మేనల్లుడు-12

0
15

[ఆరోజు తనకి కాస్త బావుందని, ఆస్తుల వివరాలు వివేక్‍కి చెప్పాలని ఉందని అంటాడు నారాయణరావు. సుమిత్ర, శారద వారిస్తారు. రమణ కూడా తొందరపడవద్దని అంటాడు. తమ సమస్యకి పరిష్కారం లేదని అమ్ము వివేక్‍తో అంటే, పాజిటివ్‍గా ఆలోచిద్దామని అంటాడు వివేక్. మావయ్య కోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధం అనుకుంటాడు వివేక్. అర్ధరాత్రి దివ్య ఫోన్ చేస్తే కంగారుపడతాడు వివేక్. తమకి అక్కడ పగలు కదా అని దివ్య అనేసరికి సర్దుకుంటాడు. తాను వివేక్‍ని ప్రేమిస్తున్నట్లు అతనికి చెప్తుంది దివ్య. మర్నాడు మావయ్యని వీల్ ఛైర్‍లో గార్డెన్ తిప్పడానికి తీసుకువెళ్తాడు వివేక్. తొందరగా అమృతకి వివేక్‍కి పెళ్ళి చేయాలని అంటాడు నారాయణరావు. ముందు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అంటాడు వివేక్. పైగా తాను వారం రోజులు మాత్రమే సెలవు పెట్టాననీ, పూర్తి చేయాల్సిన రీసెర్చ్ పనులున్నాయని అంటాడు. అమృత కూడా వివేక్‍ని సమర్థిస్తుంది. నారాయణరావు మిత్రుడు ధనంజయరావు వస్తాడు. తన కూతురు, అల్లుడు సమస్య గురించి చెప్పి, – మేనల్లుడినే అల్లుడిగా ఎంచుకున్న నారాయణరావుని మెచ్చుకుంటాడు. ఏమనాలో తెలియక వివేక్, అమృత ఒకరి ముఖాలులొకరు చూసుకుంటారు. – ఇక చదవండి.]

[dropcap]గ[/dropcap]దిలో ఒంటరిగా కూర్చోని ఆలోచనల్లో పడ్డాడు వివేక్..

జరుగుతున్నది ఏమిటో? పర్యవసానం ఎలా ఉంటుందో తలచుకోవడానికి కూడ వివేక్ మనసు అంగీకరించడం లేదు.

కళ్లల్లో అమృత, దివ్య కనబడ్డారు..

తన మెడలో పసుపు తాడు పడుతుంది ఏమో అన్న భయంతో, తనని భర్త దృష్టిలో చూడడం తన వల్ల కాదని మానసికంగా కృంగిపోతుంది అమృత..

మూడేళ్ల స్నేహ బంధం ప్రేమ బంధంగా మారి పవిత్ర బంధంగా మారాలని.. తన మెడలో పసుపు తాడు తను కట్టాలని ఆశతో ఎదురు చూస్తుంది దివ్య..

‘అమ్మూ!.. నేను.. నిన్ను భార్య దృష్టిలో చూడలేను.. పరిస్థితుల దృష్ట్యా  నిన్ను నేను పెళ్లి చేసుకున్నా, భర్తగా కాదు.. మావయ్యగా కూడా నిన్ను ఓదార్చలేను.. ఎప్పటిలా నీకు చిన్న బాధ కలిగినా, ఏం జరిగినా మామూ, వీ.వి అంటూ నా దగ్గరకు వస్తే క్షణాల్లో నిన్ను నవ్వించే వాడిని.. నీ బాధని పోగొట్టే వాడిని.. కాని ఇప్పుడు ఏమీ చేయలేని అసమర్థుడిని.. ఎందుకంటే నీ బాధకు కారణం నేనే కాబట్టి.’ అనుకున్నాడు.

ఇంతలో అక్కడికి అమృత వచ్చింది.

“ఏం చేస్తున్నావు? వీ.వి?..”

