[సంచిక పాఠకుల కోసం ‘మెహబూబా’ అనే సినిమా లోని ‘మేరే నైనా సావన్ భాదోఁ’ పాటని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
‘మెహబూబా’ (1976) చిత్రంలోని ‘మేరే నైనా సావన్ భాదోఁ’ ఒక హాంటింగ్ మెలడీ. సినిమాలో కూడా హాంటింగ్ ఒక ప్రధానాంశం. హాంటింగ్ అంటే ‘ఆత్మలు తిరగటం’ అనే అర్థం కూడా ఉంది. పునర్జన్మ ఇతివృత్తంగా వచ్చిన చిత్రమిది. ఇలాంటి సినిమాలకి ఒక థీమ్ సాంగ్ చాలా అవసరం. సినిమా పొడుగునా ‘మేరే నైనా’ పాట చాలా సార్లు వస్తుంది. ఆర్.డి.బర్మన్ అద్భుతమైన ట్యూన్ కట్టారు. లతా మంగేష్కర్, కిశోర్ కుమార్ అంతే అద్భుతంగా పాడారు. గీత రచయిత ఆనంద్ బక్షీ ప్రతిభకి తార్కాణంగా నిలిచిపోయిందీ పాట.
అ/ఆ: మేరే నైనా సావన్ భాదోఁ
ఫిర్ భీ మెరా మన్ ప్యాసా
అ/ఆ: అయ్ దిల్ దీవానే, ఖేల్ హై క్యా జానే
దర్ద్ భరా యే గీత్ కహాఁ సే
ఇన్ హోఠోఁ పే ఆయే, దూర్ కహీఁ లేజాయే
భూల్ గయా క్యా, భూల్‌కే భీ హై
ముఝ్‌కో యాద్ జరాసా ॥ఫిర్ భీ॥
అ/ఆ: బాత్ పురానీ హై, ఏక్ కహానీ హై
అబ్ సోచూఁ తుమ్హే యాద్ నహీఁ హై
అబ్ సోచూఁ నహీఁ భూలే, వో సావన్ కే ఝూలే
ఋత్ ఆయే ఋత్ జాయే దేకర్
ఝూఠా ఏక్ దిలాసా ॥ఫిర్ భీ॥
ఆ: బర్‌సోఁ బీత్ గయే హమ్‌కో మిలే బిఛ్‌డే
బిజురీ బన్‌కే గగన్ పే చమ్‌కే
బీతే సమయ్ కీ రేఖా, మైనే తుమ్‌కో దేఖా
తడప్ తడప్‌కే ఇస్ బిరహన్ కో
ఆయా చైన్ జరాసా ॥ఫిర్ భీ॥
అ: బర్‌సోఁ బీత్ గయే హమ్‌కో మిలే బిఛ్‌డే
బిజురీ బన్‌కే గగన్ పే చమ్‌కే
బీతే సమయ్ కీ రేఖా, మైనే తుమ్‌కో దేఖా
మన్ సంగ్ ఆంఖ్ మిచోలీ ఖేలే
ఆశా ఔర్ నిరాశా ॥ఫిర్ భీ॥
ఆ: ఘుంఘ్‌రూ కీ ఛమ్‌ఛమ్ బన్ గయీ దిల్ కా గమ్
డూబ్ గయా దిల్ యాదోఁ మేఁ ఫిర్
ఉభ్‌రీ బేరంగ్ లకీరేఁ, దేఖో యే తస్‌వీరేఁ
సూనే మహల్ మేఁ నాచ్ రహీ హై
అబ్ తక్ ఎక్ రక్కాసా ॥ఫిర్ భీ॥
ముందు కథ ఏమిటో చూద్దాం. మామూలు కథే. ఒక రాజు కొలువులో ప్రకాష్ అనే సంగీతవిద్వాంసుడు, రత్న అనే రాజనర్తకి ఉంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ప్రకాష్‌కి చిన్నతనంలోనే పెళ్ళయింది. అది అతనికి తెలియదు. రత్న ఒక నాట్యకత్తె కూతురు. తండ్రి ఎవరో తెలియదు. ప్రకాష్‌కి పిల్లనిచ్చిన జమీందారు అతని పెళ్ళి సంగతి అతనికి చెబుతాడు. ప్రకాష్ తనకేమీ వద్దని, రత్నని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. ప్రకాష్‌కి, అతని భార్యకి అడ్డు రాకూడదని రత్న “నీతో వస్తే ఈ భోగాలన్నీ వదులుకోవాలి” అని అతని మనసు విరిచేస్తుంది. అయితే ప్రకాష్‌కి తర్వాత రత్న హృదయం అర్థమవుతుంది. రత్నని తీసుకుని ఊరు విడిచి వెళుతుంటే అతని మామగారు అడ్డుపడతాడు. తప్పించుకుని పారిపోతుంటే ఒక లోయలో పడి ప్రకాష్, రత్న మరణిస్తారు.
