మిర్చీ తో చర్చ-2: ‘హక్కు’ పక్షి

    0
    7

    [box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

    [dropcap]ఉ[/dropcap]గాది నాడు ఉదయమే లేచి సుందరం కోసం వెతికాను. ఇంట్లో ఎక్కడా లేడు. నాలుగు రూపాయలు రాలగానే ఇతనికి ఎక్కడి నుండో కాళ్ళకి చక్రాలు వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళాడో ఏమో? సామాన్యంగా ఎదురింటి ఆవిడని మాటల్లో పెట్టి అవీ ఇవీ తెచ్చికొచ్చి పెడుతూ ఉంటాడు. వీధిలోకి తొంగి చూశాను. అక్కడా లేడు. ఎక్కడికెళ్ళాడో, అతనొచ్చేలోపల ఈ ఉగాది పచ్చడి సంగతి చూద్దామని సంచీలోని సరుకులు వెతుకుతూ టీ.వీ. ఆన్ చేశాను. ఆ కొద్ది సేపట్లోనే ఏదో మనకు అంటగట్టేద్దామనుకుంటూ ఆదుర్దా పడిపోతారు ఆ టీ.వీ.లోని వారు. వార్తల ఛానెల్ తిప్పాను. అప్పుడే ఓ చర్చ ప్రారంభం అవుతున్నట్లుంది!

    “మా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు” అంటూ ఓ అమ్మాయి నమస్కారం చేసింది. అలవాటుగా చెయ్యి చూపించి కూర్చున్నాను.

    “ఉగాది పచ్చడి మీద మనం సరదాగా ఎన్నో జోకులు వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు మన ముందర ఉన్న విషయం అది కానే కాదు. మన మధ్యలో ఉన్న వ్యక్తి సుందరం గారు…” కెమెరా సుందరం మీదకి వచ్చింది. కళ్ళజోడు సద్దుకుని మరీ చూశాను. సందేహం లేదు, సుందరమే. వార్నీ! ఇక్కడికెలా దూకేసాడు? రోజూ చిర్రుబుర్రులాడేవాడు చక్కగా ఓ చిరునవ్వు నవ్వుతూ చేతులు జోడించాడు. కెమెరా అంటే చాలు, ఎంత గొంతు చించుకున్నా మన వైపు చూడని వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసుకుని గుండ్రంగా తిప్పుతూ కనిపిస్తారు.

    “ఇంతకీ సుందరం గారు ఏమంటున్నారంటే అసలు ఉగాది పచ్చడి ఎవరో మొదలుపెట్టిన ఆచారం. దాని బదులు మిర్చీ బజ్జీ అనేది ఆచారంగా నెలకొల్పాలి అని అంటున్నారు. షడ్రుచులు ఇందులో పూర్తిగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. పోతే మరో వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. వీరు వరహాలరావు గారు…”

    ఆయన ‘నా ఖర్మ, మీ అందరికీ ఓ నమస్కారం’ అన్నట్లు నమస్కారం పెట్టాడు. ఇప్పుడెలా అన్నట్లు చూశాడు.

    “వరహాలరావుగారు దీనిని పూర్తిగా ఖండిస్తున్నారు. సనాతనంగా వచ్చిన ఆచారం ఇది. దీనిని మార్చకూడదు అంటున్నారు. అలాగే మన మధ్య శ్రీ సంధిగ్ధానంద సరస్వతి స్వామీజీ మహారాజ్ వున్నారు…”

    ఆయన మొహం మీదకి కెమెరా వెళ్ళింది. తెల్లని గడ్డం, తమాషా జుట్టు, నన్నెందుకు ఎవరూ పట్టించుకోరు అనే భావన వ్యక్తపరుస్తున్న ముఖారవిందంతో ఆయన కనిపించాడు. చెయ్యి చూపించి చిన్నగా ఆశీర్వదించాడు.

