మేనల్లుడు-23

0
10

[తన మనసులోని బాధను దాచుకుంటున్న అమృతని చూసి జాలిపడి, సారీ అమృతా అని అనుకుంటాడు సునీల్. అమృత ఇండియా వెళ్ళిపోయాకా, అంతా నిశ్శబ్దమై పోయిందని భావిస్తాడు వివేక్. దివ్య తనని ఎంత అభిమానించిందో గుర్తు చేసుకుంటాడు. తామిద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యు అని చెప్పుకోకపోయినా తమ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తలచుకుంటాడు. కారులో బయటకి వెళ్తూ దారిలో కూడా దివ్య గురించే ఆలోచిస్తాడు. మావయ్య తన చివరి కోరిక అనడం వల్ల అమ్మూతో పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చిందని – ఇదంతా దివ్యకి చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని, కానీ దివ్య ఎక్కడికి వెళ్ళిందో, ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదో అని అనుకుంటాడు. క్యాంపస్‍కి వెళ్ళి తమ స్నేహితులంతా కూర్చుండే స్థలంలో కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి రాధిక వస్తుంది. ముందు దివ్యకి సారీ చెప్పమని అడుగుతుంది. దివ్య విషయంలో వివేక్ పెద్ద తప్పు చేశాడని అంటుంది. ఇంకా ఏవేవో అంటున్న ఆమెని ఆపి, తన పరిస్థితిని వివరిస్తాడు వివేక్. అర్థం చేసుకున్న రాధిక, తాను దివ్యతో మాట్లాడితే జరిగినది చెప్తాననీ, వీలైతే వివేక్‌ని కూడా దివ్యతో మాట్లాడమని చెప్తుంది. హఠాత్తుగా అమృత అమెరికా నుండి ఎందుకు వచ్చేసిందో సుమిత్రకి, శారదకి అర్థం కాదు. ఏవేవో ఊహించవద్దని వాళ్ళతో అంటుంది అమృత. అమ్మూని టిఫిన్ తినమని అంటారు. ఇంతలో వాళ్ళకి సునీల్ గుర్తొస్తాడు. అతని గదిలోకి టిఫిన్ పంపించమంటావా అని అడుగుతుండగానే, సునీల్ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి తిని నారాయణరావుని చూడడానికి వెళ్తాడు. సునీల్‌కి ఈ పరిస్థితి తన వల్లే అని బాధపడుతుంది అమృత. కారులో బయటకి తీసుకువెళ్తూ, అతను తన గురించి ఏమనుకుంటున్నాడో తనకి తెలుసని సునీల్‍తో అంటుంది అమ్మూ. – ఇక చదవండి.]

[dropcap]“మీ[/dropcap]రే కాదు.. ఎవరైనా.. ఈ అమ్మాయికి ఇంత కోపం ఏమిటి?.. తల్లితో ఇలానే మాట్లాడేదనుకుంటారు. ఏం చేయమంటారు?.. నాన్న కాన్సర్‌తో బాధపడుతూ.. బాధలో.. ఈ లోకం విడిచి వెళ్ళిపోతానన్న భయంతో తన కూతురు జీవితం తను ఉన్నా, లేకపోయినా బాగుండాలని.. మామూతో నాకు, ఈ పెళ్ళి అంటే ఇష్టం ఉందో లేదో, కనీసం మా అభిప్రాయాలు తెలుసుకోకుండా.. తను చనిపోయే ముందు నా పెళ్ళి చూడాలనుకున్నారు.. నాన్న అలా భయపడడంలో కొంచెం అయినా అర్థం ఉంది.. కాని.. అమ్మకి, అత్తయ్యకి ఏమయింది?.. మా ఇద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోనక్కర లేదా?.. ‘మామూ’ కళ్ళెదుట పుట్టాను.. ఇద్దరం  కలిసి పెరిగాం. స్కూల్‌కి కారు ఎక్కనని పేచీ పెడుతుంటే.. బలవంతంగా మాము ఒళ్ళో కూర్చోబెట్టేవారు.. స్కూలు వచ్చే వరకు.. ‘మామూ’ ఎన్నో కథలు చెప్పేవాడు..  అన్ని చేపలు ఎండి ఒక్క చేప ఎందుకు ఎండలేదు?  అని ‘మామూ’ని యక్ష ప్రశ్నలు వేసేదానిని.. ప్చ్!.. మా ఇద్దరి మధ్య ఉన్నది అన్ని బంధాల కన్నా.. గొప్ప బంధం.. స్నేహ బంధం!.. రక్త సంబంధాల కన్నా.. ప్చ్.. ఎన్నో బంధాలకన్నా ‘మామూ’కి నాకు మధ్య ఉన్న బంధం గొప్పది.. కాని వీళ్ళందరూ.. అస్సలు మా ఇద్దరిని అర్థం చేసుకోవడం లేదు.. ఏవేవో ఊహించుకొని పొంగిపోతున్నారు. పాపం ‘మామూ’ నరకం అనుభవిస్తున్నాడు.”

