మినీ మూన్

1
9

[box type=’note’ fontsize=’16’] నాసా వారు ఓ భారతీయ ప్రొఫెసర్‌కి కానుకగా ఇచ్చిన ఓ చిన్న చంద్రశిల దొంగిలించబడింది. ఆ చంద్రశిలపై పొరపాటున భూవాతారణ ప్రభావం పడితే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో ప్రొఫెసర్ చెప్తారు. అందుకు డిటెక్టివ్‌లు ఏం చేశారో ఎం. వెంకటేశ్వర రావుమినీ మూన్” కథలో ఆసక్తిగా వివరిస్తారు. [/box]

[dropcap]”డా[/dropcap]డీ”

“ఏంటమ్మా”

“మీడియా వాళ్ళొచ్చి వెయిట్ చేస్తున్నారు”

“ఎంతమందున్నారు?”

“పదిమంది దాకా ఉన్నారు. వాళ్ళతో బాటు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చారు” అని చెప్పిన అర్చన గొంతులో కొంచెం కోపం ధ్వనించింది.

“డాడీ! ఇప్పుడిదంతా అవసరమా?”

“ఏదంతా?”

“ఈ ప్రెస్ మీట్, పోలీసులూ, ఎంక్వయిరీ?”

“ఏంటమ్మా! వింతగా మాట్లాడుతున్నావు? మన ఇంట్లో దొంగిలించబడ్డది నగలో, డబ్బో మరొకటో కాదు. ఎవరూ కలలో కూడా ఊహించలేని అపురూప వస్తువు అది. నువ్వు ముద్దుగా ‘మినీ మూన్’ అని పిలుస్తూ రోజుకి ఒకసారైనా చూసి ఆనందపడే వస్తువు. మరి అది దొంగలపాలైతే… చూస్తూ ఊర్కోమంటావా? మన ప్రయత్నం మనం చెయ్యాలా? వద్దా?”

“చెయ్యాలి”

“దొంగల పాలయిన ‘మినీ మూన్’ తిరిగి మన చేతికి రావాలంటే పోలీసుల సహాయం మాత్రమే చాలదు. మీడియా కూడా కావాలి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్” అని వేగంగా లేచి హాల్లోకి వచ్చాడు ప్రొఫెసర్ కె.ఆర్.కె. రావు.

హాల్లో వేసిన కుర్చీల్లో కూచున్నారు ప్రెస్ వాళ్ళు. టి.వి, మీడియా జర్నలిస్టులు… చేతిలో మైకులతో… కెమెరా విభాగం వాళ్ళు కెమెరాలు పట్టుకుని సిద్ధంగా వున్నారు.  వాళ్ళకి ముందు వేసిన సోఫాలో అసిస్టెంట్ కమీషనర్, అతనితో పాటు డిటెక్టివ్ శాండిల్య, అతని అసిస్టెంట్ కూర్చున్నారు. ప్రొఫెసర్ రావు అక్కడికి రాగానే… అందరూ నిలబడ్డారు.

“గుడ్ మాణింగ్ ఫ్రొఫెసర్ సార్!” అన్నాడు కమీషనర్.

“వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ ఆకాష్‌జీ!” అని కమీషనర్‌తో కరచాలనం చేశాడు ప్రొఫెసర్ రావు.

కమీషనర్ పక్కనే కూర్చున్న ప్రొఫెసర్ రావు మాట్లాడడం మొదలుపెట్టాడు…

“అందరికీ నమస్కారం. నేను అమెరికా వెళ్ళి ‘నాసా’కి పని చేసి, ఆరు నెలల క్రితం ఇండియాకి వచ్చాను. నేను అక్కడ్నించి వచ్చేడప్పుడు నాసా వారు నా పనితీరుకు మెచ్చి ఒక బహుమతి ఇచ్చారు. అదేమిటో చెబితే మీరంతా ఆశ్చర్యపోతారు. నాసా అంతరిక్ష వ్యోమగాములు చంద్రమండలం వెళ్ళినప్పుడు అక్కడ్నించి సేకరించిన రాళ్ళల్లో… నాకు చిన్న రాయిని బహుమతిగా ఇచ్చారు. దాని బరువు ఒక గ్రాము మాత్రమే, కానీ భూమి మీద దాని విలువ ఒక టన్ను బంగారానికి సమానంగా ఉంటుంది.”

