మరుగునపడ్డ మాణిక్యాలు – 39: రాకెట్ సింగ్

0
7

[dropcap]‘అ[/dropcap]బ్ తక్ ఛప్పన్’ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన షిమిత్ అమీన్ ‘చక్ దే ఇండియా’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలే. ఒకదానికొకటి పోలిక లేని చిత్రాలు. మొదటిది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఒక పోలీసు కథ. రెండోది హాకీ క్రీడలో ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారిణుల కథ. ఇక మూడోది ఈ రెంటికీ పూర్తిగా విభిన్నమైనది. అదే ‘రాకెట్ సింగ్’ (2009).  ఇది వ్యాపారరంగానికి సంబంధించిన కథ. ఇలాంటి విభిన్నమైన చిత్రాలు తీసిన దర్శకులు చాలా అరుదు. అయితే చక్కని కథాకథనాలు ఉన్న ‘రాకెట్ సింగ్’ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. రణ్‌బీర్ కపూర్ వంటి క్రేజ్ ఉన్న నటుడు ఉన్నా కూడా. కానీ ఈనాటి యువవ్యాపారవేత్తలు తప్పక చూడవలసిన చిత్రం ఇది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

హర్‌ప్రీత్ సింగ్ బీకాం పాసైన యువకుడు. అయితే 39 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. తాతయ్య తప్ప ఎవరూ లేరు. తాతయ్య ద్వారా దైవభక్తి, నిజాయితీ అబ్బాయి. అతని స్నేహితులు అతన్ని ఎంబీఏ చెయ్యమంటారు. అతను ఇక చదువు నావల్ల కాదు అని ఒక సేల్స్‌మన్ ఉద్యోగం చూసుకుంటాడు. ఇంటర్వ్యూలో ఒక పెన్సిల్ ఇచ్చి చివర్న ఉన్న రబ్బర్ తీసేసి దాన్ని ఎలా అమ్ముతావో చెప్పమంటాడు ఇంటర్వ్యూ చేసే మ్యానేజర్. అతను “ఇది డీటాచబుల్ రబ్బర్ ఉన్న పెన్సిల్”, “దీని ములుకు చాలా బలమైనది”, “రబ్బర్ సువాసన వస్తుంది” అని రకరకాలు చెప్పి ఆ పెన్సిల్‌ని అమ్మటానికి ప్రయత్నిస్తాడు. మ్యానేజర్ అతని మార్కులు చూసి అతని మీద ముందే చులకన భావం ఉండటం వలన అతనికి అడ్డుపడుతూ ఉంటాడు. హర్‌ప్రీత్‌ని గమనిస్తున్న ఎండీ “ఇతని చురుకుదనం నాకు నచ్చింది. తీసుకోండి” అంటాడు. హర్‌ప్రీత్ ఉద్యోగంలో చేరతాడు. ఆరు నెలలు శిక్షణ కాలం. ఆ తర్వాత తీసేసినా అడగటానికి ఉండదు.

అది ఏవైఎస్ అనే కంప్యూటర్ విక్రయ సంస్థ. కంప్యూటర్లు అమ్మి అవసరమైనపుడు వాటి మరమ్మత్తులు (సర్వీస్) కూడా చేస్తుంటారు. సేల్స్ మ్యానేజర్ నితిన్. హర్‌ప్రీత్‌ని ఇంటర్వ్యూ చేసింది ఇతనే. రెసెప్షనిస్ట్ కొయెనా. ఆఫీసు వ్యవహారాలు చూసే మ్యానేజర్ ఉద్యోగం ఖాళీగా ఉండటంతో కొయెనా ఆ పని కూడా చేస్తూ ఉంటుంది. తనకు ఆ ఉద్యోగం ఇప్పించమని నితిన్‌ని అడుగుతూ ఉంటుంది. కంప్యూటర్ మరమ్మత్తులు చేసేవాడు నిపుణుడు గిరి. పనితనం ఉన్నవాడే కానీ చిన్న మరమ్మత్తుకి కూడా ఎక్కువ వసూలు చేస్తాడు. కంపెనీకి ఆదాయం పెంచుతున్నానంటాడు. ఓ ఇరవై మంది సేల్స్‌మెన్ ఉంటారు. ఎవరి ప్రాంతం వారిది. ఒకరి ప్రాంతం లోకి ఒకరు వెళ్ళకూడదనే నియమం ఉంటుంది కానీ కొంతమంది ఇతర ప్రాంతాలలోని కస్టమర్లను తమ వైపుకి తిప్పుకుందామని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే అందరికీ లక్ష్యాలు నిర్దేశించబడి ఉంటాయి. ఎన్ని ఎక్కువ కంప్యూటర్లు అమ్మితే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. “అమ్మేవాళ్ళు రండి. అమ్మలేని వాళ్ళు పొండి” అనేది ఆ సంస్థ నినాదం అని సేల్స్‌మెన్ అంటారు.

