మిణుగురులు – పరిచయం

0
9

[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]

[dropcap]ర[/dropcap]వీంద్రనాథ్ ఠాగూర్ ‘మిణుగురులు’ (Fireflies) 256 లఘు కవితల సంకలనం. 1923లో మొదటిసారిగా మేక్మిలన్ సంస్థ ఈ Fireflies ని ప్రచురించింది. వీటిలో కొన్ని కవితలు ఆంగ్లంలోనే నేరుగా రాసినా, ఎక్కువ భాగం కవితలు Lekhan – లేఖన్ నుండి, మరికొన్ని Sphulinga – స్ఫులింగ (1946లో ఠాగూర్ మరణాంతరం ప్రచురించబడింది) నుండి తీసుకున్నవి. అలా ఇందులో కవితలు – 13 స్ఫులింగ నుండి, ఒకటి రవీంద్ర బిక్శ నుండి, 36 నేరుగా ఆంగ్లంలో రాసినవి, తతిమా 206 లేఖన్ నుండి తీసుకున్నవి. చమత్కారాలుగా, నీతి వాక్యాలుగా, పెద్దాయన అద్భుతమైన అనుభవాలు, కాంతిమంతమైన ఆలోచనల మాలగా అనేక విధాలుగా ఇందులో కవితలు కనిపిస్తాయి. జపాన్ చైనా కవిత్వ ప్రభావంతో క్లుప్తంగా సహజంగా సందేశాత్మకంగా ప్రకృతితో మమేకమై ఉంటాయి.

చాలావరకూ ఇందులో కవితలు 1926లో ఠాగూర్ గుండె జబ్బు నయం చేసుకుందుకు నెదర్లాండ్‌కు వెళ్లి, అక్కడే రాసిన లేఖన్ (420 లఘు కవితలు) కవిత్వ సంకలనంలోనివి. అక్కడ వీరు నాటిన చెట్టు, దాని ముందు వీరు రాసిన పంక్తులు (నేను ఈ ప్రపంచంలో లేకపొయినా ఓ నా వృక్షమా! ఇక్కడ సంచరించే వారిమీద నీ ఆకులు వసంతంలో మర్మరధ్వని చేయనీ, కవి నిన్ను జీవితాంతం ప్రేమించాడు) ఇప్పటికీ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అక్కడికొచ్చే భారత ప్రభుత్వాధినేతలందరూ ఆ చెట్టుని తప్పకుండా సందర్శించి వారి నివాళులులర్పిస్తుంటారు. ఈ సంకలనంలో కవితలు కొన్ని బెంగాలీలో రాసి, వాటి దిగువన వారే స్వయంగా ఆంగ్లంలోకి అనువాదం చేసుకున్నవి కొన్ని, మరికొన్ని ఆంగ్లంలో రాసి తరువాత బెంగాలీలోకి అనువాదం చేసినవి కొన్ని (అలా మొత్తం 150 కవితలు), కేవలం బెంగాలీలోనే (48 కవితలు) లేదా ఆంగ్లంలోనే (72 కవితలు) రాసినవి మరొకొన్ని ఉన్నాయి. వాటిని ఠాగూర్ రాసినవి రాసినట్టుగానే వారి దస్తూరిలోనే నెదర్లాండ్‌లో అప్పట్లో ప్రచురించారు. అప్పట్లో అత్యాధునికమైన జర్మనీ రోటా ప్రింటరుతో దానిని ముద్రించారు. ఆ తరువాత కూడా చాన్నాళ్లు ఠాగూర్‍ ఆ కవితలకు అనేక మార్పులు చేర్పులూ చేసేవారు. కొన్ని నచ్చక కొట్టేసినవి ఉన్నాయి. అలాంటివి కనీసం 30 వరకూ ఉంటాయి. మొదటి ప్రపంచయుద్ధం ముందు రాసిన కవితలు రెండవ ప్రపంచయుద్ధం ఆరంభం వరకూ ఏవో మార్పులతో కొనసాగుతూనే వచ్చాయి.

