మరుగునపడ్డ మాణిక్యాలు – 57: అరణ్యేర్ దిన్ రాత్రి

1
10

[సంచిక పాఠకుల కోసం ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]ఇ[/dropcap]న్నాళ్ళూ ఈ శీర్షికలో నేను చూసిన మరుగునపడ్డ చిత్రాలు పాఠకులకి సూచించాను. ఇప్పుడు ఒక పాఠకుడు సూచించిన చిత్రాన్ని నేను మొదటిసారి చూశాను. అదే ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (1970) అనే బెంగాలీ చిత్రం. దర్శకుడు సత్యజిత్ రాయ్. ఈ చిత్రాన్ని సూచించిన అభిరామ్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం. మారుతున్న భారతాన్ని చూపించారు ఈ చిత్రంలో. స్వాతంత్ర్యం వచ్చాక నగరాలు వేగంగా మారితే గ్రామీణ ప్రాంతాలు అంత తొందరగా మారలేదు. ముఖ్యంగా ఆదివాసీలు ఉండే ప్రాంతాలు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు అలాగే ఉన్నాయి. వారినలా ఉండనిస్తే వారు హాయిగా ఉంటారు. వారి వనరులని దోచుకుని వారికి అన్యాయం చేస్తున్నాం.

‘అరణ్యేర్ దిన్ రాత్రి’ అంటే ‘అరణ్యంలో పగళ్ళూ, రాత్రులూ’. ఈ చిత్రంలో నలుగురు స్నేహితులు ఉంటారు. ఒకరు పెద్ద ఎగ్జిక్యూటివ్, ఒకరు లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్, ఒకరు క్రికెటర్, ఒకరు.. అతనేం చేస్తాడో తెలియదు కానీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. వీళ్ళందరూ అప్పట్లో ఎగువ మధ్యతరగతి వారు. ఎవరికీ పెళ్ళి కాలేదు. అప్పట్లో ఎక్కువ మంది ఉద్యోగులు గుమాస్తాలుగా ఉండేవారు. ఇప్పుడంటే సాఫ్ట్‌వేర్ అనీ, ఇంకా ఏవేవో అధిక సంపాదన గల ఉద్యోగాలు వచ్చాయి. ఈ స్నేహితులు అప్పట్లో హై క్లాస్ కిందే లెక్క. మాటల్లో ఆంగ్ల పదాలు అలవోకగా జాలువారుతుంటాయి. “ఈ ప్రయాణం ఐడియా నాది. మీరందరూ యాక్సెప్ట్ చేశారు” – ఇలా ఉంటాయి మాటలు. ఆంగ్ల భాష మోజు వేళ్ళూనుకుని ఎదుగుతున్న రోజులవి. స్నేహితులందరూ కోల్‌కతా నుండి బీహార్ లోని ఒక అడవి ప్రాంతానికి విహారయాత్రకి కారులో బయలుదేరతారు. అసీమ్ కోరిక మేరకు అందరూ వస్తారు. అతనొక పెద్ద ఎగ్జిక్యూటివ్. సంజయ్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్. హరి క్రికెటర్. శేఖర్ వీళ్ళకి ఆస్థాన విదూషకుడిలా ఉంటాడు. ముఖ్యంగా హరిని ఆటపట్టిస్తూ ఉంటాడు. హరి చిరాకు పడుతూ ఉంటాడు. హరిని అతని ప్రియురాలు వదిలేసింది. అతను ఆమె పట్ల పొసెసివ్‌గా ఉండటంతో ఆమె భరించలేక వదిలేసింది. అతను కూడా కాస్త దుడుకు స్వభావం కలవాడే.

