మరుగునపడ్డ మాణిక్యాలు – 95: పాస్ట్ లైవ్స్

0
11

[సంచిక పాఠకుల కోసం ‘పాస్ట్ లైవ్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పన్నెండేళ్ళ వయసులో మంచి స్నేహితులు. పరిస్థితుల ప్రభావం వల్ల దూరమవుతారు. మళ్ళీ చాలా ఏళ్ళకి కలుసుకుంటారు. ఇలాంటి కథ ఇంతకు ముందు చూసే ఉంటారు. కానీ ఈ కథతో వలసదారుల జీవితంలో ఉండే భావోద్వేగాలను స్పృశించి మనసుని హత్తుకున్న చిత్రం ‘పాస్ట్ లైవ్స్’ (2023). ‘గత జన్మలు’ అని అర్థం. ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే లో లభ్యం. ఎయిర్‌టెల్ వినియోగదారులు కొందరికి లయన్స్ గేట్ ప్లే ఉచితం.

నోరా, హే సంగ్ మంచి స్నేహితులు. కొరియాలోని సియోల్‌లో ఉంటారు. నోరా తలిదండ్రులు కెనడాకి వలస వెళతారు. వెళ్ళే ముందు నోరా, హే సంగ్ కలిసి ఒక పార్కులో సరదాగా గడిపేలా ఏర్పాటు చేస్తుంది నోరా తల్లి. నోరాకి తీపి గుర్తులా అది మిగిలిపోవాలని ఆమె ఆశ. హే సంగ్ తల్లి నోరా తల్లిని “మీ ఆయన సినిమా డైరెక్టరు, మీరు నటి. ఇదంతా వదిలేసి ఎందుకు వలస వెళుతున్నారు?” అని అడుగుతుంది. “కొంత కోల్పోతే ఏమయింది, కొంత లాభం కూడా ఉంటుంది” అంటుంది నోరా తల్లి. నోరాకి సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకోవాలని ఆశ. కొరియాలో ఉంటే అది సాధ్యపడదని ఆమె భావన. పన్నెండేళ్ళ వయసులో ఆమె అలా అనుకుందంటే అది పెద్దలు చెప్పిన మాటే. సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల వల్ల పెద్దలు వలస వెళతారు. పౌరులు వలస వెళితే దేశానికి నష్టమే, కానీ తర్వాత తెలిసేదేమిటంటే ఆ పౌరులు కూడా చాలా కోల్పోతారు.

నోరా వెళ్ళిపోయే ముందు రోజు హే సంగ్‌తో కలిసి స్కూలు నుంచి ఇంటికొస్తుంది. హే సంగ్ దిగులుగా ఉంటాడు. ఇద్దరూ మౌనంగా నడుస్తారు. విడిపోయే చోట అతను “బై” అని వెళ్ళిపోతాడు. ఆమె మౌనంగా ఇంటికి వెళుతుంది. కెనడా వెళ్ళిన మొదట్లో నోరా అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతుంది. కొన్నిసార్లు ఏడుస్తుంది. కొరియాలో ఆమె ఏడ్చినప్పుడు హే సంగ్ ఆమెకి తోడుగా ఉండేవాడు. కొన్నాళ్ళకి నోరాకి కెనడాలో జీవితం అలవాటయిపోతుంది. పన్నెండేళ్ళు గడిచిపోతాయి. హే సంగ్ సైన్యంలో చేరతాడు. కొరియాలో యువకులు సైన్యంలో శిక్షణ పొందటం తప్పనిసరి. అతనికి నోరా గుర్తొస్తూ ఉంటుంది. సైన్యంలో శిక్షణ ముగిశాక అతను ఫేస్‌బుక్‌లో ఆమె కోసం వెతుకుతాడు. అయితే ఆమె కొరియన్ పేరు మాత్రమే అతనికి తెలుసు. ఆమె కెనడాలో నోరా అని పేరు మార్చుకుంది. ఆమె తండ్రి ఫేస్‌బుక్ పేజిలో అతను ఒక సందేశం పెడతాడు. ఆమె తండ్రి దాన్ని పట్టించుకోడు.

