మరుగునపడ్డ మాణిక్యాలు – 52: టైగర్‌టెయిల్

2
10

[సంచిక పాఠకుల కోసం ‘టైగర్‌టెయిల్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]‘టై[/dropcap]గర్‌టెయిల్’ (2020) లో తైవాన్ నుంచి అమెరికా వెళ్ళిన నాయకుడి కథ చూపించారు. పిన్-జుయి 70వ దశకంలో పెళ్ళి చేసుకుని అమెరికా వెళతాడు. అక్కడ అతని జీవితం నిస్సారంగా మారిపోతుంది. దానికి ఎన్నో కారణాలు. మన దేశం నుంచి కూడా చాలా మంది విదేశాలకు వలస వెళుతున్నారు. ఒకప్పుడు మన కుటుంబవిలువల కారణంగా మనవాళ్లు కల్చర్ షాక్ (సంస్కృతి భేదం వల్ల కలిగే ఒడిదుడుకులు) కి తట్టుకుని నిలబడ్డారు. వారి సంతానం తలిదండ్రులతో ఘర్షణ పడ్డారు. అయితే ఇప్పుడు కుటుంబవిలువలు తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో విదేశాలకు కొత్తగా వెళ్ళే దంపతులు తమలో తామే ఘర్షణ పడుతున్నారు. ఆ ఘర్షణని ‘టైగర్‌టెయిల్’ చిత్రంలో చూడవచ్చు. ఇప్పటి తరం ప్రవాస భారతీయులు ఈ చిత్రం చూస్తే కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

పిన్-జుయి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. వారి కుటుంబం తైవాన్ లోని హువే పట్నంలో ఉంటుంది. హువే అంటే తైవానీస్ భాషలో పులి తోక (ఆంగ్లంలో టైగర్‌టెయిల్) అని అర్థం. భర్త పోవటంతో కుటుంబభారం పిన్-జుయి తల్లి మీద పడుతుంది. పిన్-జుయిని తన పుట్టింట్లో వదిలిపెడుతుంది. అక్కడ అతనికి యువాన్ అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. కానీ కొన్నాళ్ళకి పిన్-జుయి తల్లి అతన్ని తనతో తీసుకువెళుతుంది. ఆమె ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుంటుంది. పిన్-జుయి పెరిగి పెద్దవాడవుతాడు. అదే ఫ్యాక్టరీలో పనిలో చేరతాడు. అయితే అతనికి పనిలో శ్రద్ధ ఉండదు. అమెరికా వెళ్ళాలని అతని కోరిక. తల్లిని కూడా తీసుకువెళ్ళాలని అతని అభిలాష. కొన్నాళ్ళకి యువాన్ కుటుంబం ఆ పట్నానికి వస్తుంది. వారిది సంపన్న కుటుంబం. పిన్-జుయి, యువాన్ మళ్ళీ కలుసుకుంటారు. తరచు బార్‌కి వెళ్ళి సరదాగా గడుపుతారు. ఇద్దరికీ సంగీతమంటే ఇష్టం. పాటలు వింటూ డ్యాన్స్ చేస్తారు. ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుంటారు. అయితే యువాన్ తండ్రి ఆమెని తనకిచ్చి పెళ్లి చేయడని పిన్-జుయి అభిప్రాయం. అతని స్నేహితుడు “ఇప్పుడే ఆమెతో సరదాలన్నీ తీర్చుకో” అంటాడు. ఒకరోజు పిన్-జుయి యువాన్‌ని ఒక ఖరీదైన రెస్టారెంట్‌కి తీసుకువెళతాడు. అక్కడి సేవకుడు పిన్-జుయి వాలకం చూసి అతను అంత ఖరీదు కట్టగలడా అన్నట్టు మాట్లాడతాడు. పిన్-జుయి తొట్రుపడకుండా పడుచుదనపు పొగరుతో ఉంటాడు. పైగా “వాడికెంత ధైర్యం! వాడికి బుద్ధి చెప్పాలి” అంటాడు సేవకుడి గురించి. భోజనం అయ్యాక బిల్లు కట్టకుండా యువాన్‌ని తీసుకుని పరుగున బయటపడతాడు. యువాన్‌కి ఇదంతా సాహసంలా అనిపిస్తుంది. కానీ తెలివైనది. “ఇంతవరకు మీ ఇల్లు చూపించలేదు” అంటుంది. “మా ఇల్లు చాలా విలాసవంతంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమించాలి, నా డబ్బుని కాదు” అని హాస్యమాడతాడతను.

