మరుగునపడ్డ మాణిక్యాలు – 64: యువర్ నేమ్ ఎంగ్రేవ్డ్ హెయరిన్

0
11

[సంచిక పాఠకుల కోసం ‘యువర్ నేమ్ ఎంగ్రేవ్డ్ హెయరిన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]నే[/dropcap]ను ఒక బహుళజాతి సంస్థలో పని చేసేవాణ్ని. అన్ని విషయాల్లో వైవిధ్యాన్ని (Diversity) ఆహ్వానించాలని మానవ వనరుల విభాగం పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేది. LGBT వర్గానికి చెందిన వారి పట్ల వివక్ష తప్పని చెప్పేవారు. LGBT అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్. స్థూలంగా స్వలింగప్రియులు, ట్రాన్స్‌జెండర్లు. పుట్టుకతోనే వారిలో భావాలు, ఆకర్షణలు జనాభాలో అధికసంఖ్యాకుల్లో ఉండే భావాలు, ఆకర్షణల కంటే వేరుగా ఉంటాయి. మగవారిని మగవారు ఇష్టపడటం, ఆడపిల్ల మగవాడిలాగా ప్రవర్తించటం, ఇలాగన్న మాట. వీరొక అల్పసంఖ్యాక వర్గం. అధికసంఖ్యాకుల కంటే వేరుగా ఉన్నారు కాబట్టి వీరిని అసహ్యించుకోవటం తప్పు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో శ్రీదేవి పాత్ర వీరి గురించి మాట్లాడుతూ “మనకి అతను భిన్నంగా కనిపించినట్టే అతనికి మనమూ భిన్నంగా కనిపిస్తాం” అంటుంది. వారి స్థానంలో ఉంటే గానీ వారి భావాలు ఇతరులకు అర్థం కావు. ఇతరులకు నిజంగా వారి స్థానంలో ఉండే అవకాశం లేదు. ధనికులుగా ఉన్నవారు పరిస్థితులు తారుమారై పేదవారు కావచ్చు. అప్పుడు పేదవారి కష్టాలు తెలుస్తాయి. కానీ ఒక రకమైన ఆకర్షణ ఉన్నవారికి వేరే రకమైన ఆకర్షణ కలిగే అవకాశం తక్కువ. కాబట్టి LGBT వర్గానికి చెందినవారితో మిగతా వారికి సహానుభూతి కలగదు. అక్కడే ఘర్షణ వస్తుంది. అర్థం చేసుకునే తలిదండ్రులూ ఉంటారు. కాలం మారుతోంది కాబట్టి. అర్థం కాని తలిదండ్రులు నువ్విలా ఎందుకున్నావు అని ప్రశ్నిస్తారు. సహజంగా కలిగే భావాలకి ఎలా వివరణ ఇవ్వగలరు? ఇలాంటి ఒక అబ్బాయి కథ ‘యువర్ నేమ్ ఎంగ్రేవ్డ్ హియరిన్’ (2020) అనే తైవాన్ దేశపు చిత్రం. ‘నీ పేరు చెక్కబడింది గుండెల్లో శాశ్వతంగా’ అని అర్థం. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. పెద్దలకి మాత్రమే. LGBT వర్గం మీద అవగాహన కలగటానికి ఈ చిత్రం ఉపయోగపడుతుంది.

తైవాన్‌లో 1987 వరకు సైనికపాలన నడిచింది. ఎవరికీ స్వేచ్ఛ ఉండేది కాదు. 1987 జులైలో ఆ పాలన ముగిసింది. సైనిక పాలనలో స్వలింగప్రియత్వం ఆమోదించే ఆస్కారమే లేదు. శిక్షలు కూడా ఉండేవేమో. సైనికపాలన ముగిశాక ఈ చిత్రకథ ప్రారంభమవుతుంది. ఒక ఫాదర్ అ-హాన్ అనే అబ్బాయికి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటాడు. అ-హాన్ తలకి చిన్న గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అదొక బాయ్స్ రెసిడెన్షియల్ స్కూలు. జూనియర్ కాలేజీని కూడా స్కూలనే అంటారు. హాస్టల్ వార్డెన్ కర్కశంగా ఉంటాడు. తప్పు చేస్తే కొడతాడు కూడా. అ-హాన్ పద్దెనిమిదేళ్ళ వాడు. ఆ ఫాదర్ స్కూల్‌కి సంబంధించిన ఫాదర్. “మొదలెట్టండి మీ కౌన్సెలింగ్” అంటాడు అ-హాన్ వ్యంగ్యంగా. “ఆ అమ్మాయి ఏ క్లాసులో చదువుతోంది?” అంటాడు ఫాదర్. ఒక అమ్మాయి గురించి గొడవ జరిగిందని అతనికి అందిన సమాచారం. అ-హాన్ ముఖంలో రంగులు మారతాయి. అతను ఒక అమ్మాయి గురించి కాదు, ఒక అబ్బాయి గురించి చెప్పటం మొదలుపెడతాడు.