నోరా ఇప్పుడు న్యూ యార్క్‌లో నివసిస్తోంది. నాటకాలు రాస్తుంది. ఒకరోజు ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ హే సంగ్ గుర్తు వచ్చి అతని కోసం ఫేస్‌బుక్‌లో వెతుకుతుంది. అతను తన కోసం వెతికాడని తెలుసుకుంటుంది. ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుంటారు. కొరియన్ భాషలో మాట్లాడుకుంటారు. ఆ సంభాషణ ఎంతో సహజంగా ఉంటుంది.

నోరా: మంచి కాలేజీలో చదువుతున్నావట కదా? మంచి మార్కులు వచ్చి ఉంటాయి.

హే సంగ్: లేదు. మామూలు మార్కులే వచ్చాయి.

నోరా: స్కూల్లో మనమిద్దరం పోటీ పడి చదివేవాళ్ళం.

హే సంగ్: నేను ఫస్టు వచ్చానని నువ్వు ఏడ్చావు.

నోరా (కాస్త ఉక్రోషంతో): ఒక్కసారేగా నువ్వు ఫస్టు వచ్చింది!

హే సంగ్: ఇప్పుడూ ఏడుస్తుంటావా? అప్పట్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదానివి.

నోరా: లేదు. మొదట్లో ఏడిచేదాన్ని. ఎవరూ పట్టించుకునేవారు కాదు.

చివరికి అతను “చెబితే వింతగా ఉంటుంది కానీ నువ్వు లేక వెలితిగా ఉండేది” అంటాడు. ఆమె “నాకు కూడా. ఇది నిజంగా వింతే” అంటుంది. అతనికి ఆమె బాగా గుర్తొచ్చేది. కానీ ఆమెకి అతనితో మాట్లాడాకే అతను లేని లోటు తెలిసింది. ఎందుకు? అతను ఆమెకి ఆమె మూలాలని గుర్తు చేశాడు. తన సొంతగడ్డతో ఉన్న ఒకే ఒక అనుబంధం అతను. ఒకరకంగా ఆమెకి అతను తన సంస్కృతిని గుర్తు చేశాడు. అతని మాటల్లో బిడియం ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో చొరవ ఎక్కువ. బిడియం తక్కువ. ఇది మంచి లక్షణం, ఇది చెడు లక్షణం అనలేము. సంస్కృతిని బట్టి అలవాట్లు ఉంటాయి. మట్టి నుంచి మనిషిని వేరు చేయొచ్చు కానీ మనిషి లోనుంచి మట్టిని వేరు చేయటం కష్టం! ఒక సందర్భంలో నోరా “అతనితో ఉంటే నాలో కొరియన్ లక్షణాలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో నాలో కొరియన్ లక్షణాలు ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది.” ఎంత లోతైన భావం! ఇలాంటి భావాల్ని ఒడిసిపట్టుకుని మాటల్లో పెట్టటం స్క్రీన్ ప్లే రచయిత, దర్శకురాలు సెలీన్ సాంగ్ ప్రతిభ.

నోరా, హే సంగ్ తరచు వీడియో కాల్లో మాట్లాడుకుంటారు. అతని కోసం ఆమె పొద్దున్నే నిద్ర లేస్తుంది. అతనికప్పుడు సాయంత్రం. “నీకు నోబెల్ బహుమతి గెలవాలని కోరిక ఉండేది. ఇప్పుడూ ఉందా?” అని అడుగుతాడొకసారి. “ఇప్పుడు నాకు పులిట్జర్ బహుమతి కావాలి” అంటుందామె. పులిట్జర్ బహుమతి అమెరికాలో రచయితలకి వివిధ విభాగాల్లో ఇచ్చే బహుమతి. ప్రపంచమంతా తెలిసిన నోబెల్ కన్నా ఆమెకి పులిట్జర్ బహుమతే ముఖ్యమన్నమాట. ఇక్కడ అమెరికా సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. అమెరికాలో ఉండే ఆధిక్య భావం కనిపిస్తుంది. మా ప్రమాణాలు గొప్పవి అని వారు చెప్పుకుంటారు. అదే భావం అందరిలో కలగజేస్తారు. ప్రపంచంలో గుర్తింపు రావాలంటే కొరియా వదిలి వెళ్ళాలి అనే భావన నుంచి అమెరికాలో గుర్తింపు వస్తే చాలు అనే స్థాయికి ఆమె దిగివచ్చింది. కానీ వింతేమిటంటే అమెరికాలో గుర్తింపే అతి పెద్ద విజయమనే భావం కలిగిస్తుంది అమెరికన్ సమాజం.

