మరుగునపడ్డ మాణిక్యాలు – 72: అ హీరో

4
13

[సంచిక పాఠకుల కోసం ‘అ హీరో’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ఇ[/dropcap]రాన్ దేశపు చిత్రం ‘అ హీరో’ మొదటిసారి చూసేవాళ్ళకి నా సూచన ఏమిటంటే కథానాయకుడిని గుడ్డిగా నమ్మకండి. సినిమాలలో మామూలుగా ఒక కథానాయకుడిని లేదా నాయికని ముందు నుంచి నమ్మటం మనకు అలవాటు. స్క్రీన్ ప్లే రచయితలు కూడా వారి మీద సానుభూతి కలిగే లాగే రాస్తారు. కథలు కూడా చాలా వరకు చెడు మీద మంచి సాధించిన విజయం చూపిస్తాయి. ఇది గమనించిన రచయిత, దర్శకుడు అస్గర్ ఫర్హదీ ఆ ఫార్ములాని తలకిందులు చేశాడు. మంచిగా కనిపించే నాయకుడు నిజానికి అంత నమ్మదగినవాడు కాకపోతే ఎలా ఉంటుందో చూపించాడు. ఇక్కడ నాయకుడు మేక వన్నె పులి అనాల్సినంత ఘోరాలేమీ చేయడు. కానీ తప్పుడు పనులు చేస్తాడు. నిజజీవితంలో కూడా అందరూ తప్పులు చేస్తారు కదా? అలాగే! కానీ చిత్రంలో నాయకుడు తప్పులు చేస్తున్నా ప్రేక్షకులు అతని మీద సానుభూతి చూపిస్తారు. ఆ సానుభూతిని పక్కన పెట్టి నిష్పాక్షికంగా చూస్తే ఈ చిత్రం కొత్తగా కనిపిస్తుంది. ఇదే ఫర్హదీ ప్రతిభ. మన జీవితంలో ఎవరైనా మనకి అన్యాయం చేసినట్టు అనిపిస్తే ‘ఏమో అతను ఎందుకు చేశాడో? ఏ విపత్కర పరిస్థితిలో చేశాడో?’ అనుకోం కదా? సినిమా నాయకుడైతే మాత్రం అతన్ని సమర్థించటానికి ప్రయత్నిస్తాం. అలా సమర్ధించటం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తాడు ఫర్హదీ. చిత్రం పేరులో కూడా వ్యంగ్యం ఉంది. మనం హీరో అనుకున్న వాడు నిజంగా హీరోయేనా? ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. తెలుగు శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.

రహీమ్ అప్పు చేసి వ్యాపారం పెడతాడు. అయితే అతని భాగస్వామి అతన్ని మోసం చేస్తాడు. రహీమ్ భార్యకి బావగారైన బెహ్రామ్ హామీ సంతకం చేయటంతో అతను అప్పు తీరుస్తాడు. కానీ రహీమ్ తనకి బాకీ ఉన్నాడని కేసు పెడతాడు. ఇరాన్‌లో ఇలాంటి కేసులకి కూడా జైలు శిక్ష పడుతుంది. రహీమ్ జైలుకి వెళతాడు. కొన్నాళ్ళ తర్వాత అతనికి జైలు నుంచి రెండు రోజుల సెలవు దొరుకుతుంది. (ఇదంతా వింతగా అనిపించొచ్చు కానీ ఆ దేశపు పద్ధతులు మనకు తెలియవుగా.) రహీమ్ కొడుకు స్యావష్ మేనత్త దగ్గర ఉంటాడు. రహీమ్ ఆమె ఇంటికే వెళతాడు. ఆమెకి భర్త, ఇద్దరు పిల్లలు. స్యావష్‌కి నత్తి. రహీమ్‌కి విడాకులయ్యాయి. స్యావష్ తల్లి దగ్గర ఎందుకుండడు? తల్లి అతన్ని వద్దనుకుందేమో. పైగా వేరే పెళ్ళికి కూడా సిద్ధపడుతుంది. స్వావష్‌కి ఈ విషయం తెలుసు.

