[సంచిక పాఠకుల కోసం ‘అరైవల్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
[dropcap]గ్ర[/dropcap]హాంతరవాసుల గురించి హాలీవుడ్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. వాటిలో చాలా కథల్లో వారు భూమి మీదకి వచ్చి మానవులతో సుహృద్భావ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి ప్రయత్నించటమో లేక భూమిని ఆక్రమించటానికి ప్రయత్నించటమో చేస్తారు. ఒక ఫ్రాంచైజ్ (వరుస చిత్రాలు) లో మానవులు వేరే గ్రహానికి పరిశోధనకి వెళితే అక్కడి భయంకర ప్రాణులు మానవుల్ని చంపేస్తాయి. అది ‘ఏలియన్’ అనే ఫ్రాంచైజ్. మానవులు వేరే గ్రహాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించే ఫ్రాంచైజ్ కూడా ఉంది. అదేమిటో గుర్తొచ్చిందా? ‘అవతార్’. ఈ ఆలోచన వచ్చిన దర్శకుడు జేమ్స్ క్యామెరూన్‌ని మెచ్చుకోవాలి. ఎవరు ఆక్రమించటానికి ప్రయత్నించినా వారికి ఓటమి ఖాయం. సినిమాల్లోనే. ఆక్రమణ తప్పు అని సందేశం. మానవాళికి ఈ సందేశం ఎప్పటికి అర్థమౌతుందో? మనలో మనమే కొట్టుకు చస్తుంటే ఇక గ్రహంతరవాసుల వరకు ఎందుకు? 2016లో వచ్చిన ‘అరైవల్’ (ఆగమనం) మానవాళి కలిసికట్టుగా పనిచేయాలి అనే సందేశం ఇస్తుంది. అయితే ఇది లోతైన చిత్రం. అంతా విధిలిఖితం అనే సిధ్దాంతం కూడా ఉంటుంది ఈ చిత్రంలో. ఈ చిత్రాన్ని విశ్లేషించే సామర్థ్యం నాకుందా అనిపిస్తూంది. అయినా ప్రయత్నిస్తాను. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.
లూయీస్ స్వగతంలో తన కూతురితో మాట్లాడుతుండగా చిత్రం మొదలవుతుంది. “నువ్వు పుట్టినప్పుడే నీ కథ ఆరంభం అయిందని అనుకునేదాన్ని. జ్ఞాపకాలు వింతగా ఉంటాయి. ఒకప్పుడు జ్ఞాపకం అనే ప్రక్రియ ఇలా ఉంటుందని నాకో అభిప్రాయం ఉండేది. అది తప్పు. మనం కాలం ఒక ప్రవాహమని అనుకుని గతంతో ముడిపడి ఉంటాం” అని ఆమె స్వరం వినిపిస్తుండగా అమె కూతురు పసికందుగా ఉన్నప్పటి నుంచి టీనేజర్‌గా ఎదిగే దాకా జ్ఞాపకాలు తెర మీద కనిపిస్తాయి. పసికందుగా ఉన్నప్పుడు ఆమె కూతురు ఆమె ఒడిని విడిచి ఉండేది కాదు. కాస్త ఎదిగాక ఆమెతో ఆటలాడేది. టీనేజర్ అయ్యాక ఎదురుతిరిగే ధోరణి కనిపిస్తుంది. లూయీస్‌కి పెళ్ళయిన గుర్తుగా అమె చేతికి పెళ్ళి ఉంగరం ఉంటుంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ జ్ఞాపకాల్లో ఉండడు. కూతురికి క్యాన్సర్ వస్తుంది. లూయీస్ దుఃఖపడుతుంది. కొన్నాళ్ళకి కూతురు మరణిస్తుంది. “ఇది అంతం. కానీ ఇప్పుడు ఆది, అంతం అనేవి లేవేమో అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు ఆది, అంతంతో సంబంధం లేకుండా జీవితాన్ని నిలబెడతాయి. అలాంటి ఓ సంఘటనే వాళ్ళ ఆగమనం” అంటుంది స్వగతంలో లూయీస్.
లూయీస్ అమెరికాలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమె భాషాశాస్త్రంలో పీహెచ్.డీ చేసింది. ప్రపంచభాషల మీద ఎంతో పట్టు ఉంది. ప్రజ్ఞ ఉంటే మాత్రం జీవితం పూలబాట కాదుగా. ఆమె తన పనేదో తనది అన్నట్టు ఉంటుంది. ఒకరోజు పన్నెండు వ్యోమనౌకలు ఎక్కడి నుంచో వచ్చి పన్నెండు చోట్ల భూమికి కాస్త ఎగువన ఆగాయని వార్త గుప్పుమంటుంది. ఆమెరికా, బ్రిటన్, రష్యా, సుడాన్, చైనా, పాకిస్తాన్ లాంటి పన్నెండు చోట్ల ఈ వ్యోమనౌకలు ఉంటాయి. జనజీవనం ఆగిపోతుంది. అందరూ తిండి, నీరు తగినంత ఉండేలా చూసుకుని రోజులు లెక్కపెడుతూ ఉంటారు. “వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యోమనౌకలివి. కానీ శాంతియుతంగా వస్తే పన్నెండెందుకు? ఒకటి చాలదూ?” అని రేడియో వాళ్ళు, టీవీ వాళ్ళు భయాలను ఎగదోస్తూ ఉంటారు. క్లాసులు రద్దు చేయటంతో లూయీస్ ఇంటికొస్తుంది. ఆమె తల్లి ఫోన్లో ఆమెతో మాట్లాడుతుంది. లూయీస్ “నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు. నా గొంతులో ఆందోళన ఉందా? లేదు కదా. నా గురించి తెలుసు కదా. నేను బాగానే ఉన్నాను” అంటుంది.