అప్పట్లో విహారయాత్రలు తక్కువే. ఇప్పుడు సంపాదన పెరిగి విహరయాత్రలు కూడా పెరిగాయి. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామని వారు నగరం విడిచి అడవి ప్రాంతానికి వస్తారు. అక్కడి ఆదివాసీలు – ముఖ్యంగా ఆడవారు ఎలా ఉంటారో సంజయ్ పుస్తకంలో చదివి వినిపిస్తాడు. ఆడవాళ్ళు ఒకే వస్త్రం ధరిస్తారని, నగలు పెట్టుకోరని అంటాడు. ఆడవాళ్ళు కూడా మద్యం తాగుతారని శేఖర్ అంటాడు. “పాశ్చాత్య సంస్కృతి” అని కూడా అంటాడు వెటకారంగా. ఫారెస్ట్ బంగ్లాకి దారి తెలియక ఆగుతారు. దారిలో కనపడ్డ లాఖా అనే అతనికి డబ్బులిస్తామని ఆశపెట్టి అతని సాయంతో ఫారెస్ట్ బంగ్లాకి చేరుకుంటారు. అయితే వాళ్ళు ముందుగా గదులు బుక్ చేసుకోలేదు. “ఈ రూల్స్ ఎవరు పాటిస్తారు?” అంటాడు అసీమ్ నిర్లక్ష్యంగా. అక్కడి ముసలి కాపలాదారు అనుమతి లేకుండా గదులు ఇవ్వటం కుదరదు అంటాడు. శేఖర్ “వీళ్ళందరూ వీఐపీలు” అంటాడు. అసీమ్ కాపలాదారుకి లంచం ఇచ్చి గదులు తీసుకుంటాడు. ‘థ్యాంక్ గాడ్ ఫర్ కరప్షన్’ అనుకుంటాడు. అవినీతిని ప్రజలు తమ ప్రయోజనానికి ఎలా వాడుకుంటారో చెప్పకనే చెప్పారు. వీళ్ళు లాఖా చేత, కాపలాదారు చేత పనులు చేయించుకుంటారు. సమాజంలో కింది స్థాయి వారిని తక్కువ చేసి చూస్తుంటారు. డబ్బులిస్తారు కానీ విలువ ఇవ్వరు. కాపలాదారు తన భార్యకి ఒంట్లో బాగాలేదని, తానే వంట చేస్తానని అంటాడు.

సాయంత్రం అందరూ దగ్గర్లోని ఊళ్ళో సారాయి దుకాణానికి వెళతారు. మందు తాగుతూ అసీమ్, సంజయ్ తమ ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరికీ అసంతృప్తి ఉంది. అసీమ్‌కి తన ఉద్యోగంలో పార్టీలు అలవాటే. ఆ పార్టీలకి వెళ్ళకపోతే అతని ఉద్యోగానికే ప్రమాదం. అందుకని బలవంతంగా వెళతాడు. అతనికి చాలా మంది ఉన్నత వర్గపు ఆడవాళ్ళతో పరిచయాలు ఉంటాయి. వారి వ్యవహారాల్లో ఉండే అవినీతి అతనికి నచ్చదు. సంజయ్‌కి తాను తన ఉద్యోగంలో ఏమీ సాధించలేకపోతున్నానని బాధ. సంజయ్ “నువ్వు బూడిదలో ఉన్నా మళ్ళీ ఉవ్వెత్తున లేస్తావు” అంటాడు అసీమ్‌తో. “ఎంత ఎత్తుకి లేస్తే అంత దూరం కింద పడతాం” అంటాడు అసీమ్. తన ఎదుగుదలలో ఎంత డొల్లతనముందో అతనికి తెలుసు. సంజయ్ “నేను ఉద్యోగం వదిలేస్తే నాకు నువ్వు ఉద్యోగం ఇస్తావా? ఉద్యోగం లేకపోతే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు?” అంటాడు. అసీమ్ మాట మార్చి “నీకు కావలసింది ఒక తోడు. నీకు పెళ్ళి చెయ్యమని మీవాళ్ళకి నేను చెబుతాలే” అంటాడు.

