మాటల ముద్రలు

1
8

[box type=’note’ fontsize=’16’] మాటల ముద్రల్ని తయారు చేసే మౌనం నిరంతర శ్రామికురాలంటున్నారు  శ్రీధర్ చౌడారపు “మాటల ముద్రలు” అనే కవితలో. [/box]

[dropcap]కా[/dropcap]లం అంచుమీద కూచున్న మౌనం
ఆలోచనల కొలిమిలో
భావాల లోహాలను కాలుస్తూ కరిగిస్తూ
అనుభవాల ఉత్ప్రేరకాలను రంగరిస్తూ
మాటల ముద్రల్ని తయారుచేస్తూ ఉంటుంది

ఆనందాల పసిడిభావాలు
మొగ్గలై పూవులై
అందమైన లతలై
సుందరమైన రత్నహారాలై
చెవులకింపైన
చక్కని మాటలై, పాటలై
ముద్దులొలికే సద్దుచేస్తుంటాయి

వేదనాభరితమైన వెతలన్నీ
కాలిపోతున్న అడవులై
కూలిపోతున్న కొండచరియలై
ఎండిపోతున్న ఏరులై, ఎడారులై
విషాదసంగీతాన్ని
నిరంతరంగా గానం చేస్తుంటాయి

వైరభావాన వెల్లువెత్తేవి
భయంకరంగా ఎగిసిపడే అలలై
భగభగమండే అగ్నిజ్వాలలై
కర్కశంగా కత్తులు దూసుకుంటూ
గుండెల్లో లోతుగా గునపాలు దించేస్తూ
ఆవేశరాగాల్ని సాగదీస్తుంటాయి

వెక్కిరింతల చిలిపి పదాలన్నీ
పుల్లని చింతకాయలై
ఉప్పు కలిపిన ఉసిరికాయలై
చక్కిలిగింతలు పెడుతూ
చెక్కిలి చెవ్వుమనేలా నోరూరిస్తూ
ఆహ్లాదపు వ్యంగ్యగానాన్ని
ఆలాపిస్తుంటాయి

మౌనం …
మాటల మాలల్ని అల్లుతోంది
ఏ ఆరాధననో సన్మానించేందుకు
మాటల దారాల్ని పేనుతోంది
ఏ సంబంధాలకో బంధాలు వేసేందుకు
మాటలు బాణాల్ని పదును పెడుతోంది
ఏ గుండెల్లో సూటిగా నాటేందుకు

మాటకు నేపథ్యం మౌనం
మాటల బంగారుపళ్ళేనికి
మన్నికైన చేరుపు గోడ మౌనం
మాటల ముద్రల తయారీలో నిమగ్నమైన
నిరంతర శ్రామికురాలు మౌనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here