మతిమరుపుకు మందు

1
8

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి పులిగడ్డ విశ్వనాథరావు పంపిన హాస్యకథ “మతిమరపుకు మందు“. . [/box]

[dropcap]“ఏ[/dropcap]మండోయ్” అంటూ కమలమ్మగారు భర్త రామశర్మగారిని వంటింటిలోంచి బిగ్గరగా పిలిచింది. ఇది వరకైతే ఆ కేకవిని “ఎందుకు ఆ గావుకేకలు కొంపలంటుకున్నట్లు” అని కోపగించుకునేవారు శర్మగారు.

కాని ఇప్పుడు ఆయన్ను కాస్త దూరం నుంచి పిలవాలంటే గావు కేకలే పెట్టాలి. దగ్గరగా కూచుని మాట్లాడినా మనం కొద్దిగా గొంతు పెంచాలి.

ఎవరైనా ఆయనకు వినికిడి తగ్గిందని అన్నా, వేపకాయంత చెముడు వచ్చిందన్నా ఆయనకు కోపం వచ్చేస్తుంది. మనం కాస్త బిగ్గరగా మాట్లాడినా కూడా “నాకేం చెముడా ఏమిటి? వీధిలంట కూరగాయలమ్మే వాడిలా అరుస్తున్నావు” అంటారు.

అందుకని ‘శర్మగారికేం నిక్షేపంలా వినబడుతుంది. ఐతే మనం ఆయనకు వినబడేలా మాట్లాడాలి’ అంటే సరిపోతుందేమో.

కమలమ్మగారు మాత్రం “గొంతు చించుకు అరిచినా ఆ మహానుభావుడికి వినబడితేగా” అంటుంది దీర్ఘాలు తీస్తూ. యాభై ఏళ్ళయి కాపురం చేస్తున్న పండు దంపతులుగా ఆపాటి చనువు, చెలిమి ఉండడం సహజమేగా!

అన్నట్టు ఈ మధ్య ఆ దంపతులకు మరో చిక్కు వచ్చిపడింది. ఆనయకు మతిమరుపు కూడా దినదినాభివృద్ధి చెందుతోంది.

ఆ గావుకేక అయనకి చెవిన పడినట్టుంది. భార్య వద్దకు వెళ్ళి “ఏమిటోయ్ కొంపలంటుకున్నట్టు పిలిచావు? ఇక్కడకు వచ్చి చూస్తే పొయ్యి కూడా అంటుకున్నట్టులేదు” అన్నారు.

“మీ హాస్యం విని విరగబడి నవ్వడానికి నా వద్ద టైము లేదు. ఇంటిలో బియ్యం ఉంటేగా, పొయ్యి రాజేయడానికి. వెంటనే బజారు కెళ్ళి పది కిలోల బియ్యం, దాంతో బాటు ఒక కిలో ఉప్పు తీసుకురండి” అంది కాస్త బిగ్గరగా.

 “అలాగే తెస్తాలే. అంతలా అరవాలా? నాకు చెముడు వచ్చిందని ఊరంతా అనుకోవాలా ఏమిటి?” అని సంచులు పట్టుకు బయలుదేరారు శర్మగారు.

శర్మగారు రిక్షాలో తెచ్చిన సామాన్లని సంచులు విప్పి చూసింది కమలమ్మగారు. ఓ సంచిలో పది కిలోల ఉప్పు, మరో సంచిలో ఒక కిలో బియ్యం వెక్కిరిస్తూ కనబడ్డాయి.

“ఏవండోయ్! నేను చెప్పిందేమిటి, మీరు తెచ్చిందేమిటి? నేను పది కిలోల బియ్యం, ఒక కిలో ఉప్పు తెమ్మన్నాను.” అని సంచుల మూతులను విప్పి చూపెట్టింది.

శర్మగారికి పొరపాటైందన్న మాట తెలిసివచ్చింది. కానీ ఒప్పేసుకుంటే ఎలా? చులకనైపోడూ? ఇప్పుడు మాత్రం భార్య దృష్టిలో గజారోహణ చేస్తూ ఊరేగుతున్నాడా అని మీరు అనుకోవచ్చు. కానీ శర్మగారు అలా అనుకోడండోయ్.