అక్కడ డుల్లీ అనే ఒక ఆదివాసీ స్త్రీ మద్యం తాగుతూ ఉంటుంది. ఆమెని చూసి “మిస్ ఇండియా” అని పేరు పెడతాడు శేఖర్. ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చి ఇంకాస్త మందు పోయమని అడుతుంది. హరి ఆమెని చూసి ఆకర్షితుడవుతాడు. ఆమెకి డబ్బులిస్తాడు. శేఖర్ ఆపబోతే అతని మీద అరుస్తాడు. ఆమె డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. మర్నాడు పొద్దున్న శేఖర్‌కి ఫారెస్ట్ బంగ్లా కిటికీలో నుంచి చూస్తే కాస్త దూరంలో ఇద్దరు స్త్రీలు కనపడతారు. ఒకామె చీర ధరించి ఉంటుంది, ఒకామె ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. విహారయాత్రలో ఉన్నన్ని రోజులు షేవింగ్ చేసుకోవద్దని అనుకున్న శేఖర్ ఆ స్త్రీలను చూశాక షేవింగ్ చేసుకుంటాడు. అందరికీ వారి గురించి చెబుతాడు.

స్నేహితులు నలుగురూ బజారుకి వెళతారు. గుడ్లు కావాలని అడగటంతో లాఖా వాళ్ళకి గుడ్లు తెచ్చి ఇస్తాడు. బజారులో డుల్లీ, ఇతర స్త్రీలు కూర్చుని ఉంటారు. శేఖర్ వాళ్ళ దగ్గరకి వెళ్ళి “ఇక్కడ కూర్చున్నారేంటి?” అంటాడు. “నీకెందుకు?” అంటుంది డుల్లీ. అది చూసి మిగతా మిత్రులు నవ్వుకుంటారు. సంజయ్ “వాళ్ళు జొన్నలు అమ్ముకుంటారు. ఇప్పుడు సీజన్ కాదు” అంటాడు. “వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా ఎలా నవ్వుతూ ఉన్నారో! వింత కదా” అంటాడు శేఖర్. రేపటి గురించి వారికి చింత లేదు. డబ్బు పోగేసుకుంటూ చింత పడేది నాగరికత పేరుతో గొప్పలు పోయేవారే. తర్వాత వారు శేఖర్‌కి కనపడిన స్త్రీల గురించి వాకబు చేసి వారున్న బంగ్లాకి వెళతారు. ఒక పిల్లవాడు గేటు దగ్గర ఉంటాడు. “ఎవరు మీరు?” అంటాడు. “మేం.. మనుషులం” అంటాడు శేఖర్. అతని మిత్రులు నవ్వుకుంటారు. ఎవరైనా తెలియని పిల్లవాడికి అంతకంటే ఏం చెబుతారు? బంగ్లా యజమాని బయట నుంచి వస్తాడు. వీరు కోల్‌కతా నుంచి వచ్చారని తెలిసి లోపలికి ఆహ్వానిస్తాడు. వీరి వేషధారణ చూసి అతను మర్యాద ఇచ్చాడు. పరిచయం లేకపోయినా. మనుషుల భేషజాలు ఇలా ఉంటాయి.

