మరుగునపడ్డ మాణిక్యాలు – 90: ది అవర్స్

2
11

[సంచిక పాఠకుల కోసం ‘ది అవర్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]‘ది[/dropcap] అవర్స్’ (2002) చిత్రం ముఖ్యంగా ముగ్గురు స్త్రీల కథ. అయితే ఈ స్త్రీలు వేరు వేరు సమయాల్లో జీవిస్తారు. ఇందులో ఒకరు వర్జీనియా వూల్ఫ్ అనే రచయిత్రి. చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారి కోసం చెబుతున్నాను – ఈమె వాస్తవంగా ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో ఇంగ్లండ్‌లో జీవించిన రచయిత్రి. పాత్ర ఆలోచనలని (Stream of consciousness) ఆధారంగా చేసుకుని రచనలు చేసింది. అంటే ఆ పాత్ర ఏం ఆలోచిస్తోందో అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి రచనాశైలిని అవలంబించిన తొలి రచయితల్లో వర్జీనియా ఒకరు. ఆమె చిన్న వయసులో తన సవతి సోదరుల లైంగిక వేధింపుల వలన చాలా క్షోభ పడింది. పురుషులంటేనే అసహ్యం కలిగింది. పెళ్ళి చేసుకుంది కానీ ఆమెకి భర్త మీద మోహం ఉండేది కాదు. ఆమె భర్త ఈ విషయం తెలిసే పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తన స్నేహితురాలిని మోహించిందని అంటారు. ఆ రోజుల్లో ఇలాంటి సంబంధాలని సంఘం ఆమోదించేది కాదు. వర్జీనియా మానసిక రుగ్మతతో బాధపడి 1941లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆత్మహత్య విషయం తప్ప మిగతా వ్యక్తిగత విషయాలు ఈ చిత్రంలో ప్రస్తావించలేదు.

 

చిత్రంలో మిగతా ఇద్దరు స్త్రీలు కాల్పనిక పాత్రలు. అమెరికాలో నివసించిన స్త్రీలు. ఈ ముగ్గురి కథలని కలిపే సూత్రం వర్జీనియా రచించిన ‘మిసెస్ డాలొవే’ అనే నవల. 1923లో వర్జీనియా ఆ నవల రచిస్తూ ఉంటుంది. 1951లో లారా ఆ నవల చదువుతూ ఉంటుంది. 2001లో క్లరిస్సాని ఆమె స్నేహితుడు రిచర్డ్ ‘మిసెస్ డాలొవే’ అని పిలుస్తాడు. నవలలో మిసెస్ డాలొవే ఎప్పుడూ పార్టీలు ఇస్తూ ఉంటుంది. అంటే ఇతరులను సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఆమె సంతోషం సంగతి ఏమిటి అనేది నవలలోని ప్రశ్న. క్లరిస్సా కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రం LGBT (లెస్బియన్, గే, బిసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గానికి చెందిన వారి కథల సమాహారం. ఈ వర్గానికి సమాజం ఆమోదముద్ర లేనప్పుడు వారు ఎలా నలిగిపోయారు, ఆమోదముద్ర లభించిన తర్వాత కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేది ముఖ్యాంశం. సమాజం నుంచి ఏ తిరస్కరణా లేకపోయినా మానవసంబంధాలు క్లిష్టంగానే ఉంటాయి కదా. ‘ది అవర్స్’ అంటే ‘ఆ ఘడియలు’ అనే అర్థం చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

చిత్రం 1941లో మొదలవుతుంది. వర్జీనియా చాలా ఏళ్ళుగా మానసిక వ్యాధితో బాధపడింది. ఏవో మాటలు వినపడుతున్నట్టు భ్రమలు కలిగేవి. తన భర్తకి, చెల్లెలికి ఉత్తరాలు రాసి ఇంట్లో పెట్టి నదిలో మునిగి మరణిస్తుంది. భర్తకి రాసిన ఉత్తరంలో “నేను మళ్ళీ భ్రమల్లోకి జారిపోతున్నానని అనిపిస్తోంది. ఈసారి తేరుకోలేనేమో. అందుకే నాకు ఉత్తమం అని తోచిన పని చేస్తున్నాను. నువ్వు నా జీవితాన్ని ఆనందంతో నింపేశావు. నన్ను సహనంతో భరించావు. నేను నీ జీవితాన్ని పాడు చేస్తున్నాను. ఇక పాడు చేయదలచుకోలేదు. మన కన్నా ఆనందంగా ఉన్న జంట మరొకటి ఉండదు” అని ఉంటుంది. అతను ఆమె కోసం ఎంతో త్యాగం చేశాడు. ఆమెకి తెలుసు. అతనికి భారం కాకూడదని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇది ప్రేమకి పరాకాష్ట. త్యాగమే అమృతత్వాన్ని ఆపాదిస్తుంది.

ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళితే 1923లో వర్జీనియా తన భర్తతో రిచ్మండ్ అనే ఊళ్ళో ఉంటుంది. వారికో ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. లండన్‌కి వెళ్ళాలంటే అరగంట రైలు ప్రయాణం. వారు ముందు లండన్ లోనే ఉండేవారు. ఆమెకి మానసిక వ్యాధి సోకడంతో కిక్కిరిసి ఉండే లండన్ కన్నా ప్రశాంతంగా ఉండే ఊరిలో ఉంటే మంచిదని ఈ ఊరికి వచ్చారు. ఒకరోజు పొద్దున్నే వర్జీనియా ‘మిసెస్ డాలొవే’ నవల రాయటం మొదలుపెడుతుంది. ఆమె భర్త లెనర్డ్ ఆమె సరిగా తిండి తినటం లేదని ఆమెని ఆక్షేపిస్తాడు. డాక్టర్ చెప్పాడు కదా అంటాడు. అయినా ఆమె రాసుకుంటానంటే సరే అంటాడు. ఇంట్లో వంటమనుషులు ఉంటారు. వారిలో ఒకామె వర్జీనియా గురించి “ఈవిడ ఏదో కావాలంటుంది, మళ్ళీ వద్దంటుంది. పనిగట్టుకుని ఇది కావాలని అడిగిందంటే ఆమె అది కచ్చితంగా తినదు” అంటుంది తన తోటి వంటమనిషితో. వారికి ఆమె వ్యాధి అర్థం కాదు. ఇప్పటికీ మనలో చాలా మందికి మానసిక వ్యాధులు అర్థం కావు. డాక్టరు దగ్గరకి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు.

వర్జీనియా తన నవలలో మిసెస్ డాలొవే ఆత్మహత్య చేసుకునేలా రాయాలని అనుకుంటుంది. ఆరోజు మధ్యాహ్నం వర్జీనియా చెల్లెలు వనెస్సా తన పిల్లలతో లండన్ నుంచి అక్కను చూడటానికి వస్తుంది. “డాక్టర్లు నిన్ను లండన్ రావద్దన్నారుగా. అందుకే నిన్ను పార్టీకి పిలవలేదు” అంటుంది. “వస్తానో లేదో తర్వాతి విషయం. పిచ్చివాళ్ళకి కూడా తమని పార్టీలకి పిలవాలని ఆశ ఉంటుంది” అంటుంది వర్జీనియా. తనని ఎవరూ పట్టించుకోవట్లేదనే బాధ ఉంటుంది. తన చెల్లెలి జీవితమే బావుందని ఆమె భావన. ఆమెని చూసి వనెస్సా దుఃఖపడుతుంది. వర్జీనియా “నేను మెరుగ్గా ఉన్నానని చెప్పు. ఒకరోజు ఇక్కడి నుంచి బయటపడతానని చెప్పు” అంటుంది. “మెరుగ్గా ఉన్నావు. ఒకరోజు బయటపడతావు” అంటుంది వనెస్సా. అక్క పరిస్థితి చూసి ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. తనకి పిల్లలున్నారు. ఏం లేకపోయినా వారుంటారు అనే భావన కలుగుతుంది. అక్కకి ఏం ఉంది? కుంగుబాటు తప్ప. వర్జీనియాకి ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేదు. కొందరంతే. ఎప్పుడూ కోలాహలం ఉండాలి. ఆ కోలాహలంలో మతి పోయినా సరే. వనెస్సా వెళ్ళిపోతుంటే వర్జీనియా ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. అక్క దుఃఖంలో ఉందని వనెస్సా ఆ ముద్దుని పట్టించుకోదు. ఇక్కడ వర్జీనియాకి స్త్రీల మీద ఆకర్షణ ఉందని తెలిసిపోతుంది. దానికి కారణం ఏమిటనేది చిత్రంలో చెప్పలేదు. ఆమె గతం తెలిసిన వారికి ఆమెకి ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఆమె లెస్బియన్ (స్త్రీలను మోహించే స్త్రీ) గా మారిందని అనిపిస్తుంది. అది అప్రస్తుతం. ఆమె మానసిక వ్యాధికి లెస్బియన్ కావటం ఒక కారణం. ఇప్పుడంటే చట్టపరంగా స్వలింగసంపర్కం నేరం కాదు. అయినా సమాజం (ముఖ్యంగా భారతీయ సమాజం) ఆమోదించటం లేదు. అప్పట్లో చట్టపరంగా కూడా అది నేరం. అక్కాచెల్లెళ్ళ మధ్య ఆకర్షణ ఏమిటి అనిపించవచ్చు. నిజమే. ఈ సంఘటన నిజంగా జరిగిందా అనే ప్రశ్న కూడా వస్తుంది.