కొన్నాళ్ళకి నోరాకి ఒక రచయితల శిబిరంలో చోటు దొరుకుతుంది. ఒక నెల పాటు జీవనభృతి ఇచ్చి రచయితలు తమ నైపుణ్యానికి సాన పెట్టుకోనేలా వెసులుబాటు ఇది. హే సంగ్ చైనాకి వెళ్ళాలనుకుంటాడు. మ్యాండరిన్ భాష నేర్చుకోవాలని అతని కోరిక. చైనా వెళ్ళే బదులు ఇంగ్లిష్ నేర్చుకోవటానికి అమెరికాకి రావచ్చు కదా అంటుంది నోరా. ఇక్కడా ఆధిక్య భావమే. “నాకు ఎప్పటి నుంచో మ్యాండరిన్ నేర్చుకోవాలని కోరిక. నాకు వృత్తిలో కూడా ఉపయోగపడుతుంది” అంటాడతను. ఒకరోజు అతను సియోల్ నగరంలో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆమెకి ఫోన్లో సియోల్ నగరం చూపిస్తాడు. ఆమె “నేను అక్కడ ఉంటే బావుండు” అంటుంది. కానీ కొన్నాళ్ళకే “నేను సియోల్ ఎందుకు వస్తాను?” అంటుంది.

ఒకరోజు నోరా హే సంగ్‌కి వీడియో కాల్ చేస్తుంది. “ఇక్కడికి ఎప్పుడొస్తావు?” అంటుంది. “ఏడాదిన్నర పడుతుంది. చైనా వెళుతున్నా కదా” అంటాడతను. “నేను అక్కడికి రావాలంటే ఏడాది పడుతుంది. మనమిద్దరం కొన్నాళ్ళు దూరంగా ఉంటే మంచిది. నేను ఇక్కడికి రావటానికి రెండు సార్లు వలస వచ్చాను. ఏదైనా సాధించాలి. దాని బదులు ఈ మధ్య సియోల్‌కి ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను” అంటుందామె. “నాతో మాట్లాడటం మానేస్తావా?” అంటాడతను విచారంగా. “కొన్నాళ్ళే” అంటుందామె. ఇద్దరూ ఒప్పుకుని మాట్లాడుకోవటం మానేస్తారు. ఆమె చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించింది. ఒకరకంగా చూస్తే ఆమె ఆలోచన సబబే. దూరంగా ఉండి ఒకరి గురించి ఒకరు ఎన్నాళ్ళు తపిస్తారు? కలిసి ఉండే అవకాశం లేకపోతే బంధం కొనసాగించి ఏం లాభం? మామూలుగా అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. కానీ ఇక్కడ ఆమే కాస్త కఠినంగా వ్యవహరించింది. అతను దాదాపు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక్కడ కూడా సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది.

నోరాకి రచయితల శిబిరంలో ఆర్థర్ పరిచయమవుతాడు. ఆమె అతనికి దగ్గరవుతుంది. అతనితో “కొరియన్ భాషలో ఇన్-యన్ అనే పదముంది. దాని అర్థం జన్మాంతర బంధం. వీధిలో ఒకరికొకరు తారసపడి రాసుకుని వెళ్ళినా అది ఇన్-యన్ అనే కొరియన్ల నమ్మకం. ఎందుకంటే వారిద్దరి మధ్య గత జన్మలో ఏదో బంధం ఉంది. ఏ ఇద్దరైనా పెళ్ళి చేసుకుంటే వారిద్దరి మధ్య ఎనిమిది వేల జన్మల ఇన్-యన్ ఉందని నమ్ముతారు” అంటుంది. ఆమె ఈ మాటలు చెబుతున్నప్పుడే హే సంగ్ చైనాలో ఒక అమ్మాయితో చూపులు కలపటం కూడా జరుగుతుంది. ఆర్థర్ నోరాతో “మనిద్దరి మధ్య జన్మాంతర బంధం ఉందని నువ్వు నమ్ముతున్నావా?” అంటాడు. “అదేం లేదు. ఎవరినైనా ముగ్గులోకి దింపటానికి కొరియన్లు చెప్పే మాటలివి” అంటుందామె. అంటే ఆమె అతన్ని ముగ్గులోకి దింపటానికి చెప్పిన కథ ఇది. ఆర్థర్‌కి విషయం అర్థమవుతుంది. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. నోరా, ఆర్థర్‌ల బంధం ఎంతవరకు వెళ్ళింది? హే సంగ్ చైనాలో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడా? ఈ ప్రశ్నల కంటే మళ్ళీ నోరా హే సంగ్ కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అనేదే ముఖ్యం. నోరా చాలా ప్రాక్టికల్ గా ఉంటుందని ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయినా కథనంలో ఒక రకమైన బిగి ఉంటుంది. కదలకుండా కూర్చునేలా చేస్తుంది.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించింది సెలీన్ సాంగ్. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆమె కథ రాసింది. సొంత అనుభవాలు కావటంతో ఎంతో నిజాయితీ కనిపిస్తుంది. ఇంతవరకు ఎక్కడా వినని భావాలు కూడా ఉంటాయి. ప్రతి జీవితం ఎంతో ప్రత్యేకం అని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? సెలీన్ ఉత్తమ స్కీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకుంది. ఉత్తమ చిత్రం విభాగంలో కూడా నామినేషన్ వచ్చింది. నోరాగా గ్రెటా లీ, హే సంగ్ గా తెయో యూ, ఆర్థర్ గా జాన్ మాగరో నటించారు. గ్రెటా నటన ఎన్నో ప్రశంసలందుకుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

