మరుగునపడ్డ మాణిక్యాలు – 8: ఐ కేర్ ఎ లాట్

0
10

[dropcap]ఒ[/dropcap]క సినిమాలో మంచి, చెడుల మధ్య సంఘర్షణ ఉంటే మంచే గెలవాలని కోరుకుంటాం. ఇద్దరు మంచివాళ్ళ మధ్య సంఘర్షణ ఉంటే ఊగిసలాడుతూ ఉంటాం. ఇద్దరు చెడ్డవాళ్ళ మధ్య సంఘర్షణ ఉంటే ఎవరు హీరో అయితే వారి వైపు మొగ్గుతాం. ‘పుష్ప’ సినిమాలో లాగ. నాకా సినిమా నచ్చలేదనుకోండి. అది వేరే విషయం. ఇద్దరు చెడ్డవాళ్ళ మధ్య సంఘర్షణలో ప్రేక్షకుల్ని ఊగిసలాడే లాగ చేసిన అరుదైన చిత్రం ‘ఐ కేర్ ఎ లాట్’ (2020). ఒక వైపు జరుగుతున్న సంఘటనలు ఎంత దారుణమో అనుకుంటూనే తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసే లాగ చేస్తుంది ఈ చిత్రం. బ్లాక్ కామెడీ చిత్రాలలో ఇది మంచి నిర్మాణ విలువలతో తీసిన చిత్రం. బ్లాక్ కామెడీ అంటే మామూలుగా చెడ్డవాళ్ళకి ఎదురయ్యే సమస్యలని వాళ్ళెలా ఎదుర్కొంటారో చూపిస్తారు. చెడ్డవాళ్ళకి సమస్యలు ఎదురైతే ప్రేక్షకులు ఆనందిస్తారు. కానీ చెడ్డవాళ్ళ మీద కూడా సానుభూతి కలిగించటం అంటే మామూలు విషయం కాదు. అలాగని ఇదేదో ఆలోచింపజేసే చిత్రం అనుకునేరు. సరదా చిత్రమే. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

మార్లా ఒక ప్రొఫెషనల్ గార్డియన్. అంటే తమ బాగోగులు చూసుకోలేని వారికి సంరక్షకురాలుగా ఉంటుంది. ఎవరూ లేని వృద్ధుల సంరక్షణ చూసుకునే పని ఆమెది. ఇలాంటి బాధ్యతలు చేపట్టటానికి ఎలాంటి అర్హతలుండాలో నాకైతే తెలియదు. అది పక్కన పెడదాం. మార్లా తన సంరక్షణలో ఉన్నవారి ఆస్తులను అమ్మేసి డబ్బు చేసుకుంటూ ఉంటుంది. గార్డియన్ కాబట్టి ఆమెకి అన్ని హక్కులూ ఉంటాయి. ఆమెకు ఫ్రాన్ అనే భాగస్వామి ఉంటుంది. ఇద్దరూ ప్రేమికులు కూడా. మార్లాకి ఒక వృద్ధాశ్రమంతో ఒప్పందం ఉంటుంది. అక్కడి మేనేజర్ వీరితో కుమ్మక్కై ఉంటాడు. అక్కడ మార్లా మాటే శాసనం. అక్కడి వృద్ధులకి సరైన తిండి, మందులు ఇవ్వరు. మత్తు మందులు ఇస్తారు. ఏమన్నా అంటే మీ ఆరోగ్యానికి ఇదే మంచిది అంటారు. బయట ఒక డాక్టర్ కూడా వీరితో కుమ్మక్కై ఉంటుంది. తన దగ్గరకు వచ్చే వృధ్ధ పేషంట్లలో కొంత మందికి లేని ఆరోగ్య సమస్యలని సృష్టించి, ఆపై కోర్టుని ఆశ్రయించి వారి సంరక్షణని మార్లాకి వచ్చేలా చేస్తుంది ఆ డాక్టర్.