రహీమ్ సెలవు తీసుకుని రావటం వెనక ఒక కారణం ఉంది. అది ఎవరికీ చెప్పడు. అతనికి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె పేరు ఫార్ఖొందే. ఆమెకి ఒక బస్ స్టాప్ దగ్గర ఒక ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. అందులో బంగారపు నాణేలు ఉంటాయి. ఆ నాణేలతో బెహ్రామ్ అప్పు కొంత తీర్చి అతని చేత నిరభ్యంతర పత్రం రాయించుకుని జైలు నుంచి బయటపడాలని రహీమ్ ఆలోచన. డబ్బులు తన స్నేహితుడు ఇస్తాడని తన బావకి చెబుతాడు. మొత్తం బాకీ లక్షా యాభై వేల తొమాన్లు. నాణేల విలువ డెబ్భై ఐదు వేలు. ఫార్ఖొందేని కలుస్తాడు. ఇద్దరూ నాణేలు తీసుకుని బంగారం కొట్టుకి వెళతారు. బంగారం ధర పడిపోయిందని తెలుస్తుంది. నాణేలు అమ్మకుండా వచ్చేస్తాడు రహీమ్. ఆమె అడిగితే “ముందు బెహ్రామ్ ఒప్పుకుంటాడో లేదో అడగాలి” అంటాడు.

బావతో కలిసి బెహ్రామ్ నడిపే దుకాణానికి వెళతాడు. అతను దుకాణంలో లేకపోతే అతని కూతురు అతనికి ఫోన్ చేస్తుంది. రహీమ్ బావ మాట్లాడతాడు. బెహ్రామ్ “నా బాకీ మొత్తం తీర్చాలి. లేకపోతే నేను అతన్ని జైలు నుంచి విడిపించను. అతని జాలి మొహం చూసి మోసపోయాను. ఇక మోసపోదలచుకోలేదు. బంధువులందరూ కలిసి హామీ అయినా ఇవ్వండి” అంటాడు. రహీమ్ బావతో “మొత్తం బాకీ ఇచ్చేస్తే ఈ అవమానం తప్పేది” అంటాడు. బావ హామీ ఇవ్వటానికి సిద్ధపడతాడు. అయితే రహీమ్ అక్క కాస్త లౌక్యంగా “నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకుంటే మాకు కొంచెం భరోసాగా ఉంటుంది” అంటుంది. బావ “రెండు రోజుల సెలవు మీద వచ్చాడు. ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?” అంటాడు. “మీ ఇష్టం” అంటుంది అక్క. రహీమ్‌కి విసుగు వస్తుంది. అయితే అతను బంగారు నాణేలు తిరిగి పోగొట్టుకున్నవారికి ఇచ్చేద్దామని నిర్ణయించుకుంటాడు! అదే ధర్మం అంటాడు. తనకే ఆ నాణేలు దొరికాయని అందరికీ చెబుతాడు. మర్నాడు నాణేలు దొరికిన బస్ స్టాప్ దగ్గర, చుట్టుపక్కల కాయితాలు అంటిస్తాడు. అందులో జైలు ఫోన్ నంబరు రాస్తాడు. మర్నాడు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు.

చిత్రంలో మొదట రహీమ్ కనపడినపుడు అతను ఎవరినో చూస్తూ నవ్వుతూ జైలు బయటికొస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అతను నిజానికి అటుగా వెళ్తున్న బస్సుని ఆపటానికి ప్రయత్నిస్తాడు. ఆ చిరునవ్వు అతను ఒక అస్త్రంలా వాడుతున్నాడనిపిస్తుంది. బయటి వారిని కలిసినపుడు అతను ఎక్కువగా నవ్వుముఖంతోనే మాట్లాడతాడు. బెహ్రామ్ అన్నట్టు అతనిది జాలి మొహం. ఆ ముఖం చూసి మనకి కూడా అతని మీద సానుభూతి కలుగుతుంది. కానీ అతను పైకి కనపడినంత మంచివాడు కాదు. బంగారం ధర పడిపోయిందని, బావ హామీ ఇవ్వటానికి అక్క ఒప్పుకోదని తెలిసిన తర్వాత అతను బంగారు నాణేలు తిరిగి ఇచ్చేస్తానంటాడు. ఒకవేళ బంగారం ధర బావుంటే? బావ హామీ ఇస్తే? నాణేలు తిరిగి ఇచ్చేవాడా? ఇది ఆలోచించమని దర్శకుడు మనకి సవాలు విసురుతాడు. రహీమ్ పైకి మాత్రం ధర్మంగా ప్రవర్తిస్తున్నానని చెప్పుకుంటాడు. ఒకవేళ ధర్మమే ముఖ్యమైతే పోలీసు స్టేషనుకి వెళ్ళి అక్కడ నాణేలు ఇచ్చెయ్యొచ్చుగా? పోలీసుల మీద నమ్మకం లేకపోతే ఫార్ఖొందేనే ఆ నాణేలు తిరిగి ఇచ్చేయమని చెప్పొచ్చుగా? నాణేలు తనకే దొరికాయని ఎందుకు చెప్పాడు? ఏదో లాభం ఆశిస్తున్నాడన్నమాట. ఏమిటది? బాకీ తీర్చలేదని జైలు శిక్ష వేసే దేశంలో.. దొరికిన డబ్బుని తిరిగి ఇస్తే బహుమతి ఎలా ఉంటుంది? అతన్ని అందరూ మహోన్నతుడిగా చూస్తారు. అప్పుడు శిక్ష తప్పించుకునే అవకాశం కూడా వస్తుంది. ఫార్ఖొందే పిచ్చిప్రేమలో అతని దురాలోచనని పసిగట్టలేదు. ఇంతకీ ఆమె ఎవరు? స్యావష్ నత్తి తగ్గించుకోవటానికి వెళ్ళే స్పీచ్ తెరపీ కేంద్రంలో ఆమె పని చేస్తుంటుంది. అక్కడే ఇద్దరూ కలుసుకున్నారు.