    “అసలు వీరికి ఈ పేరు ఎలా వచ్చిందో నేను మీకు చెప్పాలి. రకరకాల ప్రశ్నలను పరిశీలిస్తూ అటూ చెప్పలేక, ఇటూ చెప్పలేక, పూర్తిగా సంధిగ్ధావస్థలో ఎంతో కాలం గడిపి ఆ అవస్థ భరించలేక వారి గురువుగారి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు ఆయన ‘నేతి, నేతి’ అన్నారు. అంటే ఇది కాదు, ఇది కాదు అని అర్థం అంచేత ఏదీ కాదు అనుకుంటూ ఆ టైటిల్‌తో ముందుకు వెళ్ళమన్నారాయన…”

    స్వామీజీ చిదానందంగా చిరునవ్వు చిందించాడు.

    “అదలా ఉంచండి. మనం ముందుగా స్వామీజీతో ప్రారంభిద్దాం. స్వామీజీ, ఉగాది మీద ఏదైనా కవితతో కార్యక్రమం ప్రారంభిద్దామా?”

    స్వామీజీ అటూ ఇటూ చూశాడు. ఇది కొత్త సంధిగ్ధం. కథలు చెప్పమంటే చెబుతాం కానీ కవిత చెప్పమంటుందేంటి? పైగా ఇది లైవ్ ప్రోగ్రామ్! కొద్దిగా చిరాకుగా మొహం పెట్టాడు. ఏమీ చెయ్యలేక గొంతు సర్దుకున్నాడు స్వామీజీ.

    “ఉగాది….” అన్నాడు. “ఉగాది… ఉగాది!” అలా మూడుసార్లు వేలంపాటలా అని చెయ్యగలిగింది ఏమీ లేదన్నట్లు అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఏమాత్రం ఇబ్బంది పడలేదు.

    “బావుంది… ఉగాది, ఉగాది, ఉగాది. శభాష్, చెప్పండి స్వామీజీ!”

    “శివుడు. శివుడు. శివుడు – సినిమాలా…. బాగుంది” అన్నాడు సుందరం. స్వామీజీ కళ్ళు మూసుకున్నాడు.

    “ఉగాది…” అన్నాడు.

    “ఉగాది” అన్నాడు వరహాలరావు.

    “ఉగాది…” అన్నాడు సుందరం.

    “ఉగాది…” స్వామీజీ అన్నాడు, “ఉగాది…”

     అమ్మాయి నవ్వును దాచుకుంటోంది. స్వామీజీ బొబ్బిలిపులి సినిమాలో చివరి సీనులో ఎన్.టి.ఆర్. ఒక వైపుకు తలవంచి చెప్పినట్లు అన్నాడు “ఉగాది…. ఎందుకొచ్చిందీ ఉగాది”

    “కరెక్ట్…” సుందరం తగులుకున్నాడు. “బాగుంది… ఉగాది, ఎందుకొచ్చిందీ ఉగాది. శభాష్…”

    “ఎందుకొచ్చిందీ ఉగాది? ఎవరి కోసం వచ్చింది?” కెమెరా వరహాలరావు మీదకి మళ్ళింది. అయ్యో అనుకున్నాడు అతను.

    “శభాష్. బాగా అడిగారు. ఏమున్నదని వచ్చిందీ ఉగాది? శభాష్!”

    స్వామీజీ కోపంగా చూశాడు. ఆయన మాట ఈయన చెప్పేశాడు…

    అమ్మాయి అందుకుంది, “స్వామీజీ అసలు పచ్చడి ఎందుకు తినాలి?” అంది.

    ఆయన కడుపు మీద చెయ్యి పెట్టాడు. ‘తిన్నది అరగటానికి అని చెబుతాడు’ అనుకున్నాను.

    “ఆరు రుచులు కలిస్తే మనం పచ్చడే చెయ్యగలం. మరేదీ చెయ్యలేము. పైగా ఉడికియ్యటం సరినది కాదు. అందుకు పచ్చడి. నూనె తగలకూడదు”

    “తీవ్రంగా ఖండిస్తున్నాను…” సుందరం అన్నాడు.

