[సంచిక పాఠకుల కోసం ‘దేర్ విల్ బి బ్లడ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
కథల్లో కానీ, సినిమాల్లో కానీ ఒకరు చెడ్డవారైతే వారికి వ్యతిరేకంగా ఉన్నవారు మంచివారుగా చూపించటం మామూలే. కానీ ఒక చెడ్డ మనిషికి వ్యతిరేకంగా మరో చెడ్డ మనిషి ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో చాలానే వచ్చాయి. అయితే వాటిలో ఒక పాత్ర మీద సానుభూతి కలిగించేలా చేయటం మామూలుగా జరుగుతుంది. ఎటువంటి సానుభూతికి అవకాశం లేకుండా ఇద్దరు చెడ్డ మనుషుల కథ చూపించిన చిత్రం ‘దేర్ విల్ బి బ్లడ్’ (2007). ‘రక్తం చిందక తప్పదు’ అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో ఆధునిక సమాజ పోకడల మీద వ్యాఖ్యానం ఉంటుంది కానీ పరిష్కారం ఉండదు. కాకపోతే కొంతమందికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనిపించేలా చేస్తుంది ఈ చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.
1902లో డ్యానియల్ అమెరికాలో చమురు వ్యాపారం మొదలుపెడతాడు. భూమి కొని చమురు బావులు తవ్వుతాడు. అతనితో పాటు పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పనివాళ్ళలో ఒకతనికి నెలల వయసున్న కొడుకు ఉంటాడు. ఆ పనివాడు ప్రమాదంలో మరణిస్తాడు. డ్యానియెల్ అతని కొడుకుని చేరదీస్తాడు. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే మద్యం రుచి చూపించటానికి వెనుకాడడు. డ్యానియెల్‌కి ప్రేమ చూపించటం తెలియదు. అతని దృష్టంతా డబ్బు సంపాదన మీదే. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. 1911 నాటికి పిల్లవాడు పదేళ్ళవాడవుతాడు. అతని పేరు ఎచ్.డబ్ల్యూ అని పొడి అక్షరాలు మాత్రమే సినిమాలో చెబుతారు. అతను ఎప్పుడూ డ్యానియెల్ తోనే ఉంటాడు. డ్యానియెల్ అతన్ని తన భాగస్వామి అని చెప్పుకుంటాడు. ఒకరోజు పాల్ అనే యువకుడు డ్యానియల్ దగ్గరకి వస్తాడు. తమ భూమిలో చమురు నిక్షేపాలు ఉన్నాయని చెబుతాడు. డ్యానియల్ అతన్ని అనేక విధాల ప్రశ్నించి కానీ అతన్ని నమ్మడు. అతనికి ఐదు వందల డాలర్లు ఇచ్చి పంపిస్తాడు. అతను మోసం చేసినట్టు తేలితే అతన్ని వదలనని అంటాడు. పాల్ మళ్ళీ చిత్రంలో కనపడడు. అతను ఆ ఐదు వందల డాలర్లు తీసుకుని తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అతనికి అది పెట్టుబడి. అప్పట్లో అది పెద్ద మొత్తమే.
పాల్‌కి ఒక కవల సోదరుడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. డ్యానియల్ వారి తండ్రిని కలుస్తాడు. కముజు పిట్టలని వేటాడతానని అతని భూమిలో తిరగటానికి అనుమతి తీసుకుంటాడు. ఆ భూమి వందల ఎకరాలు ఉంటుంది. అంతా బంజరు భూమి. కొడుకుతో కముజు పిట్టల్ని వేటాడటానికి వెళతాడు. అది ఒక మిష మాత్రమే. చమురు ఉందో లేదో చూడాలని అతని అసలు ఉద్దేశం. ఒకచోట చమురు భూమి పైకి ఉబికి వచ్చి ఉంటుంది. భూమి అంతా తనకి అమ్మమని డ్యానియెల్ పాల్ తండ్రిని అడుగుతాడు. మూడు వేల ఏడు వందల డాలర్లు ఇస్తానంటాడు. పాల్ సోదరుడు ఈలై. అతనికి తమ భూమిలో చమురు ఉందని తెలుసు. అతను ఒక మతప్రబోధకుడు. చర్చికి పది వేల డాలర్లు ఇవ్వమని బేరమాడతాడు. ఒకవేళ చమురు బావులు తవ్వితే, అందులో చమురు పడితే మరో ఐదు వేలు ఇస్తానంటాడు డ్యానియెల్. ఒప్పందం కుదురుతుంది.
