మిర్చీ తో చర్చ-5: ఊ అను, ఊ ఊ అను…

    0
    8

    [box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

    [dropcap]అ[/dropcap]రుగు మీద కాఫీ పట్టుకుని అయ్యప్ప స్వామిలా కూర్చున్నాడు సుందరం.

    ఆదివారం సాయంత్రం వీడితో మంచి తమాషాగా ఉంటుంది. సరదాగా పేపరు కూడా చదువుతున్నాడు.

    “బాగా వ్రాశాడు…” అన్నాడు.

    “ఎవరు?” అడిగాను.

    “చెబుతా. ముందర ఏం వ్రాసాడో విను”

    “చెప్పు”

    “ఒక మనిషిని నిలబెట్టేది కుర్చీ…”

    “ఓహో… అందరినీ కూర్చోపెట్టే కుర్చీ నిలబెడుతుంది. బాగుంది. శభాష్!”

    “ఒక మనిషిని నిలబెట్టేది కుర్చీ”

    “ఒక మనిషిని కూర్చోబెట్టేది మిర్చీ!”

    “సూపర్! పట్టుకుని మరీ కూర్చోపెట్టేది మిర్చీ!”

    “బాగుందా?”

    “అదిరింది. ఎవరు చెప్పారు? ఆ పేరు కూడా చదువు”

    “సుందరం అని చెప్పేసి ఈ మధ్యనే చాలా వ్రాస్తున్నాడు”

    “వార్ని, నువ్వేనా? పేపర్లో పడిందా?”

    “లేదు”

    “మరి?”

    “ఇలా పేపరు పట్టుకుని చదివితే నువ్వు ఎలా విన్నావు?”

    “అలానే విన్నాను”

    “అదీ సంగతి”

    వాడి పేపరు లాక్కున్నాను.

    “ఇది అడ్డం పెట్టుకుని ఇప్పుడు నీ పైత్యం చెబుతావా?”

    “లేదు”

    “మరి?”

    “ఇక్కడున్నదే చదువుతాను. నువ్వేం చేస్తావు?”

    “ఇదిగో…” అంటూ ప్లేట్లోంచి మిర్చీ బజ్జీ వేసాడు. “…ఇది తింటాను”

    “శుభం భూయాత్”

    “చెప్పు”

    “కట్నం, కానుకలు, నగలు, చీరెలతో సహా మోసం చేసి భర్త పరారీలో ఉన్నాడు”

    “కొత్త ఫెరారీ కొనాలంటే ఇదే మార్గం. తరువాత…”

    “నాయకుడి కారు మీద కరెంట్ తీగ పడింది. కానీ ఏమీ కాలేదు. ఎందుకంటే అప్పుడు అక్కడ పవర్ కట్ ఉందట!”

    మిర్చీ కొరికాడు సుందరం.

    “ఇది కొరుకుడు పడడం లేదు. నాయకుడి సంగతి అలా ఉంచు. అసలు పవర్ కట్ చేసే అధికారం ఉన్నదా? మనం బిల్ కడుతున్నాం కదా? అందులోంచి ఎందుకు తగ్గించరు మరి?”

    “బిల్లు వాడిన విద్యుత్తుకు సార్!”

    “పవర్ కట్ లేకపోతే ఇన్‍వర్టర్ ఛార్జింగ్ అక్కర్లేదు కదా?”

    “అదీ పాయింటే!”

    “మిర్చీ కొరికితే గానీ తట్టదురా కారం!”

    “నాయకుడి కారు మీదే కారం… కాదు కరెంట్ తీగ పడితే, మరి మన సంగతేమిటి?”

    “ఆ తీగకు తెలియదు కింద ఎవరు పోతున్నాడో. పైగా అవాంతరాలు ఆవులించే వాడి మీదే కాదు, విచ్చలవిడిగా అమెరికన్లలాగా అందరినీ కౌగిలించుకునే వాడి మీద కూడా జరగవచ్చు”

    “అదలా ఉంచు. ఈ వార్త ప్రత్యేకంగా ఎందుకు వ్రాస్తున్నాడు?”

    “నాయకుడు స్వామీ! ప్రజలకు మరింత సేవ చేసుకునే యోగం ఉన్నది కాబట్టి ఈశ్వరుడు కాపాడాడు అని స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోలా?”

    “బాగుంది”

    ఓ బజ్జీ అయిపోయింది.

