మిర్చీ తో చర్చ-13: భర్తను బాగు చెయ్యడం ఎలా?

0
8

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

సుందరం వ్యాపారం ముప్ఫయి కాల్సు, మూడు వండల మెసేజులుగా అభివృద్ధి చెందుతోంది. వరండాలో టోకెన్లు తీసుకుని జనం కూర్చుంటున్నారు. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి లోపలికి వచ్చింది. మొబైల్ లోంచి ట్రాన్సాక్షన్ నెంబరు బిగ్గరగా చదివింది. సుందరం తన మొబైల్ చూస్తూనే కూర్చోమని సైగ చేశాడు.

“జ్యోతి” అన్నాడు.

అవునన్నట్లు తలూపింది. కుర్రాడు మిర్చీ బజ్జీల ప్లేటు తెచ్చి టీ పాయ్ మీద ఉంచాడు. మూడు బజ్జీలే ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ నిర్ధారిస్తుంది. కుర్రాడు ప్లేటు పెట్టిన తరువాత మొబైల్‍లో ఏదో నొక్కి వెళ్ళిపోయాడు.

“మీ ఆయన మీ మాట వినడం లేదు” అన్నాడు సుందరం. అమ్మాయి ఎందుకో నన్ను చూసింది. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలి కాబట్టి ఓ సారి చైనాతో సంప్రదిస్తే బాగుంటుందన్నట్లు తల ఊపాను. భర్త మాట వినకపోవడం అనేది సాధారణమైన సమస్య కాదు. అది ఒక ధారావాహిక!

“ఒక మిర్చీ తీస్కోండి. మంచి నీళ్ళు తీస్కోకూడదు. మీ వైపు ఉన్నది మొదటి మిర్చీ. అలా అన్నమాట!”

మిర్చీ తీసుకుని మెల్లగా తినేసింది.

“చాలా కారంగా ఉంది సార్”

“కరెక్ట్. వివాహం అనేది మిర్చీ బజ్జీ లాంటిది. తినే వరకు తినాలనిపిస్తుంది. తినేశాక ఎందుకు తిన్నామో అనిపిస్తుంది. అలా అని వద్దనుకున్నా మరల తినాలనిపిస్తుంది. ఇంతమంది జనాలని చూడండి. వద్దంటూనే ఉంటారు, అయినా తింటూనే ఉంటారు”

“నా ప్రాబ్లమ్”

“కరెక్ట్. పాయింటుకు వద్దాం. టైముకు వండి పెట్టకపోతే అలిగి తినకుండానే వెళ్ళిపోతాడు. అవునా?”

అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది.

“మిర్చీని ముట్టుకోకుండా అందులో ఎన్ని గింజలున్నాయో చెప్పే విద్య మాది. నువ్వు చెప్పేది వింటాడు కానీ పెద్ద లెక్క చెయ్యడు”

“అస్సలు”

“అదీ. మిర్చీ లోనే మందుంది”

“ఇవ్వండి”

“అరె! తినేసావు కదా? ఇంకేంటి?”

“అంటే?”

“భర్తను లొంగదీసుకునేందుకు…”

“సార్… బాగు చేసుకునేందుకు”

“సారీ. దేనిని బాగు చేయాలన్నా ముందర లొంగదీసుకోవాలి”

“నేను పెత్తనం చేసే టైపు కాదు”

“అలా కనిపించక్కరలేదు. బజ్జీలో కారం లోపలుంటుంది”

“…..”

“అత్తగారున్నారా?”

“ఉన్నారు. అక్కడే కదా అసలు సమస్య”

“అద్దీ, సమస్యా అక్కడే, మందూ అక్కడే”

“అంటే?”

“సింపుల్. ఈసారి టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళగానే చక్కగా నువ్వు వడ్డించుకుని తినెయ్యి. నీ వైపు అక్కినేని నాగేశ్వరరావులాగా చూస్తాడు”

“కరెక్ట్. అదే చూపు”

“కానీ మీ ఆయన అందగాడు”

ఎందుకో నా వైపు చూసింది. సిగ్గు పడుతుందనుకున్నాను. ఏమో పడిందేమో! గదిలో ఇంకో బల్బు ఉంటే కనిపించేది.

“చెప్పండి, ఇంతకీ ఏం చెయ్యమంటారు?”

“అక్కడ తినొచ్చారుగా? ఇక్కడేం బాగుటుందీ? అను”

కళ్ళు పెద్దవి చేసింది.

“ఎనీ డవుట్?”

“ఇలా చాలా ఉన్నాయి. అన్ని చోట్లా ఇదే టెక్నిక్ వాడాలా? మార్చాలా?”

“గుడ్ క్వశ్చన్! సమయానుకూలంగా వాడాలి. టార్గెట్ మటుకు ఒకటే. రెండవ మిర్చీ తీసుకో”

ఎంతో సంతోషంగా, ఆదరంగా తీసుకుంది.

