మరుగునపడ్డ మాణిక్యాలు – 63: హవర్డ్స్ ఎండ్

2
12

[సంచిక పాఠకుల కోసం ‘హవర్డ్స్ ఎండ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]స్కూ[/dropcap]లు చరిత్ర పుస్తకాల్లో అంతా పైపై సమాచారమే ఉంటుంది. దేశవిభజన సమయంలో జరిగిన హృదయవిదారక ఘట్టాలు ఉండవు. పిల్లలకు అది అవసరమూ లేదు. కానీ పెద్దయ్యాక అసలు విషయాలు ఎలా తెలియాలి? కళ ద్వారానే తెలియాలి. నేను ఇటీవలి దాకా విన్‌స్టన్ చర్చిల్ అంటే ఒకప్పటి గొప్ప బ్రిటన్ ప్రధాని అనుకున్నాను. కానీ అతను భారతదేశాన్ని, భారతీయుల్ని ద్వేషించేవాడని తర్వాత తెలిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఆలస్యం కావటంలో అతని పాత్ర చాలా ఉంది. అందుకని బ్రిటిష్ వారినందరినీ మనం ద్వేషించనక్కరలేదు. అమెరికా ప్రపంచానికి పెద్దన్నలా ప్రవర్తిస్తుంటే ఆ దేశం వారందరూ ఆధిక్యభావంతో ఉన్నారని అర్థం కాదు. వారి సమస్యలు వారికుంటాయి. అమెరికాకి బోలెడు అప్పు ఉందని ఈమధ్యనే తెలిసి ఆశ్చర్యపోయాను. వారి నవలలు, సినిమాలు, సంగీతం పరిశీలిస్తే వారి సమాజాలలో ఉన్న లోటుపాట్లు బయటపడతాయి. ఏ సమాజంలోనైనా ఉండే సమస్యలు ఒకేలా ఉంటాయి కదా అనిపిస్తుంది. మన దేశంలో కుల వ్యవస్థ ఉండేది (ఇంకా ఉంది!). అక్కడ కులం అనే భావనే ఉండేది కాదు. కాకపోతే జాతిభేదాలు ఉండేవి. శరీరం రంగుని బట్టి వివక్ష చూపించేవారు. ఆ పైన సంపదని బట్టి వర్గాలు ఉండేవి. 1910లో ఈ.ఎమ్.ఫోర్స్టర్ రాసిన ‘హవర్డ్స్ ఎండ్’ నవల ఆధారంగా అదే పేరుతో 1992లో ఓ చిత్రం వచ్చింది. ఆ చిత్రం బ్రిటన్ లోని వర్గ వ్యవస్థని చర్చించింది. అంటే ఎగువ తరగతి, మధ్య తరగతి, దిగువ తరగతిగా విడిపోయిన సమాజాన్ని, వారిలో వారికి జరిగే ఘర్షణని చూపించింది. ఎక్కడైనా నైతిక విలువలు ఒక్కటే, అవి పాటించకపోతే పర్వవసానాలు అనుభవించక తప్పదు అనే సార్వజనీన సందేశం ఉంటుంది. ఈ చిత్రం మూబీలో లభ్యం.

లండన్‌కి కాస్త దూరంలో ఉన్న ఊరు అది. అక్కడ ఒక అందమైన ఇల్లు. దాని పేరు హవర్డ్స్ ఎండ్. రూత్ విల్కాక్స్ సాయంత్రం వేళ ఆ ఇంటి బయట ప్రశాంతంగా పచార్లు చేస్తూ ఉంటుంది. అది ఆమె పుట్టింటి వారు ఇచ్చిన ఇల్లు. దాని మీద ఆమెకి అమితమైన మక్కువ. ఇంట్లో ఒక గదిలో కొంతమంది చేరి సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. భోజనాల గదిలో పనివాళ్ళు పనిలో ఉంటారు. ఒక జంట బయటకి వస్తుంది. వారు చాటుగా ముద్దు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి పేరు హెలెన్. అక్కడ అతిథి. హెలెన్ తండ్రి జర్మన్ దేశస్థుడు. కానీ వారు లండన్‌లో స్థిరపడ్డారు. హెలెన్ తలిదండ్రులు మరణించారు. హెలెన్‌కి ఒక అక్క, ఒక తమ్ముడు ఉంటారు. తలిదండ్రులు మిగిల్చిన కొంత ఆస్తి ఉంటుంది. హెలెన్ తన అక్క మార్గరెట్‌తో జర్మనీ వెళ్ళినపుడు అక్కడ విల్కాక్స్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు వారి ఇంటికి అతిథిగా వచ్చింది. ఆమెను ముద్దు పెట్టుకున్న యువకుడు పాల్. అతను రూత్ రెండో కొడుకు. తర్వాత హెలెన్ మార్గరెట్‌కి ఉత్తరం రాస్తుంది. తాను పాల్‌ని ప్రేమిస్తున్నానని, తాము పెళ్ళి చేసుకోబోతున్నామని అంటుంది. హెలెన్ పిన్ని ఈ వ్యవహారం పట్ల విముఖంగా ఉన్నా మార్గరెట్ సంతోషిస్తుంది. కానీ పాల్‌కి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని తర్వాత తెలుస్తుంది. హెలెన్ నిరాశపడుతుంది కానీ తనను తానే సముదాయించుకుంటుంది. కొన్ని నెలలు గడిచిపోతాయి.

