మరుగునపడ్డ మాణిక్యాలు – 50: బావర్చీ

2
8

[dropcap]‘బా[/dropcap]వర్చీ’ (1972) లో ఉమ్మడి కుటుంబంలోని సమస్యలని చూపించారు. నేడు ఉమ్మడి కుటుంబాలు లేవు కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. సెల్ ఫోన్లు రావటంతో సమస్యలు ఇంకా పెరిగాయనే అనిపిస్తోంది. ఎవరెవరో ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. ‘నువ్వు ఎవరికీ లొంగి ఉండొద్దు’ అనే సలహాలే ఎక్కువ. ఈ చిత్రంలో సమస్యలకి చూపించిన పరిష్కారాలు ఇప్పటికీ పనికొస్తాయి. హృషికేశ్ ముఖర్జీ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన చిత్రాలలో గంభీరమైన చిత్రాలు (అభిమాన్, నమక్ హరామ్ లాంటివి) ఎన్ని ఉన్నాయో హాస్య చిత్రాలూ (చుప్కే చుప్కే, గోల్ మాల్ లాంటివి) అన్ని ఉన్నాయి. ఈ చిత్రంలో హాస్యం పాళ్ళు ఎక్కువ. పైగా మ్యాజికల్ రియాలిజం కూడా ఉంటుంది. అంటే వాస్తవ ప్రపంచంలో అద్భుతరసం మేళవించిన కథ. హాలీవుడ్‌లో వచ్చిన ‘మేరీ పాపిన్స్’ లో ఒక ఇంటికి ఒక ఆయా వస్తుంది. ఆమెకి అసాధారణ శక్తులు ఉంటాయి. ఈ చిత్రంలో ఒక ఇంటికి ఒక వంటవాడు (బావర్చీ) వస్తాడు. అతను అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. మనస్తత్వశాస్త్రం శాస్త్రం కూడా. వంటవాడికి ఇన్ని శాస్త్రాలు ఎలా తెలుసు? అదే ఇక్కడ అద్భుతం. ఎక్కువ ప్రశ్నించకూడదు. పాఠాలు నేర్చుకోవాలంతే. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూడొచ్చు.

ఒక ఇంటి ఆసామికి నలుగురు కొడుకులు. అయనది పెద్దవయసు. భార్య మరణించింది. మొదటి కొడుకు పేరు రామనాథ్. ఒక ఆఫీసులో హెడ్ గుమాస్తా. రిటైర్మెంట్ దగ్గర పడింది. ఇంటి గొడవలతో ఆయన అఫీసుకి ఆలస్యంగా వెళుతుంటాడు. మేనేజర్ చేత చీవాట్లు తింటూ ఉంటాడు. సాయంత్రం వేళల్లో ఇంటికి సారాయి తెచ్చుకుని తాగుతాడు. ఆయన భార్య సీత. ఆమెకి కీళ్ళ నొప్పులు. వారి కూతురు మీతా గారాబంతో పెరిగింది. గురువుగారు ఇంటికి వచ్చి నృత్యసాధన చేయిస్తారు. సాయంత్రాలు పార్టీలకు వెళుతుంటుంది. పొద్దెక్కే దాకా నిద్ర లేవదు. రెండో కొడుకు, కోడలు యాక్సిడెంట్లో మరణించారు. వారి కూతురు కృష్ణ. కాలేజీలో చదువుతుంటుంది. తలిదండ్రులు లేకపోవటంతో ఆమెని ఎవరూ సరిగా పట్టించుకోరు. అలాగని కష్టాలు పెట్టరు. మూడో కొడుకు కాశీనాథ్ బడిపంతులు. తనకు అన్నీ తెలుసు అనే నైజం. అతని భార్య శోభ. వారికో చిన్న కొడుకు. శోభకి సీత కీళ్ళనొప్పి వంకతో పని తప్పించుకుంటుందని అక్కసు. నాలుగో కొడుకు విశ్వనాథ్. అవివాహితుడు. ఒక సంగీతదర్శకుడికి సహాయకుడు. ఇంగ్లిష్ పాటలు కాపీ కొట్టి హిందీ పాటలు తయారు చేస్తూ ఉంటాడు. అన్నదమ్ముల గొడవలు, తోడికోడళ్ళ కీచులాటలు చిత్రంలో ఎక్కువ చూపించకపోయినా వారి వంటవాడి మాటల్లో చెప్పారు. ఆ వంటవాడు ఇక పని చేయలేనని ఒకరోజు పనిమానేసి వెళ్ళిపోతాడు.