వీటిని ఠాగూర్ స్వయంగా కవిత్వాణువులు అన్నారు. వీటిలో కవితలు ఎక్కువ భాగం రెండు నుండి ఆరు పంక్తులున్నవి. చైనాలోను, జపానులోను వీరి అభిమానులు ఆటోగ్రాఫ్ కోసం వీరిని అడిగినపుడు ఏవో చిన్న చిన్న కాగితాలమీద, కాగితం పంకాలమీద, జేబురుమాళ్ల మీద, కొన్ని కొందరు వ్యక్తులకు వ్యక్తిగతంగా అప్పటికప్పుడు తనకు తోచినది రాసిచ్చినవి. అలా రాసినవి వారితోబాటు వెళ్లినవారు రాసి ఉంచుకున్నవి తప్ప, చాలా వరకు పోయాయి. అప్పటికప్పుడు తోసినవి రాసిచ్చినా, ఆరిపోయిన చైనా లాంతరులా పాలిపొయి పనికిరాకపోయినట్టు కనిపించినా అవి నన్ను నేను వ్యక్తపర్చుకున్నవి అని వారే చెప్పుకున్నారు.

ఠాగూర్ ఈ కవితలు శాంతపరిచి, తాత్విక పరిశీలనలతో, రహస్యమంత అర్థాన్ని, యథార్థమంత సున్నితత్వాన్ని మోస్తాయి. కవి జీవితకాలంలోవే అయినా ఇప్పటికీ అవి అంతే తాజాగా ప్రతిధ్వనిస్తాయి. బహుశా చిత్రకారుడిగా వారి ఊహ మానవత్వాన్ని, ప్రకృతిని, విజ్ఞానాన్ని, మేళవించి సమతుల్యాన్ని సాధించడంలో వారికి ఉపయోగపడిందేమో.

అయితే ఠాగూర్ కవిత్వ అనువాదాల పట్ల అనేక వాదోపవాదాలు, విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు మిణుగురులు లోని మొదటి కవితకు అచ్చు బెంగాలీ అనువాదమిదని చూపిస్తారు.

నా కలలు మిణుగురులు,
ప్రకాశిస్తున్న జీవిత రత్నాలు;
గాఢమైన చీకటి రాత్రి నిశ్శబ్దంలో
ప్రసరిస్తున్న కాంతి కణాలు

London’s School of Oriental and African Studies బెంగాలీ బోధించే విలియం రేడిస్ ఠాగూర్ బెంగాలీ రచనల్ని అద్భుతంగా ఆంగ్లానువాదం చేసారు. కొన్నింటిలో గురుదేవునికంటే, చాలామంది అనువాదకులకంటే చాలా బాగా చేసారని విమర్శకులంటారు. అయితే కవి, తానే తన కవితల స్వీయానువాదం చేసుకుంటున్నప్పుడు, అతని స్వేచ్ఛకు అనువాదాల హద్దు అంతగా బాధించదు. ఒక్కోమారు అదే కవిత మరో కొత్త రూపంలో బయటకొస్తుంది. లేదా కొత్త కవితగా కూడా మారుతుంది. అనువాదాల నియంత్రణలో కవి స్వీయానువాదాలు చూసినప్పుడు తప్పకుండా అందులో అనేక లోపాలు లేదా మూలానికి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. గురుదేవుని అనువాదాలు అందుకు అతీతం కాదు. ఒక్క బెంగాలీకే పరిమితం కాలేని ఠాగూర్ విశ్వకవిగా సదా నిలిచేందుకే మిణుగురులైనా, మరే ఆంగ్లానువాదాలైనా. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడైనా ఎన్నాళ్లయినా అంతగానే ఆకర్షించబడి అందర్నీ ప్రపంచ వ్యాప్తంగా ఆనందింపజేస్తూనే ఉంటారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here