మేనల్లుడు-27

0
11

[మర్నాడు ఉదయం ఇంట్లో టిఫిన్లు సర్దుతూ – అన్నయ్య చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంటున్నాడని – ఆయన అలా మారటానికి కారణం డాక్టరుగారేనని సుమిత్రతో అంటుంది శారద. ఈలోపు ఆటోమేటిక్ వీల్ చైర్‍లో నారాయణరావు డైనింగ్ టేబుల్ వద్దకు వస్తాడు. ఇదంతా డాక్టరు బాబు పుణ్యమేనని, నిజానికి నడిచి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచాలని అనుకున్నానని అంటాడు. ఇలా అందరూ సునీల్‍ని మెచ్చుకుంటూ ఉంటే, తనకు ఇంకో కూతురు ఉంటే సునీల్‍కిచ్చి పెళ్ళి చేసేవాడినని అంటాడు నారాయణరావు. ఆ మాటలు విన్న అమృత బాధపడుతుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చకా, అమృత సరిగా భోజనం చేయడం లేదని, తనని కూడా ఒకసారి పరీక్షించమని సునీల్‍తో అంటారు సుమిత్రా, శారద. ఈలోపు మంగమ్మ వచ్చి అమృత స్నేహితురాలు సౌమ్య ఉరి వేసుకుని చనిపోయిందని చెప్తుంది. ఆ వార్త విన్న అమృత స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే ప్రథమి చికిత్స చేస్తాడు సునీల్. అమెరికాలో – రాధిక దివ్యకి ఫోన్ చేసి వివేక్ గురించి చెప్పబోతుంటే, ఎప్పటికీ వివేక్ తన మనసులో ఉంటాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఫ్లయిట్‍లో నారాయణరావు కుటుంబం, సునీల్ కుటుంబం, దగ్గిర చుట్టాలు అంతా అమెరికాకి బయలుదేరుతారు. సునీల్‍కీ, అమృతకి అక్కడ పెళ్ళి చేయాలని వెళ్తుంటారు. అమృత, సునీల్ మాట్లాడుకుంటూ తమని ఆ లక్ష్మీ నరసింహస్వామే కలిపాడని అనుకుంటారు. విమానంలో తనకు ఊపిరి అందడం లేదని గొడవ చేస్తుంది సునీల్ నానమ్మ కైలాసమ్మ. సునీల్ తండ్రి రామచంద్రుడు, తల్లి తులసి, బాబాయ్ హరిశ్చంద్రుడు ఆమెకి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తారు. – ఇక చదవండి.]

[dropcap]“సు[/dropcap]నీల్ బాబు మావగారు.. నారాయణరావు గారు.. ఈ పెళ్ళి అమెరికాలో జరగాలని, ఎంత వద్దంటున్నా మనందరికి ఫ్లయిట్ టిక్కెట్టులు తీసి.. అన్ని ఖర్చులు భరిస్తానన్నారు.. అన్నయ్యా, వదినా ఏం చేస్తారు?” అన్నాడు హరిశ్చంద్రుడు.

“నోరు ముయ్యరా! ..పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లు అన్న మీద ఈగ వాలనివ్వవు.. కథ మొత్తం అర్థమయిపోయింది..

మన ఊరిలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకి జనాలు ఎలా పరిగెడుతున్నారో.. అలా.. మన సుబ్బయ్య మావగారు ఖర్చులు భరిస్తానన్నారని చంకలెగరేసుకుని.. నీ పెళ్ళాం, నువ్వు విమానమ్ ఎక్కే సరదా తీర్చుకుంటున్నారా?”

“ఛ.. ఛ.. అవేం మాటలమ్మా.. అన్నట్లు.. అమ్మా.. బాగోదు.. సుబ్బయ్యా అనకు.. సునీల్ అను..” అన్నాడు రామచంద్రుడు.

“ఏంటమ్మా!.. అందరం సరదాగా సునీల్ బాబు పెళ్ళి చూడడానికి బయలుదేరాం.. ఇలాంటి సంతోషం మళ్ళీ మళ్ళీ వస్తుందామ్మా?” అన్నాడు హరిశ్చంద్రుడు.