రెండు రోజుల తర్వాత లూయీస్ యూనివర్సిటీకి వెళుతుంది. ఎవరూ ఉండరు. ఆమె తన ఆఫీసు గదిలో కూర్చుని ల్యాప్‌టాప్‌లో వ్యోమనౌకల గురించి వార్తలు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్మీ కల్నల్ వెబర్ వస్తాడు. “ఆ వ్యోమనౌకల గురించి మాట్లాడటానికే వచ్చాను. మీరు రెండేళ్ళ క్రితం చొరబాటుదార్లు వీడియోల్లో మాట్లాడిన ఫార్సీ భాష అనువాదంలో మాకు సాయం చేశారు. మీరు టాప్ అనువాదకుల్లో ఒకరు. గ్రహాంతరవాసులు మాట్లాడే భాష మీరు అనువదించాలి” అంటాడు. ఆమెని వ్యోమనౌక దగ్గరకి తీసుకువెళతాడు. ఇక్కడొక భాషా సంబంధమైన విశేషం చెప్పుకోవాలి. లూయీస్ తనకి పోటీగా ఉన్న భాషా శాస్త్రవేత్తకి ఒక పరీక్ష పెడుతుంది. వార్ అనే ఇంగ్లిష్ పదానికి ఉన్న సంస్కృత పదానికి అసలు అర్థం ఏమిటో చెప్పమంటుంది. వాడుకలో ఉన్న సంస్కృత పదం ‘యుద్ధం’. కానీ నేను గూగుల్ లో వెదికితే తెలిసింది ఏమిటంటే యుద్ధానికి మరో సంస్కృత పదం ‘గవిష్టి’. దాని వ్యుత్పత్తి చూస్తే గోవుల కోసం కాంక్ష అనే అర్థం వస్తుంది. అప్పట్లో ఆవులే సంపదగా ఉండేవి. ఆవులను సొంతం చేసుకుని సంపద పెంచుకోవటానికి చిన్న యుద్ధాలు జరిగేవి. విరాటపర్వంలో దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం తెలిసినవే కదా. అయితే గవిష్టి అంటే చిన్న యుద్ధమే. కురుక్షేత్రం లాంటి యుద్ధం కాదు. ఈ చిత్రంలో లూయీస్ ప్రతిభని చూపించటానికి గవిష్టి పదాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఆ పదాన్ని నేరుగా వాడరు. సంస్కృతంలో వార్ అంటే గోవుల కోసం కాంక్ష అని లూయీస్ అంటుంది. అసలు వార్‌కి సరైన పదం యుద్ధమే. ఇంకా సమరం, రణం, కదనం అనే పదాలు కూడా ఉన్నాయి. గవిష్టి అంత పాచుర్యంలో లేదు. ఈ సినిమా ఈ విషయంలో ప్రేక్షకుల్ని కాస్త తప్పుదోవ పట్టించింది. కానీ గవిష్టి అంటే యుద్ధం అనే అర్థం వచ్చిందంటే భాషపై సంస్కృతి ప్రభావం ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఇదే మాట లూయీస్ గ్రహాంతరవాసుల భాష గురించి తర్వాత అంటుంది.
వ్యోమనౌక దగ్గరకి వెళ్ళే ఆర్మీ హెలికాప్టర్లో లూయీస్‌కి ఇయన్ అనే భౌతిక శాస్త్రవేత్త పరిచయమవుతాడు. ఆమె ఒక పుస్తకంలో ‘భాష నాగరికతకి పునాది. వివాదం తలెత్తినపుడు వాడే మొదటి అస్త్రం భాష’ అని రాసిందని, అది తప్పని, నిజానికి నాగరికతకి మూలస్తంభం సైన్స్ అని అంటాడు. కల్నల్ వెబర్ “ఏలియన్స్ (గ్రహాంతరవాసులు)కి ఏం కావాలి? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది తెలుసుకోవాలి” అంటాడు. ఇయన్ “ఎలా వచ్చారు అనేది కూడా ముఖ్యమే. కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలరా?” అంటాడు. భౌతిక శాస్త్రవేత్త కదా. “ఈ విషయాలన్నీ వారితో చర్చించే ముందు వారితో మాట్లాడగలగాలిగా” అంటుంది లూయీస్. భాషే అర్థం కాకపోతే ఏం అడిగినా ప్రయోజనం ఉండదుగా. ముగ్గురూ మూడు రకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ అభినందించదగ్గ విషయం ఏమిటంటే అందరూ కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది ఒక దేశం సమస్య కాదు. మిగతా దేశాలతో కూడా కలిసి పనిచేయాలిగా.