కథ పన్నెండేళ్ళు ముందుకి వెళుతుంది. నోరా, ఆర్థర్ ఇప్పుడు భార్యాభర్తలు. అతను నవలలు రాస్తాడు. ఆమె నాటకాలకు దర్శకత్వం చేస్తూ ఉంటుంది. వారి పెళ్ళికి ముందు ఇద్దరూ సియోల్ వెళతారు. నోరా హే సంగ్ కి ఈ మెయిల్ పంపిస్తుంది కానీ అతను జవాబివ్వడు. వారి పెళ్ళయిన ఏడేళ్ళకు న్యూ యార్క్ వస్తున్నానని హే సంగ్ నోరాకి ఈ మెయిల్ పంపిస్తాడు. విహారయాత్ర అని చెబుతాడు. స్నేహితులకి అదే చెబుతాడు. కానీ అతని స్నేహితులు అతను ఆమెని కలుసుకోవటానికే వెళుతున్నాడని ఆటపట్టిస్తారు. ఆమెకి పెళ్ళయిందని అతను వారి నోళ్ళు మూయిస్తాడు. నోరా ఆర్థర్‌కి హే సంగ్ గురించి అంతా చెప్పింది. అతను వస్తున్నాడని చెబుతుంది. ఆర్థర్ అతను ఆమెని చూడటానికే వస్తున్నట్టున్నాడని అంటాడు.

నోరా, హే సంగ్ న్యూ యార్క్‌లో ఒక పార్క్‌లో కలుసుకుంటారు. ఆమె అతన్ని కౌగిలించుకుంటుంది. అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇలా స్నేహపూర్వకంగా కౌగిలించుకోవటం మామూలే. అతనికి అది కొత్త. ఇబ్బందిగా నవ్వుతాడు. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతారు. ఆమె పెళ్ళికి ముందు పంపిన ఈమెయిల్‌కి జవాబు ఇవ్వనందుకు అతను సారీ చెబుతాడు. తన ప్రియురాలి నుంచి ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టు చెబుతాడు. “పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. నేను ఒక్కడినే కొడుకుని. నా సంపాదన అంతంత మాత్రమే. ఆమె నాకన్నా తగిన వరుడిని చూసుకుంటే మంచిది” అంటాడతను. “సంపాదన బాగా లేకపోతే పెళ్ళి చేసుకోవటం కష్టమా?” అంటుందామె. “మేము మొదట్లో అలా అనుకోలేదు. కానీ ఆలోచిస్తే అదే నిజం అనిపించింది” అంటాడతను. అతను కూడా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాడు కానీ అతని ఆలోచనలో అతని తలిదండ్రులు కూడా ఉన్నారు. వారిని చూసుకోవటం అతనికి ముఖ్యం. నోరా కేవలం తన జీవితం గురించి ఆలోచిస్తుంది. అయితే ఆమె తలిదండ్రులు కెనడాలో మంచి జీవితమే గడుపుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధులకి సదుపాయాలు బావుంటాయి. అందుకే చాలామంది ఆ దేశాలకి వలస పోతుంటారు. నోరాది స్వార్థం కాదు, స్వతంత్రం. ప్రాచ్య దేశాల్లో వృద్ధులు పిల్లలపై ఆధారపడాల్సిందే.