ప్రకాష్ సూరజ్‌గా పుడతాడు. అతనో పాప్ గాయకుడు. ఒక ప్రోగ్రాముకి వెళుతూ తుఫాన్లో చిక్కుకుని ఒక బంగళాకి వెళతాడు. అక్కడ రత్న కనిపిస్తుంది. కాపలాదారు కూతురిని అంటుంది. మర్నాడు ఆమె పాట పాడుతుంటే ఆమె వెంట అతను వెళతాడు. ఒక రాజమహలుకి వెళతాడు. అక్కడ రత్న చిత్తరువు ఉంటుంది. రత్న ఎప్పుడో చనిపోయిందని తెలుస్తుంది. ఆ చిత్తరువు చూడగానే అతనికి గతం గుర్తొస్తుంది. అయితే స్నేహితులు ఇదంతా భ్రమ అంటారు. సూరజ్ కూడా ఇదంతా మరచిపోవటానికి ప్రయత్నిస్తాడు. విహారయాత్రకి ఒక కొండప్రాంతానికి వెళతాడు. అక్కడ రత్న పోలికలతో ఝుమ్‌రీ కనిపిస్తుంది. ఆమెకి గతం గుర్తు లేదు. అతను ఆమెని రాజమహలుకి తీసుకెళ్ళి ఆమె చిత్తరువు చూపిస్తాడు. ఆమెకి గతం గుర్తు వస్తుంది. అయితే ఆమెని పెళ్ళి చేసుకోవాలని ఆశపడే ఒకతను వారికి అడ్డు నిలుస్తాడు. సూరజ్ స్నేహితులు కూడా ఆమెని వదిలేయమని అతనికి చెబుతారు. చివరికి తమ జన్మాంతర బంధం గురించి అందరికీ చెప్పి అతను ఆమెని చేపడతాడు.
చిత్రంలో కొన్ని సన్నివేశాలు గొప్పగా ఉంటాయి. రత్న “మాలాంటి వాళ్ళకి తల్లి ఉంటుంది కానీ తండ్రి ఉండడు” అని ప్రకాష్‌తో మొదట్లోనే చెబుతుంది. ప్రకాష్ తనని అసహ్యించుకోవచ్చు అని తెలిసి కూడా ఆమె నిజాయితీగా ఉంటుంది. తర్వాత ప్రకాష్ తనకి జరిగిన పెళ్ళి పెళ్ళి కాదని, రత్నతోనే తన జీవితం అని రత్నని గుడికి రమ్మంటాడు. దేవుడి ముందు ఆమెని స్వీకరించాలని. రత్న గుడికి వెళ్ళే సమయానికి ప్రకాష్ ఇంకా రాలేదు. రత్న భక్తిపారవశ్యంలో గర్భగుడిలోకి వెళుతుంటే పూజారి ఆపుతాడు. “రాజనర్తకి లాంటి వాళ్ళకి ప్రవేశం లేదు” అంటాడు. ఒక స్త్రీ ఆమెకి మద్దతుగా నిలుస్తుంది. రత్నని తనతో లోపలికి తీసుకువెళుతుంది. ఆ స్త్రీ ప్రకాష్ భార్య. లోపలికి వెళ్ళాక “నీ కోరికా నా కోరికా ఒకటే. ఇద్దరమూ ప్రకాష్‌నే కోరుకుంటున్నాము. దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడో చూద్దాం” అంటుంది. ఆమెకి రత్న, ప్రకాష్‌ల బంధం గురించి తెలియదని అనుకుంటున్న ప్రేక్షకులకి ఈ మలుపు ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు శక్తి సామంతా నైపుణ్యానికి ఇదో మచ్చుతునక. ప్రకాష్, సూరజ్ పాత్రలలో రాజేష్ ఖన్నా; రత్న, ఝుమ్‌రీ పాత్రలలో హేమమాలిని నటించారు. ప్రకాష్ భార్య పాత్రలో యోగితా బాలి నటించింది. మైసూరు రాజమహల్లో ‘మేరే నైనా’ పాట చిత్రీకరించటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
ఇక పాట విషయానికి వద్దాం:
మేరే నైనా సావన్ భాదోఁ
ఫిర్ భీ మెరా మన్ ప్యాసా
నా కనులు శ్రావణభాద్రపదాలు
అయినా నా మనసుకి దాహమే
~
తెలుగులో ‘కనులు శ్రావణమేఘాలు’ అనే ప్రయోగం ఉంది. హిందీలో ‘సావన్ భాదోఁ’ అంటే శ్రావణభాద్రపదాలు. ఈ మాసాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి వర్షర్తువుని ‘సావన్ భాదోఁ’ అంటారు. కళ్ళు వర్షిస్తున్నాయి కానీ మనసుకి దాహం తగ్గటం లేదు అని భావం. వర్షం వస్తే దాహం తీరటం భౌతికమైన విషయం. కళ్ళు వర్షిస్తే మానసికమైన ఆర్తి తీరదు. భౌతికమైన విషయాన్ని, మానసికమైన విషయాన్ని కలిపి విరోధాభాస సృష్టించారు బక్షీ.
అయ్ దిల్ దీవానే, ఖేల్ హై క్యా జానే
దర్ద్ భరా యే గీత్ కహాఁ సే
ఇన్ హోఠోఁ పే ఆయే, దూర్ కహీఁ లేజాయే
భూల్ గయా క్యా, భూల్‌కే భీ హై
ముఝ్‌కో యాద్ జరాసా?
ఓ వెర్రి మనసా, ఏమిటీ దోబూచులాట
బాధతో పొంగి పరవళ్ళుతొక్కే ఈ పాట ఎక్కడినుంచో-
ఈ పెదాలపైకి వచ్చింది, ఎక్కడికో తోడ్కొని వెళ్ళింది
మరుగున పడిందా, లేక అనుకోకుండా
కాసింత నాకు గుర్తుందా?
~
ఈ చరణం ప్రకాష్‌కి పెళ్ళయిందని తెలిసినపుడు రత్న పాడుతుంది. ప్రకాష్ తనని మోసం చేశాడనుకుంటుంది. ఒక నాట్యకత్తె కూతురైన తాను ప్రకాష్‌పై అన్ని ఆశలు ఎందుకు పెట్టుకున్నానా అని తనని తాను నిందించుకుంటుంది. తన తల్లి పడిన క్షోభ ఆమె చూసింది. అదే విషాదగీతమై ఆ పెదాలపై నిలిచింది. ఆ క్షోభ గుర్తుందా లేదా అని తనని తానే ప్రశ్నించుకుంటోంది. తమ జీవితాల్లో ఆ బాధ ఎప్పటికీ ఉండేదే అని ఆమె భావన. ప్రకాష్ తనని ఆటబొమ్మ లాగే భావించాడని ఆమె ఆవేదన. ప్రకాష్ చేసిన బాసలు నమ్మి గతం మరచిపోయింది. ఇప్పుడు ఆ గతాన్నే గుర్తు చేసుకుని నిర్వేదంలో మునిగిపోయింది.