“ఒక ప్రక్క నాన్న పరిస్థితి చూస్తే.. మేము ఇద్దరం నోరు మెదపలేకపోతున్నాం.. మరో ప్రక్క.. ఇలాంటి బాధ.. ఇప్పటి వరకు ఎవరు ఫేస్ చేసి ఉండరు.. సారీ సునీల్ గారూ. నా గుండెలో ఉన్న బాధంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో” అని వెక్కి వెక్క ఏడ్వసాగింది.

కంగారుగా చూసి కారు సైడ్‌కి తీసుకువెళ్ళి కారు ఆపి అమృత వైపు చూసాడు.

రెండు చేతుల మధ్య మొఖం పెట్టి అలా వెక్కిళ్ళు పడుతుండడంతో గుండె పైకి, కిందకి కాసాగింది.

కంగారుగా “ఏమండీ!.. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్” అని తన చెయ్యి అమృత భుజం మీద వేసి ఓదార్చసాగాడు సునీల్..

గభాలున ఆ చెయ్యి గట్టిగా పట్టుకుంది అమృత.

కంగారుగా అమృత పట్టుకున్న తన చేతి వైపు చూసాడు.. అమృత చేతిలో తన చెయ్యి ఉండడం చూసి ఏం చేయాలో తెలియని వాడిలా మౌనం వహించాడు సునీల్..

అమృత బ్యాగ్‌లో సెల్ రింగ్ కావడంతో కంగారుగా తన చేతిలో నున్న సునీల్ చెయ్యి వదిలేసి.. తప్పు చేసిన దానిలా సునీల్ వైపు చూడకుండానే.. “సారీ అండీ” అని, బ్యాగ్ లోని ఫోన్ తీసి.. “అమ్మ” అని; “చెప్పమ్మా” అంది అమృత. పొరపాటున చేయి తగిలి వాయిస్ పైకి రాసాగింది.

“పులస చేప దొరికిందమ్మా.. ఆల్‌రెడీ చికెన్ ఫ్రై, రొయ్యలు ఫ్రై, వజ్రం చేప ఫ్రై, చేసేసాం.. అందుకని పులస చేప ఫ్రై చేయకుండా ఇగురు, పులుసు చేస్తే సరిపోతుందా?.. ఫ్రై కూడా చేయించమంటావా? Doubt వచ్చి అడిగానమ్మా” అంది సుమిత్ర.

“అమ్మా!.. ఏంటమ్మా నీ డౌట్..”

“USA నుండి వచ్చింది డాక్టరుగారు.. అలా ఇలా వండితే సరిపోదు కదా? అన్నట్లు కోడి కూరలో నంచుకోని తినడానికి గారెలు చేసాం.. పాయసం చేసాం.. అన్నట్లు పెరుగున్నంలో నంచుకోడానికి రోటి పచ్చడి చేసాం.. ఇవి సరిపోతాయా అమృతా?” అని సుమిత్ర అంటుడగానే..