“నువ్వు చెప్పినట్టే తెచ్చానోయ్” అన్నారు శర్మగారు

“నేను 10 కిలోల ఉప్పు తెమ్మన్నానా? నేనేం కిరాణా కొట్టు నడుపుతున్నాననుకున్నారా?”

“ఆవకాయ పెడతావేమో అనుకున్నాను” అని సర్దబోయాడు.

“ఇది కార్తీకం. ఇప్పుడు మామిడికాయలు కాస్తాయా? ఈ కాలంలో ఆవకాయ పెడతారని ఎలా అనుకున్నారు?”

“ఆవకాయ కాకపోతే మరో ఊరగాయ పెడతావనుకున్నాను?” అని వాదించాడు.

“ఊరగాయ కాదు, టోకులో ఉప్పు అమ్మే వ్యాపారం మొదలెట్టానేమే అనుకోలేదా?”

 ఇంక మరో దారిలేక పోవడంతో “ఔనోయ్, మతిమరుపు వలన సామాన్లు తూకాల్ని తారుమారు చేశాను” అన్నారు శర్మగారు చిరునవ్వుతో.

“సరే రేపు తొమ్మిది కిలోల ఉప్పు ఇచ్చేసి బియ్యం పట్టుకురండి. నాదో సలహా, మీ మతిమరుపు రోజు రోజుకూ ముదురుతోంది. రోజూ పొడంకాయ ఎక్కడో పెట్టి అందరి చేతా వెతికిస్తారు. అలాగే కళ్లజోడు, చెప్పులు గట్రా ఎక్కడో మరిచిపోతారు. దీనికి ఏదైనా మందు తీసుకోకూడదూ?”

“ముసలితనానికి ముందు ఉందా ఏమిటోయ్? అలాగే ఈ మతిమరుపుకీ లేదు.”

శర్మగారు ఒక వేళ మందుల షాపులో మందు అయి ఉంటే పదేళ్ళ కిందటే షాపు యజమాని ఆ మందును చెత్తబుట్టలో దాఖలు పరిచేసి ఉండును. కాలదోషం పట్టిన ఆ మందులాగే శర్మగారు ఎక్స్‌పైరీ డేట్ దాటి ఓ దశాబ్ది అయిందన్న మాట. ఇప్పుడు అయన వయసు ‘రోదనం’ పక్కన ‘శూన్యం’. అనగా ఏడు పక్కన సున్న.

“మీరు మతిమరుపుకు ఏ మందైనా తీసుకొకపోతే శారదక్కకి అయిన అనుభవమే నాకూ అవుతుందని భయం” అంది కమలమ్మగారు.

శారదంటే కమలమ్మగారి పెద్దమ్మ కూతురు.

“ఏమిటా అనుభవం? ఆమె భర్తని కాకరకాయలు తెమ్మంటే కాకరపువ్వొత్తులు తేచ్చాడా ఏమిటి?” అడిగారు శర్మగారు నవ్వుతూ.

“అలా జరిగినా బావుండును. బావగారు ఏం చేశారంటే శారదక్కని స్కూటర్ మీద వెనక్కు కూచోబెట్టుకుని టింగురంగా అని బజారుకు షాపింగ్ కోసం తీసుకు వెళ్ళారు. తిరిగి వస్తుండగా రోడ్డు కంతలో స్కూటర్ పడి గతుక్కుమంది. దాంతో అక్క క్రింద పడిపోయింది. అయన మాత్రం వెనక్కు చూడలేదు. స్కూటర్ దిగకుండా ముందుకు వెళ్ళిపోయారు.”

“అయ్యో పాపం! దెబ్బలు తగల లేదు కదా?” అడిగారు శర్మగారు.

“దెబ్బలు తగలలేదు. లేచి నిలుచుని భర్త మతిమరుపు పై విసుక్కుంటూ రిక్షా ఎక్కి ఇంటికి చేరుకుంది. డోర్ బెల్ మోగిస్తే బావగారే తలుపు తీశారు.”

“అదేమిటి శారదా, చెప్పా చేయకుండా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? ఇంత ఆలస్యం అయిందేమిటని నేను బెంగ పెట్టుకుంటున్నా. ఇతకీ ఎక్కడికి వెళ్ళావు? అని బావగారు అడిగారు.”