ఒకరోజు జైలుకి ఒకామె ఫోన్ చేస్తుంది. ఆ నాణేలు తనవే అంటుంది. రహీమ్ హ్యాండ్ బ్యాగ్ రంగు, పారేసుకున్న చోటు అడిగి ఆమె సరిగ్గా చెప్పిన తర్వాత తన అక్క ఫోన్ నంబరు ఇస్తాడు. అక్కకి ఫోన్ చేసి చెబుతాడు. ఆ స్త్రీ రహీమ్ అక్క ఇంటికి వెళుతుంది. తాను కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఆ నాణేలు కొనుక్కున్నానని, వాటి గురించి తన భర్తకి తెలియదని అంటుంది. తెలిస్తే అతను డబ్బు తగలేస్తాడని అంటుంది. రహీమ్ అక్క ఆ హ్యాండ్ బ్యాగ్ ఆమెకి ఇచ్చేస్తుంది. స్యావష్ కూడా అక్కడే ఉంటాడు. ఆ స్త్రీ అతనికి ఏమైనా కొనుక్కోమని కొంత డబ్బు ఇస్తుంది. జైలు అధికారులకి మొత్తం నాణేల వ్యవహారం తెలుస్తుంది. రహీమ్ కోరుకున్నదే అది. పైకి మాత్రం వినయంగా “నేనేం గొప్ప పని చేయలేదు” అంటాడు. ఒక అధికారికి నాణేలు దొరికినది తన ప్రియురాలికని చెబుతాడు. అతను “తిరిగిచ్చేశావుగా. అది పెద్ద విషయం కాదు” అంటాడు. జైలు అధికారులు ఒక టీవీ చానల్‌కి ఫోన్ చేసి రహీమ్ చేసిన సత్కార్యం గురించి చెబుతారు. టీవీ వారు అతన్ని ఇంటర్వ్యూ చేయటానికి వస్తారు. జైలు అధికారులు రహీమ్‌ని పొగుడుతారు. రహీమ్ “జైలు అధికారులు ఖైదీల సంక్షేమం బాగా చూసుకుంటారు” అని చెబుతాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన ఒక ఖైదీ “బాగానే బోల్తా కొట్టించావు” అంటాడు రహీమ్‌తో. రహీమ్ అదేమిటని ప్రశ్నిస్తే “అధికారులు నీకు ఏం ఉపకారం చేస్తామని చెప్పారు? ఏం లేకుండానే నువ్వు వాళ్ళని పొగిడావా? రెండు వారాల క్రితం ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు చెప్పి ఉండాల్సింది సంక్షేమం గురించి” అంటాడు. ఖైదీ ఆత్మహత్య చేసుకుంటే రహీమ్‌కి ఏంటి? అతనికి తన విడుదలే ముఖ్యం. అందుకని జైలు అధికారులని పొగుడుతాడు. జైలు వారు తామే అతన్ని సంస్కరించామని చెప్పుకోవటానికి సందు దొరికింది. ఎవరి స్వార్థం వారిది. ఆత్మహత్య మరుగున పడిపోతే వారు ఊపిరి పీల్చుకోవచ్చు.

