మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-13

0
11

అధ్యాయం 13 – కన్సల్టింగ్ ఇంజనీర్‌గా, సలహాదారుగా నా కార్యకలాపాలు

[dropcap]ఈ[/dropcap] అధ్యాయంలో వివరించిన దాదాపు అన్ని పనులు నేను ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ తర్వాత కన్సల్టింగ్ ఇంజనీర్ లేదా సలహాదారుగా నా కార్యకలాపాలను వివరిస్తాయి. ఈ తరహా పనులన్నీటిని కూడా ఆయా ప్రభుతాల ఆహ్వానం మేరకు చేపట్టినవే. ఈ పనులను నాలుగు కేటగిరీల్లో విభజించవచ్చు.

  1. బొంబాయి, కరాచీ నగరాల పరిపాలన, ఆర్థిక, పౌర, సాధారణ అభివృద్ది పథకాలు తదితర అంశాలలో మున్సిపల్ కార్పొరేషన్లకు సలహాదారుగా;
  2. పెద్ద సంఖ్యలో నగరాలు మరియు పట్టణాలకు నీటి సరఫరా పథకాలు, ప్రతిపాదనలు;
  3. కొన్ని నగరాలు, పట్టణాలకు మురుగు నీటి పారుదల పథకాల రూపకల్పన;
  4. మరి కొన్ని ప్రత్యేక బాధ్యతలు;

ఈ నాలుగు విభాగాలలో ప్రతిదాని క్రింద వాస్తవంగా చేసిన పనికి సంబందించిన విషయాలను ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను.

బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్:

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వెంటనే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న కాలంలో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ నగరాభివృద్ధి, విస్తరణకు సంబందించి పెద్ద పథకాలను ప్రారంభించింది. వాటి అమలు కోసం ఉదార స్థాయిలో సిబ్బందిని, నిధులను మంజూరు చేసింది. కానీ దాదాపు 1922-23 ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య మాంద్యం ఏర్పడినప్పుడు వ్యయాన్ని తగ్గించుకోవడం అవసరమని గుర్తించి సిబ్బంది తొలగింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సిబ్బంది తొలగింపు విషయంలో ఆచరణాత్మక పద్దతిని రూపొందించడానికి ఈ కమిటీ సిఫారసు మేరకు సహాయం చేయమని కార్పొరేషన్ నన్ను ఆహ్వానించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ విభాగాలలో అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి, పరిపాలనలో సంస్కరణల కోసం ప్రతిపాదనలను పొందుపరుస్తూ ప్రాథమిక నివేదికను నేను అందించాలని వారి అభ్యర్థన.

నేను తొలుత ఆరు వారాల పాటు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను. ఆ వ్యవధి ముగింపులో వారు అడిగిన అంశంపై ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసి వారికి సమర్పించాను. ఈ నివేదికలో సిబ్బంది తొలగింపుకు అవకాశం ఉన్న విభాగాల్లో 12 నుంచి 15 లక్షలు ఖర్చు తగ్గింపు కోసం సిఫార్సులు చేశాను. 17 జూలై 1924 న కార్పొరేషన్ ఈ నివేదికను యధాతథంగా ఆమోదించింది. నివేదికలో చేసిన సిఫారసుల మేరకు సిబ్బంది తగ్గింపు కార్యక్రమంతో పాటు పాలనా సంస్కరణలను స్వీకరించడానికి కార్పొరేషన్ సిద్ధపడింది.

నా తుది నివేదికను 31 జనవరి 1925 న సమర్పించాను. ఆనాటి వరకు ప్రాథమిక నివేదికలో చేసిన సిబ్బంది తొలగింపు ప్రతిపాదనలను అమలు చేయడం ద్వారా రూ. 11.23 లక్షలు వరకు వాస్తవంగా ఆదా చేయడం జరిగింది. తుది నివేదిక రెండు భాగాలుగా తయారు చేసినాము. మొదటి భాగంలో బొంబాయి నగరం ఆర్థిక అవసరాలు, నగరంలో పౌర సదుపాయాలు, జరుగుతున్న ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు అయిన ప్రభుత్వ సంస్థలపై సమీక్ష చేశాము. గ్రేటర్ బొంబాయి, సబర్బన్ ప్రాంతాల విస్తరణ సంబందించిన సమస్యలపై చర్చించాము. నివేదిక రెండవ భాగంలో సిబ్బంది తొలగింపు ప్రక్రియ పురోగతిని సమీక్షించాము. సిబ్బంది కుదింపుకు మరింత అవకాశం ఉందని.. ఇంజనీరింగ్ విభాగాలలో కొన్ని నిర్దిష్టమైన సంస్కరణలు, శాఖల పునర్వ్యవస్థీకరణ జరపాలని సూచనలు చేశాము.

