మరుగునపడ్డ మాణిక్యాలు – 5: ద ఫండమెంటల్స్ ఆఫ్ కేరింగ్

0
10

[dropcap]కొ[/dropcap]న్నేళ్ళ క్రితం మేము ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో ఒక వాచ్‌మన్ దంపతులు ఉండేవారు. భార్య గర్భవతి అయింది. కొన్ని నెలల తర్వాత వైద్య పరీక్ష చేస్తే బిడ్డకి గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ళకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టరు అన్నదట. వారు పేదవారు కావటంతో ఆ ఖర్చు భరించలేని స్థితి. ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ అబార్షన్ చేయించేశారు. అది చట్టబద్ధమో కాదో నాకు తెలియదు. మనసు ఉసూరుమనిపించింది. తర్వాత ఏదో ప్రవచనంలో విన్నాను – అలాంటి బిడ్డలు కడుపులో పడినపుడు అబార్షన్ చేయించకూడదు, అది కర్మఫలం అని భావించి భరించాలి అని. నిజమే అనిపించింది. అయినా తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు. మేమే ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేసేవాళ్ళం? బిడ్డ పుట్టిన తర్వాత అనుకోనిదేదైనా జరిగితే ఆ శోకం తట్టుకోగలమా?

బిడ్డ పుట్టిన తర్వాత ఏదైనా వ్యాధి ఉందని తెలిస్తే అప్పుడు ఎవరూ చంపుకోరు కదా! అలా పుట్టిన తర్వాత వ్యాధి తెలిసిన ఓ అబ్బాయి కథే ‘ద ఫండమెంటల్స్ ఆఫ్ కేరింగ్’ (2016). అతనికి కేర్ గివర్‌గా ఉండే ఒకతనితో అతని బంధం వారి జీవితాలని ఎలా మార్చిందో చూపించే కథ. కేర్ గివర్ అంటే నర్సు లాంటి ఉద్యోగం. దగ్గరుండి బాగోగులు చూసుకునే వ్యక్తి. ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున బాగోగులు చూసుకునే కార్తీ ఒక ఉదాహరణ. ‘కేర్ గివింగ్’ అంటే బాగోగులు చూసుకోవటం. ‘కేరింగ్’ అంటే అర్థం విస్తృతమవుతుంది. ఆ వ్యక్తి క్షేమం కోరుకుంటున్నామని అర్థం. ‘ద రెవైజ్డ్ ఫండమెంటల్స్ ఆఫ్ కేర్ గివింగ్’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. అంటే కేర్ గివింగ్‌కి తిరగరాసిన సూత్రాలు. ఆ సూత్రాలని తిరగ రాస్తే అది ‘కేరింగ్’ అవుతుంది. నవల పేరే సినిమాకి పెడితే ఎబ్బెట్టుగా ఉంటుందని ‘ద ఫండమెంటల్స్ ఆఫ్ కేరింగ్’ గా మార్చినట్టున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

బెన్ అనే నడి వయసు వ్యక్తి కేర్ గివింగ్ కోర్సు చేస్తాడు. అందులో అతనికి చెప్పేదేమంటే రోగికి ఏం కావాలో తెలుసుకుని సహాయం అందించటమే కేర్ గివర్ పని. అంతకంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. బెన్ ఒక రచయిత. అయితే పేరు రాలేదు. అతని కొడుకు అతని తప్పిదం వల్ల చనిపోయాడు. భార్య విడాకులు కోరుతుంది. అయితే బెన్ ఒప్పుకోడు. నోటీసు ఇవ్వటానికి కోర్టు ఉద్యోగి వస్తే అతనికి అందకుండా పారిపోతాడు. నోటీసు అతనికి అందకపోతే కోర్టు ఏమీ చేయలేదు. కానీ మనుషులని కోర్టు బలవంతంగా కలపలేదు కదా!