మాటల్లో ఆమె “నా కోసం ఎందుకు వెతికావు?” అని అడుగుతుంది. అతను “నువ్వు హఠాత్తుగా వెళ్ళిపోయావు. నాకు కోపంగా ఉండేది. ఇంకొక్కసారి నిన్ను చూడాలని ఉండేది. సైన్యంలో ఉన్నప్పుడు నువ్వు గుర్తొచ్చేదానివి” అంటాడతను. “అప్పుడు మనం చిన్నపిల్లలం” అంటుందామె. “పన్నెండేళ్ళ క్రితం కూడా మనం చిన్న పిల్లలమే” అంటాడతను. పన్నెండేళ్ళ క్రితం ఆమె అతన్ని దూరం పెట్టింది కదా. అందుకు క్షమించానని అతని ఉద్దేశం. “ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు” అంటుందామె. తొందరపడకూడదు అనే భావం ధ్వనిస్తుంది ఇందులో. సాయంత్రం అతను తన హోటల్‌కి వెళ్ళిపోతాడు. ఆమె ఇంటికి వెళుతుంది. ఆర్థర్‌తో “నువ్వన్నదే నిజం. అతను నా కోసం వచ్చాడు” అంటుంది. అతను విహారయాత్రకి వచ్చాడని అనుకుంది. కానీ అతని ప్రవర్తన చూసి అతను తన కోసమే వచ్చాడని అర్థమయింది. పెళ్ళయిందని తెలిసి కూడా అతను ఎందుకు వచ్చాడు? కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు. చిన్నప్పుడు విడిపోయి మళ్ళీ మాట్లాడుకోకపోతే ఇన్నాళ్ళ తర్వాత వచ్చేవాడు కాదు. మధ్యలో కొన్నాళ్ళు మాట్లాడుకున్నారు. సరైన ముగింపు లేకుండా మళ్ళీ దూరమయ్యారు. అందుకు అతను వచ్చాడు. ఇద్దరూ ఏమన్నా తొందరపడ్డా ముందు వెనకడుగు వేసేది అతనే.

నోరా ఆర్థర్‌కి హే సంగ్ గురించి చెబుతుంది. “ఇంకా తన అమ్మానాన్నలతో ఉంటున్నాడు. కొరియన్లకి ఇది మామూలే. అతని భావాలు కూడా కొరియన్ భావాలే” అంటుంది. అతను “అతని పట్ల నీకు ఆకర్షణ కలిగిందా?” అని అడుగుతాడు. ఆమె ఆలోచించి “లేదు. ఇన్నాళ్ళూ అతన్ని చూడలేదుగా. ఇప్పుడు ఎదురుగా వచ్చేసరికి భావోద్వేగం కలిగింది. అది ఆకర్షణ కాదనుకుంటా. సియోల్ గుర్తొచ్చింది” అంటుంది. “అతనికి నువ్వు గుర్తొచ్చేదానివా?” అంటాడతను. “చిన్నప్పటి ఆ ఏడుపుగొట్టు అమ్మాయి గుర్తొచ్చేదనుకుంటా” అంటుందామె. “నువ్వు ఏడుపుగొట్టుగా ఉండేదానివా?” అంటాడతను ఆశ్చర్యంగా. ఆమె గురించి తనకి తెలియనిది హే సంగ్‌కి తెలుసు కదా అనే భావం కనిపిస్తుందిక్కడ. తర్వాత ఆమె “నీకు కోపం వచ్చిందా?” అని అడుగుతుంది. “నాకు కోప్పడే హక్కు లేదు” అంటాడతను. వారి బంధాన్ని అతను అర్థం చేసుకున్నాడు. అయితే ఆమె మీద పూర్తి నమ్మకం ఉందా? అది అతనికే తెలియకపోవచ్చు. “నువ్వు అతనితో పారిపోవని నాకు తెలుసు” అంటాడు. “నేను నాటకం రిహార్సల్స్ వదిలేసి అతనితో పారిపోతానా? నీకు నా గురించి తెలియదా?” అంటుందామె. అతను కించిత్తు విరక్తితో “నాకు నీ గురించి తెలుసు” అంటాడు. ఇక్కడ దర్శకురాలిని మెచ్చుకోకుండా ఉండలేం. అతను నోరాని అవమానించినట్టు ఆ మాట ఉండదు. కానీ అతనిలో ఉన్న చిన్న అసంతృప్తి కూడా కనిపిస్తుంది. తన కంటే ఆమెకి ఆమె వృత్తే ముఖ్యం అనే అసంతృప్తి అది. ‘నిన్ను వదిలి నేను వెళ్ళను’ అని ఆమె అనలేదు. ‘నాటకాన్ని వదిలి వెళ్ళను’ అంది. అయినా అతను పెద్దగా పట్టించుకోడు. ఆమె ప్రాధాన్యతలు ఆమెకి తెలుసు. ‘నువ్వు లేక నేనుండలేను’ అని ఒకరికొకరు చెప్పుకోవాల్సినంత అభద్రత వారిద్దరికీ లేదు. అతను కూడా రచయితే కాబట్టి అతనికి పరిపక్వత ఉంది.

