మెస్రం వంశస్తుల ఇలవేల్పు నాగోబా..

0
10

[dropcap]తె[/dropcap]లంగాణాలోని ప్రసిద్ధ ఆదివాసీయుల క్షేత్రాలలో కేస్లాపూర్ ఒకటి.  చరిత్ర రీత్యా,  పౌరాణిక రీత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఇది ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న మెస్రం వంశానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇచ్చట ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా దేవాలయం కలదు.

ఆదివాసీలు పుష్యమాసాన్ని పరమ పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పుష్యమాసంలో ఇచ్చట ప్రతి సంవత్సరం అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతర అమావాస్య రోజున ప్రారంభమవుతుంది.

ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరగా చెప్పవచ్చు. లక్షల మంది జనసందోహం మద్య అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీల కుంభమేళాకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అదివాసీ భక్తులు, మెస్రం వంశీయులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.

రూ. ఐదు కోట్లతో ఆలయం:

మెస్రం వంశస్తులు నాగోబాను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. నాగోబాను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని వీరి నమ్మకము. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకంటే పూర్వం నిజాం ప్రభుత్వకాలంలో తొలి సారిగా కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద 1942లో ఒక గుడిసెను నిర్మించి నాగోబా పూజలు చేయడం ప్రారంభిచారు. 1956లో తొలిసారిగా నాగోబా దేవుడికి చిన్నగా గుడి కట్టారు. 1995 లో సిమెంట్ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించారు. కాలానికి అనుగుణంగా ఆలయాన్ని భక్తుల తాకిడి పెరిగే కొద్ది ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ సహాకారంతో 2000లో ఆలయనిర్మాణం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిషా మొదలగు రాష్ట్రల నుండి మెస్రం వంశస్తులతో పాటు ఆదివాసీలు, భక్తులు భారీ సంఖ్యలో నాగోభాను దర్శించుకోవడం జరుగుతుంది. మెస్రం వంశీయుల కుటుంబాల సంఖ్య పెరగడం, వీరు ప్రతి సంవత్సరం సభలు సమావేశాలు నిర్వహించి దేవాలయానికి సంబంధించిన ఆలయ నిర్మాణం గురించి 2011లో సంకల్పం పన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను ఆలయ పీఠాధిపతి గ్రామ పటేల్ మెస్రం వేంకట్ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా సరికొత్త ఆలోచనతో ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ప్రతి మెస్రం ఇంటి నుండి ప్రతి సంవత్సరం ఐదు వేలు చొప్పున, ప్రభుత్వ ఉద్యోగుల నుండి పది నుండి పదిహేను వేలు, సర్పంచులు జడ్పీటీసిలు, యంపిటీసిలు, మండల అధ్యక్షులు ఇలా ప్రజాప్రతినిధుల నుండి ఏడు వేలు చొప్పున ఇలా ఐదు సంవత్సరాలు చందాలు వసూలు చేసి నిధులు సమకూర్చారు. దాదాపు రూ. 5 కోట్ల డబ్బులు జమ చేసి 2017లో నాగోబా, సతీదేవత ఆలయ నిర్మాణం ప్రారంభించారు.

ప్రణాళికాబధ్ధంగా పనులు:

దేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కలలు కన్నారు, సాకారం చేశారు. ఆధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. నగరాల నుండి గ్రానైట్ రాళ్ళు తీసుకోవచ్చారు.

నాగోబా ఆలయల నిర్మాణానికి, ఇంజినీర్లతో, తయారీదారులతో సమావేశమై వారి సలహాలు సూచనలను పాటించారు. ఆలయానికి రాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించారు. ఆలయం చుట్టూ ప్రాకారం నాలుగు దిక్కులా గుడి రాజగోపురాల నిర్మాణం చేశారు. మండపంలోని ప్రతి రాతి స్థంభాల పై గోండ్వానా రాజ ముద్రను చెక్కించారు. ఆదివాసీల, ఆచార వ్వవహారాలను అబ్బురపరిచే రీతీలో అద్భుతమైన శైలిలో రాతి స్థంభాలను చెక్కించారు.

నాగోబా విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతంలో లభించే ప్రత్యేకమైన శిలతో తయారు చేయించారు. ఆలయ గర్భగుడి ప్రధాన ముఖద్వారానికి ఇరువైపులా రెండు పాములు కలిసి ఏడు తలలు ఉండేలా చెక్కారు.