రహీమ్ చేసింది మంచిపనే. కానీ పని కంటే దాని ఉద్దేశం ముఖ్యం. అంతరాత్మకి ఉద్దేశం తెలియదా? రహీమ్ అక్క కూడా అతని సామానులో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ని చూసి అతన్ని ప్రశ్నిస్తుంది. “చచ్చిపోయిన అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ హాండ్ బ్యాగ్ ఎవరిది? మన కుటుంబం పరువు తీయకు” అంటుంది. అతను వేరే దారి లేక దొంగతనం చేశాడని ఆమె అనుకుంటోందని, అందుకే అతను నాణేలు తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాడని అనిపిస్తుంది. కానీ సొంత అక్క అంత మాట అందంటే అతని స్వభావం తెలిసే అంటుంది కదా? ఏమైతేనేం, రహీమ్‌కి పేరు వస్తుంది. అతని బావ బెహ్రామ్‌ని తీసుకుని జైలుకి వస్తాడు. జైలు అధికారిని మధ్యవర్తిత్వం చేసి రహీమ్‌ని విడుదల చేయాలని కోరతాడు. బెహ్రామ్ అతన్ని “నాకు డెబ్భై వేలు ఇస్తామన్నారుగా?” అని అడుగుతాడు. రహీమ్ “ఆ నాణేల విలువ అది. కానీ నా అంతరాత్మ వాటిని అమ్మటానికి ఒప్పుకోలేదు” అంటాడు. బెహ్రామ్ జైలు అధికారితో ఒంటరిగా మాట్లాడతాడు. “వీడికి అబద్ధాలాడటం కొత్త కాదు. వీడి భార్య వీడిని ఎందుకు వదిలేసిందనుకుంటున్నారు? ఈ నాణేల కథ కూడా ఒట్టిదే. అతని భార్య వేరే పెళ్ళి చేసుకుంటోందని తెలిసి ఆమెని తిరిగి పొందాలని ఈ నాటకం ఆడుతున్నాడు” అంటాడు బెహ్రామ్. “భార్య మెప్పు కోసం నాటకం అదుతున్నాడనటం తప్పు. ఇతనికో ప్రియురాలు ఉంది. నాణేలు పారేసుకున్న ఆమె ఫోన్ చేయకపోతే విషయం ఎవరికీ తెలిసేదే కాదు. ఇతను ఎవరికీ చెప్పలేదు” అంటాడు అధికారి. “జైలు ఫోన్ నంబరు ఎందుకిచ్చాడు? అందరికీ తెలియటానికే” అంటాడు బెహ్రామ్. “మీరు చెప్పినవేవీ నాణేల వ్యవహారం ఒట్టిదని నిరూపించటానికి సరిపోవు. అతను మీ డబ్బు తిరిగి ఇచ్చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఇవ్వకపోతే అప్పుడే చర్య తీసుకోండి” అంటాడు అధికారి. బెహ్రామ్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు.

బెహ్రామ్ రహీమ్‌ని ఎందుకు నిందించాడు? అతనికి ఫార్ఖొందే ఎప్పుడు పరిచయమయింది? విడాకులకి ముందేనా? బెహ్రామ్ రహీమ్ మాజీ భార్య బంధువు కాబట్టి అతను రహీమ్‌ని నిందిస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ చిత్రంలో సమాధానం ఉండదు. చిత్రం ముందుకు సాగిన కొద్దీ కాస్త స్పష్టత వస్తుంది. ఇది చాలా సంక్లిష్టమైన కథ. ఎన్నో మలుపులు ఉంటాయి. ఫర్హదీ ఇంతకు ముందు ‘అ సెపరేషన్’, ‘ద సేల్స్ మన్’ మొదలైన చిత్రాలు తీశాడు. రెండిటికీ ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ‘అ సెపరేషన్’ అద్భుతంగా ఉంటుంది. ఈ శీర్షికలో ఆ చిత్రం కూడా విశ్లేషించటం జరిగింది. ‘అ హీరో’ చిత్రం కాస్త గజిబిజిగా ఉంటుంది. కానీ ఓపికగా చూస్తే ఇన్ని మలుపులున్న కథని ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరు అనిపిస్తుంది. రహీమ్‌గా అమీర్ జదీదీ, బెహ్రామ్‌గా మొసేన్ తానబందే నటించారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. నేను అమీర్ జదీదీ చిత్రాలు ఇంకేవీ చూడలేదు కానీ అతనిది నిజంగా జాలి ముఖం అనిపిస్తుంది. అంతగా పాత్రలో ఒదిగిపోయాడు. ఫర్హదీ దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. జైలులో ఖైదీ రహీమ్‌ని ఎద్దేవా చేసినపుడు రహీమ్ ఆలోచనలో పడతాడు. అంతర్మథనం చేసుకుంటున్నాడని అనిపిస్తుంది. కానీ అతని ప్రవర్తనలో మార్పు ఉండదు. సినిమాల్లో హీరో గానీ హీరోయిన్ గానీ తప్పు చేసినా ఎవరైనా వారి లోపాన్ని చూపించినపుడు అంతర్మథనంతో మార్పు వచ్చినట్టు చూపిస్తారు. నిజజీవితంలో చాలా వరకు అలా జరగదు. అదే ఫర్హదీ చూపించాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

