మేనల్లుడు-8

0
10

[అమృత, వివేక్ తమ మనసుల్లో చెలరేగుతున్న సంఘర్షణని పెద్దలు గుర్తించరు. తండ్రి బాధను గుర్తించి నిశ్చితార్థానికి ఒప్పుకోమని తల్లీ, అత్త అమృతని ఒత్తిడి చేస్తారు. చేసేదేం లేక ఇద్దరూ నిశ్చితార్థానికి అంగీకరిస్తారు. తన మనసులోని బాధని వివేక్‍కి చెబుతుంది అమృత. తాను అతన్ని అన్నయ్యలా భావించాననీ, అతనితో పెళ్ళి ఏమిటని బాధపడుతుంది. తాను దివ్యని ఇష్టపడ్డ సంగతి గుర్తొస్తుంది వివేక్‌కి. ఆసుపత్రిలో ఓ గదిలో అమృతకీ, వివేక్‌కి నిశ్చితార్థం జరిగిపోతుంది. అది చూసిన నారాయణరావు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఉద్వేగానికి లోనవుతాడు. పిల్లలిద్దరూ ఆయనకి ధైర్యం చెబుతారు. తనవి ఆనంద బాష్పాలంటాడు. నారాయణరావుని ఆపరేషన్‍ కోసం తీసుకువెళ్తారు. అనుమతి తీసుకుని, థియేటర్ డ్రెస్ వేసుకుని వివేక్ కూడా లోపలికి వెళ్తాడు. అమృత మనసులో బాధ సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. – ఇక చదవండి.]

***

“వచ్చేశావా వివేక్!..” అని ఒక్క ఉదుటున వెళ్లి గభాలున కౌగిలించుకొని “నీ తొలి స్పర్శ ఇంత అద్భుతంగా ఉంటుందని తెలియదు.. మూడేళ్ల బట్టి నువ్వు నాకు తెలుసు.. నీ పక్కనే ఉంటాను.. రోజులు గడుస్తున్నకొలది.. నీ మీద ఇంట్రస్ట్ పెరిగింది.. అభిమానం పెరిగింది.. దానికి కారణం నీ డెడికేషన్, నీ బిహేవియర్.. చాలా చాలా ఉన్నాయి. అప్పుడు నాలో ఒక ప్రశ్న బయలుదేరింది.

‘నేను నిన్ను ప్రేమిస్తున్నానా?’ అని

మరి ప్రేమంటే love at first sight అంటారు కదా? Ok అలా కాదు అనుకున్నా.. నిన్ను ఇష్టపడ్డాను. ప్రేమిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలా?.. అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను వివేక్..

వెంటనే నాకు సమాధానం దొరికింది.

డౌన్ టౌన్‌లో పెట్రోలు బంక్‌లో నల్లజాతి వాళ్లు గన్స్‌తో బెదిరించి నన్ను బందీగా తీసుకున్నప్పుడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడి, బెదిరిపోయిన నన్ను నీ ప్రేమతో మనిషిని చేసావు..

కోవిడ్ వచ్చినప్పుడు చావుతో పోరాడుతున్న నన్ను చూసేవారు లేక అనాథలా హాస్పటల్‌లో ఉన్న నన్ను విడిచిపెట్టకుండా సేవలు చేసినందుకు నీకు కూడా కోవిడ్ వచ్చింది.

నా గురించి, నా ఫ్యామిలీ గురించి తెలిసిన నువ్వు ఇన్నాళ్లు ఇంత బాధని ఒక్కదానివే ఎలా భరించావు అన్నావు.

సంతోషం షేర్ చేసుకోకపోయినా పరవాలేదు.. ఫ్రెండ్‌ని, నీ కోలీగ్‌ని.. నాతో ఎందుకు చెప్పలేదు అని ఇమీడియేట్‌గా వచ్చి ఎనభై ఏళ్ల మా తాతయ్యని కలసి ఆయనకి ధైర్యాన్నిచ్చావు..

ఇంకా చెప్పాలంటే ఆయన గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు.

నా మీద నాకు clarity వచ్చేసింది వివేక్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నుండి నిన్ను నేను విడిచిపెట్టను.”

పకపకా నవ్వి.. “నువ్వు పర్మిషన్ ఇచ్చాక..” అని గభాలున బలంగా కౌగిలించుకున్నాడు..

