[సంచిక పాఠకుల కోసం ‘తెల్మా ఎండ్ లూయీస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[dropcap]‘తె[/dropcap]ల్మా ఎండ్ లూయీస్’ (1991) కి అప్పట్లో స్త్రీవాద చిత్రంగా ముద్ర వేశారు. ఇప్పుడు స్త్రీల పరిస్థితులు మారాయా? 2017లో ‘మీ టూ’ అనే ఉద్యమం జరిగింది. స్త్రీలు తమపై జరిగిన అత్యాచారాల గురించి చెప్పి ఉద్యమం చేశారు. ఇంటి నుంచి బయటకి వెళితే స్త్రీల పరిస్థితులు మారలేదనే చెప్పాలి. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కార్యాలయాల్లో కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బయటికి వెళ్ళొద్దు, ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు లాంటి కట్టుబాట్లు తప్పటం లేదు. ‘నువ్వు బరితెగించినట్టు ఉండకపోతే వాడు నీ జోలికి ఎందుకు వస్తాడు?’ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం మంచిదే కానీ స్త్రీ వద్దు అంటే ఆ మాటని గౌరవించాలని మగవాళ్ళ బుర్రల్లోకి ఎందుకు ఎక్కటం లేదు? ‘తెల్మా ఎండ్ లూయీస్’ చిత్రం ఇప్పుడు చూస్తే పరిస్థితులు ఏమంత మారలేదు అని ఒక నిట్టూర్పు విడవాలి. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.
తెల్మా, డ్యారిల్ అమెరికాలోని ఆర్కన్సా రాష్ట్రంలో ఉండే భార్యాభర్తలు. డ్యారిల్ ఉద్యోగం చేస్తుంటాడు. తెల్మా ఇంట్లో ఉంటుంది. అతనికి పురుషాహంకారం ఎక్కువ. ఆమెని ఎక్కడికీ వెళ్ళనివ్వడు. రాత్రుళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటాడు. అతనికి అక్రమసంబంధం ఉందని తెల్మాకి అనుమానం. అయినా ఆమె అణిగిమణిగి ఉంటుంది. అభద్రత కావచ్చు. లూయీస్ తెల్మా స్నేహితురాలు. ఒక రెస్టారెంట్లో సేవికగా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి జిమ్మీ అనే ప్రియుడు ఉంటాడు. అతనో గాయకుడు. ప్రదర్శనలు ఇవ్వటానికి ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. రోజుల తరబడి వేరే ఊళ్ళలోనే ఉంటాడు. లూయీస్ అసహనంగా ఉంటుంది. ఒక సందర్భంలో తెల్మా “జిమ్మీని వదిలించుకోవచ్చుగా” అంటుంది. లూయీస్ “నువ్వు నీ పనికిమాలిన మొగుణ్ణి వదిలేయొచ్చుగా” అంటుంది. ఇద్దరూ రాజీపడుతూ బ్రతుకుతూ ఉంటారు. రాజీపడటం తప్పేం కాదు. కానీ ఎప్పుడూ ఆడవాళ్ళే రాజీపడాలనటం అన్యాయం.
ఒక వారాంతం లూయీస్ తెల్మాని తనతో విహారయాత్రకి రమ్మంటుంది. కొండ ప్రాంతంలో ఒక క్యాబిన్‌కి వెళ్ళి చింతలన్నీ మరచిపోయి ప్రశాంతంగా గడపాలని ఆమె ఆశ. లూయీస్ జిమ్మీకి చెప్పాలని అతని ఇంటికి ఫోన్ చేస్తుంది కానీ వేరే ఊరు వెళ్ళిన అఅతను ఇంకా ఇంటికి తిరిగిరాలేదు (అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు). తెల్మా డ్యారిల్‌తో చెప్పి వెళదామని ప్రయత్నిస్తుంది కానీ అతను చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు. అతనికి చెప్పకుండానే లూయీస్‌తో కారులో బయల్దేరుతుంది. లూయీస్‌తో “అతనెలాగూ నన్ను వెళ్ళనివ్వడు. అందుకే ఒక ఉత్తరం రాసి పెట్టి వచ్చేశాను” అంటుంది. ఆమె బయల్దేరేటపుడు దాదాపు తన దగ్గరున్న బట్టలన్నీ తెచ్చుకుంటుంది. పంజరం నుంచి బయటపడిన చిలుకలా ఉంటుంది. తన దగ్గరున్న గన్ను కూడా తెచ్చుకుంటుంది. అమెరికాలో రక్షణ కోసం గన్ను ఉంచుకోవటం మామూలే. అయితే తెల్మాకి గన్ను వాడటం రాదు. భర్త కొన్నాడు. లూయీస్‌కి గన్ను ఇస్తుంది. గన్నెందుకు తెచ్చావని లూయీస్ అడిగితే “సైకో హంతకులుండొచ్చుగా” అంటుంది.
