మరుగునపడ్డ మాణిక్యాలు – 55: హ్యాపీ-గో-లకీ

2
11

[సంచిక పాఠకుల కోసం ‘హ్యాపీ-గో-లకీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]‘హ్యా[/dropcap]పీ-గో-లకీ’ (2008) లో కథ కన్నా కథానాయిక స్వభావమే ప్రధాన ఆకర్షణ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎవరికి మంచి జరిగినా ఆనందిస్తుంది. తనకి చెడు జరిగితే తేలిగ్గా తీసుకుంటుంది. ఈ పాత్రలో శాలీ హాకిన్స్ నటించింది. ఆమె నటన కోసమే ఈ చిత్రం చూడాలి. ఆమెని చూస్తున్నప్పుడు మనం చిరునవ్వు నవ్వకుండా ఉండలేం. ఈ పాత్రకి ఆమెకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దరిమిలా ‘ద షేప్ ఆఫ్ వాటర్’ (2017) లో నటించి ఆమె ఆస్కార్ నామినేషన్ అందుకుంది. ‘హ్యాపీ-గో-లకీ’ అంటే ‘ఉల్లాసంగా ఉండటం’ అనే అర్థం వస్తుంది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. ఈ రోజుల్లో నవ్వుతూ ఉండటం చాలా కష్టం. అందరికీ ఏవో సమస్యలు, ఒత్తిళ్ళు. వారు నవ్వకపోగా నవ్వుతూ ఉండేవారిని చూసి చిరాకుపడే స్థాయికి క్రమంగా దిగజారిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ చిత్రంలో కూడా ఉంటాయి.

కథానాయిక పేరు పాలీన్. ముద్దుగా అందరూ పాపీ అని పిలుస్తారు. లండన్‌లో ఉంటుంది. ఒక ప్రాథమిక పాఠశాలలో టీచరు. రంగురంగుల దుస్తులు వేసుకుంటుంది. ఎవరన్నా ఆమెని చూస్తే ఈమె టీచరా అంటారు. అమె రూమ్ మేట్ జోయి కూడా టీచరే. పాపీ పని అయిపోయాక స్నేహితులతో సరదాగా గడుపుతుంది. మద్యం తాగుతుంది. కానీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయదు. చిత్రం మొదట్లో ఆమె సైకిల్ మీద లండన్ వీధుల్లో వెళుతూ ఉంటుంది. ఆమెకి కారు నడపటం రాదు. సైకిల్ ఒక చోట ఆపి అక్కడున్న ఇనప రెయిలింగ్‌లో చువ్వకి కట్టి తాళం వేస్తుంది. పుస్తకాల దుకాణంలోకి వెళుతుంది. ఆమెకి ‘The Road to Reality’ (‘వాస్తవంలోకి ప్రయాణం’) అనే పుస్తకం కనపడుతుంది. “అక్కడికెందుకు వెళ్ళడం?” అని నవ్వుకుంటుంది. దుకాణదారుడు యువకుడే. అతన్ని పలకరిస్తుంది. “బయట గందరగోళంగా ఉంది. ఇక్కడ ప్రశాంతత నిండిన ఒయాసిస్సులా ఉంది” అంటుంది. అతను కనీసం చిరునవ్వు నవ్వడు. ఆమె పుస్తకాలు చూస్తూ ఉంటుంది. అతను ఒక పుస్తకం పట్టుకొచ్చి ఆమె పక్కనున్న షెల్ఫ్‌లో పెడతాడు. ఆమె “నీ టోపీ బావుంది” అంటుంది. అతను పట్టించుకోడు. ఆమెకి అతను నచ్చినట్టు తెలిసిపోతూనే ఉంటుంది. బయటకి వెళ్ళబోతూ “ఈ రోజు చిరాగ్గా ఉన్నట్టుంది?” అంటుంది. అతను “లేదు” అంటాడు. “నేనొచ్చే దాకా బాగానే ఉందేమోలే” అని నవ్వుతుంది. వెళ్లిపోతూ “నవ్వుతూ ఉండు. నేనేమీ దొంగిలించలేదులే” అంటుంది. అతను నవ్వుతూ మాట్లాడి ఉంటే అతనితో స్నేహం చేసేదే. కానీ అతని పద్ధతి చూసి ఆమె దూరంగా ఉంటేనే మంచిది అనుకుంది. ఎవరన్నా సరిగా మాట్లాడకపోతే మనం చిన్నబుచ్చుకుంటాం. కానీ ఆమె చిన్నబుచ్చుకోదు. పైగా తన మీద తనే జోకులేసుకుంటుంది. ఆమె వాలకం చూసి ఆమె ఏ పుస్తకమైనా దొంగిలించిందేమో అని అతను అనుకుంటాడేమో అని కూడా ఆమె ఊహించింది. మనం నవ్వుతూ ఉండటం గొప్ప లక్షణమే. కానీ ఇతరులు నవ్వుతూ మాట్లాడకపోతే పట్టించుకోకుండా నవ్వుతూ ఉండటం చాలా కష్టం. ఇలా ఉంటే ఇతరులు వెక్కిరిస్తున్నామనుకునే పరిస్థితి కూడా రావచ్చు. పాపీ విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. అయినా ఆమె ‘నా తప్పు లేనప్పుడు నేనెందుకు మారాలి’ అన్నట్టు ఉంటుంది. బయటికి వచ్చి చూస్తే సైకిల్ మాయం! ‘అయ్యో! వీడ్కోలు చెప్పలేదే!’ అనుకుంటుంది. సైకిల్ పోయిందని బాధ లేదు. సైకిల్‌కి వీడ్కోలు చెప్పలేదని కించిత్తు బాధ పడుతుంది.

ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకంగా అంటే పాపీ నవ్వుతూ వారితో ఏకీభవిస్తుంది. ఒకసారి ఆమె స్కూలు పిల్లల కోసం కాగితపు సంచులతో ముఖానికి వేసుకునే తొడుగులు తయారు చేస్తుంది. అవి పక్షుల ఆకారంలో ఉంటాయి. వాటిని పిల్లలకి తొడిగించి ఆటలాడిస్తుంది. ఆమె స్నేహితురాలు ఆ తొడుగులని చూసి “ఇవి కొంచెం ప్రమాదకరంగా లేవూ?” అంటుంది. పాపీ “వాళ్ళకి ఊపిరాడకుండా చేయాలనే నా ఉద్దేశం. పిల్ల రాక్షసులు” అంటుంది. అది నిజం కాదని ఆ స్నేహితురాలికి తెలుసు. పాపీ అలా అన్నాక ఇంకేం అనగలదు? ఆ స్నేహితురాలే “మా అక్క కూతురు తెగ తింటుంది. మూడు చికెన్ లెగ్సు, నాలుగు పెద్ద జామ్ బిస్కెట్లు తిని ఇంకా ఆకలేస్తుంది అంటుంది” అని అంటే మనమైతే పోనీలే తిననీ అంటాం. పాపీ మాత్రం “పందిపిల్ల లాగుందే” అంటుంది. ఎదుటివారిని ఆకట్టుకోవటానికి ఇలా మాట్లాడటం కంటే ఏం కావాలి? మనం ‘ఇలా మాట్లాడితే తప్పు. అలా అంటే దిష్టి తగులుతుంది’ అనుకుంటాం. ఎదుటివారి మాటలో మాట కలిపితే నవ్వుతూ ఉండొచ్చు అనే సంగతి మర్చిపోతాం. ఇవన్నీ హానికరం కాని మాటలే. హాని కలిగించే మాటలైతే పాపీ ఇలా ఏకీభవించదు. ఆమె రూమ్ మేట్ జోయి “మనం చిన్నప్పుడు పార్కులకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పటి పిల్లలు వీడియో గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు” అంటే “తలిదండ్ర్రులు పాపం పని ఒత్తిడిలో ఉంటారు. ఒక్కోసారి పిల్లలకి తల్లి ఒక్కతే ఉంటుంది. ఆమెకి సమయమే ఉండదు. పిల్లలను బయటికి తీసుకువెళ్ళలేదంటే వారి తప్పేముంది?” అంటుంది పాపీ. పాశ్చాత్య దేశాలలో స్త్రీలు పెళ్ళి కాకుండా పిల్లల్ని కన్నా సమాజం తప్పుబట్టదు. ఆ పిల్లల తండ్రులు చాలా వరకు బాధ్యతగానే ఉంటారు. కానీ పిల్లల్ని వదిలేసి పోయే తండ్రులూ ఉంటారు. అప్పుడు తల్లులు మాత్రమే పిల్లల సంరక్షణ చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అలాంటి తల్లుల సంఖ్య పెరుగుతోంది.