ప్రొఫెసర్ రావు చెబుతుంటే జర్నలిస్టులు ఆ వివరాలన్నీ నిశితంగా వింటూ రాసుకుంటున్నారు.

ప్రొఫెసర్ రావు మళ్ళీ మాట్లాడుతూ…

“నాకు బహుమతిగా నాసా వారు ఇచ్చిన అమూల్యమైన ఒక గ్రాము చంద్రమండల రాయికి నా కూతురు ‘మినీ మూన్’ అని పేరు పెట్టింది. దానిని అందమైన గాజు బాక్సులో భద్రపరిచి; అన్యులెవరి కళ్ళు పడకుండా నా ల్యాబ్‌లో… షో కేస్‌లో భద్రపరిచాను.

రెండు రోజుల క్రితం… ఆ గాజుపెట్టె, అందులోని ‘మినీ మూన్’తో సహా మాయమైంది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాను. ‘మినీ మూన్’ దొంగిలించబడడం… నాకెంతో బాధనిపించింది. నిన్నంతా అపురూపమైన ఆ రాయిని కోల్పోయినందుకు చాలా విచారించాను. కానీ ఈ రోజు  ఆ బాధ స్థానాన్ని భయం ఆక్రమించుకుంది” అన్నాడు ప్రొఫెసర్ రావు.

“భయమెందుకు సార్?” అడిగాడు ఓ జర్నలిస్ట్.

“నాలో చెలరేగుతున్న అలజడిని భయం అనేదాని కంటే… ‘మినీ మూన్’ వలన జరగబోయే ప్రమాదం గురించిన హెచ్చరిక… అంటే బాగుంటుంది. దాన్ని భయం అనాలో… ఏమనాలో అర్థం కావడం లేదు…”

“ఎలాంటి ప్రమాదం సార్?” టి.వి.ఛానల్ ప్రతినిధి అడిగాడు.

“నేను ఇండియాకి వచ్చేముందు ‘మినీ మూన్’ని నాతో తీసుకొస్తుంటే నాతో బాటూ నాసాలో పనిచేసిన ప్రొఫెసర్ విలియమ్స్ చేసిన హెచ్చరికే… నాలో భయం, ఆందోళన, అలజడికి కారణం…” అన్నాడు రావు ఖర్చీఫ్‌ తీసుకొని నుదుటి మీది స్వేదం తుడుచుకుంటూ.

“అదేంటి సార్! ఆయన ఏమని హెచ్చరించారు?”

“ఈ చిన్నరాయిని ఎల్లప్పుడూ అద్దాల పెట్టెలోనే ఉంచాలి. ఎప్పుడైనా ఓ గంట మాత్రం భూమ్మీది గాలి, వాతావరణం దానికి తగిలేలా ఉంచొచ్చు. గంటకంటే ఎక్కువ సమయం గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే విపరీత పరిస్థితులు ఏర్పడొచ్చని చెప్పాడు.”

వెంటనే ఒక జర్నలిస్ట్ “విపరీత పరిస్థితులు అంటే?” అన్నాడు.

“చంద్రమండలంలో ఉంటే… ఈ రాయిలో… ఉండే రసాయన ధర్మాలకి, ఇక్కడ భూమ్మీద ఉండే ఆక్సీజన్, నైట్రోజన్, కార్బన్‌డయాక్సైడ్ వంటి వాయువులు జత కలిస్తే… ఒక కొత్త్త రకం వైరస్‌లు ఉత్పన్నమవ్వచ్చు. దానివలన కొత్త రకం వ్యాధులు ఉద్భవించవచ్చు. లేదా చుట్టూ ఉన్న ఏదో ఒక పదార్థంలో రసాయన క్రియ జరిగి, ఒక ఆర్డీఎక్స్ బాంబు పేలితే ఎలాంటి ఘోర విస్ఫోటాలు జరుగుతాయో… అలాంటి ప్రమాదాలు జరగవచ్చు.”

శాండిల్య కల్పించుకుని.. “మీ ఇంట్లో ఈ దొంగతనం ఏ సమయంలో జరిగిందో చెప్పగలరా? ఎవరైనా అనుమానిస్తున్నారా?”