“నోరు ముయ్యరా!.. మీ అందరికీ సంతోషమే.. 90 ఏళ్ళ ముసలిదానిని.. ఈ విమానంలో ఊపిరి అందడం లేదు.. ఆ శబ్దం ఒకటి.. ఈ విమానంలో నా ప్రాణం గుటుక్కుమంటే.. నా శవాన్ని ఇక్కడెక్కడో పడేస్తారని నాకు తెలుసు.. కానీ అలా చేస్తే.. నా ప్రాణం పోయినా నా ఆత్మకు శాంతి ఉండదు.. మీ నన్న సమాధి పక్కనే నా శవాన్ని పూడ్చాలి..” అని రాగలు తీయడం మొదలుపెట్టింది కైలాసమ్మ.

నారాయణరావు గారు కంగారుగా తల తిప్పి సునీల్ వైపు చూశారు.

“బామ్మగారూ! ఫ్లయిట్‍లో ప్రయాణం.. భయపడుతున్నారు.. పెద్ద వయసు.. ఎలా?” అని అమృత అంటుంటగానే..

“నాలుగు రోజుల్లో వెనక్కి వచ్చేస్తాం.. ఆవిడని ఇండియాలో ఉంచేయవలసింది.. పాపం భయపడుతున్నారు” అన్నారు నారాయణరావు గారు.

“అయ్యో!.. మా నాయనమ్మ సంగతి మీకు తెలియదు మావయ్యా.. వయసు పైబడి ఏమాత్రం సుస్తీ చేసినా.. ‘నా మనవడి పెళ్ళి చూసేవరకు నా ప్రాణాలు తీసుకుపోవద్దని యముడితో పోట్లాడి పంపేసాను.. మరి నీ కొడుకు పెళ్ళి ఎప్పుడురా.. అని మా నాన్నని రోజూ అడిగి అడిగి విసిగిస్తుంది’. రోజూ నాన్నగారు నాకు ఫోన్ చేస్తారు.. నానమ్మకి అలవాటే ఇలా మాట్లాడడం.. మీరేం అనుకోకండి మావయ్యా” అన్నాడు సునీల్.

“అయ్యో!.. అయ్యో!.. దిక్కుమాలిన విమానం!.. నా ప్రాణాలు గుటుక్కుమనేటట్లు ఉన్నాయి” అంటూ కైలాసమ్మ రాగాలు తీయడం చూసి “పదండి.. మీరు చెబితే బామ్మగారు భయపడరేమో!” అంటూ అమృత సీటు లోంచి లేవడంతో, సునీల్ కూడా లేచాడు. ఇద్దరూ కలిసి కైలాసమ్మ దగ్గరకు నడిచారు.

వారిద్దరిని చూసి, “మిడిగుడ్లు వేసుకుని.. అలా చూస్తారేమిటి రా హరిశ్చంద్రా.. నీ పెళ్ళాం నువ్వూ వెళితే – నా మనవడూ మనవరాలూ ఇక్కడ కూర్చుంటారు” అని వాళ్లు లేవగానే; “రా సుబ్బయ్యా, ఇలా వచ్చి కూర్చో. రా తల్లీ..” అని ఒక్క నిమిషం అమృత ముఖంలోకి చూసి – “లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా.. మా కాకినాడలో మా వీధి కుర్రాడే దొరసానిని పెళ్ళి చేసుకొని ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ కుర్రాడి నాన్నకు గుండెపోటు వచ్చింది.. అప్పటి నుండి నాకు బెంగ పట్టుకుంది – భుజాల వరకు ఉన్న పిల్లి జుట్టు లాంటి తెల్ల జుట్టుతో.. పొట్టి గౌనులు వేసుకునే దొరసానిని మా సుబ్బు ఎక్కడ ప్రేమించి పెళ్ళి చూసుకుంటాడో అన్న భయంతో. నీ పెళ్ళి కళ్లారా చూసినాకే కైలాసం అయినా స్వర్గం అయినా వెళతానని పేచీ పెట్టేదానిని. మా ఆయన సుబ్బయ్య ఆ రోజుల్లో ఏరి కోరి.. 10 ఎకరాలు ఇచ్చే బుజ్జమ్మ సంబంధం కాదని లక్ష్మీదేవిలా ఉన్నానని మా వాళ్ళు ఐదు ఎకరాలు ఇచ్చినా.. నన్ను పెళ్ళి చేసుకున్నాడు” అంది.

