మరుగునపడ్డ మాణిక్యాలు – 78: ద ఫేవరెట్

0
8
Rachel Weisz, left, and Olivia Colman star in Fox Searchlight Pictures' "THE FAVOURITE."

[సంచిక పాఠకుల కోసం ‘ద ఫేవరెట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]‘ద[/dropcap] ఫేవరెట్’ (2018) చిత్రంలో ఒకప్పటి బ్రిటిష్ రాణి యాన్ ముఖ్యపాత్ర. అయితే ఈ చిత్రంలో జరిగేవన్నీ వాస్తవాలు కాదని దర్శకుడు యోర్గోస్ లాంతిమోస్ స్వయంగా చెప్పాడు. కొన్ని వాస్తవాలను గ్రహించి, తెర వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించి స్క్రీన్ ప్లే వ్రాశారు డెబొరా డేవిస్, టోనీ మెక్ నమారా. ఇది ఒక బయోపిక్ లాగ కాకుండా అధికారంలో ఉన్నవారికి ఎదురయ్యే సవాళ్ళు, వాటి పర్యవసానాలు చూపించే కథలా చూస్తే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అయితే ఒక హెచ్చరిక. ఈ చిత్రంలో విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. అధికారమదం మనుషుల్ని అంధుల్ని చేస్తుంది అనే వాస్తవాన్ని కొంచెం ఘాటుగా చూపించారు. మహాభారతంలో రాజైన సత్యవతి కుమారుడు విచిత్రవీర్యుడు విచ్చలవిడిగా ప్రవర్తించి రోగాల పాలై మరణించాడు. మన సినిమాల్లో ఇలాంటివి ఘాటుగా చూపించరు. ఈ చిత్రంలో చూపించారు. ఔచిత్యమేనా అంటే ఎవరి అభిప్రాయం వారిది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

యాన్ పదిహేడవ శతాబ్దంలో బ్రిటన్ రాణి. ఆమె పదిహేడు సార్లు గర్భం ధరిస్తుంది కానీ పిల్లలెవరూ బతకరు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎక్కువగా వీల్ చెయిర్ లోనే వెళుతుంది. మానసికంగా కూడా ఆమె బలహీనంగా ఉంటుంది. పిల్లలను పోగొట్టుకున్న తల్లి మానసికంగా కుంగిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? జిహ్వచాపల్యంతో తినటం, తర్వాత వాంతి చేసుకోవటం మామూలే. సేవ చేసేవాళ్ళు చాలమంది ఉంటారు. సింహాసనం మీద ఉన్నవారు మరణించేవరకు పాలించటం అక్కడి ఆచారం. కాబట్టి ఆమే పాలన చేస్తూ ఉంటుంది. అధికారం ఎవరు వదులుకుంటారు? ఆమెకి సారా అనే డచెస్ సహాయం చేస్తుంటుంది. సహాయం అనటం కన్నా పెత్తనం చేస్తుంటుంది అంటే బావుంటుంది. గద్దె మీద ఉన్నవారు నిస్సహాయులై ఉంటే ఎవరో ఒకరు వారి ప్రాపకం పొంది పెత్తనం చేయటం ఎప్పుడూ ఉన్నదే. మహాభారతంలో భీష్ముడి లాంటి వాళ్ళు ఉంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. కానీ భీష్ముడి లాంటి వాళ్ళు అరుదు అని ద్వాపరయుగంలోనే అన్నారు. ఇక కలియుగం గురించి చెప్పాలా? యాన్ సారాకి ఒక మహలు నిర్మించి ఇవ్వాలని అనుకుంటుంది. అంతగా ఆమెని ప్రభావితం చేసింది సారా.

