మొక్కల సంబరం

0
7

[dropcap]అ[/dropcap]నగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తన పొలంలో కూరగాయల మొక్కల్ని నాటుదామని అనుకున్నాడు. ఎక్కువ కాయలు కాసే మొక్కల నారు ఎక్కడ దొరుకుతుందో కనుక్కున్నాడు.  గరువుపాలెంలో అమ్ముతున్నారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి టమాటా, వంగ, బెండ, పచ్చి మిరప, దోస మొక్కల్ని కొన్నాడు. వాటిని తెచ్చి తన పొలంలో నాటాడు. ఈ మొక్కలు త్వరగా పెరగాలి. బలంగా కూడా ఉండాలి. అలా ఉంటేనే ఎక్కువ కాయలు కాస్తాయి. కాయలు కూడా చూడడానికి పెద్దగా ఉంటాయనుకున్నాడు. అలా ఉండాలని ‘కాంప్లెక్సు’ అనే ఎరువు తెచ్చి పొలమంతా చల్లాడు. ఆ ఎరువు కరగడానికి పక్కనున్న కాలవలో నుంచి నీటిని పొలంలోకి పెట్టుకున్నాడు. పొలం తడిసింది. తన పని అయిన తరువాత రైతు ఇంటికి వెళ్లిపోయాడు.

రైతు వెళ్ళిన తరువాత మొక్కలు తమలో తాము మాట్లాడుకోసాగాయి. మొదటగా బెండ మొక్క పెట్టింది. “మనం బాగానే పెరుగుతున్నాం, అయినా మన రైతు నత్రజని, పొటాషూ, ఫాస్పేట్ లాంటివి అన్ని ఉన్న ఆ ‘కాంప్లెక్సు’ ఎరువును తెచ్చి చల్లాడు. మన ఆకులన్ని వేడెక్కిపోయాయి. లోపలున్న మన వేళ్ళ కూడా హాయిగా లేదు. ఈ వేడి ఎప్పటికి తగ్గుతుందో?” అని బెండ మొక్క దిగులు పడింది.

ఆ తరువాత వంగ మొక్క అందుకున్నది –  “నువ్వు అన్నమాట నిజం బెండమ్మా. నాకు కూడా ఒళ్లంతా వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయి. బాగా నీరసంగా కూడా ఉన్నది. నాకీ నీరసం ఎప్పటికి తగ్గుతుందో?” అని తెగ బాధపడిపోయింది వంగ మొక్క.

ఆ తరువాత మిరప మొక్క మొదలుపెట్టింది. “మీరిద్దరూ నిజం చెప్పారు, ఈ ఎరువులకు నేనూ తట్టుకోలేకపోతున్నాను. మేం పెరుగుతూనే పూతా, పిందే వేస్తాం. ఇప్పుడు పూతా పిందే వెయ్యలేకపోతున్నాను. ఇదివరకటి రోజుల్లో అయితే మా మిరపకాయలు బాగా ఎర్రగా పొడుగ్గా ఉండేవి, బాగా కారంగా కూడా ఉండేవి. ఇప్పుడేమో మాకు పుట్టిన దగ్గర నుండి ఎరువులు వేస్తున్నారు దాంతో మా కాయలు ఇదివరకటిలాగా ఉండడం లేదు. అది చూసి ‘మిరప మొక్కలు ఇప్పుడు తాలుకాయలు కాస్తున్నాయ్’ అంటున్నారు” అంటూ మిరప మొక్క తన గోడు చెప్పుకున్నది.

తర్వాత టమాటా మొక్క మొదలుపెట్టింది. “నిజంగా ఈ రైతులు ఏ ఎరువులు చల్లకపోతే ఎంత బాగుంటుంది? నాకసలు పెద్దగా నీళ్ళే అవసరం లేదు. మంచు పడితే చాలు. ఆ తడిని పీల్చుకునే మేం బతుకుతాం. మా ఆకులు కూడా కమ్మని వాసన వేస్తాయి. మేం పెరగటం మొదలు పెడతామా, ఆ వెంటనే పూతా, పిందే వేస్తాం. పండిన తరువాత ఎర్రగా నిగనిగలాడతాం. చూసేవారికి నోరూరిస్తాం. ఇదివరకు కాయ నిండా రసంతో ఉండేవాళ్ళం. తింటే నోటికి పుల్ల పుల్లగా ఉండేవాళ్ళం. ఈ ఎరువుల వలన మా రుచే మారిపోతున్నది. జనాలు మమ్మల్ని తింటూ, ‘టమోటాలు ఇదివరకటి రుచిలాగా లేనేలేవు’ అనుకుంటున్నారు” అన్నది టమాటా మొక్క నిట్టూరుస్తూ.