సంస్థ గురించి విన్న హర్‌ప్రీత్ తాతగారు “అమ్మలేని వాళ్ళు పొండి అంటే ఎక్కడికి పోతారు?” అంటారు. హర్‌ప్రీత్ “ఇంకో కంపెనీకి పోతారు” అంటాడు. “ఆ కంపెనీ కూడా అదే మాట అంటే?” అంటారు తాతగారు. “ఇప్పటి కంపెనీలు ఇంతే” అంటాడు హర్‌ప్రీత్. “కంపెనీలు మరీ దరిద్రంగా తయారయ్యాయి” అంటారు తాతగారు. “దరిద్రంగా కాదు ప్రొఫెషనల్‌గా మారాయి” అంటాడతను. ప్రొఫెషనల్ పేరుతో ఒత్తిడి ఎలా ఉందో మనకి తెలిసినదే. కంపెనీలు ఏకస్వామ్యం (మొనోపలీ) కోసం ప్రయత్నిస్తున్నాయి. అందరితో పాటు మనమూ వ్యాపారం చేసుకుందామని అనుకోవట్లేదు. దాంతో ఉద్యోగులు ఫలితాలు సాధించకపోతే వారికి ఉద్వాసనే అనే పరిస్థితి వచ్చింది. ఫలితాల కోసం ఇతరులను తొక్కివెళ్ళాలనే ఆలోచన పెరుగుతోంది. హర్‌ప్రీత్‌కి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కస్టమర్ల కంపెనీల్లో బంట్రోతుల్ని మంచి చేసుకుని వారి ద్వారా పోటీదారుల సమాచారం రాబట్టడం, కంపెనీల్లో అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న అక్కసులను తమ ప్రయోజనం కోసం వాడుకోవటం లాంటివి సేల్స్‌మెన్ చేస్తూ ఉంటారు. కస్టమర్ ఎదురుగా కూర్చున్నపుడు అతని ఎదురుగా ఉన్న పత్రాలు సేల్స్‌మన్‌కి తలకిందులుగా కనిపిస్తున్నా చదవగలగాలని నితిన్ హర్‌ప్రీత్‌కి చెబుతాడు. ఆ పత్రాలలో పోటీదారులు ఇచ్చిన టెండర్లు ఉంటాయి మరి! నితిన్ హర్‌ప్రీత్‌ని చులకనగా చూస్తూ ఉంటాడు. ఎందుకూ పనికి రావు అని అంటూ ఉంటాడు. ఇతర సేల్స్‌మెన్ కూడా హర్‌ప్రీత్‌ని ఆటపట్టిస్తూ ఉంటారు. అయినా హర్‌ప్రీత్ హుషారుగానే ఉంటాడు. అందరినీ గౌరవంగా పలకరిస్తాడు. కోయెనా అతని మీద సానుభూతితో ఉంటుంది కానీ ఆమెకి ఊపిరి సలపనంత పని. టీలు అందించే ఛోటేలాల్ వయసులో పెద్దవాడు. అతన్ని హర్‌ప్రీత్ గౌరవంగా సంబోధించటంతో అతను ఖంగు తింటాడు. అంత గౌరవం అతనికి ఎవరూ ఇవ్వలేదు మరి. మరమ్మత్తులు చేసే గిరికి ఛోటేలాల్ సహాయం కూడా చేస్తుంటాడు. అలా చేస్తూ చేస్తూ విడిభాగాలు కంప్యూటర్లో ఎక్కడెక్కడ పెట్టాలో కూడా నేర్చేసుకున్నాడు.