లూయీస్, ఇయన్ వ్యోమనౌకకి కాస్త దూరంలో ఉన్న తాత్కాలిక ఆర్మీ క్యాంపులో దిగుతారు. అక్కడ అనేక గుడారాలు ఉంటాయి. కావలసిన సాంకేతిక సామగ్రి అంతా ఉంటుంది. ఇద్దరికీ వైద్య పరీక్షలు జరుగుతాయి. రకరకాల బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి టీకాలు ఇస్తారు. వ్యోమనౌకని షెల్ అని వ్యవహరిస్తారు ఆర్మీ వాళ్ళు. దానికి కారణం అది ఒక ఆల్చిప్పలా ఉంటుంది. నిటారుగా ఉంటుంది. 1500 మీటర్ల ఎత్తు ఉంటుంది. కింద ఒక ద్వారం ఉంటుంది. అందులో నుంచి పైకి వెళ్ళవచ్చు. లోపల అంతా ఖాళీగా ఉంటుంది. పైన ఒక పెద్ద గాజు కిటికీలా ఉంటుంది. పద్దెనిమిది గంటలకొకసారి ఇద్దరు ఏలియన్స్ వస్తారు. గాజు కిటికీ అవతలి నుంచి కనిపిస్తారు. ఆ సమయంలో లోపల గురుత్వాకర్షణ శక్తి పరివర్తనం చెందటంతో లోపలి గోడ మీద నడచుకుంటూ వెళ్ళవచ్చు. 112 నిమిషాల తర్వాత గురుత్వాకర్షణ మళ్ళీ మారిపోతుంది. అప్పుడిక షెల్ లోపల ఉండాలన్నా సాధ్యం కాదు. దీనికి కారణం ఏమిటంటే రెండు గంటల తర్వాత షెల్‌లో ప్రాణవాయువు తగ్గిపోతుంది. మళ్ళీ మానవులకి కావలసిన ప్రాణవాయువు షెల్‌లో నింపి తగిన వాతావరణం సృష్టించటానికి ఏలియన్స్‌కి పద్దెనిమిది గంటలు పడుతుందన్నమాట. వారి గ్రహం మీద వారికి అలవాటైన వాతావరణం మనకి సరిపడదు. అంటే ఏలియన్స్ మానవుల క్షేమం గురించి ఆలోచించి ఏర్పాట్లు చేశారు. కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ దీన్ని ఇంకోలా అర్థం చేసుకుంటాడు. “కావాలంటే ఏలియన్స్ మనకి ఊపిరాడకుండా చేయగలరన్నమాట” అంటాడు. కీడెంచి మేలెంచాలి కదా. ఎందుకైనా మంచిదని షెల్ లోకి వెళ్ళినపుడు పంజరంలో ఒక పిట్టని కూడా తీసుకువెళతారు. గాలి విషమయమైతే ముందుగా పిట్ట మీద ప్రభావం పడుతుంది. గాలిలో ఎలాంటి విషం లేదని త్వరలోనే తెలుస్తుంది. ఏలియన్స్ ఎక్కడి నుంచో మన గ్రహానికి వచ్చారంటే వారు సాంకేతికంగా మనకంటే అభివృధ్ధి చెందారని వేరే చెప్పాలా? ఏలియన్స్ పెద్ద ఆకారంలో ఉంటారు. ఏడు కాళ్ళు ఉంటాయి. గాజు కిటికీలో నుంచి కాళ్ళు మాత్రమే కనపడుతుంటాయి. అప్పటి దాకా ఆర్మీ ఆ ఏలియన్స్‌తో శబ్ద మాధ్యమంలో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించింది. ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. లూయీస్ భాషాశాస్త్రవేత్తగా ప్రపంచ భాషలను అధ్యయనం చేసింది. కానీ ఎవరికీ తెలియని భాషని ఎలా అర్థం చేసుకోవాలి? లూయీస్‌కి ఒక ఆలోచన వస్తుంది. శబ్దాల ద్వారానే కాక లిఖితరూపంలో గానీ దృశ్యరూపంలో గానీ వారి భావాలు పంచుకునే అవకాశం ఉంది కదా అంటుంది. ఒక పలక మీద ‘హ్యూమన్’ (మనిషి) అని రాసి ఏలియన్స్‌కి చూపిస్తుంది. ‘నేను మనిషిని’ అని సంజ్ఞ చేస్తుంది. ఏలియన్స్ ఒక కాలు ఎత్తి సిరా లాంటి పదార్థాన్ని చల్లి గాజు కిటికీ మీద కొన్ని ఆకారాలు చిత్రిస్తారు. ఆ ఆకారాలు స్థూలంగా వృత్తాకారంలో ఉంటాయి కానీ అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో ఆకారం ఒక్కో వాక్యం. వారు ఆ ఆకారాలు చిత్రించటం అదే మొదటిసారి. లూయీస్, ఇయన్ ఈ పరిణామంతో ఆనందంగా ఉంటారు కానీ కల్నల్ మాత్రం “ఇలా అయితే ఎప్పటికి వారి ఉద్దేశం తెలుస్తుంది?” అంటాడు. లూయీస్ “ఇదే వేగమైన పద్ధతి” అంటుంది. “సరే. మీరు తర్వాతి సెషన్లో ఏ పదాలు పరిచయం చేస్తారో నాకు ముందే చెప్పాలి” అంటాడు కల్నల్.
