మరుగునపడ్డ మాణిక్యాలు – 56: ద గిఫ్ట్

0
10

[సంచిక పాఠకుల కోసం ‘ద గిఫ్ట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]‘ద [/dropcap]గిఫ్ట్’ (2015) ఒక సైకలాజికల్ థ్రిల్లర్. కథ ఇంతకు ముందు చూసినట్టే ఉంటుంది. కానీ చివరికి ఊహించని విధంగా ఉంటుంది. ఒక కుటుంబాన్ని ఒక ఉన్మాది కలత పెట్టడం ఇంతకు ముందు చాలా చిత్రాల్లో చూశాం. ‘కేప్ ఫియర్’, ‘ఫేటల్ అట్రాక్షన్’ ఇలాంటి చిత్రాలే. ఈ చిత్రాలతో పాటు హిచ్‌కాక్ చిత్రాల స్ఫూర్తితో ‘ద గిఫ్ట్’ స్క్రీన్ ప్లే రాశానని రచయిత, దర్శకుడు జోయెల్ ఎడ్గర్టన్ చెప్పాడు. అతనికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుకి నామినేషన్ అందుకున్నాడు. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

ఖాళీగా ఉన్న ఒక ఇంటి లోపలి దృశ్యాలతో చిత్రం మొదలవుతుంది. ఆ ఇంట్లో ఏం జరగబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకులకి కలుగుతుంది. ఆ ఇల్లు సైమన్, రాబిన్ అనే దంపతులు కొంటారు. వారు షికాగో నుంచి లాస్ ఏంజెలెస్‌కి వచ్చారు. లాస్ ఏంజెలెస్‌లో సైమన్ కి ఉద్యోగం రావటంతో అక్కడికి వచ్చారు. సైమన్ స్వస్థలం లాస్ ఏంజెలెస్‌కి కాస్త దూరంలో ఉంటుంది. రాబిన్ ఒక డిజైనర్. ఇంట్లోనే పని చేస్తుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వారికో పెంపుడు కుక్క. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనటానికి వెళతారు. అక్కడ ఒక వ్యక్తి సైమన్ దగ్గరకి వస్తాడు. “మనమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. నా పేరు గోర్డన్” అంటాడు. మొదట గుర్తు పట్టకపోయినా సైమన్ అతని పేరు విని వెంటనే గుర్తుపడతాడు. రాబిన్‌ని అతనికి పరిచయం చేస్తాడు. సైమన్ ఫర్నిచర్ డెలివరీకి సంబంధించి షాపతనితో మాట్లాడుతుంటే రాబిన్ గోర్డన్ ఫోన్ నంబర్ తీసుకుంటుంది. సైమన్ సెలవు తీసుకుంటూ “అంతా బాగానే ఉంది కదా?” అంటాడు. “బాగానే ఉంది” అంటాడు గోర్డన్. “చాలా సంతోషం. గుర్తుపట్టి పలకరించినందుకు సంతోషం” అంటాడు సైమన్. ఫోన్ నంబర్ తీసుకోమని రాబిన్‌కి చెప్పాడు కానీ ఫోన్ చేసే ఉద్దేశం అతనికి లేదని తెలిసిపోతూనే ఉంటుంది. కథలో క్రమంగా మనకి తెలిసే మరో విషయం ఏమిటంటే రాబిన్‌కి గర్భం పోయింది. ఆమె గర్భంతో ఉన్నప్పుడు పిల్లల బొమ్మలు కూడా కొన్నారు. ఆమెకి మళ్ళీ గర్భం ధరించాలని కోరిక.

ఒకరోజు ఆమె స్నానం చేస్తుంటే డోర్ బెల్ మోగుతుంది. స్నానం ముగించుకుని వచ్చి చూస్తే గుమ్మం ముందు వైన్ బాటిల్ ఉంటుంది. దాంతో పాటు గోర్డన్ రాసిన కార్డు ఉంటుంది. “సొంతూరికి స్వాగతం” అని రాసి ఉంటుంది. విశేష సందర్భాల్లో ఇలాంటి కానుకలు ఇవ్వటం అమెరికాలో మామూలే. “అతనికి మన అడ్రసు ఎలా తెలిసింది?” అని రాబిన్ అంటుంది. “ఏమో!” అంటాడు సైమన్. నిజానికి సైమన్ ఫర్నిచర్ దుకాణంలో డెలివరీ కోసం అడ్రసు చెప్పినపుడు గోర్డన్ విన్నాడు. అమెరికాలో అడ్రసులు సులభంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవటం కష్టం కాదు. తమ ఫోన్ నంబరు ఇవ్వలేదు కాబట్టి గోర్డన్ మళ్ళీ తమని కలుసుకునే అవకాశం లేదని సైమన్ అనుకున్నాడు. కానీ అతను నేరుగా ఇంటికే వచ్చాడు. అయినా సైమన్ పెద్దగా పట్టించుకోడు. గోర్డన్ మానసిక పరిస్థితిపై మనకు అనుమానం వస్తుంది. ఎందుకతను పిలవకుండా అడ్రసు గుర్తు పెట్టుకుని వచ్చాడు?