    “…పులిహోర, దధ్యోజనంలో ఉడకట్లా, నూనె వాడడం లేదని మీరెలా అంటారు?”

    వరహాలరావు దగ్గాడు. “ప్రకృతి సహజంగా వచ్చినవాటిని వాడుకుని రుచిని కలపడం ఇందులో ఉన్న ఆంతర్యం. మిరపకాయ బజ్జీ పిండి వంట. అది ప్రసాదం కాబోదు.”

    “నో. నో. ప్రకృతి సహజంగా వచ్చినవాటితో ఒక వంట చెయ్యటం మానవ మేధస్సుకు దర్పణం. అసలు ఉగాది పురస్కారాలు దేనికిస్తారు?”

    “ఇక్కడ ఓ క్రొత్త్త విషయం ముందుకు వస్తోంది. ఎవరో ఫోన్‌లో ఉన్నారు… హలో, చెప్పండి”

    “అయ్యా… నేను బ్రహ్మాజీరావు నండీ”

    “చెప్పండి బ్రహ్మాజీరావు గారూ”

    “అయ్యా”

    “చెప్పండి”

    “అయ్యా”

    “అయ్యో చెప్పండి”

    “అయ్యా”

    లైన్ బాగాలేనట్లుంది. ఇతనెవరో అడుక్కునే వాడి బాపతు లాగుంది.

    “ఫోన్ కట్ అయింది. స్వామీజీ, ఈ విషయంలో మీరేమంటారు?”

    “ఉగాది ఎందుకొచ్చింది?”

    వేప పువ్వు కాదు, వేప చెట్టుతో చేసిన పచ్చడి తిన్నట్లు మొహం పెట్టింది ఆ అమ్మాయి.

    “అలాక్కాదు స్వామీజీ! ఉగాది పచ్చడి బదులు మిరపకాయ బజ్జీ ఎందుకు పెట్టకూడదు? ఇందులో విశ్వమానవ శ్రేయస్సు ఉందని వారంటున్నారు.”

    అలా ఎప్పుడన్నానన్నట్లు చూశాడు సుందరం.

    “మనందరం కూడా ఖచ్చితంగా కోరుకునేది అదే” అన్నాడు వరహాలరావు.

    “ఏది  బజ్జీనా?”

    “నో. నో! విశ్వమానవ శ్రేయస్సు. అదీ!”

    “స్వామీజీ! మీరేమంటారు?”

    “ఎందుకొచ్చిందీ ఉగాది? అసలెందుకొచ్చింది?”

    బహుశః కెమెరా మనిషి ఏమీ చెయ్యలేక సుందరం మీదకి పోనిచ్చాడు.

    “నేనో మాట అంటాను.”

    “చెప్పండి.”

    “మనకు సౌకర్యగా ఉన్న ఎన్నో అంశాలు ఆచారంలోకి తీసుకుని వచ్చి కథలు చెప్పేసారు మనవాళ్ళు. అలాగే పరిశుభ్రంగా, నిష్ఠగా వండుకున్న మిర్చీ బజ్జీని ఎందుకు ఒప్పుకోరు…?”

    “సార్, ఫోన్ వస్తోంది… ఏవండీ చెప్పండి.”

    “అమ్మా…”

    “సార్, చెప్పండి.”

    “అమ్మా…”

    “హలో”

    “అమ్మా…”

    “సార్, చెప్పండి, వినిపిస్తోంది.”

    “అమ్మా… అక్కడున్న సుందరం గారికి నమస్కారం.”

    సుందరం నమస్కారం పెట్టాడు.

    “అమ్మా… నేను బాచిలర్‌ని.”

    “వెరీగుడ్. చెప్పండి.”

    “పెళ్ళి కాలేదు.”

    “బాచిలర్ అంటే అదే కదండీ? చెప్పండి”

    “కాదండీ. పెళ్ళయిన బాచిలర్‌ని కానండీ.”