యజమాని కూతురు అపర్ణ, కోడలు జయ ఆవరణలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. జయ చనువుగా బ్యాడ్మింటన్ ఆడమని మిత్రులని ఆహ్వానిస్తుంది. వారి కుటుంబం కూడా హై క్లాస్ అలవాట్లు చేసుకుందని మనకి అర్థమవుతుంది. అసీమ్, అపర్ణ ఆడకుండా ఉండిపోతారు. అసీమ్ అపర్ణకి ఆకర్షితుడవుతాడు. ఆమె బాగా చదువుకుందని తెలిసి కాస్త జంకుతాడు. ఆమె మర్యాదగా మాట్లాడుతుంది, దూరం దూరంగా ఉంటుంది. తన అన్నయ్య మరణించాడని చెబుతుంది. అంటే జయ వితంతువు. మర్నాడు అల్పాహారానికి రమ్మని జయ మిత్రులందర్నీ ఆహ్వానిస్తుంది. మిత్రులు పారెస్ట్ బంగ్లాకి తిరిగి వస్తారు. జయ వితంతువని సంజయ్‌కి చెబుతాడు అసీమ్. సంజయ్ “చూస్తే అలా లేదే” అంటాడు. డుల్లీ, మరో ఇద్దరు స్త్రీలు పని కావాలని వస్తారు. శేఖర్ వారికి పని ఇస్తాడు. ఒకామె బావి నుంచి నీళ్ళు తోడుతుంది. ఒకామె గదిలో పైన వేలాడేసిన గుడ్డ పంకాని బయట నుంచి లాగుతూ ఉంటుంది గదిలో గాలి వీచేట్టు. డుల్లీ గదులు ఊడ్చే పని చేస్తుంది. ఆమె గదులు ఊడుస్తుంటే అసీమ్, సంజయ్, శేఖర్ ఆమెని పట్టించుకోకుండా దేశభవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమెకి అసలు విలువ ఇవ్వరు. ఇంతలో కాపలాదారు ఆ స్త్రీలని చూసి వాళ్ళని తరిమేస్తాడు. “వాళ్ళు మంచివాళ్ళు కాదు” అంటాడు. వేరే గదిలో ఉన్న హరి తన పర్సు పోయిందని గుర్తిస్తాడు. అతనికి లాఖా మీద అనుమానం వస్తుంది. లాఖాని పిలిచి అతన్ని కొడతాడు. లాఖా తాను పర్సు తీయలేదని అన్నా వినడు. చివరికి లాఖాని వెళ్ళగొడతాడు. అసీమ్ లాఖాకి కొంత డబ్బిచ్చి పంపిస్తాడు. కొంత సేపటికి అపర్ణ, జయ కార్లో వచ్చి పర్సు తమ అవరణలో దొరికిందని తెచ్చి ఇస్తారు. వాళ్ళు పర్సుని ‘వాలెట్’ అంటారు. మగవాళ్ళ దగ్గరుండేది పర్సని మన దేశంలో అంటాం. అమెరికా, బ్రిటన్‌లో వాలెట్ అంటారు. జయ, అపర్ణ పాశ్చాత్య పదజాలం తెలిసినవారని మనకి అర్థమవుతుంది. హరి అనవసరంగా లాఖాని అనుమానించాడు. అయితే పశ్చాత్తాపపడడు. జాత్యహంకారం అడ్డువస్తుంది.

స్త్రీ పాత్రల చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది. అపర్ణ పెళ్ళి కాని పిల్ల. హుందాగా ఉంటుంది. జయ వితంతువు. ఒక బిడ్డకి తల్లి. అయినా స్వేచ్ఛగా ఉంటుంది. అయితే అది కుటుంబం పరిధిలోనే. అపర్ణ కన్నా చనువుగా మాట్లాడుతుంది. డుల్లీ కూడా స్వేచ్ఛగా ఉంటుంది. జయని చూసి అందరూ అబ్బురపడతారు. డుల్లీని చూసి బరితెగించింది అన్నట్టు చూస్తారు. నిజానికి అపర్ణకి మాత్రమే ఎవరినైనా చేపట్టటానికి అవకాశం ఉంది. ఆమెని చూసి అందరూ జంకుతారు. ఆమె తెలివిని చూసి భయపడతారు. ఆమె ఎంత చురుకైనదో చిత్రంలో తర్వాత తెలుస్తుంది. అసీమ్‌ని ఆమె సరిగ్గా అంచనా వేస్తుంది. పై తరగతి, కింది తరగతి మధ్య ఘర్షణ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. లాఖా మీద నిష్కారణంగా నింద వేస్తాడు హరి. అతనిది తప్పని తెలిశాక కూడా మిత్రులెవరూ అతన్ని ఏమీ అనరు. దానికి ఒక కారణం అతని దుడుకు స్వభావం. రెండోది లాఖా లాంటివాళ్ళు ఏం చేసినా పడాల్సిందే అనే భావన. కాపలాదారు భార్యకి ఒంట్లో బాగాలేదంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తమ పని అయితే చాలు అన్నట్టుంటారు. కాపలాదారుకి ఆదివాసీలంటే చులకన. మిత్రులు కూడా డుల్లీ గదులు ఊడుస్తుంటే జపాన్ ఎంతో అభివృద్ధి చెందింది అని మాట్లాడుకుంటారు కానీ డుల్లీ కూడా మన దేశ పౌరురాలే, ఆమె బాగోగులు చూడాలి అనే ఆలోచనే ఉండదు. దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. శ్రమకి విలువ ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం? చిత్రం రెండో భాగంలో స్త్రీ పురుషుల మధ్య, పై తరగతి కింది తరగతి మధ్య జరిగే సంఘటనలు ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి.

