[box type=’note’ fontsize=’16’] సైమన్ కోలింగ్స్ వ్రాసిన Do you speak English? అనే ఆంగ్ల కథ “మీకు ఇంగ్లీష్ వచ్చా?” పేరిట అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు మోహిత కౌండిన్య. [/box]
[dropcap]మా[/dropcap]న్యుయెల్ రోడ్డు మీద నడుస్తూ ఆ చేపను దాటిపోయాడు. అది దాదాపు ఇరవై అంగుళాల పొడవుంది. దాని వెండి పొలుసులు మురికంటి కళ తప్పాయి. మొప్పలు తలకి రెండు వైపులా లోతుగా గీసిన గాయాల్లా తెరుచుకుంటున్నాయి. మురిక్కాలువలో అది నిస్సహాయంగా కొట్టుకుంటోంది టప టపా. పక్కనే ఒక పిల్లాడు అడ్డుగోడకి ఆనుకొని కింద నీటిలోకి చూస్తున్నాడు. గోడకున్న గొట్టంలోంచి ముక్కు పుటాలదిరిపోయే దుర్వాసనతో నదిలోకి ధారగా పడుతోంది మకిలి రంగు నీరు. నీటి ఉపరితలంపై తేలుతున్న చెత్తలోకి గేలం దించాడు వాడు. రంగు వెలిసిపోయిన పొట్టి లాగు వేసుకున్నాడు. తొమ్మిది పదేళ్ళుంటాయేమో. కాళ్ళకి చెప్పుల్లేవు. మురికి ముఖం. ఒళ్ళంతా దోమకాట్ల పొక్కులు.
చేప ఎగశ్వాసతో గిలగిల లాడిపోతూ నదిలోకి దూకాలని ఎగిరింది. ఆ దెబ్బతో కాలిబాట మీదకొచ్చి పడింది దబ్ మంటూ. ప్రయాసతో చేసిన ప్రయత్నంవల్ల శోష వచ్చి కదలకుండా పడుంది. పిల్లాడు దాన్నితిరిగి మురిక్కాలవలోకి నెట్టాడు కాలితో.
మాన్యుయెల్ పరధ్యానంతో అసలా చేప గురించి పట్టించుకోలేదు. ఇప్పుడే ఒక అపార్టుమెంటు చూసి వస్తున్నాడు. దాని అద్దె ఎలా కట్టాలా అని సతమతమవుతున్నాడు. నగరంలో వసతి దొరకటమే గగనం. ఇంత మంచి ఇల్లు అరుదుగా దొరుకుతుంది. ప్రస్తుతం తానూ తన భార్యా ఉంటున్న అపార్టుమెంటు ఎంత చిన్నదంటే ఆరేళ్ళ కొడుకుని వారమంతా వాడి అమ్మమ్మ దగ్గరే ఉంచాల్సి వస్తోంది. మంచి ఇంటికోసం రెండేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. నడక ఆపి అడ్డుగోడకి ఆనుకొని సిగరెట్ వెలిగించాడు. తనకు కొద్ది దూరంలో చేపలు పడుతున్న పిల్లాడి వైపు చూడసాగాడు.
అది పడవల్లో సరుకులు దించుకోవడానికి రాళ్లతో కట్టిన రేవు. అటునుంచి రెండు ఆకారాలు ఇటే వస్తున్నాయి నెమ్మదిగా. పర్యాటకుల్లా ఉన్నారు. ‘అమెరికన్లు అయ్యుంటారు’ అనుకున్నాడు మాన్యుయెల్. ముప్ఫయి ఐదు లోపే ఉంటుంది వారి వయసు. భుజాల వరకు ఎర్రటిజుట్టు, పాలిపోయిన ఎర్ర మచ్చలున్నచర్మంతో స్త్రీ సన్నగా ఉన్నా పుష్టిగా ఉంది క్రీడాకారిణిలా. ఆమెతో బాటున్న పురుషుడు పొడుగ్గా, వదులుగా వేలాడుతున్న చర్మంతో ఉన్నాడు. టీ షర్ట్ లోంచి గుండ్రంగా ముందుకు తోసుకొచ్చిన పొట్ట స్పష్టంగా కనబడుతోంది. మోకాళ్ళదాకా వచ్చే షార్ట్స్ వేసుకున్నాడు. కళ్ళకి చలవ అద్దాలు. జుట్టుని పోనీటైల్ లో బిగించాడు. గిడ్డంగులుండే ఆ దుమ్ము కొట్టుకుపోయిన రోడ్డు మీద వాళ్ళు నిదానంగా నడుస్తున్నారు.