పరిపాలనలో రెండు ముఖ్యమైన సంస్కరణలు సూచించినాము. అవి:

  1. నిర్దిష్టమైన విధుల కేటాయింపులతో విభాగాధిపతుల కార్యాలయాల వికేంద్రీకరణ
  2. శాఖాధిపతులతో కలిసి శాఖల పరిపాలనా విభాగాలను నియంత్రించడానికి ఇంగ్లీష్ తరహాలో కార్యనిర్వాహక కమిటీని నియమించడం.

పశ్చిమ దేశాలలోని ప్రధాన నగరాల్లో, ప్రత్యేకించి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ రీసర్చ్ బ్యూరో ఏర్పాటుకు మేము సిఫారసు చేశాము. పౌర సేవల సామర్థ్యం పెంచడం, ఆదాయం పెంపు మార్గాలు అన్వేషించడం, ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు, పన్ను రేట్ల తగ్గింపు కోసం పని చేయడం మొదలైనవి బ్యూరో ఏర్పాటు సాధారణ లక్ష్యంగా సూచించినాము. నగర అవసరాలలో యువకులకు సాంకేతిక, వాణిజ్య విద్యను అందించడం ద్వారా సంపదను ఉత్పత్తి చేసే కార్యకలాపాలను ప్రోత్సహించడం, కొత్త తయారీ కేంద్రాల స్థాపనను ప్రోత్సహించడానికి పన్నుల నుండి ఉదారంగా మినహాయింపు ఇవ్వాలని, అనేక ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నాము. గృహనిర్మాణ కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని కూడా నివేదికలో నొక్కి చెప్పాము. మునిసిపల్ పరిధిలోని పరిశ్రమలకు బొంబాయి కార్పొరేషన్ ఎటువంటి ప్రశంసనీయమైన సహాయాన్ని అందించడం లేదని చెపుతూ, బొంబాయి శివారు ప్రాంతాల్లో కొత్త పారిశ్రామికవాడల ఆవశ్యకతపై నివేదిక ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్చించింది. నీరు, గ్యాస్, విద్యుత్ మొదలైన ప్రజా వినియోగాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, నీటి వినియోగం మినహా, ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఇవి కూడా మున్సిపల్ కార్పొరేషన్ కఠినమైన నియంత్రణలోకి తీసుకు వచ్చే వ్యవస్థను నెలకొల్పాలని కోరాము.

నగరం శ్రేయస్సు కోసం పనిచేస్తున్న అన్ని ఏజెన్సీల మధ్య ఉమ్మడి ఆదర్శాలు, ఉమ్మడి లక్ష్య శుద్ది మొదలైనవి నగరం ఆరోగ్యకరమైన అభివృద్ధికి మొదటి అవసరం అని పేర్కొన్నాము. ప్రతిపాదించిన పథకాల ప్రయోజనాలు, ప్రయోజనకరమైన సేవల గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేసినట్లయితే, ప్రజల మద్దతుతో అభివృద్ధి ఉద్యమం గొప్ప ఉద్దీపనను పొందుతుంది. అందువల్ల, శివారు ప్రాంతాల స్థానిక అధికారులు సహా వివిధ శాఖలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే కేంద్ర బోర్డ్ లేదా కమిషన్‌ను ఉనికిలోకి తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాము. గ్రేట్ బ్రిటన్‌లో విస్తృతమైన ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే మునిసిపల్ పథకాలను రూపొందిస్తారు. ఇతర దేశాల్లో కూడా ప్రజల పరిశీలన, సూచనల ఆధారంగా తయారు చేసిన నగర అభివృద్ది ప్రణాళికలు ద్వారా ప్రజలు చాలా ప్రయోజనం పొందారు. ఈ అనుభవాలను కూడా నివేదికలో పేర్కొన్నాము. బొంబాయి కోసం కేంద్ర బోర్డ్ ప్రతిపాదించినట్లయితే త్రైమాసికానికి ఒకసారి ఒక వారం పాటు సమావేశాలు నిర్వహించి అభివృద్ధి కోసం వివిధ పథకాలపై నగర ప్రముఖుల, నిపుణుల అభిప్రాయాలను వినడమే సరి పోదు. ఇది చాలా విలువైన సేవలను నగర ప్రజానీకానికి అందించాల్సి ఉన్నది.