రూత్ భర్త హెన్రీ విల్కాక్స్. వారి సంతానం చార్ల్స్, పాల్, ఈవీ. వారిది సంపన్న కుటుంబం. చార్ల్స్ పెళ్ళికి విల్కాక్స్ కుటుంబం లండన్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుంటుంది. ఆ భవనం హెలెన్ కుటుంబం ఉండే ఇంటి ఎదురుగానే ఉంటుంది. హెలెన్.. విల్కాక్స్ కుటుంబానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదనుకుంటుంది. హెలెన్‌కి, మార్గరెట్‌కి కళలు, సాహిత్యం అంటే ఇష్టం. హెలెన్‌కి ఒక సంగీత కార్యక్రమంలో లెనర్డ్ పరిచయమవుతాడు. అతను ఒక చిన్న ఇంట్లో తన ప్రియురాలు జాకీతో కలిసి ఉంటాడు. ఆ ఇంట్లో పేదరికం కనిపిస్తూ ఉంటుంది. లెనర్డ్‌కి ఖగోళ శాస్త్రం అంటే ఇష్టం. ప్రియురాలు ఉన్నా హెలెన్‌తో పరిచయం అతనిలో కలవరం కలిగిస్తుంది. ఇదిలా ఉండగా హెలెన్ జర్మనీకి వెళుతుంది. ఆ సమయంలో మార్గరెట్ రూత్‌ని కలుసుకోవటానికి వారి ఫ్లాట్‌కి వెళుతుంది. రూత్ ఒక్కతే ఉంటుంది. అనారోగ్యంతో ఉంటుంది. హెలెన్, పాల్‌ల వ్యవహారం గురించి మాట్లాడుతూ “ప్రకృతికీ, మనిషి స్వభావానికీ ఎప్పుడూ చుక్కెదురే” అంటుంది మార్గరెట్. పరిణతి కలిగిన ఆ మాటకి రూత్ చకితురాలవుతుంది. పాల్ నైజీరియా వెళ్ళాడని చెబుతుంది. మాటల్లో మార్గరెట్ తాము పుట్టి పెరిగిన ఇంటికి లీజు ఏడాదిన్నరలో ముగియబోతోందని, ఇంటి విలువ బాగా పెరిగింది కాబట్టి లీజు కట్టలేమని, వేరే ఇంటికి వెళ్ళిపోతామని అంటుంది. రూత్‌కి పూర్వీకుల వారసత్వం ప్రాణప్రదం. ఈ విషయం చెప్పటానికే మొదట్లో ఆమె తన ఇంటిని అపురూపంగా చూసుకోవటం చూపించాడు దర్శకుడు. మార్గరెట్ మాటలు విని ఆమె “ఆడపిల్లలకి ఎంత కష్టం వచ్చింది” అని బాధపడుతుంది. తర్వాత రూత్ మార్గరెట్ ఇంటికి వస్తుంది. మార్గరెట్ స్నేహితులు ఒక చిన్న క్లబ్ లాగ ఏర్పడి కళల గురించి, సమకాలీన విషయాల గురించి చర్చిస్తారు. రూత్ వారి చర్చలు చూసి మార్గరెట్‌తో “నువ్వు చాలా తెలివైనదానివి. ఆపైన మంచిదానివి కూడా” అంటుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. రూత్ హవర్డ్స్ ఎండ్ గురించి ఎన్నో విషయాలు మార్గరెట్ కి చెబుతుంది. రూత్ భర్త హెన్రీకి వారి స్నేహం గురించి తెలిసి సంతోషిస్తాడు. క్రిస్మస్ పండుగకి కానుకలు కొనటానికి వెళ్ళినపుడు రూత్ “నీ స్నేహానికి సమానమైన కానుక నీకు ఇవ్వాలనుంది” అంటుంది. తర్వాత తనకి ఆపరేషన్ జరగబోతోందని చెబుతుంది.

ఆపరేషన్ తర్వాత రూత్ మరణిస్తుంది. రూత్ చనిపోయే ముందు ఆసుపత్రిలో ఒక నర్సు సాయంతో “హవర్డ్స్ ఎండ్ మార్గరెట్‌కి చెందాలి” అని పెన్సిల్‌తో ఒక కాయితం మీద రాస్తుంది. ఆ కాయితాన్ని ఆసుపత్రి వారు హెన్రీకి పంపుతారు. హెన్రీ, చార్ల్స్, చార్ల్స్ భార్య, ఈవీ ఆ కాయితం గురించి చర్చిస్తారు. హెన్రీకి ఆ చేతివ్రాత రూత్ దేనని తెలుసు. ఆ కాయితం చూశాక అది రూత్ రాసిందేనని చార్ల్స్‌కీ అర్థమవుతుంది. అయితే పైకి మాత్రం “తేదీ వేయలేదు. సంతకం లేదు” అంటాడు. చార్ల్స్ భార్య “పెన్సిల్‌తో రాసింది ఎలా చెల్లుతుంది?” అంటుంది. హెన్రీ “చట్టపరంగా ఇది చెల్లదు. కానీ రాసేటపుడు రూత్ మానసిక పరిస్థితి ఎలా ఉందని ఆలోచిస్తున్నాను. మార్గరెట్‌కి ఇల్లుందిగా? ఇంకో ఇల్లెందుకు?” అంటాడు. ఈవీ “అమ్మది ఇలాంటి పని చేసే మనస్తత్వం కాదు” అంటుంది. “నిజమే” అంటాడు హెన్రీ. ఈవీ ఆ కాయితాన్ని చింపి మంటల్లో పారేస్తుంది. వారికి కావలసినంత ఆస్తి ఉంది. రూత్ ఇల్లు మార్గరెట్‌కి రాసిందంటే ఆలోచించే రాసిందని వారి మనసులకి తెలుసు. తమది మధ్య తరగతి కుటుంబమైతే రూత్ ఆ పని చేసేదే కాదు. కానీ మనుషుల స్వార్థాలు ఇలాగే  ఉంటాయి. ఇల్లు ఎవరో దారే పోయే ఆమెకి ఎందుకివ్వాలి అనే భావన. చివరి రోజుల్లో రూత్‌కి మార్గరెట్ నిష్కల్మషమైన స్నేహం అందించింది. రూత్ అనారోగ్యం తీవ్రత చివరి దాకా ఆమెకి తెలియదు. మార్గరెట్ సొంత ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసి రూత్ ఆమెకి ఇల్లు ఇవ్వాలనుకుంది. మార్గరెట్ ఏడాదిన్నరలో ఇల్లు ఖాళీ చేయాలని రూత్‌కి తప్ప విల్కాక్స్ కుటుంబంలో ఎవరికీ తెలియదు. మార్గరెట్‌కి బాధ ఏమీ లేదు. ఆమె కుటుంబానికి జీవితం గడవటం కష్టం ఏమీ కాదు. ఇక్కడ ఇవేమీ ముఖ్యం కాదు. రూత్ మార్గరెట్‌కి ఇల్లు ఇవ్వాలనుకుందనేదే ముఖ్యం. మార్గరెట్‌కి ఈ విషయం తెలియదు. తెలిసినా ఒప్పుకునేది కాదు. హెలెన్ అసలే ఒప్పుకోదు. మార్గరెట్‌కి తెలియకుండా విషయం దాచటం తప్పు. ఎగువ తరగతి వారిలో ఉండే స్వార్థం ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారు. చివరికి ఒక మనిషి చివరి కోరిక తీరకుండా చేశారు. ఆ ఉసురు ఊరికే పోతుందా?

