మేనల్లుడు-4

0
13

[రోజులు గడుస్తున్నాయి. మేనమామ ఇంట వివేక్ చక్కగా పెరుగుతుంటాడు. అత్త సుమిత్ర వివే‌క్‌ని ఆడిస్తూ, తనకు పిల్లలు లేరనే లోటును తీర్చుకుంటుంది. వివేక్‌ని ఇంటికి కాస్త దూరంలో ఉన్న సెయింట్ యాన్స్ స్కూల్లో చేరుస్తారు. వివేక తల్లి శారద తన వదినకి ధైర్యం చెబుతుంది, పూజలు చేయిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్తుంది. వివేక్ వచ్చాకా తన భార్య సుమిత్రలో వచ్చిన మార్పుని గమనిస్తాడు నారాయణరావు. ఆమెలో ఆ సంతోషం అలానే ఉండాలని కోరుకుంటాడు. చెల్లెలు, భార్య కోరిక మీద పూజలు నిష్ఠగా చేస్తాడు. అత్తకి ఆడపిల్ల పుడుతుందనీ, ఆ పాపతో తాను ఆడుకుంటాననీ అంటాడు వివేక్. సుమిత్ర గర్భం దాలుస్తుంది. – ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]వునన్నట్లు సంతోషం నిండిన కళ్లతో భర్త వైపు చూసింది సుమిత్ర.

“అత్తయ్యా!.. బాబు కాదు.. బుజ్జి పాప..” అన్నాడు వివేక్.

“అవును కదూ? పాపే!..” అంది.

“మరి పేరు ఏమిటత్తయ్యా?” అన్నాడు వివేక్.

“నువ్వే చెప్పు వివేక్ బాబు.. ఏం పేరు పెడతావో నీ ఇష్టం” అన్నాడు నారాయణరావు.

“నేనే చెబుతానండి. వివేక్ బాబు ఎంతో నమ్మకంతో నాకు పాప పుడుతుంది.. తను పాపతో ఆడుకుంటానని అమృతం లాంటి మాటలు అని నాలో ఆశలు రేపాడు.. ఎందుకో తెలియదు వివేక్ బాబు మాటలు నిజం అయితే ఎంత బాగుండును” అని అనుకున్నాను.. అమృతం లభించిన దేవతలు కంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను.. వివేక్ బాబూ!.. నా కూతురు పేరు అమృత” అంది సంతోషంగా.

చప్పట్లు కొడుతూ “పేరు చాలా బాగుంది అత్తయ్యా అ..ము..త్ర..” అని నత్తిగా అన్నాడు వివేక్.

“వదినా.. వాడిని రేపటి నుండి ఎత్తుకోవడం, వాడి పనులు చేయడం అన్నీ బంద్.. డాక్టరుగారు చెప్పినట్లు చెయ్యాలి.. అలా అయితే అమృత పాప నీ చేతుల్లో ఉంటుంది” అంది శారద.