డ్యానియెల్ తన కొడుక్కి తాజా గాలి అవసరమని అందుకే భూమి కొంటున్నానని ఈలై తండ్రితో అంటాడు. కొడుకుని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకే భూమి దక్కించుకోవాలని అతని పథకం. సాటి మనిషిని మోసం చేయాలనే దురాలోచన. ఈలై తక్కువవాడేమీ కాదు. చర్చి పేరు చెప్పి పదివేలు అడుగుతాడు. డ్యానియెల్‌కి దేవుడంటే నమ్మకం లేదు. దేవుడి పేరు చెప్పి డబ్బు చేసుకోవాలని చూస్తున్నాడని ఈలైని ద్వేషిస్తాడు. ఈలైకి కీర్తికండూతి ఎక్కువ ఉంటుంది. డ్యానియెల్ తవ్వకాలు మొదలు పెడుతుంటే అతను వచ్చి ఆశీర్వాదం చేస్తానని అంటాడు. పని మొదలు పెట్టే ముందు అందరి ముందూ తనని ఆశీర్వాదం చేయటానికి ఆహ్వానించమంటాడు. డ్యానియెల్‌కి లోపల కోపం ఉన్నా సరే అంటాడు. సరిగ్గా పని మొదలు పెట్టే సమయానికి ఈలై చెల్లెలు మేరీని పిలిచి ఆమె సమక్షంలో తవ్వకం యంత్రాన్ని మొదలుపెట్టిస్తాడు. ఈలైకి డ్యానియెల్ మీద ద్వేషం మొదలవుతుంది. ఇలా ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకోవటం మొదలుపెడతారు.
ఎచ్.డబ్యూ, మేరీ స్నేహం చేస్తారు. మేరీ ప్రార్థన చేయకపోతే వాళ్ళ నాన్న కొడతాడని డ్యానియెల్‌కి చెబుతాడు ఎచ్.డబ్ల్యూ. తవ్వకాల ప్రారంభం జరిగాక మేరీ ఆడుకుంటుంటే డ్యానియెల్ ఆమెని ఆపి మాట్లాడతాడు. “ఇక నిన్నెవరూ కొట్టరులే. నిశ్చింతగా ఉండు” అంటాడు డ్యానియెల్. ఆమె తండ్రి అక్కడే ఉంటాడు. డ్యానియెల్ వంక కాస్త కోపంగా, కాస్త భయంగా చూస్తాడు. డ్యానియెల్ ఆ విధంగా ఆ ప్రాంతానికి తానే పెత్తందారుని అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇక్కడ గూడార్థం ఏమిటంటే డబ్బు రాబోతోంది కదా, ఇక దేవుడి ప్రార్థన చేయకపోయినా పెద్దవాళ్ళు పట్టించుకోరు అని. అంటే పేదవాళ్ళు పని చేయకుండా దేవుడిని ప్రార్థిస్తారని, డబ్బు రాగానే దేవుణ్ని మర్చిపోతారని, ఇది ఆత్మవంచన అతని భావన.
తవ్వకం మొదలవుతుంది. ఇంకా చమురు పడదు. ఒకరోజు ఒక కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తాడు. డ్యానియెల్ అతని అంత్యక్రియల నిమిత్తం ఈలైని కలవటానికి అతని చర్చికి వెళతాడు. అక్కడికి కొంతమంది ప్రార్థన కోసం వస్తారు. ఈలై తనకు దేవుడి ఆదేశం అందిందని, ఒకావిడ కీళ్ళ నొప్పులు పోగొడతానని గట్టిగట్టిగా అరుస్తూ “ఓ భూతమా! ఈమె శరీరాన్ని వదిలిపో” అంటాడు. అందరూ కేరింతలు కొడతారు. డ్యానియెల్ ఉక్రోషంగా చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళాక డ్యానియెల్ ఈలైతో మాట్లాడతాడు. ఈలై “నేను ఆశీర్వాదం చేసి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు” అంటాడు. డ్యానియెల్ పట్టించుకోడు. “చర్చికి మరమ్మత్తులు చేస్తున్నారట కదా?” అంటాడు. “అవును. భక్తులు పెరుగుతున్నారు. విస్తరించాలి” అంటాడు ఈలై. “చూశాను. గొప్ప ప్రదర్శన చేశావు! (It was a goddamn hell of a show)” అంటాడు డ్యానియెల్. అందులో వ్యంగ్యం ఉంటుంది. ‘హేయమైన నాటకం ఆడుతున్నావు’ అనే అర్థం వస్తుంది. డ్యానియెల్ భూమిని పిండుతున్నాడు. ఈలై మనుషుల నమ్మకాన్ని పిండుకుంటున్నాడు. ‘మా సంపద కొల్లగొడుతున్నావు’ అని ఈలై అంటాడు. ‘మనుషుల్ని వెర్రివాళ్ళని చేస్తున్నావు’ అని డ్యానియెల్ అంటాడు. ఇద్దరు చేసేదీ మోసమే. కానీ తమ మోసాన్ని బయటకి ఒప్పుకోరు. అవతలి వారి మోసాన్ని దెప్పి పొడుస్తూ ఉంటారు.