ట్రెవర్ అనే 18 ఏళ్ళ కుర్రాడికి ‘డుషేన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ’ అనే కండరాల వ్యాధి ఉంటుంది. అతనికి కేర్ గివర్‌గా బెన్ కుదురుతాడు. ట్రెవర్ నడవలేడు. వీల్ చెయిర్‌లో ఉంటాడు. చేతుల వేళ్ళు ముడుచుకుని ఉంటాయి. పూర్తిగా తెరవలేడు. తన పనులు తాను చేసుకోలేడు. అయితే ఆకతాయితనం ఉంటుంది. వయసు ప్రభావంతో ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడుతుంటాడు. బూతు మాటలు మాట్లాడుతుంటాడు. కొన్ని ఇబ్బందికరమైన పదాలు ఈ వ్యాసంలో కూడా వాడకతప్పదు. బెన్ ఉద్యోగం కోసం వచ్చినపుడు అతని తల్లి అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ట్రెవర్ కూడా ఉంటాడు. “మేమిచ్చే డబ్బుకి సరిగా ముడ్డి తుడిచేవాడు కావాలి. నువ్వు ముడ్డి ఎలా తుడుస్తావు?” అంటాడు. తల్లి ఇబ్బందిపడుతుంది. “మలం ఆనవాళ్ళు లేకుండా తుడుస్తాను” అంటాడు బెన్. ట్రెవర్ పదేళ్ళకు మించి బతకడని అతని తల్లి అంటుంది. వ్యాయామాలు చేయించాలి, మందులు వేయాలి. చచ్చిపోతానని తెలిసిన టీనేజ్ అబ్బాయి తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తల్లి ఏం చేస్తుంది? భరిస్తుంది. బెన్ పనిలో చేరిన మొదటి రోజు “బెన్‌ని ఏడిపించకు” అని ట్రెవర్‌కి చెప్పి వెళుతుంది తల్లి.  ఆమె ఉద్యోగం చేయకపోతే వారి జీవితం గడవటం కష్టం. అందుకే కేర్ గివర్ అవసరం. బెన్‌కి ఉద్యోగం అవసరం. “నీకు పిల్లలున్నారా?” అంటే లేరని చెబుతాడు బెన్. అబద్ధమైన నిజం!

ట్రెవర్ ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటాడు. వారానికో సారి పార్క్‌కి వెళతాడు. అప్పుడప్పుడూ ఫిట్స్ వచ్చినట్టు నటిస్తాడు. బెన్ కంగారు పడితే చూసి ఆనందిస్తాడు. బెన్‌కి క్రమంగా అలవాటైపోతుంది. “నీకు ఏ వ్యాధీ లేకపోతే మొదట ఏం చేస్తావు” అని ఒకసారి అడుగుతాడు బెన్. “నిలబడి మూత్రం పోసుకుంటాను” అంటాడు ట్రెవర్. మనం చిన్న చిన్న విషయాలను విస్మరిస్తూ ఉంటాము. ట్రెవర్ లాంటి వారికి అవే పెద్ద విషయాలు. “నాకు చెప్పులు లేవని బాధపడుతుంటే కాళ్ళు లేని వాడు కనబడ్డాడు” అని ఆంగ్లంలో ఒక నానుడి. కొన్నిటి విలువ అవి లేనప్పుడే తెలుస్తుంది.

ట్రెవర్‌కి ఒక అలవాటు ఉంటుంది. టీవీలో అప్పుడప్పుడు వార్తల్లో వింతలు విశేషాలు చెబుతుంటారు. ఉదాహరణకి ప్రపంచంలోనే అతి పెద్ద ఆవు కళేబరం ఫలానా ఊళ్ళో ఉంది అని. అమెరికాలో పర్యాటకులని ఆకర్షించటానికి చిన్నచిన్న వాటికి కూడా రకరకాల ప్రచారాలు చేస్తారు. హంగులతో తీర్చిదిద్దుతారు. మన దేశంలో గొప్ప ప్రదేశాలకి కూడా ప్రచారం ఉండదు. సొంతంగా తెలుసుకుని అక్కడికి వెళితే కనీస సౌకర్యాలు ఉండవు. ట్రెవర్ దేశంలోని వింతలన్నిటికీ ఒక పటం మీద గుర్తులు పెట్టుకుంటాడు. అదో సరదా. ఈ వింతలన్నీ చూసి రావొచ్చు కదా అంటాడు బెన్. నీకేమైనా మతిపోయిందా అని కొట్టిపారేస్తాడు ట్రెవర్.