కంగారుగా అన్నాడు సునీల్.. “ఇన్ని items.. నేను తినడానికా? మైగాడ్!..” అని..

సునీల్ కంగారు చూసి, సునీల్‌ని ఏడిపించాలన్నట్లు “చెప్పండి డాక్టరుగారు.. ఇంకేమైనా items చేయించమంటరా డాక్టరుగారు” అంది నవ్వుతూ అమృత..

పొలమారి.. కంగారుగా.. “ఇంకానా.. ఇలా అయితే.. అసలు నేను ఇంటికే రానండి.. ప్రొద్దున్న అలాగే డబుల్ టిఫిన్ తిన్నాను.. ఇంకా.. అది..” అని మెడ చూపెట్టి “ఇక్కడే ఉంది” అన్నాడు సునీల్..

“ఏంటమ్మా డాక్టరుగారు అలా అంటున్నారు. చాలా మొహమాటస్థులులా ఉన్నారు.. డాక్టరుగారు దేవుడిలా మనింటికి వచ్చారు.. నాన్న పరిస్థితి చూసి వివేక్ బాబుని రమ్మని ఫోను చేద్దాం అనుకున్నాం. పాపం వివేక్ బాబు రావడం ఎంత కష్టం అయ్యేది? సరేనమ్మా.. నాన్న కొంచెం తేరుకునే వరకు డాక్టరుగారు ఉంటే బాగుటుంది. నువ్వు ఎలాగైనా డాక్టరుగారు ఉండేటట్లు ఒప్పించాలి..” అంది సుమిత్ర.

గభాలున సునీల్ వైపు చూసింది.

బిక్కచచ్చిపోయినట్లు మొఖం ఉండడం చూసి నవ్వుతూ “భోజనం చేయడానికి భయపడుతున్నారా?.. లేక ఇంట్లో కొద్ది రోజులు ఉండడానికా?” అంది అమృత.

“అదీ.. అదీ..” ఏం మాట్లాడాలో తెలియని వాడిలా.. కుడి చేత్తో తల గోక్కోవడం చూసి..

“డాక్టరుగారూ!.. ప్చ్!.. మిమ్మల్ని.. ఇంక ఇబ్బంది పెట్టను లెండి.. మనం మొదటిసారిగా కలిసినప్పుడి నుండి ఇప్పటి దాకా.. situation ఎలా ఉందో మీకు తెలుసుకదా?  కాసేపు రిలాక్స్ అవుతారని అలా అన్నాను.. అన్నట్లు.. నాన్నకి ట్రీట్‌మెంట్ ఇస్తున్నప్పడలా.. ఇలానే అవుతారట.. ఆయన మనసుకే కాదు పాపం ఆయన శరీరానికి ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు కదా?”

“నాన్నని అలా చూసి వాళ్ళే కాదు నేను తట్టుకోలేకపోతున్నాను.. ధైర్యం చాలడం లేదు. మామూతో ఉన్న friendship వలన డాక్టర్ మురారి, అందరూ వచ్చి చూసి వెళుతుంటారు.. మీకు ఇక్కడ ఉండడం ఇబ్బంది అయితే చెప్పండి.. వెళ్ళిపోదురుగాని..” అని అమృత అంటుండగానే కంగారుగా అన్నాడు సునీల్..

“అదేం లేదండి.. సార్.. కోలుకునే వరకు నేను.. నేను ఉంటాను.. అసలు ఇండియా వచ్చింది మిమ్మల్ని వెతికి పట్టుకోవాలని.. అంతకు మించి ఇండియాలో నాకు పని ఏం లేదు” అని.. ఏదో గుర్తు వచ్చిన వాడిలా..”సారీ!.. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు.. సార్ కోలుకునే వరకు నేను ఉంటాను” అని అని కారు పోనిచ్చాడు.