తర్వాతి సెషన్‌కి బయల్దేరే ముందు లూయీస్ తన పేరు, ఇయన్ పేరు, Eat, Walk అనే క్రియాపదాలు వారికి పరిచయం చేస్తానని కల్నల్‌కి చెబుతుంది. తర్వాత సర్వనామాలు (pronouns) పరిచయం చేస్తానంటుంది. కల్నల్‌కి ఇది చిన్నపిల్లల సిలబస్‌లా అనిపిస్తుంది. ఇది సాధారణంగా వయోజనులు కొత్త భాష నేర్చుకునేటపుడు ఎదురయే ప్రశ్న. చిన్నపిల్లలైతే కొత్త భాష ఇట్టే నేర్చుకుంటారు. వయోజనులు అలా కాదు. ఒక వయసు దాటాక మెదడు ఒకరకమైన జడత్వం సంతరించుకుంటుంది. పైగా వంద వ్యాపకాలు. కొత్త భాష నేర్చుకోవటానికి సమయం పడుతుంది. నేను ఒక కంపెనీలో భాషా శిక్షణ విభాగంలో పని చేశాను. “రెండు నెలల్లో మా వాళ్ళకి ఫలానా భాష (స్పానిష్, జర్మన్ తదితర భాషల్లో ఒకటి) కరతలామలకమైపోవాలి” అని ప్రాజెక్ట్ మేనేజర్లు అనేవారు. అలా కుదరదు. నూటికి ఒక్కరు వారి ఆసక్తిని బట్టి తొందరగా నేర్చుకోగలరు. అందరికీ సాధ్యం కాదు. నేర్పేటప్పుడు అందరికీ ఓనమాల దగ్గర నుంచి నేర్పించాలి. “కస్టమర్లతో వారి భాషలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. మీరు Eat, Walk లాంటివి నేర్పిస్తూ కూర్చుంటే ఎలా?” అనేవారు. ముందు సులభమైన క్రియాపదాలు, వాటి వివిధ రూపాలు నేర్పిస్తేనే భాష మీద పట్టు వస్తుంది. ఈ బాధలన్నీ పడ్డవాణ్ని కాబట్టి లూయీస్ పద్ధతి చూసి ఒకరకమైన విజయానందం కలిగింది నాకు. ఇలా భాషాశాస్త్రం గురించి చెప్పుకుంటూ పోతే కథ తెమలదు. మొత్తానికి లూయీస్ కల్నల్‌ని ఒప్పిస్తుంది. లూయీస్, ఇయన్ తమ పేర్లు రాసి ఏలియన్స్‌కి చూపిస్తారు. ‘ఇవి మా పేర్లు’ అన్నట్టు సంజ్ఞలు చేస్తారు. అవి చూసి ఏలియన్స్ ఇద్దరూ చెరో ఆకారం చిత్రిస్తారు. “అవి వారి పేర్లు అనుకుంటా” అంటుంది లూయీస్. ఏలియన్స్‌తో ఇలా కమ్యూనికేట్ చేయగలగటం ఆమెకి ఆనందంగా ఉంటుంది. సెషన్ పూర్తయిన తర్వాత లూయీస్‌ని హఠాత్తుగా ఒక శూన్యభావం ఆవహిస్తుంది. ఆమె కూతురు జ్ఞాపకం వస్తుంది. డాక్టర్ “ఎలా ఉన్నారు?” అని అడిగితే “పని భారం ఎక్కువగా ఉంది” అంటుందంతే. ఏలియన్స్ చిత్రించిన ఆకారాలను విశ్లేషించి వారి భాషని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరో పక్క ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏలియన్స్ ఏమి చేస్తారో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.
కొన్నిరోజులు గడిచిపోతాయి. ఏలియన్స్‌కి భాష నేర్పిస్తూ వారు చిత్రించే ఆకారాలు సేకరిస్తూ ఉంటారు. ఒక విషయం వారికి అర్థమవుతుంది. వారు చిత్రించే ఆకారాలకి, వారు చేసే శబ్దాలకి సంబంధం ఉండదు. ఆ ఆకారాలు ఒక భావాన్ని తెలుపుతాయి తప్ప వాటిని శబ్దరూపం లోకి మార్చటం కుదరదు. ఇది ఏ ప్రపంచ భాషలోనూ లేని వినూత్న లక్షణం. ఒకరోజు లూయీస్, ఇయన్ ఏకాంతంగా క్యాంపుకి దూరంగా కూర్చుని మాట్లాడుకుంటారు. ఇయన్ “మీరు కమ్యూనికేషన్లో ఉండే లోటుపాట్లని తప్పించుకుంటూ ఏలియన్ల భాషని, భావాలని అర్థం చేసుకోవటం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నాకీ లోటుపాట్లు తెలియకే ఇలా ఒంటరిగా ఉండిపోయానేమో” అంటాడు. “ఇవన్నీ తెలిసినంతమాత్రాన ఒంటరిగా మిగలరని నమ్మకమేం లేదు” అంటుందామె. ఆమె తన ఒంటరితనం గురించి మాట్లాడుతోంది. ఆమె భర్త ఏమయ్యాడు? మనుషుల మనస్తత్వాలు భాషకి అతీతమైనవి. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అని ఊరికే అనలేదు. ఆడవాళ్ళందరూ నా మీద కత్తులు దూయకండి. మగవాళ్ళకి దాపరికాలు ఎక్కువ. ఇవన్నీ ఉంటే భాష ఒకటే అయినా మనుషుల మధ్య అగాధాలు తప్పవు. ఆ అగాధాలు దాటలేనంత పెరిగితే ఇక ఎవరి దారి వారిదే. త్రికరణశుద్ధి (ఆలోచన, మాట, చేత ఒకటే అవటం) మనుషులకి చాలా కష్టం. మరి ఏలియన్స్ సంగతి ఏమిటి? లూయీస్‌కి కూతురి గురించి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. కూతురికి ఆరేళ్ళ వయసులో భర్త ఆమెని వదిలి వెళ్ళిపోయాడని మనకి తెలుస్తుంది. కానీ అతనికి కూతురంటే ప్రేమ ఉందని లూయీస్ కూతురితో అంటుంది. ఈ జ్ఞాపకం వచ్చినపుడు ఆమె ముఖం పాలిపోతుంది. తూలి కుర్చీలో కూర్చుండిపోతుంది. ఇయన్ ఏమైందని అడుగుతాడు. “ఎలా చెప్పాలో తెలియటం లేదు” అంటుందామె. కల్నల్‌కి ఆమెకి షెల్‌లో ఏమైనా రేడియేషన్ సోకిందోమోనని అనుమానం. డాక్టర్ అలాంటిదేం లేదని అంటాడు.