తర్వాత నోరా, అర్థర్‌ల మధ్య వచ్చే సంభాషణలో ఆ పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. “హే సంగ్‌తో నాకు పోటీయే లేదు. ఈ కథలో నేను విలన్ని” అంటాడతను. ఆమె నవ్వేస్తుంది. అతనే మళ్ళీ “మనం ఆర్టిస్ట్ రెసిడెన్సీలో కలిశాం. ఇద్దరం సింగిల్‌గా ఉన్నాం కాబట్టి కలిసి పడుకున్నాం. అద్దె తగ్గుతుందని న్యూ యార్క్‌లో కలిసి ఉన్నాం. నీకు గ్రీన్ కార్డ్ వస్తుందని పెళ్ళి చేసుకున్నాం. రెసిడెన్సీలో ఇంకొకతను కలిసుంటే ఏమయ్యేది? నువ్వు అతనితో ఉండేదానివి కదా?” అంటాడు. జీవితం యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల సమాహారం అని అతని భావం. ఎంత మంది ఇలా ఆలోచిస్తారు? ఆమె “ఇది నాకు అందిన జీవితం. దీన్ని నీతో జీవిస్తున్నాను” అంటుందామె. “సియోల్ వదిలి వచ్చినప్పుడు నువ్వు కోరుకున్న జీవితం ఇదేనా? ఈ చిన్న అపార్ట్‌మెంట్లో ఓ రచయితతో కలిసి ఉంటానని అనుకున్నావా?” అంటాడతను. “నాకు ప్రాప్తించినదిదే. నేనుండాల్సినదిక్కడే. పైగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది మర్చిపోకు” అంటుందామె. ఆమెలో కూడా పరిపక్వత ఉంది. అతను “నువ్వు నిద్రలో మాట్లాడేటపుడు కొరియన్లో మాట్లాడతావు. ఒక్కోసారి భయం వేస్తుంది. నీలో ఏదో రహస్య ప్రదేశం ఉన్నట్టు, అక్కడ నాకు ప్రవేశం లేనట్టు అనిపిస్తుంది” అంటాడు. ఆమె “నేను నిద్రలో అర్థం లేని మాటలేవో మాట్లాడతానని నాకనిపిస్తోంది” అంటుందామె. ఈ సన్నివేశం ఎంతో హృద్యంగా, మనసుని తాకేలా ఉంటుంది. ఇలాంటి కథలో భర్తని విలన్‌గా చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడి ఉన్నారు. కానీ అతను ఆమెకి తాను సరిపోతానా అని ఆలోచిస్తున్నాడు. ఆమె తెలిసీ తెలియని వయసులో అన్నీ వదిలి పరాయి దేశం వచ్చింది. ఎన్నో ఆశలతో వచ్చింది. ఆ ఆశలకి తాను న్యాయం చేశానా అని అతని మథనం. ఆమెకే కాదు, అతనికి కూడా హే సంగ్ ఆమె వదిలి వచ్చిన ఆమె మూలాలకి ప్రతీక. ఆమె అతనిలో ఆ మూలాలనే చూసుకుంటోందని అతనికి తెలుసు. ఇది ‘అమ్మాయి చివరికి ఎవరికి దక్కుతుంది’ అని ఆలోచించే కథ కాదు. మూలాలని వదిలి వలస వచ్చినవారి లోని సంఘర్షణని చూపించే కథ. వలసల వల్ల దేశానికి జరిగే నష్టం కన్నా మానసిక సంఘర్షణ వల్ల పౌరులకి కలిగే కష్టమే ఎక్కువ.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మర్నాడు నోరా, హే సంగ్ కలిసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడటానికి ఫెర్రీలో వెళతారు. అతను ఆమెని “చిన్నప్పుడు నోబెల్ బహుమతి కావాలనేదానివి. పన్నెండేళ్ళ క్రితం పులిట్జర్ బహుమతి కావాలన్నావు. ఇప్పుడే బహుమతి కావాలి?” అని అడుగుతాడు. “ఆ విషయం నేను చాలా కాలంగా ఆలోచించలేదు” అంటుందామె. “ఏదో అవార్డు ఉంటుందిగా” అని రెట్టిస్తాడతను. “టోనీ అవార్డు” అంటుందామె. టోనీ అవార్డులు అమెరికాలో నాటకాలకి ఇస్తారు, సినిమాలకి ఆస్కార్ అవార్డులు ఇచ్చినట్టే. అతను నవ్వుతాడు. “నీకు అన్నీ కావాలి. ఎంత దురాశో!” అంటాడు. చిన్నప్పుడు అతను ఫస్టు వచ్చాడని ఆమె ఏడ్చినప్పుడు అదే మాట అన్నాడు. ఇద్దరూ నవ్వేస్తారు. అతని దృష్టిలో ఆమెకి అన్నీ కావాలి. కానీ ఆమెకి ఇప్పుడు పెద్దగా అభిలాషలు లేవు. అది అతనికి అర్థం కాలేదు. టోనీ అవార్డు అనేది అమెరికా బయట పెద్దగా తెలియని అవార్డు. ఆమె కొరియాలో రచయితలకి పెద్దగా పేరు రాదు అని అమెరికా వచ్చింది. కానీ అమెరికాలో ఆమె లాంటి రచయితలు ఎంత మందో! ఒకచోట ప్రతిభకి గుర్తింపు ఉండదు. ఒకచోట గుర్తింపు కోసం బోలెడు పోటీ ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి! జీవితం ఇలాగే ఉంటుంది. అతని మాటలు ఆమెలో ఏదో ఆలోచన రేకెత్తిస్తాయి. భర్త కూడా ‘నీకు కావలసిన జీవితం ఇదేనా’ అని అడిగాడు. ఇలా సందిగ్ధంలో పడే దశ చాలామందికి వస్తుంది. దాన్నే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. వలసదారుల్లో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్‌కి కొత్త కోణం జతవుతుంది. ‘నా దేశంలో ఉంటే బంధాలు ఇలా ఉండేవి. మా వూళ్ళో ఆ ప్రదేశాలన్నీ తిరిగేదాన్ని, ఆ పదార్థాలన్నీ తినేదాన్ని’ అనే ఆలోచనలు వస్తాయి. సాయంత్రం ఇద్దరూ కలిసి ఆమె ఇంటికి వస్తారు. మర్నాడు ఉదయమే అతని తిరుగు ప్రయాణం. హే సంగ్‌ని ఆర్థర్ మొదటిసారి చూసినపుడు అతని ముఖంలో ఎన్నో భావాలు కనపడతాయి. ముగ్గురూ కలిసి భోజనానికి రెస్టారెంట్‌కి వెళతారు. మాటల్లో ఆర్థర్ తానెప్పుడూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడటానికి ఫెర్రీలో వెళ్ళలేదు అంటాడు. నోరా ఆశ్చర్యపోతుంది. హే సంగ్ “మీ ఆయన్ని తీసుకుని వెళ్ళు” అంటాడు. ఇలాంటి సందర్భాలు దాదాపు అందరికీ అనుభవమే. బయటివారికి ఆకర్షణగా ఉండే విషయాలని ఆ ఊరివాళ్ళు ‘ఆ! చూడొచ్చులే’ అని నిర్లక్ష్యం చేస్తారు. అమెరికా అంటే అందరికీ ఆకర్షణ. అక్కడి వారికి జీవితం నిస్సారంగా ఉండవచ్చు. అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి.