“బాధ పడకండి బామ్మగారూ” అంది అమృత ఏం మాట్లాడాలో తెలియక.

“బంగారు బొమ్మలా.. అందంతో మెరిసిపోతున్న ముద్దుగుమ్మని మా సుబ్బయ్య పెళ్ళి చేసుకుంటున్నాడు. నువ్వు నాకు బాగా నచ్చావు పిల్లా. పొడవాటి జడ, లక్షణంగా చీర, కళ్ళకి కాటుక, నుదుటన దేవుని బొట్టు.. ఇంతకన్నా ఏం కావాలమ్మా? ఇప్పటి కాలం ఆడపిల్లలు చీరలు కట్టుకోవడం లేదు. జడలు లక్షణంగా వేసుకోవడం లేదు” అని, రెండు చేతులతో అమృతని ముద్దాడి.. వేళ్ళు విరిచి..

“మరి మునిమనుమడిని ఎప్పుడిస్తావు? బంగారు ఉగ్గు గిన్నె ఇస్తాను.. అందులో పాలు పోసి వాడికి పాలు పట్టాలి.. అన్నట్లు మగపిల్లాడు పుడితే సుబ్బయ్య అని, ఆడపిల్ల అయితే కైలాసమ్మ అని పేరు పెడతావు కదూ? ఊరికినే కాదులే.. నా పేరున ఉన్న పొలం నా మునిమనవడికి వ్రాస్తాను” అని లొడలొడ మాట్లాడుతున్న కైలాసమ్మ మాటలు విని అందరూ నవ్వుకోసాగారు.

“నానమ్మా” అన్నాడు సునీల్ కంగారుగా.

అమృత సిగ్గుతో ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది.

“చూసావా.. ఊపిరి అందడం లేదని, ప్రాణాలు పోతున్నాయి అని హడావిడి చేసావు.. ఇప్పుడు ఆపకుండా మాట్లాడుతునే ఉన్నావు..” అన్నాడు సునీల్.

ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క నిమిషం మౌనం వహించి, “అన్నట్లు ఆ దొరల దేశంలో పెళ్ళి చేయడానికి శాస్త్రులుగార్లు ఉన్నారా?.. కొబ్బరి మట్టలు దొరుకుతాయా?” అని మాట్లాడుతూ పోతున్న కైలాసమ్మని..

“అబ్బబ్బ… నానమ్మా.. అన్నీ దొరుకుతాయి.. కాసేపు కళ్లు మూసుకో.. రా అమృతా..” అని కాస్త చిరాకుగానే అన్నాడు సునీల్.

కంగారుగా, కళ్ళతో అలా వద్దన్నట్లు చూసింది అమృత.

“ఎక్కడికి రా! బంగారు తల్లి కాసేపు నా దగ్గరే కూర్చుంటుంది.. ఈ దిక్కుమాలిన విమానంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాను.. ఏం తల్లీ! నా దగ్గర కాసేపు కూర్చుంటావా?” అంది కైలాసమ్మ.

“అలాగే బామ్మగారూ.. నేను మీ దగ్గరే ఉంటాను.. నిశ్చింతగా పడుకోండి” అని అభిమానంగా కైలాసమ్మ చెయ్యి పట్టుకుంది. సునీల్ ప్రక్క సీట్లో కూర్చున్నాడు.

ఎవరూ చూడకుండా తన వైపున ఉన్న అమృత చేతిని సునీల్ పట్టుకోవడం చూసి కంగారుగా, కోపంగా చూసి – చెయ్యి వెనక్కి తీసుకోబోతే గభాలున గట్టిగా పట్టుకున్నాడు సునీల్.