ఒక ఏడాది గడిచిపోతుంది. లెనర్డ్, జాకీ పెళ్ళి చేసుకుంటారు. అతను ఒక బీమా కంపెనీలో పని చేస్తుంటాడు. పనివేళల్లో కూడా ఖగోళశాస్త్ర పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఒకరోజు మార్గరెట్ ఇంటికి మళ్ళీ వస్తాడు. దీనికి అతని భార్య అపార్థమే కారణం. అతనికి కూడా పుస్తకాలు అంటే ఇష్టమని తెలిసి మార్గరెట్, హెలెన్ సంతోషిస్తారు. అతని పేదరికం గురించి తెలిసి అతనికి సాయం చేయాలనుకుంటారు. తమ క్లబ్‌లో కూడా చర్చిస్తారు. వారు క్లబ్ నుంచి తిరిగి వస్తుండగా హెన్రీ తారసపడతాడు. అతనికి లెనర్డ్ గురించి చెప్పి ఎలా సాయం చేయాలి అని అడుగుతారు. “అతన్ని ఆ కంపెనీ నుంచి మారిపొమ్మని చెప్పండి. ఆ కంపెనీ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. ఉద్యోగం ఉండగానే వేరే ఉద్యోగం చూసుకొమ్మనండి. ఉద్యోగం పోయినవాడికి ఉద్యోగం ఇవ్వాలంటే సహజంగానే జంకుతారుగా” అంటాడు. మార్గరెట్ “నేను నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వటమే సహజం అనుకున్నాను” అంటుంది. ఇక్కడే వారి ఆలోచనాధోరణిలో ఉన్న తేడాలు తెలుస్తాయి. హెన్రీది కేవలం అనుభవం చూసే మనస్తత్వం. మార్గరెట్, హెలెన్ మనిషి యోగ్యతకి ప్రాధ్యాన్యం ఇస్తారు. ఎలాగూ ఇంటర్వ్యూలు ఉంటాయి. అలాంటప్పుడు ఉద్యోగం పోయినవారి పట్ల వివక్ష చూపించటం ఎంతవరకు సబబు? ఈ రోజుల్లో ఉద్యోగంలో గ్యాప్ వస్తే వింతగా చూస్తున్నారు. అయినా ఇదంతా ఒక చక్రం. రేపు ఆర్థిక మాంద్యం తగ్గి మళ్ళీ కంపెనీ బడ్జెట్లు పెరిగితే యోగ్యులైన వారిని కళ్ళకద్దుకుని తీసుకుంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే లెనర్డ్ పనిలో అంత శ్రద్ధ పెట్టడు. అతనికి వేరే ఆసక్తులు ఉన్నాయి. కానీ పొట్టకూటి కోసం ఉద్యోగం చేయక తప్పదు. అటూ న్యాయం చేయలేక ఇటూ న్యాయం చేయలేక సతమతమవుతూ ఉంటాడు. ఇలా ఎంతమంది ఉన్నారో. ఒకప్పుడు పండితులకి రాజుల ప్రాపకం ఉండేది. ఇప్పుడు పాండిత్యం ఎవరికీ అవసరం లేదు. ఉద్యోగం సరిగా చేస్తాడా లేదా అనే చూస్తారు. ఆసక్తి ఉన్న రంగంలోనే కృషి చేయవచ్చు కదా అనవచ్చు. చెప్పినంత తేలిక కాదు. డబ్బు లేనివారికి అసలే తేలిక కాదు. హెన్రీతో మాట్లాడినపుడు మార్గరెట్ హవర్డ్స్ ఎండ్ గురించి అడుగుతుంది. “రూత్‌కి ఆ ఇల్లు ఎంత ఇష్టమో నాకు తెలుసు” అంటుంది. హెన్రీకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది గానీ లౌక్యం తెలిసినవాడు కదా, బయటపడడు. “ఆ ఇల్లు అద్దెకిచ్చేశాం. ఇక్కడో ఇల్లు కొనుక్కున్నాం” అంటాడు. హెలెన్ “మీ కంపెనీలో ఏమైనా ఉద్యోగాలున్నాయా?” అని అడుగుతుంది. “లేవు. ఒకవేళ ఉన్నా వందల మంది అప్లై చేస్తారు” అని సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత లెనర్డ్‌ని వేరే ఉద్యోగం చూసుకోమని చెబుతుంది హెలెన్. అతనికి మొదట తన వ్యవహారంలో తలదూర్చినందుకు హెలెన్ మీద కోపం వస్తుంది కానీ ఆమె అతని మంచి కోసమే చెబుతున్నానని అంటుంది.