    పేపరు అటూ ఇటూ తిప్పాను.

    “డాక్టర్ల సమ్మె మూడో రోజుకు చేరింది. రోగుల పరిస్థితి విషమం!”

    “వైద్య వృత్తిలో కూడా సమ్మెలు జరిపిస్తే మనుషులు ఏమైపోవాలి? నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి”

    “కరెక్ట్. ఒక విధానానికి కట్టుబడలేకపోతే వృత్తి లోకి రాకూడదు కదా?”

    సుందరం మిర్చీ తీసి దాన్ని మంత్రించబోయే అస్త్రంలా పట్టుకున్నాడు. ఆ వస్తువు పట్ల ఎంత ప్రేమో!

    “ఆలోచించు”, చెప్పాడు. “డాక్టర్లూ మనుషులే! వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎంతకాలం పేషెంట్లలా ఉంటారు? మరొక మార్గం లేదు.”

    ఆలోచించాను. వీడు మిర్చీ కదా అని ఎలా అయినా కొరికేస్తున్నాడు.

    “గంట సేపు వానకి హైదరాబాద్ నగరం అల్లకల్లోలం అయిపోయింది”

    మిర్చీ కొరికాడు.

    “చూడు శిశువా! ప్రతి సంవత్సరం వానలొస్తాయ్యి. ప్రతి సంవత్సరం రోడ్లు పాడైపోతాయి. వాహనాలు పెరిగిపోతాయి. నీరంతా కాలవల్లోకి జారిపోతుంది. అయినా ఎవరూ ఏమీ చేయలేరు. పాపం రోడ్ల మీద బ్రతికేవారు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది మారదు!”

    “డిపార్టుమెంటు వాళ్ళు ముందరే కళ్ళు తెరచి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా?”

    మిర్చీని జాగ్రత్తగా చూశాడు.

    “శిశువా! వాళ్ళు మటుకు ఏం చేస్తారు? కాలువలు ఎండిన ప్రదేశంలో ఇళ్ళు కట్టమని ఎవరు చెప్పారు? అందరికీ పట్టణాలే కావాలా? ఏం సుఖపడుతున్నామని ఇక్కడికి పరుగులు తీస్తారు? ఏ డిపార్టుమెంటు మటుకు ఎంత చేయగలదు?”

    సుందరాన్ని ఓరకంట చూశాను. వాడు నన్ను పట్టించుకోవడం లేదు. మిర్చీల్లో బిజీగా ఉన్నాడు. పేపరు అటూ ఇటూ తిప్పాను. ఓ వార్త చిత్రంగా తోచింది.

    “సుందరా…”

    “చెప్పు”

    “ఛియర్ గరల్స్‌ను డిన్నర్‌కు ఆహ్వానించిన ఐపిఎల్ టీమ్. దీని మీద పలువురూ అభ్యంతరం చెప్పారు”

    “ఊ… క్రికెట్ మైదానంలో అసలు వీళ్ళెందుకు చెప్పు? సరైన టెక్నిక్, ఆటతీరు, పోటీని ప్రశసించగలిగే వాళ్ళెందరు? ఒక జెంటిల్‌మాన్ ఆట అని పేరున్నది కోట్ల వ్యాపారంలో మునిగి తేలుతోంది”

    “కానీ సుందరా, ప్రతీ సంవత్సరం కొంత సరిక్రొత్త టాలెంట్ ముందరికి రావడం లేదా చెప్పు?”

    సుందరం నన్ను అనుమానంగా చూశాడు. అతని రూటులోకి నేను రావటం నచ్చటం లేదు… మిర్చీ మొత్తం కోపంతో నమిలేసాడు.

    “శిశువా… ఆట ఎలా తయారయిందో చూశావా? నెత్తి మీద చెంబుతో నీళ్ళు పోసుకుంటున్నట్టు ఒక షాటు, గోల్ఫ్ ఆడినటు ఒక షాటు. రేపు పొద్దున్న పిచ్ మీద పూర్తిగా పడుకుని బూజు దులిపినట్టు బాల్‌ని పైకి తీసి సిక్స్ కొట్టే అవకాశం లేకపోలేదు”

    “బాల్ పైకి పోయిందా లేదా అది కావాలి”

    “ఛియర్ గర్లస్ ఎగిరారా లేదా అదీ కావాలి”

    “అందరూ ఎగిరారా లేరా? అమ్మాయిలూ, ఆంటీలూ, వయోవృద్ధులూ… అదీ కావాలి”

    “మూడు గంటల్లో ముల్లోకాలు చూపించారా లేదా? అదీ టాలెంట్”

    “ఇంతకీ ఏమంటావు సుందరా? వీర వనితలుండాలా వద్దా?”

