మిర్చీ తో చర్చ-4: కట్ మిర్చీ

    1
    6

    [box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

    [dropcap]మి[/dropcap]ర్చీ బండీ ముందుకు పోతోంది. సుందరం మిర్చీ బజ్జీ వ్యాపారం ఎలా ఉన్నా ఈ ట్రాన్స్‌పోర్టు మటుకు బాగుంది. కృష్ణానగర్‌లో ఆపుకుని దిగాను.

    “నువ్వూ రా” అన్నాను.

    “డైరక్టర్‌ల దగ్గరకి ఏం వెళతాం? నువ్వెళ్ళు” అన్నాడు.

    సంచీ సర్దుకుని లోపలికి వెళ్ళాను. ఓ ముగ్గురున్నారు.

    మధ్యలో ఉన్న వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు.

    “రుద్ర” అన్నాడు. చుట్టూతా చూసి ఆయన ముందు సెటిల్ అయ్యాను.

    “రుద్ర”. ఈ సారి కళ్ళు తెరిచి చెప్పాడు.

    “మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉంది.”

    అలా లేకపోయినా చేయగలిగిందేమీ లేదనిపించేటట్లు చిన్నగా నవ్వి, బాటిల్ లోంచి గ్లాస్ నింపాడు. గ్లాసు పట్టుకుని నన్ను చూశాడు.

    “ముందు….” ఆగి అన్నాడు, “…మందు.”

    అటు ప్రక్కనున్న వ్యక్తి ఆయన గ్లాసు నింపాడు. “ఈయన పుచ్చుకోరు సార్” అన్నాడు.

    “బీరు కావాలి”, ముక్తకంఠంతో ముగ్గురూ పలికారు.

    “ఓ బీరు కావాలి”

    పాట ఎక్కడో విన్నట్లుంది.

    ‘బీరు కావాలి’

    ‘ఓ బీరు కావాలి’

    ‘ఓ గ్లాసు నింపాలి’

    ‘నే త్రాగుతూ ఉండాలి’

    “ఇది మా సిగ్నేచర్ ట్యూన్. చెప్పండి.”

    “వర్షం కురుస్తోంది”

    “ఊఁ…”

    “కారు పోతూ పోతూ ఉంది”

    “శభాష్”

    “ఆగిపోయింది!”

    గ్లాసు కింద పెట్టాడు రుద్ర. “ఆఁ…” అన్నాడు. ఎవరు చెప్పారో తెలియదు, సుందరం లోపలికొచ్చాడు. ఎక్కడి నుంచి తీసాడో ఒక టై కట్టుకున్నాడు. నాలుగు అట్టపెట్టెలు టేబుల్ మీద పెట్టి పేపర్ న్యాప్‌కిన్స్ చక్కగా అమర్చాడు.

    “ఈయన సుందరం కాటరింగ్” అన్నాడు అటు పక్కవాడు.

    రుద్ర పెట్టె తీశాడు.

    “ఓ…” అంటూ త్రేన్చాడు. మిరపకాయ బజ్జీలు ఊరిస్తున్నాయి. హీరోయిన్‌ని దగ్గరకు లాక్కొని హత్తుకొన్నట్టు పెట్టె లాగాడు. బజ్జీని రెండు వేళ్ళ మధ్య నిలువుగా పట్టుకున్నాడు.

    “కథలో కారం ఉందా?” అడిగాడు.

    “ఉంది సార్”

    “ఊఁ…”

    చిన్నగా కొరికాడు. సుందరం వైపు చూశాడు.

    “ఏం కారం…. అదే కాటరింగ్?”

    “సుందరం కాటరింగ్”

    “శభాష్. బజ్జీ అయినా సినిమా అయినా… మొదటి చోటే చురుక్కుమనాలి… రేయ్… ఈయనే మనకు కాటరింగ్. టాప్‌గుంది.”

    “థ్యాంక్యూ సార్!”, సుందరం వెళ్ళిపోయాడు.

    “ముందుకు వెళదాం. కారు ఆగింది”

    “అందులోంచి ఓ ముసలాయన దిగాడు. బానెట్ తీసి అటూ ఇటూ కెలికాడు. సమస్య అర్థం కాలేదు.  బానెట్ మూసేసి ప్రక్కనే ఉన్న ఇంటి గేటు దగ్గర నిలబడి చూశాడు”

    “గుడ్”

    “ఏంటి సార్? మిర్చీయా, ప్లాటా?”