మైసూరు దీవాన్‍గా మోక్షగుండం విశ్వేశ్వరాయ

కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక స్థితిగతులు & పరిపాలన:

జూలై 26, 1924 నాటి లేఖలో, కరాచీ మునిసిపాలిటీ ఛైర్మన్ గారు కరాచీ మునిసిపాలిటీ ఆర్థిక స్థితి, సిబ్బంది తగ్గింపు, పాలనా సంస్కరణలపై అధ్యయనం చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నన్ను ఆహ్వానించారు. ఆ తరువాత మరొక లేఖలో “వివిధ విభాగాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ గురించి సలహా ఇవ్వమని” కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నన్ను అడిగారు. నేను ఆరు వారాల పాటు ఈ పనిలో నిమగ్నమై ఉండి, ‘కరాచీ మున్సిపల్ ఆర్థిక స్థితిగతులు & పరిపాలన, సర్వే & సిఫారసులు’ పేరుతో ఒక నివేదికను సమర్పించాను. ఈ నివేదిక అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా వంటి దేశాలలో సాధారణంగా చేపట్టే నగర సర్వే తరహాలోనే తయారు చేశాను. ఇది ‘నగరం ప్రధాన అవసరాల గురించి విహంగ వీక్షణం’ ప్రదర్శించడానికి ప్రయత్నించింది. నగరాభివృద్దికి ఉత్తమ పద్ధతులపై సూచనలు మరియు సిఫార్సులను కూడా పొందుపరచాను. నివేదికలో కార్పొరేషన్ ఆర్థిక స్థితిగతులు, మునిసిపల్ విభాగాలు, సిబ్బంది పని తీరుపై సమీక్ష, భవిష్యత్తు ప్రణాళికలు, విధానాలకు సంబంధించిన అంచనాలు ఉన్నాయి. ప్రతిపాదిత సిబ్బంది తగ్గింపు చర్యల తక్షణ ప్రభావం రూ. 3.65 లక్షలు లేదా దాదాపు 9 శాతం ఆదా. మున్సిపల్ శాఖలకు సంబంధించి, ప్రజా పనుల కమిటీ, స్టోర్స్ & కాంట్రాక్ట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసాను. ఇతర భారతీయ నగరాలతో పోలిస్తే కరాచీ మునిసిపల్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని సూచించాను. కార్పొరేషన్ పై వచ్చిన విమర్శలకు సంబంధించి.. యుద్ధం అనంతరం బ్రిటీష్ ఆర్థిక పరిస్థితుల గురించి ఒక అమెరికన్ చెప్పిన దానిని నివేదిక ఉటంకించాను: “ఆదాయాలు, ఎంత తీరికగా జరిగినా, కుక్కల పాలౌతున్నాయని వారు అంటున్నారు. అయినప్పటికీ అవి అక్కడికి కూడా చేరుకోవడం లేదు”.

ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన కరాచీ నగరానికి ప్రముఖ పౌరులు ఏమి చేయాలన్న విషయాన్ని కూడా నివేదికలో చర్చించాను. “ప్రస్తుత పరిస్థితిని కరాచీ ప్రజలు ధైర్యంగా, తెలివిగా నిర్వహించగలిగితే, అందుబాటులో ఉన్న వనరులను, అవకాశాలు సముచితంగా వినియోగించుకోగలిగితే త్వరలోనే నగరాన్ని ఆహ్లాదకరమైన కేంద్రంగా మారవచ్చు. కరాచీ ఓడరేవు పరిశ్రమల ఏర్పాటుకు ఒక గొప్ప ప్రవేశద్వారంగా అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.”