ఒకరోజు ఎచ్.డబ్ల్యూ తవ్వకం జరిగే చోట ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. ఇంతలో సహజవాయువు పెద్ద శబ్దం చేస్తూ పైకి తన్నుకొస్తుంది. ఎచ్.డబ్ల్యూ ఎగరి దూరంగా పడతాడు. బావి నుంచి చమురు ఎగసిపడుతుంది. డ్యానియెల్ పరుగెత్తుకుని వచ్చి ఎచ్.డబ్ల్యూని తీసుకుని తన ఆఫీసు గదికి తీసుకువెళతాడు. విస్ఫోటం వల్ల ఎచ్.డబ్ల్యూకి వినికిడి శక్తి పోతుంది. ఇంతలో చమురు బావిలో మంటలు ఎగసిపడతాయి. డ్యానియెల్ ఎచ్.డబ్ల్యూని వదిలి అక్కడికి వెళతాడు. అతని సహచరుడు దీనవదనంతో మంటలను చూస్తూ ఉంటాడు. డ్యానియెల్ “అలా బిక్కమొహం పెడతావేం? మన కాళ్ళ కింద చమురు సముద్రమే ఉంది. డబ్బే డబ్బు” అంటాడు. అతను “ఎచ్.డబ్ల్యూ క్షేమమేనా?” అని అడుగుతాడు. “లేదు. వాడికి చెముడు వచ్చింది” అంటాడు. కొడుక్కి చెముడు వచ్చిందని బాధ లేదు. డబ్బు రాబోతోందని సంబరపడతాడు. ఈ మొత్తం సన్నివేశం, అందులో సంగీతం ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తాయి. ప్రకృతి శక్తి ఎలా ఉంటుందో, మనిషి ప్రకృతిని దోచుకోవటం మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపటానికి ఇది నాందీవాక్యంలా ఉంటుంది.
ఎచ్.డబ్ల్యూకి వైద్య పరీక్షలు జరుగుతాయి. వినికిడి శక్తి లేక అతను కుంగిపోతాడు. డ్యానియెల్ అతన్ని సముదాయించలేక అతనికి పాలల్లో మద్యం కలిపి ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా అతన్ని మత్తుగా పడుకోబెట్టి తన పనులు చూసుకుంటాడు. బావిలో చమురు పడటంతో ఈలై డ్యానియెల్ దగ్గరకి వచ్చి తనకి ఇవ్వాల్సిన ఐదు వేల డాలర్లు ఇవ్వమని అడుగుతాడు. డ్యానియల్ కోపంతో అతన్ని కొడతాడు. “నువ్వు మనుషుల బాధలను పోగొడతావు కదా. మా అబ్బాయికి చెముడు పోయేలా చెయ్యవేం?” అని అతన్ని కింద పడేసి, జుట్టు పట్టి లాగి అవమానిస్తాడు. అక్కడున్నవాళ్ళందరూ చూస్తూ ఉండిపోతారు. ఈలై ఆక్రోశిస్తాడు. కానీ ఏమీ చేయలేడు. డ్యానియెల్ బలవంతుడు. ఈలై ఇంటికి వెళ్ళి తన తండ్రితో “వాడితో ముందూ వెనకా చూడకుండా ఒప్పందం చేసుకున్నావు” అని తండ్రి మీద దాడి చేస్తాడు. డ్యానియెల్‌ని ఏమీ అనలేక సొంత తండ్రినే కొడతాడు. ఇదేనా మతం నేర్పించే సహనం? ఈలై దుర్మార్గుడనే విషయంలో సందేహం ఉంటే ఇక్కడితో తీరిపోతుంది. తర్వాత ఎవరికి పైచేయి అయిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
చిత్రం మొదట్లో డ్యానియెల్ బంజరు భూమిలో కొండల మధ్య వెండి కోసం తవ్వకం చేస్తూ ఉంటాడు. కొండలు చూపించిన తర్వాత డ్యానియెల్‌ని చూపిస్తాడు దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్. కాసేపటికి డ్యానియెల్ జారి తాను తవ్విన లోతైన గోతిలో పడిపోతాడు. కాలు విరుగుతుంది. అయినా గోతిలోనుంచి బయటపడి దేకుతూ వెళతాడు. అప్పుడు మళ్ళీ కొండల్ని చూపిస్తాడు దర్శకుడు. సంగీతం కూడా గుబులు పుట్టించేదిగా ఉంటుంది. ప్రకృతి నిర్లిప్తంగా ఉంటుందని ఆ విధంగా చెబుతాడు దర్శకుడు. ప్రకృతిని అధీనంలో ఉంచుకునేది దైవం. ఆ దైవం అనుగ్రహం లేకపోతే కష్టాలు తప్పవు. డ్యానియెల్ దైవాన్ని నమ్మడు. ఆ విషయానికొస్తే ఎవర్నీ నమ్మడు. మరో పక్క ఈలై దైవాన్ని నమ్మేవారిని మోసం చేస్తూ ఉంటాడు. అలాంటివారినీ దైవం క్షమించదు.