“చూసావుగా పరిస్థితులు ఇంకా.. ఇంకా.. మన పెళ్లి జరగడానికి ఎంత సహాయ పడుతున్నాయో? ఊబిలో నుండి బయటకు రావడం ఎంత కష్టమో? బ్రతికి బట్ట కట్టడం ఎంత నిజమో, మన పెళ్లి ఆగడం కూడ అంతే నిజం!”

“ప్చ్! జరగనీ మామూ!.. వివాహం బంధం లేకపోతే మనషులు బ్రతకలేరా?.. మనం ఇన్నాళ్లు.. ఇద్దరం.. ఎంత ప్రేమ, అనురాగాలతో.. అభిమానం, ఆప్యాయతలతో ఉన్నాం.. అలానే ఉందాం?.. భార్యాభర్తల బంధం లేకపోతే బ్రతకలేమా? “ అంది..

“పరిస్థితులు చెయ్యి దాటినప్పుడు మనకు తెలియకుండానే పరిష్కారం దొరుకుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మూ! ఈ మామూ!.. ఎప్పటికీ.. నీకు బాధ కలిగించే పని మాత్రం చేయడు.. నీకు ఎలా కావాలంటే అలా చేయవచ్చు” అని వివేక్ అనగానే గభాలున వెళ్లి.. వివేక్ గుండె మీద వాలిపోయి.. “నువ్వెంత మంచివాడివి!..” అంది..

మాటలు రాని వాడిలా తల మీద చెయ్యి వేసి నిమరసాగాడు వివేక్!..

అటుగా వెళుతున్న శారద, సుమిత్ర గదిలో నుండి మాటలు విని గభాలున తల తిప్పారు..

వివేక్‍ని, అమృతని అలా చూసి.. సుమిత్ర చిన్నగా నవ్వి “శారదా!.. మీ అన్నయ్య ఆరోగ్యం అలా అయినందుకు అమృత ఖచ్చితంగా మంచం పట్టేది.. దానికి వాళ్ల నాన్న అంటే ప్రాణం! హాస్పటల్‍లో ఉండగా వీళ్లకి నిశ్చితార్థం అని మీ అన్నయ్య అంటున్నారు ఏమిటని ముందు బాధపడ్డాను.. నిశ్చితార్ధం చేయడం వలనే ఈ రోజు తన బాధని వివేక్ బాబుతో పంచుకుంటుంది” అంది.

“అవును వదినా!.. అన్నయ్య నిశ్చితార్థం చేయడం మంచిదయింది.. అమృత గురించి మనం బెంగపడవలసిన పని లేదు.. అంతా వివేక్ చూసుకుంటాడు” అంది శారద..

ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరు సంతోషంగానే ఉన్నారు.. ఒక ప్రక్క ఇంటి యజమానికి ఆరోగ్యం బాగోలేదని బాధ, బెంగ ఉన్నా మరో ప్రక్క కూతురు పెళ్ళి బంగారం లాంటి మేనల్లుడితో జరుగుతుందన్న ఆలోచనతో సంతోషంగా ఉన్న నారాయణరావుని చూసి అందరి మనసులు కాస్త తేలికపడి, పెళ్లి ఎలా చేయాలి? షాపింగ్ రాజమండ్రిలో చేయాలా? విజయవాడ, హైదరాబాద్‍లో చేయాలా? పది రోజులు జరిగే పెళ్లి కాబట్టి ఒకొక్క రోజు ఏ వంటలు చేయాలి?.. ఏ స్వీట్లు చేయాలి?.. ఇలా ఎన్నో కబుర్లు ఇంట్లో వాళ్లందరూ మాట్లాడుకోవడం చూసి ఏం చేయాలో తెలియక, బలవంతంగా ముఖాల మీదకి నవ్వు తెచ్చుకునేవారు అమృత, వివేక్..

USA వెళ్లడానికి బట్టలు సర్దుకోసాగాడు వివేక్!