బ్రిటన్‌కి, ఫ్రాన్స్‌కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సారా భర్త సైన్యాధిపతి. సంధి ప్రస్తావన వస్తే సారా సంధి చేసుకోవద్దని రాణికి సలహా ఇస్తుంది. ఒక సందర్భంలో ఒక పాత్ర ఆమెని “మీ భర్త యుద్ధరంగంలో ముందుండి పోరాడుతున్నారు. మీరు సంధి వద్దంటారేంటి?” అని అడుగుతుంది. “మనం ఇప్పుడు యుద్ధం చేయకపోతే వాళ్ళు ఇతర దేశాలని కూడగట్టుకుని వచ్చి మన మీద పడతారు. మన దేశం కోసం ఇది చేయాలి” అంటుంది సారా. దేశం పట్ల ఆమెకి అంకితభావం ఉందని అనిపిస్తుంది. నిజంగా అది అంకితభావమేనా అని అనుమానం కూడా వస్తుంది. యుద్ధం కొనసాగించాలంటే పన్ను రెట్టింపు చేయాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడు హార్లీ ఒప్పుకోడు. ప్రజల తిరుగుబాటు చేస్తారంటాడు. అదీ నిజమే. సంధి చేసుకోమంటాడు. యాన్ ఊగిసలాడుతూ ఉంటుంది. అయితే ఆమె ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోదు. తనకి సారా మీద కోపం వస్తే హార్లీని సమర్థిస్తుంది. మళ్ళీ సారా సముదాయిస్తే సారా చెప్పినట్టు చేస్తుంది. మానసికంగా దృఢంగా లేనివారు గద్దె మీద ఉంటే ఇలాగే ఉంటుంది.

సారాకి దూరపు బంధువైన ఆబిగెయిల్ అనే యువతి బతుకుతెరువు కోసం సారా దగ్గరకి వస్తుంది. ఆమెకి పదిహేనేళ్ళ వయసున్నపుడు ఆమె తండ్రి ఆమెని బాకీ కింద ఓ జెర్మన్ వ్యాపారికి ఇచ్చేశాడు. ఆమె లైంగిక హింస భరించింది. ఇప్పుడు వేరే దారి లేక సారా దగ్గరకి వచ్చింది. ఆమె వేశ్యగా మారకపోవటం ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. సారాకి ఆమె మీద సానుభూతి లేదు. పనివాళ్ళలో ఒకదానిగా రాణివాసంలో పెడుతుంది. సారా కూడా రాణివాసంలోనే ఉంటుంది. పనివాళ్ళు ఆబిగెయిల్ పట్ల క్రూరంగా ఉంటారు. సారా మీద కోపం ఆమె మీద చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఒకరోజు యాన్ చర్మవ్యాధితో బాధ పడుతుంటే సారా ఆబిగెయిల్‌ని పిలిపించి కట్లు కట్టిస్తుంది. అదే ఆబిగెయిల్ మొదటిసారి యాన్‌ని చూడటం. ఒకరోజు ఆబిగెయిల్‌కి తోటి పనివాళ్ళ వికృత చేష్ట వల్ల చేయి కాలుతుంది. ఆమె గుర్రం మీద అడవిలోకి వెళ్ళి ఆకుపసరు తెచ్చుకుంటుంది. సేవకురాలికి గుర్రం ఎలా వచ్చింది? ఆమె అశ్వశాలలో ఎవరికైనా తన శరీరం ఎరగా వేసి గుర్రాన్ని తీసుకెళ్ళి ఉండవచ్చు. ఆత్మగౌరవం ఉన్నా లౌక్యం కూడా ఉంది. ఆమె తెలివిగా ఆకుపసరు తీసుకుని యాన్ పడకగదికి వెళుతుంది. అక్కడ కాపలావాడికి వైద్యుడు పంపించాడని చెప్పి లోపలికి వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న యాన్‌కి పసరు రాస్తుంది. సారా వచ్చి అనుమతి లేకుండా లోపలికి వచ్చిన ఆబిగెయిల్‌ని శిక్షించమని చెబుతుంది. అయితే యాన్‌కి పసరు వల్ల ఉపశమనం కలిగిందని తెలిసి సారా శిక్ష ఆపించి ఆబిగెయిల్‌ని తన ప్రధాన చెలికత్తెగా నియమిస్తుంది.