ఒకరోజు చైనా వాళ్ళ సమాచారం గూఢచర్యం ద్వారా తెలుస్తుంది. వారు ఏలియన్స్‌తో మాహ్-జాంగ్ అనే ఆట ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారని తెలుస్తుంది. కమ్యూనికేషన్ ఒక ఆటగా మారితే గెలుపు ఓటములు ఉంటాయి. చైనా వాళ్ళకి వాళ్ళు ఓడిపోతున్నారనే భావం కలుగుతుంది. సైన్యాన్ని సమాయత్తం చేస్తారు. రష్యా కూడా అదే పని చేస్తుంది. కల్నల్ లూయీస్‌ని “ఏలియన్స్ ఉద్దేశం తెలుసుకోవాలి” అంటాడు. లూయీస్ తర్వాతి సెషన్లో ఏలియన్స్ భాష ఉపయోగించి తెలిసినంతలోనే ‘భూమిపై మీ కార్యం ఏమిటి?’ అనే ఆకారాన్ని కంప్యూటర్ సాయంతో చిత్రించి చూపిస్తుంది. వారు సమాధానంగా ఒక ఆకారాన్ని చిత్రిస్తారు. దాని అర్థం ‘అస్త్రం ఇవ్వాలి’! అది చూసి ఆర్మీ వాళ్ళు కంగారుపడతారు. వెంటనే అస్త్రప్రయోగం చేయాలని అనుకుంటారు. గుడారానికి తిరిగి వచ్చాక ఇయన్ “అదొక అభ్యర్థన కావచ్చు” అంటాడు. అంటే ‘మాకు అస్త్రం ఇవ్వండి’ అంటున్నారేమో అని. ఆర్మీ కెప్టెన్ ఒకరు ‘అది హెచ్చరిక కూడా అయ్యుండొచ్చుగా’ అంటాడు. కల్నల్ లూయీస్ అభిప్రాయం అడుగుతాడు. “వారికి మన భాష పూర్తిగా తెలియదు. అస్త్రానికి, సాధనానికి తేడా వారికి తెలియకపోవచ్చు” అంటుందామె. ఆర్మీ ఆఫీసరు “వాళ్లు మనలో మనకే తగవులు పెట్టి ఒక్క తెగ మాత్రమే మిగిలేలా చేయాలనుకుంటున్నారని అనిపిస్తోంది. అప్పుడు ఒక్క నాయకుడితో మాట్లాడితే సరిపోతుంది కదా. ఇన్నిరకాల తెగలతో మాట్లాడే అవసరం ఉండదు” అంటాడు. ఏలియన్స్ గురించి కల్పిత కథలు చెప్పినపుడు వారికి ఒకే నాయకుడు ఉన్నాడనే చెబుతారు. ఇది సాధ్యమేనా? అలా ఉంటే అదేదో అద్భుత లోకమే అయి ఉంటుంది. ఏలియన్స్ ఉండే గ్రహంలో కూడా వివిధ దేశాలు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన అంశం. ఇయన్ బయటికి వచ్చి ఆరోజు సెషన్లో 112 నిమిషాలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ షెల్ లోకి వెళదామంటాడు. లూయీస్ ఒప్పుకుంటుంది. మళ్ళీ వెళ్ళి ఏలియన్స్‌ని ‘అస్త్రం ఇవ్వాలి’ అనే మాటకి అర్థం ఏమిటని అడుగుతారు. అనేక ఆకారాలతో సంక్లిష్టమైన సందేశం చిత్రిస్తారు ఏలియన్స్. ఇంకా ఐదు సెకన్ల సమయం ఉండగానే గురుత్వాకర్షణ శక్తిని మార్చేస్తారు ఏలియన్లు. లూయీస్, ఇయన్ కిందకి పడిపోతారు. అదే సమయంలో గాజు కిటికీ దగ్గర ఒక బాంబు పేలుతుంది. అయితే లూయీస్, ఇయన్ ఏ ప్రమాదం లేకుండా బయటపడతారు. కొందరు సైనికులు ఆదేశాలు లేకుండానే షెల్ లో బాంబు పెట్టారని లూయీస్ కి తెలుస్తుంది. ఏలియన్స్ తనని, ఇయన్‌ని బాంబును గురించి హెచ్చరించటానికి ప్రయత్నించి వేరే దారి లేక తమని బయటకి తోసేశారని ఆమెకి అర్థమవుతుంది. ఇదంతా పైపైన కనిపించే కథ. చివరికి ఏలియన్స్ భాషలోని రహస్యం తెలిసి ఆశ్చర్యపోవాల్సిందే. వారి భాష వృత్తాకారంలో ఉండటం లోనే ఉంది కీలకం.
టెడ్ చియాంగ్ రాసిన ‘స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్’ అనే కథ ఆధారంగా ఎరిక్ హైసరర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. డెనీ విల్నవ్ దర్శకత్వం వహించాడు. దరిమిలా ‘డ్యూన్’ చిత్రానికి దర్శకత్వం వహించి ప్రపంచ ఖ్యాతి ఆర్జించాడు. లూయీస్‌గా ఏమీ ఆడమ్స్, ఇయన్‌గా జెరెమీ రెనర్, కల్నల్‌గా ఫారెస్ట్ విటేకర్ నటించారు. ఏమీ ఆడమ్స్‌కి ఈ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ రాకపోవటం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేషన్లు వచ్చాయి. ఫొటోగ్రఫీకి కూడా నామినేషన్ వచ్చింది. మొదటిసారి షెల్ ని చూపించినపుడు ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. హెలికాప్టర్ నుంచి లూయీస్ చూస్తూ ఉంటుంది. షెల్ దగ్గరకి వెళ్ళే హైవే మూసివేసి ఉంటుంది. అక్కడ వందలాది జనం పోగై ఉంటారు. కాస్త దూరం వెళ్ళగానే షెల్ కనపడుతుంది. ఆకాశాన్ని అంటుతుందా అన్నట్టు ఉంటుంది. మబ్బులని తాకుతూ ఉంటుంది. షెల్ నుంచి చూపు మరల్చుకుని చూస్తే ఆర్మీ క్యాంపు కనపడుతుంది. అక్కడ వేరే హెలికాప్టర్లు ఎగురుతూ ఉంటాయి. ఈ ఒక్క సన్నివేశంలో ఏలియన్స్ ఆగమనం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేది చెప్పేశారు. పెద్ద స్క్రీన్ టీవీలో చూస్తే ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