వంటవాడు మానేయటంతో పెద్దాయనకి పొద్దున్న టీ ఉండదు. ఆయన చిరాకుగా ఉంటాడు. శోభ కృష్ణని టీ చేయమని చెబుతుంది. కృష్ణది మంచి మనసు. అందరికీ టీ చేస్తుంది. పెద్దాయన “నాకు తెలుసు నీకే పని చెబుతారని” అంటాడు. కృష్ణ “మన పని మనం చేసుకోవటంలో తప్పేముంది” అంటుంది. కోడళ్ళిద్దరూ వంట చేస్తారు. రామనాథ్, కాశీనాథ్ భోంచేసి పనికి వెళతారు. అప్పట్లో టిఫిన్లు ఉండేవి కాదు మరి. “ఇదేం వంట?” అంటాడు రామనాథ్. “మాకు చేతనైనదింతే” అంటుంది సీత. రామనాథ్ తన ఆఫీసులో బంట్రోతుకి ఇంకో వంటవాడిని చూడమని చెబుతాడు. ఇక్కడ ఒక సన్నివేశం గురించి చెప్పుకోవాలి. వంటింటి బయట అంట్లు తోమే చోట పాకుడు పట్టి ఉంటుంది. పాకీ పని చేసేవాడు వస్తే శుభ్రం చేయిద్దామని కోడళ్ళు అలా వదిలేస్తారు. కృష్ణ హడావిడిగా వంటింట్లోకి వెళుతుండగా జారిపడుతుంది. శోభ “అక్కడ పాకుడు ఉందని తెలుసుగా. అంత అజాగ్రత్త అయితే ఎలా?” అంటుంది. తర్వాత శోభ అక్కడే జారిపడుతుంది. ఒకరికి చెప్పటం తేలికే. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి గానీ ‘ఇక్కడ పాకుడు ఉంది కాబట్టి జాగ్రత్తగా నడవాలి’ అంటే ఉన్న సమస్యలని పరిష్కరించటం మానేసి తప్పుకు తిరగటమే. ఈ విషయాన్ని అలా చెప్పారు స్క్రీన్ ప్లే రచయిత.