గభాలున దగ్గరకు వెళ్లి సుమిత్ర చేతులు, పట్టుకొని కళ్లల్లోకి చూస్తూ “శారద మాటలు విన్నవా? మన వివాహం అయిన దగ్గర నుండి ఈ రోజు దాక నీకు నాకు మధ్య ప్రేమ, అభిమానం తప్ప వీసమెత్తు differences కూడా రాలేదు.. అందరితో నువ్వు మొదిలే తత్వం చూసి, ఇతరులకు, ఆపదల్లో ఉన్న వాళ్లకి నువ్వు చేసే సహాయం చూసి.. నా వైఫ్ మనుషుల్లో ఉన్న దేవత, ఇంత మంచి వైఫ్ నాకు దొరకడం నా అదృష్టం అని అనుకుంటూ ఉండేవాడిని. కాని నువ్వు తల్లిని కాలేకపోతున్నానని బాధపడడం చూసి.. ఇంత మంచి అమ్మాయికి ఎంత బాధపెట్టాడు ఆ భగవంతుడు అని అందరు వ్యక్తులూ అనుకున్నట్లే అనుకున్నాను. నాకు తెలియకుండానే నా మనసులో నీ పట్ల బాధ బయలుదేరింది. దురదృష్టవంతురాలు, నేను ఏమీ చేయలేని అసమర్థుడిని అని నన్ను నేను నిందించుకుంటున్న సమయంలో.. నువ్వు తల్లివయ్యావు.. ఈ అదృష్టాన్ని నిలుపుకోవాలంటే నువ్వు డాక్టరుగారు చెప్పినట్లే కాదు, శారద చెప్పినట్లు నడుచుకోవాలి. అన్నట్లు మీ అందరితో చెప్పలేదు.. నేను ఇంకో 20 ఎకరాలు నర్సరీ కొన్నాను.. వివేక్ బాబు పేరున ఉన్న పొలం మీద వచ్చిన కౌలు డబ్బు నిన్ననే గుమస్తా లెక్కలు వేసి చూపించాడు.. ఆ డబ్బు బ్యాంక్‌లో అలా ఉండే బదులు దేని మీదనైనా డబ్బు invest చేయాలని, నర్సరీ వివేక్ బాబు పేరున కొంటున్నాను.. వాడు పెద్ద పెద్ద చదువులు చదివి, విదేశాలు వెళ్లి ఈ ఊరికి, మన ఇంటికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆరాటపడుతున్నాను.. So, కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి” అని నారాయణరావు అంటుండగానే గభాలున నారాయణరావు గుండె మీద వాలిపోయి గట్టిగా కరుచుకుపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది సుమిత్ర.

‘అ..త్త..య్యా! ఏడవ..కు.. నే..ను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాన’ని వచ్చీరాని మాటల్లో అన్నాడు వివేక్!

వివేక్ మాటలకు అందరూ నవ్వారు.

సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికైనా రోజులు జెట్ స్పీడ్‌తో దొర్లిపోతాయి.. నారాయణరావు కుటుంబంలో అదే జరిగింది. ఆ కుటుంబం ఎదురు చూస్తున్న రోజు.. సంతోషకరమైన రోజు వచ్చింది. సుమిత్ర పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.

ఊరు ఊరంతా నారాయణరావుకి సంతానం కలిగింది అని సంతోషపడ్డారు. ఊరు బంతి పెట్టాడు నారాయణరావు. సడన్‌గా రమణ రావడం చూసి షాకయ్యాడు, నారాయణరావు. మరు నిమిషంలో నారాయణరావు మొహంలో సంతోషం బయలుదేరి అభిమానంగా దగ్గరకు వెళ్లి “రండి బావగారు!.. చాలా సంతోషం” అని రమణ చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్లబోయాడు.

కోపంగా చేతులు విదిలించుకొని “మీ మర్యాదలు అందుకోవడానికి నేను రాలేదు. నా భార్య, నా కొడుకుని పంపిస్తే మా ఇంటికి తీసుకవెళతాను” అన్నాడు రమణ.

ఒక్క నిముషం కంగారుగా చూసి, “ఇలా మాట్లాడవద్దు బావగారు.. శారద వింటే బాధపడుతుంది. మీరు మారి భార్యా, కొడుకుని తీసుకెళ్లాలనే కోరుతున్నాను” అని నారాయణరావు అంటుండగానే..

కోపంగా అన్నాడు రమణ –

“నేను మారడం ఏమిటి? దుర్మార్గుడినా? ఎవరి పీకలైనా కోసానా?.. ఎక్కడ వాళ్లు..”

గభాలున రమణ చేతులు పట్టుకొని హాలులోకి తీసుకువెళ్లి “ముందు కూర్చోండి” అని “శారదా!.. ఒక్కసారి ఇలారా! ఎవరు వచ్చారో చూడు” అన్నాడు నారాయణరావు.

గభాలున లోపలి నుండి వచ్చిన శారద రమణని చూసి, మొహంలో ఎటువంటి భావాలు లేకుండా “..పిలిచావా అన్నయ్యా?” అంది.

