మాయ జలతారు – పుస్తక పరిచయం

0
8

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కథకుడు, నవలారచయిత సలీం గారి కొత్త కథాసంపుటి “మాయ జలతారు”. సలీం ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, తొమ్మిది కథాసంపుటాలు, 18 నవలలు వెలువరించారు. ఆయన రచనలు దక్షిణాదిభాషలతో సహా ఇంగ్లీషు, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లోకి అనువాదమయ్యాయి.

ఈ పుస్తకంలో – కళ తప్పుతోంది, సాలభంజికలు, ఒక అబద్ధం, అలజడి, మాయజలతారు, ప్రయాణం, వూబి, లోహముద్ర, మూడో పాదం, బతుకొక పండగ, రెండు రెళ్ళు, అడవి, మాట్లాడే దేవుడు, పోలిక, కొడుకొచ్చాడు, డైనింగ్ టేబుల్ అనే 16 కథలున్నాయి. ‘డైనింగ్ టేబుల్’ కథ సంచికలో ప్రచురితమైనదే.

***

“తుప్పు పట్టింది కళలకు కాదు.. కొంతమంది కళాకారులకు…” అని చెప్పే కథ “కళ తప్పుతోంది”. మనుషుల్ని మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్లా మార్చే వ్యవస్థపై అల్లిన కథ “సాలభంజికలు”. నిజం తెల్సినప్పటి నుండే ఒకరంటే మరొకరికి పడకుండా పోట్లాడుకుంటున్న పిల్లలిద్దరికీ “ఒక అబద్ధం” చెప్పి వాళ్ళలో మార్పు తెస్తాడో తండ్రి. నీతినే నమ్ముకున్న ప్యూన్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా “అలజడి”కి గురువుతాడో అధికారి. జులాయిగా తిరిగిన వ్యక్తి  మౌన బాబాగా  మారిని క్రమాన్ని వివరిస్తుంది “మాయ జలతారు”.

సాధారణ బోగీలో ప్రయాణించేవారి కష్టాలు ఎలా ఉంటాయో ఓ కాబోయే రైల్వే అధికారిని స్వయంగా అనుభవించేలా చేసి, తనకి అవకాశం వచ్చినప్పుడు, తాను నిర్ణయాలు తీసుకుని అమలుచేయగలిగే స్థితికి వచ్చినప్పుడు ఈ బీదల పాట్లని గుర్తు చేసుకుని, వారికి ప్రయాణం కాస్తయినా సౌకర్యంగా ఉండేట్లు చేయాలని కోరుకుంటాడో తండ్రి “ప్రయాణం” కథలో.

విద్యని, వైద్యాన్ని తనలోకి గుంజుకున్న కార్పొరేట్ ఊబి ఇప్పుడు సమాధుల్ని కూడా తనలోకి లాక్కుంటోది అంటాడో తండ్రి “వూబి” కథలో. పావురాల కువకువలతో ఒకప్పుడు సందడిగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు గోరీల దిబ్బలా మారిన వైనాన్ని “లోహముద్ర” కథ చెబుతుంది. జీవితాన్ని ఉత్సవంలా జరుపుకోమంటుంది “బతుకొక పండగ” కథ. “రెండు రెళ్ళు” ఎంతో తెలిసేసరికి అనుమానాలు తీరిపోతాయో మిత్రుడికి. అపార్థాలను తొలగించే “అడవి”, దేవతల “పోలిక”లతోనే వుండడం మంచిదని చెప్పే కథ, “మాట్లాడే దేవుడి” కోసం ఓ వ్యక్తి అన్వేషణ ఆసక్తిగా చదివిస్తాయి. లియో లాంటి పుత్రుడుండడం ఎంత అదృష్టమో “కొడుకొచ్చాడు” కథ చెబుతుంది. కుటుంబ విలువలని చాటుతూ, బంధాలని మింగేస్తున్న ఆధునికతని హృద్యంగా చిత్రించిన కథ “డైనింగ్ టేబుల్”.

***

మాయ జలతారు (కథలు)
రచన: సలీం;
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్
పేజీలు: 163.
వెల: ₹150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, రచయిత
సలీం, ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మీనారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29.ఫోన్‌-75886 30243

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here