ముగ్గురూ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక బార్లో మద్యం తాగుతారు. హే సంగ్ నోరాతో “నువ్వు కొరియా వదిలి వచ్చి మంచి పని చేశావు. అది నీ అభిలాషలకి చిన్న ప్రదేశం. నీ భర్త నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ భర్త నాకు నచ్చటం నాకు ఇంత కష్టం కలిగిస్తుందని అనుకోలేదు. మీ ఇద్దరికీ ఎనిమిది వేల ఏళ్ళ ఇన్-యన్ ఉంది. నాకు నువ్వు ఎప్పుడూ నన్ను వదిలేసే మనిషివే. అతనికి మాత్రం నువ్వు ఎప్పుడూ పక్కనుండే మనిషివి” అంటాడు. తర్వాత నోరా లేనప్పుడు అతను ఆర్థర్‌తో “మన ఇద్దరి మధ్య కూడా ఏదో ఇన్-యన్ ఉంది” అంటాడు. ఆ మాటకి ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఇది మన కర్మ సిద్ధాంతం లాగే ఉంటుంది. ఏ జన్మలోనో హే సంగ్ నోరాని ఆర్థర్‌కి దక్కకుండా చేసి ఉంటాడు. ఇప్పుడు నోరా అర్థర్‌కి దక్కింది!