చివ్వున తల ఎత్తి “చూశారా!.. మీ సిస్టర్ బిహేవియర్.. ఇలాగేనా భర్తకి గౌరవించేది?.. ప్చ్.. గౌరవం మాట దేవుడెరుగు. ఎన్నాళ్లకో వచ్చిన భర్తని పలుకరించేది ఉందా? మీ సిస్టర్‌కి కొంచెం మంచి చెడ్డలు, మర్యాద నేర్చుకోమని చెప్పండి” అని రమణ అంటుండగానే ఆవేశంగా అంది శారద.

“మర్యాద, గౌరవాల గురించి మీరు మా అన్నయ్యకు చెబుతున్నారా? ఈ మాట ఇంకెక్కడా అనకండి. నవ్వుతారు!”

“శారదా?.. మీ అన్న అండ చూసి రెచ్చిపోకు.. ఎన్నాళ్లో ఉండదు ఈ సంబరం” అని రమణ అంటుండగానే కోపంగా అన్నాడు నారాయణరావు

“చూడండి బావగారు.. నా చెల్లెలే కాదు.. ఏ ఆడపిల్ల అయినా.. నోటిలో నాలుక లేని పిల్లయినా మీరు చేసిన పనికి ఇలానే అంటుంది..”

“ఏం చేశాను? మగాడన్నాక కాళ్లు చేతులు కట్టుకొని పెళ్లాం ముందు 24 గంటలు కూర్చోవాలా?” అన్నాడు ఆవేశంగా రమణ.

“మిమ్మలను కాళ్లు చేతులు కట్టుకొని, నా ఎదురుగా కూర్చోమనలేదు.. కట్టుకున్న భార్యకి, కన్న కొడక్కి ఉండడానికి నీడ లేకుండా రోడ్డు మీద పడేసారు.. దీనికి ముందు జవాబు చెప్పండి?.. ఆ రోజు మా అన్నయ్య లేకపోతే గోదారిలో తేలేవాళ్లం..” అంది ఏడుపు గొంతుతో..

“మీ అన్నయ్య ఉన్నడుగా.. ఇప్పటికి ఎన్ని సార్లు రెక్కలు కట్టుకొని నీ దగ్గర వాలిపోలేదు” అన్నాడు ఎగతాళిగా రమణ..

“ప్చ్!.. అసలు మీలాంటి మనిషితో మాటాడడం దండగని నాకు తెలిసిందని కాని అన్నయ్యకు తెలియలేదు” అంది శారద..

“అయితే ఇప్పుడేమంటావు? నాతో వస్తావా? రావా? మొగుడు కావాలనుకుంటే బయలుదేరు లేదా” అని రమణ అంటుండగానే..

“ఏ ఆడది భర్తని వద్దనుకోదు.. 20 ఏళ్లు పెంచిన పుట్టింటి వాళ్లని వదులుకొని మెట్టినింటికి భర్త దగ్గరకు వస్తుంది. భవిష్యత్ గురించి ఎన్నో కలలు కంటుంది.. ప్చ్.. కలలు వదిలేయండి. మమ్ములను రోడ్డు మీద పడేసి ఇప్పుడు వచ్చి.. నాతో వస్తావా? రావా? అని ధైర్యంగా ఎలా అనగలుగుతున్నారు.. ముందు మీరు మనిషిగా మారి అప్పుడు రండి. మీరు పిలవకుండానే మీకూడ వస్తాను” అని రయ్ మని లోపలికి వెళ్లిపోయింది.

కోపంగా నాలుగు అడుగులు వేసి, మళ్లీ వెనక్కి వచ్చి “నా కొడుకు పేరున పొలం రిజిష్టరు చేయించి, నాకు అన్ని విషయాల్లో అడ్డుపడ్డావు.. కౌలు డబ్బులోంచి కొంత డబ్బు నాకు ఇవ్వు” అన్నాడు..

కంగారుగా అటు ఇటు చూసి, శారద రావడం లేదని తెలిసినాక గుమస్తా వెంకట్రావుని పిలిచి డబ్బు రమణకివ్వడం, గబగబా రమణ వెళ్లిపోవడం జరిగింది.