యుద్ధం గురించి విని ఆబిగెయిల్ సారాని “నీ భర్త చనిపోతాడని భయం లేదా?” అని అడుగుతుంది. “నువ్వు నీ తండ్రి అప్పు తీర్చటం కోసం నిన్ను నువ్వు అర్పించుకోలేదా? అందరం ఏదో ఒక మూల్యం చెల్లించక తప్పదు” అంటుంది సారా. ఆ మూల్యం దేశం కోసమా? సొంత ప్రయోజనాల కోసమా? ఇది తర్వాత తెలుస్తుంది. సారా యాన్ పట్ల క్రూరంగా కూడా ప్రవర్తిస్తుంది. యాన్ ఆమె ఏం చేసినా భరిస్తుంది. దీనికి కారణం వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉంది. సారా గదిలో ఆబిగెయిల్ ఒక పుస్తకం దొంగిలిస్తుండగా వారిద్దరూ శృంగారంలో పాల్గొనటం చూస్తుంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షనాయకుడు హార్లీ యుద్ధం గురించి సారా, యాన్‌ల వ్యూహాల గురించి చెప్పమని ఆబిగెయిల్‌ని బెదిరిస్తాడు. హార్లీ యువకుడే. ఆబిగెయిల్ అతనికి ఏమీ చెప్పనంటుంది. సారాతో “హార్లీ అడిగాడు కానీ నేనేం చెప్పను. నీ రహస్యాలు నా దగ్గర భద్రం. నీ అతిపెద్ద రహస్యం కూడా” అంటుంది. ‘నీ రహస్యం నాకు తెలిసిపోయింది’ అని ఈ విధంగా చెబుతుంది. సారాకి ఆబిగెయిల్ సామాన్యురాలు కాదని అర్థమవుతుంది. మరో పక్క కల్నల్ మాషమ్ అనే యువ అధికారి ఆబిగెయిల్ మీద మోజు పడతాడు. ఆబిగెయిల్‌కి మగవాళ్ళతో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు. అతన్ని ఊరిస్తూ ఉంటుంది.

ఒకరోజు యాన్ ఒంటరితనం తట్టుకోలేక సారాని తన దగ్గర ఉండమని అడుగుతుంది. సారా పని ఉందని చెప్పి ఆబిగెయిల్‌ని యాన్ దగ్గరకి పంపిస్తుంది. యాన్‌కి మొదట ఇది నచ్చదు. అయితే యాన్ దగ్గర ఉన్న కుందేళ్ళని ఆబిగెయిల్ ముద్దు చేయటంతో యాన్ ఆమెని ఉండనిస్తుంది. యాన్ దగ్గర పదిహేడు కుందేళ్ళు ఉంటాయి. తన పదిహేడు గర్భాలకి గుర్తుగా. యాన్, ఆబిగెయిల్‌ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఒకసారి సారా, ఆబిగెయిల్ వినోదం కోసం పిట్టలని కాలుస్తూ ఉండగా యాన్ ఆబిగెయిల్‌ని పిలిపిస్తుంది. తనని పిలవకుండా ఆబిగెయిల్ పిలవటంతో సారాకి కోపం వస్తుంది. యాన్ మీద కోపం చూపిస్తుంది కానీ అంతకన్నా ఏం చేయగలదు? పన్ను పెంచుతున్నామని పార్లమెంటులో చెప్పమని సారా యాన్ మీద ఒత్తిడి చేస్తుంది. అయితే సారా మీద కోపంతో కొన్నిరోజుల క్రితమే పన్ను పెంచబోనని హార్లీతో యాన్ చెప్పింది. హార్లీ తెలివిగా పార్లమెంటులో ఆ సంగతి ప్రకటించి యాన్‌ని ఇరకాటంలో పెడతాడు. యాన్ ఏమీ చేయలేక పార్లమెంటులోనే స్పృహ కోల్పోయినట్టు నటించి కింద పడిపోతుంది. ఆరోగ్యం బాగా లేకపోతే ఇదో సౌకర్యం. ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రహసనంలా నవ్వు తెప్పిస్తుంది. ఈ గందరగోళంలో యాన్ ఆబిగెయిల్ ఒక్కతే తనకి ఆప్తురాలనుకుంటుంది. ఇద్దరికీ లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఇది సారాకి తెలుస్తుంది. చివరికి ఎవరు యాన్‌కి ఫేవరెట్‌గా నిలిచారు అనేది మిగతా కథ.