సైకిల్ పోవటంతో పాపీ కారు డ్రైవింగ్ నేర్చుకోవటానికి వెళుతుంది. నేర్పేవాడి పేరు స్కాట్. అతను గంభీరంగా ఉంటాడు. ఆమె వాలకం చూసి ఇంకా చిరాకుగా ఉంటాడు. ఆమె రంగురంగుల బట్టలు వేసుకుని ఉంటుంది. హీల్స్ ఉన్న బూట్లు వేసుకుంటుంది. “ఆ బూట్లు డ్రైవింగ్‌కి పనికి రావు” అంటాడతను. ఆమె చౌకబారుగా ఉందని అతని భావన. “ఈ బూట్లు వేసుకుని నేను డ్యాన్స్ చేసినపుడు చూడాలి” అంటుందామె. అతను ఎంత చిరాకు పడినా నవ్వుతూ ఉంటుంది. ఆరోజు శనివారం కాబట్టి “సాయంత్రం సరదాగా బయటికి వెళతావా?” అని అడుగుతుంది. అతను “ఇంటికి వెళ్ళి పుస్తకం చదువుకుంటాను” అంటాడు. ఏం పుస్తకం అంటే చెప్పడు. ఆమె గేరు వేయబోతుంటే అరుస్తాడు. “ఈ కారు నా జీవనాధారం. జాగ్రత్తగా ఉండాలి. నేను నీ బార్‌కి వచ్చి గ్లాసులు పగలగొడితే నీకెలా ఉంటుంది?” అంటాడు. అంటే ఆమె బార్లో పని చేస్తుందని అతని అభిప్రాయం. “నేనొక టీచర్‌ని” అంటుందామె. అతని విస్తుపోతాడు. తర్వాత పాపీ జోయితో మాట్లాడుతూ “అతను తమాషాగా మాట్లాడతాడు. నవ్వు తెప్పిస్తాడు. నా మీద కేకలేశాడు” అంటుంది.