అ-హాన్‌కి కొత్తగా స్కూల్‌కి వచ్చిన ఒక అబ్బాయి పరిచయమవుతాడు. అతని పేరు వేరే ఉన్నా అతను పెట్టుకున్న పేరు బర్డీ. కాస్త దుడుకుగా ఉంటాడు. అ-హాన్ అతనికి ఆకర్షితుడవుతాడు. అమ్మాయిల పట్ల ఆకర్షణ లేదు. తనలో ఏదో లోపం ఉన్నట్టు బాధపడుతుంటాడు. ఫాదర్ పర్యవేక్షణలో సంగీత వాయిద్యాల సాధన చేసే బృందంలో అ-హాన్, బర్డీ కూడా ఉంటారు. ఫాదర్ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే అ-హాన్ బర్డీ వంక చూస్తాడు. అతను కూడా అ-హాన్‌ని చూస్తూ ఉంటాడు. దొరికావులే అన్నట్టు నవ్వుతాడు. ఒకరోజు స్వలింగప్రియుడైన మరో అబ్బాయిని అ-హాన్ స్నేహితులు కొందరు కొడుతూ ఉంటారు. అ-హాన్‌ని కూడా కొట్టమంటారు. “వాడు మనందరినీ వాడిలా మార్చేస్తాడు” అంటారు. అ-హాన్ కొట్టటానికి కర్ర ఎత్తుతాడు. ఇంతలో బర్డీ వచ్చి ఆ అబ్బాయిని విడిపించి తీసుకువెళతాడు. బర్డీ కొత్తవాడు కాబట్టి మిగతావాళ్ళు జంకుతారు. అమ్మాయిల పట్ల ఆకర్షణ అబ్బాయిల్లో సహజంగా వస్తుంది. ఆ ఆకర్షణ గురించి వారు మాట్లాడుకుంటారు. కానీ కొందరు అబ్బాయిల్లో అబ్బాయిల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేరు. చుట్టూ ఉన్నవారు అలాంటి వారిని దోషం ఉన్నట్టు చూస్తే కొందరు బయటపడకుండా ఉంటేనే మంచిది అనుకుంటారు. తమని తాము అసహ్యించుకుంటారు. చిన్న వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. ఆకర్షణ మాత్రం ప్రకృతి ముందే కలిగిస్తుంది. వారు ఇతరులకన్నా వేరుగా ఎందుకు ఉన్నారో అర్థం కాక మథనపడతారు. అప్పుడు పెద్దవారు వారికి అండగా ఉండాలి. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్వలింగప్రియత్వం మీద సరైన అవగాహన లేదు. పెద్దవారు కూడా అది తప్పనే భావిస్తున్నారు. ఆ పిల్లల్లో ఎంత క్షోభ ఉంటుందో ఊహకు అందదు. అ-హాన్ తన రహస్యం బయటపడకూడదని తనలాంటి వాడిని కొట్టటానికి కూడా సిధ్ధపడ్డాడు. ఎంత ఘర్షణ పడి ఉంటాడో! ఆ అబ్బాయి స్థానంలో ఒకరోజు తాను ఉండవచ్చు.

తైవాన్ అధ్యక్షుడు మరణించటంతో రాజధానిలో సంతాప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సెలవు పెట్టి అక్కడి వెళ్ళటానికి స్కూలు వాళ్ళు అనుమతిస్తారు. అ-హాన్, బర్డీ అక్కడికి వెళతారు. సంతాపం సాకు మాత్రమే. సరదాగా గడపటానికి వెళతారు. అక్కడ ఒక యువకుడు ‘స్వలింగప్రియత్వం జబ్బు కాదు’ అని ఒక అట్ట మీద రాసి ప్రదర్శిస్తూ ఉంటాడు. అతన్ని పోలీసులు నిర్బంధిస్తారు. బర్డీ అతన్ని వదలమని అరుస్తాడు. అ-హాన్ అతన్ని ఆపుతాడు. తర్వాత బర్డీ “నేను చచ్చిపోతే ఏం చేస్తావు?” అని అడుగుతాడు. అ-హాన్ “అలాంటి మాటలు మాట్లాడకు” అంటాడు. బర్డీ తనకి నచ్చిన రచయిత్రి రాసిన కథ గురించి మాట్లాడుతూ “అందులో ఒకచోట ‘నాకు నువ్విచ్చేది అందరికీ నువ్విచ్చేదే అయితే అది నాకొద్దు’ అంటుంది” అంటాడు. “అయితే నీకు ప్రేమంటే ఏమిటో తెలుసా?” అంటాడు అ-హాన్. “నన్ను ఈ లోకంలో ఎవరూ సరిగా అర్థం చేసుకోవట్లేదు. భూమ్మీద ఇంత జనాభా ఉంది. ఇంతమంది అవసరమా? నేను కూడా అనవసరంగా పుట్టానేమో. మా నాన్న ‘నిన్ను పెంచటం అనవసరం. పుట్టినప్పుడే నీ గొంతు నులిమేయాల్సింది’ అంటాడు” అంటాడు బర్డీ. “మనం పిల్లల్ని కనొద్దులే” అంటాడు అ-హాన్. “మనిద్దరికీ ఎలాగూ పిల్లలు పుట్టరు” అంటాడు బర్డీ. “ఇడియట్!” అంటాడు అ-హాన్. బర్డీ ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలోనే అ-హాన్‌ని కవ్విస్తూ మాట్లాడతాడు. అ-హాన్‌కి అతనంటే ఇష్టమని మనకి తెలిసిపోతూనే ఉంటుంది. మరికి అతనికి? విషాదమేమిటంటే అ-హాన్ బయటపడి అడిగితే తన విషయం తెలిసిపోతుందేమోనని భయపడతాడు. కానీ బర్డీ మాటలు అతన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అదే అమ్మాయి అయితే ఈ ఊగిసలాట ఉండదు.