“శారదా!.. నీకు చాలా అన్యాయం చేసానమ్మా.. బుద్ధిమంతుడు, మంచి మనిషి అని రమణని నీకిచ్చి పెళ్లి చేసాను.. లంచాల ఉద్యోగం కావడంతో, పార్టీలు.. పేకాటకి అలవాటై.. లంచం తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

ఏ మనిషైనా చెడు పనులకు తొందరగా దగ్గరవుతాడు. కాని మంచి పనులు అలవరుచుకోవడానికి బరువులు మోసినంత బాధపడతాడు.

మనిషి తీరంతే!.. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు.. శారదా.. బావగారు తన తప్పులు తెలుసుకుంటారు.. ఇప్పుడు భార్యా, కొడుకు గుర్తు వచ్చే ఇలా వచ్చారు” అని నారాయణరావు అంటుండగానే..

“అన్నయ్యా!.. ఇంకా నీ చెలెల్లు పసిపాప అనుకుంటున్నావా? డబ్బు ఇచ్చి పంపావా? అయిపోగానే మళ్లా వస్తారులే!..” అని గబగబా లోపలికి వెళ్లిపోయింది శారద.

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా అలా ఉండిపోయాడు నారాయణరావు.

‘శారద ప్లేస్‌లో ఇంకొకరుండి ఉంటే డీలా పడిపోవడమో, డిప్రషన్ లోకి వెళ్లపోవడమో, లేక ప్రాణాలు తీసుకోవడమో, లేక విడాకులు తీసుకోవడమో ఏదో ఒకటి చేసేవారు. కాని శారద చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటుంది.. నీ వ్యక్తిత్వానికి hats off తల్లీ’ అని గర్వంగా తనలో అనుకున్నాడు నారాయణరావు.

నారాయణరావు ఇల్లు వాతావారణమే మారిపోయింది.

ఆ ఊరి ధనవంతులలో అందరికన్నా మందు స్థానంలో ఉంటాడు నారాయణరావు. ఆస్తి అంతస్తులోనే కాదు దాన ధర్మాలలో, ఆపదలో ఉన్న వాళ్లని ఆదుకోవడంలో కూడా, ముందు స్థానంలో ఉంటాడు. అన్నీ ఉన్నా నారాయణరావు ఇంట్లో సంతోషఛాయలు తక్కువగానే ఉండివి.. నారాయణరావు, సుమిత్రలకు సంతానం లేకపోవడం వాళ్ల సంతోషానికి అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి.. ఆ ఇంట్లో మొదటి సారిగా సందడి, సంతోషం వివేక్ ఆ ఇంట్లో అడుగు పెట్టినాకే వచ్చింది..

వివేక్ సంతోషానికి అంతులేదు, బుజ్జి పాప పుట్టిందని.

పాపకి అమృత అని పేరు పెట్టారు.

“అత్త..య్యా.. ఎప్పుడు అమ్ము..త్ర” అనబోయి నత్తి వలన అమృత అనలేక “అమ్ము ఎప్పుడు పెద్దదవుతుంది? నాతో ఎప్పుడు ఆడుకుంటుంది?” అని ముద్దుముద్దుగా అంటున్న వివేక్‌ని దగ్గరకు తీసుకొని ముద్దాడి అంది సుమిత్ర –

“ఒక సంవత్సరం ఆగు వివేక్ బాబూ, అమృత నిలబడుతుంది, రెండో సంవత్సరం వచ్చేటప్పటికి నువ్వు దాక్కుంటే వచ్చి పట్టుకుంటుంది.. మూడు ఏళ్లు వస్తే ముచ్చటగా నీతో ఆడుకుంటుంది”.

“భలే!.. భలే.. అమ్మూ.. నవ్వుతోంది” అన్నాడు మురిసిపోతూ వివేక్.

“భలే ముద్దుగా అమ్మూ అని అంటున్నాడు వివేక్ బాబు” అని మురిసిపోయాడు నారాయణరావు.

“అంతా మేనమామ పోలికే అన్నయ్యా. వాడిలాగే కొన్ని మాటలు, పేర్లు పలకలేకపోయేవాడివి. నాన్నగారు కంగారుపడి డాక్టరుగారికి చూపిస్తే ఈ మాత్రం దానికి కంగారు ఎందుకు? Stammer, అదేనండి నత్తి, వయసు పెరిగేకొద్ది తగ్గిపోతుంది అన్నారు. గుర్తుందా అన్నయ్యా” అంది శారద నవ్వుతూ.