వాళ్లు ముగ్గురు మాట్లాడడం విని దోస తీగ తాను మాట్లాడటం మొదలు పెట్టింది. “నేనైతే గరుకుగాను గుండ్రని ఆకులతోనూ ఉంటాను. పచ్చని పూలు పూస్తాను. ముందు ఆకుపచ్చని పిందెలు వేస్తాను, ఆ తరువాత మంచి పసుపురంగులోకి మారుతాను. దోసిట్లో పట్టనంతగా పెరుగుతాను. మాలో చాలా రకాలున్నాయి. చిన్న సైజు కాయల్ని నక్కదోస అంటారు, లావాటి గుండ్రని కాయల్ని పప్పు దోస అంటారు. పండిన మమ్మల్ని చూసి దోస పళ్ళు అంటారు. దోస ఆవకాయ, దోస కాయ పప్పు జనాలకు చాలా ఇష్టం. ఇదివరకు మేము తియ్యతియ్యగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే వాళ్ళం. తీగె నుండి కోసిన తర్వాత 15 -20 రోజులదాక రాయిలా గట్టిగా ఉండేవాళ్ళం. ఈ ఎరువుల మూలంగా ఊరికే మెత్తబడిపోతున్నాం, కూరకు పనికి రావంటూ మమ్మల్ని వృథాగా బయట పారవేస్తున్నారు” అంటూ దోస తీగె ఎంతో నిరాశగా మాట్లాడింది. ఇలా మొక్కలు తమ తమ బాధలను చెప్పుకున్నాయి.

ఆ మర్నాటి పొద్దుటిపూట రైతు పొలానికి వచ్చాడు. వస్తూ వస్తూ జానెడు ఎత్తు పైగా ఉన్న బంతి ముక్కల్ని తెచ్చాడు. కూరగాయల మొక్కల మధ్య లోను, వాటి చుట్టూతాను అక్కడ అక్కడ ఈ బంతి మొక్కల్ని నాటాడు. అవి కూడా చక్కగా బతికాయి. ఏపుగాను పెరుగుతున్నాయి. తన చుట్టూ ఉన్న కూరగాయల మొక్కలని చూసి బంతి మొక్క చాలా సంతోషపడింది. మిగతా మొక్కలు అన్నిటితోనూ బాగా స్నేహంగా ఉండాలనుకున్నది. వాటితో మాటలు మొదలు పెట్టింది.

“ఏమర్రా బాగున్నారా? మీరందరూ కాయలు కాస్తారు, నేను పూలు పూస్తాను. నా పువ్వులు చారెడు వెడల్పుతో ఉంటాయి. నా రేకలన్నీ ఒత్తుగా ఉంటాయి. బంగారు రంగులోను, కారపు రంగులోను పూస్తాను. మాలోనూ చాలా రకాలున్నాయి. ముద్దబంతి, ఊక బంతి, కారపు బంతి, ఇంగ్లీషు బంతి, బంగళా బంతి ఇలాగన్నమాట. మా పూలన్నీ ఎంతో అందంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి నా పూలతో ఈ పొలానికే అందం వస్తుంది. పైగా నేనున్న చోట పురుగులు, చీడలు పెద్దగా రావు. అందుకే రైతులు మమ్మల్ని తీసుకువచ్చి తమ కూరగాయల పొలాల్లో నాటుతూ ఉంటారు. చిన్న పాపాయిలు ఎంతో అందంగా ఉంటారుగా. అలాగే మేం కూడా బోలెడు అందంగా ఉంటాం. నా ఆకులు మంచి సువాసన వస్తాయి. నా పూలతోను ఆకులతోను మందులు కూడా చేస్తారు. ఇప్పుడు రైతులు చల్లే ఎరువులతో మాకు బాగా వికారంగా ఉంటున్నది. వీళ్లు అవి చల్లటం ఎప్పుడు మానేస్తారా అని చూస్తున్నాం” అని చెప్పింది బంతి మొక్క.

