మర్యాదా దర్శకుడు కాశీనాథుడు

0
9

[dropcap]‘అ[/dropcap]దేదో’ స్టార్ నటించిన సినిమా విడుదలయింది. ఓ టీవీ ఛానెల్ మొదటి ఆట చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులని చిత్రం గురించి వాకబు చెయ్యటం మొదలు బెట్టింది. “ఎలా ఉంది సినిమా” అడిగాడు యాంకర్ ఓ ప్రేక్షకుడిని. “సూపర్” అన్నాడు. “సూపర్.. డూపర్” ఇంకొకడు. “డాన్సులు ఇరగదీసాడు మా వాడు” మరొకడు. “కత్తి” పక్కవాడు. “గొడ్డలి..” ఇలాంటి వ్యాఖ్యలు లైవ్ కవరేజ్‌లో మారుమోగాయి. మొదటి ఆట అంటే అభిమానులే ఎక్కువగా ఉంటారుగా.. ఇలాగే ఉంటాయి మరి. కొంచెం స్థాయి కలిగిన పెద్దవాళ్ళని అడిగాడు. “టెక్నికల్‍గా బాగుంది”, “డాన్సులు, ఫైట్లు, గ్రాఫిక్స్, అంతే, కథ లేదు..”, “..హీరోలు వయసుకి తగిన పాత్రలు వేస్తే బాగుంటుంది..”, “కథనం పరవాలేదు..”, “అభిమానులకు నచ్చుతుంది..”, “ఏదో ఓసారి చూడొచ్చు..” ఇలా సాదాసీదా వ్యాఖ్యలు వినబడ్డాయి. చిత్ర సమీక్షలు పత్రికలలో కాస్త అటు ఇటుగా వచ్చాయి. “రక్తం చిందని సీన్ లేదండీ బాబు..”, “ఫ్యామిలీతో చూడలేం..”, ఇంకా ఇలాంటివే వ్యాఖ్యలు వినడం కద్దు. కానీ ఒకానొకసారి “సినిమా ఎలా ఉందీ?” అంటే, “నేను థియేటర్‍లో కూర్చున్నట్లు అనిపించలేదు.. ఏదో గుడిలో కూర్చున్నట్లనిపించింది..” అని ఒకరంటే, “నిజమే, సినిమా చూస్తున్నంత సేపూ నేను చెప్పులు వేసుకోలేదు” అని మరొకరు అన్నారట. ఒక సినిమా గురించి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ ఊహించరు. కానీ అవి నిజాలే. అటువంటి వ్యాఖ్యలని రాబట్టగలిగిన సినిమా తీసిన ఆ ‘మర్యాదా దర్శకుడు’ కాశీనాథుని విశ్వనాథుడు.  43 సంవత్సరాల క్రితం ఆ సినిమా విడుదలయిన రోజునే (ఫిబ్రవరి 2) శివైక్యం చెందడాన్ని ఒక ఋజువుగా చూపించడం ‘అతిశయం’ కాకపోవచ్చు.

***

ఈ రోజులలో చిత్రం తియ్యాలంటే పెద్ద హీరోలతో తియ్యాలంటే బడ్జెట్ వంద కోట్లు దాటేస్తుంది. చిన్న హీరోలతో అయినా ముప్పై కోట్లు కావాల్సిందే. దర్శకుడు శంకర్ సినిమా అంటే టైటిల్స్‌కే వంద కోట్లు కావాలనే జోక్ ఎప్పటినుంచో వినబడుతోంది మరి. బడ్జెట్ సినిమాకి కూడా రెండు కోట్లు కావాలంటున్నారు. అది ఇప్పటి పరిస్థితి. ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళితే 1979-80 సంవత్సరాలలో అగ్రనటుల సినిమాలకి నలభై లక్షలు, బడ్జెట్ సినిమాకి అయిదు లక్షలు ఖర్చు చెయ్యాల్సి వచ్చేది. చక్కటి సినిమాలు చేసిన అలనాటి అగ్రనటులు సైతం బెల్ బాటమ్స్, సైడ్ బర్న్స్, పచ్చటి ఎర్రటి ప్యాంట్స్, పూల చొక్కాలతో ‘పేరు పడి’పోయేలా నటిస్తున్న రోజులు.. మూస కథలు.. విలన్ మేనమామే.. తండ్రిని చంపేసి ఆస్తిని కాజేస్తాడు. ఆ మామ కూతుర్నే ప్రేమించి, ఆ మామని శిక్షించే కథలు. అసలు అప్పటికీ, ఇప్పటికీ కూడా ‘ఫార్ములా, ఇమేజీ’ల వలయంలోంచి బయటపడని సినిమాలు తెలుగు సినిమాలే. మిగతా భాషలలో అప్పుడప్పుడు క్రొత్త తరహా చిత్రాలని చూడొచ్చు.. అటువంటి కాలంలో ఉద్యోగం చేసుకొంటూ నాటకాలు వేసుకొనే ఓ ముసలాయననీ, ‘ఎక్స్‌ట్రా’ పాత్రలలోనూ, డాన్సు సన్నివేశాలలోనూ కనిపించే ఓ నటినీ ప్రధాన పాత్రలకు తీసుకొని సినిమా తియ్యాలనుకోవడం ఎంత సాహసం? అంత సాహసం చెయ్యాలంటే తీసే వ్యక్తికి ఎంత గుండె ధైర్యం కావాలి?