తెల్మా తనకి దొరికిన స్వేచ్ఛని పూర్తిగా వాడుకోవాలన్నట్టు ఉంటుంది. ఆమె కోరటంతో లూయీస్ కారుని ఒక నైట్ క్లబ్‌కి తీసుకువెళుతుంది. అక్కడ సంగీతం మోగుతూ ఉంటుంది. ఒక గాయకుడు పాట పాడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. తెల్మా ఉల్లాసంగా ఉంటుంది. లూయీస్ మాత్రం కొంచెం బెరుకుగా ఉంటుంది. “నేను టెక్సాస్ నుంచి వచ్చేశాక ఇలాంటి చోటికి వెళ్ళలేదు” అంటుంది. తెల్మా డ్రింక్ తెప్పించుకుంటుంది. లూయీస్ “నిన్నిలా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ స్తబ్ధుగా ఉండేదానివి” అంటుంది. “చింతలన్నీ మరచిపోదామన్నావుగా. అదే చేస్తున్నాను” అంటుంది తెల్మా. “సరే అయితే” అని లూయీస్ కూడా డ్రింక్ తాగుతుంది. హార్లన్ అనే అతను వారి దగ్గరకి వస్తాడు. తెల్మాతో తీయగా మాట్లాడుతుంటాడు. తెల్మాని తనతో డ్యాన్స్ చేయమంటాడు. తెల్మా వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. కాసేపటికి తెల్మాకి కళ్ళు తిరగటం ప్రారంభమవుతుంది. హార్లన్ చల్లగాలి తగలాలని చెప్పి ఆమెని బయటకి తీసుకువెళతాడు. అప్పుడు లూయీస్ బాత్రూమ్‌లో ఉంటుంది. హార్లన్ కార్లు పార్కింగ్ చేసి ఉన్నచోట తెల్మాని బలాత్కరించబోతాడు. ఆమె వద్దంటూ ప్రాధేయపడుతుంది.
అతను ఆమెని గట్టిగా చెంపదెబ్బ కొడతాడు. ఆమెకి ముక్కులోంచి రక్తం వస్తుంది. ఆమెని అదిమిపట్టి అత్యాచారం చేయబోతుంటే లూయీస్ వస్తుంది. తెల్మా ఇచ్చిన గన్ను అతని మెడమీద పెట్టి “ఆమెని వదిలెయ్” అంటుంది. “ఏదో చిన్న సరదా అంతే” అంటాడు. “ఇదేం సరదా? వదులు” అంటుందామె. అతను వదిలేస్తాడు. తెల్మా ఏడుస్తూ లూయీస్ దగ్గరకి వస్తుంది. లూయీస్ హార్లన్‌తో “ఒక ఆడది అలా ఏడుస్తుంటే ఆమెకి ఆ పని సరదా కాదని గుర్తుంచుకో” అంటుంది. ఇద్దరూ వెళ్ళిపోతుంటే హార్లన్ బూతుమాటలు మాట్లాడుతూ “నా సరదా ఏదో తీర్చేసుకుంటే సరిపోయేది” అంటాడు. లూయీస్‌కి పిచ్చికోపం వస్తుంది. వెనక్కి వచ్చి గన్నుతో అతన్ని కాల్చేస్తుంది. “నోరు అదుపులో పెట్టుకో” అంటుంది. అప్పటికే అతను చనిపోతాడు.
వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోక లూయీస్ వెనక్కి వచ్చి అతన్ని ఎందుకు చంపింది? నిజానికి ఆమె టెక్సాస్‌లో ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం జరిగింది. ఇది చిత్రంలో స్పష్టంగా చెప్పటం గానీ, చూపించటం గానీ జరగదు. అక్కడక్కడా మాటల్లో మనకి తెలుస్తుంది. ఈ విషయం తెల్మాకి కూడా తెలియదు. ఆ భయంకర అనుభవం తాలూకు గాయాలు లూయీస్ మనసులో ఉన్నాయి. హార్లన్ అన్న మాటలకి ఆమెకి మనసు వికలం అయిపోయింది. మనస్తత్వ శాస్త్రంలో దీన్ని Post-traumatic stress disorder (PTSD) అంటారు. ఒక భయంకర సంఘటన వలన కుంగిపోవటం, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. యుద్ధంలో పోరాడిన సైనికులు ఇంటికి తిరిగివచ్చాక ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. లూయీస్‌కి ఆ సంఘటన మళ్ళీ కళ్ళ ముందు జరుగుతుంటే అలజడి మొదలయింది. అతను అవమానకరంగా మాట్లాడటంతో ఆమె ఆ క్షణంలో అతన్ని తన మీద అత్యాచారం చేసినవాడిగానే భావించింది. అతను కూడా నోరు పారేసుకుని ఉంటాడు. అప్పుడు చట్టం ఆమెకి న్యాయం చేయలేకపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలియని స్థితిలో అతన్ని చంపేసింది. శరీరానికి జరిగిన అవమానం కంటే మాటల వల్ల జరిగిన అవమానం ఆమెకి మరపురానిది. అందుకే ‘నోరు అదుపులో పెట్టుకో’ అంది. ఇక్కడ గుర్తుంచుకోవలసింది మాటలు ఒక్కోసారి తీవ్రమైన గాయాలు చేస్తాయి. అందుకే మాటలు అదుపులో పెట్టుకోవాలి. ప్రస్తుత సంఘటనని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఆమె చేసింది ఘోరంగా అనిపించవచ్చు. బూతుమాటలు మాట్లాడాడని చంపటం తప్పుకి మించిన శిక్ష అని చట్టం అనవచ్చు. అది లూయీస్‌కి కూడా తెలుసు. అయితే చట్టంలో ‘Temporary insanity’ (తాత్కాలిక ఉన్మాదం) అనే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో మతిస్థిమితం కోల్పోయి నేరం చేశారని చెప్పవచ్చు. లూయీస్ విషయంలో ఇది నిజమే. కానీ నిరూపించటం కష్టం. మంచి లాయరు ఉండాలి.
లూయీస్, తెల్మా కారులో హడావిడిగా బయలుదేరతారు. తెల్మా “పోలీసుల దగ్గరకి వెళదాం. అతను రేప్ చేయటానికి ప్రయత్నించాడని చెబుదాం” అంటుంది. “నువ్వు అతనితో డ్యాన్స్ చేయటం అందరూ చూశారు. నువ్వే అతన్ని రెచ్చగొట్టావని కూడా అంటారు. నీకు తెలియదు” అంటుంది లూయీస్. “మరి ఏం చేద్దాం” అని తెల్మా అంటే “నన్ను ఆలోచించుకోనీ” అంటుంది. ఆమెరికాలో స్త్రీలు పరపురుషులతో డ్యాన్స్ చేయటం మామూలు విషయమే. అందుకే తెల్మా చేసింది పూర్తిగా తప్పు కాదు. అయినా అతను రేప్ చేయటానికి ప్రయత్నించాడంటే చట్టం నమ్మకపోవచ్చు. ‘నువ్వే అతని మీద పడి ఉంటావు’ అని ప్రాసిక్యూషన్ లాయరు అనవచ్చు. నిజం ఉన్నదున్నట్టు చెబితే అతను రేప్ ప్రయత్నం విరమించుకున్నాక చంపారు అని తెలుస్తుంది. సైకో హంతకులు ఏ కారణం లేకుండా చంపుతారు. వీళ్ళూ అలాంటి వాళ్ళే అనవచ్చు. ఆడది ‘వద్దు’ అన్నా కూడా ఆమెని వదలకపోవటం తప్పు. వద్దన్నానని ఆమె చెబితే ఆమె అబద్ధం చెబుతోంది అనవచ్చు. అంత దాకా ఎందుకు? లూయీస్ ఆందోళనలో “నువ్వు నైట్ క్లబ్‌కి వెళ్ళాలని పట్టుబట్టి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు” అంటుంది. నైట్ క్లబ్‌కి వెళ్ళటం నేరమేం కాదు. డ్యాన్స్ చేయటం నేరమేం కాదు. అయినా ఆడదాన్ని తప్పు పట్టటం మానరు. ఆడవాళ్ళు కూడా!