చిత్రం మొదట్లో చాలాసేపు సంభాషణలు ఉండవు. డ్యానియెల్ తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడు, తన బిడ్డతో అతనికి ఉన్న సంబంధం ఎలాంటిది అని ఒక దృశ్యమాలికలో చూపిస్తాడు దర్శకుడు. ‘Show, don’t tell’ (చెప్పకు, చూపించు) అనే పద్ధతిని పాటిస్తాడు. పాల్, ఈలై కవలలు కావటంతో ఎవరు ఎవరు అనేది కాస్త తికమకగా ఉంటుంది. పాల్ మొదటిసారి డ్యానియెల్‌ని కలిసినపుడు “మీరు ఏ చర్చికి వెళతారు?” అని అడుగుతాడు. దీని వెనక అసలు అంతరార్థం ఏమిటంటే పాల్ తన తండ్రి, ఈలైల మతవిశ్వాసం చూసి విసిగిపోయాడు. ఈలైది బూటకపు విశ్వాసం అని కూడా తెలిసే ఉంటుంది. డ్యానియెల్ “నాకు అన్ని మతాలు ఇష్టమే” అంటాడు. అది అతని లౌక్యం. పాల్ ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు? డ్యానియెల్ దేవుడిని నమ్మేవాడైతే పాల్‌కి పెద్ద ఉపయోగం ఉండదు. దేవుడిని నమ్మని వాడైతే తనకి లాభం. తన తండ్రికి, ఈలైకి కూడా బుద్ధి చెబుతాడు. కలియుగంలో దైవభక్తి క్షీణించిదని ఈ విధంగా చెప్పాడు దర్శకుడు. దైవభక్తికి ప్రాతిపదిక ధర్మబద్ధమైన జీవనం. అది లేకుండా కేవలం మహిమలని ప్రచారం చేసేవారు ఈలై లాంటివాళ్ళు. డ్యానియెల్ లాంటివాళ్ళు నాస్తికులు. డబ్బు సంపాదనే పరమావధి. కానీ డ్యానియెల్ కన్నా ఈలై యే సమాజానికి హానికరం.
ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలతో పాటు మొత్తం ఎనిమిది విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. ఉత్తమ నటుడిగా డ్యానియెల్ డే-లూయిస్ కి, ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా రాబర్ట్ ఎల్స్విట్ కి ఆస్కార్లు దక్కాయి. ఈలైగా పాల్ డ్యానో నటించాడు. అతను డ్యానియెల్‌కి పూర్తి భిన్నంగా ఉంటాడు. వయసులో చాలా చిన్నవాడు. మృదువుగా మాట్లాడతాడు. డ్యానియెల్ మొరటుగా ఉంటాడు. అతని మాటతీరు కూడా భేషజంగా ఉంటుంది. డ్యానియెల్ డే-లూయిస్ ఆ మాటతీరుని ప్రత్యేకంగా అభ్యాసం చేశాడు. ఆ సంవత్సరం అవార్డులలో అతనికి ఎవరూ పోటీనివ్వలేకపోయారు. అతను తన నటజీవితంలో ఇప్పటి దాకా మూడు ఆస్కార్లు గెలుచుకున్నాడు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
ఒకరోజు హెన్రీ అనే వ్యక్తి డ్యానియెల్ ఇంటికి వస్తాడు. డ్యానియెల్‌కి సవతి తమ్ముడినని చెబుతాడు. ఇద్దరికీ తండ్రి ఒకరే. హెన్రీ తల్లి రాసిన ఉత్తరం పట్టుకొస్తాడు. డ్యానియెల్ మొదట అతన్ని నమ్మడు, కానీ ఉత్తరం చూశాక నమ్ముతాడు. హెన్రీ ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమంటాడు. డ్యానియెల్ అతన్ని తన ఇంట్లోనే ఉండమంటాడు. కొడుకు చెవిటివాడు కావటంతో అతనికి మాట్లాడటానికి ఇంకో మనిషి అవసరం ఉంది. ఎంత కఠినాత్ముడైనా పిలిస్తే పలికేవారుండాలని కోరుకుంటాడు. రక్తసంబంధం ఉంటే ఇంకా మంచిది. ఒక రాత్రి ఎచ్.డబ్ల్యూ హెన్రీ మంచం దగ్గర నిప్పు పెడతాడు. అతనికి హెన్రీ అంటే అసూయ. తనకి, తన తండ్రికి మధ్య వచ్చాడని అనుకుంటాడు. డ్యానియెల్, హెన్రీ మంటలని ఆర్పుతారు. డ్యానియెల్ కొడుకుని వేరే ఊరికి పంపేస్తాడు. అక్కడ బధిరుల పాఠశాలలో చేర్పిస్తాడు. కొడుకు మీద డ్యానియెల్‌కి ప్రేమ లేకపోలేదు. అతను మనుషుల్ని తొందరగా నమ్మడు. పిల్లలు కల్మషం లేని వారని అతనికి తెలుసు. అందుకే ఎచ్.డబ్ల్యూ మీద, మేరీ మీద ప్రేమ ఉంటుంది. కానీ చెవిటివాడైన పిల్లవాడి బాగోగులు చూసుకోలేక ఇబ్బంది పడతాడు. అంతే కాదు, వ్యాపారానికి సంబంధించి ఏ ఒప్పందాలు జరిగినా పిల్లవాడు తోడు ఉండేవాడు. పిల్లవాడిని చూసి అవతలివారు కాస్త మెత్తబడతారని డ్యానియెల్ దురాలోచన! ఇప్పుడు పిల్లవాడు తన లోకమేదో తనది అన్నట్టు ఉంటాడు. ఆ వయసులో వినికిడి పోవటం అంటే ఎంతో క్షోభ. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం కాని వయసు. పైగా అసూయ బయల్దేరింది. అందుకని డ్యానియెల్ కొడుకుని పంపేస్తాడు. బాధ ఉంటుంది కానీ తప్పదు అన్నట్టు ఉంటాడు.
