ఒరిజినాలిటీ, నేటివిటీతో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’

1
7

[dropcap]భ[/dropcap]వ్య క్రియేషన్స్‌పై ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 20న విడుదల అయింది. ఒక చిన్న పల్లెటూరులో ఉన్న రాఘవ అనే మధ్యతరగతి యువకుడు గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలని ప్రయత్నించటం స్థూలంగా ఇందులోని కథ. బొంబాయి చెట్ని చేయటంలో తను స్పెషల్ అని గొప్ప నమ్మకం అతనికి. ఆ ప్రయత్నంలో అతను తిన్న ఆటుపోట్ల సమాహారమే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. కోట్లు ఖర్చు పెట్టి, విదేశాల్లో ఖరీదైన లొకేషన్స్‌లో, పెద్ద పెద్ద సెట్టింగ్స్‌లో చిత్రీకరణ లేకపోయినా (నిర్మాత ఆనందప్రసాద్ చేత తక్కువ ఖర్చు పెట్టించి) మన చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ జీవితాన్ని ఎంత సహజంగా తెరకెక్కించవచ్చో చేసి చూపించాడు దర్శకుడు వినోద్ అనంతోజు. మిడిల్ క్లాస్ వారికి స్వీట్ మెమరీస్ మాత్రమే కాదు, మిజరబుల్ మెమరీస్ కూడా ఉంటాయి.

మొత్తం హీరో హీరోయిన్‌ల చుట్టూ తిరిగే కథ కాదు ఇది. సమాజంలో వ్యక్తి ఒంటరిగా బ్రతకలేడు. తన చుట్టూ ఉన్న వారితో కలిసి అతని జీవనయానం కొనసాగుతుంది. మంచి గానో చెడ్డ గానో చుట్టుపక్కల వారితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందులోనూ మధ్యతరగతి జీవితాలు అయితే చెప్పనక్కర్లేదు. మానవ సంబంధాలన్నీ పెనవేసుకొని ఉంటాయి. ఆశలు, ఆశయాలు, కొట్లాటలు, కన్నీళ్లు, నవ్వులు, మాటపట్టింపులు, మనిషి తోనూ సమాజం తోనూ జీవితంతోనూ రాజీ పడుతూ, రకరకాల మనస్తత్వాలు అన్నిటితోనూ కలగలిసి ఉంటాయి. సరిగ్గా ఈ సినిమాలోని పాత్రలన్నీ అలాంటి మామూలు వ్యక్తుల జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.

తన అన్న విజయ్ కున్న స్టార్ ఇమేజ్ వాడుకోకుండా, ఆనంద్ దేవరకొండ (తన మొదటి చిత్రం దొరసాని కంటే) మెరుగైన నటనతో మెప్పించాడు. ఎవరో ‘హీరో’ని చూసినట్టుగా కాకుండా మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉండే కుర్రాడిలా సహజంగా కనిపించాడు. సామాన్యంగా మన తెలుగు సినిమాల్లో హీరోని ఫస్ట్ లుక్‌లో చాలా కాస్ట్లీగా హీరోయిజంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. ‘ఫస్ట్ సాంగ్’ అన్నది ఆర్భాటంగా హీరో మీద, వెనక 100 మంది ఆర్టిస్టులతో చిత్రీకరిస్తారు. ఆ ఫస్ట్ సాంగ్ రాయడానికి కొందరు ప్రత్యేకమైన రచయితలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మొదటి పాట పల్లెటూరు లోని పచ్చని పొలాల మధ్య, జన సమూహంతో కిక్కిరిసిన గుంటూరు వీధుల్లో చిత్రీకరించబడింది. ఆ ఊరి గురించి సరదాగా ఓ పాటలో చెప్పారు కూడా.

ముఖ్యంగా రాఘవ తండ్రిగా నటించిన గోపరాజు రమణ నటన అద్భుతం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ నటులు లేని కొరత తీర్చాడు. హీరో స్నేహితుడుగా చైతన్య, దివ్య, హీరోయిన్ తండ్రిగా ప్రేమ్ సాగర్ ఇంకా శివప్రసాద్, ఆంటోని కొత్త ముఖాలైనా (నాటకానుభవం ఉన్నట్టుంది) సహజంగా నటించారు. టిఫిన్ సెంటర్‌లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ రాజకీయాలు మాట్లాడుకునే వ్యక్తులు, ఆఖరికి రాఘవ దగ్గర పనిచేసే హోటల్ కుర్రాడు, ఆటో డ్రైవర్…. ఎవరి నుంచి ఎంత నటన రాబట్టుకోవడంలో దర్శకుడు వినోద్‌కి బాగా తెలిసినట్టుంది. మేకప్ లేని ముఖాలు, ఓవరాక్షన్ లేని సహజమైన నటన, ఖరీదైన డ్రీమ్స్ సాంగ్స్ లేకపోవడం తోను, ఒరిజినాలిటీ నేటివిటీ చూపడంలోను దర్శకుడి ప్రతిభ తెలుస్తోంది.