వారు ఇద్దరూ ఒక మోటెల్‌లో గది తీసుకుంటారు. తెల్లవారు జామున తెల్మా ఇంటికి ఫోన్ చేస్తుంది కానీ ఎవరూ ఎత్తరు. అంటే డ్యారిల్ రాత్రంతా ఎక్కడో ఉన్నాడు. తెల్లవారాక లూయీస్ జిమ్మీకి ఫోన్ చేస్తుంది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె లేకపోవటంతో అసహనంగా ఉంటాడు. ఆమె “నేనొక పెద్ద తప్పు చేశాను. అది దిద్దుకోలేని తప్పు. ఇంతకు మించి చెప్పలేను. నా అకౌంట్లో డబ్బు ఉంది. నువ్వు నాకు నీ డబ్బు పంపిస్తే తర్వాత నీకు తిరిగి ఇచ్చేస్తాను” అంటుంది. అతనికి అర్థం కాకపోయినా డబ్బు పంపిస్తానంటాడు. అప్పట్లో మనీ ఆర్డర్ ఉండేది. డబ్బు లావాదేవీలు చేసే ఒక కంపెనీ వారి ఓక్లహోమా సిటీ ఆఫీసుకి డబ్బు పంపించమని లూయీస్ చెబుతుంది. ఆమె దేశం విడిచి మెక్సికో వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. పోలీసులు పట్టుకునే లోగా దేశం విడిచిపోతే తర్వాత పట్టుబడటం కష్టం. మెక్సికోకి వెళ్ళేదారిలో ఓక్లహోమా సిటీ ఉంది. లూయీస్ తెల్మాతో తాను మెక్సికో వెళ్ళిపోతానని, ఆమె ఇంటికి వెళ్ళిపోవచ్చని అంటుంది. తెల్మా ఇంటికి ఫోన్ చేస్తుంది. డ్యారిల్ ఎత్తుతాడు. “రేపు సాయంత్రానికి ఇంటికి వస్తాను” అంటుంది తెల్మా. “నువ్వు ఈరోజే రావాలి. లేకపోతే..” అని ఆగి “ఆ మాట నేను అనను” అంటాడు. అంటే విడాకులన్నమాట. తెల్మాకి కోపం వస్తుంది. రాత్రంతా ఇంటికి రాకుండా బయట తిరుగుతాడు. పైగా విడాకులిస్తానంటాడు. తెల్మా “ఏట్లోకి పో” అని ఫోన్ పెట్టేస్తుంది. ఆమె కూడా మెక్సికో వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఆమెకి డ్యారిల్ దగ్గరకి వెళ్లటం ఇష్టం లేదు.