పిన్-జుయికి యువాన్‌తో పెళ్ళి జరగదని తెలుసు. అయినా ఆమెని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. ఆమెతో చిన్నప్పటి నుంచి ఉన్న చనువు వదులుకోవటం అతనికి ఇష్టం లేదు. యువాన్‌కి అతను తన కోసం చేసే దుడుకు పనుల్లో తప్పు కనిపించదు. అదొక థ్రిల్. అమ్మాయిలకు అబ్బాయిలు తమ కోసం ఏం చేసినా నచ్చుతుంది. ఇదే సమస్య. సరదాగా ఉండటం ముఖ్యం కాదు. మనిషి మంచివాడా కాదా అనేదే ముఖ్యం. అతను రెస్టారెంట్లో బిల్లు కట్టలేడని ఆమెకి తెలుసు. అయినా తన కోసం అతను సాహసం చేస్తున్నాడని అదో ఆనందం. వయసు అలాంటిది. ఆ వయసులో అబ్బాయిలకి కాస్త దూరం ఉండటమే మంచిది. ‘మాకు స్వతంత్రం లేదా’ అంటే పర్యవసానాలకి కూడా సిద్ధపడాలి. ఈ కాలంలో అమ్మాయిలు కూడా సరదాలకి అలవాటు పడుతున్నారు. పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి మరి. ‘నా జీవితం నా ఇష్టం’ అంటే చేసేదేమీ లేదు.

ఈ కథంతా పిన్-జుయి వయసు మళ్ళిన తర్వాత గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతను అమెరికాలో ఉంటాడు. అతని తల్లి మరణిస్తే తైవాన్ వెళ్ళి వస్తాడు. అతనిలో ఇదివరకటి చలాకీతనం ఉండదు. గంభీరంగా ఉంటాడు. అమెరికా వచ్చాడు సరే, అనుకున్నట్టు తల్లిని ఎందుకు తీసుకురాలేదు? అతని కూతురు ఏంజెలా అతన్ని ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తీసుకువస్తుంది. అతను ఒంటరిగా ఉంటాడు. భార్య ఏమయింది? తన తల్లి చనిపోయిందని కూతురికి కూడా చెప్పలేదు అతను. “నువ్వు ఉద్యోగంలో బిజీగా ఉన్నావు కదా” అంటాడు. “మీరెప్పుడూ నానమ్మ గురించి మాట్లాడేవారే కాదు” అంటుంది ఏంజెలా. పిన్-జుయి మౌనంగా ఉంటాడు. ఆమె అతన్ని ఇంకా మాట్లాడాలించాలని ప్రయత్నిస్తుంది కానీ అతను “ఎరిక్‌ని అడిగానని చెప్పు” అంటాడు. అంటే ఇక వెళ్ళమని అర్థం. ఆమెలో కొంచెం నిరాశ ఉంటుంది కానీ ‘ఈయన మారడు’ అనే భావన ఆమె ముఖంలో వ్యక్తమవుతుంది. ఎరిక్ ఆమె ప్రియుడు. వారిద్దరూ సహజీవనం చేయటానికి నిశ్చయించుకున్నప్పుడు ఎరిక్‌ది కష్టపడే స్వభావం కాదని, ఏంజెలా మీద ఆధారపడతాడని పిన్-జుయి అంటాడు. “నాకు అతని సంపాదన ముఖ్యం కాదు. అతను మంచివాడు. మేం పెళ్ళి చేసుకుంటాం” అంటుంది ఏంజెలా. తండ్రి డబ్బుకే ప్రాముఖ్యం ఇస్తాడని, అందుకే అతను ఒంటరివాడయ్యాడని ఆమె అభిప్రాయం.

