మిర్చీ తో చర్చ-12: నిచ్చెనెక్కటం ఎలా?

0
12

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]సుం[/dropcap]దరం ఆర్థిక పరిస్థితి పదిమెట్ల పైకి దూకేసి పదిలంగా కూర్చుంది. అవసరానికి సిల్క్ కుర్తా వేస్తాడు. అనవసరం అనుకున్న రోజున టి-షర్ట్‌‍లో కారు లోంచి దిగుతాడు. సుందరం చాలా సింపుల్, పూర్తి నిరాడంబరంగా ఉంటాడు అని ఇద్దరు ముగ్గురు సరదాగా చెప్పుకొంటారు.

కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తెరిచాను. షర్ట్ టక్ చేసుకుంటే ఒక సమస్య, చేయకపోతే మరొకటి అన్నట్లు ఆఖరుకి లోపలికి దోపే ఉంచిన షర్ట్, పాదాల వరకూ అక్కరలేదనట్టు కనిపిస్తున్న పాంటు, చెప్పేసేందుకు చాలా సిద్ధంగా ఉన్నదనిపించే ముఖ కవళికలు, సమాజాన్ని ఉద్ధరిస్తానంటున్న సంచీ ఇంకా ఆశగా భుజాన వేలాడుతుంటే పట్టు వదలద్దు అని చెబుతున్నట్లు గట్టిగా పట్టుకొన్న ఎడమ చెయ్యి, అన్నీ కలబోసి ఓ రచయిత లాంటి శాల్తీ కొద్దిగా స్థిరంగా నిలబడి ఉంది.

“సుందరం గారు కావాలి” అన్నాడు.

నేనేం మాట్లాడలేదు.

“సార్, మిర్చీ కన్సల్టెన్సీ ఇదే కదా?” అన్నాడు.

“అవునండీ”

“నా పేరు వరాహం”

“….”

“వరాహ నరసింహం. రాహీ నా టైటిల్”

“లోపలికి రండి”

అతను లోపలికి రాలేదు. సంచీ లోంచి ఏదేదో కెలికి ఓ కాగితం ముక్క చూపించాడు. ఆన్‌లైన్‌లో పదివేల రూపాయలు కట్టి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు.

“ఓ… రండి. లోపలికి రండి. సార్ వస్తారు.”

సుందరం లోపలే ఉన్నాడు. అయినా అంత తేలిగ్గా ఇవతలికి రాడు.

ఇద్దరం ఎదురు బొదురు కూర్చున్నాం.

“మీరు…”

“రాహీ… రచయితనండీ”

“ఓ… ఏం వ్రాస్తూ ఉంటారండీ?”

“తప్పుగా అడిగారు”

“అంటే?”

“ఏం వ్రాయరు అని అడగాలండీ”

“ఛా”

సుందరం వచ్చాడు. ఆయన నిలబడి నమస్కారం చేసుకున్నాడు. కూర్చోమని సైగ చేసి తానూ కూర్చున్నాడు. మొబైల్‌లో ఏదో చూశాడు.

“మీరు రచయిత” అన్నాడు.

“సార్”

“నిచ్చెనెక్కాలనుకుంటున్నారు”

“సార్”

“ఊఁ… నాకు అన్నీ నిజాలు చెప్పాలి”

“సార్”

“అసలు మీరు ఎందుకు వ్రాస్తారు?”

పొట్టిగా ఉన్న పాంటు లోంచి లోనకి ఏదో జెర్రి ప్రవేశించిన రీతిని తట్టుకోలేని వానిలా అమాంతం లేచి నిలబడ్డాడు. లాభం లేదన్నట్టు చూశాడు సుందరం. రాహీ గోడ మీద చెయ్యి పెట్టాడు. ఎడమ చేయి నడుము  మీద ఉంచాడు.

“ఒక రచయిత ఎందుకు వ్రాస్తాడు? అంతస్తులు అంతఃస్థితులను దాటేసి అంతరంగం ఆలోచనల రణరంగంలో మూడవ ప్రపంచ యుద్ధం యొక్క మూడ్‌లోకి వచ్చినప్పుడు ఇది వచనమూ కాదు, ప్రవచనమూ కాదు… అపర సత్యానికిది నిర్వచనం అని చెప్పేటప్పుడు ముందుకు వచ్చేది ఒక రచన… వ్రాస్తాడు. ఎందుకో వ్రాస్తాడు ఓ రచయిత!”