ఒకరోజు ఒక పెద్ద కంపెనీకి హర్‌ప్రీత్ టెండర్ ఇవ్వటానికి వెళతాడు. అక్కడ మ్యానేజర్ లంచం అడుగుతాడు. హర్‌ప్రీత్ అవాక్కయి ఉండిపోతాడు. బయట ఫిర్యాదుల పెట్టె కనిపిస్తే అందులో ఆ మ్యానేజర్ మీద ఫిర్యాదు వ్రాసి వేస్తాడు. అఫీసుకి తిరిగి వచ్చాక ఎండీ గదికి రమ్మని పిలుపు వస్తుంది. అక్కడ నితిన్ కూడా ఉంటాడు. ఫిర్యాదు చేసినందుకు హర్‌ప్రీత్‌ని తిడతాడు. తప్పుడు ఫిర్యాదు చేసినట్టు కేసు పెడదామని ఎండీతో అంటాడు. హర్‌ప్రీత్ ఎండీతో “ఇతన్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి” అంటాడు. ఎండీ హర్‌ప్రీత్ ని బాస్టర్డ్ అని తిడతాడు. హర్‌ప్రీత్ నోట మాట రాక ఉండిపోతాడు. “అంత పెద్ద కస్టమర్ గురించి ఫిర్యాదు చెయ్యటానికి నీకెంత ధైర్యం? శిక్షణ కాలం పూర్తి చేసి వెళ్ళిపో. ఇంకో తప్పు చేస్తే గెంటి పారేస్తాను” అంటాడు. తర్వాత అతన్ని కస్టమర్ల దగ్గరకు వెళ్ళొద్దని ఆదేశాలొస్తాయి. టెలీమార్కెటింగ్ కాల్స్ చేసి ఎవరైనా కస్టమర్ ఒప్పుకుంటే వేరే సేల్స్‌మన్‌ని పంపించాలంతే. పైగా అతను చేసిన ‘పొరపాటు’ని సాకుగా చూపించి ఇతర సేల్స్‌మెన్‌కి లక్ష్యాలు పెంచేస్తాడు ఎండీ. సేల్స్‌మెన్ అందరూ అతని మీద కసిగా ఉంటారు. అతను తన సీటులో కూర్చుని ఉన్నప్పుడు కాగితపు రాకెట్లు చేసి అతని మీద విసురుతూ ఉంటారు.