పకపకా నవ్వాడు నారాయణరావు.

“ఎలా మరిచిపోతాను? కాంతమ్మని పలకలేక కాకామ్మ అని అంటే ‘పెదబాబూ!.. అసలే మా ఆయన నల్లగా ఉన్నానని కాకిలా ఉన్నననేవాడు. ఇప్పుడేమో.. పెదబాబు భలేగా అంటున్నాడు, కాకా అని సరిగ్గా సరిపోయావు అని ఏడిపిస్తున్నాడు’ అనేది.”

“పంకజాన్ని అ..అం..కజం అని; వెంకయ్యని ఎంకాయ అని” – పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని నవ్వుతూ “కానీనా మేనల్లుడు మాత్రం నాలా కాకుండా ముద్దుగా అమ్మూ అంటున్నాడు so sweet” అన్నాడు నారాయణరావు.

గభాలున వచ్చి నారాయణరావు ఒళ్లో కూర్చొని “మావయ్యా మీ..రు.. మీ..రు అ..మ్ము..త్ర అనండి” అన్నాడు వివేక్.

“అమ్మూ!.. అమ్మూ!.. ఈ పేరే బాగుంది వివేక్ బాబు” అన్నాడు నారాయణరావు.

అందరూ నవ్వారు.

***

ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం ఆగుతుంది.. “అందరూ బయటకు వెళ్లి రిలాక్స్ కావచ్చు, ఫ్రెషప్ కావచ్చు” అని ఎనౌన్స్‌మెంట్ రావడం, ఫ్లైట్ ల్యాండ్ కావడం జరిగింది.

గతం నుండి గభాలున బయటకు వచ్చాడు వివేక్. ‘మావయ్యా!.. నువ్వు లేకపోతే నేను లేను. అమ్మని, నన్ను రెండు కళ్లుల్లా చూసావు. అందుకే భర్త వ్యసనపరుడైనా, నిరాశతో కృంగిపోకుండా, ధైర్యంగా నిలబడింది’ అని అనుకున్నాడు.

“ఎక్స్‌క్యూజ్ మీ!.. ఎంత సేపు ప్లైట్ ఉంటుంది?.. నేను కొంచెం వాషింగ్ రూమ్‌కి వెళ్లాలి” అని యాభై ఏళ్లు దాటిన వ్యక్తి వివేక్‌ని అడిగాడు.

“గంట ఉంటుంది.. వెళ్లండి.. ఏం పర్వాలేదు..” అని, ఏదో గుర్తు వచ్చిన వాడిలా గభాలున సెల్ తీసి అమృతకి ఫోను చేసాడు..

గభాలున ఫోను ఎత్తి, “వీవి!.. నీ ఫోను కోసమే, చూస్తూన్నాను.. ఇంకా ఎంత సేపు? త్వరగా రా.. నాన్నను చూస్తుంటే భయం వేస్తుంది. నాన్న అలా ఉంటే నేను భరించలేను.. ఎప్పటిలా నవ్వుతూ కనబడాలి.. కాని.. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారో తెలుసా?” అని వెక్కి వెక్కి ఏడ్వసాగింది అమృత.

ఏం చేయాలో తెలియని వాడిలా ఒక్క నిముషం భారంగా ఊపిరి తీసి కళ్లు గట్టిగా మూసుకొని, తెరిచి “అమ్మూ!.. ప్లీజ్.. నా మాటంటే నీకు నమ్మకం ఉందిగా.. మావయ్యకి ఏం జరగదు. అప్పుడప్పుడు మనుషులన్నాక.. ఆరోగ్యం పాడవుతుంటుంది.. కొద్ది రోజుల్లో మళ్లీ మామూలవుతారు..” అన్నాడు.

“వీవి!.. ఇంకా నేను చిన్న పాపననుకుంటున్నావా? నన్ను ఊరుకోబెట్టడానికి అలా చెబుతున్నావు” వెక్కిళ్లు పడసాగింది అమృత.