అసలు సినిమా రంగమే కాదు, ఏ రంగంలోనైనా రాణించాలంటే ఏ వ్యక్తికైనా కావలసిన ప్రధాన లక్షణం ‘గుండె ధైర్యం’. తన మీద (మిగతా వాళ్ళకు కాదు) తనకు నమ్మకం కలిగి యుండడం అనేది ఉండి తీరాల్సిన లక్షణం. ‘నీ మీద నీకే నమ్మకం’ లేని నాడు నువ్వు ఏమీ సాధించలేవు.. ఆ లక్షణం పుష్కలంగా కలిగిన వ్యక్తి కాశీనాథుని విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ అంటే ‘శంకరాభరణాలు’, ‘స్వాతి కిరణాలు’ కాదు.. అవి తరువాత వచ్చాయి.. విశ్వనాథ్ అంటే ‘తన మీద తనకు నమ్మకం’ అనే సర్వోత్కృష్ట లక్షణాన్ని గుర్తు చేసుకోవాలి ముందు. ఈ లక్షణం ఉండబట్టే అవి వచ్చాయి.. లేకపోతే ‘శంకరాభరణం’ ఆయన ఊహల్లోనే ఉండిపోయేది. ఆయన సెట్‍లో ఖాకీ దుస్తులు వేసుకొంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే.. దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకొన్న నాడే ‘చిత్రం అపజయం పొందితే అదే గెటప్‍లో డ్రైవర్‌గా వెళ్ళిపోవచ్చు కదా’ అని ఖాకీ డ్రెస్ వేసుకొన్నానని జోక్ చేశారు.. కానీ దాని వెనుక ‘బాధ్యతల నిర్వహణలో కఠినత్వం ఉంటేనే వృత్తిలో నెగ్గుకు రాగలము’ అనే ఆలోచనను చూడొచ్చు.

ఈ నమ్మకాన్ని (self-belief) ఆత్మబలంగా చెప్పుకొంటే ఆయన లోని రెండవ విశిష్ట గుణం ‘ఆత్మవిశ్వాసం’ (self-confidence). సాధారణంగా పెట్టుబడి పెట్టే నిర్మాతలకు కొన్ని కోరికలుంటాయి. ఫలానా హీరోనే లేదా హీరోయిన్‌నే పెట్టాలని, డ్యూయట్లు, ఫైట్లు ఉండాలనో; అందరిని ఆకర్షించడానికి క్లబ్ సాంగ్‌లు ఉండాలనే పట్టుబడుతూ ఉంటారు. కానీ విశ్వనాథ్ గారి దగ్గరకు నిర్మాత వెడితే విశ్వనాథ్ గారు నిర్మొహమాటంగా “కథ నాదే ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా నాకు నచ్చిన వాళ్ళనే పెట్టుకొంటాను. ఒక వేళ మీ దగ్గర ఏదైనా కథ ఉంటే నాకు నచ్చితేనే తీస్తాను” అని చెప్పి.. “ఒకసారి బాధ్యత తీసుకొన్నాక చిత్రం బాగా తయారవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.. ఫలితం దైవ నిర్ణయం” అని కూడా అనేసరికి మామూలు నిర్మాతలు ఎవరు ముందుకొస్తారు? నిర్మాతలు వస్తేనే కదా తనకు భుక్తి దొరికేది. కాబట్టి  నిర్మాతల కోరికలు కొన్నైనా తీర్చాలి కదా అనే ఆలోచన చేసేవారు కాదు. ఆ ఆత్మవిశ్వాసం వలనే ఎంతటి పెద్ద నటుడైనా పాత్రలోనే ఇమిడిపోవాల్సిందే కాని ‘నటుడు’ కనిపించేవాడు కాదు. కొందరు దర్శకులు అగ్రనటులని పెట్టుకుంటే ‘ఇమేజ్’కి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని చిన్నస్థాయి నటులను పెట్టుకుని సినిమాలు తీసేవారు. అలా తమ మాట చెల్లుబాటు చేసుకునేవారు. కానీ విశ్వనాథ్ అలా ఎన్నడూ చేయలేదు. హీరోలందరి తోనూ పని చేసేరు. అక్కినేని, నందమూరి, కృష్ణ, శోభన్, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, మురళీమోహన్, చంద్రమోహన్, వెంకటేష్, ముమ్ముట్టి – వీళ్ళందరూ పెద్ద హీరోలేగా. అలాగే జమున, కాంచన, వాణిశ్రీ, జయప్రద, శారదలు అగ్రనాయికలే కదా.