అ-హాన్ కథ వింటున్న ఫాదర్ “కామాన్ని జయించమని దేవుడు చెప్పాడు” అంటాడు. అంటే పిల్లలు పుట్టటానికే కామం ఉండాలి, మిగతా కోరికలని జయించాలని ఉద్దేశం. “నేను కామం కాదు, ప్రేమ కోరుకుంటున్నాను. దేవుని యందు విశ్వాసం కూడా ఉంది. ఆ విశ్వాసం ఉంటే అమరమైన జీవితం ఉంటుందని దేవుడే చెప్పాడు కదా” అంటాడు అ-హాన్. “నువ్వు దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నావు” అంటాడు ఫాదర్. “నేను ప్రేమించినట్టు మీరెవర్నీ ప్రేమించలేదు కాబట్టి మీకు అర్థం కాదు” అంటాడు అ-హాన్.

మళ్ళీ గతంలోకి వెళితే.. కొత్త విధానం ప్రకారం స్కూల్లో అమ్మాయిలకి కూడా ప్రవేశం ఇస్తారు. అయితే అబ్బాయిల భవనానికి, అమ్మాయిల భవనానికి మధ్య ఇనప తీగల కంచె పెడతారు. అ-హాన్ స్నేహితులు ఆ కంచె దగ్గర నిల్చుని అమ్మాయిలని పలకరిస్తూ ఉంటారు. అ-హాన్ బర్డీతో ఉండటం చూసి “ఆ పనికిమాలినవాడితో తిరగకు” అంటారు. అతను ఇంతకు ముందు ఒక స్వలింగప్రియుణ్ణి కాపాడాడని వారి అక్కసు. అ-హాన్ పట్టించుకోడు. ఫాదర్ చేయించే సంగీతసాధనలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ ఉంటారు. స్కూలు అధికారి వారిని వేరు చేయమని ఫాదర్‌తో గొడవపడతాడు. బన్-బన్ అనే అమ్మాయి ఆ అధికారితో “మీ వక్రమైన ఆలోచనతో మమ్మల్ని కించపరచవద్దు” అంటుంది. బర్డీ కూడా ఆ అధికారికి ఎదురుతిరుగుతాడు. దాంతో అధికారి వెనక్కి తగ్గుతాడు. బర్డీ, బన్-బన్ విజయానందంతో చిరునవ్వులు విసురుకుంటారు. ఇది అ-హాన్ చూస్తాడు. “అమ్మాయిలకి దూరంగా ఉండు. లేకపోతే యాజమాన్యం ఏం చేస్తుందో” అంటాడు బర్డీతో. అతని భయం బర్డీ అమ్మాయి ప్రేమలో పడతాడేమోనని. బర్డీ ఆ మాట పట్టించుకోడు. అ-హాన్‌కి అయోమయంగా ఉంటుంది. బర్డీ తనలాంటి వాడా కాదా అనేది అర్థం కాదు. మొదట్లో తన స్నేహితులు కొట్టిన అబ్బాయిని చాటుగా పిలిచి “నీ అబ్బాయిలంటే ఎప్పటి నుంచి ఇష్టం? డాక్టరుకి చూపించుకున్నావా? గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రయత్నించావా?” అని అడుగుతాడు. తాను కూడా మిగతా అబ్బాయిల్లా మారిపోవాలని అతని ప్రయత్నం. ఆ అబ్బాయి “నాకు చిన్నప్పటి నుంచే అబ్బాయిలంటే ఇష్టం. అది మారదు” అంటాడు. అ-హాన్ నిరాశపడతాడు. ఒకరోజు అ-హాన్ స్నేహితులు బర్డీ మీద దాడి చేస్తారు. బర్డీ యథాశక్తి ఎదురుతిరుగుతాడు. అ-హాన్ కూడా బర్డీని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. బర్డీ పై అంతస్తు నుంచి దూకి తప్పించుకుంటాడు. అ-హాన్ స్నేహితుడు “వాడు తేడా గాడు. నువ్వు వాడితో తిరిగితే నువ్వు కూడా గే అని అనుకుంటారు” అంటాడు అ-హాన్‌తో. ఈ పరిణామాలతో అ-హాన్‌లో ఘర్షణ అధికమవుతుంది. గత 70 ఏళ్ళలో స్వలింగప్రియత్వం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇది వ్యక్తులు కావాలని చేసే విపరీత చర్య కాదని, సహజంగా కొంతమందిలో పుట్టే గుణమని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇది ప్రకృతికి విరుద్ధం అని కొందరు అనవచ్చు. ప్రకృతికి విరుద్ధమైనది దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? జనాభాని తగ్గించటానికి ఇది ప్రకృతి ఎంచుకున్న ఒక పద్ధతి అని కొందరంటారు. ఏది ఏమైనా ఇప్పుడు భారతదేశంతో సహా చాలా దేశాలు స్వలింగసంపర్కం నేరం కాదని చట్టం చేశాయి. కానీ ఈ కథ 1988 నాటిది. అప్పట్లో వివక్ష చాలా ఉండేది.