మార్లాకి మగవాళ్ళంటే ద్వేషం. ఆమె గతం మనకు తెలియదు. కానీ ఎవరో మగవాడి చేతిలో దారుణంగా మోసపోయిందనిపిస్తుంది. చిత్రం మొదట్లో ఒకతను వృద్ధాశ్రమంలోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తాడు. తన తల్లి అక్కడ ఉందని, చూడాలని అంటాడు. కానీ అతన్ని లోపలికి వెళ్ళనివ్వరు. అతను తలుపులు పగలగొట్టుకుని వెళ్ళాలని చూస్తాడు. సెక్యూరిటీ గార్డులు అతన్ని అడ్డుకుంటారు. తర్వాత అతను కోర్టుని ఆశ్రయిస్తాడు. తల్లి బాధ్యత అతను విస్మరించాడని, తాను ఆమెకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నానని అంటుంది మార్లా. జడ్జి ఆమెకి అనుకూలంగా తీర్పు ఇస్తాడు. కోర్టు బయట అతను మార్తాతో “నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను” అంటాడు. ఆమె “ఒక ఆడది నీ మీద గెలిచిందని అక్కసుగా ఉందా?” అని అతని చులకన చేసి మాట్లాడుతుంది. జడ్జి ముందు తన స్త్రీత్వాన్ని ఎంతో ఉన్నతంగా చూపిస్తుంది. బయట మగవారి మీద పైచేయి సాధించాలని పట్టుదలతో ఉంటుంది.

ఒకరోజు డాక్టరు జెన్నిఫర్ అనే వృద్ధురాలి గురించి చెబుతుంది. ఆమెకి నా అనేవారు ఎవరూ లేరని, పెళ్ళి చేసుకోలేదని, నలభై ఏళ్ళు ఉద్యోగం చేసి విరమణ తీసుకుందని, డబ్బు బాగానే కూడబెట్టిందని చెబుతుంది. జెన్నిఫర్ కి డెమెన్షియా (మనుషుల్ని గుర్తుపట్టలేని వ్యాధి) లక్షణాలు ఉన్నాయని కోర్టులో అబద్ధం చెప్పి డాక్టరు ఆమె సంరక్షణ మార్లాకి వచ్చేలా చేస్తుంది. విచిత్రమేమిటంటే ఇది చాలా సీరియస్ కేసని చెప్పి జెన్నిఫర్‌కి తెలియకుండానే ఈ తతంగమంతా జరుగుతుంది. కోర్టు ఆదేశాలని తీసుకుని మార్లా జెన్నిఫర్ ఇంటికి వెళ్ళి ఆమెని వృద్ధాశ్రమానికి తీసుకెళతానని అంటుంది. జెన్నిఫర్ ఒప్పుకోదు. ఇది కోర్టు ఆదేశమని, రానంటే పోలీసులు బలవంతంగా తీసుకెళతారని అంటుంది మార్లా. కావాలంటే వృద్ధాశ్రమంలో ఉండి కోర్టు ఉత్తర్వులని సవాలు చేయవచ్చని అంటుంది. విధి లేక వెళుతుంది జెన్నిఫర్. అక్కడికి వెళ్ళాక ఆమె ఫోను తీసేసుకుంటారు. ఇక్కడ మార్లా, ఫ్రాన్ ఆమె ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. ఆమె బ్యాంక్ లాకర్లో వజ్రాలు ఉంటాయి. మార్లా వాటిని తీసుకుని వచ్చేస్తుంది.

మనకి నెమ్మదిగా తెలిసేది ఏమిటంటే జెన్నిఫర్ రోమన్ అనే ఒక డ్రగ్స్ మాఫియా నాయకుడి తల్లి! అతను ఒక మరుగుజ్జు కానీ ఎంతో శక్తిమంతుడు. తన శత్రువులకి తెలియకుండా ఉండాలని తన తల్లి పేరు మార్చి, ఆమెకి దొంగ పత్రాలు సృష్టించి ఆమెని ఆ ఇంట్లో ఉంచాడు. అప్పుడప్పుడూ తల్లిని రప్పించుకుని కలుస్తూ ఉంటాడు. ఇది తెలియని మార్లా పోయి పోయి ఒక మాఫియా నాయకుడితో పెట్టుకుంది. ఇప్పుడు మనం మార్లాకి బాగా అయ్యిందిలే అనుకుంటాం. తల్లి సెంటిమెంటు పని చేస్తుంది. దాని ముందు రోమన్ డ్రగ్స్ మాఫియా నాయకుడు అనే విషయం పక్కన పెట్టేస్తాం.

