మిణుగురుల అడవి

0
10

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]

విక్కీకి తాను కుందేలు బొరియలోకి ప్రవేశిస్తున్నట్టు ఎంతో వింతైన అనుభూతి కలిగింది. నిజంగా చెప్పాలంటే పాతాళంలోకో, అగాథంలోకో పడిపోతున్నట్లు అనిపించింది. ఎందుకంటే దాని అంతం ఎక్కడో తెలియడం లేదు అతనికి. అలా ఆ బొరియలోకి జారుతూ జారుతూ పోతూ ఉంటే వాడికి ఇక తాను ఎప్పటికీ అడుగు భాగానికి చేరుకోలేనేమో అన్న సందేహం కలిగింది. ఇంతలోనే ‘ధడ్’ మన్న శబ్దంతో వాడు క్రింద పడ్డాడు. నెమ్మదిగా తల తిప్పి విక్కీ తన చుట్టుపక్కల ఏమున్నదో అని పరిశీలించసాగాడు. అతనికి ఎక్కడ చూసినా ఇసుక తప్ప మరేమీ కనిపించలేదు.

అక్కడ విక్కీకి ఏ ఒక్క మొక్క గాని, జంతువు గాని, అసలు మరే ప్రాణి గాని ఏమీ కనిపించలేదు. తన చుట్టూ కనుచూపు మేరలో ఇసుక తప్ప ఇంకేమీ లేదని వాడికి అర్థం అయింది. ఏమి చేయాలో తోచక అలా కొంతసేపు అక్కడే కూర్చుండిపోయాడు. తాను నడుస్తూ పోతే తప్ప తనకెవరూ కనబడరని వాడికి అర్థమైపోయింది. అందుకే లేచి ఆశతో నడుస్తూ ముందుకు పోసాగాడు.

విక్కీ నడిచాడు… నడిచాడు… నడిచాడు…. తన కాళ్ళు ఇక నడవడానికి సహకరించలేవు అన్నంత సేపు నడుస్తూనే ఉన్నాడు. తన శరీరపు భారాన్ని అలా ఈడ్చుకుంటూ ఆ ఇసుక మీద నడుస్తున్న విక్కీ కొంతసేపటికి పూర్తిగా అలసిపోయాడు. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైన స్థితికి చేరాడు వాడిప్పుడు. దాహంతో గొంతు ఎండిపోతూ ఉన్నది విక్కీకి. నిల్చున్న చోటినుండే చుట్టూ చూశాడు. అల్లంత దూరాన వాడికి ఒక చిన్న నీటి గుంట కనబడింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆ నీటి మడుగు వైపుగా వెళ్ళాడు. వాడి మస్తిష్కం వాడితో మాయలు చేస్తున్నది. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అది నీటి మడుగు కాదు, ఎండమావి! ఏమిటిది?! ఎంత దుఃఖం కలుగుతున్నదో వాడికి, దానికి నిస్సహాయత కూడా తోడైంది. ఒక వైపు ఆకలి, ఒక వైపు గొంతు ఎండిపోయే దాహం. నోరు తడారిపోతుండగా తనకు తెలియకుండా తాను ఆ ఇసుక మేటలపై స్పృహ తప్పి పడిపోయాడు మన విక్కీ.