కైలాసమ్మ నిద్రలోకి జారుకుంది.

“హమ్మయ్య. వాన వచ్చి వెలసినట్టయింది” అన్నాడు సునీల్.

“ఉష్!.. పాపం పెద్దావిడ!.. బామ్మగారి ఆలోచనలు అలానే ఉంటాయి.. నిజం చెప్పండి. మన ఆలోచనలను మార్చుకోగలమా?” అంది అమృత.

“అది కాదు.. పాపం నాన్నగారికి చిన్నపిల్లాడిలా అందరిలో ఏవేవో అంటుంది. నాన్నగారికి విమానం ఎక్కాలన్న సరదా వలన..”

“ఏంటండి? బామ్మగారి మాటలను పట్టించుకుంటున్నారు? పసివాళ్ళు, పెద్దవాళ్ళు.. ఒకలాగే ప్రవర్తిస్తారు.. బామ్మగారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. మావాళ్లు గాని, ఎవరైనా సరే.. ఏమీ అనుకోరు..”

ఒక్క నిమిషం అమృత వైపు చూసి “యూ ఆర్ గ్రేట్” అన్నాడు.

“ఏవండీ!.. గట్టిగా అనకండి.. నేను ఏం చేసినా, ఏం అన్నా.. గ్రేట్ అంటారని తెలుసు” అంది నవ్వుతూ.

సునీల్ కూడా నవ్వి.. “ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు” అన్నాడు.

కంగారుగా అంది – “సారీ!.. ఏంటో చెప్పండి..”

“ఇదిగో! ఇలా.. ఏవండీ.. చెప్పండి.. అవునండి.. కాదండీ.. ఇలాంటి అండీలు నాకు నచ్చవు. నన్ను సునీల్ అని పిలవండి”

“అస్సలు అలా కాడండీ.. మా ఇంట్లో పని చేసే వాళ్ల దగ్గర నుండి.. పొలంలో పని చేసేవాళ్లు.. ఎవరైనా సరే.. వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం.. ఉగ్గుపాలు తాగినప్పటి నుండి నేర్పించారు మా వాళ్ళు.

ఊర్లలో అల్లుడికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వలో, ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలో అందరికీ తెలుసు. క్రొత్తగా వస్తున్న మార్పులు.. మారుతున్న కాలంతో పాటు క్రొత్తగా వస్తున్న మార్పులు.. అదేనండి.. భర్తని పేరు పెట్టి పిలవడం.. చూసి  – ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లలని పిలిచినట్లు పిలవడం, భర్తతో పనులు చేయించడం చూసి.. ‘ఇంట్లో పెట్టుకున్న పనివాడా’ అని.. ఇలా ఏవేవో అని నాన్నగారు తెగ బాధపడిపోతుంటారు” అంది.

“అంటే! ఇవన్నీ తప్పా?”

“అవునండి! మా వాళ్ళు కాదు.. మా ఊర్లలో మనుషులు ఇంకా మీ పట్నం వాళ్లంత మాడరన్ కాలేదు. ఎప్పటికి అవుతారో కూడా తెలియదు..” అని నవ్వుతూ, “అప్పటి వరకు నేను మిమ్మల్ని ‘ఏవండీ’ అనే పిలుస్తాను” అంది.

ఏం మాట్లాడాలో తెలియనివాడిలా.. అలా చూస్తూ ఉండిపోయాడు సునీల్.

మెసేజ్ వచ్చినట్టు సిగ్నల్ రావడంతో సెల్ ఓపెన్ చేసి చూశాడు సునీల్. ముఖం సంతోషంతో నిండిపోయింది.

“నా ఫ్రెండ్స్ డేవిడ్, రాధికా చాలా హెల్ప్ చేస్తున్నారు..” అన్నాడు.

“హెల్ప్?… ఏమిటండి ఆ హెల్ప్?”