మర్నాడు ఒక వంటవాడు వస్తాడు. పేరు రఘు. ముప్ఫై ఏళ్ళవాడు. పెద్దాయనని కలుస్తాడు. “ఎవరు పంపించారు?” అంటే “ఎవరూ పంపలేదు. నేనే వచ్చాను” అంటాడు. “హామీ ఎవరిస్తారు?” అంటే “నేను ముఖ్యమంత్రుల ఇంట్లో పని చేశాను” అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళందరూ తనకు తెలుసు అని పేరు పేరునా అందరి పరిచయాలు చెబుతాడు. సంస్కృతం మాట్లాడతాడు. కాశీనాథ్ అదెలా అని అడిగితే ఒక పండితుడి దగ్గర పనిచేశాను, అక్కడ నేర్చుకున్నానని అంటాడు. జీతం నలభై రూపాయల దగ్గర బేరం మొదలుపెట్టండి అని సీత భర్తతో అంటుంది. “నాకు ముప్ఫై చాలు” అంటాడు రఘు. అందరూ ఖంగు తింటారు. రఘు చలాకీగా వంటగది వైపు దారి తీస్తాడు. ఆయుర్వేదం కూడా తెలుసంటాడు. తనకు కాశీ అన్నపూర్ణాదేవి కలలో కనిపించిందని, ఆమె చేతి గరిటెతోనే తాను రకరకాల గరిటెలు చేయించున్నానని తన దగ్గర ఉన్న పెట్టెలోని గరిటెలు చూపిస్తాడు. వంటింటిలోకి వెళుతుంటే పాకుడు మీద కాలు జారుతుంది. తానే శుభ్రం చేస్తానంటాడు. సీత వద్దంటుంది. పాకీవాడు వస్తాడంటుంది. “మన పని మనం చేసుకోవటం గొప్ప కాదు. ఇంకొకరి పని చేయటంలో ఆనందం ఉంది” అంటూ కొబ్బరిపీచు తీసుకుని పాకుడు శుభ్రం చేసేస్తాడు. అతని పని వేగం చూసి అందరూ నోరు వెళ్ళబెడతారు. కూరగాయలు కూడా చకచకా తరిగేస్తాడు. మగవాళ్ళందరూ అతని తీరు, అతని అతిశయపు మాటలు చూసి అనుమానంతో ఉంటారు. ఓ కన్నేసి ఉంచాలని తీర్మానించుకుంటారు. కోడళ్ళిద్దరూ “వీడు కపాల మాంత్రికుడిలా ఉన్నాడే” అనుకుంటారు. రఘు మాత్రం అందరితో వరసలు కలుపుతాడు. కోడళ్ళని పెద్దమ్మ, చిన్నమ్మ అంటాడు. కృష్ణని చెల్లెమ్మా అంటాడు. మీతాని అక్కా అంటాడు. ఉత్తర భారతంలో పనివాళ్ళు వయసులో తమ కన్నా చిన్నవాళ్ళని కూడా దీదీ (అక్కా), భయ్యా (అన్నా) అనటం మామూలే.

రఘు అందరికీ టీ తయారు చేస్తాడు. అందరూ ఒకేచోటికి వచ్చి టీ తాగితే బావుంటుంది కదా అంటాడు. అందరూ వరండాలోకి వస్తారు. రఘు పెద్దాయనకి ఆయన గదిలోనే టీ ఇస్తాడు. రోజూ ఉదయం ఐదున్నరకే టీ తెస్తానంటాడు. పెద్దాయన “అంత కన్నా ఏం కావాలి” అంటాడు. రఘు “మీ పెద్ద కోడలు మీకు తొందరగా టీ ఇవ్వమని చెప్పారు” అంటాడు. పెద్దాయన “నేను నమ్మను” అంటాడు. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పటం కన్నా ఇలా అందమైన అబద్ధాలు చెప్పటం కుటుంబ వాతావరణాన్ని మెరుగు పరుస్తుంది. ఇది అందరూ నేర్చుకోవాలి. ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు కలిగేలా మాట్లాడాలి కానీ కోపం పెరిగేలా మాట్లాడితే ఏం లాభం? తమ ప్రయోజనాల కోసం కొందరు చాడీలు చెబుతారు. అలాంటివారిని గుర్తించటం కూడా ఒక కళే. ఉరుకుల పరుగుల జీవితాలలో చెప్పుడు మాటలే ఆప్తవాక్యాల్లా వినపడుతున్నాయి ఈరోజుల్లో. అత్తాకోడళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించటం మానేసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటే సామరస్యంగా ఉంటుంది. కోడలు వంట దగ్గర అత్తగారి సూచనలు అడగవచ్చు. అత్తగారు కుటుంబవిషయాల్లో కోడలి సలహాలు అడగవచ్చు. దెప్పిపొడుపుల వల్ల సాధించేది ఏమీ లేదు, మనసు పాడవటం తప్ప.