    “ఓహో… బాగుంది…!” అన్నాడు వరహాలరావు. “…సహజమైన బాచిలర్”

    “సార్, సుందరం గారూ, మీరు సరైన ప్రశ్న వేశారు…”

    సుందరం ‘ద వినర్ ఈస్’ అని అతని పేరు చెప్పినట్లు కళ్ళల్లో కాంతిపుంజాన్ని నింపేశాడు.

    “సార్… మాలాంటి వారు ఉగాది పచ్చడి చేసుకోలేరు సార్.”

    “కరెక్ట్.”

    “అంచేత మిర్చీ బజ్జీని తెచ్చుకుని చింతపండు రసంలో నల్చుకుంటే అది పచ్చడిగా చెలామణి అవుతుంది కదా?”

    “మీరేమంటారు స్వామీజీ?”

    “అలా కాదు. అసలు ఉగాది ఎందుకొచ్చిందీ?”

    “అదలా ఉంచండి…” అన్నాడు వరహాలరావు. “…అసలు ఉగాది అంటే పచ్చడొక్కటే కాదు సార్. మీరు తలచుకుంటే పచ్చడి చేసుకోవచ్చు.”

    “ఎట్లా సార్. అవుత లేదు… దయచేసి సుందరం గారు చెప్పినట్టు మిర్చీ బజ్జీని వచ్చే ఉగాదికి ఖరారు చేయండి”

    అమ్మాయి ముఖం వికసించింది.

    “అయితే సుందరం గారూ, మిర్చీ బజ్జీని కొద్దిగా మార్చి… అంతే వాము వంటివి తీసేసి చింతపండు రసం అదనంగా ఇస్తే ఇది ఉగాది చట్‌నీగా మార్చవచ్చేమో?”

    “తప్పు లేదండీ. మన దైనందిన జీవితంలో మార్పు ఎలాగైతే చోటు చేసుకుంటోందో, మన ఆచారాలలో కూడా అలాగే జరగాలి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అభ్యుదయ మార్గంలో మనం పోవాలి!”

    “వరహాలరావు గారూ, మీరేమంటారు?”

    “చాలా తప్పంటాను. ఉగాది పచ్చడి సామాన్యమైనది కాదండీ.”

    “కరెక్ట్.”

    “ఎందరో ఇష్టపడి తింటారు. ఆరోగ్యానికి మంచిది. ఇందులో తత్వం ఉంది. వేదాంతం ఉంది!”

    కెమెరా స్వామీజీ వైపు వచ్చింది. నన్ను కాకుండా లెక్కేసుకోండి అన్నట్టు ఎటో చూశాడాయన.

    “అలా అయితే… ” సుందరం తగులుకున్నాడు.

    “… ఈ పచ్చడిని పేటెంట్ చేసి అమ్మవచ్చు కదా. మిర్చీ బజ్జీ అయితే చక్కగా ప్యాక్ చేసి అమెరికా పంపవచ్చు… దీనిని…”

    “దీన్ని కూడా బాటిల్‌లో పెట్టవచ్చు”

    “నో.. నో… ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.  ఉగాది పచ్చడిలో పచ్చి మిర్చీ ముక్కలు కలుపుతామా కలపమా?”

    “ఓ తప్పకుండా. కానీ మిర్చీ చట్‌నీ కాదిది.”

    “ఇది కూడా పేరుకు మిర్చీ బజ్జీ. మిగతావి కూడా కలుపుతాం. కావాలంటే పేరు మార్చుకుందాం సార్…”

    అమ్మాయి ఇద్దరినీ ఆపింది.

    “ఉండండి. ఇంతకీ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చూద్దాం…”

    స్క్రీన్ మీద ఓ టేబిల్ వచ్చింది. ఉగాది పచ్చడి రైటా? పచ్చడి బదులు మిర్చీ బజ్జీ రైటా?” పెట్రోలు పోస్తున్నప్పుడు ఆ అంకెలు జారిపోయినట్లు మిర్చీ బజ్జీకి వేలల్లో ఓట్లు, ఉగాది చట్‌నీకి కేవలం వందల్లో ఓట్లు వచ్చాయి.