    “రెండూనూ. ఎవరు కనిపించారు గేటు దగ్గర?”

    “ఓ పెద్దావిడ వరండాలో నిలబడి చూస్తోంది. తువాలు పట్టుకునుంది”

    “ఎలాగ? పట్టుకుని ఉన్నదా? కట్టుకునున్నదా?” ఇటు కూర్చున్న వ్యక్తి అడిగాడు.

    “అయ్యో కాదండీ…”

    “అబ్బా సారూ! మార్చండి. చూశారా? మిర్చీ తో మసాలా… చాలా అవసరం. మీరు ఎందుకు వ్రాసారో, అలా ఉంచండి. ఇది దేనికైనా పనికొస్తుంది.”

    “కరెక్ట్!”

    “ఊఁ… మా వాడు బాలు గాడు. మిర్చీలో వాము నాలుకకు తగిలి అంతలోనే అందలం అందినట్లు సరైన సమయానికి సరైన మాట అందిస్తాడు.”

    “బాల వాకు బ్రహ్మ వాక్కు” అన్నాడు ఇటు ప్రక్కనున్న వ్యక్తి.

    మరల గ్లాసులు నింపుకున్నారు.

    “ఈవిడని ఎక్కడ చూశానా అని ఆ పెద్దాయన ఆలోచించాడు. ఆ పెద్దావిడ ముఖం క్లోజప్… కట్ చేస్తే పల్లెటూరులో గోదావరి గట్టు. పిల్ల కాలువ మీదుగా ఉన్న తాటి బొంగు మీద హీరో జాగ్రత్తగా నడుస్తున్నాడు…”

    ఇటు ప్రక్కనున్న వ్యక్తి ఆపాడు. ఒకేసారి రెండు మిర్చీ బజ్జీలు నోట్లో కూరేశాడు.

    “ఆగండి” అన్నాడు. “ఊఁ… కొద్దిగా ఆలోచిద్దాం”

    రుద్ర గ్లాసు ఖాళీ చేశాడు.

    “ఈయన మారన్… మా స్పెషలిస్ట్. పట్టుకుంటే బంగారమే!”

    “కరెక్ట్!”

    “ఊఁ… ఉండండి. ఇందాక పెద్దావిడ తువాలుతో అన్నారు. దాని బదులు ఆ పెద్దావిడ నుండి డిసాల్వ్ చేసి హీరోయిన్‌ను ఆ గెటప్‌లో చూపించేస్తే ఎలా ఉంటుంది?”

    “శభాష్. సినిమా మొదటి సీన్ తొలి రాత్రి. తొలి బజ్జీలా పేలిపోవాలి. గుడ్.” రుద్రా మెల్లగా తేలుతున్నాడు.

    “సార్, హీరోయిన్‌ని తర్వాత తీసుకొస్తాం సార్!”

    “నో… ఇది ఫిక్స్.  నాకు బజ్జీలో చింతపండు తగిలింది. అక్కడితో సబ్జెక్టు క్లోజ్. రైటరూ, అసలు నేనెలా పుట్టానో తెలుసా?”

    “లేదండీ”

    సుందరం లోపలికి వచ్చాడు. మరో నాలుగు పెట్టెలు ఈ సారి ఓ ట్రేలో పట్టుకొచ్చాదు. జాగ్రత్తగా పెట్టాడు.

    “సార్, ఇవి స్పెషల్” చెప్పాడు.

    “మా సినిమా కూడా స్పెషల్” రుద్ర చెప్పాడు.

    “సార్, హీరోయిన్, తువాలు… తరువాత”

    “సార్, మీరు మందు పుచ్చుకోరా?” బాలు అడిగాడు.

    “నో… ఆయన మజ్జిగ బ్యాచ్… కానీ ఊర మిరపకాయ వెరైటీ”

    “ఓకే. చెప్పండి. గేటు దగ్గర ఉన్నాడు టైగర్. కానీ సార్, కథలో డ్రామా అనేది మందులో బజ్జీలా కలవాలి. చెప్పండి. ఆ మజాయే వేరు!”