“ష్యూర్! ఇంట్లోనే నాకు ప్రత్యేక లైబ్రరీ, నా పరిశోధనల కోసం ల్యాబ్ ఏర్పాటు చేసుకొన్నాను. అందులోనే నా పరిశోధనలకి సంబంధించిన పుస్తకాలు, వాటికి  సంబంధించిన ప్రయోగాలు చేసే ల్యాబొరేటరీ ఉంది. మినీ మూన్ ఉంచిన గ్లాస్ బాక్స్… అక్కడున్న షో కేస్‌లో భద్రపరిచాను. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్‌కీ తప్ప అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యే మా ఇంట్లో కొత్తగా ఓ సర్వెంట్ చేరింది. ఆమె పైకి అమాయకురాల్లా, చదువు లేని దాన్లా కనిపించేది. పోయినవారం… యాదృచ్ఛికంగా నేనూ, నా కూతురు అర్చన మినీ మూన్ గురించి మాట్లాడుకొంటున్నప్పుడు ఆమె అక్కడే వుంది… ఆమె మీదే అనుమానంగా వుంది.”

“ఇప్పుడామె ఎక్కడుంది?

“మినీ మూన్‌తో బాటు ఆమె అదృశ్యమైంది…”

“ఆమె పేరు, ఊరు… వివరాలు చెప్పగలరా?” అన్నాడో టి.వి. రిపోర్టరు.

“అవన్నీ మా అమ్మాయి అర్చనకి తెలుసు” అని కూతుర్ని పిలిచాడు.

అర్చన వచ్చి… “తన పేరు రుక్మిణి అని, పెళ్ళయిందని, ఇద్దరు పిల్లలని చెప్పింది. హజ్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడని… ఇల్లు గడవక…. సర్వెంట్ పనికి వచ్చానని చెప్పింది” అంది.

“ఆమె ఫోటో, ఆధార్ కార్డ్ వంటివి తీసుకున్నారా?”

“ఎస్…” అని లోపలికి వెళ్ళి… తెచ్చి, శాండిల్యకి ఇచ్చింది.

వెంటనే శాండిల్య… తన సెల్‌ఫోన్‌లో… ఆధార్ కార్డ్ నెంబరు ఫీడ్ చేసి… వివరాలు చూశాడు. ఫేక్ అని తెల్సిపోయింది.

“మీరు చెప్పిన ల్యాబ్, లైబ్రరీ ఓసారి చూడొచ్చా?” అడిగాడు శాండిల్య అసిస్టెంట్ శ్రీరాం.

“తప్పకుండా…” అని లేచాడు ప్రొఫెసర్ రావు.

అసిస్టెంట్ కమీషనర్, శాండిల్య, శ్రీరాం, ఒకరిద్దరు జర్నలిస్టులు ల్యాబ్‌లో ప్రవేశించారు. వందల కొద్దీ బుక్స్, మధ్యలో పెద్ద టేబుళ్ళు, వాటిమీద ప్రొఫెసర్ రావు చేసే ప్రయోగాలకు సంబంధించిన రంగురంగుల రసాయన ద్రవాలు, రకరకాల పరికరాలు కనిపిస్తున్నాయి.

గోడకి వేలాడదీసిన ‘లిస్ట్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్’ రెడ్ మార్కర్‌తో రాసిన ఛార్టు శాండిల్య దృష్టిలో పడింది. దగ్గరికెళ్ళి చూసి…

“ప్రొఫెసర్ సర్! నేనూ కెమిస్ట్రీ స్టూడెంటునే. పీరియాడిక్ టేబుల్‌లో ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడా చదవలేదే… వీటి గురించి విన్నది కూడా లేదు….” అన్నాడు శాండిల్య.

“మనకు తెలియని ఎన్నో వింతలు, అనుక్షణం ఎన్నో జతకూడుతుంటాయి” అన్నాడు ప్రొఫెసర్ రావు.

“ఎస్, ఎస్” అని ప్రొఫెసర్ రావు వైపు తిరిగి, “మూన్… భూమి నుంచి విడిపడిన ఉపగ్రహమే కదా సార్!” అన్నాడు శాండిల్య.

“అవునవును.”

“మరప్పుడు భూమ్మీద వాతావరణం, మూన్ మీది వాతావరణం ఒకేలా ఉంటుంది కదా! మూన్ నుండి తెచ్చిన చిన్న రాయి రసాయనికంగా ఎలా విభేదిస్తుంది?” అడిగాడు శాండిల్య.