ఎంత ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఉన్నా తన షరతులకు ఒప్పుకుని పెట్టుబడి పెట్టిన నిర్మాత సినిమా అపజయం పొందితే నష్టపోతాడు.. తరువాత తనతో తియ్యడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి సినిమా విజయం సాధించేటట్లు తియ్యాలి. మంచి సినిమా తీస్తే సరిపోదు.. కాసులు కూడా కురిపించాలి. ఆ విధంగా తీసే నేర్పు విశ్వనాథ్ కుంది. ప్రణాళికను అమలుపర్చగలగడం అనేది మరొక మంచి లక్షణం. విశ్వనాథ్ చిత్రాలు కొన్ని అపజయం పొందినా అనవసరపు ఖర్చులు పెట్టించడు కాబట్టి నష్టం భారీగా ఉండదు.. విజయం సాధిస్తే లాభాలు గట్టిగానే ఉంటాయి.. అదీ నిర్మాతలకి విశ్వనాథ్‌ని చూస్తే కలిగే ‘ధైర్యం’.

సాధారణంగా హీరోలకి ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్‌కి ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. కానీ చిత్రంగా విశ్వనాథ్‌కి ఓ ఇమేజ్ ఏర్పడిపోయింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టు సినిమా లేకపోతే బేజారేగా.

 

బి.యస్సీ పూర్తి చేసుకుని 1952-53లో సినీ పరిశ్రమలో సౌండ్ రికార్డింగ్‍లో అడుగు పెట్టిన విశ్వనాథ్‌కి అన్ని అంశాల మీద పట్టు ఉండడం ఆయన ఆత్మవిశ్వాసానికి కారణం. ఆయనలోని సృజనాత్మకతను గమనించిన ఆదుర్తి సుబ్బారావు తన దగ్గర సహాయకుడిగా తీసుకొన్నారు. ఆదుర్తి ఎక్కువగా అన్నపూర్ణా పిక్చర్స్‌కి పని చేస్తారు కాబట్టి అక్కినేని, దుక్కిపాటిల దృష్టిలో పడ్డారు. ‘ఇద్దరు మిత్రులు’, ‘మూగమనసులు’ వంటి సినిమాల తయారీలో ఆయన ప్రతిభను గమనించిన అక్కినేని ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి దర్శకత్వం వహించమన్నారు. విశ్వనాథ్ ధైర్యం చెయ్యలేకపోయారు. కాని తదుపరి అన్నపూర్ణ వారి చిత్రం ‘ఆత్మగౌరవం’ విశ్వనాథ్ దర్శకత్వంలో తయారై విజయం సాధించడంతో బాటు ‘నంది’నీ గెలుచుకొంది. తరువాత పది సంవత్సరాలు అందరి హీరోలతోనూ సినిమాలు తీశారు. కానీ ప్రత్యేకమైన ‘ఇమేజ్’ ఏదీ ఏర్పడలేదు.. బాగా తీస్తారు అనేది తప్ప. ‘చెల్లెలి కాపురం’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’, ‘కాలం మారింది’, ‘నేరము-శిక్ష’, ‘ఓ సీత కథ’, ‘జీవనజ్యోతి’ మంచి పేరును తెచ్చిపెట్టాయి.