ఒక మిలటరీ సంగీత పోటీలో స్కూలు తరఫున అ-హాన్, బర్డీ, బృందం పాల్గొంటారు. అమ్మాయిలందరూ చూస్తూ ఉంటారు. బన్-బన్ కూడా ఉంటుంది. కవాతు పాట పూర్తి కాగానే బర్డీ ‘ఈ లోకం అంత చెడ్డదేం కాదు. ఎందుకు కుంగిపోతావు?’ అనే పాట పాడతాడు. తోటివారందరూ గొంతు కలుపుతారు. మిలిటరీ అధికారి ఒకరు “ఇదేం పస లేని పాట? బలహీనులు పాడే పాట. పొండి” అంటాడు. బర్డీ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అ-హాన్ వెనకాలే వెళతాడు. బర్డీ అ-హాన్ మీద విసుక్కుంటాడు. బన్-బన్ బర్డీ దగ్గరకి వస్తుంది. “నిన్నెవరూ అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను” అంటుంది. బర్డీ ఆమె మాటలకి శాంతిస్తాడు. అది చూసి అ-హాన్ దూరంగా వెళ్ళిపోయి ఆక్రోశంతో అరుస్తాడు. తర్వాత ముగ్గురూ భోజనం చేయటానికి వెళతారు. బర్డీ “సైనిక పాలన ముగిసింది కదా. ఇంకా ఈ పాత భావజాలం ఏమిటి? మనం ఎంతో సాధన చేసిన పాట కనీసం పూర్తి చేయనివ్వలేదు” అంటాడు. “సైనిక పాలన ముగిస్తే ప్రపంచం మారిపోతుందా?” అంటాడు అ-హాన్. అతను ఇక్కడ పాట గురించి మాట్లాడినట్టున్నా అతని భావం తన లాంటి వారిని ప్రపంచం అంత త్వరగా ఆమోదించదని. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిరంకుశ ప్రభుత్వాలు మారినా, కొత్త చట్టాలు వచ్చినా పరిస్థితులు వెంటనే మారవు. స్వలింగసంపర్కం నేరం కాదనే చట్టం ఇప్పుడు వచ్చింది. కానీ చట్టాలు అమలు చేసేవారిలో వివక్ష ఉంటే చట్టం అమలు కాదు. ఎంతో పోరాడాలి. సమాజం విషయం ఏమిటి? చట్టం వచ్చింది కదా అని సమాజం వెంటనే ఆమోదిస్తుందా? ఎప్పటినుంచో పాతుకుపోయిన భావజాలం అంత త్వరగా మారదు. తెలిసినవారు అవగాహన కల్పించాలి. మగవారి మధ్య లైంగిక చర్యలు జుగుప్సాకరం అని కొందరంటారు. కొన్ని చర్యల విషయంలో అది నిజమే కావచ్చు. కానీ అన్ని చర్యలూ అలా కాదు. వాత్సాయన కామసూత్రాలలో ఉన్న కొన్ని భంగిమలు అసహ్యమని కొందరు అంటారు. దీనికి అంతెక్కడ? ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇద్దరికీ సమ్మతమైతే కాదనటానికి మూడో వ్యక్తికి హక్కు ఉండదు. ఇక్కడ సమ్మతి (consent) ముఖ్యం. వయసులో పరిణతి ముఖ్యం. జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. అయితే సమ్మతి లేకపోయినా బలవంతం చేయటం ఎన్నటికీ సరి కాదు.

బర్డీ, బన్-బన్ చేరువ కావటం చూసి అ-హాన్ కుంగిపోతాడు. కథ వింటున్న ఫాదర్‌తో “మా ఇద్దరి చుట్టూనే ప్రపంచం తిరుగుతోందని అనుకున్నాను. ఒక్కసారిగా నేను బయటివాడినయిపోయాను” అంటాడు అ-హాన్ కన్నీళ్ళు పెట్టుకుని. “అసూయ పాము లాంటిది. అది హృదయాన్ని తినేస్తుంది” అంటాడు ఫాదర్. మళ్ళీ గతంలోకి వెళితే బర్డీ “నీకో గర్ల్ ఫ్రెండ్‌ని నేను చూసిపెడతాను” అంటాడు అ-హాన్‌తో. అ-హాన్‌కి అమితమైన కోపం వస్తుంది. బర్డీ గేలకి మద్దతుగా ఉంటాడు కదా తననెందుకు అర్థం చేసుకోడని అ-హాన్ కోపం. బర్డీకి తానంటే ఇష్టమని తెలుసు. అది ప్రేమో కాదో తెలియదు. అ-హానే చెప్పొచ్చు కదా? మనసు విప్పి చెప్పేస్తే బర్డీ తనని అసహ్యించుకుంటే? ఇదే సంఘర్షణ. అ-హాన్ తెగించి తన ప్రేమ సంగతి చెప్పెయ్యాలని అనుకునే రోజు కూడా వస్తుంది. కానీ ఆ సందర్భంలో అక్కడ బర్డీయే కాక ఇతరులు కూడా ఉంటారు. అప్పుడు ఏం జరిగింది? చివరికి ఏమయింది అనేది మిగతా కథ.

ఈ చిత్రానికి యు-నింగ్ చూ, జీ జాన్, ఆల్కటెల్ వూ స్క్రీన్ ప్లే సమకూర్చారు. అసలు అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ అంటేనే తటపటాయింపులు, గుండె ఝల్లుమనటాలు లాంటివి ఉంటాయి. ఇక అబ్బాయిల మధ్య ప్రేమ అంటే వాటికి తోడు భయాలు, సంకోచాలు ఉంటాయి. ఇవన్నీ ప్రేక్షకులకి తెలిసేలా స్క్రీన్ ప్లే రాయటంలో రచయితలు కృతకృత్యులయ్యారు. ప్యాట్రిక్ లియూ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2020లో తైవాన్ లో అన్ని చిత్రాలకంటే ఎక్కువ ప్రజాదరణ పొందిందంటే దర్శకుడి ప్రతిభ ముఖ్యకారణం. ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. సముద్రం ఒడ్డున వచ్చే దృశ్యాలు, చివర్న తెల్లవారుతుంటే వచ్చే దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి. సముద్రం కల్లోలానికి సంకేతమయితే ఉదయకాంతి శాంతికి సంకేతం. అ-హాన్‌గా ఎడ్వర్డ్ చెన్, బర్డీగా సెంగ్ జింగ్-హువా నటించారు. ఇద్దరూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యం ఎడ్వర్డ్ దుఃఖాన్ని అద్భుతంగా అభినయించాడు. ఒక సందర్భంలో అ-హాన్‌కి ఒక నడి వయసు వ్యక్తి పరిచయమవుతాడు. అతనూ స్వలింగప్రియుడే. అతను అ-హాన్ లోని ఘర్షణని పసిగట్టి అతని పట్ల వాత్సల్యం చూపిస్తాడు. తర్వాత అ-హాన్‌ని కామోద్రేకంతో కౌగిలించుకుని ముద్దులు పెడతాడు. అ-హాన్ అతన్ని తోసేసి “నేను నీలాంటి వాడిని కాదు” అని అరుస్తాడు. పైకి ‘నేను గే ని కాదు’ అని చెప్తున్నట్టనిపించినా ‘నాకు నీలా వాంఛ తీర్చుకోవటం ముఖ్యం కాదు. నాకు ప్రేమ కావాలి’ అని భావం. ఆ భావాన్ని పలికించటంలో ఎడ్వర్డ్ మార్కులు కొట్టేశాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