సౌమిత్ర చటర్జీ, శర్మిలా టాగోర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇద్దరూ సత్యజిత్ రాయ్ దర్శకత్వం వహించిన చాలా చిత్రాలలో నటించారు. సౌమిత్ర చటర్జీ ఇంతకు ముందు చిత్రాలలో కష్టాలు పడే పాత్రల్లో నటించారు. ఇందులో అవినీతి చేయటానికి వెనకాడని పాత్రలో సామాన్య మానవుడి బలహీనతలను అలవోకగా అభినయించారు. శర్మిలా టాగోర్ హుందాగా నటించింది. ఇది కేవలం ఆమె గ్లామర్ కాదు. పాత్రకి చెందిన గతచరిత్రని దృష్టిలో పెట్టుకుని చూపించిన గాంభీర్యం. ఆ గతచరిత్ర కూడా తర్వాత చిత్రంలో తెలుస్తుంది. ఇతర పాత్రల్లో కాబేరీ బోస్, సిమీ గరేవాల్ నటించారు. హరి ప్రియురాలిగా చిన్న పాత్రని నేటి ప్రముఖ దర్శకురాలు అపర్ణా సేన్ పోషించింది. సునిల్ గంగోపాధ్యాయ్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. సత్యజిత్ రాయ్ గురించి నేను చదివిన ఒక మాట నా మనసుకి హత్తుకుపోయింది. ఆయన గొప్ప మానవతావాది కావటం వల్ల అందరిలో ఉండే మంచిని గుర్తిస్తారు. కాబట్టి కర్కోటకులైన విలన్లు ఆయన సినిమాల్లో ఉండరు. ఈ చిత్రంలో కూడా చాలా పాత్రలు మంచి, చెడ్డ కలగలిసి ఉంటాయి. నిజజీవితంలో కూడా అంతే కదా. రాయ్ సినిమాల్లో ఫొటోగ్రఫీ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఈ చిత్రానికి సౌమేందు రాయ్ కెమెరామన్‌గా పనిచేశారు. చక్కని లొకేషన్లలో షూటింగ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది.

ఈ క్రింద చిత్రంలో మిగతా కథ, ముగింపు ప్రస్తావించబడ్డాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు.

ఆరోజు రాత్రి మళ్ళీ సారాయి దుకాణానికి వెళతారు మిత్రులందరూ. డుల్లీ కనపడక హరి నిరశగా ఉంటాడు. శేఖర్ ఎక్కువ మందు తాగడు. మర్నాడు అపర్ణ వాళ్ళ బంగ్లాకి అల్పాహారానికి వెళ్లాలి కదా అంటాడు. ఎవరూ పట్టించుకోరు. తర్వాత వాళ్ళు తమ బంగ్లాకి నడిచి వెళుతుంటే అపర్ణ, జయ కార్లో వస్తూ వీళ్ళని చూస్తారు. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగివస్తున్నారు. కార్లో వాళ్ళు ఉన్నారని మిత్రులకి తెలియదు. మిత్రులందరూ మద్యం మత్తులో ట్విస్ట్ నాట్యం చేస్తుంటారు. కారుని చూసి అడ్డుగా నిలబడి “మేం ఎవరో తెలుసా? వీఐపీలం” అంటాడు అసీమ్. అపర్ణ వాళ్ళని చూసి నవ్వుకుంటుంది. మర్నాడు మిత్రులందరూ ఆలస్యంగా నిద్రలేస్తారు. జయ వాళ్ళకి అప్పటికే టిఫిన్ పంపిస్తుంది. మిత్రులు తయారయి అపర్ణ వాళ్ళ బంగ్లాకి వెళతారు. మాటల్లో ఆ పరిసర ప్రాంతాల్లో జంతువులు తిరుగుతాయని అనుకుంటారు. అపర్ణ “జంతువుల భయం లేదు. మనుషులే తాగేసి అడ్డుపడుతూ ఉంటారు” అంటుంది. శేఖర్ “ఈ ఆదివాసీలింతే. నాటు సారాయి తాగుతారు. నాటు సారాయి మంచిది కాదు” అంటాడు. అపర్ణ జయను వంక చూసి నవ్వుతుంది. వీళ్ళు తాగితే పర్వాలేదు. అదే సారాయి ఆదివాసీలు తాగితే తప్పన్నమాట. అంటే తాము నాగరికులం కాబట్టి తాగినా సభ్యంగా ఉంటామని అపోహ. రాత్రి కార్లో అపర్ణ, జయ ఉన్నారని తెలిస్తే వారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? భోజనాలయ్యాక తాతామనవళ్ళు సర్కస్‌కి వెళతారని, అప్పుడు మిత్రులుండే బంగ్లాకి తామిద్దరమూ వస్తామని అంటుంది జయ.