దాంతో అక్క అగ్గి మీద గుగ్గిలమయి “నా పిండాకుడు పెట్టుకోవడానికి వెళ్ళాను. అంత మతిమరుపైతే ఎలా నేనెలా బతికేదండీ? అంది.”

“ఏమైందేమిటి?”

“మీతో స్కూటర్ వెనక కూచుని బజారుకి వచ్చాను. తిరిగి వస్తుండగా స్కూటర్ రోడ్డపై గోతిలో పడింది. ఆ కుదుపుకు నేను కింద పడినా మీరు వెనక్కు చూడకుండా ముందుకు దూసుకుపోయారు.”

“ఐతే నువ్వు ఆ కుదుపుకు కింద పడ్డావా? అయమ్ వెరీ సారీ, శారదా! నా మతిమరుపు మండా. నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి కదా. దెబ్బలు తగలలేదు కదా?”

“మీ దయవలన దెబ్బలు తగలలేదు. రిక్షాలో వచ్చా అంది అక్క” అన్నారు కమలమ్మగారు.

శర్మగారు “ నీకా భయం లేదోయ్, కమలా. ఎందుకంటే నేను స్కూటర్ నడపనుగా!” అన్నారు.

“కానీ మీ మతిమరుపు ఏం తక్కువ కాదు. ఆ రోజు బజారులో నన్ను చూసి ‘ఏమమ్మా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది’ అన్నారు గుర్తుందా?”

“ఆ వేళ కళ్లజోడు దొరక్క అది లేకుండానే బజారుకు వెళ్ళా, దూరం నుంచి నిన్ను పోల్చుకోలేకపోయాను”

“దగ్గరగా వచ్చి చూసి అడగవచ్చుగా?”

“దగ్గరగా వచ్చి తేరిపారి చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు కాక మరెవరో ఐతే ఏమవుతుంది, చెప్పుదెబ్బలు, లాఠీబాదుళ్ళు తప్ప?”

“అందుకే ఈ మాయదారి మతిమరుపుకు మందు తీసుకోమని చెప్తున్నా..!”

“సరే, అలాగే చేస్తా, కమలా. నా సహోద్యోగి గురునాధం ఉన్నాడుగా! వాడు ఈ మధ్య రిటైరయాడు. వాళ్ళ కుటుంబంలో అయిర్వేదం వైద్యం వంశపారంపర్యంగా వస్తోంది. వాడు మాత్రం చదువుకుని మా డిపార్టమెంటులో చేరి ఉద్యోగం వెలగబట్టాడు. కాని వాడూ ఆయుర్వేదం బాగా వంట పట్టించుకున్నవాడే”

“ఏదో ఔషదం పుచ్చుకు చూడండి. ఏ పుట్టలో ఏ పాముందో?” అన్నారు కమలమ్మగారు.

మర్నాడు ఉదయం షికారులో గురునాథం కనబడ్డాడు. అప్పుడు శర్మగారు తన మతిమరుపును సోదాహరణంగా ఏకరవు పెట్టి ఔషధం చెప్పమన్నారు.

“అలాగే శర్మగారు. ఆయిర్వేదంలో దానికి దివ్యమైన ఔషధం ఉంది. ఆ ఔషధం సేవించే మా మామ్మ తన మతిమరుపుని నయం చేసుకుందట.”

“అలాగా? మీ మామ్మగారికి కూడా మతిమరుపుండేదా?”

“అంతా ఇంతా కాదు. ఓ సారి ఆమెకు వరసకు తోటికోడలైన చుట్టం చుట్టంచూపుకు వాళ్ళింటికి వచ్చి ఉందట. ఆమెను చిన్నప్పడు ఎప్పుడో చూసిందట మామ్మ. ఉదయం చింపిరి జూట్టు, నలిగిన బట్టలతో బావి దగ్గర పళ్ళు తోముకుంటోందట ఆమె.”

“మామ్మ పరధ్యానంగా ఆమెను పనిమనిషి అనుకుని “ఏంటే, నీ కెంత పొగరు? మా ఇంటికి వచ్చి బావి దగ్గర పళ్ళు తోముకుంటావే?” అని అరిచిందిట.

