మిర్చీ తో చర్చ-14: భార్యను బాగు చేయడం ఎలా?

0
6

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ”. [/box]

[dropcap]మొ[/dropcap]బైల్‍లో టోకెన్ అనుకోకుండా 420 వచ్చింది. తలుపు దగ్గర ఈ దేశం నాకేమిచ్చింది అని అడుగుతున్నట్లు నిలబడ్డాడు. కళ్ళజోడు ఉన్నది కానీ అందులోంచి చూడడం లేదు. కోటేరు లాంటి నాసిక మీద సెన్సెక్స్ జారిపోయినట్లు అది జారి ఉంది. దాని మీద నుండి చూస్తున్నాడు! పాంటు కుడి కాలు మీద కొద్దిగా పొట్టిగా కుట్టినట్లున్నాడు అతని టైలరు. లేదా అలా కనిపించేటట్లు తొడుక్కున్నాడు. ద్వారబంధం మీద చెయ్యిపెట్టాడు. చొక్కా మొదటి రెండు గుండీలూ విప్పి ఉన్నాయి. లోపల నుండి బనియన్ విప్పారి చూస్తోంది. అదేమి చిత్రమో మాతో పని ఉండి వచ్చిన వాడై యుండి కూడా మీరిక్కడ ఎందుకున్నారు అన్నట్లు చూస్తున్నాడు…

“రండి” అన్నాడు సుందరం. నిప్పులాంటి మనిషి కూడా అలా నడిచి ఉండడు. అలా వచ్చాడు. సోఫాని అదిమి పరీక్షించాడు. ఫరవాలేదన్నట్లు తల ఊపాడు. కూర్చుని ఎందుకో తల ఆడించాడు.

“ఈ రెండు గుండీల వైపు చూడకండి. పైళ్ళైన స్త్రీకి మంగళ సూత్రం ఎలాగో పెళ్ళి అయిన మగాడికి ఈ రెండు గుండీలు అలాంటివి. వివాహం అంటే గుండిగ నీళ్ళల్లో చిట్టెలుక మునిగిపోవడం లాంటిది!”

“మీ బాధేంటి?”

“అంటే?”

“వివాహామా? భార్యయా?”

“వివాహం చేసుకున్నాను అని గుర్తు చేసే భార్య!”

ప్లేటు వచ్చింది. మూడు మిర్చీలను కట్ చేసి ఆరు ముక్కలుగా అమర్చారు.

“ఏదైనా ముక్క తీస్కోండి”

ఒకటి తీసి నోట్లో వేసుకున్నాడు.

“ఎలా వుంది?

“ఏ రుచీ పచీ లేదు”

“ఊఁ… ఎలా ఉంటుందనుకున్నారు?”

“కొద్దిగా కారం…”

చెయ్యి అడ్డుపెట్టాడు సుందరం.

“మిర్చీ బజ్జీ కాబట్టి”

“కరెక్ట్. స్త్రీ లక్షణం కూడా అంతే.”

“ఛా”

“అవును. ఏదో ఉంటుంది, ఏదో చేస్తుంది, చెయ్యాలి అని ఆశించకూడదు. రెండవది తీస్కోండి.”

అతను రెండవది తీసుకున్నాడు.

“ఎలా ఉంది?”

“కొద్దిగా లైటుగా మసాలా తగిలింది”

“గుడ్. మీరు అతిగా మాట్లాడతారని అర్థం అవుతోంది”

“కాదు. పైళ్ళైన తరువాత….”

చెయ్యి అడ్డుపెట్టాడు సుందరం.