ఇలా ఆధునాతున హాంగులతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్ది ఆలయం గోడలపై ‘జై లింగో జై జంగో’, ‘జై గోండ్వానా’, ‘జై సేవా’, ‘జై పెర్సాపేన్’ చిహ్నాంతో అందంగా చెక్కిదిద్దారు, ప్రాంగణంలో ధ్వజస్థంభం, కోనేరు ఏర్పాటు చేశారు. గర్భగుడి ముఖ ద్వారానికి ఆంగ్ల అక్షరాలతో గోండి భాషలో BHUYGOTE THAMUN EDVIR PADIYURA VATHUN BHOYUR MACHVA ఆని రాయించారు. తమ సంస్కృతి సంప్రాదాయాలు చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మాణం గావించారు. టేకు కట్టెలతో నాగోబా ప్రచార రథం చాలా అందంగా అద్భతంగా తయారు చేసి ప్రచారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యం కోరకు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది.

నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ పునః ప్రతిష్ఠాపన:

ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన నాగోబా ఆలయం ప్రారంభోత్సవ వేడుకకు ముస్తాబైంది.

సర్వాంగ సుందరంగా తయారైన ఆలయంలో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 2022 డిసెంబర్ నెల 12 నుండి 18 వరకు మొత్తం ఏడు రోజులు పాటు వేడుకలు తమ ఆచారా సాంప్రదాయం ప్రకారం ఆదివాసీ వేద పండితులు అయిన కొడప వినాయిక్ రావు మహారాజ్, పురుషోత్తం మహారాజ్ సమక్షంలో మంత్రోచ్చారణలతో నవగ్రహ పూజలు చేసి గర్భగుడిలో విగ్రహప్రతిష్ఠాపన కలశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఆలయ పూజ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, కలెక్టర్ సిక్తా పట్నాయిక్ ఐఎఎస్, ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి వరుణ్ రెడ్డి ఐఎఎస్, ఆసిఫాబాద్ శాసన సభ్యులు ఆత్రం సక్కు, చైర్మన్ కోవా లక్ష్మీ, మాజీ మంత్రి గోడం నగేష్ ,ఐటీడీఏ చైర్మన్ కనక కల్కేరావు తోపాటు మెస్రం వంశీయులు, జిల్లా ప్రజాప్రతినిదులు, ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదక్షులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఎందరెందరో దేశ విదేశ చరిత్రాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఏడు రోజులు కూడా భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు.

జాతర ప్రారంభం:

ఈ జాతర పుష్యమాసంలో ప్రారంభమై నెలవంక కనిపించే రెండో రోజున మెస్రం వంశానికి చెందినవారు కేస్లాపూర్ గ్రామంలో సమావేశం నిర్వహించి నాగోబా దేవుని మొక్కి ఆ తర్వాత సిరికొండ మండలంలోని ఎన్నో తరతరాల నుంచి అంటే తాత ముత్తాతల కాలం నుండి కుండలు తయారు చేసి ఇచ్చే కుమ్మరి వద్దనుండి కుండలు తయారు చేసుకొని రావడం వీరి ఆచారం. వారు కూడా నియమ నిష్ఠలతో ఒకే ఆకారం గల మట్టి కుండలు తయారు చెయ్యడం విశేషం. ఆ తర్వాత మెస్రం వంశస్తులు పూజ కలశంతో పవిత్రమైన గోదావరి జలాలను నియమ నిష్ఠలు పాటిస్తూ క్రమశిక్షణతో కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలోని అస్తీన మడుగులో పూజ చేసి పూజ నీరు తీసుకొని ప్రయాణం సాగిస్తారు.

ప్రత్యేక నైవేద్యం:

కేస్లాపూర్ గ్రామానికి చేరి మహా వటవృక్షము వద్ద భాజాబజంత్రీలతో వారి పూర్వీకులకు కర్మకాండలు నిర్వహించి నాగోబాదేవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. మెస్రం వంశ ఆడపడుచులు, మహిళలు, అల్లుళ్ళు అందరు ఆలయాన్ని శుబ్రపరిచి పూజ నిర్వహించి పెళ్లిఅయిన వధువును పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనినే భేటింగ్ అంటారు.

వంద కిలోమీటర్లు కాలినడక:

మెస్రం తెగకు చెందిన కోడళ్ళు ఎడ్లబండి వెనుకాల కాలినడకన బయలుదేరుతూ వెదురుతో తయారుచేసిన కొత్త గుల్లలో పూజా సామాగ్రి తీసుకుని బండి వెనుకాల కాలినడకన కేస్లాపూర్ చేరుకుంటారు. వీరు ముఖం నిండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరించి నాగోబా పూజలో పాల్గొంటారు. కలశంలో తీసుకువచ్చిన శుద్ధమైన గంగాజలంతో నాగోబా దేవుని, మరియు ఆలయాన్ని శుభ్రపరిచి సంగీత వాయిద్యా పరీకరాలైన డోలు, తుడుం, పిప్రే, కాలికోమ్, మొదలగు బాజాభజంత్రీలు వాయిస్తూ దేవుని ప్రత్యేక పూజలు ‌చేసి నవధాన్యాలు, పాలు, బెల్లం మరియు కొత్త తెల్లటి వస్త్రాన్ని పుట్టపైన ఉంచి గ్రామ పటేల్, కటోడా, దేవారి, మరియు కోత్వాల్ మొదలైన వారు పూజ నిర్వహిస్తారు. అదే రోజు సాక్షాత్తూ నాగోబా దేవుడు ప్రత్యేక్షమవుతాడు అని ఆదివాసుల నమ్మకం.