జైలు వాళ్ళు ఒక సమాజ సేవాకేంద్రం సాయంతో విరాళాలు సేకరిస్తారు. ముప్పై నాలుగు వేలు పోగవుతాయి. ఆ కార్యక్రమంలో రహీమ్ ప్రసంగిస్తాడు. స్యావష్ కూడా తండ్రి ప్రోద్బలంతో మాట్లాడతాడు. నత్తిగా తాను కూడా చిన్న మొత్తం విరాళం ఇస్తున్నట్టు చెబుతాడు. కొందరు దాతలు అతని మాటలు విని కంటతడి పెట్టుకుంటారు. పిల్లవాడిని కూడా రహీమ్ అలా వాడుకుంటాడు. కార్యక్రమంలో బెహ్రామ్ కూడా ఉంటాడు. అతనికి రహీమ్ మీద అక్కసుగా ఉంటుంది. కార్యక్రమం తర్వాత బెహ్రామ్ తనకి డబ్బులు సరిపోవని అంటాడు. “నేను డెబ్భై వేలు తీసుకోవటానికి ఒప్పుకుని ఉంటే అతను జైలు నుంచి విడుదల అయ్యేవాడు. నేను ఒప్పుకోలేదు కాబట్టి అతను ఈ నాటకం ఆడుతున్నాడు” అంటాడు. జైలు అధికారి “అతను ఈ డబ్బు మీకు ఇవ్వకుండా బెయిలుగా ఇస్తే అతను ఎలాగూ విడుదలవుతాడు. అలా కాక మీరు ఒప్పుకుంటే మీకూ మంచి పేరొస్తుంది” అంటాడు. “పిల్లవాడి ముఖం చూసి ఒప్పుకుంటున్నాను” అంటాడు బెహ్రామ్. అయితే మిగతా డబ్బుకి బాండు చెక్కులు ఇవ్వాలి. రహీమ్‌కి మళ్ళీ సెలవు ఇస్తారు జైలు వాళ్ళు. రహీమ్ నిజాయితీ గురించి విని ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వటానికి ముందుకొస్తుంది. ఆ ఉద్యోగం వస్తే బాండు చెక్కులు ఇవ్వచ్చు. అయితే ఆ సంస్థ అధికారి నాణేలు పోగొట్టుకున్న స్త్రీని తీసుకువస్తే కానీ ఉద్యోగం ఇవ్వమని అంటాడు. రహీమ్ “బెహ్రామ్ కానీ మీకు ఫోన్ చేశాడా?” అని అడుగుతాడు. “సోషల్ మీడియాలో నీదంతా నాటకమని ప్రచారం జరుగుతోంది. జైలు వాళ్ళు కూడా ఖైదీ ఆత్మహత్య విషయం మరుగుపరచటానికి నీకు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు” అంటాడా అధికారి.

నాణేలు పోగొట్టుకున్న స్త్రీ కోసం అన్వేషణ మొదలవుతుంది. ఆమె జైలుకి, రహీమ్ అక్కకి చేసిన ఫోన్లు వేరేవాళ్ళ నంబర్ల నుంచి చేసిందని తెలుస్తుంది. ఆమె మీద కూడా అనుమానం వస్తుంది. ఆమె అబద్ధం చెప్పి నాణేలు తీసుకుపోయిందేమో అని జైలు అధికారులు అంటారు. లేకపోతే కనీసం రహీమ్‌కి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పకుండా ఉంటుందా అంటారు. కానీ ఆమె దగ్గర ఉన్న నాణేల సంగతి ఆమె భర్తకి తెలియదు కాబట్టి ఆమె గప్‌చుప్‌గా ఉండిపోయిందని రహీమ్ అక్క అంటుంది. అదీ నిజమే. పైగా ఆమె ఆనవాళ్ళు చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళింది. ఆమెని అనుమానించాల్సిన పని లేదు. ఆమెని టాక్సీలో రహీమ్ అక్క ఇంటికి తీసుకొచ్చిన డ్రైవరు కూడా ఆమెని వెతకటంలో సాయం చేస్తాడు. అతని ఫోన్ నుంచే ఆమె రహీమ్ అక్కకి ఫోన్ చేసింది. రహీమ్ పరిస్థితి చూసి అతనికి జాలి కలుగుతుంది. “నన్ను కూడా కొన్నాళ్ళు జైలులో పెట్టారు. ఈ లోకంలో న్యాయం లేదు. నువ్వొక పని చెయ్యి. ఎవరో ఒక ఆమెని తీసుకెళ్ళి ఆమెకే నాణేలు తిరిగి ఇచ్చానని చెప్పు” అంటాడు. చిన్న నేరాలు చేసేవాళ్ళకి శిక్షలు పడతాయి. పెద్ద తిమింగలాలకి మాత్రం శిక్షలు పడవు. వాళ్ళు లంచాలు ఇస్తారుగా మరి. ఈ వ్యవస్థ చూసి సాధారణ పౌరులకి కసి పెరుగుతుంది. తప్పు చేసి అయినా తమ హక్కులు తాము సాధించుకోవాలి అనుకుంటారు. ఇదో విషవలయం.