“గుడ్ క్వశ్చన్… మీరు చెప్పింది నిజమే. కానీ చంద్రుడు వేరు పడ్డప్పటి నుంచీ అక్కడ గాలి లేని కారణంగా… అక్కడ వాతావరణంలొ ఇలాంటి రాళ్ళూరప్పలు తమలో ఉన్న రసాయనాలు రియాక్ట్ అయ్యే అవకాశం లేక స్తబ్దుగా పడున్నాయి. ఇపుడు భూమ్మీద గాలిలో ఉండే రసాయన వాయువులు తాకగానే చర్య ప్రతిచర్యలు జరిగి… ప్రభావం భయంకరంగా ఉంటుందనే నా భయమంతా. దొంగిలించినవాడికి ఈ విషయం తెలీక డబ్బు మీద ఆశతో… ఆ రాయిని గ్లాస్ బాక్స్ నుండి బయటకు తీయగానే… ప్రమాదం… జరగవచ్చు… జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే….” అని బుక్ షెల్ఫ్ నుండి… ఓ ట్యాబ్‌లెట్ తీసి… అందులో ‘మినీ మూన్’ విస్ఫోటనపు వీడియో చూపించారు ప్రొఫెసర్ రావు.

“కాబట్టి… ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకముందే… రహస్యంగా ‘మినీ మూన్’ని నాకు చేర్చాల్సిందిగా మీ అందర్నీ కోరుకుంటున్నాను” అని ముగించారు ప్రొఫెసర్ రావు.

***

ఒక వారం తర్వాత… అటు పోలీసుల్నుంచి గానీ, ఇటు డిటెక్టివ్ నుండి గానీ ఎటువంటి సమాచారమూ అందలేదు ప్రొఫెసర్ రావుకి.

పది గంటలకి ఒక చిన్న సూట్‌కేస్‌లో… ఫైల్స్ పెట్టుకుని హడావిడిగా బయటకి వెళ్తుంటే..

“డాడీ! ఎక్కడికి వెళ్తున్నారు?” అంది అర్చన.

“సి.బి.ఐ. డైరక్టర్‌ని కలవడానికి వెళ్తున్నాను”

“ఇప్పుడెందుకు?”

“ప్రొఫెసర్ రావు ఆగి, “చూడు అర్చనా! పోలీసులతో ఈ విషయం తేలేది కాదు. వాళ్ళీ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకున్నట్టు తెలీటం లేదు. అలాగే మీడియా కూడా ఈ విషయానికి ప్రాముఖ్యత నీయడం లేదు. అందుకే… సి.బి.ఐ. డైరక్టర్ ఇంద్రజిత్ నాకు పర్సనల్‌గా తెలుసు” అన్నారు.

అర్చన ఏదో చెప్పబోయేంతలో బయటికొచ్చారు రావు.

***

“మీరు చెప్పిన వెంటనే… ఈ కేసుని సి.బి.ఐ. టేకప్ చెయ్యలేదు మిస్టర్ రావ్.  కావాలంటే అనఫిషయల్‌గా తెలిసిన డిటెక్టివ్ ద్వారా… ట్రేసవుట్ చేయిస్తాను. అదీ… నువ్వు నా ఫ్రెండువి కాబట్టి…” అన్నాడు ఫైల్సన్నీ తిరగేసిన ఇంద్రజిత్.

“అలాగే”

వెంటనే ఫోన్ తీసి… ఎవరికో ఫోన్ చేశాడు. మాట్లాడి ఫోన్ ఆఫ్ చేసి… “పది నిముషాల్లో వస్తున్నాడు… వెయిట్ చేద్దాం” అన్నాడు.

ఇంద్రజిత్ కుర్చీలో వెనక్కి వాలి… ప్రొఫెసర్ రావుని చూస్తూ, “ఎవరికీ అనుమానం రాలేదు కదా?” అన్నాడు.

“లేదు”

“పోలీసు, మీడియా నువ్వు చెప్పిందంతా నమ్మేశారన్న మాట.”

“అందరూ నమ్మేశారు”

“మీ అర్చనకి కూడా సందేహం కలగలేదా?””

“వచ్చే ఛాన్స్ ఇవ్వకుండా… నటించానుగా!” అన్నాడు ప్రొఫెసర్ రావ్ టేబుల్ వెయిట్ గుండ్రంగా తిప్పుతూ.

ఇంద్రజిత్ సన్నగా నవ్వి… “ఎలాగైతేనేం ‘మినీ మూన్’ నీ దగ్గర్నుంచి దొంగిలించబడ్డదన్న విషయం పోలీసులకి, మీడియా ద్వారా ప్రజలకి తెల్సిపోయింది. ఇప్పుడిక నువ్వు అర్చన పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవచ్చు” అన్నాడు ఇంద్రజిత్.