“మామూ!.. వెళ్ళిపోతున్నావా?.. కలలో కూడా నా ఇంట్లో నేను ఇంత బాధను మనసులో మోస్తూ పరాయిదానిలా ఉంటాననుకోలేదు.. కాలం ఎంత తొందరగా పరిస్థితులను మారుస్తుంది?.. ప్చ్!.. నువ్వు అంత బాధను మనసులో పెట్టుకొని.. ఎలా ఉండగలుగుతున్నావు?..” అంది అమృత.

“ప్చ్!.. అమ్మూ!.. నీకో విషయం తెలుసా?.. కొంతమంది మనషులు జీవితంలో అన్నీ పోగొట్టుకొని.. చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిపోతారు.. Depression లోకి వెళ్ళిపోతారు.. కొంత మంది ప్రాణాలు పొగొట్టుకుటారు, ప్రాణాలు తీసుకుంటారు.

కాని ఇక్కడ, నీకు, నాకు ఎంతో ఇష్టమైన మావయ్య.. కోసం.. మనసుని రాయి చేసుకోకపోతే ఎలా?..” అన్నాడు.

గభాలున వచ్చి వివేక్ గుండె మీద వాలిపోయి, బలంగా రెండు చేతులతో వివేక్‍ని గట్టిగా పట్టుకొని “వీవి నీ మనసెంత! గొప్పది?..

నాన్న ఏమైనా అయిపోతే.. నేను ఎలా బ్రతకగలను?.. నాన్న ప్రేమ ఇంకెక్కడ దొరకదనుకున్నాను. కాని నాన్న ప్రేమను మరిపించే.. ప్రేమ నీ దగ్గర దొరుకుతుంది.. నువ్వన్నట్లు మనిద్దరికీ ఎంతో ఇష్టం అయిన నాన్న కోసం.. మనం పెళ్ళి చేసుకుందాం.. కాని ఒక్క షరతు.. ఇక మీదట నాన్న స్థానంలోకి నువ్వు వస్తావు.. కదూ?.. కాదు.. కాదు.. రావాలి!” అంది.

“ష్యూర్ అమ్మూ!..” అన్నాడు వివేక్.

సుమిత్ర, శారద ఇద్దరూ కలిసి వివేక్ గదిలోకి రాబోయి, వాళ్ళిద్దరిని చూసి, ముసి ముసి నవ్వులతో నెమ్మదిగా రిటన్ అయి, నారాయణరావు దగ్గరకు వెళ్ళారు.

“ఏమండీ!.. నేను ఒకటి అడుగుతున్నాను.. కాదు, కూడదు అని అనకూడదు.. మీరనరని నాకు తెలుసు కాని” అని సుమిత్ర అన్నంతలో

“ఏమిటి వదినా!.. అన్నయ్య కోరుకుంటుంది వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా ఉండాలని.. కూతురు సుఖ సంతోషాలతో కన్నీరంటే ఏమిటో తెలియకుండా, బాధ అన్నది అమృత దరిదాపులకి రాకుండా ఉండాలని మొన్నటిదాక బయట సంబంధాలు చూద్దాం శారదా అన్నవాడు.. వివేక్‍తో పెళ్ళి జరిపించాలని నిశ్చయానికి వచ్చాడు అన్నయ్య, ఎందుకో తెలుసా? అక్కడా, ఇక్కడా బయట సంబంధాలు చేసుకుంటున్న వాళ్లు.. డివోర్సులు.. కాపురం చేస్తున్నా కలహాలు.. ఇవన్నీ చూసి.. అన్నయ్య బాగా ఆలోచించాడు..” అంది శారద.

