ఆదర్శవాద ధోరణులతో వచ్చిన నవల – మొదటి చీమ

0
9

[dropcap]”కా[/dropcap]ల నాళిక” వంటి బృహన్నవల రాసిన రామా చంద్రమౌళి, దాని తర్వాత ఇప్పుడు “మొదటి చీమ” పేరుతో మరో నవలను మన ముందుకు తీసుకువచ్చారు.

తమకంటూ ఎవరూ లేని జీవితాలలో నుండి కష్టపడి, ప్రతికూల పరిస్థితుల నుండి పైకెదిగి ఐ.ఐ.టి.లలో చదువుకున్న నందాదేవి, జయకర్‌లు హార్వార్డ్‌లో చదువుతున్నప్పుడు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ జీనియస్‌లే. నందాదేవి డెల్లాయి‌ట్‌లో ఏడాదికి డెబ్భై లక్షల ఉద్యోగంలో చేరితే, జయకర్ ఏడాదికి 78 లక్షల జీతానికి ఆక్సెంచర్‌లో పనిచేస్తూంటాడు. విలాసవంతమైన జీవితం వారిది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు లేకపోవడంతో నందాదేవి, తన మిత్రురాలైన డాక్టర్ అనురాధ అనే గైనిక్ స్పెషలిస్ట్‌ని సంప్రదిస్తుంది. నందాదేవి భర్త అయిన జయకర్‍లో వీర్యకణాల లోపం వుందనీ, దాని తాలూకు పూర్తి వివరాలను డాక్టర్ తెలియజేస్తుంది. ఎగ్ డోనర్, సెరెమ్ డోనర్, వూంబ్ డోనర్ గురించి తెలియజేస్తూ, ఆమె ఎంపిక చేసిన సెరెమ్ డోనర్‌తో గర్భధారణ చేయిస్తుంది. ఆమె భర్త అయిన ప్రొఫెసర్ సదాశివం మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నిక్కచ్చిగా, నిజాయితీగా వుండే ఈ ప్రొఫెసర్ మంచి రచయిత కూడా. ప్రొఫెసర్ సదాశివం శిష్యుడు రామకృష్ణ జీనియస్. అతివేగంగా రీసెర్చి స్కాలర్లకు సిద్ధాంత గ్రంథాలు రాసిపెట్టే ఘోస్ట్ రైటర్. బార్న్ ఇంటెలిజెంట్. అతని సహాయకురాలిగా చేరిన సుహాసిని అతని జీవన సహచరిగా మారిపోతుంది. వీరందరికి కొత్త విషయాలను కనిపెట్టాలనే తపన, ఉత్సాహం, అన్వేషణాతృష్ణ వుంటాయి. తద్వారా మానవాళికి మేలు జరగాలని కోరుకుంటారు. అందులో భాగంగా ‘వాయిస్ ప్రింటింగ్’ ఆవిష్కరణ గావించిన నందాదేవి ఈసారి ‘పునరుత్పాదక, సాంప్రదాయేతర ఇంధన వనరుల’పై దృష్టి పెట్టి ప్రయోగాలు చేస్తుంది. ప్రతి వనరుల నుండి అనగా సముద్రపు కెరటాల నుండి విద్యుదుత్పత్తి చేసి మనుషులకు అతి చౌకగా విద్యుత్ అందజేయడం, సముద్ర జలాలను శుద్ధి చేసి నిరంతరం త్రాగునీటి సరఫరా చేయాలని కోరుకుంటుంది.

జయకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధో సృష్టి)కి సంబంధించి కృషి చేస్తూంటాడు. సముద్రంలో వచ్చే తుఫానులు, వరదలు, హరికేన్‌లు, పెనుగాలులు, టోర్నడోలు అన్నీ ఘన, వాయు, ద్రవ పదార్థాల ఉష్ణోగ్రత వల్ల వస్తున్నాయి. వాటిని ఏర్పడకుండా, వాటికి వ్యతిరేకశక్తులను ప్రయోగిస్తూ, వాటి దారి మళ్ళిస్తూ, దిశలను మార్చుతూ – నియంత్రిస్తూ ముందు ముందు మనుషులు బలి కాకుండా కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక ప్రొఫెసర్ సదాశివం ఆయన శిష్యుడైన రామకృష్ణలు కలిసి హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ, వాక్యూమ్ ట్యూబ్స్ – వాటి డిజైన్స్, ఫ్రిక్షన్… రాపిడిని తగ్గించే వ్యవస్థ… లోపల పయనించే క్యాప్సుల్స్… టెస్ట్ ట్రాక్ నిర్మాణాల గురించి ఆలోచిస్తూంటారు.

ఏ దేశనికైనా అత్యంత కీలకమైన నాడీ వ్యవస్థ లాంటి వృత్తి విద్యారంగం చెదలు పట్టి నిర్వీర్యమై పోయింది. ప్రామాణికంగా, బాధ్యతాయుతంగా ఉండవలసిన బోధనా వృత్తి తనను తాను దిగజార్చుకుంటూ, అభివృద్ధి పేరుతో బాగా పలచబడి పతనమైపోయింది. ఎవరు దీనికి బాధ్యులు అంటే – యూనివర్సిటీలు, విద్యావ్యవస్థలలో అనవసరమైన రాజకీయ ప్రవేశాలు, విద్యావ్యాప్తి పేరుతో డబ్బు సంపాదనే ధ్యేయమై ఎడాపెడా దిక్కుమాలిన చవుకబారు నిబంధనలను తయారుచేసి ప్రతిదానికి ఇంత డబ్బని… కేవలం ధనార్జనే ముఖ్యంగా పెట్టుకుని రూపుదిద్దుకుంటున్న విశ్వవిద్యాలయాలు – వారి నిర్లక్ష్య నిర్వహణ. వీళ్లంతా ఈ సమాజాన్నీ, వ్యవస్థను, దేశాన్నీ ఎలా ముందుకు నడిపిస్తారు? ఇంకో వైపు వీధి రౌడీలు రాజకీయ నాయకులవుతూ, ప్రభుత్వాలు తమ ఓట్ల వేటలో దేన్నయినా చేయడానికి సిద్ధపడి ‘ఉచితం’ ఫార్ములాతో ప్రజలను సోమరిపోతులుగా, పనిదొంగలుగా తయారు చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని వందల లక్షల కోట్ల రూపాయలను తరలించి విదేశాలకు పారిపోతున్నారు. ఇవన్నీ చూస్తూ దిక్కుతోచక చోద్యం చూస్తూ నిలబడే అధికార గణం. వెరసి పతనమై పోతున్న నైతిక విలువలు. ‘కేవలం ఉన్నతోద్యోగాలే ఆత్మతృప్తిని కలిగించవు’ అని ఈ నవలలో ఉన్న జీనియస్‌లంతా గుర్తిస్తారు. “కళ్ళెదుట జరుగుతున్న అవినీతిని చూస్తూ ప్రతిఘటించకపోవడం నేరం” అని గ్రహిస్తారు. దీనికి ఎవరో ఒకరు ముందుకు రావాలి, మార్గదర్శకత్వం వహించాలి. మొదటి చీమ కావాలి.

చాలా శుభ్రంగా ఉన్న హాల్‌లో విట్రిఫైడ్ గచ్చు మీద కొన్ని పంచదార రేణువులు పడివుంటే… ఓ పది నిముషాల్లో అప్పటిదాక అసలు ఉనికే లేని ఒక నల్లని గండు చీమ ఎక్కడి నుండి వచ్చిందో… వచ్చి ఒక పంచదార రేణువును ముక్కున కరుచుకుని… చూస్త్ చూస్తూండనే రెండు, మూడు, నాలుగు… ఒక చీమల మంద… గుంపు తయారవుతుంది. ముందు మొదటి చీమ… దాని వెంట ఒక చీమల గుంపు. కావలసిన దాని ఉనికిని ముందు కనుగొన్నది మొదటి చీమ. దారి చూపింది మొదటి చీమ. ముందు నడిచి నాయకత్వం వహించేదీ మొదటి చీమే. నేనే మొదటి చీమనయితే అని నందాదేవి అనుకుంటుంది.