    “వాస్తవానికి కథ ప్లాట్ భిన్నంగా ఉంటుంది సార్. కథానాయకుడు అందరికీ దూరంగా ఓ కార్పోరేట్ ఆఫీసులో చాలా పెద్ద పోస్ట్‌లో ఉంటాడు. సంబంధ బాంధవ్యాలకు దూరంగా కేవలం డబ్బు కోసమే జీవితం అన్నట్లు పెద్ద ప్రపంచంలో పెద్ద ఆట ఆడుతూ ఉంటాడు”

    “పెద్ద ప్రపంచంలో పెద్ద ఆట… ఈ మాట బాగుంది” అన్నాడు రుద్ర.

    “అటువంటి పెద్ద ప్రపంచంలో తేలుతున్న ఆయన ఒక్కసారిగా తిరిగి మానవ విలువలు, మానవ సంబంధాలలోకి అడుగుపెట్టే సమయంలో నేను తువాలు అన్నాను సార్. మారన్ గారు మార్చేసి ఎటో పట్టుకొని పోతున్నారు సార్”

    మారన్ బాటిల్ మొత్తం ఎత్తేశాడు. మిర్చీని నిటారుగా పట్టుకున్నాడు.

    “సార్, మిర్చీ సాక్షిగా చెబుతున్నాను. మిర్చీలో గింజ ఎలా దాక్కుంటుందో ప్రతి కళాఖండంలోనూ నా అనుభవం ఎక్కడో అక్కడ దాక్కుంటుంది. మారన్ అనేవాడు ఎన్నడూ మారడు. రన్‌లో ఉంటాడు”

    “మారన్ జిందాబాద్”

    సంచీ సర్దుకుని లేచాను. “సార్ ఇప్పుడే వస్తాను” చెప్పాను.

    “చిన్న బ్రేక్ తీసుకుందాం” రుద్ర చెప్పాడు.

    ***

    మిర్చీ బండీలోకి వెళ్ళి కూర్చున్నాను.

    “సుందరా!”

    “యస్?”

    “నీ మొహం మండ! ఈ టై ఏంటి? ఈ గోలెంటి?”

    “ఇదేరా కీలకం. ప్రతి సన్నివేశానికీ ఓ వేషం కట్టాలి. నీ స్క్రిప్టులో ఇదే ఇబ్బంది…”

    “అదేంటిరా? తువాలు పట్టుకున్న ఆవిడను చూసిన దగ్గరి నుంచి సినిమా టేకాఫ్ అవుతుందీ అంటే అలా మార్చేస్తాడు వాడు?”

    “అదే మరి! పాకేజింగ్‌లో ఉంటుంది అంతా!”

    మంచి సమయం చూసుకుని సుందరం మిర్చీ ప్లేటు అందించాడు.

    జాగ్రత్తగా ఆలోచించాను. సుందరం ఏవో చెబుతూనే ఉన్నాడు.

    మాట్లాడుతూనే బజ్జీలన్నింటినీ చాకుతో చిన్న చిన్న ముక్కులుగా కట్ చేశాడు. పొడి చల్లాడు. అటూ ఇటూ జల్లించాడు. ఈ సారి చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులు సిద్ధం చేశాడు. వాటిల్లో అందంగా అమర్చి క్రిందకి దిగాడు. అతని వెనుకనే నేనూ లోపలికి వెళ్లాను.

    “ఇది కట్ మిర్చీ స్పెషల్ సార్” అంటూ అందరికీ అందించాదు.

    నేను మరల నా కాగితాలు తీసుకుని కూర్చున్నాను.

    “రుద్రా గారూ”

    “యస్”

    “నేనెంచుకున్న ఫ్రేమ్స్ అన్నీ బ్రిటన్ డైరక్టర్ రూడీ తీసిన సినిమాల్లోవి…”

    రుద్రా గ్లాసు పక్కన పెట్టాడు. నన్ను సీరియస్‌గా చూశాడు.

    “సూసాన్ హేవార్డ్ ఎక్కువగా చెప్పే పేరాబోలా, ఈడిపస్ ట్రాజెక్టరీ పద్ధతులు… ఇవి…”

    చెయ్యి అడ్డుపెట్టాడు రుద్రా. అటు తిరిగాడు. బాలు తన గ్లాసు కింద పెట్టాడు.