బ్రిటిష్ రాజకుటుంబానికి ఆభిజాత్యం ఎక్కువ. తాము దేవుడి ప్రతినిధులమని భావిస్తారు. ప్రజలు కూడా అలాగే అనుకునేవారు. యాన్ లాంటివారు కూడా ఆ అధికారమదంతో ఉంటారు. కానీ ఒంటరితనం తప్పించుకోవటానికి యాన్ సారాకి దగ్గరయింది. అయితే సారా తనని నిర్లక్ష్యం చేస్తోందని అనిపిస్తే యాన్‌కి అక్కసు వస్తుంది. ఆబిగెయిల్ ఈ అక్కసుని వాడుకుంటుంది. అందుకే ఆమె యాన్, సారాల లైంగిక సంబంధం గురించి బయటకి తెలియనివ్వదు. ఇది తెలిస్తే యాన్ పదవికే ప్రమాదం. అది ఆబిగెయిల్‌కి కూడా మంచిది కాదు. ఆబిగెయిల్ తన శరీరాన్ని ఎరగా వేసి యాన్‌కి దగ్గరవుతుంది. ఇద్దరు స్త్రీలు తన కోసం పోటీ పడటం యాన్ అహాన్ని తృప్తి పరుస్తుంది. స్వలింగసంపర్కం తప్పని యాన్ కూడా అనుకుంటుంది. అప్పటి మతవిశ్వాసాలు అలాంటివి. కానీ యాన్ వాంఛలకి లొంగిపోతుంది. పదవి వదిలేయొచ్చుగా? వదిలేస్తే అధికారం చేపట్టటానికి రాజకుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు. అధికారం పోతే తననెవరూ పట్టించుకోరని యాన్ భయం. ఎవరి స్వార్థం వారిది. కాస్తో కూస్తో మానవత్వం ఉన్నవారిని మిగతావారు బతకనివ్వరని కూడా ఈ చిత్రం నిరూపిస్తుంది.

అప్పట్లో కొందరు మగవాళ్ళు అందంగా కనిపించటానికి పొడుగు విగ్గులు పెట్టుకుని, మొహానికి రంగు వేసుకునేవారు. హార్లీ, కల్నల్ మాషమ్ అలాగే ఉంటారు. కాలక్షేపం కోసం బాతులకి పరుగు పందేలు పెట్టి వినోదించటం, ఆడవాళ్ళ గురించి పచ్చిగా మాట్లాడుకోవటం, పందేలలో ఓడిపోయినవాళ్ళని బట్టలూడదీసి వారి మీద తిండిపదార్థాలు విసరటం లాంటివి అప్పటి విచ్చలవిడితనానికి చిన్న ఉదాహరణలు. ఒకపక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది, మరోపక్క విలాసాలు సాగుతూనే ఉంటాయి. రాచరికంలో రాజు లేక రాణి సమర్థులు కాకపోతే అధికారులు ఎలా ఉంటారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇలాంటివి ప్రపంచంలో అన్ని చోట్లా జరిగాయి. అందుకే రాజు అయిన వాడు కొన్ని ధర్మాలు పాటించాలి. ఇప్పటి కాలంలో ముఖ్యమంత్రులకి, ప్రధానమంతులకి, అధ్యక్షులకి ఈ ధర్మాలు వర్తిస్తాయి. అవి పాటించకపోతే చరిత్రలో మచ్చలుగా మిగిలిపోతారు. యాన్ లాగే. యాన్ గురించి తెలుసుకోవాలనుకునేవారు వికిపీడియాలో Queen Anne అని సెర్చ్ చేయవచ్చు.