ఒక్క నిముషం మౌనం వహించి “సరే కావాలంటే నా ఫ్రెండ్ దివ్య ఫోను నెంబరు ఇస్తాను.. అడుగు.. తిరిగి నేను ఇలా మాట్లాడతాను అనుకోలేదు. కోవిడ్ వచ్చి నాకెంత సీరియస్ అయిందో తెలుసా?.. మా వాళ్లే నేను తిరిగి బ్రతికి బట్టకడతాననుకోలేదు.. ఈ విషయం చెబితే మీరందరూ కంగారు పడతారని చెప్పలేదు. డాక్టర్లు కూడా నా మీద ఆశ వదలుకున్నారు. కాని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎందుకు నీతో చెబుతున్నాననో తెలుసా?.. మనుషులన్నాక అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోదు.. అసలు మావయ్యకు ఏదైనా జరుగుతుందేమో అన్న ఆలోచన నీకెందుకు వస్తుంది? మావయ్య గురించి నీకన్నా నాకు బాగా తెలుసు.. మనుషుల్లో ఉన్న దేవుడు.. ఎంత మంది పేదవాళ్లని ఆదుకుని, వాళ్ల జీవితాలను సరిదిద్దాడో తెలుసా?.. ఎంత మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడో తెలుసా?.. తల్లిదండ్రులు గుండెల మీద కుంపటి అని భావించి ఇంట్లో నుండి బైటకు గెంటేస్తే, నర్సరీలో ఇల్లు కట్టి అందులో వృద్ధులను పెట్టి, వాళ్లకు అండగా తాను ఉన్నానన్న భరోసా కల్పించాడు. ఆ వృద్ధులందరూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు.. కనీసం రోజుకి ఒక సారయినా ఆ వృద్ధులతో కొంత సమయం గడుపుతాడు.. ఇది అంతా నాకెలా తెలుసనుకుటున్నావా? TV9 ఛానల్ వాళ్లు ఇది అంతా బ్రాడ్‌కాస్ట్ చేసారు.. కాని మావయ్య ఎక్కడ TVలో కనబడలేదు. మావయ్య మంచితనం గురించి ఇంతకన్నా నేను చెప్పలేను.. ఇంత మంచి మనిషికి ఏం జరుగుంతుంది? 100 ఏళ్లు మావయ్య బ్రతుకుతాడు.. నన్ను నమ్ము అమ్మూ” అన్నాడు వివేక్.

“బాబూ!..” గట్టిగా అరిచింది అమృత.

ఉలిక్కిపడ్డాడు వివేక్.. బాగా కోపం వచ్చినప్పుడో సంతోషం ఎక్కవైనప్పుడో బాబూ అంటుంది.. ఇప్పుడు దేనికి అన్నట్టు?..

“బాబూ!.. నువ్వు చెప్పింది ఏం నమ్మను. అస్సలు నమ్మను. ఎందుకంటే మన ఊరిలోనే ఉంటున్న నర్సరీ రాంబాబు పరమ నీచుడని అందరూ చెప్పకుంటారు. సొంత చెల్లెలు దగ్గర డబ్బు తీసుకొని బిజినెస్ పెట్టి, అది develop కాగానే చెల్లెలని చూడకుండా ఆ బిజినెస్ నాది అని బయటకు తోసేసాడు. రక్తసంబంధం.. మోసం ఎందుకు చేస్తాడనుకుంది గాని వాడే వట్టి వెదవని తెలుసుకోలేకపోయింది. తల్లిదండ్రులు నాన్న పెట్టిన ఆశ్రమంలో ఉన్నారు. చెల్లెలు సాధారణ జీవితం అనుభవిస్తుంది.. బంగారం లాంటి భార్యని ఇంటిలో పెట్టకొని, మూడు చిన్న ఇల్లులు పెట్టాడు.. మూడు ఇల్లులే కాదు.. వాడు వుమనైజర్!.. వాడిని తిట్టుకున్న వాళ్లే కాని తిట్టుకోని వాళ్లు లేరు. నాన్న మీద ఎంతో పెద్ద వయసున్నవాడు.. గుండురాయిలా ఉంటాడు.. జిర్రుమని చీదడు.. ఈ పాటికే నువ్వు చెప్పినట్లయితే వాడు మంచాన పడ్డాలి కదా? చెప్పు బాబూ!.. నిన్నే” అంది అమృత.