హర్‌ప్రీత్‌లో ఏది ధర్మం ఏది అధర్మం అనే సంఘర్షణ మొదలవుతుంది. తాతగారికి చెప్పుకోలేడు. ఇంట్లో టీవీలో రామాయణం సీరియల్ చూస్తుంటారు తాతామనవలు. రాముడు రావణుణ్ని చంపే ఘట్టం వస్తుంటుంది. అధర్మం మీద ధర్మం గెలుస్తుంది. అందరూ హర్షిస్తారు. హర్‌ప్రీత్ కోపంగా చానల్ మార్చేస్తాడు. తాతగారు అదేమిటంటాడు. “రామాయణం ఎప్పటి నుంచో టీవీలో వస్తోంది. ఎవరన్నా ఏమన్నా నేర్చుకున్నారా చూడటం తప్ప?” అని విసవిసా వెళ్ళిపోతాడు మనవడు. తాతగారు ‘ఎంత ఒత్తిడి ఉందో ఈ కాలపు ఉద్యోగాల్లో! ఆడుతూ పాడుతూ ఉండేవాడిని కూడా ఏడిపించేస్తున్నారు’ అనుకుంటాడు. రామాయణం, మహాభారతం చూడటమే పుణ్యమని అందరూ అనుకుంటారు కానీ వాటిలో చెప్పిన ధర్మమార్గంలో నడుచుకునేవారు తక్కువ. ముసలితనం వచ్చాక దైవచింతన చేస్తాం అంటారు. ఈలోపల డబ్బు కూడబెట్టుకోవాలి అంటారు. ఈరోజుల్లో ధర్మంగా ఉంటే కుదురుతుందా అంటారు. ఏవైఎస్ లాంటి కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యం కోసం లంచాలు ఇస్తూ ఉంటాయి. ఆ అధిపత్యం కోరుకోకుండా చిన్న లాభాలతో సరిపెట్టుకుంటే గొడవ ఉండదు కదా! అబ్బే. చిన్న లాభాలు ఏం సరిపోతాయి? పెద్ద లాభాలే కావాలి. అవీ త్వరత్వరగా కావాలి. వాటి కోసం అడ్డదారులు తొక్కాలి. హర్‌ప్రీత్ తప్పుడు పనులు చేయలేడు. ఉద్యోగం మానేస్తే తర్వాత కంపెనీ ఇలాంటిదే కాదని నమ్మకం ఏమిటి? అందుకే ఓపిగ్గా ఉంటాడు.

ఒకరోజు కోయెనా ఒక కొత్త కస్టమర్ గురించి రహస్యంగా హర్‌ప్రీత్‌కి చెబుతుంది. ముందు వద్దంటాడు కానీ తర్వాత ఆ కస్టమర్ దగ్గరకి వెళతాడు. ఆ కస్టమర్ షెరెనా అనే ఒక యువతి. స్నేహితురాలితో కలిసి కొత్తగా చిన్న డిజైన్ వ్యాపారం పెడుతుంది. కంప్యూటర్లు కావాలి. అందులో గ్రాఫిక్స్ కార్డ్ కావాలి. ఏవైఎస్ అమ్మే కంప్యూటర్లలో ఆ కార్డ్ సాధారణంగా ఉండదు. హర్‌ప్రీత్ ఆ కార్డ్ కోసం ఒక దుకాణానికి వెళతాడు. అదో చిన్న దుకాణం. యజమాని లాల్వానీ దైవప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అది చూసి హర్‌ప్రీత్ లోపలికి వెళతాడు. అతనికి దైవభక్తి ఉన్నవారి మీద నమ్మకం. లాల్వానీతో మాట్లాడుతుంటే ఏవైఎస్ కంప్యూటర్లు ఎక్కువ ధరకి అమ్ముతోందనే విషయం అవగతమౌతుంది హర్‌ప్రీత్‌కి. షెరెనాకి కంప్యూటర్లు తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అతను. విడిభాగాలన్నీ లాల్వానీ దగ్గరే అరువు తీసుకుంటాడు. కావాలంటే తన స్కూటర్ తాకట్టు పెట్టుకోమంటాడు. లాల్వానీ అదేం అవసరం లేదని విడిభాగాలు ఇస్తాడు. హర్‌ప్రీత్ గిరి సహాయంతో కంప్యూటర్లు అసెంబుల్ చేయిస్తాడు. అతనికి లాభంలో సగం ఇస్తానంటాడు. షెరెనా దగ్గర నుంచి చెక్కు వచ్చే సమయానికి అతను ఏవైఎస్ పేరు మీద కాక ‘రాకెట్ సేల్స్ కార్పొరేషన్’ పేరు మీద చెక్కు తీసుకుంటాడు. ఆ డబ్బు ఏవైఎస్‌కి చెందదని అతని అభిప్రాయం. లాభాలు తగ్గించుకుంటే కస్టమర్లకి డబ్బు మిగల్చవచ్చని, కస్టమర్ల ఆనందమే వ్యాపారానికి బలమని తెలుసుకుంటాడు. అయితే ఇంతలోనే తాతయ్య నేర్పిన నిజాయితీ కారణంగా తాను ఏవైఎస్ ని మోసగించాననే భావం కలుగుతుంది. ధర్మానికి, అధర్మానికి సంఘర్షణ హర్‌ప్రీత్ ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