పిన్-జుయి మళ్ళీ గతంలోకి వెళతాడు. అతను పని చేసే ఫ్యాక్టరీ యజమాని అతన్ని “నువ్వు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నావని విన్నాను. నాకో కూతురుంది. అమెకి తగిన జోడీ కోసం చూస్తున్నాను. మీరిద్దరూ ఒకసారి మాట్లాడుకోండి” అంటాడు. ఆ కూతురు పేరు జెన్‌జెన్. ఒకరోజు పిన్-జుయి ఆమెని రోడ్డు పక్కన తిండి అమ్మే ఒక చోటిని తీసుకెళతాడు. యువాన్‌ని మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళిన అతను ఆమెని అలాంటి చోటికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆమెని పరీక్షించాలని అతని ప్రయత్నం. ఆమె మృదుస్వభావి. ఎక్కువ మాట్లాడదు. ఆమెని పంపించిన తర్వాత అతను యువాన్‌ని కలుసుకోవటానికి వెళతాడు. ఎందుకు ఆలస్యమైందని ఆమె ఎన్నిసార్లు అడిగినా అతను నిజం చెప్పడు. “మా ఇల్లు చూస్తావా?” అంటాడు. అదో చిన్న ఇల్లు. ఇది యువాన్‌కి పరీక్ష. పరీక్ష అనటం కన్నా ఆమెని వదిలించుకునే ప్రయత్నమంటే సరిగ్గా ఉంటుందేమో. ఆ ఇల్లు చూసి యువాన్ నిరాశ పడుతుందని అతని ఆశ. తర్వాత అతను జెన్‌జెన్‌ని పెళ్ళి చేసుకుని, ఆమె తండ్రి ఇచ్చిన డబ్బుతో ఆమెని తీసుకుని అమెరికా వెళతాడు. తల్లిని తర్వాత తీసుకెళతానని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళుతుండగా అతనికి యువాన్ కనిపిస్తుంది. ఆమె కూడా అతన్ని చూస్తుంది. కానీ అతను వెనక్కి తిరిగి చూస్తే ఆమె అక్కడ ఉండదు.

మళ్ళీ ప్రస్తుతకాలానికి వస్తే జెన్‌జెన్ పిన్-జుయికి ఫోన్ చేస్తుంది. వారిద్దరికీ విడాకులయిపోయాయి. ఆమెకి కూడా అతను తల్లి మరణించిన సంగతి చెప్పలేదు. “ఏంజెలాకి ఎందుకు చెప్పలేదు?” అని అడుగుతుంది. “ఎవరి జీవితం వారిది కదా” అంటాడు. “మీరు ఆమె పట్ల కఠినంగా ఉంటారు” అంటుందామె. “అది నిజం కాదు” అంటాడతను. మొదటిసారి వయసు మళ్ళిన పిన్-జుయిలో భావోద్వేగం కనిపిస్తుంది. “మీరు తనని దూరం పెట్టారని ఏంజెలా అనుకుంటోంది. ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడుతూండండి” అంటుందామె. ఆ తర్వాత మనకి ఒక విషయం తెలుస్తుంది. ఎరిక్ ఏంజెలాని వదిలి వెళ్ళి కొంతకాలం అయింది. అయినా ఆమె ఆ విషయం తండ్రికి చెప్పలేదు. అతను ముందే వారి సంబంధాన్ని వ్యతిరేకించాడు. “ఎరిక్‌ని అడిగానని చెప్పు” అన్నప్పుడు కూడా ఆమె ఆ విషయం చెప్పలేదు. ఎందుకు మానవసంబంధాలు ఇలా అయిపోతున్నాయి? పిన్-జుయి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాడు. మగవాడికి సంపాదన ఉండాలని అతని అభిప్రాయం. ఇది పాతకాలపు ఆలోచన. ఎరిక్‌కి పెద్దగా సంపాదన లేదు. అందుకే వారి సంబంధాన్ని వ్యతిరేకించాడు. ఏంజెలా అతని మాట వినలేదు. కారణాలేమైతేనేం ఎరిక్ ఏంజెలాని వదిలి వెళ్ళిపోయాడు. పిన్-జుయి ఏంజెలాకి చిన్నప్పటి నుంచి “ఏడవటం వల్ల ఏం లాభం లేదు. ధైర్యంగా ఉండాలి” అని నూరిపోశాడు. అందుకని ఏంజెలా అతని ముందు బింకంగా ఉంటుంది. జీవితంలో అందరూ తప్పులు చేస్తారు. కానీ ఒకరికొకరు చెప్పుకోవటానికి జంకే పరిస్థితి రాకూడదు. పాశ్చాత్య దేశాలలో సంస్కృతి వేరు. ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారు. తలిదండ్రుల ప్రమేయం తక్కువ. సంబంధాలు ఏర్పరచుకోవటం, తెగతెంపులు చేసుకోవటం మామూలే. తలిదండ్రులతో ఓపెన్‌గా చెబుతారు. పిన్-జుయి, ఏంజెలాల మధ్య సంబంధం అటూ ఇటూ కాకుండా ఉంటుంది.

మళ్ళీ గతంలోకి వెళితే పిన్-జుయి, జెన్‌జెన్ అమెరికాలో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. ఒకరోజు పిన్-జుయి పాటలు వింటూ “డ్యాన్స్ చేయటం వచ్చా?” అని అడుగుతాడు. “నాకు సిగ్గు” అంటుందామె. అతను ఒక పచారీ కొట్లో పని చేస్తాడు. జెన్‌జెన్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమెకి టీచర్ అవ్వాలని కోరిక. అయితే పిన్-జుయి ఆ విషయం పట్టించుకోడు. అతనికి సంగీతమంటే ఇష్టం కాబట్టి ఒక కీబోర్డ్ తెస్తాడు. “నీకు అమెరికాలో జీవితం ఇబ్బందిగా ఉందని నాకు తెలుసు. మనమిద్దరం కలిసి ఈ కీబోర్డ్ నేర్చుకుందాం” అంటాడు. అంతేకానీ ఆమెకి ఏం చేయాలని ఉందో అడగడు. ఆమె ఆకాంక్షలు తెలుసుకోడు. ఆమె ఎక్కువగా మాట్లాడే రకం కాదు. అతను చెప్పినదానికల్లా తల ఊపుతుంది. కానీ కొన్నాళ్ళకి ఆ కీబోర్డ్ మూలనపడుతుంది. దాని మీద పుస్తకాలు, పేపర్లు పేరుకుపోతాయి. కీబోర్డ్ నేర్చుకోవటానికి అతని తీరిక లేదు, ఆమెకి ఆసక్తి లేదు. అతను కష్టపడి పనిచేస్తాడు. ఆమెని నిర్లక్ష్యం చేస్తాడు. ఒకరోజు ఆమెకి లాండ్రీ చేసుకునే చోట ఒక తైవాన్ మహిళ పరిచయమవుతుంది. ఇద్దరూ స్నేహితులవుతారు. ఆ స్నేహితురాలితో తన గోడు చెప్పుకుంటుంది. “మా ఇద్దరి మనస్తత్వాలు వేరు” అంటుంది. ఆ స్నేహితురాలు ఆమెని టీచర్ కోర్సు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే పిన్-జుయి “మనకి పిల్లలు పుడితే నీకు సమయమే ఉండదు” అంటాడు. ఆమె అతనికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది కానీ ఫలితం ఉండదు. కొద్దిరోజుల్లోనే ఆమె గర్భవతి అవుతుంది. ఆమె గర్భవతి అనే విషయం తెలియకముందే పిన్-జుయి తన తల్లికి ఫోన్ చేసి ఆమెని అమెరికా రమ్మంటాడు. ఆమె తనకి భాష రాదని, అక్కడ ఏమీ తోచదని అంటుంది. ఆమెది కష్టపడే స్వభావం. ఖాళీగా ఉండలేదు. అందుకే రానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కొన్నాళ్ళకి పిన్-జుయి, జెన్‌జెన్ పెద్ద ఇంట్లోకి మారతారు. వారికి ఇద్దరు పిల్లలు పుడతారు.

