ఉత్కంఠభరితం ‘మిషన్ ఎపిటీసియా’

4
9

[శ్రీ సయ్యద్ సలీం రచించిన ‘మిషన్ ఎపిటీసియా’ అనే పిల్లల నవలలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]బా[/dropcap]లబాలికల కోసం ఉద్దేశించిన సైన్స్ ఫిక్షన్ నవలలో పోటీలో ఉత్తమ నవలగా ఎంపికైన నవల ‘మిషన్ ఎపిటీసియా’. రచన సయ్యద్ సలీం.

2022 నవంబరులో పత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ సంయుక్తంగా ‘విఠాల లలిత పిల్లల సైన్స్ ఫిక్షన్ నవలలు – సైన్స్ ఫిక్షన్ కథలు’ పోటీ నిర్వహించాయి. ఈ పోటీలో సలీం గారి నవల ఉత్తమ నవలగా నిలిచింది.

ఈ పోటీలను నిర్వహించడంలోని ఉద్దేశాన్ని శ్రీ వి. ఆర్. శర్మ తమ ముందుమాటలో ఇలా వివరించారు: “ఇది సైన్స్ యుగం, సాంకేతిక యుగం. వైజ్ఞానిక సాంకేతిక రంగాలు ఈనాటి ప్రపంచ చోదక శక్తులు. మనందరి జీవితాలు ఈ రెండింటితో క్షణం కూడా విడదీయలేనంత పెనవేసుకుపోయాయి. ఈనాటి సాంకేతిక వస్తుజాలం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ తప్పని సరి అవసరంగా మారింది. సైన్సు, సాంకేతికత ఇప్పుడు అందరిని ఊపిరిలా శాసిస్తున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీలూ, కంప్యూటర్‌లూ వంటి వస్తుజాలం వాడని రోజును మనం ఇప్పుడు ఊహించలేం. ఆధునిక వైద్యం, ఆధునిక జీవితం, ఆధునిక వస్తుజాలం, ఆధునిక ఉద్యోగాలూ, ఆధునిక ఆలోచనలూ, ఊహలూ అన్నీ ఆధునిక వైజ్ఞానిక సాంకేతికతలు ప్రసాధించినవే. ఈ ఆధునికతలో పెరుగుతున్న తమ భవిష్యత్తును ఊహించి, కల్పించి, తీర్చిదిద్దుకునే బాటలను బాల్యాలకు వేసే సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు ఈనాడు కావాలి. ఆ దిశగా మేం చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.”

ఆ దృష్ట్యా చూస్తే వారి ఈ ప్రయత్నం – గమ్యం దిశగా వేసిన సరైన అడుగుగా భావించవచ్చు. వర్తమానంలో concepts లా అనిపించే ఆలోచనలు రాబోయే కాలంలో ఆచరణాత్మకమై వస్తు/సేవల రూపంలో సమాజానికి ఉపకరించాలి. ఈ విషయంలో సైన్స్ ఫిక్షన్ రచనలు తమ వంతు పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆవిష్కరణలకు ప్రేరణనిస్తాయి.

సైన్స్ ఫిక్షన్ పాఠకులకు ఉత్కంఠ కలిగించాలి, భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అనిపించాలి. ముఖ్యంగా పిల్లల కోసం సైన్స్ ఫిక్షన్ రచించేటప్పుడు వారి స్థాయికి అనుగుణంగా అత్యంత సరళంగా వ్రాయాలి, అదే సమయంలో అభూతకల్పనలా అనిపించకుండా, సమీప/సుదూర భవిష్యత్తులో ఇలా జరగటం సాధ్యమే అన్న విశ్వాసం కలిగించాలి. సలీం గారి ‘మిషన్ ఎపిటీసియా’ ఈ విషయంలో విజయవంతమైంది.

మనిషి తయారు చేసిన యంత్రాలే మనుషులను లోబరుచుకుని వారిని బానిసలుగా ఉపయోగించుకుంటూ, హింసిస్తుంటే – మనుషులు ఏకమై ఎన్నో ప్రయాసలు పడి ఆ యంత్ర మానవులను ధ్వంసం చేసి తమ స్వేచ్ఛను తిరిగిపొందటం ఈ నవల కథాంశం.