ఈ చిత్రంలో ఫొటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజమహలు దృశ్యాలు అప్పటి ఐశ్వర్యాన్ని ప్రతిబింబిస్తూనే ఆ రాజమహలునే ఒక బందిఖానాలా చూపించిన తీరు అబ్బురపరుస్తుంది. ఇలాంటి చిత్రాలలో రాత్రివేళ జరిగే దృశ్యాలను లైట్లు తెరపై కనపడకుండా పెట్టి తీస్తారు. కానీ ఈ చిత్రంలో కొవ్వొత్తులు తప్ప వేరే లైట్లు పెట్టలేదని అనిపిస్తుంది. అంత సహజంగా ఉంటాయి ఆ దృశ్యాలు. ఫొటోగ్రఫీ, కళాదర్శకత్వం, దుస్తుల విభాగాలలో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. ఇంకా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే నామినేషన్లు కూడా వచ్చాయి. ఉత్తమ నటిగా యాన్ పాత్రలో నటించిన ఒలివియా కోల్మన్ ఆస్కార్ అందుకుంది. ఉన్మాదంగా ప్రవర్తించటం, ఇతరుల సలహాలు తీసుకుని కూడా అన్నీ తన ఆలోచనలే అన్నట్టు దర్పం ప్రదర్శించటం, విషాదంలో కూరుకుపోవటం – ఇవన్నీ అద్భుతంగా అభినయించింది. సారాగా నటించిన రేచెల్ వైజ్, ఆబిగెయిల్‌గా నటించిన ఎమా స్టోన్ ఇద్దరూ ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్లు అందుకున్నారు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

సారా ఆబిగెయిల్ తన పుస్తకం దొంగిలించిందని ఆమెని పనిలో నుంచి తీసేస్తుంది. అయితే యాన్ ఆమెని తన ప్రధాన చెలికత్తెగా నియమించుకుంటుంది. సారా వద్దంటున్నా వినదు. సారా బెదిరిస్తే మొదటికే మోసం వస్తుందని యాన్‌ని మళ్ళీ మచ్చిక చేసుకుంటుంది. యాన్ని నవ్విస్తే చాలు ఆమె మెత్తబడిపోతుంది. మానసిక స్థితి బాగా లేనప్పుడు ఇలాంటి ప్రవర్తన వింతేం కాదు. యాన్ తనకి మళ్ళీ దగ్గరవటంతో సారా ఆబిగెయిల్‌తో “త్వరలోనే వీధిన పడతావు” అంటుంది. ఈ దాగుడుమూతలకి ముగింపు పలకాలని ఆబిగెయిల్ నిశ్చయించుకుంటుంది. “నీతిగా ఉంటే బతకటం కష్టం” అంటుంది కల్నల్ మాషమ్‌తో. ఎవరికి వారు తాము నీతిమంతులమనే అనుకుంటారు. యాన్‌కి తన నగ్న శరీరాన్ని చూపించి ఆమెకి వాంఛ కలిగించింది ఆబిగెయిలే. సారా స్థానం సంపాదించాలని కాకపోతే ఆమె ఆ పని ఎందుకు చేసింది? తన స్థానంలో తానుంటే సరిపోయేది కదా? దాసి లాగ కాకుండా పెత్తనం చేసే స్థానంలో ఉండాలని ఆమె కోరిక. అన్నం పెట్టిన చేతినే నరకటానికి సిద్ధపడుతుంది. సారాకి టీలో విషపదార్థం కలిపి ఇస్తుంది. దాని వల్ల ప్రాణం పోదు కానీ స్పృహ పోతుంది. సారా టీ తాగి గుర్రపు స్వారీ చేస్తూ అడవిలోకి వెళుతుంది. స్పృహ కోల్పోయి కింద పడుతుంది కానీ కాలు జీనులో ఇరుక్కుపోయి ఉంటుంది. గుర్రం ఆమెని ఈడ్చుకుంటూ పరుగెడుతుంది. ఆమె ముఖానికి గాయాలవుతాయి. ఒక వ్యభిచారగృహం వాళ్ళు ఆమెని కాపాడతారు. ఆమె కదలలేని స్థితిలో ఉంటుంది.