ఒకరోజు సాయంత్రం గోర్డన్ మళ్ళీ వస్తాడు. రిపేర్లు ఏమైనా అవసరమైతే చేసేవాళ్ళ ఫోన్ నంబర్లు రాబిన్‌కి ఇస్తాడు. ఆమె మొదట తలుపు దగ్గరే నిలబడి మాట్లాడుతుంది. కుక్క ఆమె పక్కనే ఉంటుంది. తర్వాత ఆమె మొహమాటపడి అతన్ని ఇంట్లోకి రమ్మంటుంది. ఇల్లు చూపిస్తుంది. అతను పిల్లల బొమ్మలు ఉన్న అట్ట పెట్టె చూసి “మీకు పాపాయి ఉందా?” అని అడుగుతాడు. “లేదు. ప్రస్తుతానికి కుక్క మాత్రమే ఉంది” అంటుందామె. ఇల్లు చాలా బావుందంటాడతను. ఆమె అతన్ని భోజనం చేసి వెళ్ళమంటుంది. సైమన్ వచ్చాక అందరూ కలిసి భోజనం చేస్తారు. సైమన్ స్కూల్లో విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్‌గా ఉండేవాడని గోర్డన్ అంటాడు. “సైమన్ తాను తలచుకుంటే ఏమన్నా చేస్తాను అని ప్రచారం చేసి గెలిచాడు. సైమన్ తలచుకుంటే ఆటల సమయం పెరిగింది. సైమన్ తలచుకుంటే క్యాంటీన్‌లో పదార్థాలు పెరిగాయి. ఇప్పుడు సైమన్ తలచుకుంటే పెద్ద ఉద్యోగం, అందమైన భార్య, కొత్త ఇల్లు.. బుల్లి పాపాయిలు” అంటాడు గోర్డన్. ఆ చివరి మాటకి రాబిన్ చిన్నబుచ్చుకుంటుంది. సైమన్ నవ్వి ఊరుకుంటాడు. ఇంతలో గోర్డన్ “నేను ఎక్కువ మాట్లాడినట్టున్నాను” అంటాడు. పర్వాలేదంటారు ఇద్దరూ. సైమన్ “ఇన్నాళ్ళూ ఏం చేశావు?” అని గోర్డన్‌ని అడుగుతాడు. తాను సైన్యంలో పని చేశానని చెబుతాడు గోర్డన్. అంటే అఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో పోరాడాడు. ఆ యుద్ధాల వల్ల సాధించిందేమీ లేదని చాలా మంది అమెరికన్లు అనుకుంటారు. ‘అయ్యో పాపం’ అన్నట్టు చూస్తుంది రాబిన్. సైన్యం విడిచిపెట్టిన తర్వాత చిన్నాచితకా పనులు చేశానంటాడు గోర్డన్. “ఎంత చెడు జరిగినా అంతా మన మంచికే” అంటాడు చివరికి. అతను వెళ్ళిన తర్వాత సైమన్ “అతను ఏదో భ్రమలో ఉన్నాడు. మేమిద్దరం స్నేహితులం అనుకుంటున్నాడు. నాకిదేం నచ్చటం లేదు” అంటాడు. “అయిపోయింది కదా. వదిలెయ్” అంటుంది రాబిన్. పిల్లలు లేరని చెప్పినా గోర్డన్ పిల్లల మాట ఎత్తాడంటే ‘మీ జీవితంలో వెలితి ఉంది కదా’ అన్నట్టు అనిపిస్తుంది. వెలితి ఎత్తి చూపించటం సభ్య లక్షణం కాదు. సైమన్ పట్టించుకోనట్టు ఉన్నా గోర్డన్ ఏం పని చేస్తున్నాడో అడిగి ‘నువ్వేం సాధించావు?’ అని అర్థం వచ్చేటట్టు మాట్లాడతాడు. ఈ శ్లేష గోర్డన్‌కి అర్థమవుతుంది. ఇక్కడ ఇద్దరు నటులూ సూక్ష్మమైన హావభావాలతో ఒకరినొకరు దెప్పిపొడవటం చక్కగా అభినయించారు.

