ఇంద్రుని వజ్రాయుధాన్ని నిరోధించిన ‘మరుత్తుడు’

0
8

[dropcap]మ[/dropcap]హాభారతములో మనకు అనేక పాత్రలు తారసపడతాయి. ప్రతి పాత్ర ఎదో ఒక అర్థవంతమైన సందేశాన్ని ఇస్తాయి. ఆణిముత్యాలు లాంటి పాత్రలు అనేకము ఉన్నాయి. అటువంటి వాటిలో ‘మరుత్తుడు’ ఒకడు. ఈయన పదివేల ఏనుగుల శక్తి గల మహనీయ బలవంతుడు. ఈయన హిమగిరి చరియాలపై అశ్వమేధ యాగాలు జరిపి భూసురులకు బంగారు పాత్రలు వగైరాలు, అపార హిరణ్యరాసులు సమర్పించుకున్న మహా భాగ్యశాలి.

మరుత్తుడి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ముందు అతని వంశ చరిత్ర తెలుసుకోవాలి. కృతయుగములో దండనీతి సిద్ధాంతకర్త అయిన మనువు కుమారుడు క్షతుడు, అతని కుమారుడు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకునికి నూరుగురు కుమారులు జేష్ఠుడు వింశుడు. అతనికి మావిదంసుడు, ఆయనకు 15 మంది కుమారులు పుట్టారు. వారిలో ఖనిత్రుడు జేష్ఠుడు. కానీ ఖనిత్రుడు హింసాతత్పరుడు అయిన బలవంతుడవటము వలన సోదరులను నిర్బంధించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అతని పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మంత్రి, సేనాధిపతులు ఊకుమ్మడిగా ఖనిత్రుని కాదని అతని కుమారుడుని పట్టాభిషక్తుడిగా చేశారు. అతను ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల అభిమానానికి పాత్రుడైనాడు.

విరివిగా అతను చేసిన దానాల వల్ల సంపదలు హరించి ధన లేమికి దగ్గర బంధువు అయినాడు. ఇది గమనించిన శత్రు రాజులు అతనిపై దాడి చేసి అరణ్యాల పాలు చేశారు. ఆప్తులతో అరణ్యాలకు చేరిన రాజు అచ్చట తీవ్రమైన తీవ్రమైన తపస్సు చేసి కరంధముడు అనే పేరు పొందాడు. దేవతలు ఇతని తపస్సుకు మెచ్చి అతనికి కావలసిన రథ, తురగ, గజ పదాతి దళాలను కానుకలుగా ఇచ్చారు ఆ కానుకలతో శత్రువులను సంహరించి యుద్ధము చేసి తన రాజ్యాన్ని తానూ స్వాధీన పరుచుకున్నాడు. అంగీరసుడిని ఉపద్రష్టగా ఏర్పాటు చేసుకొని లోక శ్రేయస్సు కోసము అశ్వమేధ యాగాలు చేసాడు. ఈ యాగాల ఫలితముగాను ఉపద్రష్టగా ఉన్న అంగీరసుడు గొప్పతనము వల్లను, కరంధముడు సశరీరముగా స్వర్గ లోకాన్ని పొందాడు. కరందముని పౌత్రుడు (మనుమడు) మరుత్తుడు. ఈయన తన యజ్ఞాలకు అంగీరసుని పుత్రుడైన బృహస్పతిని ఉపద్రష్టగా పిలుస్తాడని భావించిన ఇంద్రుడు అడ్డుపడతాడు. బృహస్పతి నీకే నా సారథ్యము అని ఇంద్రునితో చెపుతాడు. మరుత్తుడు దేవగురువును ప్రార్థించినా ఫలితము ఉండదు. నిరాశతో తన నగరానికి వస్తాడు.

ఆ సమయములో నారదుడు అంగీరసుని మరో పుత్రుడు, బృహస్పతి తమ్ముడు అయిన సంవర్తుని అర్థించమని సలహా ఇస్తాడు. సంవర్తుడు ఎక్కడ ఉంటాడని మరుత్తుడు నారదుని అడుగుతాడు. ‘అన్నగారైన బృహస్పతిచే తిరస్కరింపబడటం వలన అన్నిటిని త్యజించి దిగంబరియై కాశీ క్షేత్రములో ఉన్నాడని అతనిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుంటే నీ పని సానుకూలమవుతుంది’ అని నారదుడు మరుత్తునికి హితబోధ చేస్తాడు. మరి సంవర్తుని గుర్తించటం ఎలా? అని నారదుడిని మరుత్తుడు ప్రశ్నిస్తాడు. దానికి సమాధానముగా, “ఒక అనాథ ప్రేతాన్ని తీసుకొని కాశీ క్షేత్ర ద్వారము వద్ద వేచి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరైతే వెంటనే నగరములో ప్రవేశించకుండా తిరిగి పోతారో వారే సంవర్తనుడు, ఓ పట్టాన దొరకడు వెంటపడి పట్టుకో” అని నారదుడు చెపుతాడు.