“వివేక్!.. హగ్ అంటే ఇద్దరు మనుషులు ఒకరంటే ఒకరి మీద ఉన్న ప్రేమని పంచుకునేది.. సంతోషాన్నిచ్చేదనుకున్నాను కాని నీ హగ్‌లో నాకు భరోసా దొరికింది. వివేక్.. ఇక నా జీవితం గురించి ఆలోచించే పనే లేదు.. ఎందుకంటే నువ్వేనా జీవితం” అని మరోసారి గట్టిగా వివేక్‌ని కౌగిలించుకుంది దివ్య.

“O.K. O.K. మరి అన్ని హగ్‌లు ఇప్పడేనా?.. ఇలా అయితే ఇద్దరం అలసిపోతాం.. రోజు.. కొంచెం.. కొంచెం చొప్పున..” అన్నాడు నవ్వుతూ..

ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో మరోసారి వివేక్ గుండె మీద తలదాచుకుంది.

“బుజ్జీ!.. బుజ్జీ.. లే తల్లి.. చాలా టైమ్ అయింది” అని వాకింగ్ స్టిక్ సహయంతో దివ్య బెడ్ దగ్గరకు వచ్చి తట్టి లేపాడు డా. రంగారావు.

తుళ్లి పడి లేచి కూర్చొని.. కంగారుగా చుట్టూ చూసి “వివేక్..” అని నసిగి.. ఎదురుగా ఉన్న డా. రంగారావు వైపు చూసింది.

పెదాలపైన కనీ కనిపించని చిరునవ్వుతో అన్నాడు డా. రంగారావు.

“బుజ్జీ.. ఇంకా వివేక్‌కి నీ మీద, నీకు వివేక్ మీద ఉన్నది ప్రేమా? కాదా? అని ఆలోచించవలసిన పని లేదు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ, అన్నీ.. అన్నీ ఉన్నాయి. వివేక్ ఊరు వెళ్లిన దగ్గర నుండి నువ్వు నువ్వులా లేవు.. మీరిద్దరూ true silent lovers. జరిగిన ఆలస్యం భర్తీ చేయలేం.. ఇంకో మాట, ‘ఆలశ్యం అమృతం విషం’ అంటారు. మంచి పని ప్రారంభించడానికి మీనమేషాలు లెక్క పెట్టకూడదు.. చెడు పని మొదలు పెట్టడానికి ఖచ్చితంగా టైమ్ తీసుకోవాలి. ఎందుకంటే మనసు మారి చేయాలనుకున్న చెడు పని మానేసే అవకాశం ఉంది” అని అన్నాడు.

“Sure తాతయ్యా!..” అని గబగబా మంచం మీద నుండి లేచింది దివ్య..

రాత్రి అంతా వివేక్ ఆలోచనలతోనే గడిపింది. ఇండియా నుండి వివేక్ రాగానే తన మనసులో మాట చెప్పేయాలనుకుంది.. ఇన్నాళ్లు వివేక్ నోటి మీదుగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దివ్యా.. మనం పెళ్లి చేసుకుందాం అని వినాలనుకుంది.. తాతయ్య చెప్పినట్లు ఇప్పటికే ఆలస్యం చేసింది. ఎన్నో మధురమైన రోజులు, సంఘటనలు, జ్ఞాపకాలను మిస్ చేసుకుంది.. ఇక ఇండియా నుండి వివేక్ రాగానే ‘ఐ లవ్ యూ’ అని నోటితో చెప్పడం కాదు, రాత్రి కలలోలా తన ప్రేమనంతా రంగరించి, గట్టిగా వివేక్‌ని హగ్ చేసుకోవాలి అని నిర్ణయానికి వచ్చింది దివ్య.

***

టిఫిన్ బాక్స్ తీసుకొని గబగబా వెళ్లిపోతున్న అమృతని చూసి శారద, సుమిత్ర ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

పని చేస్తున్న పని వాళ్లు వెళుతున్న అమృతని చూసి ఒకరి మొఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకొని..

“భగవంతుండెక్కడున్నాడు? అంత మంచి అయ్యగారికి సుస్తీ చేయడం ఏమిటి.. నిన్న అమ్మాయిగారి నిశ్చితార్థం అయినందుకు, అయ్యగారు ఆరోగ్యంగా ఉంటే పండగలా ఉండేది ఇల్లు.. కాని పాపం అమ్మాయిగారు టిఫిన్ బాక్స్, తీసుకొని ఒక్కరు వెళుతున్నారు. అమ్మాయిగారి ముఖంలో ఎక్కడ సంతోషం లేదు. ఒక పక్క ప్రాణంలా చూసుకునే తండ్రి మంచం మీద ఉంటే.. పాపం అమ్మాయిగారు..” అని అనుకోవడం విని..