అ-హాన్ ఒక అమ్మాయితో డేట్‌కి వెళతాడు. ముభావంగా ఉంటాడు. ఆమె ‘వనాన్’ అనే పదం ‘ఐ లవ్యూ’కి సంకేతమని చెబుతుంది. ‘వనాన్’ అంటే శుభరాత్రి అని అసలు అర్థం. అ-హాన్ ‘వనాన్’ అనే సందేశం బర్డీ పేజర్ (సెల్ ఫోన్ రాక ముందు వాడిన ఒక పరికరం) కి పంపుతాడు. అది అర్థం చేసుకోవాలంటే సంకేత భాష తెలియాలి. బర్డీ స్పందించడు. మర్నాడు కలిసినపుడు బన్-బన్‌తో డేట్‌కి వెళ్ళానని చెబుతాడు. అ-హాన్ స్కూటర్ తీసుకునే అతను డేట్‌కి వెళ్ళాడు. బర్డీకి తన ప్రేమ సంగతి చెప్పాలని అ-హాన్ ప్రయత్నిస్తాడు కానీ బర్డీ ఒక పని ఉందని చెప్పి అతన్ని హడావిడిగా తీసుకువెళతాడు. అ-హాన్ సహాయంతో ఒక చోట కట్టి ఉన్న పెద్ద బెలూన్ దొంగిలిస్తాడు. మర్నాడు ఆ బెలూన్ మీద ‘వనాన్, నా ప్రియా’ అని రాసి స్కూల్లో అందరికీ కనపడేలా పెడతాడు బర్డీ. ఆ సందేశం బన్-బన్ కోసమని ఆమెకి సైగ చెస్తాడు. ఆ సందేశం సంకేతార్థం తెలిసినా బర్డీ తనకి స్పందించకపోవటం, బన్-బన్ కోసం దాన్ని వాడుకోవటంతో మరింత కుంగిపోతాడు అ-హాన్. ఆ బెలూన్ వ్యవహారాన్ని స్కూల్ యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి బాధ్యులు ఎవరో ముందుకి రావాలని హెచ్చరిస్తుంది. బర్డీ బయటపడడు. ఆ తర్వాత ఒకరోజు అ-హాన్ స్కూటర్ తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు బర్డీ. ఆసుపత్రిలో చేతికి కట్టు కడతారు. ఆ కట్టుతోనే అతను బాత్రూమ్‌లో స్నానం చేయటానికి ప్రయత్నిస్తుంటే అ-హాన్ సాయం చేస్తాడు. ఆ సమయంలో బర్డీకి లైంగిక ఉద్దీపన కలగటంతో అ-హాన్ ధైర్యం చేసి అతనికి హ్యాండ్ జాబ్ (చేతితో చేసే లైంగిక చర్య) చేస్తాడు. బర్డీ మొదట నామమాత్రంగా అడ్డు చెప్పినా ప్రతిఘటించడు. తర్వాత బర్డీ భావావేశంతో అ-హాన్‌ని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. అంతలోనే “సారీ. సారీ. సారీ” అంటూ విలపిస్తాడు. ఇద్దరూ కౌగిలించుకుని విలపిస్తారు. ఈ సన్నివేశాన్ని సెన్సిటివ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రేమ, కోరిక, బాధ, లజ్జ, అపరాధభావం అన్నీ కలిసి ఉంటాయి ఈ సన్నివేశంలో.