బాంబు పేలిన తర్వాత షెల్ పైకి ఎగిరి దూరంగా నిలుస్తుంది. అంటే ఇక సెషన్స్ జరిగే అవకాశం లేదు. మరో పక్క చైనా, రష్యా, సుడాన్, పాకిస్తాన్ దాడి చేయాలని నిర్ణయించుకుంటాయి. చైనా జనరల్ ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళకపోతే షెల్ ని ధ్వంసం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తాడు. ఇంతలో ఇయన్ ఒక విషయం కనుక్కుంటాడు. చివరి సందేశంలో ఉన్న నెగటివ్ స్పేస్‌ని చూస్తే ఆ సందేశం పన్నెండో వంతు మాత్రమే అని తెలుస్తుంది. అంటే ఇంకా పదకొండు సందేశాలు మిగతా పదకొండు షెల్‌లు ఆయా దేశాలకు ఇచ్చాయన్నమాట. అవన్నీ కలిపి చూస్తే విషయం అర్థమవుతుంది. అయితే ఆర్మీ ఈ మాట వినే పరిస్థితిలో లేదు. వారికి రష్యాకి అందిన సందేశం గూఢచర్యం ద్వారా తెలుస్తుంది. ఆ సందేశం “సమయం లేదు. పలువురు ఒకరు కావాలి” అని. పలువురు ఒకటి కావాలి అంటే అందరూ సంఘటితం కావాలి అనే అర్థమూ వస్తుంది, మీలో ఒక్కరే మిగలాలి అనే అర్థమూ వస్తుంది. కానీ ‘సమయం లేదు’ అంటే అర్థం ఏమిటి? ఇందులోనే ఉంది రహస్యం. లూయీస్ మాట ఎవరూ వినరు. ఆమెకి హఠాత్తుగా ఒక ల్యాండర్ లాంటి వాహనం ఆకాశం నుంచి కిందకి దిగుతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. ఆమె బయటకి వెళ్ళి షెల్ వైపు నడుస్తుంది. షెల్‌లో నుంచి ఒక ల్యాండర్ బయటకి వస్తుంది. ఆమెకి ముందే ఎలా తెలిసింది? ఆమెకి భవిష్యత్తు కనపడటం ప్రారంభమయింది. మన ఋషులకి తపస్సు చేస్తే త్రికాలజ్ఞానం కలిగేది. అదే ఇప్పుడు లూయీస్‌కి కలిగింది. ‘సమయం లేదు’ అంటే మనం అనుకున్నట్టు సమయం గతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడు భాగాలుగా విభజించి లేదు అని అర్థం. వర్తమానం మాత్రమే ఉంది. అంతా ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పుడో జరిగిపోయింది. వర్తమానంలో మనకి కొంచెం కొంచెం అనుభూతికి వస్తుంది అంతే. ఈ త్రికాలజ్ఞానం లూయీస్‌కి ఎలా కలిగింది? ఏలియన్స్ భాష వల్ల. ఆ భాషే వాళ్ళు ఇచ్చిన అస్త్రం. ఆ భాష నేర్చుకోవటం వల్ల ఆమె మెదడు పరివర్తన చెందింది. భాషకి ఆ శక్తి ఉంది. ఒక కొత్త భాష నేర్చుకుంటే మెదడు కొత్తగా ఆలోచించటం మొదలు పెడుతుంది. ఏలియన్స్ భాషతో సమయం ఒక చక్రమని, అది సరళ రేఖ కాదనే అవగాహన లూయీస్‌కి కలిగింది. కాలం ఒక చక్రం అయినట్టే ఏలియన్స్ భాష కూడా వృత్తాకారంలో ఉంటుంది. ఋషులకి తపస్సు ద్వారా కలిగిన జ్ఞానం ఏలియన్స్ భాష ద్వారా లూయీస్‌కి కలిగింది. అలాంటి భాషని వాళ్ళు అభివృధ్ధి చేశారన్నమాట. ఇదేం వింత కాదు. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనం ఒకప్పుడు ఋషులకు మాత్రమే సాధ్యమనుకున్న పనులు చేస్తున్నాంగా?
లూయీస్ ల్యాండర్ లోపలికి వెళుతుంది. ఒక వాయువు ఆమెని పైకి తీసుకెళుతుంది. తలుపు తెరుచుకునే సరికి ఒక విశాల ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక ఏలియన్ ఉంటాడు. ఏడు కాళ్ళకి పైన భారీ ఆకారం ఉంటుంది. రెండో ఏలియన్ ఎక్కడున్నాడని లూయీస్ అడుగుతుంది. సిరాతో రాసి “అతను మరణం దారిలో ఉన్నాడు” అంటాడు ఏలియన్. అంటే బాంబు పేలుడు అతను మరణించాడు. లూయీస్ క్షమాపణ చెబుతుంది. ఇతర ప్రదేశాలలో ఉన్న షెల్స్‌కి సందేశం పంపి దాడి ఆపమని లూయీస్ కోరుతుంది. “లూయీస్ దగ్గర అస్త్రం ఉంది. అది ఉపయోగించాలి” అని రాస్తాడు ఏలియన్. లూయీస్‌కి ఇంకా తనకి భవిష్యత్తు కనపడుతుందని తెలియదు. ఏవో కొన్ని అనుభూతులు కలుగుతున్నాయని అనుకుంటుంది. “నాకు అర్థం కావటం లేదు. మీరసలు భూమి మీదకి ఎందుకు వచ్చారు?” అంటుంది. “మానవాళికి సాయం చేయటానికి. మూడు వేళ ఏళ్ళ తర్వాత మీ సాయం మాకు అవసరం” అని రాస్తాడు ఏలియన్. “మీకు భవిష్యత్తు ఎలా తెలిసింది?” అంటుంది లూయీస్. “అస్త్రం సమయాన్ని తేటతెల్లం చేస్తుంది. లూయీస్ భవిష్యత్తు చూడగలదు” అని రాస్తాడు ఏలియన్. మానవాళి తమ విభేదాలు వదిలి కలిసి పని చేస్తే వారికి మనుగడ ఉంటుంది. వారిని సంఘటితం చేయటానికే పన్నెండు చోట్ల షెల్స్ దిగాయి. సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పటానికి ప్రయత్నించాయి. దాన్ని చైనా, రష్యా అర్థం చేసుకోలేదు. సంఘటితమైతే మూడు వేళ ఏళ్ళ తర్వాత ఏలియన్ జాతికి ప్రమాదం వచ్చినపుడు మానవాళి వారికి సాయం చేయగలిగే స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏలియన్స్ రాకపోతే యుద్ధాలు వచ్చి మానవాళి ప్రమాదంలో పడేది కదా, వారి రాకతో భవిష్యత్తు మారిపోయిందా, అదెలా సాధ్యం? భవిష్యత్తు మారదు అనేదే ఏలియన్స్ సిద్ధాంతం కదా? భవిష్యత్తు మారలేదు. మానవాళి సంఘటితం కావటమే భవిష్యత్తు. దానికి ఏలియన్స్ నిమిత్తమాత్రంగా సాయం చేశారంతే! ఏలియన్స్ ఏ పరిణామానికీ ఉద్వేగపడరు. జరగాలి కాబట్టి జరిగింది అనుకుంటారు. రెండో ఏలియన్ మరణిస్తే మరణం దారిలో ఉన్నాడు అని వర్తమానంలో చెబుతాడు కానీ “మరణించాడు” అని భూతకాలం వాడడు. వారికి భూతకాలం అనేది లేదుగా. అంతా వర్తమానమే.