ట్రెవర్ తండ్రి ట్రెవర్‌కి వ్యాధి ఉందని తెలియగానే కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు ట్రెవర్‌కి మూడేళ్ళు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటాడు. అయితే ట్రెవర్ వాటిని చదవడు. “చదవొచ్చు కదా, అతను ఎంత కాదన్నా నీ తండ్రి కదా” అంటాడు బెన్. “నీకు పిల్లలు లేరు కదా. నీకు తండ్రి బాధ్యతలు ఎలా తెలుస్తాయి?” అంటాడు ట్రెవర్. అయితే తర్వాత తన కొడుకు సంగతి ట్రెవర్‌కి, అతని తల్లికి తెలుసని బెన్‌కి తెలుస్తుంది. “తెలిసి కూడా నన్ను అంత మాటంటావా? వ్యాధి ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా?” అని ట్రెవర్‌ని నిలదీస్తాడు బెన్. “వ్యాధి లేకపోయినా నా స్వభావం ఇలాగే ఉండేదేమో” అంటాడు ట్రెవర్. 18 ఏళ్ళ వయసంటే ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు. ఆ వయసులో అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో అతని స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. అది బయట పడకుండా ఒక రక్షణ కవచం (Defence mechanism) లా అతని ప్రవర్తన ఉంటుంది.

బెన్‌ని ఏడిపించటానికి “వింతలన్నీ చూడటానికి బెన్ నన్ను తీసుకెళతానన్నాడు” అని తల్లికి చెబుతాడు ట్రెవర్. బెన్ “నిజమే. తీసుకెళతాను” అంటాడు. ఆమెని ఒప్పిస్తాడు. ట్రెవర్ మొదట భయపడినా చివరికి ఒప్పుకుంటాడు. వింతలు చూస్తూ వెళుతుంటారు. దారిలో ఒక అమ్మాయి, ఒక గర్భవతి తారసపడతారు. వాళ్ళిద్దరూ తమ గమ్యస్థానాలు చేరుకోవటానికి సాయం కోసం చూస్తుంటారు. వాళ్ళని తోడు తీసుకుని వెళతారు. తన తండ్రి దగ్గరకు వెళదామంటాడు ట్రెవర్. తన తల్లికి తెలియకుండా వెళదామంటాడు. తనని చూడగానే తండ్రి ఏం చేస్తాడో చూడాలంటాడు. బెన్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. ఇదిలా ఉండగా ఎవరో తమ కారుని వెంబడిస్తున్నట్టు గమనిస్తాడు బెన్. తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఇలాంటి రోడ్ మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలకలు, గొడవలు, సరదాలు, ఆటపట్టింపులతో సాగిపోతాయి. అందరికీ ఏదో ఒక దుఃఖం. దారిలో తారసపడిన అమ్మాయి పేరు డాట్. 21 ఏళ్ళు. తల్లి మూడేళ్ళ క్రితం క్యాన్సర్‌తో మరణించింది. తండ్రికి ఒక ఉత్తరం రాసి ఇంటి నుంచి వచ్చేస్తుంది కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ. గర్భవతి భర్త ఆర్మీలో ఉంటాడు. వెంటనే రమ్మని పిలుపొస్తుంది. అతను వెళ్ళిపోతే తన పుట్టింటికి ఆమె బయల్దేరుతుంది. దారిలో కారు పాడవుతుంది. బెన్‌ని తండ్రిగా అతని అనుభవం ఏమిటని అడుగుతుంది. “పిల్లలు పుడితే జీవితం మారిపోతుంది, పిల్లలే జీవితమైపోతారు అని ఏవేవో సొల్లు కబుర్లు చెబుతారు అందరూ. కానీ అవన్నీ నిజమే. పిల్లలు పుట్టాకే తెలుస్తుంది” అంటాడతను. ఒక సందర్భంలో ట్రెవర్ “నువ్వు కేర్ గివర్ ఉద్యోగమే ఎందుకు ఎంచుకున్నావు? ఇలా ఒకరికి సాయం చేస్తే నీ బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం మరచిపోవచ్చనేగా” అంటాడు. కాదని పైకి అన్నా ఆత్మపరిశీలన చేసుకుంటే అదే నిజమని అతనికి తెలియదా? కొన్ని నిత్యసత్యాలు, కొన్ని సొంత అనుభవాలు. వాటిని సమన్వయం చేసుకుంటూ పోవటమే జీవితం.