కొన్నాళ్ళ తర్వాత దంపతులిద్దరూ ఒక పార్టీకి వెళ్లి ఇంటికి వస్తారు. గుమ్మం దగ్గర మరో కానుక ఉంటుంది. గోర్డన్ రాసిన కార్డు ఉంటుంది. అందులో “డిన్నర్ ఇచ్చినందుకు థాంక్స్” అని రాసి ఉంటుంది. కానుకగా ఇంటి ముందున్న చేపల గుంటలో గోర్డన్ చేపలు వేసి వెళ్ళాడని గమనిస్తారు. సైమన్‌కి గోర్డన్ మళ్ళీ మళ్ళీ రావటం పట్ల అసహనంగా ఉంటుంది. రాబిన్ అతను సద్భావంతోనే చేస్తున్నాడంటుంది. “వాడిని స్కూల్లో అందరూ వియర్డో (వింతగా ప్రవర్తించేవాడు) అనేవారు. ఇప్పుడు కూడా వాడు చేసేది రివర్సు దొంగతనంలా ఉంది. ఇంటికి వచ్చి ఏదో ఒకటి పెట్టి పోవటం. ఇంతకీ అతనికి నువ్వు నచ్చినట్టున్నావు” అంటాడు. ఫ్రిజ్ మీద అతకించిన ఒక బోర్డ్ మీద గోర్డన్ నంబర్ రాసి ఉంటుంది. అక్కడ గోర్డన్ పేరు కొట్టేసి వియర్డో అని రాస్తాడు సైమన్. రాబిన్ నవ్వి ఊరుకుంటుంది. మర్నాడు గోర్డన్ మళ్ళీ వస్తాడు. అతనికి టీ ఇస్తుంది రాబిన్. ఫ్రిజ్ మీద తన పేరుకి బదులు వియర్డో అని ఉండటం చూసి ఖిన్నుడవుతాడు. అది రాబిన్ చూస్తుంది. అయితే గోర్డన్ దాని గురించి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత దంపతులిద్దరూ స్నేహితులతో జరిగినదంతా చెబుతారు. “ఫ్రిజ్ మీద రాసినది అతను చూసిన తర్వాత ఏమైంది” అని అడుగుతుంది ఒకామె. “ఆశ్చర్యమేమిటంటే అతను తర్వాత ఫోన్ చేసి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఇంకో జంటను కూడా అహ్వానించానని చెప్పాడు” అంటాడు సైమన్. “ఇదేదో అనుమానించాల్సిన విషయమే. ఫ్రిజ్ మీద రాసింది చూశాక ఇంకెప్పుడూ మీ జోలికి రాడనుకున్నాను” అంటుందా స్నేహితురాలు. “ఆ అవమానభారం కన్నా అతనికి రాబిన్ మీద ఇష్టమే ఎక్కువ ఉన్నట్టుంది. అంతా రాబిన్ ఇచ్చిన అలుసే” అంటాడు సైమన్. రాబిన్ మౌనంగా ఉంటుంది. “భోజనానికి వెళ్ళకండి” అంటుంది స్నేహితురాలు. “మేం వెళ్ళకపోతే వాడు వస్తూనే ఉంటాడు” అంటాడు సైమన్. “ఒకసారి నిర్మొహమాటంగా అతనితో మాట్లాడితే మంచిది” అంటాడొక స్నేహితుడు. చివరికి దంపతులిద్దరూ వెళ్ళాలనే నిర్ణయించుకుంటారు.

గోర్డన్ ఇల్లు విలాసవంతంగా ఉంటుంది. బయట పెద్ద గేట్ ఉంటుంది. కాస్త దూరాన ఇల్లు ఉంటుంది. రిమోట్‌తో గేట్ తెరవచ్చు. ఇల్లు చూసి సైమన్ విస్తుపోతాడు. తనకి ఇంత పెద్ద ఇల్లు లేదు మరి. గోర్డన్‌ని “మీ ఆవిడ ఉందా? నీకు పెళ్ళయిందా?” అని అడుగుతాడు సైమన్. “అదో పెద్ద కథ. ప్రస్తుతం ఒంటరినే” అంటాడు గోర్డన్. ఇంతలో గోర్డన్ ఫోన్ మోగుతుంది. అతను ఫోన్ మాట్లాడి వీళ్ళతో “నేను పని మీద బయటకి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తాను” అని కార్లో వెళ్ళిపోతాడు. వీళ్ళు విస్తుపోతారు. ఎవరైనా అనుకోని పని వస్తే మళ్ళీ కలుద్దాం అని అతిథుల్ని పంపేస్తారు. గోర్డన్ అతిథుల్ని ఇంట్లో వదిలి వెళతాడు. సైమన్ “అతను నీ మీద వ్యామోహంలో ఉన్నాడు. అందుకే ఇలా మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాడు” అంటాడు. “నాకేం అలా అనిపించటం లేదు” అంటుంది రాబిన్. సైమన్ ఇంటి పై అంతస్తు లోకి వెళతాడు. రాబిన్ ఇష్టం లేకపోయినా అతని వెంట వెళుతుంది. అక్కడ ఒక గదిలో అల్మారాలో ఆడవాళ్ళ బట్టలుంటాయి. “ఒంటరినన్నాడు?” అంటాడు సైమన్. ఇంకో గదిలో పిల్లల బొమ్మలుంటాయి. ఇంతలో గోర్డన్ కారు వస్తున్న శబ్దం విని ఇద్దరూ ఆదరాబాదరాగా కింది అంతస్తుకి వచ్చి కూర్చుంటారు. గోర్డన్ వచ్చాక ఏమైందని అడుగుతారు. అతను అంతా బాగానే ఉందని అంటాడు. సైమన్ “నువ్వు ఏం చేస్తుంటావు? ఇంత పెద్ద ఇల్లు ఉందంటే ఏదో పెద్ద పనే” అంటాడు. గోర్డన్ “నేను అబద్ధం చెప్పాను. నేను పని మీద బయటకి వెళ్ళలేదు. నా భార్య పిల్లలని తీసుకుని కొన్ని రోజుల క్రితం వెళ్ళిపోయింది. ఇది ఆమె ఇల్లే. ఆమే ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడటానికే బయటకి వెళ్ళాను. అదంతా వదిలెయ్యండి. భోజనం చేద్దాం” అంటాడు. సైమన్ “లేదు. నేను నీతో మాట్లాడాలి” అని రాబిన్‌ని బయటకి వెళ్ళి కార్లో కూర్చోమంటాడు. “నువ్వు మా ఇంటికి రావటం మానెయ్. నీ వ్యవహారమేమిటో ముందు చూసుకో” అని బయటికి వస్తాడు సైమన్. గోర్డన్ భార్య వెళ్ళిపోవటంతో మనసు భ్రమించి తనను, రాబిన్‌ని చూసి అసూయపడుతున్నాడని సైమన్ భావన. అందుకే పదే పదే తమ ఇంటికి వస్తున్నాడని, రాబిన్ మీద మోజు పడ్డాడని అతని అభిప్రాయం. సైమన్, రాబిన్ ఇద్దరూ కార్లో బయల్దేరతారు. గేటు దగ్గరకి వస్తారు. గేటు మూసి ఉంటుంది. గోర్డన్ రిమోట్‌తో గేటు తెరుస్తాడని వేచి ఉంటారు. అతను తెరవడు. సైమన్ కోపంగా కారు దిగుతాడు. అప్పుడు గోర్డన్ గేటు తెరుస్తాడు. దంపతులిద్దరూ బయటపడతారు.