ఈరోజుల్లో విదేశాలకి వెళ్ళిన భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నారు. ఒకవేళ భార్య పనిచేయకపోయినా స్నేహితులకి కొదవలేదు. అయితే స్వభావాలు వేరైతే మనసుల మధ్య దూరాలు తప్పటం లేదు. పిన్-జుయికి సంగీతం ఇష్టం. జెన్‌జెన్‌కి సంగీతం పట్ల ఆసక్తి లేకపోవటంతో అతనికి యువాన్ గుర్తు వస్తుంది. ఆమెతో ఉంటే జీవితం ఉల్లాసంగా ఉండేది కదా అనే భావన ఉంటుంది. ఇక్కడ యువాన్‌ని అభిరుచికి ఒక ప్రతీకగా తీసుకోవచ్చు. ఎంతో మంది తమ అభిరుచులని వదులుకుని మంచి జీవితం ఉంటుందనే ఆశతో విదేశాలకి వెళతారు. కొన్నాళ్ళకి విసుగు వస్తుంది. అక్కడ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి ఏదో దారి వెతుక్కుంటారు. జీవితభాగస్వామిని నిర్లక్ష్యం చేస్తారు. వారు కూడా తమ దారి తాము చూసుకుంటారు. పిన్-జుయి తల్లి సంస్కృతికి ప్రతీక. పిన్-జుయి తన తల్లికి పని తప్పించాలని, ఆమెని అమెరికా తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. ఆమె రానంది. “నువ్వు కోరుకున్నది ఇదే కదా” అని అతడంటే ఆమె “నేను కోరుకున్నది కాదు, నువ్వు కోరుకున్నది” అంటుంది. కొడుకు కోరుకున్నాడని అతన్ని పంపించింది. ఆమెని వదులుకున్నానని అతని బాధ. తిరిగివెళ్ళటానికి మామగారు ఒప్పుకోడు. డబ్బులిచ్చి పంపించాడు కదా. విదేశాలకి వెళ్ళినవారు చాలామంది తమ సంస్కృతి కోసం అర్రులు చాస్తారు. కానీ తల్లి వేరే చోట ఇమడలేనట్టే సంస్కృతి కూడా వేరే చోట మనలేదు. తిరిగి వెళదామంటే సౌకర్యాలకి అలవాటుపడినవాళ్ళు తిరిగి రాలేరు. అభిరుచులను వదులుకుంటే జీవితం నిస్సారమవుతుంది. కట్నాలు తీసుకుని ఆ డబ్బుతో కొత్త సౌకర్యాలు వెతుక్కుంటే ఒకరి పెత్తనానికి లోబడి ఉండాల్సి వస్తుంది. స్వయంకృషితోనే ఏదైనా సాధించాలి. కలలు కనటం తప్పు కాదు. కానీ వాటి కోసం తమ ఉనికినే వదులుకునే పరిస్థితి రాకూడదు. అప్పుడు పశ్చాత్తాపమే మిగులుతుంది.