‘ఎరువులు వాడడం బంతి మొక్కకూ ఇష్టం లేదన్న మాట’ అనుకున్నాయి మిగతా మొక్కలు. మొక్కలు అన్నీ బాగానే పెరుగుతున్నాయి. కూరగాయల మొక్కలు, బంతి మొక్కలు అన్నీ చిన్న చిన్న మొగ్గలు వేశాయి. రైతు వచ్చి పొలం చుట్టూ తిరిగి చూసుకున్నాడు. మొక్కలన్నీ బాగున్నాయి. పూత వచ్చింది. ఈ పూతలు కొద్దిరోజులకు పువ్వులుగా విచ్చుకుంటాయి. ఆ పువ్వులే పిందెల అవుతాయి కనుక ఇప్పుడు పూల మీద పురుగేమీ చేరకుండా చూసుకోవాలనుకున్నాడు.

అనుకున్నట్టుగానే పురుగుల్ని చంపేముందు తెచ్చి మొక్కల మీద చల్లాడు. ఈసారి మొక్కలతో పాటు విచ్చిన పూలు కూడా విసుక్కున్నాయి. “అబ్బా పాడు వాసన, పడలేక పోతున్నాం. మా పూలన్నీ చక్కగా పిందెలయ్యేవి. ఇప్పుడీ వాసనతో ఒళ్లంతా వికారంగా ఉన్నది. వేళ్ళ నుండి కూడా వెచ్చని ఆవిరి పైకి వస్తున్నది. ఆ వేడికి మన పూలన్నీ కమిలిపోతాయేమో. బాగా ఉన్నామని ఎంతో సంతోషించాం ఇంతలోనే ఈ రైతు ఈ మందు తెచ్చి కొట్టాడు. సంతోషం అంతా పోయింది” అని బాధపడ్డాయి. కొన్ని రోజులు గడిచాయి.

రైతు పొలమంతా తిరిగి చూసుకున్నాడు. ‘పూలూ, పిందెలు బాగానే పడ్డాయి. ఈ పిందెలు బాగా పెద్ద సైజు కాయలుగా అయ్యేటట్లు చూడాలి. అలా కావాలంటే మొక్కలకు ఏదైనా బలం మందు వేయాలి’ అనుకున్నాడు. ఎరువుల దుకాణంలో కనుక్కొని బలం మందు కూడా తెచ్చాడు. పొలంలో ఆ మందుని చిలకరించాడు.

ఈసారి మొక్కలకు బాగా కోపం వచ్చింది. మళ్ళా తమలో తాము మాట్లాడుకోసాగాయి. “మనమంతా బాగానే పెరుగుతున్నాం. పూత పూశాం. పిందెలు వేశాం. అయినా ఈ రైతుకు ఇంత ఆత్రం ఏంటో తెలియదు. వీళ్ళ తాతలు ఇలా పొలాల్లో ఎరువులు మందులు పోసేవాళ్లు కాదంట. మొక్కలకు పశువుల పేడను పెంట పోగు ఎరువును వేసే వాళ్ళంట. పురుగులు ఏమీ రాకుండా వేపపిండిని చల్లేవారంట. అప్పుడు మొక్కలు పూలు కాయలు అన్ని ఆరోగ్యంగా ఉండేవంట. అవి తిన్న మనుషులు కూడా రోగాలు రాకుండా బాగా ఉండేవారంట. ఇప్పుడే ఈ రైతేమో చీటికీ మాటికీ మందులు తెచ్చి పోస్తున్నాడు. ఇలా చేయకుండా చూడాలి” అనుకున్నాయి.

వంగ మొక్క “నేనీ మాట గట్టిగా చెప్పాలనుకుంటున్నా” అన్నది.

బెండ మొక్క మొదలుపెట్టింది “ఇదంతా అక్షరాల నిజం. మనమే ఏదో ఒకటి చేయాలి. మనకు మళ్లీ ఎరువుగా పశువుల పేడ, పెంట పోగు ఎరువు వేసేటట్లు చూడాలి. మీకేమైనా తెలిస్తే సలహా చెప్పండి” అంటూ మొక్కల వైపు చూసింది.

“నువ్వే చెప్పు బెండ మొక్కా, నువ్వు అసలే  చాలా తెలివిగలదానివి. నువ్వు చెప్పిందే మేమంతా వింటాం” అన్నాయి మిగతా మొక్కలు.

బెండ మొక్క సంతోషించింది. “సరే నేనే ఆలోచించాను. మనందరం సమ్మె చేద్దాం మనం పెరగకూడదు. మన కాయల్ని పెరగనివ్వకూడదు. పిందెలు గానే ఉండిపోదాం. రైతు ఎన్ని బలం మందులు తెచ్చి పోసినా మనం ఇలాగే ఉండిపోదాం. ఏమంటారు?” అని అడిగింది.