సమాంతరంగా లారా కథ, క్లరిస్సా కథ నడుస్తూ ఉంటాయి. లారా కథలో 1951లో ఆమె ‘మిసెస్ డాలొవే’ నవల చదువుతూ ఉంటుంది. మిసెస్ డాలొవే అసంతృప్తితో ఉంటుంది. లారా కూడా అసంతృప్తితో ఉంటుంది. ఏమిటా అసంతృప్తి? ముందు లారా జీవితం ఎలా ఉందో చూద్దాం. ఆమెకి భర్త, కొడుకు ఉంటారు. ఆమె మళ్ళీ గర్భవతి. భర్త ఆమెని ఎంతో ప్రేమిస్తాడు. అతను రెండవ ప్రపంచయుద్ధంలో పోరాడిన సైనికుడు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. ఆరోజు అతని పుట్టినరోజు. కొడుకు పేరు రిచీ. మూడేళ్ళ వాడు. భర్త ఆఫీసుకి వెళ్ళాక లారా అతని కోసం కేకు చేయటం మొదలుపెడుతుంది. తల్లి దిగులుగా ఉండటం రిచీకి తెలుస్తూనే ఉంటుంది. తల్లికి సాయం చేస్తానంటాడు. “కేకు చేయటం అంత కష్టం కాదు” అని కూడా అంటాడు. ఆమె అసంతృప్తి ఏమిటి? ఆమె కూడా ఒక లెస్బియన్. ఆమె స్నేహితురాలు ఇంటికి వస్తుంది. ఆ స్నేహితురాలికి పిల్లలు కలగటం లేదు. ఆమె బాధలో ఉంటుంది. లారా ఆమెని సముదాయిస్తూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంది. అయితే ఆ స్నేహితురాలు పెద్దగా పట్టించుకోదు. లారాకి మొదటి నుంచీ స్త్రీల మీద ఆకర్షణ. అంటే పరిస్థితుల వల్ల కాకుండా ఈ ఆకర్షణ సహజంగా కూడా ఏర్పడుతుంది. ఇది సైన్స్ అంగీకరించిన విషయం. సమాజం ఒత్తిడితో ఆమె ఒక పురుషుడిని పెళ్ళి చేసుకుంది. లైంగిక ఆకర్షణ లేకపోయినా ఆమె భర్తతో పక్క పంచుకుంది. ఆకర్షణ లేని శృంగారం ఎవరికైనా నరకమే. ఆ నరకాన్ని అనుభవించింది. కుంగిపోయింది. ఇక్కడ ఇంకో విషయం. వర్జీనియాకి పిల్లలు లేరు. అది ఆమెకి ఒక అసంతృప్తి. లారాకి కొడుకు ఉన్నాడు. కానీ ఆమెకి ఆ జీవితం ఇష్టం లేదు. సొంత పిల్లలను ప్రేమించలేని తల్లులుంటారా? వెర్రి కాంక్షలతో పిల్లలను చంపుకుంటున్న తల్లులను చూస్తున్నాం. లారాది సహజంగా పుట్టిన కాంక్ష. అది తీరలేదు. పైగా ఇష్టం లేని సంసారం చేస్తోంది. ఆమె స్థానంలో ఉంటే గానీ ఆ బాధ అర్థం కాదేమో. ఆమె తన స్నేహితురాలిని ముద్దు పెట్టుకోవటం రిచీ చూస్తాడు.