“కరెక్టుగా చెప్పావమ్మా.. నేను వాళ్ళిద్దరికి పెళ్ళి చేయాలనుకోవడానికి బలమైన కారణమే ఉంది. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఇష్టం.. అన్నీ.. అన్నీ.. ఉన్నాయి.. వివేక్ అమెరికా వెళ్ళేటప్పుడు అమృత ఎంత ఏడ్చింది.. బెంగతో మంచం పట్టింది.. తరువాత ప్రొద్దున్న మంచం మీద నుండి దిగకుండానే వివేక్‍కి వీడియో కాల్ చేసి కబుర్లు చెప్పినాకే కాఫీ తాగేది.. నా మేనల్లుడు మాత్రం.. ప్రతీ రోజు కబుర్లు చెప్పి గుడ్ నైట్ చెప్పేవాడు.. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇన్నాళ్ళు వాళ్ళు స్నేహితుల్లా పెరిగారు. ఆ స్నేహంలోంచి ప్రేమ పుట్టింది.. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఇంకా నేను పిచ్చివాడిలా బయట సంబంధాలు చూడడం ఏమిటి?.. ఈ స్థితిలో నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు.. నా చివరి కోరిక ఒకటే.. నా బంగారు తల్లిని నాకన్నా ఎక్కువగా ప్రేమించే, మంచిగా చూసుకునే అల్లుడు కావాలి.. నా మేనల్లుడే అల్లుడు అయితే.. నా చివరి కోరిక తీరిపోతుంది.. జీవితంలో ఇంకేం కోరను” అని అన్నాడు నారాయణరావు.

అప్పటికే సుమిత్ర కళ్ళ నిండా నీళ్ళతో ఉండడం చూసి కంగారుగా అంది శారద.

“వదినా!.. అన్నయ్య అలా అంటే నువ్వు ఇలా బాధపడితే ఎలా? ఈ మధ్యన BP ఎక్కువ ఉంటుంది.. జాగ్రత్తగా ఉండాలంటున్నారు.. డాక్టర్లు ఏం చెప్పారు? నీకు తెలుసు కదా?.. అన్నయ్య మందులు వాడితే.. ప్రమాదం ఉండదు..” అంది శారద.

అప్పటికే గుమ్మం దగ్గరకు వచ్చిన.. వివేక్, అమృత వాళ్ళ మాటలు విని షాకయ్యారు..

‘తామిద్దరికి ఒకరంటే ప్రేమ, అభిమానం, ఉందని మావయ్య అనుకోవడం, ఆ ప్రేమ ఒక్క వివాహా బంధంతోనే ముడిపడి ఉంటుందనుకోవడం దురదృష్టం!’ అనుకున్నాడు వివేక్.

‘నాన్నా! నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ‘మామూ’ తప్ప ఇంకెవరు లేరు. నా ప్రతీ అడుగు వెనుక ‘మామూ’ ఉన్నాడు. నిజం చెప్పాలంటే అమ్మా, మీరు నా బాధ్యత  ‘మామూ’ మీద వదిలేసారు.. స్కూలుకి వెళ్ళిన దగ్గర నుండి.. నన్ను.. నా చెయ్యి పట్టుకొని క్లాసు రూమ్ లోకి తీసుకువెళ్ళి సీటులో కూర్చోబెట్టడం దగ్గర నుండి.. లంచ్ తినిపించడం వరకు, నా తలలో రిబ్బనులు ఊడిపోతే కట్టేవరకు శ్రద్ధ తీసుకున్న మాముని ఇష్టపడకుండా ఎలా ఉంటాను.. ప్రేమించకుండా ఎలా ఉంటాను?’

‘కాని ఆ ప్రేమను.. వివాహబంధంగా ఎలా అనుకోగలను?.. కాని మీ కోసం.. మీ చివరి కోరిక కోసం మాముని పెళ్ళి చేసుకుంటాను?..’ అనుకుంది అమృత.

గభాలున ప్రక్కకు చూసి.. కళ్ళ నిండా నీళ్ళతో ఉన్న అమృత కళ్ళు తుడిచి, అభిమానంగా భుజం చుట్టూ చేతులు వేసి.. నారాయణరావు దగ్గరకు నడిచాడు వివేక్.

వాళ్ళద్దరిని అలా చూసి.. నారాయణరావు ముఖం సంతోషంతో నిండిపోయింది..