వయసు మళ్ళిన పిన్-జుయి పాత్రలో జీ మా నటించాడు. అతను రెండు తరాల క్రితం ప్రాచ్యదేశాలలో ఉండే తండ్రులకి ప్రతినిధిలా అనిపిస్తాడు. డబ్బు సంపాదన నా పని, వండిపెట్టటం నా భార్య పని, చదువుకోవటం పిల్లల పని – ఇదే ఆలోచనాధోరణి. సాయంత్రం త్వరగా వచ్చి పిల్లలతో సమయం గడపకుండా ఇంటి బయట ఉండే తండ్రులే అప్పట్లో ఎక్కువ. దాంతో పిల్లలకి తండ్రి మీద ప్రేమ కంటే భయమే ఎక్కువ ఉండేది. యుక్తవయసులో పిన్-జుయి పాత్రని హాంగ్ చి-లీ పోషించాడు. స్వార్థంతో ప్రవర్తించే పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఆలన్ యాంగ్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. ప్రాచ్యదేశాల నుంచి వలస వెళ్ళిన వారికి ఎక్కడో ఒక చోట ఇది నా జీవితంలో జరిగింది కదా అనిపించేలా కథ ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ప్రస్తుతకాలంతో పిన్-జుయి జెన్‌జెన్ చెప్పినట్టు ఏంజెలాతో కాస్త సమయం గడపాలని ఆమెని ఒక రెస్టారెంట్‌కి తీసుకువెళతాడు. అయితే ఎక్కువ మాట్లాడడు. “మీరేం మాట్లాడరేం?” అంటే “నీకు మాట్లాడటం ఇష్టం లేదనిపించింది” అంటాడు. ఆమెలో నిరాశ కనిపిస్తుంది. అతను “నువ్వెలా ఉన్నావు? అంతా బావుందా?” అంటాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ “ఎరిక్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. నిజానికి అంతా నా తప్పే” అంటుంది. అతను “అయ్యో” అంటాడు తప్ప ఇంకేమీ మాట్లాడడు. “అంతేనా? ఇంకేం లేదా? మీరు అమ్మ నుంచి విడిపోయారు కదా. ఎప్పుడూ ఆ విషయం మాట్లాడరేం?” అంటుందామె. “దాని వల్ల ఏం లాభం?” అంటాడతను. “ఏదో ఒక ఓదార్పు మాట అనవచ్చు కదా? నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నన్ను ప్రేమించేవారు ఉండాలని కోరుకున్నాను. మీరెప్పుడూ ఆ ప్రేమ చూపించలేదు. ఇక ఎవరి దారిలో వాళ్ళుంటే మంచిదేమో” అని వెళ్ళిపోతుంది.

ఏంజెలాతో పిన్-జుయి సరిగా మాట్లాడకపోవటానికి కారణం ఏమిటి? అతని మనసు మొద్దుబారిపోయింది. భార్యతో కలిసి ఉంటే కాస్తైనా వేరుగా ఉండేవాడేమో. విడాకులైపోవటంతో అతని జీవితం ఇంకా దుర్భరమైపోయింది. విడాకులెందుకయ్యాయి? పిల్లలు కాలేజీ చదువులకి వెళ్ళిపోయాక ఒకరోజు జెన్‌జెన్ అతనితో “నాకు విడాకులు కావాలి. ఇన్నాళ్ళూ పిల్లల కోసమే ఉన్నాను. నువ్వు నన్ను పనిమనిషిలా చూస్తున్నావు” అంటుంది. “నీకు అన్ని విలాసాలు ఉన్నాయి కదా” అంటాడతను. “వాటికేం విలువ లేదు” అంటుందామె. “అమెరికా నిన్ను మార్చేసింది” అంటాడతను. అంటే జీవితంలో డబ్బు, విలాసాలు ఉంటే చాలు అని అతని భావం. అమెరికా వాళ్ళు అన్నీ ఉన్నా లేనిదాని కోసం పరుగులు పెడతారని అతని అభిప్రాయం. ‘మన దేశంలో ఏమీ లేక ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అన్నీ సమకూర్చుకున్నాం. ఇంకేం కావాలి?’ అన్నట్టు మాట్లాడతాడు. “నేనే నిన్నిక్కడకి తీసుకొచ్చాను” అంటాడు. “మా నాన్న డబ్బుతో తీసుకొచ్చావు” అంటుందామె. ఒక్కసారి వేసిన తప్పటడుగు జీవితాంతం వెంటాడుతుంది. “నేను కష్టపడి పని చేశాను కాబట్టే ఇలా ఉన్నాం” అంటాడతను. “నీ పిల్లలని పెంచింది నేను. నన్ను పట్టించుకోవు” అంటుందామె. అతను కోపంగా “నిన్నసలు పెళ్ళి చేసుకోవాలని అనుకోలేదు” అంటాడు. “నువ్వు నీ గురించే తప్ప వేరొకరి గురించి ఆలోచించవు. నీకు మానవత్వమే లేదు” అంటుందామె. ప్రేమించిన అమ్మాయిని అతనే దూరం చేసుకున్నాడు. తల్లి తోడు ఉంటుందనుకున్నాడు కానీ జన్మభూమిని విడిచినవాడిని తల్లి కూడా వదిలిపెట్టింది. తను కలలు కన్న జీవితం ఇది కాదని తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. పిల్లలు కూడా వారి నిర్ణయాలు వారు తీసుకోవటం మొదలుపెట్టారు. అతనిక నిర్లిప్తంగా ఉండటం మొదలుపెట్టాడు. పిల్లలు ఎలా ఉన్నా కష్టం వచ్చినపుడు తలిదండ్రుల సాంత్వన వాక్యాలు కోరుకుంటారు. అందరూ తప్పులు చేస్తారు. తమ అనుభవాల నుంచి తలిదండ్రులు పిల్లలకి సలహాలు ఇవ్వవచ్చు. కానీ తలిదండ్రుల పద్ధతులే తప్పైతే వారి సలహాలు కూడా తప్పే అవుతాయి. పిన్-జుయి మాటలు ప్రభావంతో ఏంజెలా ఎరిక్‌ని అవమానించిందని అనిపిస్తుంది. తలిదండ్రుల ప్రేమ సరిగా అందకపోతే పిల్లలు కూడా ప్రేమ పంచలేరు. ఇదొక విషవలయం. భార్యాభర్తలయిన తర్వాత గతాన్ని మరచిపోయి ఒకరికొకరు తోడుగా ఉండాలి. అభిరుచులు కలవకపోవచ్చు. కానీ ఒకరి ఆకాంక్షలు ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. లేకపోతే అగాధాలే మిగులుతాయి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ప్రస్తుతకాలంలో పిన్-జుయి ఒకరోజు ఫేస్‌బుక్‌లో యువాన్ కోసం వెతికి ఆమెకి మెసేజ్ పంపుతాడు. ఆమె సమాధానం ఇస్తుంది. ఆమె కూడా అమెరికాలోనే ఉంటుంది. ఆమెకి కూడా పెళ్ళయింది. ఇద్దరూ ఏ కోపతాపాలూ లేకుండా మాట్లాడుకుంటారు. కొన్నాళ్ళకి యువాన్ పిన్-జుయి ఉండే ఊరికి వస్తుంది. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. వయసులో ఉన్నప్పుడు రెస్టారెంట్లో బిల్లు కట్టకుండా పారిపోయిన ఘటన గుర్తుచేసుకుంటారు. “నువ్వు చాలా దుడుకుగా ఉండేవాడివి” అంటుందామె. “నువ్వింకా దుడుకుగా ఉండేదానివి. నిన్ను ఆకట్టుకోవటానికి నేను దుడుకుగా పనులు చేసేవాడిని” అంటాడతను. “నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు చెడిపోయామన్నమాట” అంటుందామె. ఇద్దరూ గతం గురించి మాట్లాడుకుంటారు. “నువ్వు వెళుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు?” అంటుందామె. “చెబితే మాత్రం ఏం జరిగేది?” అంటాడతను. “ఏం జరిగేదో ఎప్పటికీ మనకి తెలియదు” అంటుందామె. అతను ఆమె తనకు దక్కదనే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళి పెటాకులయింది. ఆమెతో మాట్లాడి ఉంటే వారి జీవితం ఇంకోలా ఉండేదేమో! ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఆమె అతని పిల్లల గురించి అడుగుతుంది. కొడుకు ఒక మ్యూజిక్ బ్యాండ్‌లో ఉన్నాడని చెబుతాడు. ఏంజెలా మొండిదని అంటాడు. ఆమెతో మాట్లాడటమే కష్టం అంటాడు. యువాన్ “ఆమె నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు ఆమెతో మనసు విప్పి మాట్లాడాలి” అంటుంది.