డ్యానియెల్ వ్యాపారాన్ని కొనుగోలు చేయటానికి స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీ వాళ్ళు పది లక్షల డాలర్లు ఇస్తామంటారు. డ్యానియెల్‌కి వారి మీద అక్కసు. తాను కష్టపడి మట్టి తవ్వితే వీళ్ళు వచ్చి తన కష్టాన్ని తన్నుకుపోతున్నారు అని అతని భావన. అందుకని “మీరు నాకు పది లక్షల డాలర్లు ఇస్తారు సరే. తర్వాత నేను ఏం చెయ్యాలి?” అంటాడు. కంపెనీ ప్రతినిధి విస్తుపోతాడు. “మీ అబ్బాయి క్షేమం చూసుకోండి” అంటాడు. డ్యానియెల్‌కి సందు దొరికినట్టుంటుంది. “నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నువ్వు చెబుతావా? ఒకరోజు నీ ఇంటికొచ్చి నువ్వు పడుకుని ఉండగా నీ గొంతు కోస్తాను” అంటాడు. అతనికి వ్యాపారం అమ్మటం ఇష్టం లేదు. కానీ సూటిగా చెప్పడు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అనే సాకు చెప్పి వారిని అవమానిస్తాడు. అతని ఉన్మాదానికి వాళ్ళు విస్తుపోతారు. డ్యానియెల్‌కి మనుషుల మీద తీవ్రమైన ద్వేషం ఉంటుంది. అందరూ స్వార్థపరులే అనే భావన నరనరాన ఉంటుంది. మరి తన సంగతి ఏమిటి? అతనికి తన మీద కూడా ఏ మూలో ద్వేషం ఉంది. అది అతనికే తెలియదు. ఆత్మపరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. మనిషి ఆత్మపరిశీలన చేసుకోవటానికి భయపడతాడు. అందుకే ఏవో వ్యాపకాలు పెట్టుకుంటాడు. డ్యానియెల్ కూడా అంతే. వ్యాపారంలో మునిగిపోతే బాహ్యప్రపంచాన్ని శాసించవచ్చు. తనలోకి తాను తొంగి చూసుకునే అవసరం ఉండదు. కానీ వయసు మీద పడితే ఏం చేస్తాడు? ప్రతి మనిషి తన చుట్టూ జరామృత్యువులు చూస్తూ ఉన్నా తనకి మాత్రం అవి రావని అనుకుంటాడు. ఇదే మాయ.
ఒకరోజు డ్యానియెల్ హెన్రీతో చిన్నప్పుడు తమ ఊళ్ళో ఉన్న ఒక అందమైన ఇంటి గురించి ప్రస్తావిస్తాడు. అలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానంటాడు. హెన్రీ కూడా ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు. “నువ్వు కావాలంటే ఇప్పుడు అలాంటి ఇల్లే కట్టుకోవచ్చు” అంటాడు. “ఆ ఇల్లు ఇప్పుడు చూస్తే నాకు కడుపులో దేవుతుందేమో” అంటాడు డ్యానియెల్. హెన్రీ మాట పొడిగించటం ఇష్టం లేక “తిండి తిన్నాక అమ్మాయిలను తెచ్చుకుందాం” అంటాడు. డ్యానియెల్ “వాళ్ళకి మద్యం ఇచ్చి వారిని పీచ్ ట్రీ డ్యాన్స్‌కి తీసుకెళదాం” అని హాస్యమాడతాడు. పీచ్ ట్రీ డ్యాన్స్ అంటే వారి ఊరిలో జరిగే ఏదో రహస్య వ్యవహారమన్నమాట. అయితే హెన్రీ “సరే” అని ఊరుకుంటాడు. తెలిసినవాడైతే ఆ ఙాపకంతో అతను కూడా ఏదైనా హాస్యమాడేవాడు. అతనికి తెలియదంటే..? డ్యానియెల్‌కి అతని మీద అనుమానమొస్తుంది. ఇక్కడ డ్యానియెల్ డే లూయిస్ నటన ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. హెన్రీ తన తమ్ముడు కాదేమో! మరి ఎవరు? ఎందుకు వచ్చాడు? ఆ రోజు రాత్రి వాళ్ళు అడవిలో పడుకుని ఉండగా డ్యానియెల్ లేచి తుపాకీతో హెన్రీని బెదిరిస్తాడు. హెన్రీ నిజం చెబుతాడు. “నేను ఒకతన్ని కలిశాను. నీ తమ్ముడినని చెప్పాడు. నీ దగ్గరకి వద్దామనుకున్నాడు కానీ డబ్బు లేదు. క్షయతో మరణించాడు. అతన్ని నేను చంపలేదు. అతని పేరు వాడుకున్నానంతే. నన్ను వదిలెయ్. నేను వెళ్ళిపోతాను” అంటాడు. డ్యానియెల్ అతన్ని చంపి పాతిపెట్టేస్తాడు. తర్వాత బాధతో రోదిస్తాడు. ఒక్కడిని నమ్మితే వాడు కూడా మోసగాడిగా తేలాడు.