తర్వాత బర్డీ మళ్ళీ అ-హాన్‌కి దూరం దూరంగా ఉంటాడు. దాంతో విసిగిపోయి అ-హాన్ బర్డీ, బన్-బన్‌ల ప్రేమ వ్యవహారం గురించి స్కూల్ అధికారికి ఫిర్యాదు చేస్తాడు. ఇది నేరుగా చూపించకపోయినా అతనే ఫిర్యాదు చేశాడని తెలిసిపోతూనే ఉంటుంది. బర్డీని సస్పెండ్ చేస్తారు. బన్-బన్‌ని ఏకంగా స్కూల్ నుంచి తొలగిస్తారు. అమ్మాయిలకి ఎప్పుడూ ఎక్కువ అన్యాయమే జరుగుతుంది. బర్డీ ప్రేమ వ్యవహారం తెలిసి అతని తండ్రి స్కూల్‌కి వచ్చి అతని చేతికి కట్టు ఉందని కూడా చూడకుండా స్కూల్ సిబ్బంది ముందే అతన్ని కొడతాడు. బర్డీ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు. కుర్చీ ఎత్తి కొట్టబోతుంటే అ-హాన్ వచ్చి అడ్డుపడటంతో అతనికి దెబ్బ తగులుతుంది. అయినా బర్డీ తండ్రి ఆగకుండా బర్డీని కొడుతుంటాడు. అ-హాన్ అడ్డుపడుతుంటే బర్డీ “ఇది నా ప్రేమ వ్యవహారం. నువ్వు పో” అంటాడు. అ-హాన్ స్కూల్ అధికారి వైపు తిరిగి “ఇది నా ప్రేమ వ్యవహారం. బెలూన్ పెట్టింది నేను” అంటాడు. బర్డీ అతన్ని కొడతాడు. అ-హాన్ ఆవేశంలో అంతా చెప్పేస్తే తనని కూడా గే అనుకుంటారని అతని భయం. బర్డీ కొట్టేసరికి అ-హాన్‌కి కోపం వస్తుంది. “ఎందుకు నన్నిలా బాధపెడతావు?” అని అతనితో కలియబడతాడు. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇది చూసి స్కూల్ సిబ్బంది బన్-బన్ కోసం ఇద్దరూ కొట్టుకుంటున్నారని అనుకుంటారు. ఫాదర్ వచ్చి ఇద్దరినీ విడదీస్తాడు. బర్డీ రుసరుసలాడుతూ వెళ్ళిపోతాడు. ఫాదర్ అ-హాన్‌ని తీసుకుని వేరే గదికి వెళతాడు. అ-హాన్ తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అక్కడే అ-హాన్ తనకి బర్డీ మీద ఉన్న ప్రేమ గురించి చెబుతాడు. ఫాదర్ రక్తం తుడిచి పట్టీ వేస్తూ అతని కథ వింటాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.

ఫాదర్ తన కథ చెబుతాడు. అతను కెనడా దేశస్థుడు. తనకి పద్దెనిమిదేళ్ళు ఉన్నప్పుడు తనని అక్కడి ఫాదర్ బాగా కొట్టాడని, అక్కడ ఉండలేక తైవాన్ వచ్చేశానని అంటాడు. 1960లో అక్కడి ప్రజలు తిరుగుబాటు చేశారని, మతం ప్రభావం నుంచి బయటపడి తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవటం మొదలెట్టారని అంటాడు. అక్కడి తిరుగుబాటు తాను చూడలేదు కానీ ఇక్కడ అ-హాన్ చేస్తున్న తిరుగుబాటు చూస్తున్నానని అంటాడు. ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇంతలో అ-హాన్ స్నేహితుడు వచ్చి అ-హాన్‌తో “మీ అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. బర్డీ మీ ఇంట్లో ఉన్నాడట” అంటాడు. అ-హాన్ పరుగుపరుగున ఇంటికి వెళతాడు. బర్డీ అక్కడే ఉంటాడు. అ-హాన్ తండ్రి “అతని గర్ల్ ఫ్రెండ్‌ని దొంగిలించాలని చూశావా?” అని అడుగుతాడు. అ-హాన్‌కి పిడుగు పడ్డట్టు ఉంటుంది. “ఇదంతా దేని కోసం చేస్తున్నావు?” అని అడుగుతాడు బర్డీని. “నేను కాలేజ్ ప్రవేశ పరీక్ష కోసం తయారవాలి. వేరే ఏ ఆలోచనలూ నాకొద్దు. స్కూల్లో నువ్వేం చేస్తున్నావో మీ అమ్మానాన్నకి చెప్పటానికి వచ్చాను. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వెందుకు మా మధ్యకి వచ్చావు?” అంటాడు బర్డీ. అ-హాన్ తల్లి అ-హాన్‌తో “మీరిద్దరూ మంచి స్నేహితులు కదా. ఒక అమ్మాయి కోసం గొడవ ఎందుకు? నీకు కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే” అంటుంది. ఆమె మాట విని బర్డీ “అతనికి కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ దొరక్కపోతే? ఎప్పటికీ గర్ల్ ఫ్రెండ్ దొరక్కపోతే?” అంటాడు. అ-హాన్ “ఆ సంగతి నీకెందుకు?” అంటాడు. “నా జోలికి మాత్రం రాకు” అంటాడు బర్డీ. అ-హాన్ హతాశుడవుతాడు. తలిదండ్రులతో “నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉన్నది..” అని చెప్పబోతుంటే బర్డీ “నా జోలికి రావద్దన్నాను కదా!” అని అరుస్తాడు. “నాకు నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం ఉంది. నీకుందా?” అంటాడు అ-హాన్. “నీకు పిచ్చెక్కిందా? తేడా గాడిలా ప్రవర్తించకు” అంటాడు బర్డీ. “నేను తేడా అయితే తప్పేంటి? నీకు అసహ్యమా? అసహ్యమైతే నా ముఖం మీద చెప్పు” అని అరిచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అ-హాన్.