రూపాయికి పది పైసలు లాభం వేసుకోవచ్చు కానీ ఈ కాలంలో అలా చేసే సంస్థలు ఎన్ని? ఒక చిన్న సూత్రాన్ని మరచిపోతున్నాయి. తక్కువ లాభానికి మంచి సరుకు అందిస్తే ఎక్కువమంది వారి దగ్గరే కొంటారు. ఆ విధంగా లాభాలు ఎక్కువ వస్తాయి. అలా కాకుండా లాభాలు ఎక్కువ వేసుకుని లంచాలు ఇచ్చి వ్యాపారం చేస్తున్నాయి. ఏమన్నా అంటే పోటీ తట్టుకోవాలిగా అంటున్నాయి. నాణ్యత ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటే లాభాలూ వస్తాయి, పోటీ కూడా ఉండదు కదా! ఒకవేళ పోటీ ఉన్నా వినియోగదారుడు మోసపోకుండా ఉంటాడు. పోటీ ఉండకూడదు అనుకోవటం కూడా తప్పే. నాణ్యత గల సరుకు అమ్మటమే మన పని. హర్‌ప్రీత్ లాంటి వాళ్ళు లోకం తీరు చూసి సందిగ్ధంలో పడతారు. అతని లాంటి యువకులు చాలామంది గుంపులో చేరిపోతారు. అతని పెంపకం వేరు. అతను విలువలకు కట్టుబడి ఉంటాడు. కస్టమర్ సంతోషమే ముఖ్యమనుకుంటాడు. కానీ ఏవైఎస్‌కి వెళ్ళవలసిన కస్టమర్‌ని తాను ఎగరేసుకుపోయాననే భావన అతని మనసుని తొలిచివేస్తుంది. మంచివాళ్ళకి ఎప్పుడూ ఈ సంఘర్షణ తప్పదు. ఈ కాలంలో మరీనూ.

హర్‌ప్రీత్‌గా రణ్‌బీర్ కపూర్ నటన హృద్యంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రెండేళ్ళకే ఇలాంటి చిత్రం చేయటం సాహసమే. స్నేహితులతో మాట్లాడేటపుడు చలాకీగా, తాతగారి దగ్గర ప్రేమ, చిలిపితనం చూపిస్తూ, ఒడిదుడుకులు ఎదురైనపుడు సంఘర్షణ పడుతూ, తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ అతను చూపిన నటన అతనికి ఫిల్మ్‌ఫేర్ విమర్శకుల అవార్డు సంపాదించి పెట్టింది. 2009లో ‘వేక్ అప్ సిడ్’, ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ చిత్రాలలో కూడా నటించి అతను తన సత్తా చాటుకున్నాడు. కోయెనాగా నటించిన ఫ్యాషన్ మోడల్ గౌహర్ ఖాన్ ఆశ్చర్యపరుస్తుంది. రెసెప్షనిస్ట్ అనగానే చులకనగా చూడటం అలవాటైనవాళ్ళకి ఆమె వ్యక్తిత్వం చూసి ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు అనిపిస్తుంది. నితిన్‌గా నటించిన నవీన్ కౌశిక్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఎండీగా నటించిన మనీష్ చౌదరి అధిక శాతం వ్యాపారస్థులు ఎలా ఉంటారో చూపించటంలో కృతకృత్యుడయ్యాడు. జైదీప్ సాహ్నీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. షిమిత్ అమీన్ దర్శకుడిగా తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. హర్‌ప్రీత్ ఇల్లు చూస్తే 90ల నాటి మధ్యతరగతి ఇళ్ళు గుర్తు వస్తాయి. హర్‌ప్రీత్ తాతగారు నిరాడంబరంగా ఉండే వ్యక్తి అనీ, తళుకుబెళుకుల మోజులో పడకుండా జీవిస్తున్నాడని ఇంట్లో ఉన్న వస్తువులే చెబుతాయి. మొదట్లో పేర్లు పడేటపుడు వస్తువులను చూపించారు. జాగ్రత్తగా గమనిస్తే వారి జీవితం ఎలాంటిదో అర్థమౌతుంది. డెకోలామ్ బల్ల చూసి అప్పటి జ్ఞాపకాలు ముసురుకుంటాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.