ఆలోచించి చూస్తే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినవారందరూ ఎంతో కష్టపడి పైకొచ్చారు. కానీ కొన్ని అక్రమాలు కూడా చేసే ఉంటారు. అయితే వాళ్ళు వ్యాపారాలు చేయబట్టే అభివృధ్ధి సాధ్యమయింది. సంపద పెరిగింది. సంపద ముఖ్యమా, సంతృప్తి ముఖ్యమా? సంతృప్తి పడితే సంపద పెరగదుగా అనేవాళ్ళుంటారు. గాంధీజీ “ఈ భూమి మనిషి అవసరాలని తీర్చగలదు, కానీ మనిషి ఆశలని తీర్చలేదు” అన్నారు. ఇప్పుడు భూమి ఏ పరిస్థితిలో ఉంది? యుద్ధాలు ఒక పక్క, ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క. అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి కోసం కర్బన ఉద్గారాలు పెంచేసి ఇప్పుడు వేరే దేశాలని కర్బన ఉద్గారాలు తగ్గించుకోమంటున్నాయి. పెరిగిన కర్బన ఉద్గారాల వల్లే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు దాపురిస్తున్నాయి. డ్యానియెల్ లాంటి వాళ్ళు సంపద పెంచి ఉండొచ్చు కానీ హాని కూడా చేశారు. వారు తమ ఆకాంక్షలను తగ్గించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకరు మానేస్తే సరిపోతుందా అనేది సరైన వాదన కాదు.
డ్యానియెల్ చమురు రవాణా ఖర్చులు తగ్గించటానికి సముద్రం దగ్గరకి ఒక పైపులైను వేయాలనుకుంటాడు. దాని కోసం యూనియన్ ఆయిల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ సంస్థకి ఉన్న భూమి లోనుంచి పైపులైను వేయాలి. అయితే మధ్యలో కొంత భూమి బ్యాండీ మరో ఆసామికి చెందినది. బ్యాండీతో మాట్లాడటానికి వెళతాడు కానీ అతను ఊళ్ళో లేకపోవటంతో వెనక్కి వస్తాడు. హెన్రీ పేరుతో వచ్చిన వ్యక్తిని డ్యానియెల్ చంపిన తర్వాత బ్యాండీ అతన్ని కలవటానికి వస్తాడు. బ్యాండీకి డ్యానియెల్ అంటే అయిష్టం. అతను పాపభీతి లేనివాడని బ్యాండీ అభిప్రాయం. అతను ఒక వ్యక్తిని చంపాడని కూడా బ్యాండీకి తెలుసు. డ్యానియెల్ ఆ శవాన్ని పాతిపెడుతున్నప్పుడు బ్యాండీ మనిషి ఎవరో చూశారు. బ్యాండీ “నా భూమిలో పైపులైను వేయటానికి అనుమతిస్తాను. కానీ ఒక షరతు. నువ్వు యేసు రక్తంతో పరిశుద్ధం కావాలి” అంటాడు. చర్చిలో బాప్టిజం అనే పద్ధతి ఉంటుంది. అది పూర్తి చేస్తే పరిశుద్ధం అయినట్టు. డ్యానియెల్ తప్పించుకుందామని చూస్తాడు. కానీ బ్యాండీకి తాను చేసిన హత్య గురించి తెలుసని తెలిశాక వేరే దారి లేక ఒప్పుకుంటాడు. చర్చికి వస్తాడు. ఈలైకి ఇదే అదును. “పాపులు ఎవరైనా ఉంటే ముందుకి రండి” అంటాడు. బ్యాండీ పక్కనే ఉండటంతో డ్యానియెల్ గత్యంతరం లేక ముందుకి వెళతాడు. ఈలై డ్యానియెల్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతను వ్యభిచారం చేశాడని అతన్ని చెంపదెబ్బలు కొడతాడు. డ్యానియెల్ చేత “నేను పాపిని. నా కొడుకుని వదిలేశాను” అని పదే పదే అనిపిస్తాడు. తర్వాత అతని తలని కడిగి అతన్ని పరిశుద్ధుడిని చేస్తాడు. డ్యానియెల్ “ఇక పైపులైనుకి అడ్డు లేదు” అంటాడు ఎవరికీ వినపడకుండా. ఈలై ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. డ్యానియెల్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తే కాస్త భయంగా చూస్తాడు. డ్యానియెల్ శక్తిమంతుడని ఈలైకి తెలుసు. కానీ అతనికి పగ తీరటం ముఖ్యం. కొన్నాళ్ళకి ఈలై మిషనరీగా మారి ఊరు విడిచి వెళ్ళిపోతాడు.