విదేశీ పర్యాటకులు ఆ ఊళ్ళో మామూలే. కాని 18వ శతాబ్దపు రోకోకో చర్చిలు ఉండే పాతరేవు దగ్గరా, వైభవోపేతంగా కనబడే పన్ను కార్యాలయం దగ్గరా, పగడపు దీవుల వెంట జలవిహారం చేయడంలోనూ ఆసక్తి చూపిస్తారు తప్ప నిర్మానుష్యమైన ఈ ప్రాంతానికి ఎవరూ రారు. మాన్యుయెల్ వారు దారి తప్పారనుకున్నాడు.
పిల్లాడు తన్నిన చోటే పడి ఉంది చేప తుదిశ్వాసతో. “పాపం! పీఛీముండా” అందా స్త్రీ చేప పక్కనే ఆగి. ముక్కుతో సాగదీసి మాట్లాడింది. పిల్లాడు వాడు వెనక్కి తిరిగి చూడలేదు కాని వారి ఉనికిని గుర్తించాడు. ఆవలి గట్టున చాకలిబండలకు తాకి తళతళా మెరుస్తున్న నీటి ఉపరితలాన్ని తదేకంగా చూస్తూ వాళ్ళు వెళ్ళిపోతే బాగుండనుకున్నాడు.
“దీన్ని మళ్ళీ నీళ్ళలో పడెయ్యాలి…” అంటోంది ఆమె. “….వీడికి కావాలంటావా?” అనడిగింది తన సహచరుణ్ణి. అతడు భుజాలెగరేశాడు. ధైర్యవిహీనుడనిపించాడు మాన్యుయెల్ కి.
“ఈ పరిసరాలు అంత సురక్షితమైనవిగా అనిపించటంలేదు. మనం వెనక్కి వెళ్ళిపోదాం పద” అన్నాడు. కాని ఆమె ఉపేక్షించేలా లేదు. చేపని, పిల్లాణ్ణి మార్చిమార్చి చూస్తోంది.
“పోనీ వాణ్ణే అడుగు” అన్నాడు అతను.
స్త్రీ ఆ చేప చుట్టూ నడిచి పిల్లాడి దగ్గరకెళ్ళింది. వాడింకా నది ఆవలివైపుకే చూస్తూ ఉన్నాడు. ఆమె దగ్గరకొచ్చే కొద్దీ వాడు బిగుసుకుపోయాడు.
“ఆ చేప చచ్చిపోతోంది తెలుసా” అని ఆమె ఆవేశంగా అడగటం మాన్యుయెల్ చెవిన పడింది. పిల్లాడు బిక్కముఖంతో తల అడ్డంగా ఊపాడు.
“చ-చ్-చ్-ఇ-ప్-ఓ-త్-ఓ-న్-ద్-ఇ” ఆమె ఒక్కో అక్షరమే జాగ్రత్తగా విడమర్చి పలికింది ఇంగ్లీషులో. వాడు మౌనంగానే ఉండిపోయాడు, అర్థం కాక. వెర్రిమొర్రిగా కాళ్ళు కదిలిస్తూ నుంచున్నాడు. ఆమె తన సహచరుడివంక తిరిగి “వీడికి మనం చెప్పేది అర్థం కావటం లేదేమో” అంది. అతను భుజాలెగరేశాడు, ‘కలగజేసుకోవద్దని చెప్పానా’ అన్నట్టు. ఆమె చుట్టుపక్కల సహాయం కోసం వెతుకుతూ తమనే చూస్తున్న మాన్యుయెల్ ని గమనించింది. కోరా రంగు లినెన్(నార) సూటూ బూటూ ధరించిన అతన్ని అంచనా వేయలేకపోయింది.