నగరాన్ని, కరాచీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్న అనేక ఏజెన్సీల మధ్య ప్రణాళిక రచన, అమలు కోసం తీసుకుంటున్నచర్యల మధ్య సమన్వయం చేయడం కోసం మున్సిపాలిటీకి బలమైన ప్రాతినిధ్యంతో కూడిన ‘కేంద్ర సలహా మండలి’ని ప్రభుత్వం నియమించాలని కూడా నివేదికలో సిఫార్సు చేసాను.

కరాచీ మునిసిపల్ పరిపాలన భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే సమర్థతలో మెరుగ్గా ఉందని నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసాను. కరాచీకి చెందిన ఒక ఔత్సాహిక పౌరుడు నాతో ఇలా అన్నాడు.

నేను యూరప్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడల్లా నిరాశకు గురవుతాను. ఇంగ్లండ్, యూరప్ దేశాలలో వారు మనకంటే చాలా మైళ్ళ దూరం ప్రయాణించారు. ఇక్కడ మా పురోగతిని మాత్రం అంగుళాలలోనే కొలవవచ్చు. కరాచీ మునిసిపాలిటీ దేశం వెలుపల ఉన్న మరింత ప్రగతిశీల, చైతన్యవంతమైన నగరాల నుండి పాఠాలు నేర్చుకుని, మంచి పనులు చేయడానికి ప్రయత్నించవచ్చు. అంటే, ఏ ముఖ్యమైన అవసరం విస్మరించకుండా నగరం అన్ని అవసరాల గుర్తించడానికి, లోపాలను సవరించడానికి నిరంతర జాగరూకతలో ఉండడానికి ప్రయత్నించాలి.

మైసూరు రాజావారితో మోక్షగుండం విశ్వేశ్వరాయ

నగరాల, పట్టణాల తాగునీటి పథకాలు:

ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రధానంగా నీటి సరఫరా కోసం ఆచరణాత్మక పథకాలను సూచించడానికి పెద్ద సంఖ్యలో పట్టణాల నుండి నాకు అభ్యర్థనలు వచ్చాయి. ఈ విషయంలో నగరాలు, పట్టణాలకు నా సహాయం చాలా విభిన్నమైన పాత్ర, పరిధిని కలిగి ఉంది. వీటిని మూడు విభాగాల క్రింద వర్గీకరించవచ్చు.

  1. పూర్తి స్వతంత్ర పథకాలను రూపకల్పన చేయడం;
  2. ఇప్పటికే నిర్మాణం అయి ఉన్న నీటి సరఫరా పథకాలకు మార్పుల చేర్పుల ద్వారా లోపాలను సరిచేయడానికి సూచనలు చేయడం;
  3. నిర్దిష్ట లోపాలు లేదా అవసరమైన మార్పులపై సలహాలు సూచనలు చేయడం.

తాగునీటి సరఫరా పథకాలకు సంబంధించి.. కొన్ని నేను ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు రూపకల్పన చేసినవి అయితే మరికొన్ని కన్సల్టింగ్ ఇంజనీర్, సలహాదారు హోదాలో ఉన్నప్పుడు రూపకల్పన చేసినవని చెప్పవచ్చు. కన్సల్టింగ్ ఇంజనీర్, సలహాదారు హోదాలో చేసిన పనులు మరింత ముఖ్యమైనవి. పదవీ విరమణ తర్వాత చేపట్టిన ఈ అభివృద్ధి పనుల్లో ప్రతి ఒకటి సంబంధిత ప్రభుత్వాలు లేదా మునిసిపల్ సంస్థల ప్రత్యేక అభ్యర్థన మేరకు చేసినవే.

ఆ దిశలో ఖాందేష్ లోని ధులియాకు నీటి సరఫరా పథకాన్ని అందించడం నా తొలి ప్రయత్నం అని నేను ఇంతకు ముందు అధ్యాయాలలో చెప్పాను. నీటిని నిల్వ చేయడం కోసం ఒక జలాశయం నిర్మాణం కూడా ఈ పథకంలో ఉంది. దాదాపు 1886 ప్రాంతంలో సింధ్ రాష్ట్రంలో సుక్కూర్ పట్టణానికి నీటి సరఫరా పథకంపై నేను దృష్టి సారించవలసి వచ్చింది.