ఇది అదనుగా ఆబిగెయిల్ హార్లీతో ఒప్పందం చేసుకుంటుంది. యాన్‌తో ముఖాముఖి మాట్లాడే అవకాశం కలిగిస్తానని, దానికి బదులుగా తనకి కల్నల్ మాషమ్‌తో పెళ్ళి జరిగేలా చూడమని అడుగుతుంది. ఆ పెళ్ళి జరిగితే ఆమెకి హోదా వస్తుంది. ఇలాంటి పెళ్ళిళ్ళకి రాజు లేదా రాణి అనుమతి ఉండాలి. హార్లీ యాన్‌ని కలిసి ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారని, ఫ్రాన్స్‌తో సంధి చేసుకోమంటాడు. తిరుగుబాటు సంగతి యాన్‌కి తెలియదు. ఆమె ఆలోచిస్తానంటుంది. హార్లీ కల్నల్ మాషమ్ ఆబిగెయిల్ మీద మనసు పడ్డాడని చెబుతాడు. “ఆమె కేవలం ఒక దాసి” అంటుంది యాన్. “అవును, ఆమె మీద మనసు పడటం వింతే. కానీ అతని ప్రేమ చూసి నా మనసు కరిగిపోయింది” అంటాడు హార్లీ. ఇంకో పక్క సారా కనపడకపోవటంతో ఆమె కోసం వెతికిస్తామని ప్రధానమంత్రి యాన్‌తో అంటాడు. “వద్దు. నన్ను ఆందోళన పెట్టాలనే ఆమె వెళ్ళిపోయింది. ఆమె కోసం వెతకొద్దు” అంటుంది యాన్. పన్ను పెంచమని చెబుతున్నా వినటం లేదని సారా ఇలా నాటకాలాడుతోందని యాన్ భావన. కానీ మర్నాటికే ఆమె మనసు మారిపోతుంది. సారాని వెతికించమని చెబుతుంది. ఆబిగెయిల్‌తో “సారా వల్లే నా జీవితం నాకు దక్కింది. ఆమె లేకపోతే నేను లేను. ఎంత వేదన! అందరూ చచ్చిపోయి నన్ను వదిలిపోయేవారే. ఆమె కూడా అంతే. ఒకవేళ ఆమె బతికుంటే నేనే ఆమెని చంపేస్తాను. నన్ను ఇలా వేధించటానికే ఆమె వెళ్ళిపోయింది” అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. ఆబిగెయిల్ తీయగా మాట్లాడి ఆమెని అనునయిస్తుంది. “నువ్వు చాలా మంచిదానివి. నీ మనసు నిండా ప్రేమే. నిన్ను కల్నల్ మాషమ్ కిచ్చి పెళ్ళి చేస్తాను” అంటుంది. ఆబిగెయిల్ తెలివిగా “నేనెందుకూ కొరగాని దాసీని. నన్ను పెళ్ళి చేసుకుంటే అతని పరువు పోతుంది” అంటుంది. యాన్ కరిగిపోయి “ఇది నీకు నా కానుక. సారా తిరిగిరాక ముందే మీ పెళ్ళి జరిగిపోవాలి. లేకపోతే ఆమె శివాలెత్తిపోతుంది” అని అప్పటికప్పుడే పెళ్ళి జరిపించేస్తుంది. ఈ పెళ్ళితో హోదాతో పాటు ఆబిగెయిల్‌కి సంవత్సరానికి రెండు వేల పౌండ్ల భత్యం వస్తుంది.

ఆబిగెయిల్‌కి హోదా అయితే వస్తుంది కానీ ఆమెకి భయం పట్టుకుంటుంది. సారా తిరిగివస్తుందని, తన మీద ప్రతీకారం తీసుకుంటుందని ఆమె భయం. కార్యం గదిలో కూడా ఆమె ఈ ఆలోచనలతోనే సతమతమవుతూ ఉంటుంది. భర్త దగ్గరకి రాబోతే ఆమె అతనికి హ్యాండ్ జాబ్ (చేతితో చేసే లైంగిక చర్య) చేసి అతన్ని వదిలించుకుంటుంది. ఆ సమయంలో కూడా ఆమె సారా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తప్పుడు పనులు చేస్తే మనశ్శాంతి కోల్పోవటంలో ఆశ్చర్యం ఏముంది? అయినా ఆబిగెయిల్‌కి ఈ గ్రహింపు కలగదు. ఆమెకి అధికారమే ముఖ్యం. కొన్నాళ్ళకి సారా తిరిగి వస్తుంది. ఆమె ముఖం మీద పెద్ద గాటు ఉంటుంది. ఆమె తెలివితక్కువది కాదు. ఆబిగెయిల్ విషప్రయోగం చేసిందని ఆమెకి అర్థమైపోయింది. ఆమె ఆబిగెయిల్‌ని చెంపదెబ్బలు కొడుతుంది. ఆబిగెయిల్ “నీకు కోపం ఉండటం సహజం. ఈ దెబ్బలు కొట్టినందుకు నేనేమీ అనను. ఇక ఇద్దరం సఖ్యంగా ఉందాం” అంటుంది. సారా లాంటి వాళ్ళతో సఖ్యంగా ఉండటమే మంచిదని ఆమె అనుకుంటుంది. కానీ సారా అంత త్వరగా జరిగినవన్నీ మర్చిపోతుందా?