కొన్నాళ్ళ తర్వాత రాబిన్ రన్నింగ్ చేసి ఇంటికి వచ్చి చూస్తే చేపల గుంటలోని చేపలు చచ్చి పడి ఉంటాయి. ఇంట్లోని కుక్క కూడా మాయమవుతుంది. సైమన్ కోపంతో గోర్డన్ ఇంటికి వెళతాడు. ఒక స్త్రీ తలుపు తీస్తుంది. “మీ ఆయన గోర్డన్‌తో మాట్లాడాలి” అంటాడు సైమన్. “మా ఆయన పేరు మైక్” అంటుందామె. మైక్ లోపలి నుంచి వస్తాడు. అంటే అది గోర్డన్ ఇల్లు కాదు. పోలీసులకి చెబితే వాళ్ళు విచారణ చేస్తారు. ఆ ఇల్లు మైక్ దని, అతను లగ్జరీ కార్లు అద్దెకి ఇస్తూ ఉంటాడని, గోర్డన్ అతని దగ్గర ఒక కారు అద్దెకి తీసుకున్నాడని, ఇంటి గ్యారేజ్‌లో ఉన్న కారు తీసుకోవటానికి అతనికి గ్యారేజ్ రిమోట్ ఇస్తే అతను ఏదో రకంగా ఇంటిలోకి ప్రవేశించాడని తెలుస్తుంది. ఆ సమయంలో మైక్ దంపతులు విహారయాత్రలో ఉన్నారు. రాబిన్‌కి గోర్డన్ మీద జాలి కలుగుతుంది. అతను న్యూనతతో తనకి కూడా మంచి ఇల్లు, జీవితం ఉందని చూపించుకోవటానికి ఇదంతా చేశాడనుకుంటుంది. “కుక్క తానే వెళ్ళిపోయిందేమో” అంటుంది. “మరి చేపల్ని ఎవరు చంపారు? వాడే. కుక్కని కూడా వాడే తీసుకెళ్ళాడు” అంటాడు సైమన్. పోలీసు అధికారి “మేము అతన్ని పట్టుకుని విచారించవచ్చు. అయితే ఆధారాలేమీ లేవు. కుక్క గురించి అడిగితే అతనికి మీరే ఫిర్యాదు చేశారని తెలిసిపోతుంది. మీ మీద పగ పట్టవచ్చు” అంటాడు. దంపతులిద్దరూ ఆ విషయం వదిలేస్తారు. అయితే రాబిన్‌కి భయం మొదలవుతుంది. ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు చిన్న శబ్దానికి కూడా భయపడుతూ ఉంటుంది. ఒక రాత్రి కుక్క తిరిగివస్తుంది. ఎలా వచ్చిందో ఇద్దరికీ అర్థం కాదు. ఇదిలా ఉండగా గోర్డన్ నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

చిత్రం మొదట్నుంచే టెన్షన్ ఉంటుంది. ఖాళీ ఇల్లు చూపించినపుడు ఇదేమైనా దెయ్యాల కొంపా అనిపిస్తుంది. దానికి తగ్గట్టు గానే చిన్న చిన్న శబ్దాలని ఉపయోగించుకుని ఏదో జరగబోతోందని మనకి ఉత్సుకత కలిగిస్తాడు దర్శకుడు. అట్ట పెట్టె మీద అంటించిన టేపు ఒక్కసారిగా లాగితే వచ్చే శబ్దం ముందు వినిపించి తర్వాత దృశ్యం చూపిస్తాడు. ఇలాంటివే ఉలిక్కిపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. గోర్డన్ లాంటి వింత ప్రవర్తన గలవారి పరిచయం ఉంటే ఎవరికైనా భయం కలుగుతుంది. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనిపిస్తుంది. కానీ మనం దూరంగా ఉంటే సరిపోదుగా! అవతలి వారి ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో మనకి తెలియదు. అలాంటపుడు చిన్న చిన్న వాటికి భయపడటం సహజమే. ఈ ఉత్కంఠభరితమైన పరిస్థితిని దర్శకుడు ప్రభావవంతంగా చూపించాడు. రామ్ గోపాల్ వర్మ ‘రాత్రి’ చిత్రంలో గ్రైండర్ శబ్దం, లారీ వెనక తలుపు ఒక్కసారిగా కిందకి వదిలితే వచ్చే శబ్దం లాంటివి ఉపయోగించి ప్రేక్షకులని భయపెట్టాడు. అతని మీద హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంది. ఆ కోవకి చెందినదే ఈ చిత్రం కూడా. సైమన్‌గా జేసన్ బేటెమన్, రాబిన్‌గా రెబెకా హాల్ నటించారు. గోర్డన్‌గా దర్శకుడు జోయెల్ ఎడ్గర్టన్ తానే నటించాడు. జేసన్ బేటెమన్ పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల ద్వేషం దాచుకునే పాత్రలో అద్భుతంగా నటించాడు. అతను కాక వేరే వారైతే ఈ పాత్రకి న్యాయం చేయగలిగేవారు కాదేమో. రెబెకా హాల్ ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయే పాత్రలో ఒదిగిపోయింది. గోర్డన్ పాత్రకి వేరే నటుడిని తీసుకుంటే బావుండేదేమో అని నాకనిపించింది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. చిత్రం పూర్తయ్యాక మళ్ళీ చూస్తే స్క్రీన్ ప్లే గొప్పతనం తెలుస్తుంది. అలాగే చిత్రం చూడలనే ఉద్దేశం లేనివారు ఈ వ్యాసం చదివాక మళ్ళీ మొదటి నుంచి చదివితే పాత్రల మనసుల్లో ఉన్నదేమిటో తేటతెల్లమవుతుంది.