ఆ తర్వాత 1896లో కొద్దికాలం పాటు సూరత్ వాటర్ వర్క్స్ నిర్మాణం ప్రారంభ కాలంలో విధులు నిర్వహించాను.

1898 నుండి 1904 వరకు నేను పూనా, కిర్కీ కంటోన్మెంట్లకు నీటి సరఫరా పనులకు ఇన్ఛార్జ్‌గా ఉన్నాను. ఒక కాలువ నుండి పూనా నగరానికి ఎక్కువ మొత్తంలో నీటి సరఫరా కూడా నా బాధ్యతల్లో ఉంది. పూనా నగరానికి నీటి సరఫరా కోసం ఉద్దేశించిన జలాశయానికి ఆటోమేటిక్ గేట్లను అమర్చడం ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. 1907 సంవత్సరంలో నాసిక్ నగరానికి మొదటి నీటి సరఫరా పథకానికి ప్రాథమిక నివేదిక తయారు చేసినది నేనే. ఆ తర్వాత వాస్తవానికి నాసిక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులు పూర్తి చేసినాడు.

ధార్వార్ పట్టణానికి టాగు నీటి సరఫరా కోసం ప్రాథమిక నివేదిక తయారు చేసి ఇచ్చాను. ధార్వార్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆద్వర్యంలో పనులు పూర్తి అయినాయి. బీజాపూర్ నీటి సరఫరా పథకం విషయంలో కూడా నిల్వ జలాశయం నిర్మాణంతో సహా ఇలాంటి సలహా, సూచనలు అందించాను.

పురపాలక సంఘం అభ్యర్థన మేరకు బెల్గాం నగరానికి తాగునీటి సరఫరా పథకం తయారుచేసి ఇచ్చాను.

కొల్హాపూర్ పట్టణానికి తాగునీటి సరఫరా పథకానికి నేను చేసిన సహాయం గురించి నేను ఇదివరకే ప్రస్తావించాను.

షోలాపూర్ జిల్లాలో అక్కల్‌కోట్ పట్టణానికి నీటి సరఫరా పథకానికి ప్రాథమిక నివేదిక అందించాను.

ఏడెన్ సైనిక ప్రాంతానికి నీటి సరఫరా కోసం జరిగిన పనుల గురించి కూడా గత అధ్యాయాల్లో ప్రస్తావించాను.

ఇండోర్ నగరానికి తాగునీటి సరఫరా పథకం పనులు జరుగుతున్న సమయంలో ఇండోర్ రాష్ట్ర ప్రభుత్వం వారి అభ్యర్థన మేరకు సలహా ఇచ్చే అవకాశం నాకు వచ్చింది.

గ్వాలియర్ నగరాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నేను రెండు లేదా మూడు సార్లు సందర్శించాను. రాష్ట్ర నీటిపారుదల పథకాలపై, కొట్టుకుపోయిన టిగ్రా డ్యామ్ (గ్వాలియర్ నగరానికి నీటి సరఫరా కోసం నిల్వ చేసే జలాశయం) పునర్నిర్మాణంపై సలహా ఇవ్వాలని వారు కోరినారు.

హైదరాబాద్ (సింధ్) మునిసిపాలిటీ అభ్యర్థన మేరకు సింధు నది నీటి శుద్ధీకరణ కోసం నిర్మించిన చెరువుల కోసం నేను డిజైన్‌ను అందించాను.

రెండు మూడు సందర్భాలలో బొంబాయికి నీటి సరఫరాకు సంబంధించిన పనులపై సలహా ఇవ్వడానికి నన్ను మునిసిపల్ కార్పొరేషన్ వారు ఆహ్వానించారు. ఇటువంటి ఒక సందర్భంలో ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్ నాతో కలిసి పని చేశాడు.