హెన్రీ, ఈవీ ఒకరోజు మార్గరెట్ ని కలవటానికి వస్తారు. ఆమెకి కానుకగా పూర్వకాలానికి చెందిన ఒక క్రిస్టల్ బుడ్డీ ఇస్తారు. “మీరు రూత్ పట్ల చూపిన ఆదరణకి కృతఙతగా ఈ కానుక” అంటాడు హెన్రీ. మార్గరెట్ చాలా ఆనందిస్తుంది. “ఇది చాలా విలువైనదానిలా ఉంది” అంటుంది. ఆమెకి రూత్ తన ఇల్లు ఇవ్వాలనుకుంది. అది హెన్రీకి, ఈవీకి తెలుసు. మార్గరెట్ కి తెలియదు. మార్గరెట్ హవర్డ్స్ ఎండ్ గురించి అన్న మాటలు విన్నాక హెన్రీకి అపరాధభావం కలిగింది. ఏదో ఒకటి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. మనసు తప్పు చేశావని నిందిస్తుంటే దాని నోరు మూయటానికి ఇలాంటి పనులు. కానుక అందుకున్నాక మార్గరెట్ ప్రతిస్పందన చూసి ఆమె అల్పసంతోషి అని అతనికి తెలిసింది. తర్వాత ఆమెని ఒక రెస్టారెంట్లో భోజనానికి ఆహ్వానిస్తాడు. ఈవీ, ఆమె కాబోయే భర్త కూడా ఉంటారు. ఈవీకి మార్గరెట్ మీద చిన్నచూపు. “తెగ వాగుతుంది” అంటుంది. మార్గరెట్ హెన్రీతో “మాకు త్వరలోనే ఓ ఇల్లు కావాలి. హవర్డ్స్ ఎండ్ మాకు ఇవ్వచ్చుగా” అంటుంది. హెన్రీ, ఈవీ ముఖాలు పాలిపోతాయి. “అది సాధ్యం కాదు. కానీ మీకోసం ఒక ఇల్లు చూస్తాను” అంటాడు హెన్రీ. అతని స్వరంలో ఆమె పట్ల ప్రేమ పలుకుతుంది. మార్గరెట్‌కి అది చూచాయగా తెలుస్తుంది. తర్వాత హెన్రీ ఈవీ పెళ్ళి తర్వాత లండన్లో ఇల్లు అవసరం ఉండదు కనక అద్దెకిస్తామని అంటాడు. ఆ ఇల్లు చూడటానికి మార్గరెట్ వెళుతుంది. హెన్రీ “మిమ్మల్ని అబద్దం చెప్పి ఇక్కడికి రప్పించాను. నా ఉద్దేశం వేరే ఉంది. పంచుకోవటానికి మిమ్మల్ని ఒప్పించగలనా?” అంటాడు. ఇది అతను ఆమెని పెళ్ళి చేసుకోమని అడిగే విధానం. ఎంత లౌక్యం తెలిసినా ప్రేమను వ్యక్తం చేయటం తెలియదు. మార్గరెట్ తెలివైనది. ఆమెకి వెంటనే అర్థమవుతుంది. తనకి సమ్మతమే అంటుంది. ఆమెకి అతని పద్ధతి తెలుసు. అతని గురించి ఆమె, హెలెన్ నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆమె పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? ఆమెకి పెళ్ళి వయసు దాటిపోయింది. ఎంత అభ్యుదయ భావాలున్నా ఒక్కోసారి భద్రతే ముఖ్యమనిపిస్తుంది. అతను రూత్‌ని ఎంతో ప్రేమించాడని ఆమెకి తెలుసు. అతనికి మంచి మనసు ఉందని ఆమె నమ్మింది. అతనే అడిగాడు కాబట్టి సరే అంది. వారు పెళ్ళి చేసుకోబోతున్నారని హెన్రీ అందరికీ ప్రకటిస్తాడు. అతని కుటుంబానికి ఇది సుతరామూ ఇష్టం ఉండదు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

ఒకరోజు హెన్రీ, మార్గరెట్ మాట్లాడుకుంటుండగా హెలెన్ వారికి లెనర్డ్ ఒక బ్యాంక్‌లో ఉద్యోగం చూసుకున్నాడని తెలిసిందని చెబుతుంది. “జీతం తక్కువే కానీ బీమా కంపెనీని వదిలించుకున్నాడు” అంటుంది. హెన్రీ “ఆ బీమా కంపెనీ ఇప్పుడు బాగానే నడుస్తోంది” అంటాడు. హెలెన్ విస్తుపోతుంది. “మీరు చెప్పారు కాబట్టి అతను ఆ బీమా కంపెనీ వదిలేశాడు. పైగా ఇప్పుడు తక్కువ జీతం. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది” అంటుంది. హెన్రీ “ఇదంతా జీవనపోరాటంలో భాగమే. పేదవారి గురించి ఎక్కువ ఉద్వేగపడటం అనవసరం. వారి మీద జాలి పడొచ్చు. అంతే” అంటాడు. హెలెన్‌కి విపరీతమైన కోపం వస్తుంది. మార్గరెట్ ఆమెని శాంతపరచటానికి ప్రయత్నిస్తుంది. కానీ హెలెన్ వినదు. ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తుంది. తర్వాత లెనర్డ్ బ్యాంక్ ఉద్యోగం కూడా పోయిందని తెలిసి ఆమెకి హెన్రీ మీద అమితమైన కోపం వస్తుంది. హెన్రీకి కంపెనీల లోపలి సమాచారం (ఇన్‌సైడర్ ఇన్ఫర్మేషన్) తెలిసి ఉండవచ్చు. అలా తెలుసుకోవటం నేరం. దాని ఆధారంగా సలహాలు ఇవ్వటం ఇంకా నేరం. అతను ఇచ్చిన సలహా వల్ల పేదవాడొకడు రోడ్డున పడ్డాడు. కనీసం పశ్చాత్తాపం ఉండాలి. అదీ లేదు. పేదవారుగా పుట్టటమే వారు చేసిన నేరం అని అతని భావన. అలా పుట్టారు కాబట్టి అలాగే ఉంటారు అంటాడు. సమాజంలో అందరూ సమానమే అనుకోకపోతే చివరికి భంగపాటు తప్పదు. ఆ భంగపాటు ఎలా జరిగిందనేది మిగతా కథ.