అయితే రోమన్ వీలైనంత సాఫీగా తన తల్లిని బయటకు తీసుకురావటమే మంచిదని అనుకుంటాడు. సహజమే కదా! లేకపోతే అతని ఉనికి బయటపడిపోతుంది. అయితే అతను సామదానభేద దండోపాయాలన్నీ ఉపయోగించాల్సి వస్తుంది. మొదట తన లాయర్ని మార్లా దగ్గరికి పంపిస్తాడు. ఈ సన్నివేశం భలే బావుంటుంది. ఆ లాయరు తాను జెన్నిఫర్ లాయరునని, జెన్నిఫర్ ఆరోగ్యం బావుందని, ఆమె తనకి ఫోన్ చేసిందని, ఆమెని పంపించేయమని అంటాడు. మూడు నాలుగు వారాల క్రితం ఆమెని కలిశానని అంటాడు. మార్లా ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసింది. పైగా ఆమెకి జెన్నిఫర్ ఒక మాఫియా నాయకుడి తల్లి అని తెలియదు. ఆమెకి జెన్నిఫర్ డబ్బు ముఖ్యం. ఇక్కడ ఉన్నవి వజ్రాలు మరి. ఎందుకు వదులుకుంటుంది? ఆ వజ్రాల వాసన పసిగట్టి ఎవరో ఈ పథకం వేశారనుకుంటుంది. రెండు వారాల క్రితం అకస్మాత్తుగా జెన్నిఫర్ ఆరోగ్యం క్షీణించిందని, మతిమరుపు వచ్చిందని, అందుకే  కోర్టు ఆమెని తనకి అప్పగించిందని అంటుంది. లాయరుకి ఇక మంచి మాటలతో పని జరగదని అర్థమవుతుంది. బెదిరింపులకి దిగుతాడు. తర్వాత సంభాషణ ఇలా ఉంటుంది.

ఖరీదైన లాయరుగారు

లాయరు: నువ్వు వృద్ధులని ఎలా మోసం చేస్తున్నావో నాకు తెలుసు. అయినా అది నాకనవసరం. జెన్నిఫర్ ని మాత్రం వదిలెయ్.

మార్లా: నేనేం పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఆమెని వదిలేయటానికి? ఎందుకు వదలాలి?

లాయరు: ఎందుకు వదలాలో రెండు కారణాలు చెబుతాను. మొదటిది – అది ధర్మం కాబట్టి. కానీ నీకు ధర్మమంటే లెక్కలేదుగా. రెండోది – ఆమెకి ఎంతో శక్తిమంతమైన మిత్రులున్నారు. వారు నిన్ను అమితమైన ఇబ్బందులు పెట్టే సత్తా ఉన్నవాళ్ళు.

మార్లా: బెదిరిస్తున్నావా? ఏం ఇబ్బందులు పెడతారు?

లాయరు: ఊహించలేని ఇబ్బందులు. అంతే కాదు – ఇబ్బంది గానీ, సౌకర్యం గానీ లేని స్థితికి కూడా తీసుకెళ్ళగలరు. (ఈ మాట వ్రాసిన రచయితని మెచ్చుకోవాల్సిందే!)

మార్లా: అంటే చంపేస్తారా?

లాయరు: అందరం ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే. కొందరు అంతులేని వేదన అనుభవించి దారుణంగా అకాలమరణం పొందుతారు.

మార్లా (తొణకకుండా): నిన్నెవరు పంపించారు?

లాయరు: జెన్నిఫర్.