ఇక క్లరిస్సా కథ 2001లో జరిగే కథ. ఆమె బైసెక్సువల్. అంటే పురుషులకీ, స్త్రీలకీ కూడా అకర్షితురాలవుతుంది. ఆమెకి తోడుగా శాలీ ఉంటుంది. వీర్యదానం ద్వారా క్లరిస్సా ఒక ఆడపిల్లని కన్నది. ఆ అమ్మాయికిప్పుడు కాలేజీ వయసు. వర్జీనియా జీవించి ఉన్న సమయంలో వీర్యదానం పద్ధతి లేదు. లేకపోతే ఆమె కూడా పిల్లలని కనేదేమో. కంటే ఆనందంగా ఉండగలిగేదా? లేక లారాలా మరో రకం అసంతృప్తి ఉండేదా? క్లరిస్సాకి కూడా అసంతృప్తి ఉంది. ఆమె రిచర్డ్ అనే అతన్ని ప్రేమించింది. కానీ అతను గే. పురుషులంటే ఆకర్షణ. ఇద్దరూ స్నేహితులుగా ఉండిపోయారు. రిచర్డ్ ఒక కవి. నవల కూడా రాశాడు. అతనికి ఒక అవార్డు వస్తుంది. ఆ అవార్డు ప్రదానం రోజు రిచర్డ్ కోసం తన ఇంట్లో ఒక పార్టీ ఇవ్వాలని క్లరిస్సా ఏర్పాట్లు చేస్తుంటుంది. ‘మిసెస్ డాలొవే’ నవలలోలా క్లరిస్సా కూడా ఇతరులని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రిచర్డ్ ఆమెని మిసెస్ డాలొవే అని పిలుస్తాడు. అందుకు కారణం మిసెస్ డాలొవే పూర్తి పేరు క్లరిస్సా డాలొవే. ఆరోజే అవార్డు ప్రదానం. అయితే రిచర్డ్ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎముకల గూడులా ఉంటాడు. క్లరిస్సా అతని ఇంటికి వెళుతుంది. అదో ఒక ఎత్తైన భవంతిలో చిన్న అపార్ట్‌మెంట్. అతను నిర్వేదంలో ఉంటాడు. “నాకు ఎయిడ్స్ ఉందని జాలిపడి ఈ అవార్డ్ ఇస్తున్నారు” అంటాడు. అతన్ని ఉత్సాహపరచాలని ఆమె “పార్టీలో అందరూ నీ మిత్రులే ఉంటారు” అంటుంది. “నా మిత్రులందరికీ నేను నరకం చూపించానని వారందరూ అనుకుంటారుగా” అంటాడతను. అంతటితో ఆగకుండా “మిసెస్ డాలొవే! ఎప్పుడూ పార్టీలు ఇస్తూ ఉంటావు, నిశ్శబ్దాన్ని నింపటానికి” అంటాడు. ఆమె మనస్సు చివుక్కుమంటుంది. అయినా మాట మారుస్తుంది. మందులేసుకున్నావా, అల్పాహారం తిన్నావా అని అడుగుతుంది. అతను మాత్రం తన ధోరణి వదలడు. “నేను చచ్చిపోతే నువ్వు నా మీద అలుగుతావా? నేను నీ తృప్తి కోసమే బతికి ఉన్నాననిపిస్తోంది” అంటాడు. ఆమె “ఒకరి కోసం ఒకరు బతికి ఉండటం అందరూ చేసేదే. నువ్వు ఇలాగే ఇంకా కొన్నేళ్ళు బతకొచ్చని డాక్టర్లు చెప్పారు కదా” అంటుంది. “అదే కదా!” అంటాడతను వ్యంగ్యంగా. అతనికి అలా కృశించిపోతూ బతకటం ఇష్టం లేదు. ఆమె నిస్పృహతో “నువ్వనేది నేనొప్పుకోను” అంటుంది. అతను అసహనంగా “అంతా నీ చేతుల్లో ఉందా? ఎన్నేళ్ళుగా ఇక్కడికి వస్తున్నావు? నీ జీవితం సంగతేమిటి? శాలీ సంగతేమిటి?” అంటాడు. అతనికి ఆమె తనని ఇంకా ప్రేమిస్తోందని తెలుసు. ఆమె ఏం మాట్లాడకుండా ఇల్లు సర్దటం మొదలు పెడుతుంది. అతను ఆమెని దగ్గరకి పిలిచి ముద్దు పెట్టుకుంటాడు. ఆమె “మళ్ళీ మధ్యాహ్నం వస్తాను. తయారయ్యి వెళదాం” అని వచ్చేస్తుంది.

క్లరిస్సాకి రిచర్డ్ సాంగత్యం చాలా ఇష్టం. అతనితో ఉంటే ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. అతను కాదంటే ఆమె శాలీకి దగ్గరయింది. దీనికి కారణం అతను కాదన్నందుకు ఉక్రోషం కావచ్చు. ‘నువ్వు లేకపోతే నేను ఉండలేనా?’ అనే భావం కావచ్చు. కానీ రిచర్డ్ ని మర్చిపోలేకపోయింది. శాలీకి ఒకరకంగా అన్యాయం చేసింది. శాలీకి సహనం ఎక్కువ. వర్జీనియాకి మంచి భర్త దొరికినట్టే క్లరిస్సాకి శాలీ దొరికింది. కానీ వర్జీనియా, క్లరిస్సా తామే ఎంతో బాధపడిపోతున్నట్టు ప్రవర్తిస్తారు. మరి అవతలి వారి సంగతి ఏమిటి? వారి బాధ వారు పైకి చెప్పుకోరు. కారణం ప్రేమ.

రిచర్డ్ ఒకప్పటి ప్రియుడు లూయిస్ పార్టీలో పాల్గొనటానికి క్లరిస్సా ఇంటికి వస్తాడు. సాయంత్రం రావలసినవాడు మధ్యాహ్నమే వస్తాడు. క్లరిస్సా మొహమాటంతో అతన్ని లోపలికి ఆహ్వానిస్తుంది. లూయిస్ అంటే క్లరిస్సాకి అసూయ. లూయిస్ మాత్రం “రిచర్డ్‌ని వదిలేశాక నాకెంతో స్వేచ్ఛగా అనిపించింది” అంటాడు. తన సన్నిహితులకి పిచ్చెక్కించేలా రిచర్డ్ ఎందుకు ప్రవర్తిస్తాడు? ఇది తర్వాత తెలుస్తుంది. క్లరిస్సా చాలామంది లాగే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనుకుంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్లరిస్సా కథ 2001లో జరుగుతుంది. LGBT వర్గం వారికి అమెరికాలో తిరస్కరణ లేదు. అయినా మానవసంబంధాల క్లిష్టత మాత్రం ఎప్పుడూ ఉండేదే. అప్పటి దాకా సమాజంతో ఘర్షణ. సమాజంతో ఘర్షణ లేకపోతే ఎవరికి వారితోనే ఘర్షణ.