మగవాళ్ళందరూ వరండాలో టీ తాగుతారు. టీ చాలా బావుందంటారు. ఆడవాళ్ళు టీ తర్వాత తాగుతామంటారు. రఘు “అందరూ కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటంలో మజాయే వేరు. ఈ చిన్న చిన్న చేష్టల్లోనే పరమార్థం ఉంది. అందరూ కలిసి ఒకే జీవితం జీవిస్తున్నట్టు ఉంటుంది” అంటాడు. ఇప్పుడు ఇళ్ళల్లో ఉండే జనాభాయే తక్కువ. అందరూ కలిసి రోజులో ఏదో ఒక సమయంలో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎంత బావుంటుంది? పెద్దవాళ్ళు ఆఫీసు పని అని, చిన్నవాళ్ళు కోచింగులని తీరిక లేకుండా ఉంటే ఎలా కుదురుతుంది? దానికి తోడు ఫోన్లు. వారాంతంలో ఎక్కడికైనా వెళదామనే ఆలోచనే కానీ ఇంట్లో సరదాగా ఉందామనే ఆలోచన తగ్గిపోతోంది. తీరిక చేసుకోవాలి. సంగీతం, సాహిత్యం లాంటి అభిరుచులు ఒకరితో ఒకరు పంచుకోవాలి. పిల్లల్లో పెంపొందించాలి. పెద్దలు నీతి కథలు, వీరగాథలు చెప్పాలి. పెద్దవాళ్ళు సంపాదనే పరమావధి అనుకోవటం వల్లే చిన్నవాళ్ళు తప్పుదోవ పడుతున్నారు. ఈ ధోరణి మారాలి.

రఘు వంటలో కందగడ్డతో కబాబ్‌లు, అరటికాయలతో దమ్ ఫుక్త్ చేస్తాడు. రామనాథ్, కాశీనాథ్ లొట్టలేసుకుంటూ తింటారు. కంద కబాబ్ లను మటన్ కబాబ్‌లు అనుకుంటారు. వారి భార్యలు విస్తుపోతూ అది కంద అని చెబుతారు. అన్నదమ్ములు ఆశ్చర్యపడి “వండేవాడి చేతిలో ఉంటుంది కానీ పదార్థాల్లో ఏముంటుంది? కొందరు చేస్తే కంద మటన్‌లా ఉంటుంది, మరికొందరు చేస్తే మటన్ కూడా కందలా ఉంటుంది” అని హాస్యమాడతారు. వారి భార్యలు మూతులు తిప్పుకుంటారు. రఘు వద్దంటున్నా అంట్లు తోమేస్తాడు. “ఎవరి పని వారు చేయటం గొప్ప కాదు. ఇంకొకరి పని చేసినప్పుడే ఆనందమూ, పుణ్యమూ” అంటాడు. సాయంత్రం కాశీనాథ్ ఇంటికి వచ్చాక అతనికి టీ, కచోరీలు ఇచ్చి మాటల్లో తాను ఒక కవి ఇంట్లో పని చేశానని, ఆయన అప్పుడప్పుడూ ‘ఇటీజ్ సో సింపుల్ టు బి హ్యాపీ, బట్ ఇటీజ్ సో డిఫికల్ట్ టు బి సింపుల్’ అనేవాడని చెబుతాడు. అంటే సంతోషంగా ఉండటం చాలా సరళం (తేలిక) కానీ సరళంగా ఉండటం చాలా కష్టం. ఎంత గొప్ప మాట ఇది! మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. సర్దుకుపోవటంలోనే సంతోషం ఉంది. ఎవరైనా తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. మనం తప్పులే చేయకుండా ఉన్నామా? మన తప్పులు దాచుకుని ఇతరుల తప్పుల్ని భూతద్దంలో చూడటం పెద్ద తప్పు. పరిస్థితులకు సర్దుకుపోయే గుణం ఉన్నా కోరికలతో వేగిపోకుండా ఉండటం చాలా కష్టం. సంతృప్తితో ఉంటూ ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా ఉండటం అలవర్చుకుంటే అంతకన్నా ధనం లేదు. ధర్మరాజు యక్షప్రశ్నల్లో ‘అన్నిటి కన్నా గొప్ప ధనం ఏది?’ అని అడిగితే ‘తృప్తి’ అంటాడు. రఘు ఇంకో మాట అంటాడు. “ఏదో పెద్ద సుఖం కోసం మనం చిన్న చిన్న ఆనందాలని వదిలేసుకుంటూ ఉంటాం. జీవితంలో పెద్ద ఆనందాలు కొన్నే ఉంటాయి. కానీ చిన్న చిన్న ఆనందాలు చాలా ఉంటాయి. భర్త ఇంటికొచ్చి భార్యకు ఓ ఐదు నిమిషాలు వంటింట్లో సాయం చేస్తే భార్య తానే ‘చాల్లే వెళ్ళండి, అలిసిపోయి వచ్చారు’ అంటుంది. ఇలాంటి చిన్న చిన్న సరసాలు, ఆనందాలు వదులుకోకూడదు” అంటాడు. కాశీనాథ్ ఆలోచనలో పడతాడు.