వాతావరణాన్ని తేలికపరచాలన్నట్లు.. “మీకు ఈ టెంపుల్ అంటే అంత గురా?” అన్నాడు.

“ప్చ్!.. గురి అంటే 100% గురి అనే చెప్పాలి. ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి దాకా నేను నమ్మిన ఏకైక దేవుడు లక్ష్మినరసింహస్వామి.. నేను అడిగినవన్నీ ఇచ్చాడు.. ఒక్కటి తప్ప.. ఆ ఒక్కటి కూడ నేను పొరపాటుగా  కోరుకున్నానే ఏమో?.. నా ప్రేమలో నిజాయితీ లేదు ఏమో? నేను..” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా.. “అయినా.. 99% నాకు అండగా ఉన్న దేవుడు.. ఏవో ఫేవర్ చేయలేదనుకోవడం.. పొరపాటు.. అదిగోండి.. మాటల్లోనే గుడి వచ్చేసింది..” అని కారు డోరు తెరుచుకొని గుడిలోకి నడుస్తూ ‘ఛ!.. ఛ!.. మనసులో.. మాట పైకి అనేసాను.. అతనేం అనుకున్నాడో’ అని మనసులో అనుకుంది అమృత.

‘అమృత మనసులో ఎంత బాధ ఉందో తెలిసింది. తను.. తను.. అమృత దూరం అయినందుకు ఎంత బాధపడుతున్నాడో తనకి మాత్రమే తెలుసు.. తన ఫ్రెండ్ వివేక్‌కి భార్య అవుతుందని తెలిసిన దగ్గర నుండి.. ఎంత సముదాయించుకున్నా గుండెలో ముల్లు గుచ్చుకున్నట్టే ఉంది.. అంతే బాధను అమృత కూడా అనుభవిస్తోంది.’ అనుకున్నాడు సునీల్.

రెండక్షరాల ప్రేమ.. ఇద్దరి మనుషుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తుంది..

“రండి డాక్టరుగారు..” అని అమృత అనడంతో ఆలోచనల నుండి తేరుకొని అడుగులు వేసాడు సునీల్.

***

ఫోను రింగ్ కావడంతో లిఫ్ట్ చేసాడు వివేక్!..

“హాయ్..! వివేక్!.. ఏం చేస్తున్నావ్?.. బిజీగా ఉన్నావా?” అంది రాధిక..

“ప్చ్!.. బిజీనా?.. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.. ఎవరున్నారు చెప్పు?.. నేను బిజీగా ఉండాడానికి? ఇన్నాళ్ళు అయితే బోర్ అనిపిస్తుంది.. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ ఉండేది కాదు.. ఎందుకంటే.. దివ్య ఫోను చేసేది కాని ఇప్పుడు ఎవరున్నారు?.. అందరూ అంటారు కదా? ఆడవాళ్ళు బయట పడినట్లు, ఏవైనా unfavour అయితే గభాలున ఏడుస్తారని.. తెగ బాధపడతారనీ, ఏవేవే అంటారు కదా. కాని అంతా ట్రాష్.. నేను చూడూ.. వర్క్‌లో ఉంటే తప్ప ఒంటరిగా ఉన్నా.. గభాలున దివ్యే గుర్తు వస్తుంది.. గుర్తు కాదు.. నాతో ఉన్నట్లే నాతో కబుర్లు చెబుతున్నట్లే అనిపిస్తుంది.. ప్చ్!..  కాని ఇప్పుడు.. నా మనసు నా మాట వినడం లేదు..

మగాడిని.. నేనే ఇంత బాధపడుతున్నానంటే.. దివ్య.. పాపం దివ్య ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక్కసారి దివ్యని కలిసి రెండు చేతులు పట్టుకొని క్షమించమని.. అడగాలనుకుంటున్నాను..”