పాలీ వారం వారం సరదాగా ట్రాంపొలీన్‌ల మీద ఎగరటానికి వెళుతుంది. ట్రాంపొలీన్ అంటే ఎగరటానికి వీలుగా ఉండే ఒక తివాచీ లాంటిది. దానిని భూమికి కాస్త ఎత్తులో కట్టేసి దాని మీదకి మనుషుల్ని ఎక్కిస్తారు. దాని మీద గెంతుతూ ఉంటే కాసేపటికి వేగం పెరిగి పైపైకి ఎగరవచ్చు. ఉల్లాసానికి ఇలాంటి క్రీడలు ఉంటాయి. పాపీకి ఒకసారి ట్రాంపొలీన్ మీద ఎగురుతుంటే నడుము బెణుకుతుంది. ఫిజియోథెరపీకి వెళుతుంది. అక్కడి థెరపిస్టు ఆమెని ఒక బల్ల మీద పడుకోమంటాడు. “I am gonna ask you to turn towards me” అంటాడు మర్యాదగా. ఆంగ్లంలో ‘నువ్వు’ అనాలన్నా, ‘మీరు’ అనాలన్నా ‘యూ’ అనే అంటారు. కాబట్టి మర్యాదగా మాట్లాడాలంటే ఇతర పదాల సాయం తీసుకుంటారు. అతను అన్న మాటకి అర్థం “నా వైపు తిరిగి పడుకోమని కోరుతున్నాను” అని. ఆమె “నీ కోరికలు పెద్దవి కావేఁ?” అంటుంది. నడుము బెణికి నొప్పిగా ఉన్నా నవ్వుతూనే ఉంటుంది. అతను కూడా నవ్వుతాడు. అతను పరీక్ష చేస్తున్నపుడు నొప్పి ఎక్కువగా ఉంటే “డింగ్ డాంగ్ డిల్లీ డిల్లీ డాడా హూహూ” అని ఏదో పిచ్చి పాట పాడుతుంది. నొప్పిని కూడా ఆస్వాదించటమంటే ఇదేనేమో. తర్వాత థెరపిస్టు ఒక్కసారిగా ఆమె నడుముని తిప్పి ఆమె వెన్నెముకలో పట్టేసిన కీలుని విడిపిస్తాడు. ఒంట్లో ఏదన్నా నలతగా ఉంటే మనసుని ఉల్లాసంగా ఉంచుకోవాలని, మనసు బాగా లేకపోతే శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుకోవాలని మనోవైజ్ఞానికులు అంటారు. పాపీ ఒంట్లో నలతగా ఉన్నా నవ్వుతూ ఉంటుంది. చికిత్సకి చేయవలసినదేదో చేస్తుంది. అంతే కానీ తనకేదో పెద్ద కష్టం వచ్చినట్టు ముఖం వేలాడేసుకోదు.

డ్రైవింగ్ క్లాస్‌కి వెళ్ళాల్సిన సమయంలోనె ఫిజియోథెరపీకి వెళ్ళటంతో ఆమె క్లాస్ సమయం మారుస్తుంది. డ్రైవింగ్ నేర్పించే స్కాట్ విసుక్కుంటాడు. “తప్పలేదు మరి” అంటుందామె. పుస్తకాల షాపతన్ని అడిగినట్టే “ఈ రోజు చిరాగ్గా ఉన్నట్టుంది?” అని అడుగుతుంది. అతను ఎప్పుడూ చిరాగ్గా ఉంటాడని ఆమెకి తెలుసు. “ఈ రోజు డ్రైవింగ్ నేర్చుకోవటానికి వచ్చినవాడొకడు దురుసుగా ప్రవర్తించాడు. మరీ చౌకబారుగా ఉన్నాడు” అంటాడతను. “పాపం నీకది నచ్చదుగా” అంటుందామె. “వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళ తల్లులకి జ్ఞానం ఉంటేగా. పైగా కంపు కొడుతూ ఉంటారు” అంటాడతను. “ఎంత కష్టం నీకు!” అంటుందామె. దారిలో నల్లజాతివారు కనిపిస్తే “డోర్లు లాక్ చెయ్యి” అంటాడు. అంటే నల్లజాతివారందరూ రౌడీలేనని అతని అభిప్రాయం. ఇంతకు ముందు అతను చెప్పినవాడు కూడా నల్లజాతివాడే అయి ఉంటాడు. పాపీకి అతని మాటలకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె స్నేహితురాలు నల్లజాతి స్త్రీ. ఆమె థెరపిస్టు కూడా నల్లజాతి వాడే. జాతి వివక్ష ఆమెకి తెలియదు. అయినా స్కాట్ మీద కోప్పడదు. ప్రపంచాన్నంతా ఆమె మార్చలేదుగా.