నిజానికి ఉపయోగించుకోదలచుకుంటే, మన దేశంలో ప్రతి ఇంటిలోని ప్రతి స్త్రీ ఒక మొదటి చీమ. ప్రతి ఇంటిలో జరుగుతున్న అసాంఘిక విషయాన్ని ముందు పసిగట్టేది ఆ ఇంటి స్త్రీయే. స్త్రీని ఉద్యుక్తురాలిని చేసి, సంఘటిత పరిచి ఆయా ఇండ్లలో జరుగుతున్న లంచగొండి పనులను, అనైతిక కలాపాలను, తప్పుడు చేష్టలను ప్రశ్నించగలిగేలా చేయాలి. కొన్నేళ్ళుగా ఈ పట్టాలు తప్పుతున్న రైలుగా వున్న స్థితి నుండి ఈ తరాన్ని రక్షించేందుకు కేవలం ‘నైతిక విలువల పునఃస్థాపన’ జరగాలి తప్ప వేరే ఏ మార్గమూ లేదని ‘డాగ్’ అనే పేరుతో సంస్థను నెలకొల్పి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుంటుంది నందాదేవి. ప్రతి ఇంట్లో నుండి ఆడవాళ్ళు లేవదీసిన అవినీతి నిరోధక ఉద్యమానికి క్రమంగా ప్రజల్లో రియలైజేషన్ వస్తుంది. తమను తాము ప్రక్షాళన చేసుకుంటున్న వ్యక్తుల స్వచ్ఛంద భాగస్వామ్యం ఒక నిర్మల, కాలుష్య రహిత నైతిక జీవనానికి అంకితమై కొనసాగాలని తమను తాము పునర్నిర్మించుకుంటున్న పౌరుల ఒక కలయిక.. సామాజికంగా ఈ ఉద్యమం విజయవంతం కావడంతో ముఖ్యమంత్రిని కలిసిన నందాదేవి తన కొడుకు విశ్వను ఒక పరిశుభ్ర హృదయం గల రాజకీయ నాయకునిగా, విశ్వమానవునిగా తీర్చిదిద్దుతానని ప్రకటిస్తుంది.

ఈ నవలలో రచయిత అనేకానేక శాస్త్ర, సాంకేతిక విషయాలను అలవోకగా తెలియజేశారు. మన ప్రాచీన గ్రంథాలలో శాస్త్రాలలో వున్న అనేక విషయాలను విశ్లేషించి చర్చకు పెట్టడంతో పాటు నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలతో వాటిని తులనాత్మకంగా పరిశీలించడం ఆకట్టుకుంటుంది. భవిష్యత్ ఊహలతో, ఇందులో ఉన్న జీనియస్‌లు తలపెట్టిన పరిశోధనలు, ఆలోచనలతో ఈ నవల సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తుంది. కవితాత్మక వచనం ఈ నవలకు మరింత వన్నె తెచ్చింది. పాత్రధారుల ఫ్లాష్‌బ్యాక్ కథాకథనాలతో, శాస్త్రసాంకేతిక విషయాలను జోడించడం వల్ల జాగ్రత్తగా చదివితే తప్ప నవలను అర్థం చేసుకోవడం కష్టం.

***

మొదటి చీమ (నవల)
రామా చంద్రమౌళి,
మాధుర్ బుక్స్, వరంగల్లు, జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 110
వెల: ₹80
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here