ఈ క్రింద చిత్రకథ మరి కొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

గోర్డన్ రాసిన ఉత్తరంలో “నా నిజమైన ఇల్లు చూస్తే మీరు జాలిపడతారు. మీలా నేను విజయాలు సాధించలేదు. అందుకే న్యూనతతో ఆ పని చేశాను. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను” అని ఉంటుంది. ఉత్తరం వెనకాల “సైమన్! చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇక జరిగినదాన్ని మర్చిపోవడమే మంచిదేమో” అని ఉంటుంది. అదేమిటని సైమన్‌ని అడుగుతుంది రాబిన్. “ఏమో! వాడి మనఃస్థితి బాగాలేదు కదా. ఏదో వాగుతున్నాడు” అంటాడు. రాబిన్ ఊరుకుంటుంది కానీ ఆమెకి అనుమానం పోదు. రాత్రి నిద్ర పట్టటానికి ఆమె పక్కింటామె ఇంట్లోని నిద్ర మాత్రలు దొంగిలించి వేసుకుంటుంది. ఒకరోజు ఇంట్లో ఏదో అలికిడి అయి రాబిన్ భయంగా ఇల్లంతా పరిశీలిస్తుంది. కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోతుంది. లేచేసరికి మంచంలో ఉంటుంది. బయట గదిలో సైమన్ ఉంటాడు. ఆమె దాచుకున్న నిద్రమాత్రలు అతనికి దొరికాయి. మాత్రలెందుకు వాడుతున్నావని ప్రశ్నిస్తాడు. ఆమె “ఒంటరిగా ఉన్నప్పుడు నా భయంగా ఉంటుంది. గోర్డన్ మళ్ళీ వస్తాడేమో అనిపిస్తుంది. అతనికి సారీ చెబితే నా మనసు కుదుటపడుతుంది. అతను ‘జరిగినదాన్ని మరిచిపోదాం’ అని ఎందుకన్నాడు?” అని అడుగుతుంది. సైమన్ అసహనంగా “ఆ వ్యవహారం ముగిసింది. వదిలెయ్” అంటాడు. తర్వాత అనునయంగా “అంతా అతని తప్పే. మర్చిపో. కొన్నాళ్ళకి అంతా సర్దుకుంటుంది. ధైర్యంగా ఉండు” అంటాడు. అతనికి తన భయాలు చెప్పుకోవటంతోనూ, అతని సాంత్వన వాక్యాలతోనూ ఆమె మనసు తేలికపడుతుంది. కొన్నాళ్ళకి ఆమె గర్భం ధరిస్తుంది. కొన్ని నెలలు గడిచిపోతాయి. అంతా మామూలుగా ఉందనుకున్న సమయంలో ఒక షాపు దగ్గర రాబిన్‌ని చూస్తూ గోర్డన్ కనిపిస్తాడు. రాబిన్ తనని చూసిందని తెలిసి హడావిడిగా వెళ్లిపోతాడు.