రహీమ్ కూడా తప్పు చేస్తాడు. ఫార్ఖొందేని తీసుకువెళ్ళి ఆమే నాణేల సొంతదారు అని చెబుతాడు. టాక్సీ డ్రైవరుని, తన అక్కని, స్యావష్‌ని కూడా సాక్షులుగా తీసుకువెళతాడు. అంటే స్యావష్‌కి అబద్ధం చెప్పమని చెప్పాడన్నమాట. పెద్దల చేసే ఈ తప్పుడు పనుల వల్ల పిల్లల మీద దుష్ప్రభావం పడుతుంది. రహీమ్ ఆ ఉద్యోగం వదులుకుని వేరే ఉద్యోగం చూసుకుని ఉండవచ్చు. ఆ విధంగా స్యావష్‌ని ఈ తతంగం నుంచి కాపాడి ఉండవచ్చు. కానీ అతను అలా ఆలోచించడు. వచ్చినదాన్ని ఎందుకు వదులుకోవాలి అనే ఆలోచిస్తాడు. ఫార్ఖొందేని ప్రశ్నించిన తర్వాత సంస్థ అధికారి “ఇంకా విచారణ చేయాలి” అంటాడు. రహీమ్ ప్రాథేయపడితే “జైలు సెలవుకి ఒక వారం క్రితమే బెహ్రామ్‌కి ఎస్ఎమ్ఎస్ పంపించావు. అందులో డెబ్భై అయిదు వేలు ఇస్తానని చెప్పావు. ఆ ఎస్ఎమ్ఎస్ నాకు నిన్నే అందింది. నాణేలు దొరకటానికి ముందే అంత డబ్బు ఇస్తానని ఎలా చెప్పావు?” అంటాడు అధికారి. రహీమ్ ఖంగు తింటాడు. అతను నిజంగానే ఎస్ఎమ్ఎస్ పంపించాడు. జైలులో దొంగ ఫోన్లు ఉంటాయి. నాణేలు దొరికాయని ఫార్ఖొందే చెప్పగానే రహీమ్ ఆతృతతో బెహ్రామ్‌కి ఎస్ఎమ్ఎస్ పంపించాడు. ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంది. నాణేలు ఫార్ఖొందేకి దొరికాయని చెప్పి ఉంటే గొడవ ఉండేది కాదు. కానీ అంతా తన గొప్పతనమే అని చెప్పుకోవటానికి అతను నాణేలు తనకే దొరికాయని చెప్పాడు. ఇప్పుడు ఫార్ఖొందేకి దొరికాయని చెప్పటం కుదరదు. ఫార్ఖొందే వేరే స్త్రీలా వచ్చింది. అందుకే అబద్ధాల చెబుతూ పబ్బం గడుపుకోవాలని చూడకూడదు. నిజం ఎప్పటికైనా బయట పడుతుంది. ఇంత జరిగినా రహీమ్ తాను ఎస్ఎమ్ఎస్ జైలు నుంచి సెలవు మీద వచ్చాక పంపించానని బుకాయిస్తాడు. అధికారి ఎస్ఎమ్ఎస్ తేదీ చూపిస్తూ అతన్ని చీవాట్లేస్తాడు. టాక్సీ డ్రైవరుకి అధికారి మీద కోపం వస్తుంది. “మీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం ఇలా ఉంది” అంటాడు. అతనికి రహీమ్ చేసిన మంచి పని మాత్రమే ముఖ్యం. అతను చెప్పిన అబద్ధాలు అంత ప్రాధాన్యం లేనివని అతని అభిప్రాయం. అతనికి లోతుగా ఆలోచించే అవసరం ఏముంది? ఒక్కోసారి (నిజానికి ఎక్కువ శాతం) సత్కార్యాలు స్వార్థంతోనే చేస్తారు. రహీమ్‌కి జైలు నుంచి బయటపడటానికి ప్రచారం అవసరం లేకపోతే అతను ఆ డబ్బు తిరిగి ఇచ్చేవాడా? జైలు వారికి తెలియాలనే జైలు ఫోన్ నంబరు ఇచ్చాడు. లేకపోతే తన అక్క నంబరే ఇచ్చేవాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

