కాజాల్లాంటి బాజాలు-97: మీ పిల్లలు ఏమవుతారో ఆలోచించేరా!

1
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]సి[/dropcap]నిమాలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకుంటూ ఒకరినొకరు ఘోరంగా హింసించుకుంటున్నారు. ఎర్రని రక్తం చివ్వున చిమ్ముతూ ఆ దృశ్యమంతా భయంకరంగా ఉంది.

“చిన్నపిల్లాడివి. నువ్వు ఇలాంటివి చూడకూడదు..” అని నా పక్కనే కూర్చున్న మా పక్కింటి అబ్బాయి ఆరేళ్ళ పవన్‌తో అంటూ చానల్ మార్చడానికి వాడి చేతిలో రిమోట్ తీసుకోబోయేను. ఆ సినిమాలో లీనమైపోయి చూస్తున్నవాడు వాడికి పక్కనే అందుబాటులో ఉన్న బాల్ పాయింట్ పెన్నుతో నా పొట్టలో ఒక్కపోటు పొడిచాడు.

ఒక్కసారి గిలగిల్లాడిపోయేను. వాడి వైపు చూసేను. నాకేసి చూడకుండా టివీ వైపే ఏకాగ్రతగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఇలా పొడిచేనన్న స్పృహే ఏమీ కనిపించకపోగా సినిమాలో వాళ్ళింకా ఎలా పొడుచుకుంటున్నారో మరింత జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆశ్చర్యమేసింది. ఇంత చిన్న పిల్లాడు ఎందుకిలా చేసేడు. ఇందులో తప్పెవరిది. సినిమా చూడడం తప్పు కాదే! కానీ ఆ సినిమాలో చూపించే దృశ్యమే అలా ఉంది. అలాంటివి చూసిన ఆరేళ్ళ పిల్లవాడు అంతకన్న ఏం చేస్తాడూ!

ఈమధ్య వచ్చే సినిమాలలో హింస, పగలు, ప్రతీకారాలు ఎక్కువగా ఉంటున్నాయని చాలామంది అభిప్రాయం.

నిజమే.. సినిమాలు వచ్చే కొత్తల్లో ఎక్కువగా పౌరాణికాలు వచ్చేవి. ఆ తర్వాత స్వాతంత్రోద్యమం నేపథ్యంగా దేశాన్నంతటినీ ఏకం కమ్మని చెప్పే సినిమా లొచ్చేవి. ఆ తర్వాత ఆదర్శవంతమయిన నాయకుణ్ణి చూపిస్తూ కుటుంబ కథలు వచ్చేవి.

కొన్ని కుటుంబ కథలు ఉమ్మడి కుటుంబాల గొప్పదనం గురించి చెపితే మరికొన్ని చిన్నకుటుంబాలు ఎంత ఆదర్శవంతమో చెప్పేవి. ఆ తర్వాత ఎన్నో సినిమాలు త్యాగాలతో నిండిపోయుండేవి. ఇద్దరు ప్రియురాళ్ళూ ఒకరికోసం మరొకరు త్యాగాలు చేసేసుకోవడం కానీ లేకపోతే ప్రియురాలు సుఖంగా ఉంటుందనే ఆశతో హీరో త్యాగాలు చేసెయ్యడం కానీ వచ్చేవి.

ఆ తర్వాత సినిమాల ధోరణి కొత్తపుంతలు తొక్కింది. సమాజంలో జరిగే అవకతవకలు చూపించడం మొదలెట్టి, దానిని సరిచేసే మనిషిగా హీరోని చూపించడం మొదలైంది. ఈ ప్రక్రియలో హీరో అడ్దదారిలో కూడా వెళ్ళేవాడు. అలాంటప్పుడు ఆ హీరోకి విలన్ లక్షణాలు వచ్చేసేవి. కొన్నాళ్లకి దుష్ట సంహారం కోసం దుష్టమార్గం అనుసరించేవాడు హీరో అయిపోయేడు. అంటే ఎదుటివాడిని కొట్టి చంపైనా సరే తన పని చేసుకుపోయేవాడు హీరో అయిపోయేడు.

అలా వాడు హీరో అవడమే కాకుండా అలాంటి సినిమాలే తీసి జనాల మీదకి వదలడం మొదలెట్టేరు. జనాలకి సెలవులకీ, పండగలకీ సినిమాలు చూసే అలవాటుండడం వల్ల ఆ హింసనీ, పగనీ, ప్రతీకారాన్నీ చూస్తూ వినోదించేస్తున్నారు.

కానీ రేపటిపౌరులనదగ్గవారు ఇలాంటి పగలూ, ప్రతీకారాలూ జీర్ణించేసుకుంటే ఎలా! ఏమి చేస్తే వాళ్ళని ఈ ప్రభావం నుంచి బయటపడేయొచ్చూ! భావి తరాన్ని నేనెలా కాపాడుకోవాలి!