ఈ కార్యక్రమంలో మెస్రం వంశస్తులతో పాటు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‍గఢ్, కర్నాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

స్థల పురాణం:

ఈ ఆలయ నిర్మాణం, నాగోబా విగ్రహానికి సంబందించిన కథ ఇది.

పూర్వం మెస్రం వంశానికి చెందిన నాగాయి మోతి అనే ఒక రాణికి కలలో ఒక పాము వచ్చి నీ కడపున జన్మిస్తానని చేప్పి అదృశ్యం అయ్యాడట. ఆమె గర్భం దాల్చి కొన్ని నెలల తర్వాత ఆమె కడపున నిజంగా పాము (నాగోబా దేవుడు) జన్మించడంతో ఆ పాముకు తన తమ్ముడి కూతురు గౌరి దేవితో వివాహం జరిపించి ఆ తర్వాత అందరు కలిసి తీర్థయాత్రకు గోదావరి వెళ్ళగా ఆ పాము మనిషి రూపంలో మారిందట. ఆశ్చర్య పోయిన గౌరి దేవి అచటి నుండి కేస్లాపూర్ చేరుకుందట. అంతలోనే మళ్ళీ ఆ మనిషి పాము రూపంలో గౌరి దేవిని వెతుక్కుంటూ కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న పుట్టలో వెళ్ళిపోగా ఆ గ్రామస్థులు ఆ పుట్టకు పూజలు చేయడం మొదలు పెట్టారట, అలా మెస్రం వంశస్తులే అప్పటి నుండి ఆలయానికి ధర్మకర్తలుగా వుంటూ ఆలయాన్ని అభివృధ్ధి పరిచి పూజలు నిర్వహిస్తున్నారు.

కేస్లాపూర్‌లో దర్బార్:

1941 సంవత్సరం నిజాం నవాబు కాలం నుండి ఆదివాసుల సమస్యలు – వాటి పరిష్కారాల మీద కేస్లాపూర్‍లో దర్బార్ నిర్వహిస్తు వస్తున్నారు, కాని గత 2019 సంవత్సరం నుండి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో గిరిజన దర్బార్‌కు కళ తప్పింది. నిజాం నవాబు 1941 లో ఆదివాసుల స్థితిగతులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇంగ్లాండ్‌కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది.

ఆదివాసుల చారిత్రక విశేషాలను అధ్యయనం చెయ్యాలనుకున్న పరిశోధకులు, చరిత్ర నిపుణులు, ఉన్నతస్థాయి అధికారులు, విదేశీయులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి నాగోబా దేవుని పూజా నిర్వహిస్తారు. శతాబ్దం నాటి పౌరాణిక ప్రమాణాలను బట్టి కేస్లాపూర్ నాగోబా దేవుని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది. కేస్లాపూర్ నాగేంద్రుడి పూజ అనంతరం మెస్రం తెగవారు ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్‌కు చేరుకొని నందీశ్వరుని (బోడుందేవుడు) పూజ నిర్వహించి, తిరిగి కేస్లాపూర్ చెరుకోని అక్కడి నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఈ ఆదివాసుల జాతరతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలోని ఖాందేవుని జాతర, బేల మండలం‌ సదల్ పూర్ లోని భైరం దేవుని జాతర, తిర్యాని మండలంలోని దంతన్ పల్లి భీమ్యక్ జాతర, మందమర్రి మండలంలోని బొక్కలగూడ కోవామొకాషీ జాతర, సిర్పూర్ (యు) మండలంలోని మహాదేవుని జాతర, కెరామెరి జాతర మొదలగు జాతరలకు నిలయం మన ఉమ్మడి ఆదిలాబాదు.

ఎలా చేరుకోవచ్చు:

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నుండి గుడిహత్నూర్ మీదుగా బస్సులో లేదా ప్రయివేటు వాహానాలలో ముత్నూర్ చేరుకోవాలి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా వాసులు బస్సులో గాని ప్రయివేటు వెహీకిల్ లోగాని ఇంద్రవెల్లి మీదుగా ముత్నూర్ చేరుకోవాలి. ముత్నూర్ నుండి కేస్లాపూర్ నాగోబా దేవాలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

(వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక. ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి, ఆదిలాబాద్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here