హర్‌ప్రీత్ ఎండీకి అంతా చెప్పేద్దామని వెళతాడు. ఎండీ ఒక క్లబ్‌లో లంచ్ చేస్తూ ఉండగా అక్కడికి వెళతాడు. అయితే ఎండీ లంచం అడిగిన అధికారితో లంచ్ చేస్తూ ఉంటాడు. ఎండీ హర్‌ప్రీత్‌ని తమతో పాటు కూర్చోమంటాడు. ఆ అధికారితో “ఈ పెద్ద జీరో గాడి వల్ల నాకు భలే అవకాశం వచ్చింది. అందరు సేల్స్‌మెన్‌కి లక్ష్యాలు పెంచేశాను. మీకు వీడు సారీ చెప్పలేదు కదా. చెప్పిస్తాను” అని హర్‌ప్రీత్‌ని సారీ చెప్పమంటాడు. అవమానభారంతో ఉన్న హర్‌ప్రీత్ సారీ చెబుతాడు. ఇంకేం మాట్లాడకుండా వచ్చేస్తాడు. తన స్నేహితులతో జరిగినదంతా చెబుతాడు. వాళ్ళు ఉద్యోగం వదలెయ్యమంటారు. “నేను సక్రమంగానే ఉద్యోగం సంపాదించాను. కంపెనీ తప్పుడు పనులు చేస్తే కంపెనీ మారాలి కానీ నేనెందుకు ఉద్యోగం మానాలి? ఆ ఎండీ ఇంకెవర్నీ ఎప్పుడూ జీరో అనకుండా ఏదో ఒకటి చేస్తాడు. నేను ఏవైఎస్ పట్ల ఒక అపరాధం ఎలాగూ చేశాను. ఆ అపరాధాన్ని ఎంత పెద్దది చేస్తానంటే మొత్తం ఏవైఎస్ అపరాధిగా నిలబడాలి” అంటాడు. అక్కడి నుంచి గిరితో కలిసి కంప్యూటర్ల వ్యాపారం మొదలు పెడతాడు. పేరు ‘రాకెట్ సేల్స్ కార్పొరేషన్’. అయితే అతనికి కావాల్సిన వనరులు ఏవైఎస్ నుంచే వాడుకుంటాడు. ఎండీకి గుణపాఠం చెప్పాలని ఇదంతా చేసినా ఖర్చుల పద్దు కూడా రాస్తాడు. “ఒకరోజు ఈ డబ్బంతా ఎండీకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను” అంటాడు. “వాడు నీ ఉద్యోగం తీసేస్తుంటే నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావా?” అంటాడు గిరి. “నేను వాడి గురించి కాదు మన గురించి ఆలోచిస్తున్నాను” అంటాడు హర్‌ప్రీత్.