లూయీస్ ఏలియన్‌తో మాట్లాడుతుండగా మనకి ఆశ్చర్యం కలిగించే పరిణామం ఒకటి జరుగుతుంది. లూయీస్‌కి ఆమె కూతురు ఆడుకుంటున్న జ్ఞాపకాలు వస్తాయి. ఆమె “నాకేం అర్థం కావటం లేదు. ఈ పాప ఎవరు?” అంటుంది! అంటే ఆమెకి ఏలియన్స్ భాష నేర్చుకుంటున్న సమయంలో వచ్చినవన్నీ జ్ఞాపకాలు కాదు, భవిష్యద్దర్శనాలు. ఆమెకి అవి అర్థం కాక అయోమయంగా ఉండేది. ఆమె కూతురు మరణించటం భవిష్యత్తులో జరిగే సంఘటన. ఆ సంఘటనలను మనకు ముందే చూపించాడు దర్శకుడు. అది లూయీస్ గతమని మనం అనుకున్నాం. కానీ అది భవిష్యత్తు. అలా ఎందుకు మమ్మల్ని తప్పుదారి పట్టించారు అంటే దర్శకుడు ‘భవిష్యత్తు అనేది లేదు. అంతా వర్తమానమే. అదే కదా మొత్తుకునేది’ అంటాడేమో! ఇంకో విషయం – లూయీస్ కి కూతురు పుట్టి పెరిగే సరికి కనీసం పదమూడేళ్ళు గడవాలి కదా? మరి లూయీస్ ముఖంలో వయసు పెరిగిన ఛాయలు కనిపించలేదేం? నిజానికి భవిష్యత్తులో కంటే ఏలియన్స్ వచ్చినపుడే ఆమె వయసు భారంతో ఉన్నట్టు ఉంటుంది. నాకు తోచిన సమాధానం ఏమిటంటే ఆమె ఎవరినో ప్రేమించి విఫలమయింది. దానితో నిర్వేదం వచ్చింది. ఆమె తల్లితో మాట్లాడినపుడు “నా గురించి తెలుసు కదా” అంటుంది. అంటే బాధని దిగమింగే స్వాభావం వచ్చింది. ఇయన్‌తో ఆమె “భావాలు అర్థం చేసుకోవటం తెలిసినంత మాత్రాన ఒంటరిగా మిగలరని నమ్మకమేం లేదు” అంది. ఆమె ప్రేమలో విఫలమయిందనటానికి ఇదో సూచన. ఏలియన్స్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుని కూతుర్ని కన్నది. జీవితం సంతోషంగా ఉండటంతో ఆమె ముఖంలో కళ తిరిగివచ్చింది. సంతోషమే సగం బలం కదా. అందుకే ఆమె కూతురు చనిపోయేటప్పటికి ఆమె వయసు పెరిగినట్టు అనిపించదు. పైగా ఆమెకి ఏం జరిగినా విధిలిఖితం అనే జ్ఞానం కూడా కలిగింది. కాబట్టి ఎప్పుడూ శాంతంగానే ఉండటం అలవాటయింది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
ఏలియన్స్‌తో మాట్లాడొద్దని కల్నల్‌కి పై నుంచి ఆదేశాలు వస్తాయి. చైనాలా దాడి చేయాలని అమెరికా ఉద్దేశం కాదు. క్యాంపు ఖాళీ చేయాలని మాత్రమే వారు నిర్ణయించుకుంటారు. లూయీస్ తను కనుగొన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె చెప్పే మాటలు వినటానికి ఎవరూ సిద్ధంగా లేరు. లూయీస్‌కి మళ్ళీ భవిష్యద్దర్శనం కలుగుతుంది. ఆమె కూతురు ఆమెని తన తండ్రి తనతో ఎప్పటిలా ఎందుకు ఉండటం లేదని అడుగుతుంది. లూయీస్ “నేను మీ నాన్నకి ఒక విషయం చెప్పాను. అది భవిష్యత్తులో జరగబోయే విషయం. అది విని మీ నాన్నకి చాలా కోపం వచ్చింది. నేను తప్పు చేశానని అన్నాడు. ఆ విషయం ఒక ప్రాణాంతక వ్యాధికి సంబంధించినది” అంటుంది. అంటే ఆమె భర్తకి కూతురు చనిపోతుందని చెప్పింది. అతను తట్టుకోలేకపోయాడు. భవిష్యత్తు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ తెలుసుకుని తట్టుకునే గుండెధైర్యం ఎందరికి ఉంటుంది? లూయీస్ కూతురు చనిపోతుందని తెలిసి కూడా కూతుర్ని కన్నది. తప్పించాలని ప్రయత్నిస్తే ఆ జీవితం వేరేలా ఉండేదేమో. కానీ ఆమె విధిలిఖితాన్ని ఆమోదించింది. స్వార్థంతో తప్పించాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించటం కష్టం. యోగులు మాత్రమే లూయీస్ లా నిస్వార్థంగా ఉండగలరు. ఆమె భర్త ఆమెని అర్థం చేసుకోలేదు. విడిపోయాడు.