మర్చెంట-ఐవరీ ప్రొడక్షన్స్‌లో వచ్చిన చిత్రమిది. ఇస్మాయిల్ మర్చెంట్ నిర్మించగా జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించాడు. హెలెన్‌గా హెలెనా బాన్హమ్ కార్టర్, మార్గరెట్‌గా ఎమా థాంప్సన్, హెన్రీ గా ఆంథొనీ హాప్కిన్స్ నటించారు. ఎమా థాంప్సన్‌కి ఉత్తమ నటి ఆస్కార్ వచ్చింది. చివర్లో హెన్రీ మనసు మార్చే ప్రయత్నం చేసే సీనులో ఆమె నటన్ అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే రాసిన రూత్ ప్రవర్ ఝబ్వాలాకి కూడా ఆస్కార్ వచ్చింది. నవల రాసిన ఈ.ఎమ్. ఫార్స్టర్ దార్శనికతని మెచ్చుకోకుండా ఉండలేం. సున్నితమైన హాస్యచతురత కూడా ఉంటుంది. ఉదాహరణకి కొన్ని మాటలు – రూత్ “నువ్వు తెలివైనదానివి. పైగా మంచిదానివి” అంటే మార్గరెట్ “I am afraid I am neither” (దురదృష్టం ఏమిటంటే నేను రెండూ కాదు) అంటుంది. ఇదే తర్వాత నిజమవుతుంది. చిత్రం మొదటి భాగంలో జాకీ అపార్థంతో లెనర్డ్‌ని వెతుక్కుంటూ మార్గరెట్ ఇంటికి వస్తుంది. “మా ఆయన ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు” అంటుంది. హెలెన్ మార్గరెట్‌తో “మనం లెనర్డ్ అనే ఆయన్ని గూట్లో దాచి ఉంచామా?” అని నవ్వుతుంది. లెనర్డ్‌కి ఉద్యోగం ఇస్తారా అని హెలెన్ హెన్రీని అడిగినపుడు అతను “ఖాళీలు లేవు” అని సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు హెలెన్ మార్గరెట్‌తో “ఏదో తరుముతున్నట్టు ఎలా వెళ్ళిపోయాడో చూడు” అంటుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. హెన్రీ పెళ్ళి ప్రస్తావన చేసే ముందు మార్గరెట్‌కి ఇల్లు చూపిస్తూ ఉంటాడు. ఒక బాల్ రూమ్ (డ్యాన్స్ పార్టీల గది) కూడా ఉంటుంది. “బావుంది కదా” అంటాడు హెన్రీ. “Yes. Even I know a good thing when I see one” (అవును. అపురూపమైనది చూస్తే నాలాంటి దానికి కూడా అది అపురూపమని తెలిసిపోతుంది) అంటుంది. అంటే తనని మీద తాను జోకులు వేసుకోవటం. ఇక చిత్రంలో దుస్తులు, కళాదర్శకత్వం గురించి చెప్పక్కరలేదు. కేవలం కళాదర్శకత్వం చూడటానికే ఈ చిత్రం మరోసారి చూడొచ్చు. కళాదర్శకత్వానికి కూడా ఆస్కార్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఈవీ పెళ్ళి జరిగి విందు జరుగుతూ ఉండగా అక్కడికి హెలెన్ లెనర్డ్‌ని, జాకీని తీసుకుని వస్తుంది. వాళ్ళిద్దరూ పస్తులుండే పరిస్థితి. హెలెన్ హెన్రీని నిలదీసి లెనర్డ్‌కి ఉద్యోగం ఇవ్వమని అడగటానికి వస్తుంది. మార్గరెట్ ఆమెని ఆపుతుంది. “నీ పరోపకారం మరీ వింతగా ఉంది. నీకు వయసు పెరిగే కొద్దీ నియంత్రణ తగ్గిపోతోంది. నువ్వు వాళ్ళని హోటల్‌కి తీసుకు వెళ్ళు. నేను హెన్రీతో మాట్లాడి లెనర్డ్‌కి ఉద్యోగం ఇప్పిస్తాను. నువ్వు మాత్రం ఇలా చిందులు వేయటం ఆపాలి” అంటుంది. హెలెన్ సరే అంటుంది. మార్గరెట్ అందరినీ భోజనం చేయమంటుంది. హెలెన్, లెనర్డ్ హోటల్లో గది తీసుకోవటానికి వెళతారు. జాకీకి ఆకలిగా ఉండటంతో అమె భోజనం చేయటానికి ఉండిపోతుంది. మద్యం తాగుతుంది. మార్గరెట్ హెన్రీని ఆమెకి పరిచయం చేయటానికి తీసుకువస్తుంది. హెన్రీ చూసి జాకీ మద్యం మత్తులో “నేను గుర్తున్నానా?” అంటుంది. హెన్రీ అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు. మార్గరెట్ వెనకాలే వెళుతుంది. హెన్రీ “నన్ను ఇరకాటంలో పెట్టాలని ఇదంతా చేశారు కదా. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళు” అంటాడు. పెళ్ళి హాడావిడి కాస్త సద్దు మణిగాక మార్గరెట్ హెన్రీతో మాట్లాడుతుంది. హెన్రీ “పదేళ్ళ క్రితం జాకీతో సంబంధం ఉండేది” అంటాడు. “అది మనకేం ఇబ్బంది కాదు” అంటుందామె. అతను కాలుజారాడని ఆమె అర్థం చేసుకుంది. అతను “మనిషి ఒక్కోసారి పతనమవుతాడు. నీకు తెలుసా? నీకు అభిరుచులూ, పుస్తకాలూ ఉన్నతమైనవి. నీకు అర్థం కాకపోవచ్చు” అంటాడు. పుస్తకాలలో మనిషి జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులే ఎక్కువ ఉంటాయి. మార్గరెట్‌కి తెలుసు. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ ప్రకృతితో ఘర్షణ పడుతుందని అందొకసారి. హెన్రీ ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం కలది కాబట్టి మనిషి బలహీనతలు తెలియవని అనుకున్నాడు. అతనికి సాహిత్యంతో ఎక్కువ పరిచయం లేదని ఇక్కడ తెలిసిపోతుంది. ఆమెకి మనిషి బలహీనతలు తెలుసు కాబట్టే అతన్ని క్షమించింది. అయితే ఆమె అతనితో మరీ మెతకగా వ్యవహరిస్తుంది. అందులో ఆమె స్వార్థం కూడా ఉంది. అతను “లెనర్డ్, జాకీ హోటల్లో ఉంటే పుకార్లు పుట్టే అవకాశం ఉంది. వారక్కడ ఉండకూడదు. హెలెన్‌కి సందేశం పంపు” అంటాడు. ఆమె సందేశం పంపుతుంది. జాకీ మద్యం అతిగా తాగిందని, హెన్రీకి అలాంటి వారు నచ్చరని, లెనర్డ్‌కి సాయం చేయటం కుదరదని, వారిని పంపేయమని సారాంశం.