ట్రెవర్ తల్లి అతను బతికి ఉన్నన్ని రోజులు అతన్ని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంది. తండ్రి చిన్నప్పుడే అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. బెన్ ఒక తప్పు చేసి తన బిడ్డ చావుకి కారణమయ్యాడు. వీరందరిలో కుంగిపోయి ఉన్నది బెన్ ఒక్కడే. ట్రెవర్ తల్లి తన బాధ్యత నిర్వర్తిస్తోంది. తండ్రి స్వార్థం చూసుకున్నాడు. బాధ్యత విస్మరించాడు. ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ట్రెవర్ చనిపోతే అతని తల్లి పరిస్థితి ఏమిటి? అది జరిగినపుడు చూసుకోవచ్చు అని ఆమె అనుకుని ఉండవచ్చు. భవిష్యత్తు కన్నా వర్తమానమే ఆమెకి ముఖ్యం. బెన్ మాత్రం భూతకాలంలో ఉండిపోయాడు. జరిగినది తలచుకుంటూ బాధపడేకన్నా ముందుకు సాగటం ముఖ్యం. అతని భార్య అతని వల్ల తన కొడుకు చనిపోయాడని కాకుండా అతను తనను తాను క్షమించుకోలేక పోవటం వల్లే విడాకులు కోరుతోందని నాకు అనిపించింది. ఆమె ముందుకు సాగాలనుకుంటే అతను తోడుగా రాలేకపోయాడు.

బెన్‌గా పాల్ రడ్, ట్రెవర్‌గా క్రెగ్ రాబర్ట్స్, డాట్‌గా సెలెనా గోమెజ్ నటించారు. పాల్ రడ్ ‘యాంట్ మ్యాన్’ చిత్రాలలో యాంట్ మ్యాన్‌గా నటించి పేరు సంపాదించాడు. ఒక ‘అవెంజర్స్’ చిత్రంలో కూడా యాంట్ మ్యాన్‌గా కనిపించాడు. హాస్యాన్ని బాగా పండిస్తాడు. ఈ సినిమాలో ట్రెవర్ ఆటపట్టించినపుడు మొదట్లో కంగారు పడినా తర్వాత అలవాటు పడి ఆ పైన తానే అతన్ని ఆటపట్టించటం నవ్వు తెప్పిస్తుంది. అయితే తనలోని సంఘర్షణని అంత బాగా చూపించలేకపోయాడనిపిస్తుంది. క్రెగ్ రాబర్ట్స్ విరక్తితో కూడిన ఆకతాయితనాన్ని బాగా అభినయించాడు. ఈ సినిమాలో నటించే సమయానికి అతని వయసు 24 ఏళ్ళు. కాస్త వయసు ఎక్కువని అనిపిస్తుంది కానీ ఎప్పుడూ వీల్ చెయిర్‌లో కూర్చుని ఉండే అబ్బాయి కాస్త వయసు ఎక్కువైనట్లు ఉండటం సహజమే కదా! సెలెనా గోమెజ్ చిన్న వయసులోనే పాప్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. నటిగా ఇంకా ఎదగాల్సి ఉంది. ఈ సినిమాలో డాట్ పాత్ర ఆమె వయసుకి తగిన పాత్రే అయినా అప్పటికే స్టార్ కావటంతో కాస్త అతిశయం కనిపిస్తుంది. ట్రెవర్, డాట్ మధ్య సన్నివేశాలు కుర్రకారు ప్రవర్తనకి అద్దం పడతాయి. డాట్‌కి తన మీద మంచి అభిప్రాయం కలగాలని ట్రెవర్ పడే తంటాలు కుర్రాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు కదా అనిపించేలా చేస్తాయి. జొనాథన్ లెవిసన్ వ్రాసిన నవల ఆధారంగా రాబ్ బర్నెట్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. హాస్య ప్రధానమైన టీవీ షోలు నిర్మించిన అతను ఈ చిత్రాన్ని హాస్యం మేళవించి రూపొందించాడు. జీవితం అందించే చేదు అనుభవాలను దిగిమింగి సాగిపోవటమే మనిషి కర్తవ్యమనే సందేశం అలవోకగా అందిస్తుంది ఈ చిత్రం. అంతే కాకుండా మంచి కాలక్షేపం కూడా.