చాలా సేపటి తరువాత అలసిపోయిన కనురెప్పలు విప్పి చుట్టూ చూశాడు. తాను ఎక్కడ ఉన్నాడో, అసలు అక్కడికి తానెలా చేరాడో వాడికి ఎంత మాత్రమూ అర్థం కాలేదు. ఇప్పుడు వాడి చుట్టూ ఇసుక లేదు. ఎక్కడ చూసినా పచ్చదనమే! చెట్లు,లతలు, ప్రాకుడుతీగలు, పొదలు – అన్ని రకాల పచ్చని మొక్కలూ ఉన్నాయి! మిలమిల మెరుస్తూ జుఁయ్ మని శబ్దం చేస్తూ లక్షల కొద్దీ మిణుగురు పురుగులు చుట్టూత ఎగురుతూ ఉన్నయ్! దట్టంగా, ఎత్తుగా పెరిగిన చెట్లు అది పగటి సమయమా లేక రాత్రి సమయమా అన్నది తెలియకుండా చేస్తున్నాయి. అక్కడ ఏదైనా వెలుతురు ఉన్నది అంటే ఆ మిణుగురు పురుగుల వల్ల మాత్రమే! ఈ ప్రకాశమే వాడిని ఎలాగో లేచి నడిచేందుకు కొంత శక్తిని, ప్రేరణను ఇచ్చింది.

వాడికి ఇంకా దాహంగానే ఉన్నది. ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయేమోనని ఒక్కసారి ఆగి చుట్టూ చూడగానే తన ఎదురుగా ఒక పెద్ద జలపాతాన్ని కనపడింది. ఆ జలపాతం పైన స్వర్గం నుండి భూమి మీద నీళ్లు పోస్తున్నారా అన్నంత ఎత్తు ఉంది! వాడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆ జలపాతం దగ్గరకు వెళ్లి కడుపు నిండుగా తృప్తిగా నీళ్లు తాగి తన దప్పిక తీర్చుకున్నాడు. తన కోల్పోయిన శక్తినంతా పొంది, తన శ్వాస కూడా ఒక క్రమపద్ధతిలో వస్తున్నట్లు, తాను మామూలుగా ఎప్పటి విక్కీ లాగా ఎంతో చలాకీగా మారినట్లు భావించాడు. వాడి చుట్టూ ఎన్నో పండ్ల చెట్లు, రంగురంగుల మనోహర పుష్పాలు, ఆ చెట్లపై నివాసముంటున్న పక్షులు, పురుగులు, ఎన్నెన్నో… ఎన్నెన్నో ఉన్నాయని గమనించాడు.

వాడికి ఇప్పుడు ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా అనిపించసాగింది. ఇంతకు ముందు ఏం జరిగింది? అమ్మో! తానొక ఎడారిలో ఒంటరిగా ఆకలితో, దాహంతో, కనీసం నీడ కూడా దొరకని స్థితిలో దారి తప్పిపోయి ఉన్నాడు కదా!? తలచుకుంటేనే దుఃఖం వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ – ప్రకృతిమాత ఒడిలో, చుట్టూ హరితంతో నిండిన పరిసరాలు. తన కళ్ళను తానే నమ్మలేని నిజం. హద్దులేని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నాడు విక్కీ. వాడు అలా ఎగురుతూ ఉంటే కాళ్ళ క్రింద పచ్చిక ఎంత మెత్తగా ఉందో! ఆ అడవి మొత్తాన్ని అణచుకోలేని కుతూహలంతో ఎక్కడ ఏమున్నదో అని పరిశీలించడం మొదలుపెట్టాడు విక్కీ. అడవి అందం అతడిని ఎంతగానో ఆకర్షించింది. విక్కీ ఆ మోహపారవశ్యంలో మైమరచిపోయాడు.

ఇంతలో కొంత దూరంలో విక్కీకి ఏదో శబ్దం వినిపించింది. ఏమిటా ఆ శబ్దం అని వెనుకకు తిరిగాడు. కాని వాడికి ఏమీ కనిపించలేదు. అయితే ఆ శబ్దం తనకు బాగా దగ్గరగా వస్తున్నట్లు తెలుసుకున్నాడు. వాడికి పైప్రాణం పైనే పోయింది. తనకు ఎదురుగా వస్తున్న ఆకలిగొన్న ఒక పెద్ద కుక్కను చూసి ప్రాణభయంతో పరుగెత్తసాగాడు. ఆ కుక్క వాడిని ఎలాగైనా తినేయాలని భయంకరంగా మొరుగుతూ వాడిని వెంటాడుతున్నది. ఆ క్రూర జంతువు నుండి ఎలాగైనా తప్పించుకోవాలని మునుపెన్నడూ పరిగెత్తనంత వేగంగా పరిగెత్తాడు.