ఒకరోజు ఆమె స్కూల్ ఆట స్థలంలో ఒక అబ్బాయి మరో అబ్బాయిని కొట్టడం చూస్తుంది. ఆమెకి స్కాట్‌తో జరిగిన సంభాషణ గుర్తు వస్తుంది. ఆమె డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదన్నా కాస్త వింతగా కనపడితే ఏకాగ్రత కోల్పోతుందని అరుస్తాడు స్కాట్. “నువ్వు టీచరువంటే నమ్మశక్యం కావటంలేదు. నీకు ఒక పద్ధతి లేదు. చెప్పినమాట వినవు. అంతా గందరగోళంగా ఉంటే గానీ నీకు ఆనందంగా ఉండదు” అంటాడు. ఆమెకి అతనికి ఏదో కసిగా ఉందని అర్థమవుతుంది. “చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళినపుడు ఆనందంగా ఉండేవాడివా?” అని అడుగుతుంది. “లేదు. మన విద్యావ్యవస్థ ఆలోచించటం చేతకాని దద్దమ్మలని తయారు చేస్తుంది” అంటాడతను. “స్కూల్లో ఎవరైనా నిన్ను ఏడిపించేవారా?” అని అడుగుతుందామె. అతను జవాబు చెప్పడు. ఆమె “కొంతమంది పిల్లలు క్రూరంగా ఉంటారు” అంటుంది. ఇదంతా గుర్తు వచ్చి ఆమె ఆట స్థలంలో కొడుతున్న పిల్లాడిని ఆపుతుంది. స్కాట్‌ని కూడా ఎవరో ఏడిపించారని అందుకే అతను అలా తయారయ్యాడని ఆమె ఊహిస్తుంది. ఇప్పుడు ఆమె చేతుల్లో ఉన్నది ఒక్కటే. తోటివాడిని కొట్టే అబ్బాయిలో పరివర్తన తీసుకురావటం.

నేచర్ వర్సెస్ నర్చర్ (స్వభావమా పెంపకమా) అనేది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ. మనిషి ప్రవర్తన స్వభావం మీద ఆధారపడి ఉంటుందా లేక పెంపకం మీద ఆధారపడి ఉంటుందా? అనుకూల పరిస్థితులు ఉంటే స్వభావానిదే పైచేయి అవుతుంది. ఇంట్లో వాతావరణం బావుంటే సహజంగా ఎదుగుతారు. అయితే ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక స్వభావం ఉంటుంది. పాశ్చాత్యులు దీనికి సరైన వివరణ ఇవ్వలేరు. దీనికి కారణం పూర్వజన్మ వాసనలు అని హిందూ మతం అంటుంది. ఆ స్వభావం మంచిదే కావాలని ఏం లేదు. సజ్జనుల ఇంట్లో దుర్మార్గులు పుట్టొచ్చు. ఇక ఇంట్లో వాతావరణం బాగా లేకపోతే అది పిల్లల మనసు మీద ప్రభావం చూపిస్తుంది. స్కాట్ విషయంలో ఇదే జరిగింది. తండ్రి చనిపోయాడు. తల్లి సరిగా పట్టించుకోలేదు. ఒక్కడే బిడ్డ. ఇప్పుడు తల్లితో మాట్లాడడు. మామూలుగా తల్లిప్రేమకు సాటి ఏదీ లేదంటారు. కానీ తల్లిని కూడా నమ్మలేని రోజులు వచ్చాయి. స్వార్థం కోసం పిల్లలని చంపేసే తల్లుల కథలు పేపర్లో చూస్తూనే ఉన్నాం. తల్లిప్రేమ అందని స్కాట్ లాంటివారిని చూసి జాలిపడాలి. విషాదమేమిటంటే ఇలాంటివారికి తోడు దొరకటం కష్టం. తోడు లేకపోతే వీరు ఇంకా నిర్వేదంలో కూరుకుపోతారు.

