మిగతా

5
7

[dropcap]బం[/dropcap]తి బోజనాలు జరగతా వుండాయి.

మునెమ్మ, మునెమ్మ కొడుకు పోయి బంతిలో కూకొనిరి.

వీళ్ళ పక్కల ఓ ముసలమ్మా కూకొనె.

అబుడు మునెమ్మ కొడుకు వాళ్ల అమ్మ చెవిలా ఏమో చెప్పే.

మునెమ్మ ముసలమ్మ పక్క తిరిగి “అవ్వా… వా… నా కొడుకు చెయ్యి కడకుండా వచ్చిండాడువా, నువ్వు రవంత లేస్తే” అనె.

ముసలమ్మ ముక్కతా మూల్గతా లేచి నిలుసుకొనె. అంతే కాదు ఆ చిన్నోడు వచ్చేగంట అట్లే నిలుకొని వుండే. ఏలంటే ఆయమ్మకు మోకాళ్ల నొప్పులు. కితకిత (ప్రతిసారి) లేచి నిలుసుకొనేకి అయ్యే పని కాదు.

***

‘చిక్కినబుడు తినరా కుక్క తిన్నెట్ల’ అనే మాద్రిగా ఆ చిన్నోడు వడ్దించిన విస్తరిని బాగా నక్కి నాకి పెట్టీశా.

ముసలమ్మ నిదానంగా తింటా వుంది. ఆయమ్మ ఆకుల ఇంగా అర్ధము కూడు అట్లే వుంది.

ఆ చిన్నోడు తిరగా తన నక్క బుద్ది చూపిచ్చే… వాళ్ళ అమ్మ చెవిలో ఏమో ఊదే.

ఆయమ్మ అట్లే ముసలమ్మ పక్క తిరిగి “అవ్వా నా కొడుకు తినింది అయే. నువ్వు రవంత లేసి దోవ విడస్తే” అనె.

ముసలమ్మా ముక్కతా మూల్గతా లేచి నిలుసుకునేకి సురువాయ.

ఈ తతంగం అంతా దూరంగా వుండి అబుటి నింకా గమనిస్తా వుండిన కాకమ్మకి, గువ్వమ్మకి రేగిపోయ.

“నువ్వు లేయోద్దు కూకోవా” కాకమ్మ గట్టిగా అనె.

“ఏయ్! లత్త ముండ మునెమ్మ. నీకేమయినా బుద్ది ఇద్ది (విద్య) వుందా? ఆ ముసలమ్మ కూడు తినేవరకు వుండి ఆమీట చెయ్యి కడుకొంటే నీ కొడుకు ఏమైనా సమిసిపోతాడా? ఏమే నీకు అంత సొక్కు, నీ కొడుకు చెయ్యి కడగాలి అన్నబుడు ఆ ముసలమ్మ లేసి వాడు వచ్చే గంట కాయిలేదా (వెయిట్ చేయడం). ఇబుడు నువ్వు అట్లే చేయాలా వద్దా? ఇట్లేనా బిడ్డలకి వజాయము (నడవడిక) నేర్పేది” అంటా తిట్టు మింద తిట్టు తిట్టి పెట్టీశా గువ్వమ్మ.

మునెమ్మ తన తప్పు తెలుసుకొని అవ్వని మన్నిప్పు అడిగె.

బంతిలా వుండే మిగతా (మిగిలిన) జనాలు మాత్రం సెల్లు పోను చూసుకొని సొల్లు మాటలు మాట్లాడుతా వుండారు.

***

మిగతా= మిగిలిన వారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here