రాబిన్‌కి బేబీ షవర్ (సీమంతం లాంటిది) జరుగుతుంది. సైమన్ చెల్లెలు వస్తుంది. రాబిన్ ఆమెని గోర్డన్ తెలుసా అని అడుగుతుంది. హైస్కూల్లో ఉన్నప్పుడు గోర్డన్ మీద ఒకతను లైంగికదాడి చేశాడని, అందువల్ల అతను స్కూలు వదిలి వెళ్ళాడని ఆమె అంటుంది. సైమన్‌కి ఇదంతా తెలిసే ఉంటుంది కదా అంటే సైమనే లైంగికదాడి జరగటం చూసి ప్రిన్సిపాల్‌కి చెప్పాడని అంటుంది. అప్పుడు గ్రెగ్ అనే స్నేహితుడు కూడా సైమన్‌తో ఉన్నాడని అంటుంది. అప్పుడు తన వయసు చిన్నది కావటంతో తనకు అంతా తెలియదని, సైమన్ వల్ల గోర్డన్ రక్షించబడ్డాడని అంటుంది. ఇదంతా సైమన్ రెబెకాకి ఎందుకు చెప్పలేదు? సైమన్ ఏదో దాస్తున్నాడని అతను ఇంట్లో లేనప్పుడు అతని ఫైళ్ళు చూస్తుంది రాబిన్. అందులో గోర్డన్ గురించి ఒక ఫైలు ఉంటుంది. అందులో.. సైన్యంలో అతని ప్రవర్తన బాగాలేక అతన్ని తొలగించారని, మానసిక వైద్యశాలలో పెట్టారని ఉంటుంది. తర్వాత తన ప్రియురాలి ఇంట్లో దొంగతనంగా ప్రవేశించి బిడ్డని అపహరించటానికి ప్రయత్నించాడని ఉంటుంది. సైమన్ గోర్డన్ గురించి రహస్యంగా కూపీ లాగాడు. మరి రాబిన్‌కి ఎందుకు చెప్పలేదు? రాబిన్ సైమన్ స్నేహితుడైన గ్రెగ్‌ని వెతికి పట్టుకుని అతనితో మాట్లాడుతుంది. సైమన్ చెప్పింది లైంగికదాడి గురించి కాదని, అతను గోర్డన్ స్వలింగప్రియుడని పుకారు పుట్టించాడని గ్రెగ్ అంటాడు. సైమన్ ఇదంతా వినోదం కోసం చేశాడని అంటాడు. సైమన్ క్రూరంగా ఉండేవాడని, మెతకగా ఉండే విద్యార్థులను ఏడిపించేవాడని అంటాడు. గోర్డన్ గే అని విని అతని తండ్రి అతన్ని చంపబోయాడని, అందుకు తండ్రిని అరెస్టు చేశారని అంటాడు.

రాబిన్ ఇంటికి వచ్చి సైమన్‌ని నిలదీస్తుంది. “నువ్వు పుట్టించిన పుకారు వల్ల ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది” అంటుంది. “గోరంతలు కొండంతలు చేసి చెబుతున్నారు. నేను ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు” అంటాడతను. “నువ్వు పుట్టించిన పుకారుకి సారీ చెప్పొచ్చుగా” అంటుందామె. “స్కూల్లో జరిగిన ప్రతి దానికి సారీలు చెప్పాలంటే ఎలా?” అంటాడతను. చివరికి “నీ కోసమే నేను గోర్డన్ సమాచారాన్ని సేకరించాను. దాని ఆధారంగా గోర్డన్ మన జోలికి రాకుండా చట్టపరమైన ఉత్తరువు సంపాదించాను. నువ్వు అనవసరంగా ఆదుర్దా పడతావని నీకు చెప్పలేదు. నిజంగా నాకు అతని తండ్రి అతన్ని చంపబోయాడని తెలియదు” అంటాడు. “అన్ని అబద్ధాలు చెప్పాక ఇది నిజమని ఎలా నమ్మను? ఇన్నాళ్ళూ నేను పిచ్చి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే నువ్వు నిజం చెప్పలేదు. దాన్ని బట్టే అర్థమయింది నువ్వెలాంటి వాడివో” అంటుందామె. “నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలో చెప్పు” అంటాడతను. “ఆ మాట అడగాల్సింది నన్ను కాదు” అంటుందామె.

గోర్డన్‌కి సైమన్ మీద కసి ఉంది. అయితే సైమన్ అది పసిగట్టలేదు. కొందరు ఇతరుల మనోభావాలను పట్టించుకోరు. మనలో చాలామందికి స్కూల్లో వేధింపులు ఎదురయ్యే ఉంటాయి. కొందరికి అది వినోదం. వయసు అలాంటిది. సైమన్ కూడా స్కూల్లో ఏదో చేశాను, పెద్ద విషయం కాదు అన్నట్టు ఉంటాడు. పైగా “నా తండ్రి నాతో కఠినంగా ఉండేవాడు. నేను తట్టుకుని నిలబడలేదా” అంటాడు. అమెరికాలో హైస్కూల్ అంటే పద్దెనిమిది ఏళ్ళ వరకు ఉంటుంది. అది చిన్న వయసేమీ కాదు. తీవ్ర పరిణామాలు జరిగినపుడు తన తప్పు ఒప్పుకోవాలి కదా? అక్కడే సైమన్ స్వభావం బయటపడుతుంది. ఇంతకాలమైనా రాబిన్‌కి కూడా నిజం చెప్పలేదు. గోర్డన్ రాబిన్ మీద మోజు పడ్డాడని నిజంగానే నమ్మాడు. చేపలని చంపినప్పుడైనా గోర్డన్‌తో మాట్లాడి క్షమాపణ కోరి ఉంటే సరిపోయేది. ‘నన్నే సవాల్ చేస్తాడా? వాడెంత?’ అనే భావంతో ఉండిపోయాడు. అతనిలో మదం పోలేదు. వయసుతో పాటు పెరిగింది. అయితే రాబిన్ తనకు దక్కాలంటే గోర్డన్‌కి సారీ చెప్పక తప్పదు. లేకపోతే ఆమె అతన్ని వదిలి పోవటానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సైమన్ గోర్డన్‌ని కలుసుకుంటాడు. “సారీ చెప్పాలని వచ్చాను. రాబిన్ రాజీ చేసుకోమని చెప్పింది” అంటాడు. “ఆమె చెబితే వచ్చావా?” అంటాడు గోర్డన్. సైమన్ అహం దెబ్బ తింటుంది. “నాకెవరూ చెప్పక్కరలేదు. నేనే సారీ చెబుతున్నాను. సరేనా?” అంటాడు సైమన్. “ఇప్పుడు చెప్పి లాభం లేదు. నువ్వు గతాన్ని వదిలించుకున్నా గతం నిన్ను వదలదు. నీకు ఇంతకు ముందే ఒక అవకాశం ఇచ్చాను” అంటాడు గోర్డన్. సైమన్‌కి చిర్రెత్తుకొస్తుంది. గోర్డన్ మీద దాడి చేస్తాడు. గోర్డన్ కింద పడిపోతాడు. “నీ బతుకిలా అవ్వటానికి నువ్వే కారణం. నేను కాదు. నా కుటుంబం జోలికొస్తే చంపేస్తాను” అని అతన్ని కిందే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక రాబిన్‌కి “సారీ చెప్పాను. అతను సరే అన్నాడు” అని అబద్ధం చెబుతాడు.