ఒక్కోసారి మనం చేసే పని పైకి అధర్మంలాగే కనిపిస్తుంది. కానీ హర్‌ప్రీత్ మొదట ధర్మమే ఆచరించాడు. దానికి అతనికి శిక్ష పడింది. ఆ అధర్మానికి వ్యతిరేకంగా అతను అధర్మ పద్ధతుల్లో పోరాడుతున్నాడు. చట్టం ప్రకారం నేరమే. కానీ కలియుగంలో అధర్మాన్ని అధర్మంతో ఎదుర్కోవటం తప్పు కాదేమో. ద్వాపరయుగంలోనే కురుక్షేత్రంలో అస్త్రసన్యాసం చేసిన భీష్ముడి మీద, రథచక్రం పైకి తీస్తున్న కర్ణుడి మీద బాణాలు వేశాడు అర్జునుడు. అధర్మం అని కూర్చుంటే లాభం లేదు. ఎదుటివారు అధర్మపక్షాన ఉంటే అధర్మం తోటే జయించాలి. జయించటానికి వాడే పద్ధతులే అధర్మం. మిగతా వ్యవహారమంతా ధర్మమే. అందుకే హర్‌ప్రీత్ ఎండీకి తన వల్ల అయిన ఖర్చు తిరిగి ఇచ్చేస్తానంటాడు. ఆ పని చేసేది ఎండీ కోసం కాదు, తన కోసమే అంటాడు. తన ఆత్మసాక్షికి తాను జవాబు చెప్పుకోవాలి కదా అని అతని భావన. రేపటి రొజున తప్పు చేశానే అనే భావన ఉండకూడదు. వయసు మీరి పోయాక చాలా మంది జీవితంలో చేసిన తప్పులు తలచుకుని కుమిలిపోతుంటారు. హర్‌ప్రీత్ లాంటివారు తప్పు చేసినా పరిహారం చెల్లించి నిశ్చింతగా ఉంటారు. చిన్నవయసులోనే ఈ నీతినియమాలు పెంపకం వల్లే వస్తాయి.

ఇదిలా ఉండగా కోయెనా ఆశించిన ఆఫీసు మ్యానేజర్ పదవి కొత్త వ్యక్తికి దక్కుతుంది. అదేమిటని నితిన్‌ని అడిగితే “నువ్వు అందంగా రెసెప్షన్లో కూర్చుంటే సేల్స్ వాటంతట అవే పెరుగుతాయి” అంటాడు. ఆమె అందానికి ఉన్న ప్రాధాన్యత ఆమె నైపుణ్యానికి లేదు. ఇది గమనించి హర్‌ప్రీత్ ఆమెని తన కంపెనీలో చేరమంటాడు. ఆమె మొదట ఒప్పుకోదు కానీ తనకు జరిగిన అన్యాయానికి తాను చేసేది తప్పు కాదని భావించి చేరుతుంది. ‘రాకెట్ సేల్స్ కార్పొరేషన్’ కి వచ్చే ఫోన్ కాల్స్ ఆమె దగ్గరకే వస్తాయి. జాగ్రత్తగా వాటిని హర్‌ప్రీత్‌కి బదిలీ చేస్తుంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతుంది. దాంతో కంప్యూటర్లు అసెంబుల్ చేయటానికి మరో మనిషి అవసరమౌతాడు. ఛోటేలాల్‌కి ఆ పని తెలుసు కాబట్టి అతన్ని చేర్చుకుంటారు. అందరూ సమాన భాగస్వాములు. గిరి రాత్రి పని చేసి పగలు పడుకునే మనిషి. కాబట్టి రాత్రి కూడా మరమ్మతులు చేస్తాడు. 24 గంటల సర్వీస్ ఇస్తామని ప్రచారం చేస్తారు. వారి నియమావళి ఇదీ:

  1. కస్టమర్లకి అబద్ధం చెప్పకూడదు.
  2. అమ్మకాల కన్నా సర్వీసే ముఖ్యం. సర్వీసు బావుంటే అమ్మకాలు అవే పెరుగుతాయి.
  3. లంచం ఇవ్వకూడదు. లంచం అడిగే కస్టమర్ మాకొద్దు.
  4. కస్టమర్‌కి ఒక తేదీ ఇస్తే ఆ తేదీనే సరుకు చేరిపోవాలి లేదా సర్వీస్ జరిగిపోవాలి.
  5. పగలూ రాత్రీ ఎప్పుడైనా సర్వీస్ ఇవ్వబడును.