గట్టిగా గాలి పీల్చమంటాడు డాక్టర్. ఇక అలా పీలుస్తునే ఉంటే ఆ డాక్టర్‌కి ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూసినట్లు సుందరం కూడా అటూ ఇటూ చూశాడు.

పరిస్థితి గమనించి వచ్చి కూర్చున్నాడు రాహీ.

“మీలో ఉత్సాహం బాగుంది…” చెప్పాడు సుందరం. “… కాకపోతే మీకు నిచ్చెన ఎలా ఎక్కాలో తెలియాలి.”

ఓ కుర్రాడు ప్లేట్లో నాలుగు మిర్చీలు పట్టుకొచ్చాడు. ఒక మిర్చీ తిన్నాడు రాహీ. సుందరం ఆపాడు.

“రెండవది అప్పుడే వద్దు”

రాహీ మంచినీళ్ళు త్రాగబోయాడు. అదీ ఆపేశాడు.

“మీకు ఎలా ఉంది?”

“నోరు మండుతోంది”

“కరెక్ట్. మండాలి. ప్రతి వ్యక్తికీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మండి తీరాలి. ఆవేశం రావాలి. ఆవేదన కావాలి. అది అర్ధరాత్రి వరకూ సాగి చుట్టుకున్న సంకెళ్ళన్నీ తెంచుకుని స్వాతంత్ర్యంలోకి దొంగతనంగానైనా దూకాలి”

రాహీ ఆక్రోశంతో చూస్తున్నాడు. రచయిత ద్రవించినట్లున్నాడు. రెండు కన్నీటి చుక్కలు రచయిత భాషలో చెప్పాలంటే అమ్మాయిల చెవులకుండే జూకాలకు వ్రేలాడుతున్న ముత్యాలలా అగుపించాయి.

“ఇది గట్టిగా ఎక్కవలసిన మెట్టు…” సుందరం చెప్పాడు. “… నిచ్చెనను ఇరుప్రక్కలా గట్టిగా పట్టుకుని కాలిని ఎప్పుడూ రెండో కర్ర మీదనే అదిమి పెట్టాలి!”

“అయ్యా…” రాహీ సంశయం వ్యక్తపరిచాడు – “మొదటిది ఏం చెయ్యాలి?”

“మొదటిది అనవసరం. నేను ప్రకాశిస్తున్నాను అని సూర్యుడు ఎన్నడూ ప్రకటించడు. మీరు రచయిత అన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు. లోకానికి తెలియడం లేదు. అంత ఎందుకు? ఇప్పుడే మీరు ఆ గోడ దగ్గర చెప్పిన ప్రసంగానికి అది చిన్నగా కదిలిందని నేను పెద్దగా చెప్పనక్కరలేదు”

రాహీ నోరు తెరచి దానిని అలాగే వదిలేశాడు.

“మీరు రచయిత అని మీకు ఎవరూ చెప్పనక్కర్లేదు” అన్నాడు సుందరం నా వైపు చూస్తూ. ఏ మాత్రం సందేహం లేదన్నట్లు నేను తల ఊపాను.

“కరెక్ట్” అన్నాడు రాహీ. కాకపోతే ఆ గొంతు నూతిలోంచి కదిలింది.

“రెండవ మిర్చీ తినండి” అన్నాడు సుందరం.

రాహీ అటూ ఇటూ చూశాడు. కురాడు చేతులు కట్టుకున్నాడు. రాహీ జాగ్రత్తగా మిర్చీ తీశాడు. సగం తిని మా ఇద్దరినీ అనుమానంగా చూశాడు. సుందరం కాలు మీద కాలు వేశాడు. రాహీ మిర్చీ తినేశాడు.

“ఎలా ఉంది?”

“సార్, ఇది కొద్దిగా తక్కువ కారంగా ఉంది”

“రెండవ మెట్టు – అంటే మీకు. మీరు రచనలు ఎడిటర్‌కి ఎలా చూపిస్తారు?”

సంచీ చూపించాడు రాహీ.

“సార్. ఇందులో పెట్టి మోసుకుని వెళ్ళి వాళ్ళ ముందరపెట్టి వినిపించడం మొదలుపెడతాను”

చెయ్యి అడ్డు పెట్టాడు సుందరం.