“క్షమార్పణలు.. మనసులో బాధని పోగొడతాయని కాదు.. కనీసం కాస్త మనసుకి ఊరట కలుగుతుందేమో అన్న ఆశ..”

“వివేక్!.. ఇంకేం మాట్లాడకు.. నాకు ఇప్పుడే నీ మాటలు విన్నాక ఒకటి అర్థమయింది.

ప్రేమలో నిజాయితీ ఉంటే, ఆ ప్రేమ ఎప్పటికి నిలిచే ఉంటుంది. ఇలా చెప్పకుపోవాలంటే ఆ ప్రేమికులు బ్రతికి ఉన్నంత వరకు.. వాళ్ల మనసులో తొలి క్రష్.. అదేనండి మొదటిసారి మనసులో మొలకెత్తిన ప్రేమ.. మహా వృక్షంలా పెరిగిపోతుంది.. కాని మీ ఇద్దరి విషయంలో ఆ మహావృక్షాన్ని.. కూకటివేళ్ళతో పెకిలిస్తే తప్ప.. మీ ఇద్దరికి ఫ్యూచర్ ఉండదు.. మన కోసం కాకపోయినా మనని కని పెంచిన వాళ్ళ కోసం మనం ఆలోచించాలి.. నువ్వు ఆ పనే చేసావు.. దివ్య అందుకే తాతగారి కోసం వచ్చేసింది.. కాని తాతగారు చెప్పిన మాటలు విన్నాక నాకు భయం వేసింది. అందుకే నీకు ఫోను చేసాను. ఒక్కసారి దాన్ని.. ఆ ప్రేమ పిచ్చిదాన్ని.. వెళ్ళి పలుకరించు.. ఏం చేస్తావో ఏమో!.. నాకు తెలియదు.. దివ్య తిరిగి మాములు మనిషి కావాలి!..  ఒక్కసారి వెళ్ళి కలువు.. రేపు సండే కదా?.. ఏమంటావ్ వివేక్” అంది రాధిక..

గభాలున అన్నాడు..

“ఏంటి దివ్య వచ్చేసిందా?.. ఎన్ని సార్లు ఫోను చేసినా లిఫ్ట్ చేయలేదు.. నాకు కావలసింది దివ్య.. మాములు మనిషి కావడం.”

“పరిస్థితులు అర్థం చేసుకొని.. తిరిగి దివ్య ఎప్పటిలా..”

“ఇంకేం మాట్లాడాకు.. అర్జంటుగా దివ్యని కలుపు.. దాన్ని ఎలా ఓదార్చుతావో.. ఏమో నాకు తెలియదు.. మరి ఉంటాను” అని ఫోను పెట్టేసింది రాధిక.

నిద్ర పట్టలేదు వివేక్‍కి.. మంచం మీద అటు ఇటు దొర్లాడు.. ఇన్ని రోజులు తనని.. చాలా మిస్ అయ్యాడు.. ఎప్పుడు తెలవారుతుందా?.. దివ్య దగ్గరికి ఎప్పుడు వెళతానా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారాడు..

గభాలున మెలకువ వచ్చి కంగారుగా సెల్ తీసి టైమ్ చూసాడు.. నాల్గుగంటలవుతుంది.. ఇంకా చీకటి గానే ఉంది.. అయినా ఫ్రషప్ అయి బయలుదేరేటప్పటికి తెల్లారిపోతుంది అని గబగబా మంచం మీద నుండి లేచి.. వాష్ రూమ్ లోకి నడిచి.. స్నానం చేసి.. కిచెన్ లోకి నడిచి.. కఫ్పులో పాలు పోసి వేడి చేసి.. కాఫీ కలుపుకొని తాగుతూ వార్డ్ రోబ్ దగ్గరకు నడిచి.. తనకెంతో ఇష్టమైన లైట్ పర్పుల్ షర్ట్ వేసుకొని.. గబగబా రెడీ అయి మిరర్ దగ్గరకు వచ్చి.. ఒక్క నిమిషం చూసాడు..

ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు వచ్చింది.

“థాంక్స్ వివేక్, you look very smart” అంది దివ్య.

“థాంక్స్!.. దివ్యా.. గాని ఒకటి అర్థం కాలేదు ఇందాక.. నువ్వు నన్ను చూడగానే థాంక్స్ అన్నావు ఎందుకు? దేనికి?..” అన్నాడు.

కోపంగా బుంగమూతి పెట్టింది దివ్య..

“అరె!.. ఎందుకు నీకు కోపం వచ్చింది?.. అసలు నీకు ఎప్పుడు కోపం రాదుగా..” అన్నాడు కంగారుగా వివేక్..

“ఎందుకా.. నేను.. డిసెంబరుకి.. నీకు.. షర్టు కొని ఇచ్చాను.. నువ్వు కంగారుగా అన్నావు.. – ఇలాంటి కలర్స్ ఎప్పుడు వేసుకోలేదు.. ఎప్పుడు వైట్,  strips షర్ట్సు తప్ప..” అని.. ఓ.కే.. ఓ.కే.. ట్రై చేస్తాను అన్నావు.. కాని.. తరువాత వీక్లీలో ఒకసారయినా ఈ షర్టు వేసుకున్నప్పుడల్లా నీకు థాంక్స్ చెబుదామని అనుకుంటాను. మళ్ళీ ఏమనుకుంటావో ఏమో, నా సెలెక్షన్ నీకు నచ్చుతుందో లేదో” అంది దివ్య.

“ఈ షర్టుకి అంత కథ ఉంది కదూ?.. కాని నువ్వు ఒకటి మరిచిపోతున్నావు.. ఈ షర్టు నువ్వు ఇచ్చావు కాబట్టి.. నాకు ఫేవరెట్ షర్ట్ అయిపోయింది.” అన్నాడు.

చెళ్ళుమని ఎవరో కొరడాతో మొఖం మీద కొట్టినట్లయింది.. గభాలున తీసేసి ఒకసారి షర్టుని రెండు చేతుల్లోకి తీసుకొని ఒక్క నిమిషం చూసి గుండెకి హత్తుకొని.. ఒక క్షణం బాధగా కళ్లు మూసుకొని.. ‘ఈ షర్టు వేసుకొని దివ్య దగ్గరికి వెళితే.. తనని ఇంకా బాధపెట్టినవాడిని అవుతాను.. అని షర్టు కప్ బోర్డులో జాగ్రత్తగా హేంగరుకి పెట్టేసి, వేరే షర్టు వేసుకొని గబగబా కారు దగ్గరకు నడిచాడు.

కారు బయలుదేరింది.. ఇద్దరూ ఒకరితో ఒకరు I love you చెప్పుకోకపోయినా, తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని, ఆ ఇష్టం ప్రేమగా మారుతుందని.. తెలిసే లోపు ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఫ్రండ్స్ టీజ్ చేయడం మొదలు పెట్టారు..

“ఇదెక్కడి లవ్ రా? ఎక్కడా చూడలేదు” అని.. కాని ఇప్పుడు అనిపిస్తుంది.. డేటింగ్‌లు.. చాటింగ్‌లు.. లాంగ్ డ్రైవ్‌లు చేసిన వాళ్ళందరూ.. కలిసి ఉంటున్నారా?.. బ్రేకప్‌లు.. డివోర్సులు.. కాని.. తమలా.. ఫ్రెండ్స్‌లా.. ఉండి.. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న వాళ్ళ ప్రేమ జీవితాంతం చెక్కు చెదరకుండా ఉంటుందని అనుకున్నాడు. త్వరలోనే ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కాని.. దివ్య తనకి దూరం అయింది..

ఆలోచనల లోనే.. కారు వెళ్ళి డా. రంగారావు ఇంటి ముందు ఆగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here