ఇదంతా జరుగుతూ ఉండగా అర్కన్సా రాష్ట్ర పోలీసు ఆఫీసర్ హ్యాల్ హత్య జరిగిన చోట విచారణ మొదలుపెడతాడు. నైట్ క్లబ్ సేవిక హార్లన్ ఇద్దరు స్త్రీలతో మాట్లాడటం చూశానని చెబుతుంది. హార్లన్ ఆకతాయి అని ఆమెకి తెలుసు. ఒక ఆకుపచ్చ థండర్బర్డ్ కారు నైట్ క్లబ్ నుంచి హడావిడిగా వెళ్ళటం చూశామని కొందరు చెబుతారు. కారు వివరాలని బట్టి లూయీస్ పేరు తెలుస్తుంది. లూయీస్ పని చేసే రెస్టారెంట్ కి వెళితే ఆమె క్యాబిన్‌కి వెళ్ళిందని తెలుస్తుంది. ఆ క్యాబిన్ ఆ రెస్టారెంట్ మ్యానేజర్‌దే. అయితే వారు క్యాబిన్కి చేరుకోలేదని కూడా తెలుస్తుంది. తెల్మా లూయీస్‌తో వెళ్ళిందని రెస్టారెంట్ సిబ్బంది చెబుతారు. హ్యాల్ లూయీస్ ఇంటికి వెళతాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో తెల్మా ఇంటికి వెళతాడు. డ్యారిల్‌కి హత్య విషయం చెబుతాడు. డ్యారిల్‌కి మతిపోయినట్టుంటుంది. అతనికి తెల్మా మళ్ళీ ఫోన్ చేస్తుందని అతని ఫోన్ ట్యాప్ చేసి పోలీసుల్ని అక్కడ పెడతాడు హ్యాల్. నిందితులు రాష్ట్రం దాటి వెళ్ళిపోతారని ఊహించి ఎఫ్.బీ.ఐ.కి సమాచారం ఇస్తారు. అది కేంద్ర విచారణ సంస్థ. ఇక్కడ నుంచి కథ అనుకోని మలుపులు తిరుగుతుంది.
క్యాలీ ఖూరీ రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా రిడ్లీ స్కాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. క్యాలీ ఖూరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. తెల్మాగా జీనా డేవిస్, లూయీస్‌గా సూసన్ శారండన్ నటించారు. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. తెల్మా ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ఉంటుంది. ఆ పాత్రలో జీనా ఒదిగిపోయింది. లూయీస్‌కి గతం మిగిల్చిన గాయాలు ఉండటం వల్ల రాటుదేలినట్టు ఉంటుంది. “హార్లన్ నిన్ను రేప్ చేయటానికి ప్రయత్నించాడని నిరూపించటానికి ఏ ఆధారాలూ లేవు. ఆధారాలు లేకపోతే అతను తప్పు చేశాడని చట్టం ఒప్పుకోదు” అంటుంది. తెల్మా “చట్టం ఇంత తిరకాసుగా ఉంటుందా? అయినా నీకివన్నీ ఎలా తెలుసు?” అంటుంది. లూయీస్ మాట్లాడదు. చిత్రకథ గంభీరంగా ఉన్నా హాస్యం కూడా ఉంటుంది. పోలీసులకి తమ మీద అనుమానం వచ్చిందా లేదా అని తెల్మాని డ్యారిల్ కి ఫోన్ చేయమంటుంది లూయీస్. డ్యారిల్‌కి పోలీసులు విషయం చెప్పారని అనుమానం వస్తే వెంటనే ఫోన్ పెట్టేయమంటుంది. తెల్మా డ్యారిల్‌కి ఫోన్ చేస్తుంది. పోలీసులు అక్కడే ఉంటారు. డ్యారిల్ ఫోన్ ఎత్తి తెచ్చిపెట్టున్న ఉల్లాసంతో “తెల్మా! హలో!!” అంటాడు. తెల్మా వెంటనే ఫోన్ పెట్టేసి “వాడికి విషయం తెలిసిపోయింది” అంటుంది. ఎప్పుడూ విసుగుపడే మొగుడు ప్రేమగా మాట్లాడితే ఏ భార్యకైనా అనుమానం వస్తుంది మరి.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.