“జీవిత సత్యం చెబుతాను వినండి”

“సార్”

“నో… మంచి నీళ్ళు ముట్టుకోకూడదు”

“ఓ”

“జీవిత సత్యం ఏమిటో తెలుసా?”

“సార్”

“డాక్టర్లకి రోగులంటే పిచ్చి ఉత్సాహంగా ఉంటుంది”

“కరెక్ట్”

“కానీ వాళ్ళు వెంట తీసుకుని వచ్చే రోగాలంటే ఇబ్బందిగా ఉంటుంది”

“ఓ”

“ఎడిటర్లకి రచయితలతో చాలా పనుంటుంది”

“కరెక్ట్”

“వాళ్ళు చూపించే ప్రతిభ పెద్దగా నచ్చదు!”

సంచీ నేల మీద పడేశాడు రాహీ. కుర్చీలోంచి క్రిందకి జారి – మండుటెండలోంచి వచ్చి మెండైన చెట్టు నీడలోకి వచ్చినట్టు – సుందరం కాళ్ళ దగ్గర చేరాడు.

“అంచాత రచయిత గారూ! చక్కగా ఎడిటర్ గారిని పొగడకుండానే పొగడాలి”

“అదెలాగో చెప్పండి”

“మీ పత్రిక మీతోనే మొదలు, మీతోనే ఆఖరు అని గట్టిగా అని మధ్య వేలితో టేబిల్‍మీద ఉన్న దేనిపైనైనా గట్టిగా నొక్కండి. ఎడిటోరియల్‌లో మీరు లేవదీసే విషయం, దాని గురించి చెప్పే తరహా అనితర సాధ్యం అని అందంగా చెప్పి కుర్చీలో వెనక్కి వాలండి”

“ఓ”

“మీ శైలిని అభిమానించి, అనునయించి, అనుసరించి కేవలం ఎనిమిది పేజీలు నుడివానని చెప్పి ముందరుంచండి. ఆయన ఏమంటారో తెలుసా?”

“తెలీదు”

“అలా వద్దండి. మీరు మీ శైలిలో వ్రాయాలి. అందరు ఒకలాగ వ్రాయకూడదు… అయినా… అంటే ఇది దేని గురించి ఎత్తుకున్నారండీ? అంటాడు”

“భలే చెప్పారు సార్. ఖచ్చితంగా ఇలాగే అంటాడు ఒకాయన”

“అదీ. విషయం చెప్పండి. మీరు ఏదో వ్రాసినా వాళ్లకి కావలసిందీ… రీడబిలిటీ, చమత్కారం, సామాన్యుడు చదివేదిలా అని చెప్పండి”

“ఓ”

“ఆయన ఏమంటాడో తెలుసా?”

“సార్”

“అది చాలా ఇంపార్టెంట్… అంటాడు”

“కరెక్ట్”

“మూడో బజ్జీ తినండి”

కుర్రాడు ప్లేటు క్రిందకి తెచ్చాడు. సుందరాన్ని అదోలా చూస్తూ మూడోది ఆరగించాడు.

“ఇదెలా ఉంది?”

“బజ్జీ సైజు కొద్దిగా పెద్దది. అక్కడక్కడ చింతపండు అంటుతోంది నాలుకకు!”

“శభాష్. ఇది క్లాసిక్ బజ్జీ”

“అంటే?”

“కొంత ప్రజలలో పడ్డాక ఎక్కువ తినవలసిన బజ్జీ”

“అర్థం కాలేదు”

“నేను చాలా చదువుకున్న వాడిని, ఎంతో అవగాహన ఉన్న వాడిని అనేది నలుగురూ అర్థం చేసుకోవాలి. దానికి ఓ పద్ధతి ఉంది”

“సార్”

“గొప్ప గొప్ప వాళ్ళ శ్లోకాలు, పద్యాలు, అలా మధ్య మధ్యలో బయటకు వదులుతూ ఉండాలి. వాళ్ళ గురించే చర్చించేవాళ్ళూ, మాట్లాడేవాళ్ళతో ఫొటోలు దిగి పలుచోట్ల కండువాలతో కనిపించాలి.”

రాహీ పైకి జరుగుతున్న పొట్టి పాంటును బలవంతంగా క్రిందకి తోశాడు.

“ఇప్పుడే చెబుతాను” అన్నాడు.