“వివేక్ బాబూ!.. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.. అమృతని చూస్తుంటే నాకు భయం వేస్తుంది.. నన్ను ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది.. మా మాట.. వినదు.. నా మాట విని నీతో అమృతని కూడా తీసుకు వెళ్ళు.. నీ దగ్గర అయితేనే నా కూతురు క్షేమంగా ఉంటుంది.. ఇక్కడ ఏం తినకుండా, ఏడ్చుకుంటూ ఉండి, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. వివేక్ బాబూ! నీతో పాటు నా బంగారు తల్లిని తీసుకు వెళ్ళు.. నువ్వు ఎప్పుడు వచ్చేది ఖచ్ఛితంగా చెప్పలేనంటున్నావ్? నేను ఇలా ఉన్నాను.. ఇక వాళ్ల అమ్మా మాట, శారద మాట వింటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా తరువాత నీ మాటే వినేది..” అని వివేక్‍తో అంటూ, “వెళ్ళమ్మా బట్టలు సర్దుకో!..” అని అమృతతో అని..

“ఇక్కడ నన్ను చూసుకోవడానికి అమ్మా, శారద ఉన్నారు.. అక్కడ నువ్వు బాగుంటే.. నేను ఇక్కడ బాగుంటాను.. నువ్వింకేం మాటాడొద్దు.. వెళ్ళు తల్లి!..” అన్నాడు నారాయణరావు.

అయోమయంగా వివేక్ వైపు చూసింది అమృత.

“ఏమండీ!.. ఈ మాట చెప్పడానికి వచ్చాను.. మీరు ఎక్కడ అంగీకరించరేమో అని నేనొకటి అడుగుతాను, కాదు, కూడదు అని అన్నాను. కాని మీకు నాలాంటి ఆలోచన.. అమృతని.. వివేక్ బాబుతో పంపాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..” అని, “ఇంకా నిలబడతావు ఏమిటి తల్లి? వెళ్ళి బట్టలు సర్దుకో” అంది సుమిత్ర..

“అవును అమృత.. అన్నయ్య తన గురించి కన్నా ఎక్కువ నీ గురించి ఆలోచిస్తాడు.. నువ్వు అక్కడ వివేక్‍తో ఉంటే, వాడే నిన్ను చూసుకుంటాడు..” అంది శారద..

“అవును అమ్మూ! వాళ్ళు చెబుతుంది కరక్టే! నేను వెళ్ళినా, నువ్వు ఎలా ఉన్నావో, మావయ్య ఎలా ఉన్నాడో అన్న టెన్షన్‍తో ఉంటాను.. నువ్వు నాతో వచ్చేస్తే, మావయ్యని నా కొలీగ్స్‌ని వచ్చి చూస్తుండమని, మావయ్య  health గురించి ఎప్పటికప్పుడు update ఇవ్వమని చెప్తాను. పద!” అని అభిమానంగా భుజం మీద చెయ్యి వేసి అడుగులు వేసాడు వివేక్ బాబు.

వాళ్ళిద్దరు వెళ్ళడం చూసి అందరూ సంతోషంగా నవ్వుకున్నారు.

రూమ్ లోకి వచ్చిన అమృత.. “ఏంటి వీ.వి! మా నాన్నగారు ఏదో అన్నారనుకో.. నువ్వు కూడ సరే అన్నావు.. మనిద్దరి మధ్యా ఉన్న రిలేషన్‍ని చూసి పెళ్ళి నిశ్చయం చేసారు. ఎంగేజ్‍మెంట్ కూడ చేసారు.. ఇంకా ఇలా నీతో వచ్చేయడం చూసి అందరూ ఏమనుకుంటారో?” ఇంకా అమృత మాట పూర్తి కానే లేదు.. కాస్త అసహనంగా అన్నాడు వివేక్..