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సారా యాన్ దగ్గరకి వెళ్ళి బందిపోట్లు తనపై దాడి చేశారని చెబుతుంది. ఆబిగెయిల్ విషప్రయోగం చేసిందని చెబితే నమ్మే స్థితిలో లేదామె. సారాకి యాన్ రాసిన ప్రేమలేఖలు సారా దగ్గర ఉంటాయి. వాటిలో వారి శృంగారం గురించి కూడా రాసి ఉంటుంది. సారా ఆ ఉత్తరాలని యాన్ దగ్గరకి తీసుకెళ్ళి “ఈ ఉత్తరాలు పత్రికల వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? పన్ను పెంచుతున్నానని ప్రకటించండి. నేను చెప్పినట్టు మంత్రి మండలి ఏర్పాటు చేయండి. ఆబిగెయిల్‌ని బహిష్కరించండి. లేకపోతే ఉత్తరాలు పత్రికలవారికి ఇచ్చేస్తాను” అని బెదిరిస్తుంది. కానీ సారాలో అంతర్మథనం మొదలవుతుంది. ఉత్తరాలని మంటల్లో పడేస్తుంది. ఇదే కథలో అనుకోని మలుపు. సారా యాన్‌ని నిజంగానే ప్రేమించింది. దేశాన్ని రక్షించుకోవాలంటే యుద్ధం తప్పదని కూడా నమ్మింది. ఆమె యాన్ పట్ల క్రూరంగా ప్రవర్తించటం కూడా ఆమె ఆరోగ్యం కోసమూ, ఆబిగెయిల్ మీద అసూయ తోనూ. యాన్ ఆమెని పూర్తిగా అర్థం చేసుకోలేదు. యుద్ధాన్ని ఆమె గట్టిగా సమర్థించటం కూడా యాన్‌కి అనుమానం కలిగించింది. ఇక్కడ సారా తప్పే చేసింది. తన వాదనని జాగ్రత్తగా వినిపించాల్సింది. ఆమెకి యాన్ సమర్థత పట్ల నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఆమె ‘నీకు తెలియదు. నా మాట విను’ అన్నట్టు వ్యవహరించింది. రాణి దగ్గర ఇలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. రాచరికపు అహాలు అలా ఉంటాయి. “ఆబిగెయిల్ మిమ్మల్ని ప్రేమించటం లేదు” అని సారా అంటే యాన్ “అంటే నేను ప్రేమించటానికి తగని మనిషినని కదా నీ అభిప్రాయం” అంటుంది. ఆబిగెయిల్ తన స్వార్థం కోసం చేసిన పనులు యాన్ మనసుని కలుషితం చేశాయి. యాన్ సారాని బహిష్కరిస్తుంది. ఇలా చేస్తే యాన్‌కి ప్రమాదం కాదా? సారా నమ్మకద్రోహం చేసిందని తప్ప ఏమీ ఆలోచించదు. పైగా ఆమెకి ఆబిగెయిల్ మీద నమ్మకం.