“వద్దు. నాకు అవసరం లేదు. పన్నీరు ఇళ్ళల్లోనూ, కళ్ళల్లోనూ చల్లుకుంటే అస్సలు లాభం ఉండదు. చల్లవలసిన చోట చల్లాలి.”

“అర్థమైంది”

“మీరు నిచ్చెన ఎక్కుతున్నారు”

“కరెక్ట్”

“ఈ మెట్టు దగ్గర నుండి కాలు దేని మీద పెడుతున్నారో చూడనక్కరలేదు. కాలు ఎక్కడుందో కనిపెట్టుకుంటూ పైకి చూస్తూ పైకి ఎక్కాలి… అంటే కొన్నింటిని తొక్కాలి.”

“కరెక్ట్”

“చూశారూ… పెడల్ మీద కాలు పెట్టి తొక్కితేనే బండి ముందర కెళుతుంది. డాష్‌ బోర్డు మీద గట్టిగా తన్ని పైకి ఎగిరి డైవ్ కొడతాడు అతను”

“నాల్గవ బజ్జీ అందుకోండి”

రాహీ మిగిలిన ఆఖరు మిర్చీ పట్టుకుని ఇందులో ఇంత ఉందా అన్నట్లు చూశాడు. మంచి నీళ్ళ సంగతి మరిచిపోయి ఆనందంగా కొరికాడు. పొరపాటుగా వేలు కొరికినట్లో లేక తేలు అతన్ని కొరికినట్లో కెవ్వున కేకపెట్టి లేచి నిలబడ్డాడు.

“ఇంత కారమా?”

“తినాలి”

“తప్పదా?”

“తప్పదు”

అతను తెచ్చుకున్న సంచీని అడ్డం పెట్టుకుంటూ తినేశాడు. సుందరం మంచి నీళ్ళు అందించాడు. ఒక్క క్షణం అతనివైపు అనుమానంగా చూసి త్రాగేశాడు.

“ఇది నాలుగో మెట్టు”

“సార్”

“ఇప్పటి వరకూ మామూలూ రచయిత అని పేరు. ఇప్పుడు అసలు రాకెట్‌లా ఆశల పేకమేడలన్నింటినీ దూసుకుంటూ దాటేసి నేరుగా మంగళగ్రహం మీదకి చేరుకోవాలి”

రాహీ అసలు ఈ లోకంలో లేడు. టక్ చేసిన షర్ట్ టక్కున బైటకు తీసేశాడు. కిటికీ బైటకి ఓ చూపు చూసి సుందరం వైపు తిరిగాడు.

“మీరు సూపర్ సార్. చెప్పండి”

“మీడియాలోకి దూసుకెళ్ళాలంటే ఇది వజ్రాయుధం”

“వదలండి సార్. నేను రెడీ!”

“జనం ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తారో, యుగ యుగాలుగా ఏది నరనరాలలో నాటుకున్నదో, ఏ చరిత్ర, సంప్రదాయం ప్రపంచ ఖ్యాతి పొందినదో – మీరు చేస్తున్న పని తప్పని తెలిసినా – అదంతా బూటకం, ట్రాష్, మిథ్య, అన్యాయం అని చాటుతూ, ఇది అసలు సంగతి అంటూ దిక్కుమాలిన వితండమైన తర్కాన్ని నలుమూలల నుండీ సేకరించిన చెత్తనంతా నింపి ఒక పుస్తకం వ్రాసి ప్రచురించి అలాగే కొన్ని కీలకమైన ప్రదేశాలలో ప్రసంగాలివ్వండి! బి.బి.సీ.లో కూడా మీ మీద ఓ గంట సేపు కార్యక్రమం ఉంటుంది”

రాహీ సంచీలో ఉన్న పుస్తకాలన్నీ క్రింద పడేశాడు. చొక్కా మడిచాడు. మొదటి గుండీ ఎందుకో పంటితో పీకేశాడు.

“అయామ్ నాట్ రాహీ… అయామ్ హీరా! హీరా!” అన్నాడు.

“నో…” అన్నాడు సుందరం. “మీరు హీరో.. రచయితలు హీరోలను సృష్టిస్తారు. మీరు స్వయంగా హీరో!”

రచయిత మెల్లగా ఈ లోకంలోకి వచ్చాడు. అన్నీ సర్దుకుని విచిత్రమైన నడకతో బైటకెళ్ళిపోయాడు!

కుర్రాడు మిర్చీ ప్లేటు తీసుకెళ్ళిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here