“దాంతో ఆ చుట్టం ఖంగుతిని ‘నేను నీకు పనిమనిషిలా కనబడుతున్నానటే! నువ్వు లేవు వెలిసిన ముతక చీరా చిరిగిన రవికతో ముష్టిదానిలా’ అంటూ లోనికి పోయి మూటా ముల్లె సర్దుకుని మామ్మ ఎంత క్షమాపణ చెప్పినా, కాళ్ళా వేళ్ళాపడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందట.”

“ఆ ఔషధంతో ఆమె మతిమరుపు నయం అయందా?”

“అయింది శర్మగారు. మీరే చూస్తారుగా ఔషధం తడాఖా. ఐతే సిద్దం చేసిన ఔషధం నా వద్ద లేదు. మీరే తయారు చేసుకోవాలి. మూలికల పేర్లు పరిమాణాలు, చేసే విధానం రాసి రేపు ఇస్తాను.”

 మర్నాడు గురునాధం ఆ జాబితా తెచ్చి శర్మగారికి ఇచ్చాడు.

“ఈ మూలికలు ఎక్కడి దొరకుతాయి, గురునాథం.”

“రాజమహల్ ఎదురుగా వీధిలో కొండ దొరలు రోడ్డు పక్క ఈ మూలికలు పోకలు పోసి అమ్ముతారు. వాళ్ళ వద్ద లేనివి తెప్పించమంటే తెప్పించి ఇస్తారు.” అన్నాడు గురునాథం.

మర్నాడు శర్మగారు తాజమహల్ హోటల్ వద్దకు వెళ్ళి చూడగా ఎదురుగా ఏ వీధీ లేదు. ఆ వరసలోనే కాస్త దూరంలో ఓ వీధి కనబడింది. అక్కడకు వెళ్ళి చూడగా కొండదొరలూ లేరు, మూలికలూ లేవు.

ఒక అంగడి యజమాన్ని అడగ్గా కొండదొరలు మూలికలు అమ్మే వీధి రాజమహల్ సినిమా హాల్ ఎదురుగా ఉందని చెప్పాడు. అప్పుడు శర్మగారికి తను చేసిన పొరబాటు తెలిసి వచ్చిది. గురునాథం చెప్పింది రాజమహల్ సినిమా హాలుకి ఎదురుగా ఉన్న వీధి. తను విన్నది తాజ్ మహల్ హోటలు ఎదురుగానున్న వీధి.

శర్మగారు ఆ వీధికి వెళ్ళి మూలికలు కొన్నారు. ఐతే వాటిలో రెండు మూలికలు ఏ అంగడిలోనూ దొరకలేదు. అప్పుడు ఓ అంగడి యజమానైన కొండదొర ముందుగా డబ్బు తీసుకుని రేపు తెప్పించి ఉంచుతాను, వచ్చి తీసుకో ముసిలోడా అన్నాడు. మర్నాడు వాటిని తీసుకున్నారు శర్మగారు.

మూలికలను ఎండబెట్టి, గురున్నాథం చెప్పిన పాళ్ళల్లో దంచారు. ఆ పొడిని గురునాథం చెప్పిన మోతాదుల్లో పుచ్చుకోవడం ప్రారంభించారు శర్మగారు.

రెండు నెలల తర్వాత తన మతిమరుపు తగ్గినట్టు ఓ నిదర్శనం కనిపించింది. అదేమిటంటే:

ఇది వరకు తను పొడుంకాయ ఇంటిలో ఎక్కడెక్కడో మరిచిపోయేవాడు. బైట గది కిటికిలోనూ, మరుగుదొడ్డిలోనో స్నానాలగదిలోనో, పెరటిలో బావి దగ్గరో మరిచిపోయేవాడు. దాంతో తాను భార్య, కొడుకులు, కోడళ్ళు అంతా వెతికి దాన్ని కనుగొనేవారు.

ఇప్పుడు అలా కాదు. తన గది బైట నడవలో గ్రిల్ కింద గోడ అంచు పైనో లేక నడవలో నున్నఅలమరపైనో మాత్రమే పొడుంకాయ మరుస్తున్నాడు. మరెక్కడా మరవడం లేదంటే ఔషధం గుణం చూపుతున్నట్టేగా!