హెలెన్‌కి మార్గరెట్ మనసు తెలుసు. ఆమె సందేశం చూసి హెన్రీయే అలా రాయించాడని అంటుంది. అయితే ఎవరి స్వార్థాలు వారివి. తన జీవితం కోసం మార్గరెట్ లెనర్డ్ జీవితం పణంగా పెట్టింది. లెనర్డ్‌కి ఉద్యోగం ఇస్తే హెన్రీ అక్రమ సంబంధం సంగతి బయట పడుతుందని అనుకుంది. ఆమెకి ఎలాగూ తెలుసు. హెన్రీని క్షమించింది కూడా. మరి ఇంకేమిటి? భేషజం. పరువు పోతుందని భయం. తప్పు చేయవచ్చు కానీ పరువు పోకూడదు. అప్పట్లో అలాగే ఆలోచించేవారు. ఇప్పటికీ ఆ ధోరణి ఉంది. తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచి జరుగుతుంది. మమకారం, స్వార్థం ఉంటే పర్యవసానం అనుభవించాలి. లెనర్డ్ కి ఉద్యోగం పోయింది. హెన్రీ వల్ల. జాకీకి అన్యాయం జరిగింది. హెన్రీ వల్ల. ఇద్దరికీ ఒకేసారి న్యాయం చేసే అవకాశం హెన్రీకి వచ్చింది. సమస్యల రూపంలో వచ్చిన అవకాశాలను గుర్తించిన వాడే ఉన్నతుడవుతాడు. పరీక్షిత్తు తప్పు చేయటంతో అతనికి శాపం వచ్చింది. అతను దాన్ని సమస్య అనుకోలేదు. వైరాగ్యం దిశగా వెళ్ళటానికి అవకాశంగా భావించాడు. హరికథలు విని జ్ఞానం పొందాడు. చనిపోతాడని తెలిసి కూడా పరీక్షిత్తు అంత పరిణతిగా ఆలోచించాడు. మనం పరువు కోసం ప్రాయశ్చిత్తానికి కూడా భయపడితే ఎలా?

లెనర్డ్‌కి హెన్రీ, జాకీల సంబంధం గురించి తెలుసు. తలిదండ్రులు చనిపోయి జాకీ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు హెన్రీ ఆమెకి సాయం చేసే నెపంతో ఆమెని లొంగదీసుకున్నాడు. లెనర్డ్ ఇదంతా తెలిసినా జాకీని పెళ్ళి చేసుకున్నాడు. హెన్రీదే తప్పని అతనికి తెలుసు. ఈ విషయమంతా అతను హెలెన్‌కి చెబుతాడు. ఆమె చెప్పమని బలవంతం చేస్తేనే చెబుతాడు. “ఈ ప్రపంచంలో హెన్రీ లాంటి వాళ్ళు జాకీని మోసగిస్తూ పోకుండా ఉండటానికి ఆమెని పెళ్ళి చేసుకున్నాను” అంటాడు. హెలెన్ “ఆ మనిషికి ఎప్పటికీ తాను తప్పు చేశాననే విషయం బుర్రకెక్కదు. ఎందుకంటే బుర్రలో ఏమీ లేదు. గుండెలో కూడా శూన్యమే” అంటుంది. హెన్రీ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. పైకి రావాలంటే ఇతరులని తొక్కి వెళ్ళాలి, అది వారి కర్మ అంటారు. వారికి అవతలి వారి బాధ పట్టదు. ఇంత క్రూరంగా ఎలా ఉంటారు అనిపిస్తుంది. వారి స్వభావమంతే. వారి గురించి ఆలోచించటం అనవసరం. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మార్గరెట్ ఈ విషయం తెలియనంత మూర్ఖురాలు కాదు. కానీ ఒక్కోసారి బుద్ధి పనిచెయ్యదు. దానికి ఎన్నో కారణాలు. ఆమెకి హెన్రీ స్వభావం తెలిసే రోజు కూడా వస్తుంది.