తెల్లవారుతుంటే అందరూ నోరా వాళ్ళ ఇంటికి వస్తారు. నోరా హే సంగ్‌ని ట్యాక్సీ ఎక్కించి వస్తానని వెళుతుంది. ఇద్దరూ మౌనంగా ఉంటారు. చివరికి అతను ఆమెని కౌగిలించుకుంటాడు. మళ్ళీ ఎప్పుడూ వారిద్దరూ కలవకపోవచ్చు. అతను “ఇది కూడా ఒక గత జన్మ అయి తర్వాతి జన్మలో మనం కలుసుకుంటే? అప్పుడు మనం ఏమవుతాం?” అంటాడు “ఏమో!” అంటుందామె. అతను ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆమె ఇంటి వైపు నడుస్తుంది. ఇంటి బయట ఆర్థర్ ఎదురుచూస్తూ ఉంటాడు. అంత వరకు ఆపుకున్న దుఃఖం ఆమెలో ఒక్కసారిగా ఉబికివస్తుంది. ఆర్థర్ ఆమెని కౌగిలించుకుంటాడు. ఒకప్పుడు ఆమె హే సంగ్ ముందు ఏడ్చేది. ఇప్పుడు హే సంగ్ ముందు దుఃఖాన్ని ఆపుకుని ఆర్థర్ ఎదుట కన్నీరు పెట్టింది. ఆ కన్నీటికి అర్థం ఏమిటి? ఆమె కొరియా వదిలివచ్చిన మొదట్లో ఏడ్చేది. తర్వాత దుఃఖాన్ని దిగమింగింది. అప్పుడు ఆమెకి మాతృభూమి ప్రాముఖ్యత తెలియదు. ఇప్పుడు తెలుసు. ఆ మాతృభూమిని మళ్ళీ గుర్తు చేసిన హే సంగ్ వెళ్ళిపోతుంటే మాతృభూమి మళ్ళీ దూరమవుతున్నట్టనిపించింది. అందుకని మనసారా ఏడ్చింది.

ఇంతకీ ఈ చిత్రానికి ‘పాస్ట్ లైవ్స్’ అని పేరెందుకు పెట్టారు? జన్మజన్మల బంధాల గురించి ప్రస్తావన వచ్చింది కదా అందుకు అని అనిపించవచ్చు. అదీ నిజమే. నాకు అనిపించించి మాత్రం మనిషి ఒక జీవితకాలంలోనే ఎన్నో జన్మలు జీవిస్తాడు. యాభై ఏళ్ళు దాటిన వారు పరిశీలించుకుంటే కొన్ని విషయాలు గత జన్మలో జరిగినట్టు ఉంటాయి. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. కానీ జీవనస్రవంతిలో సాగిపోతుంటే పాత విషయాలని తలచుకుని అతిగా బాధపడటం వ్యర్థం. జీవించటమే జీవితలక్ష్యం. అంతకంటే లక్ష్యాలు ఉండవలసిన అవసరం లేదు. అలాగే గతం గురించి అతిగా విచారపడాల్సిన అవసరమూ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here