“వాళ్లు చెప్పింది నిజం.. ఎంతో సంతోషంగా ఉండవలసిన ఈ ఇల్లు ఎంత కళావిహీనంగా ఉందో చూడు. అన్నట్లు మనం అమృత వెనకాలే హాస్పటల్‌కి వెళ్లొద్దు. పాపం ఒక గంటయినా వాళ్లిద్దరికి ఏకాంతం ఇద్దాం.. ఏమంటావు శారదా” అంది సుమిత్ర.

“అలాగే వదినా!.. అయినా అన్నయ్య గురించి మనం కంగారు పడవలసిన పని లేదు.. కంటికి రెప్పలా వాళ్ల మావయ్యను చూసుకుంటున్నాడు.. అమృత వాడి ప్రాణం. నిన్న నిశ్చితార్థం అయింది, అయినా హాస్పటల్ లోనే వివేక్ ఉండిపోయాడు. కనీసం ఇద్దరు కలిసి కొంచెం సేపయినా సమయం గడపలేదు” అంది శారద.

గుమ్మంలో చెప్పులేసుకుంటున్న అమృత, వాళ్ల మాటలు విని మౌనంగా ఒక్క క్షణం ఆగి బాధగా కళ్లు మూసుకొని, ‘అందరు ఒకే చట్రంలో ఇమిడిపోయారు.. బావ, మరదలు అంత వరకే ఆలోచిస్తున్నారు. అందరూ ఏ కోశానా, వీ.వీ. నా మనసుల్లో ఏం ఉందో ఆలోచించలేకపోతున్నారు. ఇద్దరూ ఒకటి కావడానికి కలిసి జీవించడానికి ఇష్టం, ప్రేమ, అభిమానం లాంటివి ఉంటే చాలనుకుంటున్నారు. కాని రెండు మనసులు కలిస్తేనే బంధం ఏర్పడుతుందని.. అలాంటి బంధంలో నుండి ఏర్పడ్డ ప్రేమ ఒకరి కోసం ఒకరు బ్రతికే లాంటి వివాహబంధాన్ని కల్గి ఉంటారని వాళ్లకు తెలియలేదు.. ప్చ్! .. ఇలాంటి పరిస్థితికి వీ.వీ అయినా తనయినా మౌనం వహించడం తప్ప ఏం చేయలేరు’ అనుకుంది.

బెడ్ మీద కళ్లు మూసుకొని ఉన్నాడు నారాయణరావు.. ఒక చేతికి సెలైన్, మరో చేతికి బ్లడ్ ఎక్కుతుంది.

ఎంతో గంభీరంగా, హుందాగా, చిరునవ్వుతో కనిపించే తండ్రిని అచేతనంగా మంచం మీద చూసి కళ్ల నిండా నీళ్లు నిండి ‘నాన్నా’ అని నారాయణరావు చేతి మీద చెయ్యి వేసింది.

కంగారుగా అమృత వైపు చూసి, “అమ్మూ! మావయ్య ఇంకా మత్తులోనే ఉన్నాడు.. మెలకువ వచ్చిన తరువాత కూడా ఎవరి కళ్ళలోనూ కన్నీటిని మావయ్య చూడకూడదు. ముఖ్యంగా తను cancer పేషంట్, బ్రతికి ఉన్నంత వరకు మందులు వాడాలి. ఏ వేళప్పుడైనా తన ప్రాణం పోతుందన్న ఆలోచన మావయ్యలో రాకూడదు. మనం.. మనిద్దరం కూడా.. ఎప్పటిలా ఉండాలి. ఏమంటావు అమ్మూ?” అని గభాలున అమృత చెయ్యి పట్టుకున్నాడు వివేక్.

అప్పటి వరకు దుఃఖాన్ని దిగమింగుతున్న అమృత “బాబూ!” అని గభాలున వివేక్ గుండె మీద వాలిపోయింది.

“అమ్మూ! ప్లీజ్! Control yourself” అని అభిమానంగా అమృత భుజం మీద చెయ్యి వేసాడు.

నిమిషాలు దొర్లుతున్నాయి.. ఏదో గుర్తు వచ్చిన దానిలా కంగారుగా దూరం జరిగింది.

చెక్ చేయడానికి రౌండ్స్‌కి డాక్టర్లు రావడంతో.. “గుడ్ మార్నింగ్ డాక్టర్” అని విష్ చేసాడు వివేక్.

రౌండ్స్ అయ్యాక.. “వీ.వి. నేనుంటాను ఇక్కడ.. అమ్మ, అత్తయ్యా నా వెనకాలే బయలుదేరుతున్నారు. ఇంటికి వెళ్లి నువ్వు రెస్ట్ తీసుకో” అంది అమృత.