డ్యానియెల్ నిజంగానే వ్యభిచారం చేశాడా? చేసి ఉండవచ్చు. అయితే అతనికి అన్ని వాంఛల కన్నా ధనదాహమే ఎక్కువ. చమురు వెలికితీతలో ఉన్న తృప్తి అతనికి ఎందులోనూ కలగదు. పైపులైను కోసం అతను ఇష్టం లేకపోయినా చర్చికి వెళ్ళాడు. అతనికి కేవలం లాభం ముఖ్యం కాదు, ఆధిపత్యం కావాలి. నాకు లాభం రావాలి అనుకుంటే తప్పు లేదు. నాకే లాభం రావాలి అనుకోవటం తప్పు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
పైపులైను పని జరుగుతుండగా ఎచ్.డబ్ల్యూని తిరిగి రప్పిస్తాడు డ్యానియెల్. కొడుకుని హత్తుకుని “ఇదే నాకు కావాలి” అంటాడు. పుత్రపరిష్వంగంలో పులకించని తండ్రి ఉంటాడా? ఎచ్.డబ్ల్యూ తండ్రి మీద కోపంగా ఉంటాడు కానీ త్వరలోనే సర్దుకుంటాడు. సౌంజ్ఞల భాష నేర్చుకుంటాడు. పదహారేళ్ళు గడిచిపోతాయి. డ్యానియెల్ కోట్లకి పడగలెత్తుతాడు. ఎచ్.డబ్ల్యూ మేరీని పెళ్ళి చేసుకుంటాడు. ఒకరోజు తండ్రి దగ్గరకి వచ్చి తాను మెక్సికో వెళ్ళి సొంతంగా చమురు తవ్వకాలు చేస్తానని అంటాడు. సౌంజ్ఞల భాషతో ఒక సహాయకుడి ద్వారా తన మాటలు వినిపిస్తాడు. డ్యానియెల్‌కి సౌంజ్ఞల భాష నేర్చుకునే తీరిక ఏది? నిర్దయగా కొడుకు చెవిటితనాన్ని హేళన చేస్తాడు. “నువ్వు ఒక బుట్టలో అనాథవై పడి ఉంటే నేను చేరదీశాను. ఎందుకో తెలుసా? నేను భూములు తీసుకోవాలంటే నీ మొహం చూసి ఆసాములు కరిగి ఒప్పుకుంటారని” అంటాడు కర్కశంగా. అందులో నిజం లేకపోలేదు. అయితే డ్యానియెల్‌కి కొడుకు మీద ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమని ఒప్పుకోవటానికి అతని అహం అడ్డువస్తుంది. “నాకు పోటీ వస్తావా? నీలో నా తత్త్వం లేదు” అంటాడు కొడుకుతో. తాను నిర్దయుడనని తెలుసు. మిగతా మనుషులు నిర్దయులని వారిని ద్వేషిస్తాడు. కొడుకేమో మరీ మెతక వాడని అతన్ని హరిహాసం చేస్తాడు. స్వార్థం ఉంటే తప్పు. స్వార్థం లేకపోతే చేతకానితనం. అందుకే అతనికి శాంతి లేదు. అతని కొడుకు “నాలో నీ తత్త్వం లేకపోవటం నాకు ఆనందమే”. అతనికి తండ్రి అక్రమాలు తెలుసు. తండ్రిని వదిలి వెళ్ళిపోతాడు.
