మేరా భారత్ మహాన్

0
9

[dropcap]“ను[/dropcap]వ్వు చెప్పే మాటలకి, చేసే చేష్టలకి ఏం సంబంధం లేదురా” నిష్ఠూరంగా నిలదీసాడు కృష్ణారావు.

“ఏమైందిరా?” అడిగాడు అతని చిన్ననాటి స్నేహితుడైన వెంకటేషు.

“ముష్టి డాలర్ల కోసం కన్నవాళ్ళని ఇక్కడొదిలి, విదేశాలలో ఊడిగం చేస్తున్న పిల్లల్ని నువ్వు విమర్శించేవాడివి కదా! మరి నువ్వు చేసిందేమిటి?” నిలేసాడు కృష్ణారావు.

“నేను చేసింది కరెక్టే కదా!” తడుముకోకుండా సమర్థించుకున్నాడు వెంకటేషు.

“ఏమిటి! నీ పెద్ద కూతుర్ని మహారాష్ట్రలోని వాడికి, చిన్న కూతుర్ని గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్నవాడికిచ్చి పెళ్ళి చేసి, నువ్వు మాత్రం కన్నబిడ్డలకి దూరంగా ఉండట్లేదూ?”

“ఓహ్! అదా? అది తప్పెలా అవుతుంది. కూతుర్నెపుడూ అత్తారింటికి పంపించాల్సిందే కదా! వాళ్ళు ఎంతదూరంలో వున్నా మా మనసులకి దగ్గరగానే ఉంటారు. అదీకాక వాళ్ళ వల్ల మాకు లాభమే కానీ, నష్టం ఏమాత్రం లేదు కదా!” చెప్పాడు తాపీగా వెంకటేషు.

“ఎలాగా?” అర్థంకాక చూసాడు కృష్ణారావు.

“వాళ్ళు ఇతర రాష్ట్రాలలో ఉండటం వల్లనే మేము ఆ ప్రాంతాలలో చూడతగ్గ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు క్షుణ్ణంగా తెలుసుకొని చాలా చక్కగా చూసి ఎంజాయ్ చెయ్యగలిగాము. నిజంగా వాళ్ళు ఆ ప్రాంతాలలో ఉద్యోగస్థులు కాకపోయుంటే మేకు ఎన్నటికీ ఆయా ప్రదేశాలు చేసే భాగ్యం కలిగుండేది కాదు! అదీకాక మేము అలా ఇతర రాష్ట్రాలు చూసిరావడం వల్ల టూరిజం డెవలప్ అయ్యి మన దేశ ఆర్థిక వ్యవస్థకి లాభమే కాని నష్టం కాదుకదా” అసలు విషయం విడమరిచి చెప్పాడు వెంకటేషు. మేరా భారత్ మహాన్ అనే విధంగా నిరూపించుకున్న అతని తెలివితేటలకి నిజంగా అభినందించకుండా ఉండలేకపోయాడు కృష్ణారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here