తన దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పగలడు? ఆలోచనలో పడ్డాడు వివేక్.

“వీవి!.. నువ్వు ఏది చెబితే అది నమ్మి, తల ఊపి, నీ చిటికన వేలు పట్టుకొని తిరిగే అమ్మూని కాను. ఇప్పుడు నా వయసు వచ్చే నెల 20వ తారీఖుకి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతంది.”

“పాపీ చిరాయువు అంటారు.. మరిచిపోయావా?..” అంది అమృత. మరు నిమిషంలో ఏడుస్తున్నట్లు వెక్కిళ్లు పడడం వినిపించింది.

బాధగా కళ్లు మూసుకున్నాడు వివేక్.. ఏదో దృఢనిశ్చయానికి వచ్చిన వాడిలా అన్నాడు.. కంఠంలో జీర.. బాధతో, ప్రేమ, అనురాగంతో నిండిన జీర నిండిన స్వరంతో అన్నాడు..

“నేను ఇప్పుడు ఏం చెప్పలేను అమ్మూ!.. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..

నువ్విలా ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నా ప్రాణం నువ్వు.. నా భవిష్యత్తుని తీర్చిదిద్దినది మీ నాన్న అయితే, నీ సహచర్యంలో.. నీ ప్రేమతో, అభిమానంతో, నీ అటపాటలతో, నీ అల్లరి పనులతో.. ఒక్కటేమిటి.. నాకు ఒక తోడు ఉంది, నేను లేకుండా అమ్మూ లేదు.. అన్న ఆనందంలో పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను.. అసలు నిన్ను విడిచి నేను ఇక్కడకు వస్తుంటే నేను ఎంత ఫీలయ్యానో తెలుసా?

నన్ను ప్రాణపదంగా చూసుకునే నా వాళ్ల మధ్య ఉండకుండా ఇలా ఇంత దూర దేశం వచ్చి ఎవరో తెలియని వాళ్ల మధ్య ఉంటున్నాను ఏమిటి? అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. నా దగ్గర ఒకే ఒక్క సమాధానం దొరికింది. నీకు తెలుసు.. చిన్నతనం నుండీ కూడా మావయ్య నన్ను డాక్టరు చదువుతావా? ఇంజనీరా అని అడిగితే రెండు కాదు.. నేను కొత్తది కనిపెడతాను అని ఏవేవో చెప్పేవాడిని.. తరువాత నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటానంటే అందరూ నవ్వేవారు. ఆ కోరికతోనే పి.హెచ్.డి. చేయడానికి వచ్చాను.. ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే నా రీసెర్చ్ పూర్తి కావడానికి, నా కల నెరవేరడానికి ఎన్నాళ్లో లేదు.. నువ్విలా ఏడుస్తూ, తినకుండా, ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే నేను ఇక USA వెళ్లను.. అర్థం అయిందా అమ్మూ” అన్నాడు వివేక్.

“ఊ.. త్వరగా వచ్చేయ్!..” అని అమృత అంటుండగానే,

“సార్ గంట అయిపోయింది” గబగబా నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి వైపు చూసాడు వివేక్.

ప్లైట్‌లో నుండి దిగినప్పుడు ఎంత సేపు ఫ్లైట్ ఉంటుందని అడిగిన వ్యక్తి.. గబగబా నడుచుకుంటూ వెళుతున్నాడు.

గభాలున వాచీ వైపు చూసాడు.. టైమ్ అయింది.. కంగారుగా అన్నాడు.

“అమ్మూ!.. టైమ్ అయింది.. నేను మార్నింగ్ కల్లా ఉంటాను ప్లీజ్!.. నా కోసం అయినా తిండి మానేసి, ఏడుస్తూ కూర్చోకు.. ఓకేనా..” అని ఫోను పెట్టేసి గబగబా ఫ్లైట్ దగ్గరకు అడుగులు వేసాడు..

ప్లైట్ బయలుదేరింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here