హెలెన్‌కి లెనర్డ్ మీద సానుభూతి ఉంది. అతని మంచితనం తెలిసి ఆమె ఇంకా కరిగిపోతుంది. ఒక బలహీన క్షణంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. తర్వాత హెలెన్ లెనర్డ్‌కి ధనసహాయం చేయమని తన డబ్బు తమ్ముడికి ఇస్తుంది. ఆమె జర్మనీ వెళ్ళిపోతుంది. తమ్ముడు చెక్కు పంపిస్తే లెనర్డ్ తిరస్కరిస్తాడు. మార్గరెట్, హెన్రీల పెళ్ళి జరిగిపోతుంది. హెలెన్ పెళ్ళికి రాదు. తమ్ముడు ఇష్టం లేకపోయినా వస్తాడు. కొన్నాళ్ళకి పిన్నికి ఆరోగ్యం బాగాలేదని తెలిసినా హెలెన్ రాదు. ఉత్తరాలు రాయదు. ఆమె సందర్శించిన ప్రదేశాల చిత్రాలు ఉన్న పోస్ట్ కార్డులు మాత్రం పంపిస్తూంటుంది. మార్గరెట్‌కి అసహనంగా ఉంటుంది. కొన్నాళ్ళకి ఆమె లండన్ వచ్చిందని తెలుస్తుంది. మార్గరెట్ వేరే ఊళ్ళో ఉంటుంది. ఆమె తన ఇల్లు ఖాళీ చేసి సామానంతా హవర్డ్స్ ఎండ్‌లో ఉంచింది. అప్పటికి అక్కడున్న వాళ్ళు ఖాళీ చేయటంతో హెన్రీ సలహా మీద ఆ పని చేసింది. నివాసం మాత్రం వేరే ఊళ్ళో. లండన్ వచ్చినా తనని చూడటానికి రాకపోవటం మార్గరెట్‌కి వింతగా ఉంటుంది. “దానికి పిచ్చెక్కిందా?” అంటుంది తమ్ముడితో.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

హవర్డ్స్ ఎండ్‌లో ఉన్న తన పుస్తకాలు తీసుకోవటానికి హెలెన్‌ని రమ్మని ఉత్తరం రాస్తుంది మార్గరెట్. హవర్డ్స్ ఎండ్ చార్ల్స్‌కి ఇవ్వాలని హెన్రీ అప్పటికే నిర్ణయించుకున్నాడు. హెలెన్ వస్తే ఏం చేయాలని హెన్రీ, మార్గరెట్, చార్ల్స్ చర్చిస్తారు. హవర్డ్స్ ఎండ్‌లో హెలెన్ ఉండటానికి వీల్లేదని అర్థం వచ్చేటట్టు మాట్లాడతాడు చార్ల్స్. అతనికి హెన్రీలా లౌక్యం తెలియదు. హెలెన్ హవర్డ్స్ ఎండ్‌కి వచ్చేసరికి మార్గరెట్, హెన్రీ అక్కడికి వెళతారు. హెలెన్ గర్భంతో ఉంటుంది! మార్గరెట్ ఒంటరిగా హెలెన్‌తో మాట్లాడుతుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి లెనర్డ్ అని తెలుస్తుంది. ఆమె మర్నాడు జర్మనీ వెళ్ళితున్నానని అంటుంది. మార్గరెట్ ఇంటికి వచ్చి హెన్రీతో మాట్లాడుతుంది. హెన్రీ “హెలెన్ గర్భానికి కారణమైనవాడెవరో తెలియాలి. ఆమె గౌరవం నిలబెట్టాలి” అంటాడు. “అంటే అతనితో పెళ్ళి చేస్తారా? అతను పెళ్ళయినవాడైతే? అలాంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయిగా” అంటుందామె. ఇది హెన్రీకి తెలియని విషయం కాదు. అతనే స్వయంగా పెళ్ళయి ఉండి కూడా జాకీతో సంబంధం పెట్టుకున్నాడు. “అతను తన తప్పుకి మూల్యం చెల్లించాల్సిందే” అంటాడు హెన్రీ. ఆ మాటకి మార్గరెట్‌కి మనసు కలచివేసినట్టుంటుంది. హెన్రీ అదే తప్పు చేశాడు, జాకీ విషయంలో. దర్జాగా తిరుగుతున్నాడు. లెనర్డ్ మాత్రం మూల్యం చెల్లించాలి అంటున్నాడు. ఎంత దారుణమైన ద్వంద్వ ప్రవృత్తి! తన కుటుంబంతో సంబంధం ఉన్న హెలెన్ నలుగురి నోళ్ళలోనూ పడుతుందనేసరికి అతనికి రోషం వచ్చింది. ‘మీ మరదలే కదా’ అంటారని అతని భయం. మరి జాకీ ఎవరికీ ఏమీ కాదా? పేదరాలు కాబట్టి ఏం చేసినా పర్వాలేదా? మార్గరెట్‌కి అతని స్వభావం అర్థమవుతుంది. ఆమె ఒక కోరిక కోరుతుంది. “హెలెన్ రేపు జర్మనీ వెళ్ళిపోతుంది. ఈ రాత్రి హవర్డ్స్ ఎండ్ లో ఉండటానికి ఆమెకి అనుమతి ఇవ్వండి” అంటుంది. ఇది హెలెన్ కోరిక కాదు. హెలెన్ అలాంటి కోరిక కోరదు. మార్గరెట్‌యే అతన్ని పరీక్షించటానికి ఈ కోరిక కోరింది. తెలివి అంటే అదీ! అతను ససేమిరా అంటాడు. తనకు చెందిన ఇంట్లో ఒక పెళ్ళి కాని గర్భవతి ఉంటే పరువు పోదూ? మార్గరెట్ అతన్ని బతిమాలుతుంది. “మీకు క్షమాపణ లభించింది. అలాగే హెలెన్‌ని క్షమించలేరా? ఈ ఒక్కరోజు ఆమెని అక్కడ ఉండనివ్వండి. నేనూ ఆమెతో ఉంటాను” అంటుంది. హెన్రీ మొండిగా నిరాకరిస్తాడు.