అ-హాన్ దృక్కోణం నుంచి మనం కథ చూశాం కానీ బర్డీ మనసులో ఏముంది అని కూడా ఆలోచించాలి. అతనికి అ-హాన్ అంటే ఇష్టమే. కానీ అ-హాన్‌లా ఆకర్షణ ఉందా అనేది అతనికే తెలియాలి. ఒకవేళ ఆకర్షణ ఉన్నా అతనికి బయటపడటం ఇష్టం లేదు. అతను తిరుగుబాటు మనస్తత్వం కలవాడే కానీ నిజానికి ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉంటే సమాజం ఒప్పుకోదని తెలుసు. వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. అ-హాన్ వాస్తవ ప్రపంచం గురించి తెలిసినట్టు మాట్లాడతాడే కానీ అతనిలో కలలు కనే స్వభావం ఎక్కువ. బయటి ప్రపంచానికి స్నేహితుల్లా ఉంటూ గోప్యంగా కలిసి ఉండొచ్చు అని అతని ఆలోచన. బర్డీకి ఇది సాధ్యం కాదని తెలుసు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ అ-హాన్‌కి సమాజం బూచిని చూపిస్తే సరిపోదు. అందుకే బర్డీ ‘నువ్వు తేడా గాడివి. నేను కాదు’ అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. అ-హాన్ అది నమ్మడు. బర్డీ సమాజానికి భయపడి అలా అంటున్నాడని అతనికి అనుమానం. అది నిజమా కాదా? బర్డీ ఏదీ స్పష్టంగా చెప్పడు. ఇలా ఎంతమంది క్షోభకి గురయ్యారో? కారణమేదైనా పకృతి స్వలింగప్రియులని సృష్టించింది. వారి మానాన వారిని వదిలేస్తే గొడవ ఉండదు. కానీ సమాజం కట్టుబాట్ల పేరుతో వారి పట్ల వివక్ష చూపించింది. ఆంగ్ల రచయిత ఈ.ఎమ్.ఫార్స్టర్ (‘హవర్డ్స్ ఎండ్’ మొదలైన నవలలు రాసిన రచయిత) స్వలింగప్రియుడే. ఆధునిక కంప్యూటర్లకు ఆద్యుడైన ఆలన్ ట్యూరింగ్ స్వలింగప్రియుడు. వీరందరూ భయపడుతూ బతికారు. వారిని సమాజం అక్కున చేర్చుకుని ఉంటే వారు ఇంకా ఎంతో సాధించేవారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా అవగాహన పెరగాలి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అ-హాన్ ఇంటి నుంచి వెళ్ళిపోయి పడవెక్కి ఒక ద్వీపానికి వెళతాడు. బర్డీ కూడా అతని వెనకాలే వస్తాడు. ద్వీపం మీద ఒక నిర్జన ప్రదేశంలో అ-హాన్ నడుస్తూ వెళుతుంటాడు. బర్డీ అతన్ని ఆగమంటూ అరుస్తూ ఉంటాడు. “నా గురించి ఎప్పుడు ఆలోచించావు గనక? నాకు నువ్వు లేని చోటికి వెళ్ళాలని ఉంది” అని అరుస్తాడు అ-హాన్. అసలు బర్డీ పరిచయం కాకపోతే బావుండేదని అతని భావన. ప్రేమలో గాయపడిన వారు ఇలాగే ఆలోచిస్తారు. ఆ వ్యక్తి నా జీవితంలోకి ఎందుకు రావాలి అనుకుంటారు. బర్డీ కాకపోతే మరో అబ్బాయి మీద ప్రేమ పుట్టేది. ఆ అబ్బాయికి ఇష్టమైనా సమాజంతో పోరాటం తప్పదు. అ-హాన్ సముద్రం అంచు దాకా వెళతాడు. ఇక ఎక్కడికీ వెళ్ళటానికి దారి ఉండదు. నిస్పృహతో అరుస్తాడు. బర్డీ అతన్ని వెనక నుంచి కౌగిలించుకుంటాడు. ఇద్దరూ అక్కడ కాసేపు ఉంటారు. సముద్రంలో మునకలేస్తారు. ఇసకలో సేద తీరుతారు. అ-హాన్ బర్డీని ముద్దు పెట్టుకుంటాడు. సముద్రపు పోటు పెరుగుతూ ఉంటుంది. ‘ప్రపంచం ఇక్కడే అంతమయిపోతే బావుండు’ అనుకుంటాడు అ-హాన్. ఆ రోజు తర్వాత బర్డీ మళ్ళీ అ-హాన్‌ని కలవడు. ఇద్దరూ ఒకసారి మాత్రం ఫోన్లో మాట్లాడుకుంటారు. ఒక ప్రేమగీతం వింటూ ఇద్దరూ విలపిస్తారు.

చాలా ఏళ్ళ తర్వాత స్కూలు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అ-హాన్ వెళతాడు. అతనికిప్పుడు నడివయసు. బర్డీ కోసం వెతుకుతాడు కానీ బర్డీ అక్కడ ఉండడు. అతని పాత స్నేహితులందరూ ఉంటారు. అ-హాన్‌కి బర్డీ ఎలా ఉన్నాడో అని కుతూహలం పుడుతుంది. అతను బన్-బన్‌ని వెతికి ఆమెని కలుస్తాడు. బర్డీ, బన్-బన్ పెళ్ళిచేసుకుని విడిపోయారు. వారికి పిల్లలు కూడా కలిగారు. “అబ్బాయిలకి అబ్బాయిల మీద కలిగే ఆకర్షణ స్వభావసిద్ధంగా వస్తుందని నాకు తర్వాత అర్థమయింది. బర్డీ దానితో పోరాడాలని ప్రయత్నించాడు. అతని జీవితమూ పాడయింది. నా జీవితమూ పాడయింది. ఎంత ఘోరం!” అని కన్నీరు పెడుతుంది. స్వలింగప్రియులు అప్పట్లో పెళ్ళి చేసుకుని తమ స్వభావాన్ని మార్చుకోవచ్చని అనుకునేవారు. ఇప్పుడు వారు పెళ్ళికి దూరంగా ఉన్నా కొందరు తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. అలా చేస్తే ఇద్దరి జీవితాలూ పాడవుతాయి. ఆకర్షణ లేని చోట దాంపత్యం నిలబడదు. ఆవేశంలో లైంగిక సంబంధం ఏర్పడవచ్చు కానీ దంపతుల మధ్య ఉండాల్సిన అనురాగం ఉండదు. ఆకర్షణ పక్కకి లాగుతూ ఉంటుంది. తలిదండ్రులు సమాజానికి భయపడవచ్చు. కొన్ని దేశాల్లో స్వలింగవివాహాలు చట్టబద్ధం అయ్యాయి. కొన్ని దేశాల్లో ఇంకా కాలేదు. కనీసం ఇష్టం లేని పెళ్ళికి బలవంతం చేయకుండా ఉంటే చాలు. ఇమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయకుండా ఉంటే చాలు. ఎన్నో కలలు కనే ఒక అమ్మాయి బతుకు పాడు చేయటం తప్పు. మనవలు కావాలి అనేవారుంటారు. అది పిల్లల ఇష్టం. వారి జీవితాలని శాసించే అధికారం తలిదండ్రులకి ఉండదు.