తెల్మా, లూయీస్ మెక్సికోకి బయల్దేరుతారు. లూయీస్ “టెక్సాస్ లోకి వెళ్ళకుండా మెక్సికో వెళదాం. మ్యాప్‌లో దారి చూసి చెప్పు” అంటుంది. ఒక్లహోమా సిటీ నుంచి మెక్సికో వెళ్ళాలంటే టెక్సాస్ గుండా వెళితే త్వరగా వెళ్లొచ్చు. టెక్సాస్ పెద్ద రాష్ట్రం. టెక్సాస్ గుండా వెళ్ళకపోతే చుట్టు తిరిగి వెళ్ళాలి. తెల్మా అదే మాట అంటుంది. లూయీస్ “ఒక విలాసపురుషుడిని చంపి టెక్సాస్‌లో దొరికిపోతే అంతే సంగతులు” అంటుంది. ప్రతి రాష్ట్రంలో చట్టాలు వేరుగా ఉంటాయి. టెక్సాస్‌లో పురుషులకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయన్నమాట. అందుకే అక్కడ లూయీస్‌కి న్యాయం జరగలేదు. తెల్మా అసలేం జరిగింది అని అడుగుతుంది కానీ లూయీస్ “నేను ఆ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు” అంటుంది. పెద్ద హైవేల మీద కాకుండా లోపలి దారుల్లో ప్రయాణం చేస్తుంటారు. దారిలో ఆగిన చోట తెల్మాకి జేడీ అనే ఒక యువకుడు పరిచయమవుతాడు. తానొక విద్యార్థినని చెబుతాడు. వారి కారులో రావచ్చా అని అడుగుతాడు. అతను అందగాడు. పైగా తెల్మా డ్యారిల్‌కి వదిలేసి పారిపోతోంది. అందుకని అతన్ని తమ కారులో ఎక్కించుకుంటుంది. లూయీస్ ఇష్టం లేదు కానీ తెల్మా మాట కాదనలేకపోతుంది. ఆమె ఇన్నాళ్ళూ ఏ సరదాలూ లేకుండా గడిపింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. అయితే ఓక్లహోమా సిటీ చేరగానే అతను దిగిపోవాలని లూయీస్ షరతు పెడుతుంది. అతను అలాగే దిగిపోతాడు. అయితే దారిలో పోలీసు కార్లు కనపడినపుడు లూయీస్ భయపడటంతో అతనికి అనుమానం వస్తుంది.
ఓక్లహోమా సిటీ చేరేసరికి జిమ్మీ అక్కడ ఉంటాడు. డబ్బు తెస్తాడు. రావద్దని చెప్పినా అతను రావటం లూయీస్‌కి నచ్చదు. ఒక మోటల్‌కి వెళ్ళి తెల్మాని ఒక గదిలో ఉంచి, డబ్బు ఆమె దగ్గర పెడుతుంది లూయీస్. జిమ్మీతో మరో గది తీసుకుంటుంది. జిమ్మీ ఏం జరిగిందని గుచ్చి గుచ్చి అడుగుతాడు. లూయీస్ చెప్పకపోయే సరికి అసహనంతో అక్కడున్న టేబుల్ ఎత్తి పడేస్తాడు. “నువ్వు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తే నేను ఉండను” అంటుంది లూయీస్. జిమ్మీకి ఇలాంటి ప్రవర్తన కొత్త కాదన్నమాట. డ్యారిల్ లాగా తెరచాటు బాగోతాలు నడిపేవారు కొందరు. జిమ్మీ లాగ కోపం చూపించి భయపెట్టేవారు కొందరు. జిమ్మీ లూయీస్‌ని శాంతింపజేసి ఆమెకి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇస్తాడు. అంటే పెళ్ళి చేసుకోమని అడిగినట్టు. ఆమె మరో పురుషుడితో వెళ్ళిపోతోందని అతని భయం. భయమనే పునాది మీద నిలబెట్టిన పెళ్ళి కూలిపోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది? అయినా లూయీస్ ఇప్పుడు పెళ్ళి చేసుకునే పరిస్థితిలో లేదు. అతనికి సర్దిచెబుతుంది. అతను ఇక లాభం లేదని అర్థం చేసుకుంటాడు.