మైకెల్ కనింగమ్ రాసిన ‘ది అవర్స్’ నవల ఆధారంగా డేవిడ్ హేర్ స్క్రీన్ ప్లే రాశాడు. స్టీఫెన్ డాల్డ్రీ దర్శకత్వం వహించాడు. వర్జీనియాగా నికోల్ కిడ్మన్ నటించింది. ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ అందుకుంది. వర్జీనియా పోలికలకి తగ్గట్టుగా నికోల్‌కి కృత్రిమమైన ముక్కు అమర్చారు ఈ చిత్రంలో. అందుకే ఆమెని వెంటనే గుర్తు పట్టటం కష్టం. లారాగా జూలియాన్ మూర్, క్లరిస్సాగా మెరిల్ స్ట్రీప్, రిచర్డ్ గా ఎడ్ హ్యారిస్ నటించారు. మూడు కథలని ఒకేసారి నడిపిస్తూ చేసిన ఎడిటింగ్‌ని మెచ్చుకుని తీరాలి. సన్నివేశాలలోని ఉద్విగ్నతని సూచించటానికి దర్శకుడు వాడిన పద్ధతులు దర్శకత్వ ప్రతిభని చాటుతాయి. ఉదాహరణకి వర్జీనియా తన వంటమనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆమె విసిగిపోయి ఎదురు సమాధానం చెబుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మరో వంటమనిషి గుడ్లు పగలగొట్టి సొన తీస్తూ ఉంటుంది. గుడ్లు పగలగొట్టటం ఆ సన్నివేశంలోని ఘర్షణకి ప్రతీక. క్లరిస్సా రిచర్డ్ మాజీ ప్రియుడు లూయిస్‌తో మాట్లాడుతున్నపుడు ఆమె కూడా గుడ్లు పగలగొడుతూ ఉంటుంది. అక్కడ ఆమె అసూయతో ఉంటుంది. అదో ఘర్షణ. చిత్రం చివర్లో క్లరిస్సా ఇంటికి ఒక అతిథి వస్తుంది. ఆమె చాలా ముఖ్యమైన పాత్ర. ఆమె తెచ్చిన సూట్‌కేస్ ఎత్తేటపుడు క్లరిస్సాకి అది బరువుగా అనిపిస్తుంది. ఎమోషనల్ బ్యాగేజ్‌కి అది సూచన. అందరూ గతాన్ని ఒక బరువులా మోస్తూ ఉంటారు. ఆ బరువుని ఎంత తేలిక చేసుకుంటే జీవితం అంత బావుంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

వర్జీనియా మిసెస్ డాలొవే పాత్ర ఆత్మహత్య చేసుకోకూడదని నిశ్చయించుకుంటుంది. ఇది ఆమె లోని ఊగిసలాటకి సంకేతం. ఒకసారి పోరాటం చేయాలని, ఒకసారి పరిస్థితులకి తలవంచాలని ఆమె ఊగిసలాడుతూ ఉంటుంది. లారాకి తాను కోరుకునే జీవితం తనకు దక్కదని అర్థమవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కొడుకుని ఒక పరిచయస్థురాలి ఇంట్లో దింపేసి ఒక హోటల్‌కి వెళ్ళి గది తీసుకుంటుంది. మాత్రలు మింగి చనిపోవాలని ఆమె ఆలోచన. అయితే ఆమె గర్భవతి. అందుకని ఆమె ఆత్మహత్య ప్రయత్నం విరమించుకుంటుంది. రిచీని తీసుకుని తిరిగి ఇంటికి వస్తుంది. తనని వదిలి వెళ్ళినందుకు రిచీ ముభావంగా ఉంటాడు. ఆమె అతన్ని ఉల్లాసపరచటానికి “నువ్వే నా హీరోవి” అంటుంది. అతను సంతోషిస్తాడు. ఆ రాత్రి లారా తన భర్తకి కేకు తినిపిస్తుంది. కానీ అతనితో ఏకాంతంలో సన్నిహితంగా ఉండటం ఆమెకి సాధ్యం కాదు. మరి దారి ఏమిటి?

క్లరిస్సా కూతురు జూలియా పార్టీకి సాయం చేయటానికి వస్తుంది. తల్లి దిగులుగా ఉండటం చూస్తుంది. ఇక్కడ లారాకి, క్లరిస్సాకి పోలిక కనిపిస్తుంది. ఇద్దరి పిల్లలూ వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. క్లరిస్సా “రిచర్డ్ ‘నీ జీవితం అతిసాధారణమైనది’ అన్నట్టు మాట్లాడాడు. ఈ పార్టీలు, ప్రణాళికలు అన్నీ వ్యర్థమని అతని భావన. అదీ నిజమే. నాకు అతనితో ఉంటేనే జీవిస్తున్నట్టు ఉంటుంది. లేకపోతే అంతా వ్యర్థమనిపిస్తుంది” అంటుంది. జూలియా చిన్నబుచ్చుకుంటుంది. తనకి విలువ లేదా అన్నట్టు. అందుకే చాలామంది ఇలాంటి విషయాలు సైకియాట్రిస్టులతో మాట్లాడతారు. సొంతవారికి చెబితే ఏదో ఒక చోట వారిని బాధపెట్టాల్సి వస్తుంది. క్లరిస్సా తన పొరపాటు గుర్తించి వెంటనే జూలియాతో “నువ్వు మాత్రం నాకు ముఖ్యం” అంటుంది. “మరి శాలీ సంగతి ఏమిటి?” అంటుంది జూలియా. “అది పైపైని ఆనందం” అంటుంది క్లరిస్సా. ప్రేమించినవారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. వేరేవారితో జీవితం బాగానే ఉన్నా ఆ ప్రేమించినవారిని తలచుకుంటూ ఉంటారు చాలామంది. లారాకి తన భర్తతో ఆనందం లేదు. కానీ క్లరిస్సా శాలీతో అనందంగానే ఉంది. అయినా రిచర్డ్ మీద ప్రేమ అలాగే ఉంది. మనిషికి మనసుని మించిన శత్రువు లేదు. లొంగదీసుకుంటే మనసుని మించిన మిత్రుడూ లేడు.