యాన్ ప్రధానమంత్రిని తొలగించి హార్లీని ప్రధానమంత్రిని చేస్తుంది. ఫ్రాన్స్‌తో సంధికి కూడా అనుమతిస్తుంది. మాజీ ప్రధానమంత్రి యాన్ దగ్గరకి వెళ్ళి సారా చేత క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయిస్తానని అంటాడు. సారా దగ్గరకి వెళ్ళి ఉత్తరం రాయమని చెబుతాడు. యాన్ ఆ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇది గమనించిన ఆబిగెయిల్ మళ్ళీ వాళ్ళు కలిసిపోతారని సారా నిధులు మళ్ళించదని యాన్‌కి తప్పుడు సాక్ష్యాలు ఇస్తుంది. యాన్ నమ్మదు. సారా రాస్తుంది. కానీ ఆబిగెయిల్ ఆ ఉత్తరం యాన్‌కి అందకుండా చేసి మంటల్లో పడేస్తుంది. ఉత్తరం కోసం ఎదురుచూసి చూసి యాన్ కోపంతో సారాని, ఆమె భర్తని నిధులు మళ్ళించారనే అభియోగం మీద దేశం నుంచి బహిష్కరిస్తుంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఆబిగెయిల్ సారా ఉత్తరాన్ని చదివి, మంటల్లో పడేసేటప్పుడు కన్నీరు కారుస్తుంది. సారా ప్రేమ నిజమైనదని ఆమెకి కూడా తెలిసింది. కానీ ఆమె ఇప్పుడు వెనక్కి తిరిగిరాలేని చోటికి చేరుకుంది. కనికరం చూపిస్తే ఆమెకే ప్రమాదం.

ఆబిగెయిల్ విలాసాలకి అలవాటు పడుతుంది. యాన్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఆబిగెయిల్ ఒకరోజు యాన్ పడుకుని ఉండగా కాస్త దూరంగా కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఒక కుందేలు ఆమె కాళ్ళ దగ్గరకి వస్తే దాన్ని కాలి కింద తొక్కుతుంది. అప్పుడే నిద్రలేచిన యాన్ అది చూస్తుంది. లేచి నిల్చుని ఆబిగెయిల్‌ని పిలిచి తన కాలు మర్దనా చేయమంటుంది. ఆబిగెయిల్ మోకాళ్ళ మీద కూర్చుని మర్దనా మొదలుపెడుతుంది. “మీరు మంచం మీద పడుకుంటే మంచిదేమో” అంటుంది. “నేను మట్లాడితేనే నువ్వు మాట్లాడాలి” అంటుంది కర్కశంగా యాన్. మళ్ళీ “కళ్ళు తిరిగుతున్నాయి. నాకు ఊతం కావాలి” అని ఆబిగెయిల్ జుట్టు పట్టుకుంటుంది. ఆబిగెయిల్ మర్దనా చేస్తుంటే యాన్ ఆమె జుట్టు గట్టిగా పట్టుకుని ఉండిపోతుంది. అప్పుడు ఆబిగెయిల్‌కి తన స్థానమేమిటో అర్థమవుతుంది. ఆధిపత్యం కోసం సారాతో పోరు చేసినా చివరికి ఆమె రాణి కాళ్ళ దగ్గర ఉండక తప్పదు. ఆమె దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు. రాణికి కోపం వస్తే తన పరిస్థితి ఏమిటి? పైగా ఈ రాణి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇలా ఆమె ఆలోచిస్తూ ఉండగా చిత్రం ముగుస్తుంది. ఇలాంటి సన్నివేశంతో చిత్రాన్ని ముగించటం అభినందనీయం.

ధూర్జటి “రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు” అన్నాడు ఒక పద్యంలో. రాజులని నమ్ముకుంటే క్షణక్షణం భయపడుతూనే ఉండాలి. రాజులు అధికారంతో మత్తులై ఉంటారు. కలియుగంలో మరీనూ. ఇక యాన్ లాంటి రాణి గురించి ఏం చెప్పగలం? ఆమె ప్రాపకం కోసం ఎత్తుకి పై ఎత్తు వేసి ఆబిగెయిల్ ఏం బావుకుంది? ఇక్కడ యాన్ గురించి కూడా ఆలోచించాలి. తనకి ప్రాణప్రదమైన కుందేలుని ఆబిగెయిల్ తొక్కటంతో ఆమె మనసు విరిగిపోయింది. తనని నిజంగా ప్రేమించేవారు ఎవరూ లేరని ఆమె భావన. సారా ఆమెని నిజంగా ప్రేమించింది. కానీ ఆ సంగతి ఆమెకి తెలియనివ్వలేదు ఆబిగెయిల్. అందరి కథలూ విషాదంగానే మారాయి. దీనంతటికీ యాన్ అహంకారమే ముఖ్యకారణం. సామర్థ్యం సన్నగిల్లినా అధికారాన్ని పట్టుకుని వేలాడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here