    మిర్చీని కొద్దిగా చట్నీలో అద్దాడు సుందరం.

    “శిశువా, ఇది మిర్చీతో చర్చ”

    “కరెక్ట్”

    “నిజం ఇందులో గింజలా దాక్కునుంటుంది. తగిలినపుడు నాలుక చుర్రుమంటుంది”

    “ఛా”

    “అదీ సంగతి. సినిమాలు, క్రికెట్, కలర్… ఇవి దేశాన్ని నడిపించే దినుసులు. ఈ వనితలకు ఉపాధి కల్పించామా లేదా? అదొకటి. ఐ.పి.ఎల్ ఉందని ఇతర మ్యాచ్‌లు అంతరించి పోలేదు కదా? ఇదిగో ఈ మిర్చీలాగా ఇది జనరంజకం… రేపు ఏమవుతుందో మనకెందుకు? కొరుకుడు పడితే మింగే ప్రయత్నం చెయ్యి!”

    “ఊఁ”

    “ఊ అను, ఊ ఊ అను. మరో దారి లేదు. నా మిర్చీ బండి మీద రేపటి నుండే ఓ ఛియర్ గర్ల్‌ను కూర్చో పెట్టి తిప్పితే ఎలా ఉంటుంది?”

    “మహిళ విషయంలో రాజాకీయాలాడేవారు ఎందుకు అవకాశాన్ని విస్మరిస్తున్నారు?”

    “అటూ ఇటూ చర్చ జరిపెయ్యి. అందరికీ కెమెరా పనికొస్తుంది. స్వాత్రంత్యం మన జన్మ హక్కు”

    “కరెక్ట్”

    “అందరికీ అన్నీ కావాలి. ఏం చేద్దాం?”

    “మంచి మాట ఎవరికీ అక్కరలేదు”

    “ఇదిగో… ఇలా ఇదంతా సరదాగా నమిలేసి ఈ తొడిమెను పారేస్తాం. ఇలా మంచి చెడూ రెండిటినీ నమిలేసి రాజకీయం చేసేసి అసలు విషయాన్ని ఇదిగో ఇలా విసిరేస్తాం! అదీ సంగతి.”

    ఆలోచించాను. సుందరం మిర్చీ తింటున్నాడా లేక జీవిత సత్యం చెబుతున్నాడా అర్థం కాలేదు. సుందరం మొబైల్ శబ్దం చేసింది. దాన్ని కెలికి నాకు చూపించాడు. అందులో ఓ ఫొటో ఉంది. కుర్రాడు అందంగా ఉన్నాడు. కాకపోతే ఎందుకో శ్రీకృష్ణుడు రుక్మిని అవమానించినట్టు ఎవరో అరగుండు గొరిగినట్టున్నారు. ఒక వైపు సైడ్ లాక్ ఉంది. మీసం లేదు.

    “లేటెస్ట్ ఫాషన్…” చెప్పాడు సుందరం. “… నా మిత్రుడి కొడుకు”

    “ఏం చేస్తున్నాడు?”

    “ఏం చెయ్యడు. ఫాషన్ డిజైనింగ్ చేసే అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉంటాడు”

    “శభాష్”

    “క్రింద ఏం వ్రాసాడో చదువు”

    జాగ్రత్తగా చదివాను.

    “అంకుల్! మీకు ఐ.పి.ఎల్.లో మిర్చీ బజ్జీ అమ్మే కాంట్రాక్ట్ వచ్చిందని తెలిసింది. ఆరో తారీఖున మన ఊర్లో మ్యాచ్ ఉంది. ప్లీజ్. నాకూ, నా గరల్ ఫ్రెండ్‌కీ రెండు పాసెస్ ఇప్పిస్తారా?”

    చదివి సుందరానికిచ్చేసా. మరల మొబైల్ శబ్దం చేసింది. సుందరం మరల మొబైల్ నాకిచ్చాడు.

    ఆ మెసేజ్ క్రింద మరొకటుంది.

    “అంకుల్, ప్లీజ్! ఛియర్ గరల్స్‌కి దగ్గరగా సీట్లు కావాలి…”

    00000

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here