“ఎలా ఉంది?”

“ఇది అంత కారంగా లేదు”

“కరెక్ట్. ఎందుకో తెలుసా? టెక్నిక్ అలవాటయిన తరువాత ఆట తేలికవుతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కడి నుండో వచ్చి లోపలికి ప్రవేశిస్తాయి. రెండవ మిర్చీ సంగతి చెబుతాను”

“చెప్పండి” ఇప్పటికే అమ్మాయి ఇంతకంటే పెద్ద స్కెచ్‌లు వేస్తోందని అర్థమవుతోంది.

“ఆవిడ మాట ఎత్తినప్పుడల్లా కోపం వచ్చి అరుస్తాడు”

“మరి?”

“నువ్వు మామూలుగానే ఉండు. ఇంజక్షన్ ఇచ్చే డాక్టరులా చిరునవ్వుతోనే ఉండాలి…’

“ఊఁ…”

“అతను సినిమా డైలాగులు వినిపిస్తాడు. కోపం వచ్చిన ప్రతీ వాడికీ ఆంగ్లం ధారాళంగా వచ్చేస్తుంది”

“అవునండీ. ఏవేవో మాట్లాడుతాడు”

“కరెక్ట్. ఇతను ముక్కోపి, షార్ట్ టెంపర్డ్, విచక్షణ లేనివాడు, ఎక్కువ మాట్లాడితే పిచ్చివాడు అన్న సంగతి అందరికీ కాకపోయినా కావలసిన వాళ్ళందరికీ తెలియాలి”

“నాకు అలాంటివి ఇష్టం లేదు సార్. నాకు కావలసింది…”

సుందరం చెయ్యి అడ్డు పెట్టాడు.

“వివాహం మిర్చీ లాంటిది అని ఇందాకే చెప్పాను. ఇష్టం, అయిష్టంతో పని ఉండదు. ఇష్టం లేకపోయినా కొంత జరిగిపోతుంది. కాలం కూడా అలా కరిగి పోతుంది”

“తరువాత?”

“నిశ్శబ్దంగా నీతో తినేసి గాంభీర్యం చూపిస్తూ కాలం గడుపుతాడు”

“ఊఁ… మరి జీవితం?”

“ఏం కాదు. గణాంకాల ప్రకారం ఈ వ్యవహారం నాలుగు నెలలకంటే ఉండదు”

“ఛా!” మరల నావైపు చూసింది. ఈ గణాంకాలను పుస్తకాలలో భద్రపరిచినవాడిలా కనిపించి ఉంటాను.

“మిగిలిపోయిన మిర్చీ తీస్కో”

తీసుకుని తినేసింది. తీస్కోవచ్చా అన్నట్లు చూసి మంచి నీళ్ళ గ్లాసు తీసుకుంది.

“ఈ మిర్చీ ఎలా ఉంది?”

“ఏదో మసలాలా వుంది. పుల్లగా, హాయిగా ఉంది”

“దటీజ్ సంసారం. రుచి తెలియదు. కానీ బాగుంటుంది”

“కరెక్ట్”

“మీ ఆయన కూడా ఏదో మిర్చీ తింటాడు”

“అవును. బాగా తింటాడు”

“కొత్త పద్ధతులు అవలంబిస్తాడు”

“అంటే?”

“సింపుల్. నిన్ను ఎందుకో పొగడడం మొదలెడతాడు”

నా వైపు చూసింది. ఎందుకైనా మంచిదని ఓ చిరునవ్వు ఇచ్చేసాను.

“ఎలా?”

“అది నేను చెప్పలేను తల్లీ”

ఓ నవ్వు నవ్వింది. చేతులు కట్టుకుంది.

“కాలం వృథా చేసుకోకుండా నీ దారిన సంచరిస్తాడు”

“మూడో మిర్చీ సంగతి చెప్పలేదు?”

“ఊఁ… చూడమ్మా! వీళ్ళూ వాళ్ళూ కాకుండా అతను సరదాగా ఎందుకు ముందుకెళతాడో తెలుసా?”

“ఎందుకు సార్?”

“వాస్తవం చెబుతాను విను. నీ ఒక్కదాని వలన అతను తన పూర్తి ప్రపంచాన్ని వదులుకోడు”

అమ్మాయి లేచి నమస్కారం చేసుకుంది.

సుందరం కూడా లేచాడు.

“చూడమ్మా! ఇక మీదట ఒక్క విషయమే గుర్తు పెట్టుకో. నీ భర్త మాట వింటే ఎవరి మాట వినవలసిన అవసరం ఉండదు”

“భర్త ఎలాంటివాడైనా సరేనా?”

“ఇప్పుడు బాగుపడ్డాడనుకుందాం!”

“అంతేనా?”

“ముమ్మాటికీ అంతే!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here