“O.K!..” అని గబగబా దగ్గరకు వచ్చి “అమ్మూ!.. ప్లీజ్!.. ఏం ఆలోచించకు.. సరేనా..” అని కళ్ల మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి పెట్టి, చెయ్యి పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టి, “నేను వెళతాను” అని గబగబా బయటకు అడుగులు వేసాడు.

‘ఆలోచించకుండా ఎలా ఉండను వీ.వి.. నీ ప్రేమలో అమ్మ, నాన్నా.. ఆప్తులు.. స్నేహితులు కనబడుతున్నారు.. ఈ ప్రేమని నా చెయ్యి పట్టుకొని, జీవితాతం నాకు తోడు నీడగా ఉండే, ప్రియాతి ప్రియమైన, నా మనసులో స్థానం అందుకునే వ్యక్తి ప్రేమగా ఎలా అంగీకరించగలను? బాబూ!.. మనిద్దరి మధ్యనున్న ప్రేమని ఆ ప్రేమతో ముడిపెట్టలేను’ అనుకుంటూ బాధగా కళ్లు మూసుకుంది అమృత.

ఇంటికి వెళ్లిన వివేక్ ఫ్రెషప్ అయి, గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాడు.. బాధగా కళ్లు మూసుకున్నాడు.. కళ్లల్లో దివ్య మెదిలింది.. పాపం దివ్య.. తన మీద పంచప్రాణాలు పెట్టుకుంది. తన మనసులో మాట చెప్పడానికి ఎంతో సంశయించింది. తనకు తెలియకుండానే దివ్యతో జీవితం గురించి ఎన్నో కలలు కంటున్నాడు. తను I love you చెప్పాలని నిర్ణయానికి వచ్చాడు. కాని ప్చ్.. అనుకోకుండా మావయ్యకి ఇలా కావడం.. తనకి అమృతతో పెళ్లి చేయాలని గట్టి నిర్ణయానికి రావడం, కాదు, కూడదు, అని చెప్పే అవకాశం లేకపోవడం.. ఈ బాధని ఎవరితోను షేర్ చేసుకోలేడు. లేదు..లేదు.. తన బాధని షేర్ చేసుకునే వ్యక్తి ఒకే ఒకరున్నారు.. అది ఎవరో కాదు దివ్య.. యస్, దివ్యతో తన బాధ అంతా చెప్పేయాలి, అప్పుడే తన గుండె తేలికపడుతుంది..

ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యకు పరిష్కారం దొరికినా, అది హాని కల్గించే పరిష్కారం అయితే.. సమస్య.. సమస్యగానే ఉన్నా పరవాలేదు.. ముందు దివ్యతో మాట్లాడాలి. ఇప్పుడు తనకి అర్ధరాత్రి.. తన దగ్గర నుండి ఫోను వచ్చిందన్న సంతోషం ముందు అర్ధరాత్రి అయినా దివ్య పట్టించుకోదు అని వివేక్ ఫోను చేయాలనుకునేలోగానే దివ్య దగ్గర నుండి ఫోను రావడం చూసి సంతోషంగా

“ఏయ్! దివ్యా!.. What a surprise. నేనే నీకు ఫోను చేద్దాం అనుకుంటున్నాను. Midnight అని ఆలోచిస్తున్నాను. ఏంటి ఇంకా నిద్రపోలేదా? ఇంకా మెలకువగా ఉన్నావా?” అన్నాడు వివేక్.

“నిజం చెప్పాలంటే.. నువ్వు వెళ్లిన దగ్గర నుండి ఇంచుమించు సరిగ్గా నిద్ర పోలేదనే చెప్పాలి. నీతో పరిచయం అయి ఎన్నో ఏళ్లు అయింది. ప్చ్!.. ఇన్నాళ్లు ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూనట్లు ఎప్పుడు ఆలోచించలేదు వివేక్. ‘ఎందుకిలా?’ అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను జవాబు దొరికేసింది.

నేను కోరుకున్న నాకు ప్రియమైన, ఇష్టమైన నా వివేక్ నా ఎదురుగానే ఉన్నాడన్న తృప్తితో, సంతోషంతో బాగానే ఉండగలిగాను. మన రీసెర్చ్ అయి, మనం ఇద్దరం ఒకటయ్యే రోజు ఎప్పుడా అని లెక్కలు వేసుకుంటున్నాను. సడన్‌గా నువ్వు నాకు దూరం అయ్యేటప్పటికి తట్టుకోలేకపోతున్నాను వివేక్.