వర్జీనియా తన చెల్లెలు వెళ్ళిపోయాక ఇంటి నుంచి హడావిడిగా బయటకి వెళుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా లెనర్డ్ కి తెలియాలని ఒక నియమం. ఆమె క్షేమం కోసం ఆ ఏర్పాటు. ఆమె బయటకి వెళ్ళిందని తెలిసి లెనర్డ్ పరుగున వెళతాడు. ఆమె ఎక్కడికి వెళుతుందో అతనికి తెలుసు. లండన్ వెళ్ళిపోవాలని ఆమె ఆకాంక్ష. రైల్వే స్టేషన్‌కి వెళుతుంది. అతను కూడా అక్కడికి వెళతాడు. ఆమె “నాకిక్కడ ఉండాలని లేదు. ఇది బందిఖానాలా ఉంది. డాక్టర్లు ఇక్కడ ఉండటమే మంచిదంటారు. నాకు ఏది మంచిదో నాకు తెలియదా?” అంటుంది. “నీకున్న మేధస్సుకి నిన్ను వేరే వాళ్ళు శాసించటం నీకు నచ్చకపోవచ్చు. కానీ ఇదంతా నీ శ్రేయస్సు కోసమే” అంటాడతను. “నాకు లండన్ జీవితమే గుర్తొస్తూ ఉంటుంది. అక్కడికి పోదాం” అంటుందామె. “లండన్ జీవితం వల్లే నువ్వు కుంగిపోయావు. గుర్తు చేసుకో. ఇవి నీ మాటలు కావు. నీకు కలిగే భ్రమలు” అంటాడతను. “ఇది నా మాటే. నాకు తెలియదా? రిచ్మండ్‌లో ఇలా స్తబ్దుగా ఉండటం కంటే లండన్ జీవితంలో ఉండే ఆ ఉత్తేజకరమైన కుదుపు నాకు కావాలి. నీ కోసం ఈ ఎండమావిలో నేను ఆనందంగా ఉండగలిగితే బావుండునని ఎంతో కోరుకున్నాను. కానీ రిచ్మండా, మృత్యువా అంటే నేను మృత్యువునే కోరుకుంటాను” అంటుంది. ఈ మాటల్లో ఆమెకి అతని మీద ఉన్న ప్రేమ కూడా బయటపడుతుంది. అయితే ఆమె ఇక ఎవరి మాటా వినదని అతనికి అర్థమవుతుంది. “సరే. లండన్ పోదాం” అంటాడు కానీ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆమె ఒక పక్కన బాధపడుతుంది, ఒక పక్కన సంతోషపడుతుంది. “జీవితం నుంచి పారిపోయి మనశ్శాంతి వెతుక్కుంటే లాభం లేదు” అంటుంది. ఒక్కోసారి మన బాగు కోసం రాజీ పడాల్సి వస్తుంది. రాజీ పడటం మంచిదా లేక నచ్చినట్టు ఉండటం మంచిదా? వర్జీనియా ఏమీ విపరీతమైన కోరిక కోరలేదు. ఆమెకి లండన్‌లో అందరి మధ్యా ఉండటం ఇష్టం. మానసిక రోగుల దురదృష్టం ఏమిటంటే వారి మాటలను దగ్గరి వారు కూడా వినరు. డాక్టర్లు చెప్పినట్టు ఉండమంటారు. వర్జీనియా భర్త సహృదయుడు కాబట్టి ఆమె మాట విన్నాడు. కానీ చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అది లండన్‌లో కాదు, ససెక్స్ అనే మరో ఊళ్ళో. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నది తన కోసం కాదు. భర్త కోసం. అతను స్వేచ్ఛగా ఉండాలని.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