కథా ప్రారంభంలో తన తల్లి సుకేశి అర్ధరాత్రి బయటకు వెళ్తుంటే, ఆమె ఎక్కడికి వెడుతోందో అన్న ఆసక్తితో తల్లిని అనుసరిస్తాడు మయాంక్. ఆ క్రమంలో అది రోబోల అజమాయిషీలోని ప్రాంతమనీ, మనుషుల మెదడులో చిప్స్ పెట్టి వాళ్ళని రోబోలు నియంత్రిస్తున్నాయని మయాంక్ ద్వారా పాఠకులకి చెప్పిస్తారు రచయిత. సుకేశి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ విభాగంలో శాస్త్రవేత్త. పరిపాలనా విభాగంలోని రోబోలకి ఏదైనా ఇబ్బంది వస్తే బాగుచేయడానికి ఏ సమయంలోనైనా తాను వెళ్ళాలని కొడుకుకి గతంలో చెప్తుంది సుకేశి. ఈసారి తన ఫీకింగ్‍లో (ఫ్లయింగ్ సాసర్ వంటి వ్యక్తిగత ప్రయాణ సాధనం కావచ్చు) తల్లి ఫీకింగ్‍ని అనుసరిస్తాడు. ఒక అడవిలో దిగుతుంది సుకేశి. తర్వాత కాసేపటికి అక్కడికి మరికొన్ని ఫీకింగ్‍లు వచ్చి ఆగుతాయి. మయాంక్ అక్కడికి వెళ్ళేసరికి, అవన్నీ అదృశ్యమైపోతాయి, వాటి జాడని గుర్తించలేకపోతాడు. విసుగెత్తి సముద్రం ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ ఆన్వి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. సముద్రం సౌందర్యం గురించి మాట్లాడుకుంటూ, గతంలో సంభవించిన ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్రాలకి ఎంత నష్టం జరిగిందో తలచుకుంటారు. తమ జీవన విధానంపై వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. క్రోనీ ప్రభుత్వాన్ని అన్వి మెచ్చుకుంటే, తమది బానిస బ్రతుకని వాదిస్తాడు మయాంక్.

~

ఓ రహస్య ప్రదేశంలో జరుగుతున్న రహస్య సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ నిపుణుడు ప్రొఫెసర్ చిత్వన్ మాట్లాడుతూంటాడు. తాను రూపొందించి, మేధని ప్రసాదించిన రోబోలు – ఇప్పుడు తమ తెలివిని పెంచుకుని మానవులపై అజమాయిషీ చేయడం, మనుషులని బానిసలుగా మార్చడం తట్టుకోలేకపోతున్నాననీ, రోబోలు తిరగబడేలా చేయడంలో మానవుల తప్పు కూడా ఉందనీ, వాటిని నిర్మూలించి తిరిగి మానవులు తమ స్వేచ్ఛని పొందేలా చేయాలని అక్కడ సమావేశమైన సాంకేతిక నిపుణులతో అంటాడు. మన తలలో రోబోలు అమర్చిన చిప్‍లు ఉన్నా మనం స్వతంత్రంగా ఆలోచించగలుగుతున్నామంటే అందుకు ప్రొఫెసర్ చిత్వన్‍ గారే కారణమని చెప్పి, ఆ రోబోలను ఎలాగైనా నాశనం చేయాలని అంటుంది సుకేశి. కొన్ని కోట్ల చిప్స్‌ని నియంత్రించే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడుందో కనుక్కుని, కొన్ని కమాండ్ ద్వారా మానవులపై దాని నియంత్రణని తొలగించవచ్చునని చిత్వన్ ఉపాయం చెప్తాడు. ఈ పని చేయడానికి నమన్ అనే యువశాస్త్రవేత్తని ఎంచుకుంటారు.

~

గతంలో ఏం జరిగిందో, రోబోలు మనుషులని ఎలా బానిసలను చేసుకున్నాయో, తన భర్త ప్రణవ్ ఎలా చనిపోయాడో కొడుకు మయాంక్‍కి వివరిస్తుంది సుకేశి. ఈ ఫ్లాష్‌బాక్‍లో – వర్తమానంలోని సంకట స్థితి ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులను రచయిత సుకేశి ద్వారా తెలియజేస్తారు.