రఘు కృష్ణకి ఆల్జీబ్రాలో సాయం చేస్తాడు. ఒక ప్రొఫెసర్ దగ్గర నేర్చుకున్నానంటాడు. విశ్వనాథ్‌కి ఒక కొత్త బాణీ కట్టి పాడి వినిపిస్తాడు. సందర్భం చెబితే సాహిత్యం కూడా తానే అల్లుతాడు. ఈ కళ ఎలా అబ్బింది అని అడిగితే గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ దగ్గర నేర్చుకున్నానంటాడు. విశ్వనాథ్ తేలిగ్గా వదలడు. “గురుదేవులు మరణించి ముప్ఫై ఏళ్ళయింది. నీ వయసు ముప్ఫై. మరి ఆయన దగ్గర ఎలా నేర్చుకున్నావు?” అంటాడు. “మీరేం హిందువులు? అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండి పద్మవ్యూహం గురించి అర్జునుడి వద్ద నేర్చుకోలేదా? మా అమ్మ శాంతినికేతన్‌లో పని చేసినపుడు నేను ఆమె కడుపులో ఉన్నాను” అంటాడు. ఇలా అందరి దగ్గరా మంచి ప్రావీణ్యం ఉన్నవాడిగా పేరు సంపాదిస్తాడు. పెద్దాయన పాట విని “ఎవరు పాడారు?” అంటే “మీ అబ్బాయే” అంటాడు. “ఇన్నాళ్ళకి పాడటం వచ్చింది వాడికి” అంటాడు పెద్దాయన.

రామనాథ్ సారాయి తాగుతుంటే రఘు అందులో కోకా కోలా, నిమ్మరసం కలుపుకోమని సలహా ఇస్తాడు. రామనాథ్‌కి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. “సంసారజంఝాటంలో ఉన్న మనిషి కాస్త మత్తు కోరుకోవటంలో తప్పేమిటి?” అంటాడు రఘు. అయితే గది కిటికీ తెర వేసేస్తాడు. ఇంతకు ముందు బాహాటంగా తాగుతుంటే కాశీనాథ్ కొడుకు వింతగా చూస్తుంటే పెద్ద గొడవ అయింది. ఇప్పుడు రఘు తెరచాటున తాగేలా ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ళకి రామనాథ్‌కి సారాయి అవసరమే ఉండదు. అతనికి ఉద్యోగంలో పొడిగింపు వస్తుంది. అదనపు వేతనం వస్తుంది. దీనికి కారణం ఇంటిలో ప్రశాంత వాతావరణం, సమయానికి మంచి భోజనం లభించటం. ఇదంతా రఘు చలవే. ఈ ఆనందం అందించిన మత్తులో అతను సారాయి వదిలేస్తాడు. అయితే తనకు ఉద్యోగంలో పొడిగింపు వచ్చిన సంగతి ఎవరికీ చెప్పొద్దని రఘుతో అంటాడు. “అందరూ కుళ్ళుకుంటారు” అంటాడు. రఘు “కాశీనాథ్ గారికి మీరంటే ఎంతో గౌరవం. తాను ఎక్కువ సంపాదించటం లేదని, మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారని ఎంతో బాధ పడుతున్నారు” అంటాడు. “అవును, వాడికి నేనంటే ఎంతో ప్రేమ” అంటాడు రామనాథ్. రఘు కాశీనాథ్ దగ్గరకి వెళ్ళి “మీరు బాగా చదువుకునేవారని, మిమ్మల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపించి చదివించలేకపోయానని మీ అన్నయ్య బాధపడుతున్నారు” అని చెబుతాడు. ఒకప్పుడు అన్నగారు తండ్రిలా కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు ఎవరి దారి వారిదే. అలా ఉన్నా పరవాలేదు. ఒకరి ఆస్తి వాటా ఒకరు కాజేయాలని చూస్తున్నారు. తమ్ముడికి అన్న మీద గౌరవం ఉండాలి. అన్నకి తమ్ముడి సుఖం కోరుకునే మంచిమనసు ఉండాలి. అంతకన్నా ఏం చేయనక్కరలేదు.