మరోపక్క జేడీ తెల్మా గదికి వెళతాడు. ఆమెని వదిలి వెళ్ళలేకపోయానన్నట్టు మాట్లాడతాడు. తెల్మా అతన్ని గదిలోకి రమ్మంటుంది. మాటల్లో అతను ఒక దొంగ అని తెలుస్తుంది. జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అయినా తెల్మాకి అతన్ని వదిలించుకోవాలని అనిపించదు. ఆమె అతని మాయలో పడిపోయింది. అతను తాను దుకాణాల్లోకి వెళ్ళి తుపాకీతో బెదిరించి ఎలా దొంగతనం చేస్తాడో చెబుతాడు. తర్వాత ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. మర్నాడు ఆమె మోటెల్ వారి రెస్టారెంట్‌కి వెళ్ళేసరికి లూయీస్ అక్కడ ఉంటుంది. అప్పటికే ఆమె జిమ్మీకి వీడ్కోలు చెప్పి పంపించేసింది. తెల్మా లూయీస్‌తో “ఇన్నాళ్ళూ అందరూ సెక్స్ గురించి గొప్పగా చెబితే ఏమిటో అనుకున్నాను. నిన్న రాత్రి తెలిసింది” అంటుంది ఆనందంగా. లూయీస్ “ఇన్నాళ్ళకి నీకు సరైన సెక్స్ లభించిందన్నమాట” అంటుంది. కొంతమంది పురుషులకి ఆబగా ఆడదాన్ని ఆక్రమించుకోవటమే తెలుసు. సరససల్లాపాలు తెలియవు. రెండేళ్ళ క్రితం వచ్చిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచన్’ అనే మలయాళ చిత్రంలో సంభోగానికి ముందు సరససల్లాపాలు కావాలని నాయిక భర్తని అడుతుంది. అతను “నువ్వు పెద్ద ఆధునిక మహిళవనుకుంటున్నావా?” అంటాడు. సెక్స్ అంటే పురుషుడి హక్కు అన్నట్టే ఉంటారు ఇలాంటి వాళ్ళు.
తెల్మా రెస్టారెంట్లో ఉండగా జేడీ డబ్బు పట్టుకుని పారిపోతాడు. ఆ విధంగా మరో మగాడి చేతిలో దగాపడతారు వాళ్ళిద్దరూ. లూయీస్ నిస్పృహలో కూరుకుపోతుంది కానీ తెల్మా ఆమెకి ధైర్యం చెప్పి ఆమెని తీసుకుని బయల్దేరుతుంది. దారిలో కారు ఆపి ఆమె ఒక దుకాణం లోకి వెళ్ళి దొంగతనం చేస్తుంది. జేడీ చెప్పినట్టే దొంగతనం చేస్తుంది. తుపాకీ చూపించి అందర్నీ కింద పడుకోమని చెప్పి యజమాని గల్లా పెట్టెలో నుంచి డబ్బు తీసుకుంటుంది. ఇదంతా సీసీటీవీలో రికార్డవుతుంది. తెల్మా చేసిన ఈ సాహసానికి లూయీస్ ఆశ్చర్యపోతుంది. కానీ ఎలాగో ఒక నేరం చేశాం, ఇప్పుడు పోయేదేముంది అన్నట్టు ఇద్దరూ కారులో దూసుకుపోతారు. తెల్మా “దొంగతనం నాకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది” అంటుంది. “నువ్వు ఈ పని చేయటానికే పుట్టావేమో” అంటుంది లూయీస్ హాస్యంగా.
తెల్మా జేడీ దొంగ అని తెలిసినా అతన్ని గెంటేయకపోవటం కొంచెం వింతగా ఉంటుంది. ఆమెకి కొత్తగా దొరికిన స్వేచ్ఛ, అతని పట్ల ఉన్న ఆకర్షణ కారణంగా ఆమె కొంచెం నిర్లక్ష్యంగా ఉందని అనుకోవాలి. ఒకవేళ ఆమె జేడీని గెంటేయటానికి ప్రయత్నించినా అతను ఆమెని బెదిరించి డబ్బు తీసుకుపోయేవాడే. అతనికి వారి మీద అనుమానం వచ్చి అదును చూసి తెల్మా గదిలో చేరాడు. ఆడవాళ్ళ మీద పురుషులు చేసే దౌర్జన్యాలకి సంకేతంగా ఈ చిత్రంలో సంఘటనలు ఉంటాయి. లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా స్త్రీల దోపిడీ జరుగుతూ ఉంటుంది. మగవాడి అకృత్యాలని భరిస్తూ ఈ పురుషాధిక్య సమాజంలో ఇక ఉండం అన్నట్టు వారు తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నిస్తారు. తిరుగుబాటు చేస్తారు. వారిలో ఒకరకమైన తెగింపు వస్తుంది.