మరొక స్వతంత్ర పథకం.. పొరుగున ఉన్న నది నుండి నాగ్‌పూర్ నగరం కోసం నీటి సరఫరా పథకం తయారు చేశాను. నేను మూడు వారాలు నాగ్‌పూర్‌లో ఉండి పథకం ప్రాథమిక నివేదిక రూపొందించాను. నేను సిఫారసు చేసిన సభ్యుల కమిటీ పర్యవేక్షణలో ఆ పథకం విజయవంతంగా పథకం అమలయ్యింది.

గోవా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నేను ఓడరేవును సందర్శించాను. గోవా, దాని నీటి సరఫరా కోసం ఒక పథకం ప్రాథమిక నివేదిక తయారు చేసి ఇచ్చాను.

రాజ్ కోట్ (కతియావార్) మునిసిపాలిటీ వారి అభ్యర్థన మేరకు దాని నీటి సరఫరా కోసం ఉద్దేశించిన నిల్వ జలాశయం మట్టికట్ట తెగిపోయింది. దీన్ని పునర్నిర్మించడానికి ప్రతిపాదనలు అందించాను.

కతియావార్‌లో భావనగర్ పట్టణం నీటి సరఫరా కోసం నిల్వ ఏర్పాట్లు నా పర్యవేక్షణలో విస్తరించి పునర్నిర్మించారు. పైన పేర్కొన్న వాటితో పాటు, నేను బొంబాయి ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్‌గా పనిచేసినప్పుడు, తరువాత సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన అనంతరం బరోడా, సాంగ్లీ, వంకనేర్, మోర్వి, పంఢర్ పూర్, అహ్మద్ నగర్ వంటి అనేక ఇతర నగరాలు, పట్టణాల నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలపై సలహాలు ఇచ్చే సందర్భాలు నాకు లభించాయి.

బెంగుళూరు కోసం కొత్త నీటి సరఫరా పథకాన్ని రూపొందించిన కమిటీకి నేను చైర్మన్‌గా ఉన్నానని మునుపటి అధ్యాయంలో చెప్పాను.

కుటుంబ సభ్యులతో మోక్షగుండం విశ్వేశ్వరాయ

ఆధునిక మురుగునీటి పారుదల పథకాలు:

1908 సంవత్సరంలో మొదటిసారి పూనా నగరం కోసం ఆధునిక పంపింగ్ పైపు మురుగునీటి పథకం నేను రూపొందించాను. అయితే దీని నిర్మాణ బాధ్యతలను ఒక యూరోపియన్ ఇంజనీర్‌కు అప్పగించారు.

హైదరాబాద్ సిటీ (దక్కన్) కోసం మురుగు నీటి పారుదల పథకం రూపకల్పన, నిర్మాణం నా పర్యవేక్షణలో జరిగిన సంగతి ఇంతకు ముందు అధ్యాయంలో వివరించాను.

ధూలియా పట్టణంలో మురుగు నీటి పారుదల పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు సుమారు 1890 సంవత్సరంలో సమర్పించాను.

సుక్కూరుకు సరఫరా చేసిన నీటి పారుదల పథకాన్ని గత అధ్యాయాల్లో ప్రస్తావించినట్టుగానే ఏడెన్ సైనిక స్థావరానికి తయారుచేసిన మురుగు నీటి కూడా పథకం గురించి కూడా ప్రస్తావించాను.

ఇండోర్ కోసం డ్రైనేజీ పథకాన్ని నా పర్యవేక్షణలో సమర్థుడైన ఇంజనీర్ ద్వారా కొంతకాలం నిర్వహించారు.

గతంలో చెప్పినట్లుగా, నేను మైసూర్ రాష్ట్రం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న సమయంలో మైసూర్ నగరానికి మురుగు నీటి పారుదల పథకం సిద్ధం చేశాను. అది తరువాత అమలు అయ్యింది.

నా యూరప్ పర్యటనానుభవాలు చెబితే అవి పాఠకులకు ఆసక్తిని కలిగిస్తాయని భావిస్తున్నాను. యూరప్‌లో 1908లో నేను సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థలను కలిగి ఉన్న అర డజను నగరాలను సందర్శించాను. మిలన్, డ్యూసెల్డార్ఫ్, లండన్, ప్యారిస్ లలో లోతైన భూగర్భ మురుగు కాలువల రూపకల్పన, నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి కాలువల్లో నడచి చూశాను. అవగాహన చేసుకున్నాను. వాటిలో కొన్ని భూగర్భంలో 80 అడుగుల లోతులో ఉన్నాయి. అటువంటి సందర్శనలు, తనిఖీల సమయంలో మురుగు కాలువల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను, స్వచ్ఛమైన గాలి సరఫరాకు ఏర్పాట్లు చేశారు.