మిగతా మొక్కలన్నింటికీ ఆ మాట నచ్చింది. “నువ్వు చెప్పిన ఆలోచన బాగున్నది బెండ మొక్కా. నువ్వు చెప్పినట్లే చేద్దాం. రైతుకు తెలిసి వచ్చేటట్లు చెయ్యాలి” అన్నాయి మిగతా మొక్కలన్నీ.

పొలం చూసుకోడానికి రైతు వచ్చాడు. చుట్టూ తిరిగి చూసుకున్నాడు. పక్క పొలంలో మరొక రైతు ఉన్నాడు. అతనితో మాట్లాడసాగాడు.

“అన్నా, నీలాగే నేను బలం ముందు తెచ్చి పోశాను. దాంతో మొక్కలు బాగుంటాయి. పిందెలు అన్ని గబగబా పెరుగుతాయి. కూరగాయలన్నీ మంచి సైజులో ఉంటాయి. మార్కెట్‌కు తీసుకువెళితే జనం ఎగబడతారు. నాకు మంచి ధర కూడా వస్తుంది” అన్నాడు.

ఆ మాటలన్నీ మొక్కలు విన్నాయి. మొక్కలు మళ్లీ మాటల్లో పడ్డాయి. ముందుగా దోస తీగ మాటలు మొదలుపెట్టింది. “మన అన్నింటికీ ఈ బలం మందు వాసన వికారంగా ఉన్నది. యాక్. అసలు ఈ వాసన పీలుస్తుంటేనే డోకు వస్తున్నది. రైతేమో పెద్ద పెద్ద కాయలు అవుతాయని అనుకుంటున్నాడు. మనం అనుకున్న మాటలు మీ అందరికీ గుర్తున్నాయిగా, ఈరోజు ఎట్లా ఉన్నామో మనమంతా అలాగే ఉందాం. ఒక్క చిగురు వేయవద్దు. ఒక్క పువ్వు విచ్చనీయొద్దు, ఒక్క పిందెను పెరగనీయద్దు” అని దోస తీగ గట్టిగా చెప్పింది.

ఆ తర్వాత టమాటా మొక్క మాట్లాడసాగింది. “అవునవును మన పిందెలనీ ఎలా ఉన్నాయో అట్లాగే ఉంచుదాం. వాటిని కొంచెం కూడా పెరగనీయొద్దు. ఈ రైతుకు మన బాధ అర్థం కావాలి” అంది ఆవేశంగా.

ఆ తరువాత మిరప మొక్క మాట్లాడడం మొదలుపెట్టింది. “రైతుకు మన బాధ తెలుస్తుందంటారా. అంత తెలివి ఉన్నదా అతనికి? ఎన్నో ఆశలతో ఇంటికి వెళ్ళాడు. రేపు పొలానికి వచ్చిన తరువాత చూడాలి అతని ముఖం! తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తున్నది. పండిన మిరపకాయ లాగా ఎర్రగా పెట్టుకుంటాడేమో తన ముఖాన్ని” అన్నది మిరప మొక్క తన చిన్న చిన్న కొమ్మలని ఇటూ ఊగిస్తూ.

చివరగా బంతి మొక్క మొదలు పెట్టింది. “ఈ రైతులకి ఇదేం బుద్ధో తెలియడం లేదు. రకరకాల మందులు తెచ్చి మనమీద గుమ్మరిస్తున్నారు. వీటి మూలంగా పురుగుల్ని చీడపీడలను దగ్గరకు రాకుండా చేసే నేనే పురుగుల బారిన పడవలసి వస్తున్నది. ఎంతో ఆశతో విచ్చుకుంటానా, ఎక్కడి నుండి వస్తాయో నల్లటివీ, పచ్చటివీ పురుగులు వస్తాయి. నా రేకల సందున దూరతాయి. వాటిని తింటూ పెరుగుతాయి. నా బాధ ఈ రైతుకు ఎలా తెలుస్తుందో? మందులు తెచ్చికొట్టవద్దు బాబూ అని ఎలా చెప్పాలి?” అంటూ బంతి మొక్క తన కష్టాన్ని చెప్పుకున్నది.