ఇదే చరణం ఝుమ్‌రీని చూసిన తర్వాత సూరజ్ పాడతాడు. చరణం అదే అయినా వేరే అర్థం స్ఫురించేలా బక్షీ రాశారు. రత్న గతజన్మలో పాడిన పాటే ఇది. ఇప్పుడు అది సూరజ్ పెదవుల పైకి వచ్చింది. ఆ పాట విని ఝుమ్‌రీకి మనసులో అలజడి రేగుతుంది. రత్న ఒక అభూతకల్పన అని మర్చిపోదామనుకున్న అతనికి ఝుమ్‌రీ మళ్ళీ రత్నని గుర్తు చేసింది. ఆమెకి మాత్రం ఏమీ గుర్తు లేదు. ఈ క్షోభని కిశోర్ కుమార్ అద్భుతంగా పలికించాడు.
బాత్ పురానీ హై, ఏక్ కహానీ హై
అబ్ సోచూఁ తుమ్హే యాద్ నహీఁ హై
అబ్ సోచూఁ నహీఁ భూలే, వో సావన్ కే ఝూలే
ఋత్ ఆయే ఋత్ జాయే దేకర్
ఝూఠా ఏక్ దిలాసా
ఇప్పటి మాట కాదు ఈ కథ
నీవు మరచావని ఊరుకుంటాను ఒకసారి
మళ్ళీ అనుకుంటాను నీవా వలపు డోలలు మరువలేదని
ఋతువులు మారిపోతున్నాయి-
ఉత్తుత్తిగా నను ఊరడిస్తూ ( ఒక ఆబధ్ధపు ఆశను కల్పిస్తూ)
~
రత్న ఆత్మ పాడినపుడు ఇది సూరజ్‌ని ఉద్దేశించిన చరణం. ఇదే చరణం సూరజ్ ఝుమ్‌రీని ఉద్దేశించి పాడతాడు. ‘మరచిపోయావని నిరాశ పడతాను. ఇంతలో మరువలేదులే అని సర్దిచెప్పుకుంటాను’ అనే భావన భగ్నప్రేమికులలో ఉండే భావన. ఈ ఊగిసలాటని అందంగా చెప్పారు బక్షీ. ఉత్తరాదిలో ‘సావన్ కే ఝూలే’ అనే పద్ధతి ఉంది. వర్షంలో పడతులు ఉయ్యాలలూగుతారు. ఇవి ముఖ్యంగా వలపుకి సంకేతాలు. కృష్ణుడు రాధని ఇలా ఉయ్యాల ఊపాడని ఒక కథనం. వలపుకి సంకేతంగా ఆ ఊయలలని ఇక్కడ ప్రస్తావించారు. రత్న ఆత్మ ఎన్నేళ్ళ నుంచో వేచి ఉంది. పై ఋతువులో అతను వస్తాడులే అనే ఆశతో ఆమె ఎన్నో ఋతువులు వేచి చూసింది. సూరజ్ ఝుమ్‌రీని చూశాక ఋతువులు మారిపోతున్నాయి అనటం సబబుగా ఉండదు. బక్షీ అనుకుంటే వేరే పంక్తులు రాసేవారు. ఇక్కడ భావం బావుందని వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఓ ప్రశ్న – రత్న ఝుమ్‌రీగా పుట్టింది కదా, మళ్ళీ ఆత్మ ఏమిటి? సినిమా కదా, వదిలేయండి.