ఫారెస్ట్ ఆఫీసర్ బంగ్లాకి వచ్చి అనుమతి లేనందున ఖాళీ చేయాలని మిత్రులకి చెబుతాడు. అసీమ్ “అంటే ఇంతకు ముందెవ్వరూ అనుమతి లేకుండా ఇక్కడ బస చేయలేదా?” అంటాడు. సగటు భారతీయుడి వాదన ఇలాగే ఉంటుంది. ‘నేనేనా చేసినది? ఎవరూ చేయలేదా?’, ‘నేనొక్కడినే రూల్సు పాటిస్తే ఏం లాభం?’ అంటాడు. అసీమ్, సంజయ్ అఫీసర్‌తో మాట్లాడుతుండగానే అపర్ణ, జయ వస్తారు. వారికి ఆఫీసర్ ముందే తెలుసు. అపర్ణ తండ్రి ఎలా ఉన్నారని అడుగుతాడు. అపర్ణ అసీమ్, సంజయ్ లను చూపించి “వీళ్ళు మా పాత స్నేహితులు. కోల్‌కతా నుంచి వచ్చారు” అని తేలిగ్గా అబద్ధం చెబుతుంది. ఇలాంటి ప్రమాదం లేని అబద్ధాలు (White lies) చెప్పటం భారతీయులందరికీ అలవాటే. పిల్లలకి “అబద్ధాలు చెబితే కళ్ళు పోతాయి” అని చెబుతారు (ఇప్పుడు చెబుతున్నారో లేదో మరి!) తాము మాత్రం చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. ఎవరైనా పిల్లవాడు “అబద్ధం చెప్పొద్దని అన్నావు కదా?” అంటే “ఈ తెలివికేం తక్కువ లేదు” అంటారు. మొత్తానికి ఆఫీసర్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మిత్రులు నలుగురూ, అపర్ణ, జయ చెట్ల కింద కూర్చుని సరదాగా ఒక ఆట ఆడతారు. అదొక మెమరీ గేమ్. ప్రముఖ వ్యక్తుల పేర్లు ఒకరి తర్వాత ఒకరు వరసగా చెప్పాలి. అప్పటి వరకూ అందరూ చెప్పిన పేర్లు గుర్తు పెట్టుకుని కొత్త పేరు జోడించి చెప్పాలి. ఏదైనా పేరు మర్చిపోయినా, తప్పు చెప్పినా ఓడిపోయినట్టు. కాసేపటికి అసీమ్, అపర్ణ మిగులుతారు. సంజయ్, జయ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చివరికి అపర్ణ ఓడిపోతుంది. జయ విస్తుపోతుంది. అంతకు ముందు అపర్ణ ఎప్పుడూ ఓడిపోలేదు మరి.