చినీయుల కొత్త సంవత్సరం రోజు ఏంజెలా తన బంధుమిత్రులకి పార్టీ ఇస్తుంది. పిన్-జుయి, జెన్‌జెన్ వస్తారు. జెన్‌జెన్ టీచర్‌గా స్థిరపడింది. ఆనందంగా ఉంది. పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయినా పిన్-జుయి ఉండిపోతాడు. ఇల్లు శుభ్రం చేయటంలో ఏంజెలాకి సాయం చేస్తాడు. ఏంజెలా ఎరిక్‌ని గుర్తుచేసుకుంటుంది. “నేను ఒంటరిగా ఉండిపోతానేమో అని భయం వేస్తుంది” అంటుంది. పిన్-జుయి “మీ అమ్మని కలుసుకునే ముందు నేను ఒకమ్మాయిని ప్రేమించాను” అంటాడు. “నాకెప్పుడూ చెప్పలేదే” అంటుందామె. “నీకు చాలా విషయాలు చెప్పలేదు” అంటాడతను. తర్వాత ఆమెకి తన జీవితం గురించి చెప్పటానికి ఆమెని హువే పట్నానికి తీసుకువెళతాడు. తన పాత ఇంటికి తీసుకువెళతాడు. అది పాడుబడి ఉంటుంది. “వీధి చివర ఒక బార్ ఉండేది. నేను యువాన్‌ని అక్కడ కలుసుకునేవాడిని” అంటాడు. ఆ పరిసరాలు చూసి, ఆ రోజులు తలచుకుని అతని దుఃఖం వస్తుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. తప్పులు చేయటం సహజం. సుఖదుఃఖాలు పంచుకోవటానికి ఒక తోడు ఉంటే ప్రయాణం తేలిక అవుతుంది. అన్నీ మనసులో దాచుకుంటే ప్రయాణం భారమవుతుంది. పిల్లలు ఎదిగాక వారితో అరమరికలు లేకుండా ఉంటే బంధం గట్టిపడుతుంది. అంతే కానీ తమ తప్పులు దాచుకుని పిల్లలకు సలహాలివ్వటం అన్నివేళలా పనిచేయదు. పిన్-జుయి తన జీవితం గురించి ఏంజెలాకి చెప్పటంతో ఆమెకి అతనిలో ఇంకో కోణం కనపడింది. అతనిలో దుఃఖం గూడు కట్టుకుందని ఆమెకి అర్థమయింది. ఇప్పుడు తన దుఃఖాన్ని అతనితో పంచుకోవటానికి ఆమె వెనుకాడదు. జీవితంలో పశ్చాత్తాపాలు లేనివారు ఉండరు. వాటిని సన్నిహితులతో పంచుకుంటే జీవనయానం సాఫీగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here