    “నోట్ చెయ్యి!” అన్నాడు. సుందరం నన్ను అభిమానంగా చూశాడు.

    “సార్, మిర్చీ ఎలా ఉంది సార్?” అడిగాడు.

    రుద్రా కొద్దిగా ఊగాడు. థమ్స్ అప్‌లా చూపించాడు. సుందరం నాకూ అలాగే చూపించి వెళ్ళిపోయాడు.

    “మొన్న అనంతం అనే ఒక కేరళ చిత్రంలో ఓ అద్భుతం ఉంది” అన్నాను. రుద్ర ఈ సారి మారన్‌ను కదిపాడు. వాడు నాకు దగ్గరగా జరిగాడు.

    “చెప్పండి”

    “ఒక పూర్తి పాట నది మీద చిత్రీకరించారు”

    “ఇందులో అద్భుతం ఏముంది?”

    “ఉందండి. నది మీద అంటే అది అందరూ తీస్తారు. అలాక్కాదు. హీరో హీరోయిన్లు ఇద్దరూ బ్రిడ్జి మీద ఉంటారు, వాళ్ళ నీడలు నీళ్ళ మీద పడి దగ్గరవడం, దూరమవడం మీద పాట మొత్తం అయిపోతుంది!”

    రుద్ర కట్ మిర్చీలన్నింటినీ నోట్లోకి కుక్కి కళ్ళు మూసుకున్నాడు.

    “శభాష్”

    “…”

    “మీరు ఒకే ఒక తప్పు చేస్తున్నారు సార్…” అన్నాడు.

    “ఏంటి సార్! కాపీ కొడుతున్నానా?”

    “నో… మీరు మందు త్రాగడం లేదు. కరెక్ట్?”

    “అవును”

    “అది తప్పు. మీలో ఓ జీనియస్ ఉన్నాడు. వాడు ఎలా వస్తాడు ఇవతలికి? చెప్పండి!”

    “అసలు ఓ వంద రకాల సినిమాలు చూసి వండిన వంట సార్!”

    మారన్ మరో గ్లాసు నింపాడు.

    “సార్, అసలు ఈ ఆలోచన… అంటే ఆ టవల్ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు?”

    “ఒసొందొర్భో అనే బంగాలీ సినిమా ఉంది సార్. ముని మానస్ చటర్జీ తీసిన చిత్రం. దాని కథలోంచి తీసుకున్న లీడ్ సార్ ఇది”

    ఎదురుగా రుద్రా కనిపించడం లేదు. ఏం లేదు. సోఫాలోంచి జారిపోయి కాళ్ళు అలాగే జాపి ఉంచి తల వెనక్కి ఆన్చాడు.

    “సార్, మీలో ఒక రైటర్ ఉన్నాడు సార్. మనం కరెక్ట్ రైటర్‌ని చూస్తున్నాం మారా? ఏమంటావు?”

    “చిరిగింది సార్”

    నేను లేచాను. రుద్రా కూడా అతికష్టం మీద లేచాడు.

    “సార్, మరి సినాప్సిస్ ఎప్పుడివ్వమంటారు?”

    “రేపే… ఆ రోజే మీకు టోకెన్ అడ్వాన్స్ ఇప్పించేస్తాను. తరువాత ఓ మాటనుకుందం. బ్రిలియంట్…”

    శలవు తీసుకుని ఇవతలికి వచ్చాను. ముగ్గురూ వాకిట్లో నా మీదకి తూలారు.

    “సార్… మీలో ఓ రైటరున్నాడు సార్!”

    ***

    బండి ఇంటివైపు పోతోంది. సుందరం ఏదో పాట పాడుకుంటున్నాడు.

    “ఎవర్రా వీళ్ళంతా?”

    “ఎవరు?”

    “ముని మానస్ చటర్జీయా? ఎక్కడా వినలేదే?”

    “నాకూ తెలియదు”

    “నీ మొహం మండ” ఈ సారి వాడన్నాడు.

    “మరి? పాకేజింగ్ కదా? అన్నీ కట్ మిర్చీలే మరి!”

    “నిజమే. ఇది నీ కథ అంటే ఎవడిక్కావాలి?”

    “సినిమా కాదు, అన్ని రంగాలు అంతే. తువాలు నాది కాదనాలి!”

    00000

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here