“అవునండి”

“ప్చ్.. మీరు ముందు అమృతా అనండి” అని చెప్పి,

“ముందే చెబుతున్నాను నన్ను అమృతా అన్నా – అమ్మూ అన్నా నాన్న సంతోషపడతారు. అన్నట్లు – మన పెళ్ళి ముహూర్తం నిర్ణయించిన రోజునే నన్ను పక్కకి పిల్చి ‘అల్లుడి గారిని నిన్ను పేరు పెట్టి పిలవమని చెప్పమ్మా. నిన్ను అండీ అంటుంటే నాకు బాధగా ఉంది’ అన్నారు నాన్నగారు” అంది.

“ఆహా!.. అలా చెప్పారా?” అన్నాడు నవ్వుతూ.

“అన్నట్లు ఇందాక మీ ఫ్రెండ్స్ గురించి..” అని అమృత అంటుండగానే..

గభాలున సెల్ ఓపెన్ చేసి కొన్ని పిక్స్ చూపెడుతూ.. “మన మ్యారేజ్‍కి ఎరేంజ్‍మెంట్స్ గ్రాండ్‍గా చేస్తున్నారు. మనం స్టే చేయడానికి, మ్యారేజ్ చేయడానికి బ్రహ్మాండమైన వెన్యూ ఎరేంజ్ చేశారు.. ఫోటోలు చూడు” అన్నాడు.

“ఎక్కడండి?”

“Hampshire House బుక్ చేశారు. చాలా బాగుంది, చూడు” అన్నాడు.

ఫోటోలన్నీ చూస్తూ, సంతోషంగా అంది..

“ఎక్కడండి?”

“బోస్టన్‍లో..”

“చాలా బాగుందండీ.. కానీ..”

“కానీ ఏమిటి అమృతా.. అరే నీ ఫేస్ అలా డల్ అయిపోయింది ఏమిటి?

“మరి డల్ కాదా?.. అసలు ‘మామూ’ లేకుండా, ‘మామూ’కి చెప్పకుండా మన పెళ్లి ఫిక్స్ చేయడం, అదీ USA లో చేయడం.. ‘మామూ’ ఏమనుకుంటాడు? ఎంత బాధపడతాడు?”

“ఏం చేయమంటావు? మావయ్య నా దగ్గర మాట తీసుకున్నారు..”

ఆశ్చర్యంగా, కంగారుగా.. అంది “ఏంటి నాన్నగారు.. మాట తీసుకున్నారా?”

“అవును!.. మన పెళ్ళి నిశ్చయం చేశాకా, ఈ విషయం వివేక్‍తో చెబుతాను మావయ్యా అంటే, ‘అస్సలు ఈ విషయం వివేక్‍కి తెలియడానికి వీలు లేదు.. తనకే.. నా మేనల్లుడికే సీక్రెట్‍లు దాచటం తెలుసా?.. నాకూ తెలుసు.. నా మేనల్లుడు చేసిన దానికి.. నాకు ఇలానే చేయాలనిపించింది.. తరువాత మీకే తెలుస్తుంది అల్లుడుగారూ!.. నేను చెప్పినట్టు చేయండి’ అన్నారు.. ఇక నేనేం మాట్లాడను?”

“నాన్న అలా అన్నారా?” అని ఒక్క నిమిషం ఆగి, “నాన్న.. ఏం చేసినా మంచే చేస్తారు. అందులోకీ ‘మామూ’ అంటే.. పంచప్రాణాలు. జరిగినదంతా ‘మామూ’తో చెబుతానంటే.. అస్సలు చెప్పడానికి వీలు లేదు.. నేనే చెప్పే వరకు మనం USA వెళుతున్నట్లు వివేక్ బాబుకి చెప్పడానికి వీలు లేదమ్మా అన్నారు” అంది.

తన దగ్గరే కాదు, సునీల్ దగ్గర కూడా నాన్న మాట తీసుకున్నారన్న మాట.. అనుకుంది.

“ఏం చేసినా నాన్న ఆలోచించే చేస్తారు” అంది అమృత.

ఈలోపు ఎయిర్ హోస్టెస్‍ వచ్చి అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తుండడంతో.. ఎదురు సీట్లకి ఉన్న ట్రే టేబుల్ ఓపెన్ చేసి వాటి మీద పెట్టారు అమృత, సునీల్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here