క్లరిస్సా రిచర్డ్ ని తీసుకురావటానికి అతని ఇంటికి వెళుతుంది. అంతకు ముందు అతను తన తల్లి ఫొటో చూస్తూ ఉంటాడు. ఆమె ఎవరో కాదు, లారా! అతనే చిన్నప్పటి రిచీ. తల్లిని తలచుకుని కన్నీరు పెట్టుకుంటాడు. ఆమె చనిపోయిందా? ఆమె పడిన క్షోభ తలచుకుని అతను బాధపడుతున్నాడా? తల్లి లెస్బియన్ అని అతనికి తెలిసిందా? ఎప్పుడు తెలిసింది? ఇవన్నీ ప్రేక్షకుడి మనసులోని ప్రశ్నలు. క్లరిస్సా వచ్చేసరికి రిచర్డ్ హడావుడిగా ఉంటాడు. కిటికీకి అడ్డు పెట్టిన చెక్కలు తొలగిస్తూ ఉంటాడు. “వెలుతురు లోపలికి రావాలి” అంటాడు. తాను పార్టీకి రానని అంటాడు. అతని మనఃస్థితిని చూసి క్లరిస్సా “పార్టీకి రానక్కరలేదు” అంటుంది. “అది సరే. పార్టీ తర్వాతి ఘడియలు, ఆ తర్వాతి ఘడియల సంగతి ఏమిటి?” అంటాడతను. “నీకు మళ్ళీ ఏవో మాటలు వినపడుతున్నట్టు భ్రమ కలుగుతోందా?” అంటుంది. అంటే అతనికి కూడా మానసిక వ్యాధి ఉంది. “నాకు మాటలు ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి. అది కారణం కాదు. నువ్వు కారణం. నీ కోసమే నేను బతికి ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళనీ” అంటాడు. ఆమె గాబరా పడుతుంటే గతంలో వారు కలిసి గడిపిన ఒక రోజు గురించి మాట్లాడతాడు. చివరికి “ఐ లవ్యూ” అంటాడు. ఆమె ముఖం ఒక్కసారిగా తేటపడుతుంది. ఆమె వినాలనుకున్నది అదే. వారిద్దరూ ఆత్మబంధువులు. శారీరక సంబంధం వారికి ముఖ్యం కాదు. ఒకరి సాంగత్యం ఒకరికి ఇష్టం. అతనికి పురుషులంటే ఆకర్షణ కాబట్టి పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడు. లైంగిక వాంఛ బలీయమైనది. ముఖ్యంగా పురుషులలో. ఆమె శాలీతో కలిసి జీవిస్తోంది. కానీ ఒకరినొకరు వదులుకోలేరు. వర్జీనియా, ఆమె భర్త లాగే. తాను బతికి ఉంటే ఆమె తన కోసం వస్తూనే ఉంటుందని రిచర్డ్‌కి తెలుసు. తన పరిస్థితి బాగాలేదు. శారీరకంగానూ, మానసికంగానూ కృశించిపోయాడు. ఆమెకి భారంగా మారుతున్నాడు. ఆమె మీద ప్రేమతో అతను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. “మన కన్నా ఆనందంగా ఉన్న జంట మరొకటి ఉండదు” అని తాను కూర్చున్న కిటికీ అంచు నుంచి దూకేస్తాడు. అతను అన్న ఆ చివరి మాట వర్జీనియా ఆత్మహత్యకి ముందు భర్తకి రాసిన ఉత్తరం లోనిదే.

రైల్వే స్టేషన్ నుంచి తిరిగి వచ్చాక వర్జీనియా లెనర్డ్‌తో తన నవల గురించి మాట్లాడుతుంది. నవలలో మిసెస్ డాలొవే కాక ఎవరో ఒకరు మరణించాలి అని ఆమె ప్రణాళిక. “ఎవరో ఒకరు మరణించే తీరాలా?” అంటాడతను. “అవును. అలా అయితేనే మిగతా వారికి జీవితం విలువ తెలుస్తుంది. కథలో ఆ వైరుధ్యం ఉండాలి” అంటుందామె. “మరి ఎవరు చనిపోతారు?” అంటాడతను. “కథలోని కవి, దార్శనికుడు చనిపోతాడు” అంటుందామె. ఇది రిచర్డ్ విషయంలో నిజమయింది. అతను నవల వల్ల ప్రభావితుడయ్యాడని అనిపిస్తుంది. సాహిత్యం తరతరాల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే పాశ్చాత్య సాహిత్యంలో నెగెటివిటీ ఎక్కువ ఉంటుంది. భారతీయ సాహిత్యంలో ఆశావహ దృక్పథం ఎక్కువ ఉంటుంది. కనీసం పంతొమ్మిదవ శతాబ్దపు సాహిత్యం వరకు.