చివరికి ఒకరోజు ఈలై వస్తాడు. డ్యానియెల్ తన భవంతిలో తప్పతాగి పడి ఉంటాడు. బౌలింగ్ రూమ్‌లో ఉంటాడు. బౌలింగ్ అంటే ఒక బంతిని దొర్లించి దూరంగా త్రికోణాకారంలో పెట్టిన చిన్న దిమ్మలను పడగొట్టే ఆట. ఆ దిమ్మలు లోహంతో తయారు చేస్తారు. ఈలై డ్యానియెల్ తో “బ్యాండీ మనవడు హాలీవుడ్ కి వెళ్ళి నటుడిగా స్థిరపడాలనుకుంటున్నాడు. అతని భూమి మీకు అమ్ముతాడు. అక్కడ చమురు తవ్వకాలు చేసుకోవచ్చు. లక్ష డాలర్లు ఇవ్వు. నాకు ఇవ్వాల్సిన ఐదు వేల డాలర్లు వడ్డీతో సహా ఇవ్వు” అంటాడు. “సరే. కానీ ఒక షరతు. నువ్వు బూటకపు ప్రచారకుడవని ఒప్పుకోవాలి. దేవుడంటే ఒక మూఢనమ్మకమని ఒప్పుకోవాలి” అంటాడు డ్యానియెల్. ఈలై మొదట అది నిజం కాదంటాడు కానీ అంత డబ్బు వదులుకోవటం ఇష్టం లేక “నేను బూటకపు ప్రచారకుడిని. దేవుడంటే ఒక మూఢనమ్మకం” అంటాడు నెమ్మదిగా. డ్యానియెల్ అతన్ని ఆ మాట గట్టిగా అనమంటాడు. గట్టిగా అంటాడు ఈలై. తనకి చర్చిలో జరిగిన అవమానానికి డ్యానియెల్ ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. అంతటితో ఆగకుండా “ఆ భూమిలో తవ్వకాలు అయిపోయాయి” అంటాడు. ఈలై ఖంగు తింటాడు. “అదేమిటి అక్కడ యంత్రాలేమీ లేవే?” అంటాడు. “చుట్టూ ఉన్న భూమంతా నాదే. అక్కడున్న యంత్రాలతో ఈ భూమిలోని చమురుని లాగేశాను. నీ దగ్గర ఒక మిల్క్ షేక్ ఉందనుకో. నేను ఇవతలి నుంచి ఒక పొడుగాటి స్ట్రా పెట్టి నీ మిల్క్ షేక్ తాగేసినట్టన్నమాట” అంటాడు పైశాచికంగా డ్యానియెల్. “I drink your milkshake” (నేను నీ మిల్క్ షేక్ తాగుతున్నాను) అనే మాట చిత్రం విడుదలయ్యాక ప్రసిద్ధమయింది. డ్యానియెల్ మాట విని ఈలై కాళ్ళ బేరానికొస్తాడు. “నేను సైతాను కోరల్లో చిక్కుకున్నాను. నాకు డబ్బు అవసరం. ప్లీజ్!” అంటాడు. డ్యానియెల్ అతన్ని ఆ గదిలో తరిమి తరిమి కొడతాడు. చివరికి ఒక దిమ్మ తీసుకుని అతని తలపై మోదుతాడు. ఈలై స్పృహ కోల్పోతాడు. డ్యానియెల్ అతని తలపై మళ్ళీ మళ్ళీ మోదుతాడు. ఈలై చనిపోతాడు. రక్తం కాలువ కడుతుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
ఆధునిక సమాజంలో ధనదాహం పెరిగింది. ధార్మిక జీవనం తగ్గింది. దేవుడిని ఐహికసుఖాలు ఇచ్చేవాడిగా మనిషి మార్చేశాడు. ‘నీకు గుడి కట్టిస్తాను, చర్చి కట్టిస్తాను. పూజ చేస్తాను, ప్రార్థన చేస్తాను. నాకు ఐహిక సుఖాలనివ్వు’ అని బేరం మొదలు పెట్టాడు. దేవుడిని చేరుకోవటానికి శరీరాన్ని ఒక సాధనంగా వాడుకోమంటే శరీరానికి భోగాలు కోరుకోవటానికి దేవుడిని వాడుకుంటున్నాడు. మరి కొందరు దేవుడిని నమ్మటమే మానేశారు. ‘అంతా నా ప్రతిభే. ఇంత చేశాను. ఇంకా సాధిస్తాను’ అనుకుంటారు. మొదటి రకానికి ప్రతినిధి ఈలై ఐతే రెండో రకానికి ప్రతినిధి డ్యానియెల్. ఇద్దరికీ శాంతి లేదు. ఈ కథలో డ్యానియెల్ ది పైచేయి అయింది. కానీ అతను ఒంటరిగా ఉండిపోయాడు. తర్వాత ఏం జరిగిందనేది అప్రస్తుతం. నేటి సమాజానికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పరిష్కారం ఏమీ ఉండదు. పాపం పండేదాకా శిక్షపడదు. డ్యానియెల్‌కి హత్యానేరం మీద శిక్ష పడితే బావుండు అని అనిపిస్తుంది. అలా న్యాయంగా ముగించటం ఒక పద్ధతి. డ్యానియెల్ ఉన్మాదిగా మారాడు అని చెప్పి ముగించాడు దర్శకుడు. ఇలాంటి ఉన్మాదం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు చేసినా ఉన్మాదం ఆగట్లేదు. ‘నాకు ఏ వ్యామోహాలు కలగకుండా ఈ జీవితం వెళ్ళిపోతే చాలు’ అనుకునే రోజులు వచ్చాయి. అలా అనుకోగలగటం కూడా ఈ రోజుల్లో విజయమే.