ఆ: బర్‌సోఁ బీత్ గయే హమ్‌కో మిలే బిఛ్‌డే
బిజురీ బన్‌కే గగన్ పే చమ్‌కే
బీతే సమయ్ కీ రేఖా, మైనే తుమ్‌కో దేఖా
తడప్ తడప్‌కే ఇస్ బిరహన్ కో
ఆయా చైన్ జరాసా
ఏళ్ళు గడచిపోయాయి మనం విడిపోయి
నింగిలో మెరుపులా మెరుస్తోంది-
గడచిన కాలపు రేఖ, ఇన్నాళ్ళకి నిన్ను చూశాను
తపించి తపించి ఈ విరహిణికి
కాస్త ఊరట దక్కిందీనాటికి
~
రత్న ఆత్మకి గతం నింగిలో మెరుపులా మెరుస్తూ గుర్తొస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళకి అతను మళ్ళీ అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి ఆమెకి కాస్త మనశ్శాంతి లభించింది. ఇది స్త్రీ స్వభావానికి దర్పణం పడుతుంది. ఒకసారి అతన్ని చూస్తే ఆమె ఊరట పొందింది. సూరజ్‌కి ఝుమ్‌రీ కనిపించాక అతనిలో భావాలు వేరుగా ఉంటాయి. చరణం ఎత్తుగడ అలాగే ఉన్నా చివరికి భావం మారుతుంది. అదెలాగ అంటే-
అ: బర్‌సోఁ బీత్ గయే హమ్‌కో మిలే బిఛ్‌డే
బిజురీ బన్‌కే గగన్ పే చమ్‌కే
బీతే సమయ్ కీ రేఖా, మైనే తుమ్‌కో దేఖా
మన్ సంగ్ ఆంఖ్ మిచోలీ ఖేలే
ఆశా ఔర్ నిరాశా
ఏళ్ళు గడచిపోయాయి మనం విడిపోయి
నింగిలో మెరుపులా మెరుస్తోంది-
గడచిన కాలపు రేఖ, అందులో నిన్ను చూశాను
మనసుతో దాగుడుమూతలాడుతున్నాయి-
ఆశనిరాశలు రెండూ
~
ఝుమ్‌రీని చూసిన సూరజ్ ‘ఇన్నాళ్ళకి నిన్ను చూశాను. ఆశనిరాశలు నాతో దాగుడుమూతలాడుతున్నాయి’ అంటున్నాడు. పురుషుడు తను కోరుకున్న స్త్రీ తనకి దక్కాలనుకుంటాడు. అది పురుషుడి స్వభావం. ఆమె మనసు మారుతుందని ఆశ ఒకవైపు, మారదేమో అని నిరాశ ఒకవైపు.
ఆ: ఘుంఘ్‌రూ కీ ఛమ్‌ఛమ్ బన్ గయీ దిల్ కా గమ్
డూబ్ గయా దిల్ యాదోఁ మేఁ ఫిర్
ఉభ్‌రీ బేరంగ్ లకీరేఁ, దేఖో యే తస్‌వీరేఁ
సూనే మహల్ మేఁ నాచ్ రహీ హై
అబ్ తక్ ఎక్ రక్కాసా
గజ్జెల గలగలలు మనసుకి వేదనయ్యాయి
మనసు జ్ఞాపకాలలో మునిగింది మళ్ళీ
రంగుల్లేని గీతలతో వేసిన ఈ చిత్తరువులు చూడు
నిర్జనమైన మహల్లో ఆడుతోంది
ఇప్పటికీ ఒక నాట్యకత్తె
~
ఇది కేవలం రత్న ఆత్మ పాడే చరణం. ‘రంగుల్లేని గీతలతో వేసిన చిత్తరువులు’ అద్భుతమైన ప్రయోగం. ఆమె జ్ఞాపకాలు రుంగుల్లేని చిత్తరువుల్లా ఉన్నాయి. నాట్యకత్తె అయినందు వలన ఆమెకి కోరుకున్నది దక్కలేదు. అదే ఆమె మనసులో ఉండిపోయింది. ఆ గతమే ఒక నాట్యకత్తెలా మారి శ్మశానం లాంటి రాజమహల్లో నాట్యం చేస్తుంటే ఆ గజ్జెల గలగలలు ఆమెకి భరింప శక్యం కాకుండా ఉన్నాయి. ఈ చరణంలో ఉర్దూ పదాలు ఎక్కువ ఉన్నాయి. లకీరేఁ (గీతలు), తస్‌వీరేఁ (చిత్తరువులు), రక్కాసా (నాట్యకత్తె) – ఇవన్నీ ఉర్దూ పదాలే. ఆనంద్ బక్షీకి హిందీలోనే కాదు, ఉర్దూలో కూడా పాండిత్యం ఉందనటానికి ఈ చరణం నిదర్శనం.
Images Credit: Internet