కృష్ణకి మీతాలా నృత్యం నేర్చుకోవాలని ఆశ. ఆమె సాధన చేస్తుంటే చాటుగా నిలబడి చూస్తుంది. ఒకరోజు మీతా ఆమెని ఎందుకు చూస్తున్నావని దుర్భాషలాడుతుంది. కృష్ణ నొచ్చుకుంటుంది. ఈ సన్నివేశం హృద్యంగా తీశాడు దర్శకుడు. కృష్ణ తల్లిలేని పిల్ల. పరుగున తాత గదిలోకి వెళుతుంది. మొహం అటు తిప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తాతకి పితూరీలు చెప్పే స్వభావం కాదు. తాతగారు “ఎవరన్నా ఏమన్నా అన్నారా? అనే ఉంటారు. చెప్పు” అంటారు. కృష్ణ మాట్లాడదు. రఘు అసలు విషయం చెబుతాడు. “దీనికి విరుగుడు నేను చేస్తాను” అని తాతగారి చెవితో ఏదో చెబుతాడు. కొన్నాళ్ళ తర్వాత నృత్యాల పోటీలు జరుగుతాయి. పోటీలో పాల్గొన్నవాళ్ళు అనేక రకాల నృత్యాలు ప్రదర్శిస్తారు. మీతా కూడా ప్రదర్శిస్తుంది. ఆశ్చర్యకరంగా కృష్ణ కూడా నృత్యం ప్రదర్శిస్తుంది. ఆమెకి మొదటి బహుమతి వస్తుంది. మీతాకి రెండో బహుమతి వస్తుంది. మొదటి బహుమతి రానందుకు ఆమె దుఃఖిస్తుంది. కృష్ణ ఆమె దగ్గరికి వెళ్ళి “నీకింత కష్టం కలుగుతుందని తెలిస్తే నేనసలు పోటీకే వచ్చేదాన్ని కాదు” అంటుంది. రఘు పదిరోజుల్లోనే తనకి నృత్యం నేర్పాడని అంటుంది. ఇది నమ్మశక్యం కాకపోయినా ఇక్కడ విషయం ఏమిటంటే అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకి వెలికి తీయాలి. మీతాలో కూడా ప్రతిభ ఉంది, కానీ నమ్రత లేదు. నమ్రత లేకపోతే కళ వృథా అయిపోతుంది. మంచి కళాకారుడు కావటం కంటే మంచి మనిషి కావటం ముఖ్యం. ఇప్పటి విద్యార్థులు పోటీ పడి చదువుతున్నారు. ర్యాంకు రాకపోతే కుంగిపోతున్నారు. ర్యాంకు కన్నా బిడ్డ ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని తలిదండ్రులు చెప్పాలి.