ఐతే ఉన్న మాటే చెప్పుకోవాలి. ఆ పొడుంకాయ నిత్యం నడవలోనే అవతరించడానికి కారణం కొత్తగా కాపురానికి వచ్చిన ఆఖరి కోడలు. ఇల్లు సర్దే అలవాటూ, ఎక్కడుండవలసిన వస్తువు అక్కడే ఉండాలనే ఆమె తపన. ఆమెకు పొడుంకాయ ఎక్కడ కనబడినా మావగారికి దొరికేలా ఆయన గది బైట నడవలో పెడుతోంది. ఆ విషయం ఇప్పటి వరకు తెలియక శర్మగారు తన మతిమరుపు ఔషదం ప్రభావంతో తగ్గిపోతోందని భ్రమపడుతున్నారు.

ఆ రోజు శర్మగారి చిన్ననాటి స్నేహితుడు శివయ్యగారు వచ్చారు. ఆయన్ను పలకరించి పిచ్చాపాటి మొదలెట్టారు శర్మగారు.

 “ఏమోయ్, శర్మా. నువ్వు మతిమరకుపుకు మూలికల ఔషధం పుచ్చుకుంటున్నావట. అది కాస్తయినా గుణం చూపించా?” అని శివయ్యగారు అడిగారు.

“కాస్తేమిటి శివయ్యా! నా మతిమరుపు పూర్తిగా నయం అయినట్టే” అన్నారు శర్మగారు చేటంతమొహంతో.

“చాలా సంతోషం, శర్మా. నాకు కూడా మతి మరుపు ఈ మధ్య బాగా ముదురుతున్నట్టుంది. మా ఆవిడ నువ్వు తీసుకుంటున్న మందు నన్నూ తీసుకోమంటోంది.”

“మీ ఆవిడ పప్పు తెమ్మంటే ఉప్పు తెచ్చావా ఏమిటి?” అని తన జోకుకి పగలబడి నవ్వారు శర్మగారు.

“అంత కంటే పెద్ద పొరబాటే జరిగింది శర్మా. మా ఆవిడ పొస్టు చేయమని ఇచ్చిన ఉత్తరాన్ని మూడు నాలుగు సార్లు జేబులో పెట్టుకొని మరిచిపోయాను.”

“ఆరోజు మరవకూడదని శపథం పట్టి ఉత్తరాన్ని తీసుకుని వెళుతూండగా మా ఆవిడ ఓ కవరు కూడా ఇచ్చి బజారులో సూర్య ఫోటో స్టూడియోలో ఇవ్వమంది. ఆ స్టూడియో యజమాని సూర్యరావు మాకు దూరపు బంధువే. ఆ కవరులో మా ఆవిడ గురువుగారి నలుపు తెలుపు ఫోటో ఉంది. దాన్ని ఎనలార్జ్ చేయించి, రంగులు వేయించి ఫ్రేమ్ కట్టించి దేవుడి గదిలో పెట్టించాలని ఆవిడ ఉద్దేశం.”

ఆ ఫోటో చాలా అరుదైనది. ఎవరో అడిగితే ఎరువు ఇచ్చారు.

“దాన్ని జాగ్రత్తగా సూర్యానికి అందజేయండి. అన్నట్టు ఉత్తరం పోస్టు చేశారా?”

“ఆ చేశానులే” అని బిగ్గరగా అని మహాభారతంలో ధర్మరాజులా ఆమెకు వినబడకుండా “చేస్తానులే” అన్నా.

“సూర్యా ఫోటో స్టూడియోకి వెళ్ళగా సూర్యం లోపల ఎవరికో ఫోటో తీస్తున్నాడు.”

“సూర్యం, మీ పెద్దమ్మ పంపిన ఫోటో తెచ్చా, తీసుకో అన్నా.”

“అలాగే తీసుకుంటా, పెద్దనాన్నా. కౌంటర్ మీద ఉంచు” అన్నాడు సూర్యం లోపల నుంచి బిగ్గరగా.

ఫోటో కవరుని కౌంటర్ మీద ఉంచి, ఫోస్టు డబ్బాలో మా ఆవిడ ఇచ్చిన ఉత్తరాన్ని పడేసి ఇంటికి వచ్చా.

ఆ మర్నాడు సూర్య అసిస్టెంట్ వచ్చి నేను పోస్టు చేశాననుకున్న కవరు నా కిచ్చి “మీరు నిన్న ఇవ్వవలసిన ఫోటోకి బదులు ఈ ఉత్తరం కౌంటర్ మీద పెట్టి వెళ్ళారట” అన్నాడు.