అవన్నీ మంచి సినిమాలుగా వెళ్ళాయి కానీ ప్రత్యేకమైన ముద్ర ఏదీ పడలేదు.. విశ్వనాథ్‌కి ఎక్కడో ఏదో తెలియని అసంతృప్తి.. ఆ అసంతృప్తి కాస్తా ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’ చిత్రాలతో తీరడం ప్రారంభయింది. ‘శంకరాభరణం’ పరాకాష్ఠ. ఆయన ‘సంస్కృతి, సాహిత్యం, సంగీతం’ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారన్న ఇమేజ్ ఏర్పడిపోయింది. ఆ మూడు అంశాలు ‘స’ అక్షరంతోనే  ప్రారంభమవుతాయి.. విశ్వనాథ్ సినిమాలలో ఎక్కువ శాతం టైటిల్స్ ‘S’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి. సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ, శృతిలయలు, స్వాతికిరణం, శుభ సంకల్పం.. ఇత్యాదులు. ‘కేవలం శాస్త్రీయ సంగీతాన్ని చక్కటి సాహిత్యాన్ని నమ్ముకొని ఎన్ని సినిమాలు తీయగడు రెండు మూడు తప్ప’ అనుకొన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ‘ఎంతసేఫూ మడి కట్టుకొని చాదస్తం, ఛాందస భావాలున్న సినిమాలు తీస్తాడు’ అనుకొనేవాళ్ళు కూడా వెనుకడుగు వెయ్యక తప్పలేదు.

“ఏ కులము నీదంటే గోకులమూ నవ్వింది” అంటూ కులం ముఖ్యం కాదు అంటూ తీసిన ‘సప్తపది’, ‘కాలం మారింది’ వంటి సినిమాలు విజ్ఞుల మన్ననల నందుకొన్నాయి. ‘శంకరాభరణం’లో ఓ ‘చాదస్తపు బ్రాహ్మణుడు’ తక్కువ కులంలో పుట్టిన స్త్రీని ఇంట్లోకి ఆహ్వానించి వంట వండమంటాడుగా. ‘జీవిత నౌక’, ‘మాంగల్యానికి మరో ముడి’ వంటి సినిమాలలో మంగళసూత్రాలని ముడి వెయ్యాల్సింది ప్రేమతో అని చెబుతాడు.. ఆయన సినిమాలలో ‘ఛందస్సు’ కనిపిస్తుంది. కానీ ‘చాదస్తం’ కనిపించదు.

స్వతహాగా రచయిత కావడంతో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వేటూరి సుందరరామమూర్తిని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని సినీ ప్రపంచానికి తెచ్చింది ఆయనేగా. సంగీతం సరేసరి. అన్ని మ్యూజికల్ హిట్సేగా. ఎక్కువగా కె.వి. మహదేవన్‍తో పని చేయించుకొన్నారు. సంస్కృతి పట్ల ఆయన కున్న దృష్టి ‘రావమ్మా మహాలక్ష్మి’ పాటతో ప్రారంభమయి ఉండొచ్చు.

ఆయన లోని మరొక ప్రధానమయిన లక్షణం హాస్య దృష్టి. సంస్కృతికి, సాహిత్య సంగీతాలకు ఆలవాలమయిన ఆయన సినిమాలు సీరియస్‌గా ఉండవు. చాలా హాస్యభరితంగా ఉంటాయి. ‘శంకరాభరణం’లో ‘అల్లు రామలింగయ్య’, ‘నిర్మలమ్మ మరచెంబు’, ‘చంద్రమోహన్ పాట్లు’, ‘కీర్తనలకు కొత్త వరుసలు కట్టబోయే హార్మోనిస్టు’ను మరచిపోగలమా.. ‘సాగర సంగమం’లో ‘కమల్ హాసన్ ఫోటోలు తీసే స్టూడియో పనివాడ్ని’, ‘స్వర్ణకమలం’లో ‘శ్రీలక్ష్మి – సాక్షి రంగారావు’ల పాత్రలను వదిలెయ్యగలమా?

సంస్కృతి సంప్రదాయాలకు కొదవే లేదు.. హరికథలు, గంగిరెద్దులు, జాలరి నృత్యాలను కూడా చూడవచ్చు. పాత్రల చిత్రీకరణ, సన్నివేశాల రూపకల్పనలు సహజంగా ఉంటాయి. మన ఇంట్లోనో ప్రక్క ఇంట్లోనో మెలిగే పాత్రలు జరిగే సంఘటనలు. చేటలో బియ్యం ఏరుతుంటే ఆ దృశ్యం జనాలకు బాగా పట్టేస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు. కొన్ని కొన్ని కనుమరుగవుతున్న దృశ్యాలు ఆకట్టుకొంటాయి.. పల్లెలొదిలేసి పట్టణాలలో బ్రతుకుతున్న వాళ్ళని ఆ మండువా ఇళ్ళు, పెద్ద పెద్ద అరుగులు ఇత్యాదులు గతంలోకి తీసుకువెళతాయి. బాగా కనెక్ట్ అయిపోతారు. ప్రేక్షకుడు పాత్రతో తనను ఐడెంటిఫై చేసుకొన్నాడంటే ఇంక హిట్టేగా. అలా అని హీరోలెవరూ ధీరోదాత్తులుగా సిక్స్ ప్యాక్ లతో కనబడరు. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాలలో అంగవైకల్యం గల పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. గుడ్డి, మూగ, కుంటి, నలుపు, అపరిపక్వత లక్షణాలు ప్రధాన పాత్రల లోనే కనిపిస్తాయి. కాని అంగవైకల్యాన్ని హాస్యం కోసం వాడరు.