తెల్మా దొంగతనం సీసీటీవీలో హ్యాల్, ఎఫ్.బీ.ఐ. వారు చూస్తారు. జిమ్మీకి హత్య విషయం, దొంగతనం విషయం తెలుస్తాయి. అతను ఓక్లహోమా సిటీలో జేడీని చూడటంతో అతను పోలీసులకి చెబుతాడు. వారు దొంగల ఫొటోలు చూపిస్తే జేడీని గుర్తు పడతాడు. జేడీని పోలీసులు పట్టుకుంటారు. అతను నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటాడు. హ్యాల్ ఒంటరిగా అతనితో మాట్లాడతాడు. “నువ్వు వారి డబ్బు దొంగిలించకపోయి ఉంటే తెల్మా దొంగతనం చేసేది కాదు. ఇప్పుడు వారి ఇరుక్కుపోయారు. నువ్వు నీకు తెలిసినదంతా చెప్పు. కనీసం వారికి కొంత సాయం చేయగలుగుతాను” అంటాడు. వారి పరిస్థితి హ్యాల్‌కి అర్థమయింది. హత్య వారు ఎలాంటి పరిస్థితిలో చేశారో అతను ఊహించగలడు. కానీ దొంగతనం చేయటానికి ఏ కారణం చెప్పినా అది నేరమే అవుతుంది. హత్యానేరం తొలగిపోయినా దొంగతనం చేసినందుకు వారికి శిక్ష తప్పదు. ఇంతమంది పురుషులలో హ్యాల్ ఒక్కడే తెల్మా, లూయీస్ లకి సాయం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. విచిత్రమేమిటంటే వారు అతనికి దొరక్కుండా పారిపోతున్నారు.
చిత్రం ముగిసే లోపు వారిద్దరూ మరో రెండు నేరాలు చేస్తారు. ఒకటి పట్టుబడకుండా ఉండటానికి, ఒకటి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక పోకిరీకి బుద్ధి చెప్పటానికి. ఒక సందర్భంలో లూయీస్ హ్యాల్‌తో ఫోన్లో మాట్లాడుతుంది. “అంతా ప్రమాదవశాత్తూ జరిగిందంటే నమ్ముతారా?” అంటుంది. నిజానికి హత్య ప్రమాదవశాత్తూ జరగలేదు. “నమ్ముతాను. కానీ మీరు వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. మీరు బతికి బయటపడాలంటే అదే మార్గం” అంటాడు హ్యాల్. “నాకు కొన్ని మాటలు మెదడులో తిరుగుతున్నాయి. కస్టడీ, జీవితశిక్ష, మరణశిక్ష లాంటివి. అందుకే ఆలోచిస్తున్నాను” అంటుంది లూయీస్. ఆమె ఇంతకు ముందు ఆ మాటలన్నీ విన్నది. ఆమె టెక్సాస్‌లో తన మీద అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. కానీ నేరస్థుడు చివరికి ఏ శిక్షా పడకుండా బయటకి వచ్చాడు. అందుకే చట్టం మీద ఆమెకి నమ్మకం లేదు. హ్యాల్ “టెక్సాస్‌లో నీకేం జరిగిందో నాకు తెలుసు” అంటాడు. తెల్మా ఫోన్ కట్ చేయటంతో అక్కడితో ఆ సంభాషణ ఆగిపోతుంది. హ్యాల్ ఆమె మానసిక వేదనని అర్థం చేసుకున్నాడు. కానీ వారు చేసిన నేరాల వల్ల వారు తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క హ్యాల్ మాట ఎవరూ వినరు. చిత్రంలో చివరికి ఏం జరుగుతుందనేది ముఖ్యం కాదు. ఎన్ని చట్టాలు చేసినా స్త్రీలకి ఇప్పటికీ పూర్తి భద్రత లేదు. చట్టాల అమలు సరిగా జరగకపోతే చట్టం ఉండి లాభం లేదు. పలుకుబడి ఉపయోగించి, చట్టాలలో లొసుగులు ఉపయోగించి నేరస్థులు తప్పించుకున్నంత కాలం పరిస్థితులు మారవు.