తర్వాత అందరూ కలిసి దగ్గర్లో జరుతున్న తిరునాళ్ళకి వెళతారు. రకరకాల వినోదాలు, దుకాణాలు ఉంటాయి. శేఖర్ జూదమాడటానికి వెళతాడు. సంజయ్, జయ దుకాణాల దగ్గర ఉంటారు. హరి డుల్లీని తీసుకుని అడవిలోకి వెళతాడు. అసీమ్ ఏదో మాట్లాడాలని అపర్ణతో దూరంగా వెళతాడు. “మీరు ఆటలో కావాలనే ఓడిపోయారు కదా? ఎందుకు?” అంటాడు అసీమ్. “మీరు ఓడిపోతే మీకు అవమానంగా ఉండేది కదా” అంటుందామె. రాత్రి రోడ్డు మీద అతన్ని చూశానని నవ్వుతుంది. “మీవి పిల్లచేష్టలు. బుకింగ్ లేకుండా బంగ్లాలో ఉండటమేమిటి?” అంటుంది. “కావాలంటే బుకింగ్ చేసేవాడిని. ఉద్యోగంలో రూల్సు పాటించాలని ఒత్తిడి ఉంటుంది. అవంటే చిరాకు” అంటాడతను. “తిరిగి వెళ్ళాక మళ్ళీ రూల్సు పాటించాలిగా” అంటుందామె. “లేకపోతే జీతం ఎక్కడ నుంచి వస్తుంది?” అంటాడతను. “మీకు జీతం గురించి భయమెందుకు? కాపలాదారు లంచం తీసుకున్నాడు కాబట్టి జీతం గురించి అతను భయపడాలి” అంటుందామె. “నేను తప్పు చేశానని ఎవరన్నా పరవాలేదు. మీరు అనకండి” అంటాడతను. ఆమెని ఇష్టపడ్డానని అంటాడు. “మీరు కోల్‌కతా లో పార్టీలకి వెళ్ళే స్త్రీలలా కాదు. అయినా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను” అంటాడు. ఆమె తన గతం గురించి చెబుతుంది. “అన్నయ్య నాకు బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండేవాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నా పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ ఇంట్లో ఒంటికి నిప్పు అంటుకుని మరణించింది. అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఒకసారి మంట చూసినపుడు భయంతో స్పృహ కోల్పోయాను. మీకు ఇలాంటి అనుభవాలేం లేవనుకుంటాను” అంటుంది. వ్యక్తులని చూసి మనం పొగరనో, మొండితనమనో అనుకుంటాం. వారి జీవితంలో ఏం జరిగిందో మనకి తెలియదు కదా. ఉద్యోగంలో ఒత్తిడికే అసీమ్ పెద్ద కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆమె కష్టంతో పోలిస్తే అతని కష్టమెంత? అసీమ్‌కి ఓడిపోవటం ఇష్టం లేదని ఆమె గ్రహించింది. అందుకే అతన్ని గెలిపించింది. తర్వాత ఫారెస్ట్ బంగ్లాకి వచ్చి అక్కడే ఉన్న కాపలాదారు ఇంటి దగ్గరకి వస్తారు. కిటికీలోంచి చూస్తే కాపలాదారు భార్య మంచంలో ఒళ్ళు తెలియకుండా ఉంటుంది. “ఆమె పరిస్థితి మీకు తెలియదా?” అంటుందామె. “చూచాయగా తెలుసు. మీ నాన్నకి ఫారెస్ట్ ఆఫీసర్ తెలుసు కదా?” అంటాడతను. అతని ఉద్దేశం కాపలాదారు ఉద్యోగం పోకూడదని. లంచం తీసుకున్నా అతన్ని వదిలేయమని సిఫార్సు చేస్తారన్నమాట. ఇలా అవినీతి జరుగుతూనే ఉంటుంది. చివరికి అపర్ణ మర్నాడే వెళ్ళిపోతున్నామని చెప్పి అసీమ్‌కి తన ఫోన్ నంబర్ ఇస్తుంది.