ఈ నియమావళిలో ఎన్ని నియమాలు కంపెనీలు పాటిస్తాయి? ఐదో నియమం చాలా కంపెనీలు పాటిస్తున్నాయి. ఎందుకంటే ఆ భారం ఉద్యోగుల మీద వేసేయవచ్చు. ఈ చిత్రంలో నాకు నచ్చనిది కూడా ఈ నియమమే. రాత్రి పూట పని చేసే ఉద్యోగులు దొరుకుతారు. కాదనను. కానీ రాత్రి వేళ కూడా కస్టమర్లకు అవసరాలుండే పరిస్థితి ఎందుకొచ్చింది? ఉత్పాదకత పెంచటానికి కొన్ని కంపెనీలు రాత్రి కూడా పని చేస్తాయి. ఉత్పాదకత పెంచాలంటే వేరే మార్గాలున్నాయి. యంత్రాలు ఎక్కువ కొనవచ్చు. పనంతా పగలే చేయవచ్చు. అలా అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రాత్రి వేళ పని చేయిస్తామని కొందరు అంటారు. అవసరం కొద్దీ రాత్రివేళ పనిచేసే ఉద్యోగులు చేరతారు. ఇక్కడ కంపెనీల స్వార్థమే పని చేస్తోంది. రాత్రి వేళ ప్రజలకి బ్యాంకు (డబ్బు) అవసరాలు ఉండొచ్చు కదా అని కొందరు అనవచ్చు. అందుకు ఏటీఎంలో, ఫోన్ పేమెంట్లో కావాలి. రాత్రివేళ వాటికి అవసరమైతే సర్వీసు వెంటనే జరగాలి. ఒకప్పుడు ఏటీఎంలు, ఫోన్ పేమెంట్లు ఉండేవి కాదు. రాత్రివేళ ఇరుగుపొరుగు వారు అవసరానికి సాయం చేసేవారు. ఇప్పుడు ఎవరి దారి వారిదే. మనుషుల మధ్య సంబంధాలు లేవు. యంత్రాలే నేస్తాలు. కానీ రాత్రి అనేది విశ్రాంతి కోసమే ఉంది. దానికి వ్యతిరేకంగా పని చేయటం ప్రకృతి విరుద్ధం. ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఐదో నియమం పక్కన పెడదాం. మిగతా నియమాల్లో ఒక్క నియమమైనా పాటించే కంపెనీలు చాలా అరుదు. అదే నేటి విషాదం.

రాకెట్ సేల్స్ కార్పొరేషన్ విషయం ఏవైఎస్ ఎండీకి తెలిసిపోతుందని వేరే చెప్పక్కరలేదు. కానీ ఎలా తెలుస్తుందనేది ఉత్కంఠభరితంగా చూపించటంలో రచయిత, దర్శకుడు నూటికి నూరు శాతం విజయం సాధించారు. చివరికి ఏం జరుగుతుందనేది కూడా వాస్తవికంగా ఉంటుంది. వ్యాపారంలో ముఖ్యమైనవి అంకెలు కాదు, మానవసంబంధాలు అనే సందేశం ఉంటుంది. లాభాపేక్ష తగ్గించుకుని, మనుషుల మనసులు గెలుచుకుంటే వ్యాపారం బావుంటుంది. అందరితో పాటూ నేను అనుకునేవారి కంటే కొత్తగా ఆలోచించేవారే వార్తల్లో ఉంటారు. మనం దినపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. మొదట్లో ఒడిదుడుకులు రావచ్చు. కానీ చిత్తశుద్ధితో పని చేస్తే విజయం అందుకోవచ్చు. ఈ సందేశం ముఖ్యంగా రేపటి తరానికి అందాలి. అందాలంటే నేటి తరం నోటిమాటతో చెబితే సరిపోదు. ఆచరణలో చూపించాలి.

Image Courtesy: IMBD, Samir Bharadwaj Blog

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here