ఇంక దుష్ట పాత్రలు.. ‘డెన్’లు ఉండవు. మర్డర్ ప్లాన్లు ఉండవు.. ఇంట్లోనో ప్రక్క ఇంట్లోనో ఓ చెడ్డవాడు ఉంటాడు అంతే. స్వాతిముత్యంలో గొల్లపూడి లాగ. మనిషిలోని అవలక్షణమే విలన్. ‘స్వాతికిరణం’లో ముమ్ముట్టి పాత్ర అలాంటిదే.

ఆయన సౌందర్య దృష్టిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జయప్రదలు, మూన్ మూన్ సేన్‌లు, భానుప్రియలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు వారి సినిమాలలో.

అన్నిటి కన్నా మించి విశ్వనాథ్ ఓ చక్కని నటుడు. కమల్ హాసన్, బాలుల ప్రోద్బలంతో శుభ సంకల్పం సినిమాలో తొలిసారిగా తెర వెనుక నుంచి తెర ముందుకు వచ్చారు. అసలు నటుడికి పాత్రను నటించి చూపించే దర్శకుడు తెర మీదకు వస్తే ఇంకేముంది? అవలీలగా ఎన్నో పాత్రలను పండించారు.

తెర వెనుక నిగర్వి. “నేను దర్శకుడిని. నా బాధ్యతలను నెరవేర్చాను, అంతే. సమాజానికి మేలు చేశానో లేదో తెలియదు కానీ కీడు చెయ్యలేదని చెప్పగలను” అంటారు ఈ పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల గ్రహీత. “నేను సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వను. సినిమాలో హావభావ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చినా బాహుబలి వంటి సినిమా తియ్యను.. తియ్యలేను కూడా” అన్నారొక ఇంటర్వ్యూలో.

ఇక్కడొక విషయం ప్రస్తావించాలి. ప్రస్తుతం ‘పాన్ ఇండియా’ మూవీల కాలం నడుస్తోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి హిందీ నుంచి తమిళం నుంచి ఒక్కో నటుడిని కూడా పెట్టుకొని థియేటర్లని బ్లాక్ చేసి, ఏ థియేటర్‍లో చూసినా ఆ సినిమాయే కనబడేట్లు ప్రణాళిక వేసి పాన్ ఇండియా మూవీ అంటూ తీస్తున్నారే; అసలు సిసలైన పాన్ ఇండియా మూవీ అంటే శంకరాభరణమే.. ఇతర భాషా నటులు కాదు కదా తెలుగులోనే ప్రాచుర్యంలో లేని నటులని ప్రధాన పాత్రలకు ఎంచుకొని  సినిమా తీసి అతి కష్టం మీద థియేటర్లలో విడుదల చేస్తే, ఆ తెలుగు సినిమా ఒక్క వారం తరువాత తెలుగు రాష్ట్రంలో పుంజుకొని ఆ తరువాత ఇతర రాష్ట్రాలలో సయితం సూపర్ హిట్ అవడం ‘పాన్ ఇండియా’ లక్షణం కాదా. కొన్ని రాష్ట్రేతర ప్రాంతాలలో ‘డబ్’ చెయ్యకుండానే ఆడటం విశేషం. కొన్ని చోట్ల తెలుగు పాటలే ఉండి  డైలాగులు మాత్రం డబ్ చెయ్యడం జరిగింది. ఖచ్చితంగా శంకరాభరణం మొదటి పాన్-ఇండియా మూవీ.

సినిమాల వరకూ విశ్వనాథ్ గారు చెప్పుకోకపోయినా, తెలుగు సంస్కృతి సంప్రదాయల వైపు అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేసింది ఆయనే. సినిమా అనేది ఎంతో శక్తివంతమైన మీడియా. ఆ మాధ్యమాన్ని సద్వినియోగం చేసిన తెలుగువారిలో కాశీనాథుని విశ్వనాథ్ గారు అగ్రస్థానంలో నిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here