“అందరూ ఏవేవో అనుకుంటారు.. అనుకోని! మనం వెళ్ళి ఆపగలమా?.. వీళ్ళు ఇంకా.. అని ఏదో అనబోయావు.. ఇంకా, అనుకోవడానికి ఏముంది?.. చక్కగా ఇద్దరూ ఒక చోట ఉన్నారు.. మనం ఇక్కడ పెళ్ళి పనులు మొదలు పెడదాం అని ముచ్చట్లు పెట్టుకుంటారు.. నువ్వు ఇక్కడ ఉంటే ఆ ముచ్చట్లు వింటూ ఏడుస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటావు.. వాళ్ళకి దూరంగా ఉంటే.. వాళ్ళ మాటలు వినబడక.. కొన్నాళ్ళు టెన్షన్ లేకుండా ఉంటావు.. జరగబోయే పరిణామం గురించి కొద్ది రోజులు మరిచిపోదాం.. నా మాట విను.. అన్నీ ఆలోచించే మావయ్య నిన్ను తీసుకు వెళ్ళమనగానే అంగీకరించాను.. నువ్వు బాగుండాలనే అమ్మూ” అన్నాడు.

మాటాడకుండా గభాలున వివేక్ గుండె మీద వాలిపోయింది అమృత.

***

అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యారు అమృత, వివేక్..

ఇద్దరిని దగ్గరకు పిలిచి.. “వివేక్ బాబూ!..” అని అనగానే గబగబా దగ్గరకు వెళ్ళాడు వివేక్..

గభాలున వివేక్ చెయ్యి పట్టుకొని “రా తల్లీ” అని కూతురు వైపు చూసాడు నారాయణారావు.

“నాన్నగారూ!..” అని గభాలున దగ్గరకు వెళ్ళింది. అమృత కళ్ళనిండా నీళ్ళు చూసి.. “అమ్మా!.. నీ కళ్ళల్లో నీరు ఈ రోజుతో ఉండకూడదు.. నువ్విక్కడ ఉంటే ఇలానే ఉంటావు. అందుకనే నిన్ను వివేక్ బాబుతో పంపిస్తున్నాను.. ఇక నుండి అన్నీ నీకు వివేక్ బాబే! .. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు.. నిజం చెప్పాలంటే ఈ నాన్నని మరిచిపోతావు” అని నారాయణరావు అంటుడగానే..

“నాన్నా!.. ఎందుకలా అనుకుంటున్నారు?.. మిమ్మలను నేను బ్రతికి ఉన్నంత వరకు మరిచిపోను. అయినా ఎందుకలా అంటున్నారు.. మీకేం కాదు” అంది అమృత.

చిన్నగా నవ్వారాయన.. “నాకు బ్రతకాలనే ఉందమ్మా!.. నీ పిల్లలను ఆడిస్తూ ‘తాతయ్యా’ అని పిలిపించుకోవాలని ఉంది.. కాని అనుకున్నవన్నీ జరగవు కదా?”

“కాని నీ పెళ్ళి చూడాలన్న నా చివరి కోరిక మాత్రం నెరవేరుతుంది.. వివేక్ బాబు లాంటి మనిషి అల్లుడు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇంతకన్నా నేను ఇంకా కోరికలు కోరడం సమంజసం కాదు..” అన్నాడు నారాయణరావు.

 ఏం మాట్లాడాలో తెలియని దానిలా వివేక్ వైపు చూసింది అమృత..

“ఎందుకండి పాపం అమృతని బెదరగొడతారు.. అది అసలే బెంగతో వెళుతుంది” అంది సుమిత్ర.

“అవునన్నయ్య!.. నువ్వు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటేనే అక్కడ అమృత ఉండగలదు.. ఇప్పుడు ఎన్నో రకాల మందులు వచ్చాయి.. పెద్ద డాక్టర్లు చూసి మందులు వ్రాసారు.. నీకేం కాదు” అంది శారద.

“అవునమ్మా.. ఈ రోజు నుండి చాలా సంతోషంగా ఉంటాను.. నాకు కాన్సర్ వచ్చిందన్న విషయాన్నే మరిచిపోతాను. అయినా త్వరలో నా చిన్నారి తల్లి పెళ్ళి. తొందరగా కోలుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను” అన్నాడు నారాయణరావు..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here