నారదుని సూచన మేరకు కాశీ క్షేత్రము చేరి నగర ద్వారము వద్ద ఒక అనాథ ప్రేతముతో ఎదురు చూస్తూ ఉండగా నారదుడు చెప్పినట్లుగానే సంవర్తనుడు వెను తిరిగి పరిగెడుతుంటే వెంట పడి ఎట్టకేలకు ఒక ఏకాంత ప్రదేశములో ఆయనను పట్టుకొని తన వృత్తాంతాన్ని చెప్పి కరుణించమని వేడుకొన్నాడు. “నా గురించి నీకు ఎవరు చెప్పారు?” అని సంవర్తుడు మరుత్తుని అడగగా, నారదుడు చెప్పాడు అని చెపుతాడు. “సరే నీ సంగతి నీకు కావలసినది నీవు చెప్పావు. మరి నా సంగతి చెపుతాను విను. నీ మనోభీష్టము తప్పక నెరవేరుస్తాను. కానీ కార్యము ప్రారంభించాక వెనకడుగు వేయరాదు. ఏ మాత్రము తేడా వచ్చిన నా ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అందుకు సిద్ధమయితే యజ్ఞ రంగము సిద్దము చేసుకో” అని సంవర్తుడు మరుత్తునికి చెప్పాడు.

“మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను. మీ మాట ఎటువంటి పరిస్థితులలో జవదాటను అని సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను” అని సంవర్తునికి ప్రమాణము చేస్తాడు. సంతోషించిన సంవర్తుడు,”రాజా నీ యజ్ఞాన్ని నిర్వర్తించి నీకు అనంత ధనరాశులు పొంది అన్నిలోకాలు దేవతలు ఆశ్చర్యపోయేట్లు చేస్తాను. ఈ యజ్ఞానికి సమర్థులైన సహస్రాధికులు భార వాహకులు కావాలి. వారు హిమవంతునికి ఉత్తర దిశలో ఉన్న ముంజవంతము అనే పర్వత రాజము నుండి పరమశివుని అనుగ్రహముతో కోకొల్లుగావుండే బంగారు పాషాణాలను ఇసుకను తీసుకురావాలి” అని సంవర్తుడు మరుత్తునితో చెపుతాడు. మరుత్తుడు మహర్షి ఆజ్ఞ ప్రకారము భారవాహకులతో వెళ్లి పరమశివుని ప్రసన్నము చేసుకొని అఖండ అనంత బంగారు రాశులతో వచ్చి దేవతలు మెచ్చే విధముగా యజ్ఞము ప్రారంభించాడు.

దేవ గురువైన బృహస్పతి తన తమ్ముడు చేయిస్తున్న యజ్ఞానికి సాధారణ మానవుని లాగా అసూయ ద్వేషాలు పెంచుకొని క్రుంగి పోవటాన్ని గమనించిన ఇంద్రుడు కారణము అడిగి తెలుసుకొని అగ్నిదేవుడితో మరుత్తుని దగ్గరకు రాయబారము పంపి సంవర్తుని బదులు యజ్ఞ నిర్వహణ బృహస్పతికి అప్పజెప్పమని చెపుతాడు. కానీ మరుత్తుడు ఇంద్రుడి శాసనాన్నిసౌమ్యముగా తిరస్కరిస్తాడు.”నేను ఉపద్రష్టను మార్చి సంవర్తుని శాపానికి గురి కాలేను. బృహస్పతి కాదంటానా? నేను సంవర్తుని ప్రాధేయపడి ఒప్పించి యజ్ఞము ప్రారంభించాను. ఎట్టి పరిస్థితులలో మార్పు లేదు”అని ఖచ్చితముగా చెప్పాడు. అగ్ని ఇంద్రునికి ఈ విషయమే చెప్పాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తామని మరుత్తునితో చెప్పమంటాడు. అగ్ని మళ్లా మరుత్తుని దగ్గరకు వెళ్లి వారి ఆగ్రహానికి గురికాను అని అంటాడు. ఈ సారి గంధర్వ పతిని రాయబారిగా ఇంద్రుడు పంపిన లాభాము ఏమి లేకుండా పోయింది.

ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే మరుత్తుడు ఆ వజ్రాయుధాన్ని నిరోధించి ఇంద్రాది సర్వ దేవతలను యజ్ఞ ఫలము అందుకోవటానికి ఆహ్వానించాడు. అందరు వచ్చి యజ్ఞ ఫలాలు స్వీకరించి మరుత్తుని ఆశీర్వదించారు. ఆ విధముగా పరమశివుని ఆశీస్సులతో సంవర్తుని అనుగ్రహముతో యజ్ఞాన్ని పూర్తిచేసి అఖండ కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. ఆ విధముగా సంవర్తుని శక్తి, మరుత్తుని భక్తి ఖ్యాతి లోక విదితము అయి విశ్వ విఖ్యాతము అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here