మూడు రోజులున్నాక రైతు పొలానికి వచ్చాడు. చుట్టూ తిరిగి చూశాడు. పొలమంతా ఈపాటికి బలంగా తయారవుతుంది అనుకున్నాడు కానీ మొక్కలన్నీ పాలిపోయినట్లుగా బలహీనంగా కనపడ్డాయి. బెండ పిందెలయితే రెండు రోజులకే కాయలుగా మారుతాయి, ఈరోజు బెండ కాయలను కోసుకు వెళ్లాలని వచ్చాడు. అవిప్పుడు కాయలుగా పెరగలేదు, పైపెచ్చు గిడస బారిపోయినట్లుగా వున్నాయి. వంగ పిందెలు వడపడినట్లుగా ఉన్నాయి. పచ్చిమిరప పిందెలు ముడుత బారినట్లుగా ఉన్నాయి. టమాటా పిందెలు కణసబారినట్లు అయిపోయాయి. దోస తీగల్ని ఎత్తి చూశాడు. దోస పిందెలన్నీ నాలుగు రోజుల క్రితం ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో ఉన్నాయి, పైగా కుక్కమూతి పిందెలు ముడుచుకు పోయి ఉన్నాయి. ఆఖరికి బంతి పువ్వుల్లో ఏ ఒక్క పువ్వు సరిగ్గా విచ్చుకోలేదు. బంతి మొగ్గల పై భాగంలో నల్లబడ్డాయి. తెగులు వచ్చిన వాటిలాగా అయిపోయాయి.

అవన్నీ చూసిన రైతు గుండెల్లో రాయి పడింది. ‘ఇదేంటి పొలంలో మొక్కలన్నీ ఇలా ఉన్నాయేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ముక్కలన్నింటినీ ఎలా బాగు చేసుకోవాలి?’ అనుకున్నాడు. బలానికి అని పోసిన మందు ఏమైనా కల్తీ మందా, దానివలననే మొక్కలన్నీ ఇలా అయిపోయాయా ఆ విషయం ఎలా తెలుస్తుంది, ఈ ఆలోచనతోనే దిగులుగా ఇంటికి వచ్చాడు. ఏ దారీ తోచక లేదు. మరుసటి రోజు రైతు మళ్ళీ పొలానికి వచ్చాడు. మొక్కలన్నీ నిన్నటి లాగానే కనపడ్డాయి. రైతుకు దిగులు ఇంకా ఎక్కువైంది. ఏం చేయాలో తోచక  ఆకాశం వంక చూసాడు. పొలం చుట్టూ తిరిగొచ్చాడు. ఏం చేయాలో తోచకుండా ఉంది. రెండు చేతులు తలమీద పెట్టుకుని పొలం గట్టుమీద కూలబడ్డాడు.

బెండకాయలు పెరగకుండానే ముదిరిపోతాయో ఏమో, పచ్చి మిరప, టమాటా పిందెలు కూడా పండకుండానే కుళ్లిపోతాయో ఏమో, ఇంక దోసకాయలు కూడా పెరగవేమో? ఆఖరికి బంతి పువ్వులు కూడా విచ్చుకోలేదు. ఏంటి ఇలా జరిగింది? రైతు చాల భయపడిపోయాడు. ఇప్పటికే తన పొలం మీద చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. అప్పు కూడా చేశాడు. కాయలు కాయకపోతే తను అమ్ముకోవడానికి ఏమీ ఉండవు. అమ్ముకోకపోతే తనకు డబ్బు ఎలా వస్తుందనుకుంటూ గాలి తీసిన బంతిలాగా అయిపోయాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. రైతుకు అన్నం కూడా తినాలనిపించలేదు.

తమ ఊళ్లో పొలాల మంచిచెడ్డలు చెప్పి వ్యవసాయాధికారి ఉన్నాడు. రైతు సలహా కోసం ఆయన దగ్గరకు వెళ్ళాడు. తను చల్లిన ఎరువుల సంగతి. మొక్కలకు పోసిన మందుల సంగతి పేర్లతో సహా వివరంగా చెప్పాడు. ఆ అధికారి శ్రద్ధగా విన్నాడు. “అవి లేతమొక్కలు. ఇన్ని రకాలుగా ఎరువులు, మందులు వాడకూడదు. అవి తట్టుకోలేకపోయాయి. అసలు ఎరువులు అంటూ వాడకపోతేనే పొలానికి మంచిది. నేను వానపాముల ఎరువు ఇస్తాను. అది తీసుకువెళ్ళు, పొలమంతా పల్చగా చల్లు. నీటితో పొలాన్ని తడుపు. ఎరువు సారం నేలలోకి దిగుతుంది. ఆ తరువాత పశువుల పేడ, మూత్రం కలుపు. దాని నాలుగు రోజులపాటు నానబెట్టు. నీళ్లు కలిపి పల్చగా చేయి. దాన్ని పొలంలో పొయ్యి. అదంతా నేలలో ఇంకేటట్లు పొలాన్ని నీటితో తడుపు. తప్పకుండా తేడా కనబడుతుంది. భయపడకు” అంటూ ధైర్యం చెప్పి పంపాడు.

