మిర్చీ తో చర్చ-30: ప్రేమ – మిర్చీ… ఒకటే-12

0
13

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]ఫో[/dropcap]న్ మ్రోగింది.

“హలో”

“సంబరం”

“ఎవరు?”

“సంబరం చేస్కోవాలన్న మాటండి”

“అంటే?”

“సార్, నేను నూకా. మిర్చీ బండీ”

“ఓ శభాష్. చెప్పు. చాలా కాలం అయ్యింది”

“అవునండి మరి. నాకు ఏటేటో అయిపోతున్నాది సారూ”

“ఎలాగ?”

“ప్రేమ భీమిలి లీచీలాగా పొంగి పొరలిపోతన్నాదండీ మరి”

“మిర్చీలో విశేషం తెలుసా?”

“మీరే సెప్పాలండీ?”

“మిర్చీ సామాన్యమైనది కాదు”

“అస్సలా”

“మిర్చీ తినేటోళ్ళందరూ బ్రతకరు”

“అయ్ బాబో, అంత మాటనేసినారేంటండీ?”

“మిర్చీ తినేటోళ్ళందరూ జీవిస్తారు”

“ఆయ్’

“అదీ. ఇంతకీ ఏటైందేంటి?”

“నా గుండెకాయకు తలుపు తెరుచుకు పోనాదండీ”

“చిరిగింది”

“ఏటండీ?”

“ఏం లేదు నూకా. అసలు ప్రేమంటే తెలుసా?”

“సెప్పండి సారూ”

“హాల్లో లైట్లన్నీ తీసేసాక తెర మీద ఏదో వెలుగుతుంది”

“బాబోయ్”

“అద్దీ. అలా గుండెలో తలుపు తెరుచుకుని మరేదో వెలుగుతుంది”

“అంతే కాదు, మరొకటుంది”

“ఖచ్చితంగా ఉంటుంది”

“ఎందుకు సార్?”

“నువ్వు మిర్చీ తినేవాడివే కాదు, అమ్మేవాడివి కూడాను”

’అలాగండీ”

“మరి? స్పెషల్ మిర్చీ. ఇంతకీ ఏమైంది?”

“గుండె కాడ తలుపు అన్నాను”

“కరెక్ట్”

“అటూ ఇటూ రెండు కిటికీలు కూడా తెరుచుకుపోనాయండీ”

“శభాష్”

“ఒక కిటికీ దగ్గర పోలీసమ్మాయి”

“ఓ. మరో కిటికీ?”

“బస్సులో దిగే అమ్మాయి”

“ఓ. గుండె వాస్తు రీత్యా బాగుంది”

“ఎలాగండీ?”

“కిటికీ ఎదురుగా కిటికీ ఉండాలి”

’అయ్య బాబోయ్”

“క్రాస్ వెంటిలేషన్”

“అంటే?”

“ఇటునుంచి వచ్చిన గాలి అటుగా పయనించి వెళ్ళిపోవాలి”

“మరి ఆ గాలండీ?”

“అలా అలా మీదకి వచ్చి ఇలా ఇలా వెళ్ళిపోవాలి”

“అలాగే వచ్చేసినాదడీ?”

“ఎవరు?”

“పోలీసు పిల్లండీ”

“గుడ్”

“ఏటి సెయ్యాలో తెలీలేదండీ?”

“ప్రేమ”

“సార్”

“ప్రేమలో ఏటి తోస్తే అది సేసెయ్యాలి మరి. మిర్చీ ప్రేమ”

“సార్”

“చెప్పు”

“భయం వేస్తోంది”

“తప్పు లేదు. తొలి ప్రేమ తొలి రాత్రి వంటిది”

“ఎలాగ?”

“అద్దీ. తొలి రాత్రి పెళ్ళికూతురు భయపడుతుంది లేదా అలా నటిస్తుంది”

“అయితే?”

“తొలి ప్రేమ కూడా అంటే. భయాన్ని చిన్నగా మేకప్‌లా అద్దుకుంటుంది. ఇంతకీ ఏం చేసింది?”