లూయీస్ ఏలియన్స్ భాష తెలిస్తే భవిష్యత్తు తెలుస్తుందని కల్నల్‌కి చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అతను పట్టించుకోడు. లూయీస్‌కి ఇంకో భవిష్యద్దర్శనం కలుగుతుంది. అందులో ఐక్యరాజ్యసమితి వేడుక జరుగుతూ ఉంటుంది. అన్ని దేశాలు సుహృద్భావంతో ఉంటాయి. లూయీస్ ఆ వేడుకలో ప్రత్యేక అతిథి. చైనా జనరల్ ఆమె దగ్గరకి వస్తాడు. “మిమ్మల్ని కలుసుకోవటం ఎంతో అనందంగా ఉంది. మీరు ఆరోజు నా ప్రైవేట్ నంబర్‌కి ఫోన్ చేయబట్టి దేశాలన్నీ సంఘటితం అయ్యాయి” అంటాడు. “నాకు మీ ప్రైవేట్ నంబర్ తెలియదే” అంటుంది లూయీస్. జనరల్ తన ఫోన్లో తన నంబర్ ఆమెకి చూపిస్తాడు. “ఇప్పుడు నా నంబర్ మీకు తెలుసింది కదా. మీ మేధస్సు అద్భుతమైనది. అది నాకు అర్థం కాదు. కానీ నా నంబర్ మీకు చూపించటం అవసరమని నాకనిపించింది” అంటాడు. వర్తమానంలో లూయీస్‌కి ఆ నంబర్ తన మేధలో మెదులుతుంది. ఆమె ఒక శాటిలైట్ ఫోన్ తీసుకుని చైనా జనరల్‌కి ఫోన్ చేస్తుంది. కమ్యూనికేషన్ నిఘాలో ఆ విషయం తెలిసి ఆర్మీ ఆమెని ఆపటానికి ప్రయత్నిస్తుంది. ఇయన్ ఆమెకి రక్షణగా ఉంటాడు. ఆమె జనరల్‌కి అతని తల్లి చనిపోయినపుడు మాట్లాడిన మాటలు మళ్ళీ చెబుతుంది. ఆమె గతాన్ని కూడా చూడగలదు కాబట్టి ఇది సాధ్యమయింది. దానితో అతనికి ఆమెపై నమ్మకం కుదురుతుంది. ఆమె దాడి ఆపమని అంటుంది. జనరల్ దాడి ఆపేస్తాడు. తర్వాత అన్ని దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటాయి. ఏలియన్స్ షెల్స్ అన్నీ వెళ్ళిపోతాయి.
లూయీస్ స్వగతంలో తన కూతురితో మాట్లాడుతుంది. “ఏలియన్స్ వెళ్ళిపోయిన రోజు నీ కథ మొదలయింది. నేను అన్నిటినీ సమదృష్టితో చూడటం నేర్చుకున్నాను” అంటుంది. అసలు జరిగిందేమిటంటే ఆరోజే ఇయన్ ఆమెని ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఆమె అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. పిల్లలు కావాలని అతనే అంటాడు. వారికి కూతురు పుడుతుంది. కానీ ఆమె కూతురు చనిపోతుందని చెబితే అతను తట్టుకోలేకపోయాడు. అతనికి పరిణతి లేదా? లూయీస్ భవిష్యత్తుని ఉన్నదున్నట్టు సాక్షిగా చూడటం మంచిదని అనుకుంది. అతను అలా అనుకోలేదు. అంటే ముందే తెలిస్తే ఆమెని వదిలేసేవాడా? అంటే ఆమె మీద ప్రేమ షరతులతో కూడినదా? ఒకవేళ ఆమెతో ఉండి పిల్లల్ని కనకుండా ఉండాలని నిర్ణయించుకునేవాడా? అది ఆత్మవంచన చేసుకోవటం కాదా? మనకి కావలసినట్టు జీవించాలి గానీ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటే అదీ ఒక జీవితమేనా? హిందూ తత్వశాస్త్రంలో ఇదే విషయం ఉంటుంది. ‘నీ పని నువ్వు చెయ్యి. జీవితాన్ని ఆస్వాదించు. జీవితం ఇలాగే ఉండాలని ఆశించకు. ఏ పరిణామం వచ్చినా అది అనివార్యమని ఆమోదించి సాగిపో’ అంటాయి ఉపనిషత్తులు. అందరూ ఈ దృక్పథం అలవాటు చేసుకోవాలి. జీవితంలో సుఖాలూ ఉంటాయి, దుఃఖాలూ ఉంటాయి. కూతురు చనిపోతుందని తెలిసినా లూయీస్ కూతురితో గడిపే ఆనందమయ క్షణాలు కూడా ఉంటాయి కదా, వాటినెందుకు వదులుకోవాలి అనుకుంది. సుఖాలని ఆస్వాదించాలి. అలాగే దుఃఖాలని కూడా తట్టుకోవాలి. అదే జీవితం.