అధికారి మాటలతో రైతుకు కాస్త దిగులు తగ్గింది. ఆయనిచ్చిన వానపాముల ఎరువును తీసుకొని ఇంటికి వచ్చాడు. పశువుల చావిట్లోకి వెళ్ళాడు. వాటి దగ్గర ఉన్న పేడను ఎత్తి ఒక పెద్ద పాత్రలో వేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత పశువుల మూత్రాన్ని పట్టాడు. పట్టిన మూత్రాన్ని పేడలో పోశాడు. పేడా, మూత్రం బాగా కలిసేటట్లు కర్ర బెట్టి తిప్పాడు. ఆ పగలంతా రైతు అదే పనిలో ఉన్నాడు. తెల్లవారుతూనే రైతు పొలానికి బయలుదేరాడు. మొక్కలన్నీ పాలిపోయే ఉన్నాయి. పిందెలు పిందెలుగానే ఉన్నాయి. వాటిని చూసి రైతు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. పొలమంతా తిరిగాడు. వానపాముల ఎరువు పల్చగా చల్లాడు. అది నానడానికి కావలసిన నీటితో పొలాన్ని తడిపాడు. పక్కనున్న పొరుగు రైతు సాగు చేసే పొలాన్ని చూశాడు. ఆ పొలంలో ఉన్న మొక్కలు ఒక మాదిరి తేజస్సుగా ఉన్నాయి. ‘నా పొలమే బీదగా అయిపోయింది’ అనుకున్నాడు. ‘వానపాముల ఎరువు పని చేస్తే బాగుండును’ అని పదే పదే అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు.

నాలుగు రోజులు గడిచాయి. పశువుల పేడా మూత్రము నానింది. దాన్ని పొలం తీసుకెళ్లాడు. ఆ నానిన ఎరువును పల్చగా చేసి పొలమంతా చల్లాడు. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆ నాలుగు రోజులకే మొక్కల్లో కొంత తేడా కనిపించింది. రైతుకు కాస్త ధైర్యం వచ్చింది. పొలంలోకి దిగాడు. పెరగకుండా ఆగిపోయిన పిందెలన్నింటిని గిల్లివేశాడు. ఈసారి మొక్కలు మళ్లీ పూత పూసాయి, పిందెలు వేశాయి. ఏపుగా పెరగాయి. రైతు ఇంకా ధైర్యం వచ్చింది. చూస్తుండగానే పిందెలు కాస్త కాయలయ్యాయి. వాటన్నింటినీ కోశాడు. ఆనందంగా ఇంటికి తీసుకు వెళ్ళాడు. మార్కెట్లో అమ్మడానికి కూడా తీసుకువెళ్ళాడు. కేవలం పశువుల ఎరువులతోనే పండించిన కాయలు అనేసరికి ఎక్కువ రేటు వచ్చింది. త్వరగా అమ్ముడుపోయాయి. రైతుకి ఇప్పుడు దిగులు పోయింది.

‘అత్యాశకు పోయి ఎరువులు మందులు అంటూ వాడకూడదు. ఇకనుంచి నా పొలంలో పశువుల ఎరువు వాడుతాన’ని గట్టిగా అనుకున్నాడు. ఆ మాటే పక్క పొలం లోని రైతుకు చెప్పాడు.

అతను కూడా మాట్లాడుతూ “పశువుల ఎరువు పొలాలకు మంచిదని అంటున్నారు మందులు చల్లిన పొలంలోని కాయలు తింటుంటే మనుషులకు రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అంట. నేను ఇకనుంచి పశువుల ఎరువునే నా పొలంలోనూ తోలతాను” అని కూడా చెప్పాడు.

ఆ మాటలు విన్న మొక్కలన్నీ సంతోషపడ్డాయి. మన ప్రయత్నం ఫలించిందని సంబరపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here