సైమన్‌కి ప్రొమోషన్ వస్తుంది. అయితే అతను తనకు పోటీగా ఉన్న ఉద్యోగి గురించి దొంగ పత్రాలు సృష్టించి అతన్ని పోటీ నుంచి తప్పించి ప్రొమోషన్ దక్కించుకున్నాడని తెలుస్తుంది. రాబిన్‌కి కూడా ఈ విషయం తెలుస్తుంది. అదే సమయంలో రాబిన్‌కి పురిటి నొప్పులు వస్తాయి. ఆమె హాస్పిటల్లో మగబిడ్డని ప్రసవిస్తుంది. సైమన్ అవకతవకలకి పాల్పడటంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు అతని బాస్ ఫోన్ చేసి చెబుతాడు. రాబిన్ కూడా సైమన్‌తో ఉండటం ఇష్టం లేదని చెబుతుంది. సైమన్ నిస్పృహతో హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గర గోర్డన్ పంపించిన కానుక ఉంటుంది. అందులో సైమన్ ఇంటి తాళం చెవి, ఒక ఆడియో సీడీ, ఒక వీడియో సీడీ ఉంటాయి. అంటే గోర్డన్ దగ్గర సైమన్ ఇంటి తాళం చెవి ఉంది. ఇంట్లోకి వచ్చినపుడు అతను తాళం చెవి ముద్ర తీసుకుని ఉంటాడు. ఆడియో సీడీలో సైమన్, రాబిన్ మాట్లాడుకున్న మాటలు ఉంటాయి. మైక్ ఇంట్లో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకున్న మాటలవి. గోర్డన్ వారి మాటలు రికార్డ్ చేశాడు. వారి మాటలు రికార్డ్ చేయటానికే అతను వారిని వదిలి బయటకు వెళ్ళాడు. సైమన్ రాబిన్‌కి నిజం చెప్పాడా లేదా అని తెలుసుకోవటానికి అతను వారి మాటలు రికార్డ్ చేశాడు. నిజం చెప్పలేదని తెలిసింది. దానితో అతనికి కోపం మరింత పెరిగింది. సైమన్ క్షమాపణ చెప్పటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ సైమన్ తాను చేసినది తప్పు కానట్టు ఉండిపోయాడు.

వీడియో సీడీలో రాబిన్‌ని ఆమె ఇంట్లో ఉండగా రికార్డ్ చేశాడు గోర్డన్. ఆమె కళ్ళు తిరిగి పడిపోయిన రోజు వీడియో అది. గోర్డన్ ఆమె తాగిన జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఆమె స్పృహ కోల్పోయాక ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు. అతను ఒక కోతి మాస్క్ ధరించి ఉంటాడు, బయటి వారికి అతనెవరో తెలిసే అవకాశం లేకుండా. రాబిన్ మీద గోర్డన్ లైంగిక దాడి చేయబోతున్నట్టు ఉంటుంది ఆ వీడియోలో. అక్కడ వీడియో ముగుస్తుంది. సైమన్ ఏం జరిగిందో అర్థం కాక హాతాశుడవుతాడు. అదే సమయంలో గోర్డన్ హాస్పిటల్లో రాబిన్ దగ్గరకు వెళతాడు. ముఖం మీద గాయాలుంటాయి. చేతికి కట్టు ఉంటుంది. శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చానంటాడు. రాబిన్ “సైమన్ నిన్ను కొట్టాడా?” అంటుంది. అవునంటాడతను. మళ్లీ “నువ్వు బావుండాలి. మంచివాళ్ళకి మంచి జరగటమే న్యాయం” అంటాడు.