మార్లా: అబద్ధం. ఆమె నీకు ఫోన్ చేయలేదు. నా పట్టులోకి కొత్తగా వచ్చిన వాళ్ళని ఫోన్ దగ్గరకి వెళ్ళనిచ్చేంత తెలివితక్కువ దాన్ని కాదు. పైగా జెన్నిఫర్ లాయరు వేరే ఉన్నాడని నాకు తెలుసు. నిన్ను ఎవరు పంపించారో తెలుసుకోవాలని నాకు భలే ఆసక్తిగా ఉంది.

లాయరు (గంభీరంగా): ఆమెని వదిలెయ్.

మార్లా: వదలను.

లాయరు సామం పక్కన పెట్టి దానం లోకి దిగుతాడు. పెట్టె తెరిచి లక్షా యాభై వేల డాలర్లు చూపిస్తాడు. మార్లా యాభై లక్షల డాలర్లు అడుగుతుంది. మూడు లక్షల కన్నా ఒక్క డాలరు ఎక్కువ దక్కదంటాడు లాయరు. మగవాళ్ళది పైచేయి కాకుండా ఉండాలని తపించే మార్లా ససేమిరా అంటుంది. లాయరు ఆడదైతే ఏం చేసేదో మరి.

జెన్నిఫర్ అమాయకురాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే! తన కొడుకు ఎలాంటివాడో ఆమెకి తెలుసు. మార్లా జెన్నిఫర్ దగ్గరకి వెళ్ళి “నీ కోసం ఒక లాయరు వచ్చాడు” అని అంటే “ఖరీదుగా ఉన్నాడా?” అని అడుగుతుంది. ఔనని మార్లా అంటే “నీ పని అయిపోయిందిలే. వాడొస్తాడు” అని నవ్వుతుంది. మార్లా పరిస్థితి చూసి మనకి నవ్వొస్తుంది. ఇంతలో వజ్రాలు మాయమైన సంగతి రోమన్ కి తెలుస్తుంది. అతని కోపం నషాళానికంటుతుంది. అయినా అతనికి ముందు తల్లిని విడిపించటం ముఖ్యం. భేదోపాయం ఉపయోగిస్తాడు. తన అనుచరుల్ని మారువేషాల్లో వృద్ధాశ్రమానికి పంపించి తల్లిని తప్పించాలనుకుంటాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఎలా అన్నది చూస్తే బావుంటుంది. ఇక దండోపాయం. ఈ దండోపాయం ఎలా ఉంటుందంటే మన సానుభూతి మార్లా వైపుకి మళ్ళుతుంది. ఆమె, ఆమె ప్రేయసి ఫ్రాన్ కూడా ప్రాణాపాయంలో ఇరుక్కుంటారు. ఫ్రాన్ కోసం మార్లా పడే తపన చూసి మనం ఆమె వైపుకి పార్టీ ఫిరాయిస్తాం. మనుషులు బయట ఏం చేసినా సరే తమ సొంతవాళ్ళని కాపాడుకుంటే వాళ్ళే హీరోలైపోతారు. మమకారం అంత చెడ్డది. ‘పుష్ప’ సినిమాలో అదే పని చేసింది.