తన ఎస్ఎమ్ఎస్ ని అధికారికి ఫార్వర్డ్ చేసినది బహ్రామేనని నిర్ధారణకొస్తాడు రహీమ్. బెహ్రామ్ దుకాణానికి వెళ్ళి అడిగితే అతను తాను పంపించలేదంటాడు. అంటే జైలులోని ఖైదీ ఎవరో పంపించారన్నమాట! రహీమ్‌కి ఈ ఆలోచన రాదు. టీవీలో రహీమ్ అతన్ని చులకన చేసి మాట్లాడాడని బెహ్రామ్‌కి కోపంగా ఉంటుంది. “నీ మాయమాటలకి మళ్ళీ పడిపోయాను” అంటాడు. అతని కూతురు కూడా రహీమ్‌ని ఛీత్కరిస్తుంది. రహీమ్ బెహ్రామ్‌ని “నా మీద ప్రజలు అభిమానం చూపిస్తున్నారని నీకు ఈర్ష్యగా ఉంది కదా?” అంటాడు. “అది అభిమానం కాదు, జాలి. నీ కొడుకుని, అతని నత్తిని చూసి జాలి. నీకు సిగ్గులేదా నీ కొడుకుని వాడుకోవటానికి” అంటాడు బెహ్రామ్. రహీమ్ అతని మీద దాడి చేస్తాడు. ఇద్దరికీ పెనుగులాట జరుగుతుంది. బెహ్రామ్ చేయి విరుగుతుంది. ఆ దాడిని ఒకతను ఫోన్లో రికార్డు చేస్తాడు. చుట్టుపక్కల దుకాణదారులు రహీమ్‌ని ఒక దుకాణంలో బంధించి పోలీసులకి ఫోన్ చేస్తారు, కానీ ఫార్ఖొందే వచ్చి బతిమాలటంతో బెహ్రామ్ అతన్ని వదిలేయమంటాడు. బెహ్రామ్ ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు. కథ అంతా రహీమ్ వైపు నుంచి చూపించటంతో అతను విలన్‌లా కనపడతాడు. కానీ అతను ఎంతో క్షోభపడ్డాడు. తన కూతురికి స్త్రీధనంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని హామీ కింద చెల్లించాడు. హామీ ఇచ్చినందుకు ఇరుక్కుపోయాడు. రహీమ్ అతనే తనకి అడ్డుపడుతున్నాడని ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. ఇది పెద్ద తప్పు. దాడి చేసినా బెహ్రామ్ సహృదయంతో అతన్ని వదిలేశాడు.

బెహ్రామ్ కూతురు దాడి వీడియోని సమాజ సేవాసంస్థకి పంపిస్తుంది. అందులో ఫార్ఖొందే వచ్చి బతిమాలటం కూడా రికార్డయ్యి ఉంటుంది. సేవాసంస్థ అధికారిణి రహీమ్‌ని పిలిపించి చీవాట్లేస్తుంది. సేవాసంస్థలోని ఇతర సభ్యులు కూడా ఉంటారు. “ఈ వీడియో నీకు ఉద్యోగం ఇవ్వాలనుకున్న సంస్థకి కూడా వెళ్ళింది. వాళ్ళు ఫార్ఖొందేని గుర్తు పట్టారు. ఆమె నీ ప్రియురాలని వాళ్ళకి తెలిసిపోయింది. ఈ వీడియో జనంలోకి వెళితే మా సంస్థ ప్రతిష్ఠకే భంగం వస్తుంది. మేము ఎందరో అమాయకులకి సాయం చేస్తాం. ఇప్పుడు మాకు విరాళాలు ఎవరిస్తారు? ఆ అమాయకులకి కూడా నువ్వు నష్టం కలిగించావు” అంటుంది అధికారిణి. రహీమ్ నాణేలు ఫార్ఖొందేకి దొరికాయని, జైలు అధికారి తనకే దొరికాయని చెప్పమన్నాడని అంటాడు. ఇది కూడా చిన్నపాటి అబద్ధమే. జైలు అధికారి అతన్ని ఏమీ బలవంతపెట్టలేదు. రహీమ్‌లో ఊగిసలాట ఉంది. కానీ ఇతరులు తనకు అనుకూలంగా మాట్లాడితే తనను తాను సమర్థించుకునే గుణం ఉంది. ఇతరులకి కూడా స్వార్ధాలు ఉంటాయి కదా? జైలు వారికి ఖైదీ ఆత్మహత్యకి మించిన సంచలన వార్త కావాలి. అందుకని రహీమ్‌ని వాడుకున్నారు. సేవాసంస్థ వారు తలలు పట్టుకుంటారు. వీడియో బయటికి వస్తే తమ ప్రతిష్ఠకి కూడా భంగమని బెహ్రామ్‌ని వీడియో బయటపెట్టొద్దని కోరతారు. సేకరించిన విరాళం రహీమ్‌కి ఇవ్వలేమని అంటారు.