“పెద్ద విషయం కాదు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్… ఇవన్నీ దైవం గురించి చెప్పారు. అది భార్య గురించి చెప్పాలి. మగాడు పెళ్ళి తరువాత మాట్లాడుతాడు, మాట్లాడడం మరిచిపోతాడు, పిరికివాడు కూడా ఆంజనేయస్వామిలా గుండె చీల్చి… సారీ గుండీ తెంచి ఏవేవో చెబుతాడు, చిన్నగా చెప్పాలంటే తనలోని కవినే ఆవిష్కరించుకుంటాడు. చరిత్ర  దీనికి నిదర్శనం”

అతను మూడో గుండీ కూడా విప్పేసాడు.

“మొదటిది అర్థమయింది. రెండవది అర్థం కాలేదు”

“అందులో మసాలా ఉంది సార్. మాటలు పూర్తిగా తగ్గించెయ్యండి. నిశ్శబ్దం అన్ని శబ్దాలకు మూలం.”

“మాట్లాడడం మానేసి ఏం చెయ్యాలి?”

“దిక్కుమాలిన మొబైల్ ఉంది కదా, దాంట్లోకి దూరండి”

“అర్థమయింది. ఆమె కూడా దూరిపోతే?”

“మరీ హాయి. అందులోంచే చెప్పదలచుకుంది చెప్పండి.”

“ఊఁ…”

“భార్యతో ఏ రోజూ వాదన తగదు. గాంధీ గారిలాగా మీ జీవన విధానమే సందేశం అన్నట్లు నడుచుకోవాలి. “

మూడవది తీసుకున్నాడు.

“ఇది పిచ్చ కారంగా ఉంది”

“కరెక్ట్. ఆమె ద్వారా  మీకు బంధువులైన వారిని ప్రతి వారం ఒక్కసారైనా పలకరించాలి.”

అతను లెచి నిలబడ్డాడు. దగ్గరకెళ్ళి కూర్చోపెట్టాను.

“అన్యాయం… నేను…”

చెయ్యి అడ్డం పెట్టాడు సుందరం.

“మీ మా అనేవి బంధుత్వాలలో పనికిరాదు. పెళ్ళిలో ఎదురుకోలు ఎందుకు చేస్తారు?”

“అటు ప్రక్క నుండి…”

“అనవసరం. మీరు మటుకు అది చేస్తూ ఉండండి. ప్రవర్తన గమనించండి”

ఈ సారి ఎందుకో మంచినీళ్ళు త్రాగనిచ్చాడు. కోపంగా చూశాడు.

“ఈ సారి రెండు తీస్కోండి”

తీసుకున్నాడు.

“ఎలా వుంది?”

“బావుంది”

“అంటే?”

“కారం, పులుపు, కొద్దిగా తీపి…”

“శభాష్!”

“ఇప్పుడేం చెయ్యాలి?”

“కొన్ని పాకేజీలు కలిసి చెయ్యండి – చెకప్‌లు, టూరులు… ఇదెందుకంటే జీవితానికి కావలసినవి ఏవి? అక్కర్లేనివి ఏవి అనేది చేతల ద్వారా చూపాలి… నో లెక్చర్! స్త్రీలకు లెక్చర్లు నచ్చవు. అతిగా మాట్లాడేవాళ్ళని స్త్రీలు ఏ మాత్రం పట్టించుకోరు.”

లేచి నిలబడ్డాడు.

“వస్తాను. జ్ఞానోదయమైంది”

“మరి చివరి పీస్?”

తీసుకుని తిన్నాడు.

“ఇది అసలు మిర్చీ రుచి. అదిరించి. ఇందులో సందేశం?”

“మీరు ఇంటికి వెళ్ళాక చెబుతాను. గుండీలు పెట్టేసుకోండి”

అతను వెళ్ళిపోయాడు.

“ఏంటి సందేశం?” అడిగాను. సుందరం నవ్వాడు.

“ఇంతకీ ఎవరు ఎవరిని బాగు చేసారు?”

“ఏమో”

“చివరి పీస్ అదే. భార్యను బాగు చేయటం అనేది ఏమీ ఉండదు! అది అవసరమూ లేదు. అదే సంసారంలోని సారం!”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here