“మీకు ఇంగ్లిష్ వచ్చా” అని అడిగింది ఇంగ్లీషులో. పిల్లాణ్ణి అడిగిన తీరుకంటె మర్యాదపూర్వకంగా ఉంది ఆమె స్వరం. మాన్యుయెల్ “వచ్చు” అన్నాడు కాని ఆ చెప్పిన తీరుని బట్టి సహాయం చేస్తాడని ఏ మాత్రం అనిపించలేదు. అతన్తో చూపు కలిపింది కొన్ని క్షణాలు.
“ఈ పిల్లాడు ఆ చేపని ఏం చేస్తాడో అడుగుతారా కొంచెం? ఇలా బయట పడేయడం చాల దారుణమైన పని! దాన్ని నదిలో పడేయాలి”
మాన్యుయెల్ తాపీగా తల తిప్పి పిల్లాడి వంక, తిరిగి ఆమెవంక చూశాడు. ఈమెకి వాడి జీవితం ఎలాంటిదో తెలియజెప్పాలా వద్దా? నగరానికి దూరంగా తీరంవెంబడి అసహ్యకరమైన మురికివాడల్లో చిన్న గాలికే లేచిపోయే కప్పులున్న గుడిసెల్లోంచి వాడు వచ్చాడని చెప్పాలా? నోట్లోకి నాలుగు వేళ్ళు పోవడానికి వాడి తల్లిదండ్రులు ఎంత కష్టపడేదీ చెప్పాలా? రెండు రోజుల క్రితమే దినపత్రికలో చదివాడు – ఒక మత్స్యకారుల బస్తీ మొత్తం ఖాళీ చేయించేశారు అక్కడ కట్టబోయే హోటల్ కోసం.
పిల్లాడు వాళ్ళిద్దరినే ఆత్రంగా చూస్తున్నాడు. మాన్యుయెల్ పోర్చుగీసు భాషలో వాణ్ణి సౌమ్యంగా అడిగాడు “సెనోరా ఈ చేపని నువ్వేం చేస్తావో అడుగుతోంది”. అతని స్వరంలో ‘నీ పరిస్థితి నాకు తెలుసు’ అనే జాలి ఉంది.
వాడు తన మురికిచేతిని ఒక కంటిమీద రుద్దుకుంటూ ఇంకో కంటితో మాన్యుయెల్ ని చూస్తూ జవాబిచ్చాడు పోర్చుగీసులో “దాన్ని అమ్ముతాను”
మాన్యుయెల్ ఆమె వంక తిరిగి “అమ్ముతాడట” అని స్థిరంగా చెప్పాడు. ఆ జవాబును అతను ‘ఇదే వాడి తుది నిర్ణయం, ఇందులో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు’ అనేలా ధ్వనింపజేశాడు. తనకు ప్రోత్సాహం లభించదని అర్థమై సందిగ్ధావస్థలో పడిందామె. అది గమనించాడు మాన్యుయెల్. ఆమె కళ్ళు అతను ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలన్నట్టు నిశితంగా చూస్తున్నాయి.
ఆమె సహచరుడు చిరాగ్గా కదిలాడు. “హనీ! మనం వెళ్ళాలి, పద”
ఆమె అతన్ని పట్టించుకోలేదు. అతను గాభరాగా చెప్పాడు “నువ్వీ విషయంలో ఇక కలగజేసుకోకూడదని నాకనిపిస్తోంది”
ఆమె తొణక్కుండా మాన్యుయెల్ ని అడిగింది “వాడికి చేపకి ఎంత కావాలట ?”