రిచర్డ్ మరణంతో క్లరిస్సా హతాశురాలవుతుంది. ఆమెకి రిచర్డ్ డైరీలో అతని తల్లి ఫోన్ నంబర్ దొరుకుతుంది. ఆమెకి ఫోన్ చేస్తుంది. లారా కెనడాలో నివసిస్తోంది. రాత్రి కల్లా విమానంలో క్లరిస్సా ఇంటికి చేరుకుంటుంది. క్లరిస్సా తలుపు తీస్తుంది. జూలియా, శాలీ వంటింట్లో ఉంటారు. వారికి లారా కనపడుతూనే ఉంటుంది. జూలియా “ఈమేనన్నమాట ఆ రాక్షసి” అంటుంది శాలీతో. లారా తన రెండో బిడ్డ పుట్టాక కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇద్దరు బిడ్డలనీ వదిలేసి వెళ్ళిపోయింది. రిచర్డ్‌కి ఆ గాయం ఎప్పటికీ తగ్గలేదు. అతను గే గా మారటానికి అదీ ఒక కారణం కావచ్చు. స్త్రీలంటే ఏహ్యభావం. రిచర్డ్ తన తల్లి రాక్షసి అన్నట్టు మాట్లడేవాడన్నమాట. అందుకే జూలియా లారాని రాక్షసి అంది. రిచర్డ్ కి లారా లెస్బియన్ అని తెలుసా? తెలిసే ఉంటుంది. ఆమె ఫోన్ నంబర్ అతని దగ్గర ఉందంటే ఆ విషయం అతనికి తెలిసే ఉంటుంది. అయినా అతను తల్లిని క్షమించలేదు. ఎవరికీ ఆమె లెస్బియన్ అని చెప్పలేదు. చివరి క్షణాల్లో రిచర్డ్‌కి అదే బాధ కలిగిందని నాకనిపించింది. ఇంకొకరైతే సమర్థించేవాడు. తల్లి కాబట్టి క్షమించలేకపోయాడు. అతని తప్పు లేదు. ఇది పెద్ద మానసిక సంఘర్షణ. జీవితంలో అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ఉండవు. లారా క్లరిస్సాతో మాట్లాడుతుంది. తన రెండో బిడ్డ అయిన కూతురు మరణించిందని చెబుతుంది. “నేను పిల్లల్ని వదిలిపోయినందుకు పశ్చాత్తాపపడ్డానని అనటం తేలిక. కానీ వేరే మార్గం లేనపుడు పశ్చాత్తాపానికి చోటేది? పిల్లలని వదిలిపోవటం తల్లి చేసే అతి హేయమైన పని అని అంటారు. నన్నెవరూ క్షమించరని నాకు తెలుసు. కానీ నేను జీవచ్ఛవంలా ఉండేదాన్ని. జీవితేచ్ఛతో వెళ్ళిపోయాను” అంటుంది. వర్జీనియా, ఆమె భర్త శృంగారం లేకపోయినా ప్రేమ పంచుకున్నారు. క్లరిస్సా, రిచర్డ్ కూడా అంతే. శృంగారం లేని ప్రేమ. కానీ లారా ప్రేమ లేని శృంగారం భరించలేకపోయింది. ప్రేమ ఉన్న చోట శృంగారం లేకపోయినా పరవాలేదు. కానీ ప్రేమ లేని చోట శృంగారం ఎవరూ భరించలేరు. క్లరిస్సాకి లారాపై సానుభూతి కలుగుతుంది. భావోద్వేగంతో ఆమె తన గదిలోకి వెళుతుంది. శాలీ ఆమె దగ్గరికి వెళుతుంది. క్లరిస్సా శాలీ సహనాన్ని గుర్తించినట్టుగా ఆమెని ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత జూలియా లారాకి టీ చేసి ఇస్తుంది. లారాని కౌగిలించుకుంటుంది. అంటే ఆమెకి క్లరిస్సా లారా కథ చెప్పిందన్నమాట. ఇన్నాళ్ళూ రాక్షసి అనుకున్న లారాని జూలియా అర్థం చేసుకుంది. అది లారాకి సాంత్వన. చివరికి వర్జీనియా తన భర్తని ఉద్దేశించి అన్న మాటలతో చిత్రం ముగుస్తుంది. “జీవితాన్ని దైర్యంగా చూడాలి. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఉన్నదున్నట్టు ప్రేమించాలి. చివరికి దాన్ని పక్కన పెట్టేయగలగాలి. మన మధ్య ఎన్ని వసంతాలు, ఎంత ప్రేమ, ఎన్ని ఘడియలు” అంటుంది.

వర్జీనియా ఆత్మహత్యలో సమాజం పాత్ర ఉంది. ఆమె ఒక లెస్బియన్. కానీ నచ్చినట్టు జీవించలేకపోయింది. రిచర్డ్ ఆత్మహత్యలో స్వయంకృతం ఉంది, ఒక మహమ్మారి వ్యాధి ఉంది. అతను తల్లిని క్షమించగలిగితే కాస్త మనశ్శాంతిగా ఉండేవాడు. అతని ఇతర బంధాలు కూడా కాస్త మెరుగ్గా ఉండేవి. తల్లి చేసిన గాయం మర్చిపోలేక తనకి దగ్గరైన వారు తనని వదిలిపోతారనే అనుమానంతో ఉండేవాడు. ఆ అనుమానమే మానసిక వ్యాధికి కారణం. దగ్గరైన వారిని అనుమానంతో వేధించాడు. పైపైని సంబంధాలు పెట్టుకుని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. దీనికి తల్లి మీద కోపమే కారణం. లారా ధైర్యం చేసి తన జీవితం తాను వెతుక్కుంది. అయితే ఇతరుల జీవితాలు నాశనం చేసింది. తీర్పులు ఇవ్వటం తేలికే. కానీ ఆచితూచి తీర్పులు ఇవ్వాలి. ఎవరైనా భిన్నంగా ఉంటే వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి లేదా వారి మానాన వారిని వదిలేయాలి. లేకపోతే విపరిణామాలు తప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here