కొందరు వ్యవస్థలోని లోపాలని ఉపయోగించుకుని చట్టం నుంచి తప్పించుకుంటారు. జడ్జి తాను వృధ్ధులకి ఉపకారం చేస్తున్నానని అనుకుంటాడు కానీ అసలు బాగోతం ఏమిటని కనీసం ఆరా తీయడు. ఏమన్నా అంటే పని భారం, నిధుల కొరత అంటారు. ఇలా ఉన్నంత వరకు మార్లా లాంటి వారు మోసాలు చేస్తూనే ఉంటారు. వృద్ధాశ్రమంలో జరిగే అక్రమాలు ఎవరూ బయటపెట్టలేదా అని అనిపించకమానదు. పెద్దమనుషులే సరిగా తమ పని చేయనపుడు చిన్న ఉద్యోగులని ఏమంటాం? డాక్టరు దగ్గర గతంలో పని చేసిన ఒక అసిస్టెంటు ఆమె చేసే పనులని బయటపెడుతుంది. అయితే ఉద్యోగం పోయిందనే అక్కసుతో అమె తప్పుడు ఆరోపణలు చేసిందని చెప్పి మార్లా తప్పించుకుంటుంది. జడ్జి కూడా ఆమెనే నమ్ముతాడు. తాను సంఘసేవ చేస్తున్నట్టు అభిప్రాయం కలిగించి జడ్జిని మాయ చేస్తుంది. ఇలా గార్డియన్లు వృద్ధుల ఆస్తులు దోచుకోవటం అమెరికాలో నిజంగానే జరిగింది. దానికి వ్యంగ్యం జోడించి వ్యవస్థపై సంధించిన అస్త్రం ఈ చిత్రం.

ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు జే బ్లేక్సన్. స్క్రీన్ ప్లే ఆసాంతం ఆసక్తి కలిగించేలా ఉంటుంది. మాటలు పదునుగా ఉంటాయి. కథ అనేక మలుపులు తిరుగుతూ వెళుతుంది. చివర్లో ఒక పరిణామం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలోచిస్తే ఇలాంటి మనుషులు అలా చేయటంలో ఆశ్చర్యం ఏముంది అనిపిస్తుంది. మార్లాగా రోసమండ్ పైక్ నటించింది. ‘గాన్ గర్ల్’ చిత్రానికి ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న రోసమండ్ ఈ చిత్రానికి గాను ‘హాస్య చిత్రాలలో ఉత్తమ నటి’గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె తనకిష్టం లేనివారి ముందు చిరునవ్వు నవ్వేటపుడు కేవలం ఆమె పళ్ళు మాత్రమే నవ్వుతాయి, కళ్ళు గాజుల్లా కర్కశంగా ఉంటాయి. ‘నాకు లాభం లేకపోతే నీ మాటెందుకు వినాలి’ అనే ధోరణి చిత్రం పొడుగునా కనిపిస్తుంది. అలా డబ్బే పరమావధిగా జీవించేవారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారో తన నటనలో చూపిస్తుంది రోసమండ్. రోమన్‌గా పీటర్ డింక్లేజ్ నటించాడు. ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ టీవీ సీరీస్ తో ప్రజాదరణ పొందిన పీటర్ ఈ చిత్రంలో సున్నితత్వాన్నీ, కర్కశత్వాన్నీ తన హావభావాలలో చూపిస్తాడు. జెన్నిఫర్‌గా సీనియర్ నటి డయాన్ వియెస్ట్, లాయరుగా క్రిస్ మెసినా కొద్ది సీన్లలోనే గుర్తుండిపోయే నటన ప్రదర్శించారు. చిత్రంలో ముఖ్యపాత్రలన్నీ నైతికంగా చెడ్డవారు కావటం విశేషం. జెన్నిఫర్ కూడా ఒక దశలో తన మోచేతి సందులో మార్లా మెడని ఇరికించి చంపాలని ప్రయత్నిస్తుంది. రోమన్ తల్లి దగ్గర కూడా పాఠాలు నేర్చుకున్నాడేమో అనిపిస్తుంది. అసలు అతని తల్లే అతన్ని డ్రగ్స్ మాఫియాలోకి పంపిందేమో!

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత చదవవచ్చు.