ఈ క్రింద చిత్ర కథ మరి కొంత ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ప్రయాణంలో తమని వెంబడించే వ్యక్తి ఎవరని తర్జనభర్జన పడతుంటాడు బెన్. అతని భార్య ఎవరినైనా తనని వెంబడించమని చెప్పిందేమో అని అనుమానం వస్తుంది. అసలు అతను ట్రెవర్‌తో ప్రయాణం కావటానికి ఇంకొక కారణం తన భార్య నుంచి తప్పించుకుందామనే. విడాకులు ఆలస్యం చేస్తే భార్య మనసు మార్చుకుంటుందని ఒక చిన్న ఆశ. చివరికి ఆ వెంబడించే వ్యక్తిని ఎదుర్కుంటాడు బెన్. తన భార్య పంపించలేదని తెలుస్తుంది. మరి ట్రెవర్ తల్లి పంపించిందా అని అడుగుతాడు. తన మీద నమ్మకం లేక ట్రెవర్ తల్లి తమని వెంబడించమని పంపించిందని అతని ఆలోచన. “కాదు. నేను డాట్ తండ్రిని” అంటాడతను. తన కూతురు క్షేమంగా గమ్యం చేరుకోవాలని అతను ఆమెని వెంబడిస్తూ వచ్చాడు. అతని కథ మనకి పూర్తిగా తెలియకపోయినా అతను కూతుర్ని నిర్లక్ష్యం చేశాడని అనిపించకమానదు. చివరికి కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే గానీ అతనికి ఆమె విలువ తెలియలేదు. చివరికి డాట్ అతనితో మాట్లాడుతుంది. బెన్‌తో “ఆయన అయోమయంలో ఉన్నాడు, కానీ ఎంతైనా నా తండ్రి కదా. ఆయన్ని దూరం చేసుకోలేను” అంటుంది. ఒక్కోసారి పిల్లలే తలిదండ్రులకి పాఠాలు నేర్పిస్తారు. తమ తలిదండ్రులకే కాదు తలిదండ్రులైన వారెవరికైనా!

తండ్రి దూరమైన ట్రెవర్, తల్లి లేని డాట్, కొడుకుని పోగొట్టుకున్న బెన్ – వీరందరూ కలిసి చేసిన ప్రయాణం అందరికీ పాఠాలు నేర్పుతుంది. పోయినవాళ్ళు ఎలాగూ వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళని అంటిపెట్టుకుని వారి నుంచి ఏదో కోరుకోవటమే కాక వారిని అర్థం చేసుకుని వారికేం కావాలో ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అది విడాకులైనా సరే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here