పసివాడు చేతిలో బొమ్మ ఎవరైనా లాక్కుంటే గుక్క పెట్టి ఏడుస్తాడు.. కాని నాకా అవకాశం కూడా లేదు.

ఏయ్! దివ్యా!.. ఎప్పుడు లేనిది నీ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటున్నావా?

ప్చ్!.. ఆశ్చర్యం కాదు వివేక్!.. ఎవరైనా ప్రేమలో పడనంత వరకే.. ఒకసారి ఆ ప్రేమ మనసులో ఏర్పడ్డాక నాలాగే మాటాడుతారు.. నువ్వు నా నుండి దూరం అయినాక కాని నాకు తెలియలేదు.

ప్రేమించే మనసు అవతల వ్యక్తి దూరం అయితే తట్టుకోలేదా? భరించలేదా?.. పిచ్చెక్కిపోతుందా? అని ఆలోచిస్తే అవును.. అవును.. అవును అని ఆ ఒక్క సమాధానమే దొరుకుతుంది.

ఇన్నాళ్లు నువ్వు నా దగ్గరగా, నా ఎదురుగా ఉన్నప్పుడు నేను చాలా హేపీగా ఉన్నాను. కాని ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాను.. ఏమైంది నాకు ? పిచ్చిగాని పట్టిందా? ఇందుకు జవాబు దొరికింది వివేక్..

ప్రేమ! ప్రేమకి అంత పవర్ ఉంది. అందుకే ఎన్ని తరాలు మారుతున్నా చరిత్రలో ప్రేమ కథలు అలా చిరస్థాయిగా నిలిచిపోయాయి.

సుడిగుండంలో పడ్డ మనిషి పైకి ఎలా రాలేడో, ప్రేమలో.. నిజమైన.. ట్రూ లవ్‌లో పడ్డ మనిషి కూడ ప్రేమకి దూరం కాలేడు.

నేను అంతే! వివేక్.

ఎందుకంటే.. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లు నేను నీ ప్రేమలో.. ఆ బిచ్చగాడిలా తయారయ్యాను వివేక్!.. ప్లీజ్.. నన్ను పిచ్చిదాన్ననుకున్నా పరవాలేదు.. నువ్వు వచ్చినా సరే.. లేదా నేను ఒక్కసారి అక్కడికి వచ్చి.. నిన్ను గట్టిగా హగ్ చేసుకొని, వీలయితే కాసేపు నీ ఒడిలో పడుకొని.. రిలాక్స్ అయి తిరిగి వెళ్లిపోతాను.. ప్లీజ్! వివేక్ నవ్వుకోకు..

నీకెలా ఉందో, నీ ఫీలింగు ఏమిటో నాకు తెలియదు. నా గురించి మాత్రమే చెబుతున్నాను వివేక్.. ఇంకో విషయం కూడా అర్థమయింది వివేక్..

ఇన్నాళ్లు మనుషులు బంధాలను తెంచుకొని దూరంగా వెళ్లిపోతుంటారు.. ఎందుకలాంటి పిచ్చి పని చేస్తారని అనుకునే దానిని. కాని నువ్వు నాకు దూరం అయినాక అర్థం అయింది.

దూరం.. ఎంత దూరం పెరిగితే మనుషులు అంత దగ్గరవుతారు.

నువ్వు దూరం అయిన దగ్గర నుండి నాకు ఇంకా దగ్గిరయిపోయావు వివేక్.. ఎంత దగ్గరంటే.. ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావన్న భయం ఒక ప్రక్క, దూరం మమ్ములను ఇంకా దగ్గిర చేస్తుందన్న సంతోషం మరో ప్రక్క. OK.. OK.. చాలా.. చాలా.. నిన్ను బోర్ కొట్టించేసినట్టున్నాను.. ఎందుకంటే నిన్ను మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడుతున్నాను. ముందు నీకు పెద్ద సారీ! అక్కడ మీ అంకుల్ ఆరోగ్యం ఎలాగుంది అని అగడకుండా నిన్ను బాధ పెడితే I am sorry.. Please excuse me.. ఈ పిచ్చి వాగుడంతా నీ వల్లే, వివేక్ ఎందుకంటే ‘నేను నేను కాదు’. నాలో.. నాలో ఉన్నది నువ్వే!..”

నిశ్శబ్దం!..

కాసేపటిలో ఊపిరి గట్టిగా పీల్చి, ఏడుస్తూ, పైకి వినబడడం ఇష్టం లేని దానిలా, గొంతు సవరించుకొని, “చెప్పు వివేక్?.. మీ అంకుల్ ఎలా ఉన్నారు?” అంది దివ్య.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here