తర్వాత అ-హాన్ కెనడా వెళతాడు. అక్కడ తన స్కూల్ ఫాదర్ సమాధిని దర్శిస్తాడు. ఆ ఫాదర్ కూడా స్వలింగప్రియుడే. తన కోరికలని జయించటానికి అతను మతం ఆసరా తీసుకున్నాడు. చివరికి తన కోరికలు మారవని తెలుసుకున్నాడు. కానీ మతం ప్రభావంతో తాను నరకానికి పోతానని నమ్మాడు. మతాధికారులు స్వలింగప్రియుల్ని నేరస్థులుగా చూశారు. ఒకప్పుడు స్వలింగప్రియులు లేరేమో. ఇప్పుడు ఉన్నారనేది నిజం. ఎప్పుడో రాసిన మతగ్రంథాలని ఇప్పుడు అన్వయిస్తే కుదరదు. అయినా మన ఋషులు దార్శనికులు. వారు భవిష్యద్దర్శనం చేసే ఉంటారు. ఎక్కడో రాసే ఉంటారు. కానీ మధ్యలో వచ్చిన వారు ఆ కాలానికి అవసరం లేదు కాబట్టి వాటిని మరుగుపరచి ఉంటారు. ఇది ఒక ఊహ మాత్రమే. చెప్పొచ్చేదేమిటంటే మతం పేరుతో స్వలింగప్రియులని భయపెట్టడం కూడా తప్పే. పోప్ ఫ్రాన్సిస్ ఒకప్పుడు స్వలింగసంపర్కాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఆమోదిస్తున్నాని చెప్పారు. దేవుడు మారాడా? లేదు. దేవుణ్ణి అనుసరించేవారు మారారు. అంతే.

బర్డీ కూడా కెనడాలో ఉంటాడు. ఫాదర్‌కి శ్రద్ధాంజలి ఘటించటానికే అతనూ వచ్చాడు. అ-హాన్ అతనిని ఒక బార్లో చూస్తాడు కానీ పలకరించడు. ఒకరోజు రాత్రి బర్డీ వీధిలో అకస్మాత్తుగా అ-హాన్ భుజం తట్టి పలకరిస్తాడు. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంటుంది. అ-హాన్ వెనక్కి తిరిగి బర్డీని చూసి అవాక్కయి గుండె పట్టుకుని ఉండిపోతాడు. అమితంగా ప్రేమించినవారు ఒక్కసారిగా ఎదుటపడితే గుండె లయ తప్పుతుంది. ఎంత వయసు వచ్చినా అది మాత్రం మారదేమో. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. బర్డీ “ప్రపంచం ఎంత మారిపోయింది. అప్పట్లో మన విషయం బయటపడితే మన అంతు చూసేవారు. అప్పట్లో నేను నిన్ను ఎంతో ప్రేమించాను” అంటాడు. అ-హాన్ ఒక్కసారి అలా నిలబడిపోతాడు. ఇన్నాళ్ళకి అతనిలో ఏ మూలో ఉన్న సందేహం తీరింది. బర్డీ ప్రేమించానని ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. తెల్లవారుతూ ఉంటుంది. అ-హాన్ బస చేసిన హోటల్ వస్తుంది. ఇద్దరూ వీడ్కోలు తీసుకుంటారు. ‘వనాన్’ అని పదే పదే చెప్పుకుంటారు. బర్డీ తన హోటల్ వైపు నడుస్తాడు. అ-హాన్ తిరిగి బర్డీ దగ్గరకి వస్తాడు. “నీ హోటల్ దాకా తోడు వస్తాను” అంటాడు. ఇంతలో ఏవో మాటలు వినపడతాయి. అటు వైపు చూస్తే స్కూలు వయసులో ఉన్న అ-హాన్, బర్డీ ఒకరినొకరు ఆటపట్టిస్తూ, పాట పాడుతూ వీధి చివరికి వెళ్ళి మలుపు తిరిగి కనుమరుగవుతారు. దూరంగా తూరుపు ఆకాశంలో వెలుతురు పరుచుకుంటుంది. ఇలా కవితాత్మకంగా చిత్రం ముగుస్తుంది.

ప్రేమ ఎవరి మీద ఉన్నా అది ప్రేమే. ఇద్దరు మనుషులకి ఇష్టమైతే దాన్ని అమోదించాలి. అడ్డు చెప్పటానికి తల్లిదండ్రులకి వేరే కారణాలు ఉండొచ్చు. కానీ వారిద్దరూ మగవారని లేదా వారిద్దరూ ఆడవారనే ఒకే ఒక్క కారణంతో అడ్డు చెప్పకూడదు. అదే ఈ చిత్రం సందేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here