మేడ మీది దెయ్యం

    0
    8

    [box type=’note’ fontsize=’16’] మన భయమే దెయ్యం అనీ, గుండెలో ఉన్న భయం అనే దెయ్యాన్ని వదిలించుకోమని చెప్పే శంకర ప్రసాద్  కథ “మేడ మీది దెయ్యం“.[/box]

    [dropcap]అ[/dropcap]ది ఓ వేసవి సాయంకాలం. కరెంట్ పోయింది. అంతా చీకటి. బయట గాలి వీస్తున్నా, ఇంట్లో ఉక్కపోత. కొవ్వొత్తి వెలిగించి ఆ గుడ్డి దీపం వెలుగులో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాను. నా వెనకే, నా నీడ, తరుగుతూ పెరుగుతూ కదలాడుతోంది. నా నీడని చూస్తే నాకే భయం వేస్తోంది.

    అసలే ఊరి బయట ఇల్లు. చుట్టు పక్కలా ఎవరూ లేరు. ఈ చీకట్లో దొంగోడొస్తే… గీ పిచ్చి ఆలోచన వచ్చింది. దొంగొస్తే ఫరవాలేదు, డబ్బులిచ్చి పంపేయొచ్చు… దెయ్యమొస్తే… నాకు ముచ్చెమటలు పట్టాయి. దెయ్యాన్ని మేనేజ్ చెయ్యటం కష్టం. దొంగైతే, కాళ్ళూచేతులు పట్టుకుని బతిమిలాడొచ్చు. ఈ దెయ్యముంది చూసారు… పట్టుకోడానికి దానికి కాళ్ళే ఉండవు… మరి దాని కాళ్ళు ఎలా పట్టుకోవాలి… పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర వేడెక్కింది.

    జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్ వెలిగించి, గుండెల నిండుగా, గట్టిగా దమ్ము పీల్చాను. కొంచెం బుర్ర స్థిమితపడింది. దెయ్యం వస్తే రానీ… ఎన్ని దెయ్యం సినిమాలు చూడలేదూ… దాని సంగతి తేల్చేస్తా… అనుకున్నా…

    ఇంతలో మేడ మీద గదిలో ఏదో చప్పుడు… మళ్ళీ నా గుండె గుభేల్ అంది. కొంపదీసి దొంగా… దెయ్యమా… ఇప్పుడేం చెయ్యాలి… ఆలోచించలేక పోతున్నాను… మెదడు మొద్దుబారిపోయింది. పైన గదిలో చప్పుళ్ళు ఎక్కువయ్యాయి.

    ఎవరికైనా ఫోన్ చేస్తే… ఛ… ఛ… పిరికోడనుకుంటారు. అహం అడ్డొచ్చింది. ఇంతలో బయట గాలి జోరు పెరిగింది. పెద్ద గాలివానగా మారింది. దీపం ఆరిపోయింది… నా గుండె జారి పోయింది. వానజల్లు ఇంట్లోకి కొడుతోంది. వీధి తలుపులు మూసెయ్యటానికి ధైర్యం సరిపోలేదు. పైన ఉన్న దొంగ/దెయ్యం కిందికొస్తే… అమ్మో వద్దు… బయట వర్షం కురుస్తోంది… లోపల నా వంటి మీద చెమట వర్షం కురుస్తోంది.

    ఉరుములు, మెరుపులు, పిడుగులు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మేడ మీది గదిలో చప్పుళ్ళు, వీటి మధ్య, అప్పుడప్పుడూ అలవోకగా వినిపిస్తున్నాయి. ఈ రాత్రెలా గడుస్తుంది దేవుడా అనుకుని, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం చదవడం మొదలుపెట్టాను. అవి నాకు కంఠస్తమే…

    వర్షం జోరు ఇంకా పెరిగింది. గదిలో అటూ ఇటూ తిరగలేక, నిల్చోడానికి ఓపికలేక, వసారాలో ఉన్న వాలుకుర్చీలో కూలబడ్డా… ఎప్పుడు కంటిరెప్పలు మూతబద్దాయో తెలీదు… ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి, త్రుళ్ళిపడి, కళ్ళు తెరిచి చూస్తే… ఎదురుగా రామచంద్ర ఉన్నాడు…

    అప్పటికే తెల్లారిపోయింది. రామచంద్ర నా చిన్ననాటి స్నేహితుడు. వాడు నన్ను అదోరకంగా చూస్తూ…

    “ఏట్రా పెసాదూ… మోహం పీక్కుపోయింది?” అన్నాడు.

    “ఏమీ లేదు, రాత్రి సరిగా నిద్రపట్టలేదు” నా సమాధానం.

    నా గుండె పీక్కుపోయిన సంగతి వాడికేం తెలుసు… “పద లోపలికెళ్దాం” అని రామచంద్రని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాను.

    గాలీ వాన ప్రభావం వలన ఇల్లంతా గందరగోళంగా ఉంది. సడెన్‍గా నాకు మేడ మీది గది గుర్తొచ్చింది. మెల్లగా ధైర్యం కూడగట్టుకుని “ఒరే రామచంద్రా! రాత్రి మేడ మీద గదిలోకి దొంగో, దెయ్యమో వచ్చార్రా… ఒకటే చప్పుళ్ళు” అన్నాను.

    రామచంద్ర పెద్దగా ఓ నవ్వు నవ్వి, “ఓహో అందుకా సరిగ్గా నిద్ర పట్టలేదన్నావ్, సరే పద, మేడ మీద గదిలో కెళ్దాం” అన్నాడు. నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆంజనేయుడిని తలచుకుంటే రామచంద్రుడొచ్చాడు… వీడుండగా భయమెందుకూ… అయినా ఆ దొంగో దెయ్యమో… ఈ పాటికి వెళ్ళిపోయుంటారు అనుకుంటూ, వాడి వెనకే మేడ మీదకి ఎక్కాను.

    మేడమీద గది తలుపులు మూసి ఉన్నాయి. రామచంద్ర నెమ్మదిగా తలుపులు తోశాడు. కిర్రుకిర్రుమని చప్పుడుతో అవి తెరుచుకున్నాయి. గదిలో ఎవరూ లేరు. రామచంద్ర నా వైపు తిరిగి, “ఎవరూ లేరు కదారా?” అన్నాడు. నేను బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసాను. ఇంతలో రామచంద్రకి ‘అది’ కనిపించింది.

    “అదిగో అదే”… అన్నాడు రామచంద్ర.

    కొంచెం తటపటాయించి, ధైర్యం కూడగట్టుకొని, అటువైపు చూశాను… ‘ఖాళీ డబ్బా’…

    “డబ్బారా అది, రాత్రి గాలీ వానకీ అటూ ఇటూ దొర్లుంటుంది. నువ్వేమో దొంగ, దెయ్యం అని తెగ భయపడిపోయావ్… మన భయమే దెయ్యం రా… దెయ్యం అనేది లేదు. అంతా రజ్జుసర్పభ్రాంతి… చీకటిలో తాడును చూసి పాము అనుకున్నట్లు, మన నీడని చూసి మనమే భయపడినట్లు, నువ్వూ భయపడ్డావ్… నీ గుండెలో ఉన్న ఆ భయం అనే దెయ్యాన్ని వదిలించుకో” అని చెప్పి రామచంద్ర కిందకి దిగిపోయాడు.

    నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘ఛీ… డబ్బా… దీనికి ఇంత భయపడ్డానా…’ అని ఉక్రోషంతో డబ్బాని గట్టిగా ఓ తన్ను తన్నాను…

    వెంటనే గది తలుపులు ధనాల్న మూసుకున్నాయి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here