జెన్నిఫర్‌ని తప్పించే ప్రయత్నం విఫలం కావటంతో ఆమె మార్లాని చంపాలని ప్రయత్నిస్తుంది. అది సీసీ కెమెరాలో రికార్డవుతుంది. మార్లా తోక తొక్కిన పాములా మరింత కక్ష పెంచుకుని కోర్టులో ఆ వీడియో చూపించి జెన్నిఫర్‌ని మానసిక వైద్యశాలకి తరలిస్తుంది. దొరికిపోయిన రోమన్ అనుచరుడు ఏమీ చెప్పకపోయినా అతని నేరచరిత్ర ఆధారంగా అతని రోమన్ అనుచరుడని తెలుస్తుంది. రోమన్ దండోపాయంలో మొదటి చర్యగా డాక్టరుని హత్య చేయిస్తాడు. దీంతో ఫ్రాన్ భయపడిపోతుంది. మార్లా ఆమెని సముదాయిస్తుంది. ఇద్దరూ వేరే ఇంటికి మారతారు. ఆ ఇల్లు కూడా మోసపోయిన ఒక వృద్ధుడి లేదా వృద్ధురాలి ఇల్లే. అయితే రోమన్‌ని వారు తక్కువ అంచనా వేశారు. అతనికి ఉన్న బలగం పెద్దది. మార్లాని అపహరణ చేయిస్తాడు. అదే సమయంలో ఫ్రాన్ మీద వారున్న ఇంట్లో దాడి జరుగుతుంది. రోమన్ మార్లాని కలుస్తాడు. తల్లిని, వజ్రాలని అప్పగించమని అంటాడు. మార్లా కోటి డాలర్లిస్తే అప్పగిస్తానంటుంది. ఈ ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుందని ఆమె భావన. నీ ‘వస్తువు’ నా దగ్గర ఉంటే దానికి సరైన వెలకట్టి తీసుకో అంటుంది. రోమన్‌కి ఆ స్తోమత ఉందని ఆమెకి తెలుసు. తనని చంపేస్తే వజ్రాలు ఎక్కడున్నాయో తెలియకుండా పోతుందని అంటుంది. రోమన్ కరడుకట్టినవాడు. ఆమెని చంపేయమని తన అనుచరులకి చెబుతాడు. వారు ఆమెకి మత్తు మందు ఇచ్చి కారులో డ్రైవరు సీటులో కూర్చోబెట్టి కారు ఒక చెరువులో పడేలా చేస్తారు. ఆమె తాగి కారు నడుపుతూ ప్రమాదం పాలైందని పోలీసులు అనుకోవాలని వారి పథకం. అయితే మార్లా మేలుకుని కారులో నుంచి బయటపడి ఇంటికి చేరుతుంది. అక్కడ ఫ్రాన్ గ్యాస్ ప్రమాదంలో మరణించేటట్టు పథకరచన చేసి ఉంటుంది. మార్లా ఆమెని తప్పించి వేరే ఇంటికి తీసుకెళుతుంది. ఆ ఇల్లు ఎవరిదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

ఆ ఇంట్లో దాచిన వజ్రాలు మార్లా ఫ్రాన్‌కి చూపిస్తుంది. “నీకు కావాలంటే ఇప్పుడే మనం వేరే చోటికి వెళ్ళిపోయి కొత్త జీవితం ప్ర్రారంభించవచ్చు. అయితే రోమన్ ఎప్పుడు మనల్ని పట్టుకుంటాడా అని భయపడుతూ ఉండాలి. అలా కాక అతని మీద ప్రతీకారం తీర్చుకుంటే మనం నిశ్చింతగా ఉండవచ్చు” అంటుంది ఫ్రాన్‌తో. ఫ్రాన్ ప్రతీకారం తీర్చుకుందామంటుంది. ఇక్కడ మన సానుభూతి మార్లా, ఫ్రాన్ లపైకి మళ్ళుతుంది. ఎలాగైనా వాళ్ళు ప్రతీకారం చేయాలి అని అనిపిస్తుంది. మరి తల్లి సెంటిమెంటు ఏమైంది? అదే రచయిత ప్రతిభ. తల్లీకొడుకులు ఇద్దరూ చెడ్డవారే కావటంతో మార్లాకి, ఫ్రాన్ కి అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రోమన్‌ని కలిసినపుడు అతని కారు నంబరు గుర్తుపెట్టుకుంటుంది మార్లా. అది డ్రైవరు పేరు మీద ఉన్న కారు. ఆ నంబరు సాయంతో డ్రైవరు అడ్రసు పట్టుకుని ఆ కారుని వెంబడించి రోమన్ ఉన్నచోటికి చేరుకుంటారు మార్లా, ఫ్రాన్. మార్లా డ్రైవరుకి టేజర్ గన్‌తో షాక్ ఇచ్చి రోమన్ కారు ఎక్కగానే అతనికి మత్తు ఇంజక్షన్ ఇస్తుంది. అతన్ని అడవిలోకి తీసుకెళ్ళి డ్రగ్స్ ఎక్కించి, అతని బట్టలన్నీ ఊడదీసి వదిలేస్తారు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని పోలీసులు రక్షిస్తారు కానీ అతని దగ్గర ఏ గుర్తింపు కార్డూ లేకపోవటంతో అతన్ని అనామకుడిగా నిర్ణయించి హాస్పటల్లో చేర్పిస్తారు. అతని సంరక్షణ బాధ్యతని ఎవరికో ఒకరికి అప్పగించాలి. ఇంకెవరికి, మార్లాకే అప్పగిస్తాడు జడ్జి! రోమన్ కళ్ళు తెరిచేసరికి మార్లా అతని ఎదురుగా ఉంటుంది. కోటి డాలర్లిస్తే అతన్ని, అతని తల్లిని వదిలేస్తానంటుంది.