మాన్యుయెల్ ఆమె సహచరుడి వంగిపోయిన భుజాల వంక, పొట్టవంకా, నిరుపయోగకరమైన కండల వంక చూశాడు. ఆమె పట్టుదల అతనికి వినోదంగా ఉంది.
“సెనోరా చేపను కొంటుందిట. ఎంత అని అడుగుతోంది”
పిల్లాడు అక్కడ మార్కెట్లో అమ్మితే వచ్చే ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ చెప్పాడు. వాడి ముఖం భావరహితంగా ఉంది. బిగించిన కుడి పిడికిలిని గమనిస్తే తప్ప వాడు పడుతున్న ఆందోళన ఎవరికీ తెలియదు.
మాన్యుయెల్ మొదట మాట్లాడిన స్వరంతోటే ఆమెకు వాడిజవాబు చెప్పాడు కాని ఈసారి నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆమె ఆ నవ్వుని స్నేహపూర్వక చర్యగా అనుకుంది. తన పర్సు తీసి వాడు చెప్పినదానికంటే రెట్టింపు విలువున్న నోటుని బయటకితీసింది.
“వాడిదగ్గర చిల్లరుందా?”
మాన్యుయెల్ అనువదించాడు. మళ్ళీ పిల్లాడి కుడిచేయి స్వల్పంగా కంపించింది కాని ముఖంలో అంతకు ముందున్నఅమాయకత్వమే! తల అడ్డంగా ఊపాడు. ఆమె సందేహించింది ఓ క్షణం. చేపవంక చూసి ఇక ఆలస్యం చేయకుండా నోటు ఉన్న చేతిని చాచింది. వాడు కిమ్మనకుండా తీసుకున్నాడు. ఆమె వంగి తన చూపుడువేలు, బొటనవేలుతో చేపను జాగ్రత్తగా ఎత్తి నదిలో పారేసింది.
సహచరుడు ఆమెకు రుమాలు ఇవ్వబోయాడు వేళ్ళు తుడుచుకోవటానికి. ఆమె నిరాకరించింది. ఇద్దరూ వాదులాడుకొన్నారు. ఒక్కసారి కూడ వెనుదిరిగి మాన్యుయెల్ ని గాని పిల్లాణ్ణి గాని చూడకుండా అతన్తో కలిసి ఆమె ముందుకి సాగిపోయింది.
పిల్లాడు నోటు పట్టుకొని కదలక మెదలక నుంచున్నాడు. వాడి ముఖకవళికల్లో మార్పేమీ లేదు. మాన్యుయెల్ ఆ జంట కనుమరుగయ్యే వరకు చూస్తూండిపోయాడు. తర్వాత ఇంకో సిగరెట్ వెలిగించి అడ్డుగోడకి ఆనుకొని తన పూర్వస్థానంలోకి వెళ్ళిపోయాడు.
సుదీర్ఘంగా నీటిబయట ఉన్న చేప తేరుకోలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చే అలలు తిరిగి లోపలికి వెళ్ళేప్పుడు ఈడ్చుకెళ్ళిన చెత్తతో పాటు పైకి తేలింది. పిల్లాడు ఆడ్డుగోడ మీద నుంచి నీటి లోపల ఉన్న గట్టు మీదకు దూకాడు. ఓ కర్రతో చచ్చిన చేపని తనవైపుకి లాగాడు. చేతికందే దూరంలోకి వచ్చాక దొరకబుచ్చుకొని రోడ్డుమీదకి విసిరేశాడు. అడ్డుగోడమీదకి ఎగబాకుతూ మాన్యుయెల్ ని చూసి పళ్ళన్నీకనిపించేట్టు నవ్వాడు. తన సరంజామా సర్దుకొని చేపను ఒక చేత్తో పట్టుకొని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మాన్యుయెల్ సిగరెట్ పూర్తిగా కాలిపోయే వరకు వాణ్ణి చూసి పీక మురిక్కాలవలో పడేసి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు.
ఆంగ్ల మూలం: సైమన్ కోలింగ్స్
అనువాదం: మోహిత కౌండిన్య