సైమన్ కోపంతో ఊగిపోతూ హాస్పిటల్‌కి వస్తాడు. అప్పుడే గోర్డన్ లిఫ్ట్‌లో వెళ్ళిపోతూ ఉంటాడు. సైమన్‌ని చూసి హేళనగా చిరునవ్వు నవ్వుతాడు. లిఫ్ట్ వెళ్ళిపోతుంది. సైమన్ హాస్పిటల్ బయటకి వస్తాడు. కానీ గోర్డన్ హాస్పిటల్లోనే పై అంతస్తులో ఉంటాడు. సైమన్‌కి ఫోన్ చేస్తాడు. “మీ ఆవిడకి నువ్వు చెబుతావా.. నేను చెప్పనా?” అంటాడు. సైమన్ “వద్దు. ప్లీజ్. ప్లీజ్” అంటాడు. “ఏమీ జరగలేదని ఎవరైనా చెబితే బావుంటుందని అనుకుంటున్నావు కదా! నీకు గుర్తుందా? ఏమీ జరగలేదని నువ్వు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను ఏం జరిగిందో చెప్పను. ఆ బిడ్డ నీ బిడ్డో కాదో ఆ బిడ్డ కళ్ళలోకి చూసి తెలుసుకో” అంటాడు. సైమన్ పరుగున బిడ్డ ఉన్న గదికి వెళతాడు. గాజు అద్దంలోనుంచి చూస్తాడు. రాబిన్ బిడ్డని ఎత్తుకుని ఉంటుంది. అతన్ని చూసి ఆమె నిర్లిప్తంగా ఉండిపోతుంది. సైమన్ ఏమీ పాలుపోక కూలబడిపోతాడు. గోర్డన్ దూరం నుంచి అతని అవస్థ చూసి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. వెళుతూ తన చేతికున్న కట్టు తీసి పారేస్తాడు. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

సైమన్‌కి నిజం ఎప్పటికైనా తెలుస్తుందా? అతని జీవితం ఎలాగూ నాశనమయింది. ఉద్యోగం పోయింది. రాబిన్ అతన్ని వదిలేసింది. అతను ఇప్పటికీ దుష్టబుద్ధితోనే ఉన్నాడని ఆమెకి అర్థమయింది. అలాంటి వాడితో ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఒకవేళ అతను రాబిన్‌కి తన అనుమానం గురించి చెబితే ఆమె గుండె పగిలిపోయే ప్రమాదం ఉంది. ఆమెకి చెప్పకుండా బిడ్డకి పితృత్వ పరీక్ష చేయటం చట్టరీత్యా కుదరదు. కనీసం ఆమె అయినా ప్రశాంతంగా ఉండాలంటే అతను ఏమీ చేయకుండా ఉండిపోవాలి. రాబిన్ ఎలాగూ అతన్ని పిల్లవాడి దగ్గరకి రానివ్వదు. కోర్టు వారు కూడా అతను పాల్పడిన అవకతవకలు చూసి పూర్తి సంరక్షణ బాధ్యతలు రాబిన్‌కే అప్పగించే అవకాశం ఎక్కువ. ప్రొమోషన్ పోగొట్టుకున్న ఉద్యోగి అతని మీద కేసు వేస్తే అతనికి జైలు శిక్ష కూడా పడవచ్చు.

దీనికంతటికీ కారణం ఎవరు? అంతా సైమన్ స్యయంకృతమేనా? నిజమే, అతను గోర్డన్‌కి క్షమాపణ చెప్పలేదు. తప్పే. అయితే గోర్డన్ ఇలా ప్రతీకారం చేయవచ్చా? అబద్ధాలు చెప్పి గోర్డన్ జీవితాన్ని పాడు చేసిన సైమన్ ది పెద్ద తప్పా లేక ప్రతీకారేచ్ఛతో గోర్డన్ చేసినది పెద్ద తప్పా? గోర్డన్ మానసిక పరిస్థితి బాగాలేదు. అయితే అతను చేసింది సమర్థనీయం కాదు. తాను చేసింది తప్పు కాదని సైమన్ అనుకున్నట్టే ఇప్పుడు గోర్డన్ తాను చేసింది తప్పు కాదని అనుకుని ఉండవచ్చు. మతి స్థిమితం లేని వాడిని ఏమనగలం? అతను తన చేయి విరిగిందని రాబిన్‌ని నమ్మించాడు. విషాదమేమిటంటే వీరిద్దరి ఆటలో రాబిన్ పావుగా మారింది. అనాదిగా స్త్రీలు మగవారి స్వార్థాలకి బలైపోతూనే ఉన్నారు. రాబిన్‌ని గోర్డన్ ఏమీ చేసి ఉండకపోవచ్చు. కానీ అతను ఇంట్లో ప్రవేశించాడనేది నిజం. ఇది రాబిన్‌కి తెలియదు. తెలిస్తే ఆమె జీవితమంతా భయపడుతూనే బతకాలి. ఇప్పుడు గోర్డన్ ఆమెని కలిసి శుభాకాంక్షలు చెప్పాడు కాబట్టి ఆమె స్థిమితంగా ఉంటుంది.

కర్మఫలం అనుభవించటం ఎవరికైనా తప్పదు. చేసిన తప్పులకి అవకాశం వచ్చినపుడు క్షమాపణ చెప్పాలి. అవకాశం లేకపోతే దేవుడి ముందైనా మనసు ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉండవు. సైమన్ లాంటి వాళ్ళు లోకమే ఇంత, నేనూ ఇంతే అనుకుంటారు. హోదా కోసం, పదవుల కోసం పెడదారులు పడతారు. చాలామంది కుటుంబసభ్యులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తారు. రాబిన్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. అలాంటివాళ్ళు పక్కన ఉండటం నిజంగా అదృష్టం. వారి మాట కూడా వినకపోతే అధోగతి తప్పదు. మండోదరి రావణుడికి ఎంతో చెప్పింది. గాంధారి దుర్యోధనుడికి ఎంతో చెప్పింది. వాళ్ళు వినలేదు. చివరికి మట్టికరిచారు. మండోదరి, గాంధారి పుణ్యవతులుగా చరిత్రలో నిలిచిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here