ఇద్దరు మంచివాళ్ళు సంఘర్షణ పడితే వాళ్ళిద్దరూ కలిసిపోతే బావుంటుందని కోరుకుంటాం. ఇద్దరు సమఉజ్జీలైన చెడ్డవారు తలపడితే ఏం జరుగుతుంది? ఊహించటం కష్టమేమీ కాదు. వాళ్ళిద్దరూ కలిసిపోయి భాగస్వాములైపోతారు. ఇక్కడ అదే జరుగుతుంది. మార్లా ఎంత క్రూరమైనదో అర్థమైన రోమన్ ఆమెని ‘వ్యాపారం’ విస్తరించమని చెబుతాడు. పెట్టుబడి పెడతానంటాడు. లాభాలు పంచుకోవచ్చంటాడు. వజ్రాలు కూడా పంచుకుందామంటాడు. షరతు ఏమిటంటే అతని తల్లిని వదిలెయ్యాలి. సహజంగానే మార్లా ఒప్పుకుంటుంది. వృద్ధుల సంరక్షణని ఒక మహావ్యాపారంగా మార్చేసి కోట్లకి పడగలెత్తుతుంది.

అయితే కర్మఫలం అనుభవించక తప్పదు కదా! మొదట్లో తన తల్లి కోసం వచ్చిన వ్యక్తి తన తల్లి వృద్ధాశ్రమంలో చనిపోయిందని, చివరి చూపు కూడా దక్కలేదని ఒకరోజు మార్లా ఫ్రాన్‌తో కలిసి తన కారు దగ్గరకి వెళుతుండగా తుపాకీతో కాలుస్తాడు. మార్లా ఫ్రాన్ ఒడిలో మరణిస్తుంది. ఈ ముగింపుతో ఇది ఒక నీతికథగా మారుతుంది. అవకాశం ఉంది కదా అని వంచన చేస్తే ఫలితం అనుభవించాలి. చట్టాన్ని ఏమార్చవచ్చేమో గానీ మనుషుల భావోద్వేగాలను మార్చలేం కదా! ఏ దారీ లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారూ ఉంటారు. వృద్ధులని ఎవరూ పట్టించుకోరు అనే అభిప్రాయంతో ఉంది మార్లా. ప్రతి విషయానికీ మినహాయింపులుంటాయి. తల్లిని అమితంగా ప్రేమించే ఒక మంచి మనిషి చేతిలో ప్ర్రాణాలు పోగొట్టుకుంది. విషాదమేమిటంటే ఆ మంచి మనిషి హంతకుడిగా మారాడు. వ్యవస్థ మేలుకోకపోతే అతనికీ శిక్ష పడుతుంది. వ్యవస్థ మేలుకుంటుందనే ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here