“ఇంద్రజిత్! నువ్వు చేసిన ఈ సహాయం… ఎప్పటికీ మరువలేనిది. ఎలా కృతజ్ఞలు చెప్పాలో తెలీడం లేదు”

“అదేం లేదు. ప్రెండ్‌గా నిన్ను కాపాడుకోడం నా బాధ్యత.”

అంతలో… డిటెక్టివ్ శాండిల్య వచ్చాడు.

“ఇందాక అన్నావే… ‘కృతజ్ఞత’ అని…. అది ఇతనికి చెప్పు… ఈ ప్లానంతా ఇతనిదే. పదిహేను రోజులకి ముందు క్రైం బ్రాంచ్‌కి అందిన సమాచారం ప్రకారం… ఒక తీవ్రవాద సంస్థ నీ దగ్గరున్న మినీ మూన్ సంగతి తెలుసుకుని – నిన్నూ, నీ కుటుంబాన్నీ అంతమొందించి… దాని ద్వారా బయో వెపన్స్ అనే… రోగాలు ప్రబలే కాప్యుల్స్ తయారు చేసి విధ్వంసం సృష్టించాలని పథక రచన చేస్తున్నట్టు సమాచారం అందింది. అందుకే… వెంటనే నిన్ను కాంటాక్ట్ చేసి ‘మినీ మూన్’ని నేషనల్ కెమికట్ ఎలిమెంట్స్ రీసెర్చి యూనిట్‍కి పంపి, అది నీ ఇంటి నుండి దొంగింలించబడ్డదని… మీడియా ద్వారా ప్రచారం చేయించాం. ఇక మీదట ఏ తీవ్రవాద సంస్థల నుంచి నీకూ, నీ కుటుంబానికీ ఎటువంటి అపాయమూ ఉండదు…” అన్నాడు ఇంద్రజిత్.

“ఏమైనా సి.బి.ఐ. బ్రెయిన్ కదా! కర్ర విరక్కుండా, పాము చావకుండా భలే ప్లాన్ వేశావు”

“ఈ క్రెడిట్ నాది కాదు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ డిటెక్టివ్ మిస్టర్ శాండిల్యది. ఇంటలిజెన్స్ సమాచారం అందగానే… నీకు, నీ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఊహించి… శాండిల్యని కాంటాక్ట్ చేశాను. ఆ సమయంలోనే ఇంట్లో సర్వెంట్‌గా చేరిన రుక్మిణి అలియాస్ ‘రుక్సానా’కి తీవ్రవాద సంస్థతో సంబంధాలనున్నాయని గ్రహించి.. ‘మినీ మూన్’ స్థానంలో డూప్లికేట్ మినీ మూన్ నీ చేత పెట్టించాడు. రుక్మిణి ఇచ్చిన ఇంటి అడ్రసు, ఆధార్ కార్డ్ వివరాలు ఫేక్ అని గ్రహించి… శాండిల్య తన అసిస్టెంట్ శ్రీరాం రుక్సానా వ్యవహారంపై నిఘా వేసి… ఆమె డూప్లికేట్ మినీ మూన్‌ తస్కరిస్తుంటే వీడియో తీయించాడు. ఆ వీడియో ఇదే” అంటూ శాండిల్య సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియో చూపించాడు.

అది చూసి అవాక్కయిన ప్రొఫెసర్ రావు, “ఇప్పుడీమె ఎక్కడుంది?” అన్నాడు.

“ఇంకెక్కడ… తీహార్ జైల్లో…” అన్నాడు ఇంద్రజిత్.

“నన్నూ నా కుటుంబాన్నీ ఈ విపత్తు నుంచి కాపాడిన నీకూ, శాండిల్యకి, శ్రీరాంకి కృతజ్ఞతలు…” అన్నాడు రావు షాక్ నుంచి తేరుకుని.

“దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఎంతో విలువైన కాలాన్ని త్యాగం చేస్తూ… మానవ సంక్షేమం కోసం ఎన్నో కొత్త్త ఆవిష్కరణలు కనుగొంటున్న మీ లాంటి శాస్త్రవేత్తలను కాపాడుకోవటం… రక్షణ కల్పించడం మా కనీస బాధ్యత సర్!” అన్నాడు శాండిల్య.

౦౦౦౦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here