ఆలోచిస్తుంటే ఆపద్బాంధవురాలు వదిన గుర్తొచ్చింది. వెంటనే వదినకి ఫోన్ చేసి నా ఆవేదన వెళ్ళగక్కేసేను. దీన్నించి పిల్లల దృష్టి మార్పించడానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగేను.

వదిన ఒక్కసారి గట్టిగా నవ్వేసింది.

“గొంగళిలో భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టుంది నీ ప్రశ్న. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి! ఇదివరకు ఇంట్లోకి ఏదైనా తెస్తే నలుగురు పిల్లలుండడం వల్ల ఇంట్లో అందరూ పంచుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఒక్కళ్ళూ ఇద్దరే పిల్లలవడంతో, అందులోనూ వాళ్ళు అడిగినవే కాకుండా తల్లితండ్రులు వాళ్లకున్న డబ్బును చూపించుకుందుకు అఖ్ఖర్లేనివి కూడా బాగా కొనిపెడుతుండడంతో పిల్లల మనస్సుల్లో వాళ్లకి కావల్సింది ఏదైనా తెచ్చేసుకోవచ్చు అనే భావన బలపడిపోయింది. అలాంటప్పుడు వాళ్లకి కావల్సినది దొరకకపోతే ఎదుటివాడిని కొట్టైనా సరే తెచ్చేసుకోడంలో హీరోయిజం ఉందని ఇప్పటి సినిమాలు చెపుతున్నాయి. ఏం చేస్తాం.. కాలంతో పాటు మారాల్సిందే..” అంది వదిన.

ఈసారి వదిన మాటలు నాకెందుకో నచ్చలేదు. అదే అన్నాను వదినతో..

“నీ పిల్లల్లో నేనిలాంటివి చూడలేదు. వాళ్లలో ఆ భావం కలగకుండా నువ్వేం చేస్తున్నావో చెప్పు అని అడుగుతుంటే ఆ సంగతి చెప్పక అలా నీళ్ళు నములుతావేం..” అని గట్టిగా అన్నాను.

“మనం పిల్లల్ని అంటున్నాం కానీ నిజానికి మనమే మారాలి. మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు.”

అంటూ తనేం చేసిందో చెప్పింది వదిన.

వాళ్ళింట్లో టీవీకి డిష్ కానీ, కేబుల్ కానీ ఏదీ పెట్టించలేదుట. దూరదర్శన్‌లో వచ్చే ప్రోగ్రాములు తప్పితే ఇంకేమీ రావుట. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో తెలుస్తుందని కంప్యూటర్ టేబుల్ కూడా పిల్లల రూమ్‌లో కాకుండా హాల్లోనే పెట్టించిందిట. వాళ్ళమ్మాయికీ, అబ్బాయికీ ఆన్‌లైన్‌లో సంగీతం, డ్రాయింగ్ నేర్పిస్తోందిట.

ఈ కరోనా మహమ్మారి వచ్చేక అందరూ ఇంట్లోనే ఉండే పరిస్థితులు వచ్చేసరికి చాలా రకాలైన ఇండోర్ గేమ్స్ తెప్పించిందిట. ఆన్‌లైన్‌లో పిల్లలకోసం చైల్డ్ సైకాలజిస్టులు పెట్టే పజిల్స్‌లో పాల్గొనేలా చేసిందిట. ఒక్కోరోజు ఒక్కొక్కటిగా పిల్లలిద్దరూ ఇవన్నీ చేస్తుంటేనే సమయమయిపోయేసరికి ఇంక వాళ్లకి సినిమాల మీదకి దృష్టి పోవటం లేదుట.

ఈమధ్యే వాళ్ళమ్మాయి ఆన్‌లైన్‌లో పాడిన పాటకి బహుమతి కూడా వచ్చిందని చెప్పింది.

ఇవన్నీ విన్నాక నాకు వదినకి పాదాభివందనం చేసెయ్యాలనిపించింది.

ఎలాగైనా మా పక్కింటావిడతో చెప్పి ఇవన్నీ చేయించేసి ఈ పిల్లాడి మనసులో పగలూ, ప్రతీకారాలూ కాకుండా స్నేహభావం పెరిగేలా చెయ్యాలనిపించింది. అలాగే చిన్నపిల్లల తల్లితండ్రులని ఒకచోట చేర్చాలి. వాళ్లకి అర్థమయేలా వాళ్ళేం చెయ్యాలో వివరించాలి. అందుకేం చెయ్యాలీ! ముందు మా పక్కింటావిడని మార్చాలి.. మార్చగలనా! ఏమో ప్రయత్నమంటూ చెయ్యాల్సిందే ననిపించింది.

ఏదేమైనా సరే నా తర్వాతి తరం స్నేహ సౌభ్రాతృత్వాలతో పెరగాలి. అందుకు ఎంత కష్టమైనా పడాలి తప్పదు అనుకుంటూ మా పక్కింటికి బయల్దేరేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here