రచయిత, దర్శకుడు మైక్ లీ తన చిత్రాల షూటింగ్ మొదలెట్టే ముందు వర్క్‌షాప్‌లు నిర్వహించి నటీనటులకి పాత్రలు బాగా ఆకళింపు అయ్యేలా చేస్తాడు. కొన్ని సన్నివేశాలలో పాత్రల స్వభావాన్ని బట్టి వారు ఏం మాట్లాడతారో నటీనటులనే నిర్ణయించుకోమంటాడు. పాపీ కారు నేర్చుకునే సన్నివేశాలలో ఇదే పద్ధతి ఉపయోగించాడు. స్కాట్‌గా నటించిన ఎడీ మార్సన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎప్పుడూ కోపంగా ఉండే పాత్ర ఇది. ప్రపంచం మీద కోపం. సమాజంలో విభిన్న సంస్కృతులు ఉంటే అసలు సంస్కృతే లేనట్టు అని అతని అభిప్రాయం. ఆలోచించి చూస్తే పాపీ పాత్ర, స్కాట్ పాత్ర పూర్తిగా విభిన్నమైనా రెండూ కష్టమైన పాత్రలే. శాలీ హాకిన్స్, ఎడీ మార్సన్ ఇద్దరూ అద్భుతమే ఆవిష్కరించారు. ఇందుకు మైక్ లీ ప్రతిభ దోహదం చేసిందనేది కాదనలేని నిజం. చిత్రంలో ఒక చిన్న ఉపకథలో పాపీ ఫ్లెమెంకో నృత్యం నేర్చుకోవటానికి వెళుతుంది. అక్కడ జరిగే ప్రహసనం నవ్వు తెప్పిస్తుంది. స్కాట్ లాంటివాళ్ళు కోపాన్ని వెళ్ళగక్కితే కొందరు కోపాన్ని అణగదొక్కుతారు. అయితే వారూ వేదనకు గురవుతారు, వీరూ వేదనకి గురవుతారు. పాపీ లాంటివాళ్ళు కోపం పెట్టుకోకుండా సహానుభూతితో తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. ‘శుభాశుభపరిత్యాగీ’ అని భగవద్గీతలో చెప్పినట్టు ఉంటారు. వీళ్ళే ప్రశాంతంగా ఉండగలరు. పాపీ ఒక సన్నివేశంలో మతి భ్రమించిన ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. అతనంటే భయపడదు. అలాంటి వారికి అర్థం చేసుకునేవారు ఉండాలి. సహనం గలవారు ఉండాలి. వారు ప్రేమని అర్థం చేసుకోగలరు. భయాన్ని చూసి భయపడతారు. మామూలు మనుషులు ప్రేమని నిర్లక్ష్యం చేస్తారు. భయాన్ని సాధారణ విషయంగా చూస్తారు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

స్కూల్లో తోటివాళ్ళని కొట్టే పిల్లవాడి పేరు నిక్. అతని గురించి పాపీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతుంది. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో సామాజిక కార్యకర్తలు ఇలాంటి విషయాల్లో స్కూళ్ళకి సహకారం అందిస్తారు. టిమ్ అనే కార్యకర్త స్కూల్ కి వచ్చి నిక్‌తో మాట్లాడతాడు. పాపీ కూడా అక్కడ ఉంటుంది. నిక్ తల్లి సంరక్షణలో ఉండే పిల్లవాడు. తండ్రి వదిలి వెళ్ళిపోయాడు. తల్లికి ఒక ప్రియుడు ఉంటాడు. “అతను మంచివాడేనా?” అని టిమ్ అడుగుతాడు. “కాదు. నన్ను కొడతాడు” అంటాడు. నిక్ ప్రవర్తనకి అది కారణం. సాధారణంగా టీచర్లు పిల్లలెవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారిని దండిస్తారు. లేదా వారి ఇంటివారికి చెబుతారు. ఇక్కడ ఆ రెంటిలో ఏ పని చేసినా నిక్ పరిస్థితి ఇంకా దిగజారిపోయేది. పాపీ మూలకారణం ఏమిటని ఆలోచించింది. ఇప్పుడు మూలకారణం దొరికింది. నిక్ తల్లి ప్రియుడికి ఇప్పుడు పోలీసుల ద్వారా హెచ్చరిక ఇవ్వచ్చు. మళ్ళీ ఏమైనా జరిగితే నిక్ పాపీకి చెప్తాడు. అతనికి ఒక ఆలంబన దొరికింది. స్కాట్ మాత్రం ఏ ఆలంబనా లేకుండా పెరిగాడు. అతని మనసు మొద్దుబారిపోయింది.