ఒకరోజు కృష్ణకి చదువు చెప్పే యువకుడు ఆమె గదిలో ఉండగా వారి మాటలు విని ఇంటి కోడళ్ళిద్దరూ ఆమెని తిడతారు. సీత ఆమె మీద చేయి చేసుకుంటుంది. రఘు తాతగారి దగ్గరకి వెళ్ళి విషయం చెబుతాడు. కోడళ్ళని చీవాట్లేయమని చెబుతాడు. ఆయన కోడళ్ళని చీవాట్లేస్తాడు. భర్తలు ఇంటికి వచ్చాక కోడళ్ళు వాళ్ళని పెద్దాయన మీదకి ఉసిగొల్పుతారు. కొడుకులిద్దరూ పెద్దాయనని నిలదీయటానికి బయల్దేరతారు. రఘు వాళ్ళని ఆపుతాడు. “చీవాట్లేశారంటే ప్రేమ ఉండబట్టే కదా. పెద్దవాళ్ళు ఒక మాటంటే పడితే తప్పేముంది? కాశీనాథ్ గారూ, రేపు మీ అబ్బాయి పెళ్ళయ్యాక మీరు మీ కోడలిని ఓ మాటంటే మీ అబ్బాయి మీ మీదకి దెబ్బలాటకి వస్తే ఎలా ఉంటుంది?” అంటాడు. వాళ్ళు వెనక్కి తగ్గుతారు. ఎవరికి వాళ్ళు ఇలాగే ఆలోచించుకోవాలి. ఆ స్థానంలో నేనుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటే సరైన మార్గం దొరుకుతుంది. రఘు కృష్ణ దగ్గరకి వెళ్ళి పెద్దమ్మకి, చిన్నమ్మకి క్షమాపణ చెప్పమంటాడు. ఆమె తానే తప్పూ చేయలేదంటుంది. తప్పు చేయకపోయినా పెద్దవాళ్ళకి క్షమాపణ చెబితే పోయేదేం లేదంటాడు రఘు. తప్పు చేసినవాళ్ళకి పెద్దవాళ్ళ చేత చీవాట్లేయించటం, తప్పు చేయకపోయినా చిన్నవాళ్ళ చేత క్షమాపణలు చెప్పించటం – రెండూ చేసింది రఘుయే. ఎవరి పాఠాలు వారికి నేర్పుతాడు. మీతా తల్లి దగ్గరకి వెళ్ళి “నేను పార్టీలకి వెళ్ళినపుడు నన్ను ఏమీ అనలేదు. తల్లి లేని పిల్ల అని కృష్ణని తిడతావా?” అంటుంది. కృష్ణ క్షమాపణ చెప్పటంతో తోడికోడళ్ళిద్దరూ శాంతిస్తారు. తోడికోడళ్ళిద్దరూ కూడా సఖ్యంగా ఉండటంలో రఘు తన పాత్ర తాను పోషిస్తాడు.

చిత్రంలో చివరికి ఏం జరిగిందనేది ముఖ్యం కాదు. మనిషి తన జీవితాన్ని ఉన్నంతలో ఎలా ఆనందమయం చేసుకోవచ్చో ఇందులో చూపించారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒడిదుడుకులు తట్టుకుంటూ సాగిపోవాలి. కష్టాలు లేని జీవితం ఉండదు. కష్టాలకి బెదిరిపోకుండా నిలబడటమే ధీరత్వం. కలిసి ఉండకపోగా ఒకరి మీద ఒకరు అసహనంగా ఉంటే జీవిత దుర్భరమౌతుంది. లోపాలు అందర్లో ఉంటాయి. సామరస్యంగా మాట్లాడుకుని లోపాలు దిద్దుకునే ప్రయత్నం చేయాలి. తమలో లోపాలున్నాయని గుర్తించటమే పెద్ద విజయం. అహంకారాలు పక్కన పెట్టి మసలుకుంటే చింతలే ఉండవు.

హేమాహేమీలైన నటులు నటించిన చిత్రమిది. రాజేష్ ఖన్నా, జయా బాధురి, దుర్గా ఖోటే, ఏ కె హంగల్, అస్రానీ, ఉషా కిరణ్, కాళీ బెనర్జీ, పేంటల్, హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. గుల్జార్ వ్రాసిన సంభాషణలు పదునుగా ఉంటాయి. చివర్లో వచ్చే ‘భోర్ ఆయే గయా అంధియారా’ పాట మనసుని ఉర్రూతలూగిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే ఇల్లే ఇలలో స్వర్గమౌతుందని గుర్తు చేస్తుంది. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ చూడవలసిన చిత్రమిది. జీవితపాఠాలెన్నో నేర్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here