అలా కొద్దిసేపు ఆగకుండా పరిగెత్తిన విక్కీ ఒక్క క్షణం ఆగి ఆ కుక్క తనకు ఎంత దూరంలో ఉన్నదో చూడాలని వెనుకకు చూశాడు. ఎక్కడా కుక్క వస్తున్నట్లు ఆనవాలు గాని, దాని మొరుగుడు గాని వాడికి వినిపించలేదు. హమ్మయ్య! అది ఎక్కడో దారి తప్పి వేరే మార్గంలో వెళ్లిపోయిందని వాడికి అర్థమైంది. ఇక తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసి ఎంతో హాయిగా గాలి పీల్చుకున్నాడు. వాడలా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడో లేదో, వాడి కాళ్ళ క్రింద ఉన్న మొక్కలు వాడి కాళ్ళ చుట్టూ అల్లుకొని తనను బంధించడానికి పైపైకి వస్తున్నట్లు గ్రహించాడు. తనకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద బండరాతిని అందుకొని ఆ మొక్కలు పూర్తిగా ముక్కలు ముక్కలు అయిపోయేలాగా వాటిని కత్తిరించేసినట్లు కొట్టి పడేశాడు.

ఇప్పుడు విక్కీకి అడవి కాని, అడవిలోని అందాల ప్రకృతి గాని ఏ మాత్రం ఆకర్షణీయంగా కనబడలేదు. ఆ చోటినుండి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనేదే విక్కీ ఆలోచన. వాడికి ఒక సురక్షితమైన చోటు కనపడింది. అక్కడకు చేరుకుందామని అడవి నుండి బయటకు దారి తీశాడు. కాని వాడికి అసలు తాను ఎక్కడున్నదీ అర్థం కాలేదు. ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. వాడికి వాళ్ళ అమ్మ, నాన్న గుర్తుకు వచ్చారు. వాళ్ళ నుండి దూరమైనానని తలచుకుంటే అంతులేని దుఃఖం వస్తున్నది.

ఇంతలో వాడికి తనను ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు వినిపించింది. కాని, వాడు వెనుకకు తిరిగి చూడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ అడవిలో తన పేరు ఎవరికి తెలుస్తుంది? ఊహూఁ! తనను ఎవరూ పిలవరు. అయితే, మరి ఎవరో గాని అలా ఆపకుండా వాడిని పేరు పెట్టి మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉన్నారు. కాసేపటికి వాడికి అది తన ఊహ కాదు, భ్రాంతి కాదు, నిజంగానే తననెవరో అలా పిలుస్తున్నారని అర్థమైంది. వెనుదిరిగి చూసిన విక్కీ నోట మాట లేకుండా అలాగే ఉండిపోయాడు!