“ఏటీ సెయ్యలేదండీ. బండి పక్కనే ఉన్న బెంచీ మీద కూకున్నాదండీ”

“మామూలమ్మాయి నిలబడితేనే మర్యాద. పోలీసమ్మాయి కూర్చుంటే ప్రేమ”

“ఛా”

“అవును”

“ఇటునుండి బస్సులోంచి అమ్మాయి దిగిపోనాది సారూ”

“శభాష్”

“అటూ ఇటూ జింక కళ్ళెట్టుకుని చూసేసినాడండీ”

“గుడ్”

“ఒచ్చి ఇటు వైపు నిలబడి పోనాది”

“ఏం చేశావు?”

“ఇద్దరికీ చెరో ప్లేటు ఇచ్చేసానండి. ఏటి చేత్తాను?”

“గుడ్. తిన్నారా?”

“ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తినేసినారన్నమాటండీ”

“శబాష్. పోటీ పడ్డారన్నమాట”

“ఇదేం పోటీ సారూ?”

“ప్రేమ పోటీ”

“ఓ. డబ్బులడిగేసినాను సారు”

“మంచి పని చేసాను. ప్రేమలో త్యాగం మంచిదే కాని వ్యాపారం పోగొట్టుకోకూడదు”

“పోలీసమ్మాయి లేచి నిలబడింది”

“గుడ్. పాకెట్ లోంచి తియ్యాలంటే మరి నిలబడాలి కదా!”

“కాదంటీ. లాఠీ సిత్రంగా తిప్పేసినాదండీ”

“అంటే?”

“దాని అర్థం డబ్బులివ్వరు అని”

“మరి ఎలా?”

’ఇటుపక్కనున్న అమ్మాయిని సూపించి ముసి ముసి  నవ్వులు నవ్వుతూ, నన్ను సైడింగ్ సూపు సూసేసి ఎల్లిపోనాడండీ”

“నూకా…”

“సారూ?”

“అమ్మాయి ఎవరైనా ఫరవాలేదు. ముసి ముసి నవ్వులు నవ్విందంటే అందులో మిర్చీలో మసాలాలో ఏదో దాగుందని అర్థం”

“ముసి ముసి నవ్వులు ఏటిగానండీ సారూ, నేను మసి అయిపోతున్నానన్నమాటండీ”

“ఓ”

“మరండి. ఇటు వైపు తిరిగానానండీ”

“గుడ్. మనకు మరో ఆప్షన్ ఉంది అని నొక్కి వక్కాణించాలి. అది స్ట్రాటజీ”

“ఏటోనండీ! ఏదో తోచక ఇటు తిరిగేసినానండీ”

“ఏవైంది? వేడి బజ్జీలు తిని నిన్ను చల్లగా చూసిందా?”

“లేదండీ”

“మరి?”

“ఏమనుకుంటున్నావు? అని అడిగింది. ఎలాగండీ అని అడిగాను”

“అమ్మాయి ముందు మాట అలానే ఉంటుంది”

“అవునాండీ? పోలీసమ్మాయి దగ్గర తీసుకోమని ఎల్లిపోనాదండీ”

“గుడ్. ఇది ప్రేమలో ఒక సిద్ధాంతం నూకా. సూటిగా చెప్పరు. ఇంకొకరి మీదుగా ఓ చిన్న పోటీ లేదా పోట్లాటలా ప్రవర్తిస్తారు”

“అలాగండీ?”

“శ్రీకృష్ణుడిని తలచుకో”

“రోజూ చేతులు జోడిస్తాను సారూ”

“మరి? సత్యభామను, రుక్మిణిని తలచుకో”

“ఆయ్, అంత లేదండీ సారు!”

“అంతుండదు. మార్కెట్‌కి పోటీ కావాలి. ప్రేమకి రెండు కిటికీలు కావాలి. అవి నీకు అనుకోకుండానే దొరికిపోయాయి”

“సారూ”

“అదృష్టం ఆవలిగట్టులో ఉంది నూకా”

“అదెటోనండీ సారూ, కిటికీ తలుపులు అలా కొట్టుకుంటూనే ఉన్నాయి”

“కొట్టుకోవాలి. దటీస్ గుండె! దటీజ్ ప్రేమ”

“సారూ!”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here