“ఐతే నీ ఘనకార్యం బైటపడి మీ ఆవిడ చిచ్చుబుడ్డిలా అంటుకుని నిప్పురవ్వలు చిమ్మి ఉంటుంది” అన్నారు శర్మగారు.

“అంతా జరిగింది, శర్మా! మరి ఫోటో ఎలాగో అలాగ తిరిగి రాబట్టుకోవాలి కదా! అక్కడ పోస్టు డబ్బా దగ్గర మూడు గంటలు కాపలా కాసి, పోస్టు డబ్బాపై క్లియరెన్స్ మధ్యంహ్నం రెండు గంటలని ఉంటే తపాల మనిషి నాలుగు గంటలకి సంచితో నింపాదిగా వచ్చాడు.”

“అతడికి నాకు వచ్చిన సమస్యని విశదీకరించి ఫోటో కవరు ఇమ్మన్నా.”

“అలా ఇవ్వడానికి వీలు లేదు, సార్ నాకు ఇచ్చే పవర్ లేదు అన్నాడు.

“ఇంకా నయం మై హాండ్స్ ఆర్ టయిట్ అని అనలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారిలా.”

“చూడు, నాయనా. నేను డబ్బాలో పడేసింది మా ఆవిడ గురువుగారి ఫోటో ఉన్న కవరు.” జేబులోంచి మా ఆవిడచ్చిన ఉత్తరం తీసి చూపించి “అసలు నేను పోస్టు చేయవలసింది ఈ ఉత్తరం బాబూ. దయచేసి ఇది తీసుకుని ఫోటో కవరు ఇచ్చేయ్” అన్నాను.

“మీరిస్తున్న ఉత్తరం కవరు తీసుకుంటా కాని ఆ కవరు మాత్రం ఇవ్వను” అని మొండికేశాడు. అప్పుడు అతడి చేతిలో గాంధీగారి బొమ్మ ఒకటి పెడితే మెత్తబడి ఫోటో కవరు వెతికి ఇచ్చి ఉత్తరం కవరు తీసుకున్నాడు. ఫోటో కవరు సూర్యానికి అందజేసి ఇంటికి వచ్చా.

“మా ఆవిడ నా తలంటి వెంటనే రామశర్మగారిని కలవండి అంది. మొన్న మీ ఆవిడ ఆమెకు గుడి వద్ద కనబడి నువ్వు మతిమరుపుకు ఏదో ప్రత్యేక ఔషధం పుచ్చుకుంచున్నావని చెప్పిందిట. అది తెలుసుకుందామని నీ వద్దకు వచ్చా.”

“ఆ ఔషధానికి అవసరమయ్యే మూలికలు, తయారు చేసే విధానం, సేవించే పద్దతి అన్నీ ఓ కాగితం మీద రాసున్నాయి అవి ఇస్తాను. అన్నట్టు… ఓ పెద్ద పూవుంటుంది.. పెద్ద పెద్ద రేకులుంటాయి. దాని పేరు గుర్తురావడం లేదు. నీళ్ళలో పూస్తుంది.”

“కమలం పువ్వు”

“అద్గదీ..” అని శర్మగారు “కమాలా.. కమలా.. ” అని కేకేశారు.

కమలమ్మగారు రాగానే శర్మగారు “కమలా, నేను మతిమరుపుకు వాడే ఔషధంలో మూలికలు, వివరాలు ఉన్న కాగితం నీకు ఇచ్చాగా. శివయ్య కూడా ఆ ఔషధం పుచ్చుకుంటాడట. అది తీసుకురా ” అన్నారు.

కమలమ్మగారు కాగితం తేవడానికి వెనక్కు తిరిగింది. ఈలోగా శివయ్యగారు, కోపం పట్టలేక “పోవయ్యా శర్మా. నువ్వు పుచ్చుకుంటున్న ఔషధం నీకు ఇది వరకున్న రవంత జ్ఞాపక శక్తిని కూడా హరించినట్టుంది. 50 ఏళ్ళు నీతో కాపురం చేసిన భార్య పేరే గుర్తు లేని నీకు మతిమరుపు తగ్గిందంటే ఎవడు నమ్ముతాడు? నా కొద్దు ఔషధం” అని విసవిసా వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here