వాడిని పిలుస్తున్నది ఒక మిణుగురు పురుగు! అది నిజం కాదని, తన భ్రమేనని మళ్లా అనిపించింది వాడికి. కాని ఆ మిణుగురు ఎగురుతూ ఎగురుతూ వాడికి దగ్గరగా వచ్చి “నువ్వు చూస్తున్నది నిజమే, నేను నీతో మాట్లాడుతున్నాను” అని చెప్పింది. వాడికి మిణుగురు పురుగు తనను పిలవడం పచ్చి నిజం అని అర్థమైంది. తన భ్రాంతి కానే కాదు! మిణుగురు వాడితో “విక్కీ! ఎలా ఉన్నావు? నీకెలా అనిపిస్తున్నది?” అని అడిగింది. వాడు తన కళ్ళను పదే పదే నలుపుకుని దాని వంక చూసి అది తనతోనే మాట్లాడుతున్నదని గ్రహించాడు. విక్కీ మిణుగురుతో “నీవు మనుషులు మాట్లాడినట్లే మాట్లాడుతున్నావు. నీకిది ఎలా సాధ్యపడింది?” అని అడిగాడు. మిణుగురు నవ్వుతూ “నేను మాట్లాడటమే కాదు, మీలా పాట పాడగలను, నృత్యం కూడా చేయగలను” అన్నది. “అవును గాని, నీవెందుకు అడవిని చూసి భయపడుతున్నావు? ఇక్కడనుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? నాకు చెప్పు” అని పదే పదే అడగసాగింది. విక్కీ ఒక పెద్ద భయంకరమైన కుక్క తనను తినాలని వెంటపడడం, తనను చంపేయాలని మొక్కలు తన కాళ్లకు చుట్టుకోవడం – ఈ మొదలైన అనుభవాలన్నీ చెప్పి అవి మళ్ళీ కనబడతాయేమోనని భయంగా ఉన్నదని చెప్పాడు.

‘అలాగా’ అన్నట్లు తల ఊపి మిణుగురు “నీకేమీ భయం లేదు. నీకు నేను సాయం చేస్తాను, సరేనా?” అన్నది. “కళ్ళు మూసుకో” అంటూ వాడి చెవి దగ్గరగా వచ్చి గుసగుసగా ఒక మంత్రం చెప్పింది. కళ్ళు తెరిచిన విక్కీకి తనకు రెండు ప్రక్కలా రెండు రెక్కలు ఉన్నట్లు అర్ధమైంది! మిణుగురు వాడిని చూసి నవ్వుతూ “విక్కీ! నువ్విప్పుడు హాయిగా అలా అలా ఎగురవచ్చు. నిన్నిప్పుడు ఏ జంతువులూ ఏ మొక్కలూ ఏమీ చేయలేవు” అని అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.

ఇంతకుముందు ఎప్పుడూ ఎగరటం అంటే ఏమిటో తెలియని విక్కీ నెమ్మదిగా తన రెక్కలను అలా విప్పి విశాలంగా చేసి ఎగరటానికి ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటికి వాడి ప్రయత్నం ఫలించి ఆ అడవిలో అలా అలా ఎగురసాగాడు విక్కీ. వాడికిప్పుడు తనకు ఏ ప్రమాదమూ లేదు కదా అని ఎంతో సంతోషం కలిగింది. ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఇప్పుడా అడవి అందాలన్నీ చూస్తూ హాయిగా ఎగురసాగాడు. కాని అంతలో వాడికి తననెవరో వెంబడిస్తున్నట్లు అనిపించింది. ఒక పెద్ద కప్ప తన పొడవాటి నాలుకను చాచి తన వైపే రావడం కనిపించింది! వాడికి గుండె ఆగినంత పనయింది. ‘ఈ కప్ప ఇంత పెద్దగా ఉన్నది. నేను దీని నుండి తప్పించుకోనూ లేను. లేదా దీన్ని నేను చంపనూ లేను’ అనుకున్నాడు తన మనసులోనే విక్కీ. అంతే! ‘కాపాడండి… కాపాడండి…’ అంటూ శక్తికొద్దీ పెద్దగా అరవడం మొదలు పెట్టాడు.

వాడు మేలుకొని కళ్ళు తెరిచాడు. వాడి శరీరమంతా చెమటతో తడిసి ముద్ద అయిపోయింది. భయంభయంగా ఆ పెద్ద కప్ప ఎక్కడ ఉన్నదో అని వగరుస్తూ అటూ ఇటూ చూడసాగాడు. అసలు అక్కడ ఎడారి కాని, అడవి కాని, జంతువులు గాని, మిణుగురులు గాని లేవని అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది మన విక్కీకి. తన మంచం పైనుండి క్రిందకు పడ్డాడు, వాడింత సేపు అనుభవించినదంతా ఒక కలలో మాత్రమే!

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here