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో ఈ సినిమాలో పాత్రధారులు అలానే కనిపిస్తారు, కానీ ‘సినీ ప్రపంచం’ కనిపించదు. మనకు మన చుట్టూ ఉన్న మానవ మనస్తత్వ ప్రపంచం కనిపిస్తుంది. పల్లెటూరి బాస, యాస, బూతు మాటలు చాలా మామూలుగా వాడటం, మధ్యతరగతి వారు చీటీలు కట్టుకోవడం, అవసరానికి పాడుకోవడం, ఒక్కోసారి నిర్వాహకుడు పారిపోతే చీటీదారుల జీవితాలు ఎంత చిన్నాభిన్నమై పోతాయో, తమ స్థలాల ధరలు ఆకాశాన్నంటితే మనిషి ఎంతగా పొంగిపోతాడో, ధరలు పడిపోతే ఎంతగా కుంగిపోతాడో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నేడు నెలకొన్న పరిస్థితులు, తదనుగుణంగా మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయో దర్శకుడు బాగానే చూపాడు. రిచ్‌గా వేషభాషలు, సెట్టింగ్స్ లేవన్న మాటే గానీ ఈనాడు వస్తున్న అర్థంపర్థం లేని చాలా సినిమాల కంటే నయమే. కానీ అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో చలనచిత్రానికి తక్కువ షార్ట్ ఫిలింకి ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది.

ఆనంద్ దేవరకొండ మధ్యతరగతి కుర్రాడుగా రాఘవ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. హీరోయిన్ వర్ష (బహుశా తెలుగమ్మాయి కాకపోవచ్చు కానీ) మధ్యతరగతి అమ్మాయిగా, తండ్రి చాటు కూతురిగా, ప్రేమించిన వ్యక్తి జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిగా తన శక్తి మేరకు బాగానే నటించింది.

జాతకాన్ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని, అడ్డుగా ఉందని పచ్చని చెట్టుని కొట్ట కూడదని చెప్తూనే – ఇళ్లలోని చెత్తనంతా హోటల్ పక్కన చేయటాన్ని ఆపడానికి అక్కడో చిన్న దైవ మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు చూపడం ఎంత వరకు సమంజసం! చట్టబద్ధంగానో,  ప్రభుత్వ పరంగానో ఆ సమస్యని యువతరం పరిష్కరించుకోలేదా!!

హీరో, హీరోయిన్, హీరో స్నేహితుడు, అందరికీ ప్రేమ – పెళ్లి అనేవి చేజారిపోతుంది అనుకుంటున్న సమయంలో నటుడు, దర్శకుడు ‘తరుణ్ భాస్కర్’ పెళ్లి కొడుకు పాత్రలో ప్రవేశించి ఒక్క సంఘటనతో కథను సుఖాంతం చేస్తాడు. చివరికి అందరి సమస్యలు తీరిపోయి హాయిగా నవ్వుకుంటూ గ్రూప్ ఫోటో తీస్తే ‘మామూలు సినిమా’ అయి ఉండేది. కానీ ‘రాఘవ హోటల్’ ఎదురుగా “‘న్యూ రాఘవ హోటల్’ కొత్తగా అవతరించడంతో మిడిల్ క్లాస్ కుర్రాడికి ‘అంతులేని పోరాటం’ మళ్ళీ మొదలైంది అని చూపించటం చాలా సహజంగా వుంది. ఆనంద్, చైతన్య, గోపరాజు రమణ, దర్శకుడు వినోద్ ఎక్కువ మార్కులు కొట్టేశారు అని చెప్పవచ్చు. చివరాఖరికి నాకో సందేహం – (న్యూటన్‌కి యాపిల్  లాగా) రాఘవకి చెట్టుపైనుండి మామిడికాయ పడకపోతే….!!??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here