    “సుందరంగారూ, ఏమంటారు?”, ఆ అమ్మాయి కళ్ళెగరేసింది.

    “నేనిప్పుడు కాదు, ఎప్పటి నుండో చెబుతున్నాను. ప్రజలు అభ్యుదయానికే ఓటు వేస్తారు.”

    “మీరేమంటారు?”

    “నో…!” చెప్పాడు వరహాలరావు. “…మంచి విషయం పట్ల ప్రజలు ఎప్పుడూ ఒక్కసారిగా ముందుకురారు. అంత మాత్రం చేత అందరూ అదే కోరుకుంటున్నారనటం సరైనది కాదు.”

    “ప్రస్తుతానికి ఈ చర్చ ఇక్కడితో ఆపేద్దాం. పండుగంటే మీక్కావలసింది మీరు వండుకోవటమే కాకుండా మన జీవితాలలో ఏ వస్తువుకు ఎంత ప్రాధాన్యం ఉందో కూడా తెలుసుకోవటం మన బాధ్యత. ఆరు రుచులలో ఆనందం పంచుకున్నట్లు ఆరు రకాల ఆలోచనలు కూడా మనం పంచుకోవాలి…” ఆ అమ్మాయి చక్కగా చెబుతోంది…

    “అవి మిర్చీ బజ్జీలలోనే ఉన్నాయి” అన్నాడు సుందరం.

    “నో నో  నో…” అన్నాడు వరహాలరావు. “…అవి కేవలం ఉగాది పచ్చడిలోనే ఉన్నాయి.”

    కెమెరా స్వామీజీ మీద అగింది. ఉలిక్కి పడ్డాడు ఆయన.

    “ఉగాది… ఉగాది… ఉగాది…” అన్నాడాయన. ఓం శాంతి శాంతి శాంతి అన్నట్లు వినిపించింది. వీళ్ళిద్దరూ నమస్కారం పెట్టారు. స్వామీజీ ఆశీర్వచనంగా చేయి చూపించాడు.

    ***

    రెండు గంటల తరువాత తలుపు చప్పుడైంది. సుందరం లోపలికొచ్చాడు.

    “ఏంటిది? నువ్వెలా వెళ్ళావక్కడికి?” అడిగాను.

    “అదే తమాషా.”

    “మొన్న ఆ సభలో  నా బజ్జీలు తిన్నాడు ఒకాయన. నువ్వు లేవకముందే నాకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. సిద్ధమా? అన్నాడు. నాకు మార్కెటింగ్ బాగుంటుందని వెళ్ళాను… ఇంతకీ ఏదీ ఉగాది పచ్చడి?”

    “నీ మొహం మండ!”

    “కాదురా! నాకు ఉగాది పచ్చడి చాలా ఇష్టం. పెట్టు.”

    పచ్చడి టేబిల్ మీద పెట్టాను. అది సేవిస్తూ నవ్వుతున్నాడు సుందరం… “అంతా కనిపించేందుకే స్వామీ… కనిపించేందుకు, అనిపించేందుకు! అనుకొనేందుకు ఏమీ ఉండదు. డబ్బులిచ్చి కొని బజ్జీ తినేసాక మిర్చి ఎక్కడికో, పిండి ఎక్కడికో… గుర్తుండిపోయే రుచి కేవలం మసాలాది!”

    “అవునూ, ఆ స్వామిజీ ఎవర్రా?”

    నవ్వాడు. “ఓ… ఆయనా! ఎక్కడా చెప్పబోక! ఆ సమయానికి స్టూడియోలో మేకప్ చేసే ఆయన్ని కూర్చోబెట్టారు… మంచి కవిత చెప్పాడు కాకపోతే!”

    “బాగుంది. ఉగాది ఎందుకొచ్చింది?”

    “కరెక్ట్! ఎందుకొచ్చిందీ ఉగాది?”

    00000

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here