చార్ల్స్‌కి హెలెన్ గర్భవతి అనే విషయం తెలుస్తుంది. అతను ఆమె తమ్ముడిని నిలదీస్తాడు. ఆమె తమ్ముడు ఆ బిడ్డకి తండ్రి లెనర్డ్ అయి ఉండొచ్చని అంటాడు. చార్ల్స్ హెన్రీతో మాట్లాడతాడు. హెన్రీ “రేపు హవర్డ్స్ ఎండ్‌కి వెళ్ళి అక్కడ ఎవరూ తిష్ట వేసుకోకుండా చూడు” అంటాడు. మర్నాడు యాదృచ్ఛికంగా లెనర్డ్ హెలెన్‌ని వెతుక్కుంటూ హవర్డ్స్ ఎండ్‌కి వస్తాడు. అతనికి ఉద్యోగం దొరకలేదు. అనారోగ్యంగా ఉంటాడు. మార్గరెట్, హెలెన్ అక్కడ ఉంటారు.  చార్ల్స్ కూడా అక్కడే ఉంటాడు. హెలెన్ లెనర్డ్‌ని చూసి ఆశ్చర్యపడుతుంది. చార్ల్స్ అతనే లెనర్డ్ అని తెలిసి అక్కడే గోడ మీద ఉన్న పెద్ద కత్తి తీసి చదునుగా ఉన్న వైపుతో లెనర్డ్‌ని కొడతాడు. ఈ గందరగోళంలో ఒక పుస్తకాల బీరువా లెనర్డ్ మీద పడుతుంది. అతను చనిపోతాడు! అతనికి గుండె జబ్బు ఉందని తర్వాత తెలుస్తుంది. పోలీసుల ఎదుట చార్ల్స్ తాను లెనర్డ్‌ని కత్తితో కొట్టానని చెబుతాడు. హెన్రీ అయితే అలా చెప్పేవాడు కాదు. ఆ విషయంలో చార్ల్స్ నిజాయితీని మెచ్చుకోవాలి. అయితే చంపాలనే ఉద్దేశం లేకపోయినా చనిపోవటానికి కారణమైన వారిని కూడా చట్టం నేరస్థులుగా పరిగణిస్తుంది. దాని మ్యాన్ స్లాటర్ అంటారు. ఈ చట్టం హెన్రీకి తెలుసు. చార్ల్స్‌కి తెలియదు.

హెన్రీ బయటకి వచ్చి మార్గరెట్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. ఆమె “నేను హెలెన్‌కి సాయంగా ఉంటాను. మిమ్మల్ని వదిలేస్తున్నాను” అంటుంది. హెన్రీ ఆమెని బతిమాలి తన మాట చెబుతాడు. “చార్ల్స్ జైలుకి వెళ్ళబోతున్నాడు” అని విలపిస్తాడు. చివరికి హెన్రీ చేసిన పాపాల వల్ల చార్ల్స్ జైలుకి వెళతాడు. కర్మఫలం ఇలాగే ఉంటుంది. హెన్రీ కొడుకుని చూసి ఏడుస్తూ బతకాలి. అతను మార్గరెట్ మాట విని చార్ల్స్‌ని ఆపి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అతనికి మార్గరెట్ ప్రాయశ్చిత్తానికి రెండో అవకాశం ఇచ్చింది. అతను విధిని వెక్కిరించాడు. ఫలితం అనుభవించాడు. అయితే హెన్రీ శోకం చూసి మార్గరెట్ అతనికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. హెలెన్ కూడా వారితోనే ఉంటుంది. కొన్ని నెలల తర్వాత తన కోడలు, రెండో కొడుకు పాల్, ఈవీలతో మాట్లాడతాడు. మార్గరెట్ అక్కడే ఉంటుంది. హెలెన్, తన చిన్నారి కొడుకుని బయట ఆడిస్తుంటుంది. హెన్రీ “నేను హవర్డ్స్ ఎండ్‌ని మార్గరెట్‌కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆమె తదనంతరం ఈ ఇల్లు హెలెన్ కొడుక్కి ఇవ్వాలని మార్గరెట్ నిర్ణయించుకుంది. ఆమె వేరే ఆస్తి ఏమీ కోరుకోవట్లేదు. అది మీకే చెందుతుంది” అంటాడు. అందరూ ఒప్పుకుంటారు. తర్వాత హెన్రీ కోడలు ఈవీతో “ఎంత వింత! మీ అమ్మ హవర్డ్స్ ఎండ్ మార్గరెట్‌కి చెందాలని అనుకుంది. చివరికి అదే జరిగింది” అంటుంది. ఆ మాట మార్గరెట్ వింటుంది. పాల్, ఈవీ, హెన్రీ కోడలు వెళ్ళిపోతారు. మార్గరెట్ “మీ కోడలు హవర్డ్స్ ఎండ్ గురించి ఏదో అంది. ఏమిటది?” అంటుంది హెన్రీతో. “రూత్ ఆఖరి దశలో ఓ కాయితం మీద నీ పేరు రాసింది. ఆమె మతిలేక ఏదో రాసిందని ఆ కాయితాన్ని పక్కన పెట్టేశాను. నేను తప్పు చేశానంటావా?” అంటాడు. మార్గరెట్ ఏమీ అనదు. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది. ఇక్కడ కూడా లౌక్యమే చూపించాడు హెన్రీ. అయితే చివరికి తన మొదటి భార్య కోరిక తీర్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మనుషులు కోరుకున్నంత మాత్రాన ఏదీ జరగదు. మనుషులు ఆపాలనుకున్నా ఏదీ ఆగదు. భారతంలో దాసరాజు భీష్ముడికి రాజ్యం రాకుండా అడ్డుపడ్డాడు. సత్యవతి కొడుకులకి, తర్వాత ఆమె పిల్లలకి రాజ్యం రావాలని పట్టుబట్టాడు. అందుకు భీష్ముడు పెళ్ళి కూడా మానుకున్నాడు. ఏమైంది? సత్యవతి కొడుకులు చిన్నవయసులోనే నిస్సంతుగా మరణించారు. ఒకరికి ధర్మంగా రావలసింది ఆపితే మనమే నాశనమవుతాం. సంపద కన్నా మనుషులకి ప్రాధాన్యం ఇస్తేనే మనుగడ బావుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here