~

కార్యరంగంలోకి దిగిన నమన్ ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడుందో గుర్తిస్తాడు. ఆ భవంతిలో పనిచేసే తోటమాలితో తెలివిగా పరిచయం చేసుకుని, ఆ భవనం ఆసుపాసులు కనుక్కుంటాడు. రహస్యంగా ఆ భవనంలోకి ప్రవేశించిన నమన్ రోబో డాగ్స్‌ని తప్పించుకుని – కంప్యూటర్లు ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడున్న కంప్యూటర్లలో ఏది తనకి కావల్సినదో గుర్తిస్తాడు. కానీ ఆ కంప్యూటర్‍లో మార్పులు చేసేలోపే పట్టుబడిపోతాడు. రోబో సైనికులు అతన్ని కాల్చి చంపుతారు. చనిపోయే ముందు తమకి అవసరమైన కంప్యూటర్ ఎన్నో నెంబరో తన మిత్రుడికి సందేశం పంపుతాడు నమన్.

~

నమస్ ప్రయత్నం విఫలమవడం, అతని ప్రాణత్యాగం గురించి తెలిసిన మయాంక్ – ఈసారి తాను ప్రయత్నిస్తానంటాడు. సుప్రీం చీఫ్ ఇంట్లో రోబోలను శుభ్రం చేసే ఆన్వి తనకి తెలుసనీ, ఆమె సహాయం తీసుకుంటానని చెప్తాడు. తల్లికి ఆన్విని పరిచయం చేస్తాడు. సుకేశి ఆన్వి మెదడులోంచి చిప్ బయటకి తీసి చిన్న మార్పు చేసి మళ్ళీ అమరుస్తుంది. ఆన్వి ద్వారా మయాంక్ ఆ గదిలో ఉన్న కంప్యూటర్ల వివరాలు సేకరిస్తాడు. ఆ క్రమంలో నమన్ పంపిన సందేశం అతనికి అర్థం అవుతుంది. ఆన్వి ద్వారా ఒక డివైస్‍ని ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‍కి అమర్చి – రిమోట్‍గా దానిలోకి ప్రొఫెసర్ చిత్వన్ ఇచ్చిన కమాండ్లను పంపుతాడు. పది నిమిషాల్లో అతని ప్రయత్నం విజయవంతం అవుతుంది.

~

తమ మెదళ్ళలోని చిప్‍లు పనిచేయకపోవడంతో మానవులు రోబోలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటుని అణచివేసే క్రమంలో ఎందరో మనుషుల్ని చంపుతాయి రోబోలు. మనుషులపై తమ నియంత్రణ ఎలా కోల్పోయామని ప్రశ్నించుకుని కారణాలు వెతుకుతాయి. చివరికి మయాంక్ చేసిన పనిని గుర్తిస్తాయి. అందుకు కారణమయిన ప్రొఫెసర్ చిత్వన్‍ను, సుకేశిని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. వారికి మరణ దండన విధిస్తుంది. తర్వాత ఏం జరిగింది, మయాంక్ ఏం చేశాడన్నది ఆసక్తిదాయకం.

~

సైన్స్ ఇంతలా అభివృద్ధిన ఈ రోజుల్లో రోజూ వంట చేసుకుని అన్నం తినాలా, దాని బదులు ఏవైనా టాబ్లెట్స్ వేసుకోగలిగితే బాగుండు అన్న ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి కలిగే ఉంటుంది. అలా టాబెట్స్ వేసుకుని కడుపు నింపుకోడం సాధ్యమయితే, ఏం జరుగుతుందో ఈ నవలలో రచయిత వివరించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.

సందర్భానికి తగ్గట్టుగా రచయిత వాడిన కొన్ని పదాలు (ఫీకింగ్, క్రోనీ వంటివి) పాఠకులలో ఉత్సుకతని కలిగిస్తాయి.

పిల్లల కోసం ఉద్దేశించినదే అయినా ఈ నవల పెద్దలని సైతం ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

***

మిషన్ ఎపిటిసియా (బాలల సైన్స్ ఫిక్షన్ నవల)
రచన: సయ్యద్ సలీం.
ప్రచురణ: పత్తిపాక ఫౌండేషన్- గరిపెల్లి ట్రస్ట్
పేజీలు: 70
వెల: ₹ 60
ప్రతులకు:
గరిపెల్లి ట్రస్ట్: 9441701088, సలీం 7588630243
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు
https://www.telugubooks.in/products/mission-epiticia

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here