ఇదంతా జరుగుతున్నా స్వావష్ తన తండ్రి అబద్ధం చెప్పలేదనే అంటాడు. అతను నాణేలు తిరిగి ఇవ్వటం తన కళ్ళతో చూశాడు. అతని చిన్ని బుర్రకి అది చాలు. కానీ అతనికి అందిన సందేశం మంచి పనిని సమర్థించుకోవటానికి వేరే అబద్ధాలు చెప్పవచ్చని. అతని బుర్రని తొలిచే విషయం ఇంకొకటుంది. ఫార్ఖొందే ఆ నాణేలు తన తండ్రికి ఎందుకిచ్చిందని. అదే అడుగుతాడు. రహీమ్ “నేను జైలు నుంచి బయటకు రావాలని” అంటాడు. “నువ్వు ఆమెని పెళ్ళి చేసుకుంటావా?” అంటాడు స్వావష్. “నువ్వొద్దంటే చేసుకోను” అంటాడు రహీమ్. స్వావష్ మౌనంగా విలపిస్తాడు. తల్లి ఇంకో పెళ్ళి చేసుకుంటోంది. తండ్రి కూడా. పిల్లలకి ఇది అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. ఇదిలా ఉండగా సేవాసంస్థ అధికారిణి దాతలెవరూ సేకరించిన డబ్బు రహీమ్‌కి ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదని అంటుంది. విరాళాన్ని ఉరిశిక్ష పడిన ఒక వ్యక్తికి ఇవ్వటానికి ఒప్పుకోమంటుంది. బదులుగా బెహ్రామ్‌ని వీడియో బయటపెట్టకుండా ఒప్పిస్తామంటుంది. రహీమ్ ఒప్పుకుంటాడు. తనకి పరువే ముఖ్యమంటాడు. కానీ ఆ వీడియో బయటికొస్తుంది! ఎవరు బయటపెట్టారో చిత్రంలో స్పష్టంగా చెప్పలేదు. కథ ఇంకొన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి రహీమ్ డబ్బు కట్టలేక పోవటంతో మళ్ళీ జైలుకి వెళతాడు.

మెరిసేదంతా బంగారం కాదని చెప్పటం ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం. కొందరు చూడటానికి అమాయకంగా ఉంటారు. కొందరు గంభీరంగా ఉంటారు. అమాయకంగా ఉన్నవారందరూ మచ్చ లేనివారు కాదు. గంభీరంగా ఉన్నవారందరూ కఠినాత్ములు కాదు. కానీ బెహ్రామ్ కూడా ఒక తప్పు చేశాడు. రహీమ్ ఒక మంచి పని చేశాడంటే నమ్మలేదు. అంతా నాటకం అన్నాడు. అతను కఠినంగా మాట్లాడటంతో రహీమ్‌కి అతనే తనకి అడ్డుపడుతున్నాడనిపించింది. ఒక్కోసారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నిజాయితీగా ఉండని వారిని అంత త్వరగా ఎవరూ నమ్మరు. కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకుని దాన్ని మార్చుకోకపోవటం కూడా తప్పే. జీవితం ఇంతే. అందరూ తప్పులు చేస్తారు. ఎవరికి వారు తమ అంతరాత్మని పరిశీలించుకోవాలి. లేకపోతే మంచి పని చేసినా నమ్మేవారు ఉండరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here