పాపీ జోయిని, తన చెల్లెల్ని తీసుకుని తన అక్కని చూడటానికి వెళుతుంది. ఆ అక్క గర్భవతి. భర్త ఉంటాడు. అక్క పాపీతో “నీకు వయసు పెరిగిపోతోంది. పెళ్ళి, పిల్లల గురించి ఆలోచించవా?” అంటుంది. పాపీ “నేను స్వతంత్రంగా, ఆనందంగా ఉన్నాను. నాకేం లోటు లేదు” అంటుంది. అక్క “నేను గతిలేక పెళ్ళి చేసుకున్నానని నీ ఉద్దేశం కదా” అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒకే కడుపున పుట్టినవారి మధ్య ఇలాంటి కోపతాపాలు ఉంటాయి. కొందరికి గర్భం ధరించగానే స్వేచ్ఛ పోయిన భావం కలుగుతుంది. పైకి చెబితే అందరూ ఏమనుకుంటారో అని భయం. పాపీ అక్క ఇలాగే ఉంటుంది. పాపీ తప్పు ఏమీ లేకపోయినా ఆమెకి ఇతరుల నుంచి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా పెద్దగా పట్టించుకోదు.

పాపీ ఇంటికి తిరిగి వస్తుంటే ఆమె ఇంటి దగ్గర స్కాట్ నిలబడి ఉంటాడు. ఆమె కోసం కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. పాపీ అతన్ని పలకరిస్తుంది. స్కాట్ ఆమెని చూసి పారిపోతాడు. స్కాట్‌కి పాపీ నచ్చింది. అయినా పైకి మాత్రం ఆమె మీద చిరాకు పడుతూ ఉంటాడు. ఆమె అతని బాధ అర్థం చేసుకోవటానికి అతన్ని ప్రశ్నలు వేసేది. అది అతను ప్రేమ అనుకున్నాడు. పాపీ అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతుందని అతనికి తెలియదు. స్కాట్‌ని చూసి పాపీ ఆశ్చర్యపోతుంది కానీ పెద్దగా పట్టించుకోదు. సామాజిక కార్యకర్త టిమ్ పాపీని డేట్‌కి తీసుకువెళతాడు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. కలిసి పడుకుంటారు. మర్నాడు ఆమె డ్రైవింగ్ క్లాస్ కి వెళ్ళేటపుడు టిమ్ ఆమెతోనే ఉంటాడు. ఆమె స్కాట్‌కి అతన్ని తన మిత్రుడని పరిచయం చేస్తుంది. స్కాట్ నిరాశ పడతాడు. పైకి మాత్రం ఎప్పటిలాగే చిరాకుగా ఉంటాడు. ఆ చిరాకులో కారు నడుపుతూ ఉంటాడు. ఇతర డ్రైవర్లు సరిగా నడపటం లేదని వారిని తిడుతూ ఉంటాడు. కాసేపటికి అతని కోపం తారస్థాయికి చేరుతుంది. కారు ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. ఆమె ఆందోళన పడుతుంది. ఇద్దరూ గొడవపడతారు. అతను ఆమె మీద దాడి చేస్తాడు. ఆమె అతన్ని కాసేపు ప్రశాంతంగా ఉండమని కోరుతుంది. కాసేపటి తర్వాత “టిమ్ నీ ప్రియుడా?” అని అడుగుతాడు. ఆమె మాట్లాడదు. అతను ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమె కాస్త విచారంగా ఉంటుంది కానీ రెండు రోజుల్లోనే మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. ఆమె టిమ్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా చిత్రం ముగుస్తుంది.

నిష్కల్మషంగా ఉండేవారికి కూడా లోకంలో ఇబ్బందులు తప్పవు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నిస్పృహ తప్ప ఏమీ లాభం ఉండదు. తమ తప్పు లేనపుడు నిస్పృహ చెందటం అనవసరం. తమకు చేతనైన మంచి పనులు చేస్తూ సాగిపోవటమే వారు చేయవలసినది. ప్రపంచాన్ని మార్చటం మహామహుల వల్లే కాలేదు. అందుకని వారు నిరాశ పడలేదు. తమ కర్తవ్యమేదో చేసి నిష్క్రమించారు. అది చాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here