హరి డుల్లీని అడవిలోకి తీసుకెళ్ళి ఆమెని కేకలేస్తాడు. “నిన్న సారాయి దుకాణానికెందుకు రాలేదు? పనిమనిషిగా ఎందుకు వచ్చావు? నాతో ఉంటే కావల్సినంత డబ్బు ఇస్తాను” అంటాడు. ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. తర్వాత హరి ఆమెని ఆమె భర్త గురించి అడుగుతాడు. ఇక్కడే అతని స్వార్థం అర్థమవుతుంది. అతనికి ఆమె కావాలి. ఆమెకి పెళ్ళయిందా లేదా అనేది అతనికి అనవసరం. ఆమె తన భర్త పాము కాటు వల్ల చనిపోయాడని చెబుతుంది. ఆమె మాటని పూర్తిగా నమ్మలేం. తర్వాత అతను “తిరునాళ్ళకి రా. లేకపోతే కొడతాను” అని వెళ్ళిపోతాడు. పొదల్లో పొంచి ఉన్న లాఖా కర్రతో అతని మీద దాడి చేసి అతని పర్సు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను తనకి జరిగిన అవమానానికి కొట్టాడా? లేక డుల్లీని లొంగదీసుకున్నందుకు కొట్టాడా? రెండూ కారణాలే. నాగరికులు అటవీ సంపదని దోచుకోవటం లాంటిదే ఇది కూడా. ప్రకృతి ఎప్పటికైనా తిరగబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం కదా. శేఖర్ హరిని వెతుక్కుంటూ వచ్చి అతన్ని బంగ్లాకి తీసుకువెళతాడు.

సంజయ్, జయ కలిసి జయ బంగ్లాకి వెళతారు. జయ కాఫీ చేస్తుంది. తన నగలు పెట్టుకుని సంజయ్ దగ్గరకి వస్తుంది. ఆమెకి నగలు పెట్టుకునే అవకాశం లేదు. అప్పట్లో వితంతువులు నగలు పెట్టుకునేవారు కాదు. “నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలియదు” అంటుంది. సంజయ్‌కి ఆమెని అలా చూసి చిరుచెమటలు పోస్తాయి. “నాకు కూడా బెదురుగా ఉంది చూడు” అని ఆమె అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుంటుంది. తర్వాత ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అతను బయటి వెళ్ళిపోతాడు. ఆమెకి అతను నచ్చాడు. ఇప్పుడంటే కాలం మారింది కానీ అప్పట్లో పై తరగతి కుటుంబాల్లో వితంతు వివాహాలు జరిగేవి కాదు. ఆమెకి తోడు కావాలి. కానీ అది దాదాపు అసంభవం. సంజయ్‌కి కూడా ఆమె నచ్చింది. అయితే అతని తలిదండ్రులు ఒప్పుకోరని అతనికి తెలుసు. సమాజం ఇద్దరికీ అడ్డుగా నిలిచింది. అప్పట్లో ఇలాంటి కథలు ఎన్నో!

చివరికి మిత్రులు తిరుగుప్రయాణం అవుతారు. చిత్రం పేరుకి ‘అరణ్యంలో పగళ్ళూ రాత్రులూ’ అని అర్థం. సూక్ష్మంగా చూస్తే ‘అరణ్యంలో పగళ్ళే రాత్రులు’ అనే అర్థం కూడా వస్తుంది. దట్టమైన అరణ్యంలో పగలు కూడా చీకటిలా ఉంటుంది. చిత్రంలో ముఖ్యమైన సంఘటనలన్నీ రాత్రి మొదలవకముందే జరుగుతాయి. అక్రమ సంబంధాలతో సహా. ఒక్కోసారి పగళ్ళే చీకటిమయమవుతాయి. మన తప్పుల కారణంగా. రాత్రివేళ బాధలు మర్చిపోవటానికి మద్యం ఆసరా అవుతుంది. ఎవరి అనుభవాలు వారివి. హరి అందరికంటే స్వార్థపరుడిగా కనిపిస్తాడు. అతనికి తన చెప్పుచేతల్లో ఉండే స్త్రీ కావాలి. అలాంటి సంబంధం ఎప్పటికైనా తెగిపోతుంది. ప్రకృతిని దోచుకోవాలని చూస్తే మనిషికి మనుగడే ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here