ఇతర ప్రత్యేక కార్యక్రమాలు:

ఇతర పథకాలలో వరద రక్షణ పథకాలపై నివేదికల తయారీని పేర్కొనవచ్చు. మహాత్మా గాంధీ గారి ఆహ్వానం మేరకు ఒరిస్సాలో వరద రక్షణ చర్యల కోసం ఒక నివేదికను తయారు చేశాను. ఆనాడు కాంగ్రెస్ నాయకుడు శ్రీ నిత్యానంద కనుంగో ఒరిస్సా ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖా మంత్రిగా పదవిలో ఉన్నారు. నేను మొదట ప్రావిన్స్‌ని సందర్శించి వరదలు సంభవించిన ప్రాంతాలను పరిశీలించాను. ఏప్రిల్ 1939లో ఒక నివేదికను సమర్పించాను. వరద రక్షణ చర్యలకు సంబందించి పూర్తి వివరాలతో పథకాన్ని తయారుచేయడానికి మైసూర్‌కు చెందిన ఇంజనీర్, బొంబాయి నుండి యూరోపియన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇతర స్థానిక అధికారులతో కూడిన కమిటీని నియమించాలని కూడా నేను నివేదికలో సూచించాను. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఒరిస్సా ప్రభుత్వం పెద్దగా చర్యలు ఏమీ చేపట్టలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న విద్యుత్, సాగునీరు, నౌకాయానం కమిషన్ వారు అప్పటికే మహానది ఎగువ ప్రాంతాలలో ఒక పెద్ద జలాశయానికి రూపకల్పన చేసి నిర్మాణాన్ని ప్రారంభించింది. దాన్నే హీరాకుడ్ డ్యామ్ అని పిలుస్తారు.

1947లో మద్రాస్, హైదరాబాద్ (దక్కన్) ప్రజా పనుల శాఖల ఉమ్మడి అభ్యర్థన మేరకు నేను తుంగభద్ర డ్యామ్ పనులను సందర్శించి రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న ఇంజినీరింగ్ ప్రాముఖ్యత ఉన్న ఒక సమస్య పరిష్కారానికి సలహా ఇచ్చాను. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఇరు పక్షాలు అంగీకరించి ఒక నిర్ణయం తీసుకున్నారు.

భోపాల్ నవాబు అభ్యర్థన మేరకు నేను భోపాల్ నగరానికి విద్యుత్, నీటి సరఫరాకు సంబందించిన సమస్యలను పరిశీలించాను. సముచితమైన ప్రతిపాదనలు సమర్పించాను.

1949లో సౌరాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నేను ఆ రాష్ట్రాన్ని సందర్శించాను. ఆ రాష్ట్రంలో నీటి నిల్వ కోసం జలాశయాలను ఏర్పాటు చేయడానికి డ్యాంల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలపై ప్రభుత్వం నా సలహాలు సూచనలు కోరింది.

హైదరాబాద్ (డెక్కన్) వంటి నగరాలు అనేక పట్టణాల కోసం పట్టణ ప్రణాళిక పథకాలపై కూడా నేను సలహా ఇచ్చాను. హైదరాబాద్ పట్టణ ప్రణాళికపై గత అధ్యాయాల్లో వివవరంగా ప్రస్తావించి ఉన్నాను. ఇండోర్ పట్టణ ప్రణాళికపై కూడా సలహాలు ఇచ్చాను. బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హామ్ బొంబాయి నగరం అంధేరిలో కొత్త మార్కెట్‌ను ప్రారంభించిన సందర్భంలో ఆయన చేసిన ప్రసంగంలో బొంబాయి నగరం కోసం నేను గతంలో తయారు చేసిన ఒక ప్రతిపాదన గురించి ఈ విధంగా ప్రస్తావించారు.

లార్డ్ సిడెన్హామ్

“ఇప్పుడు నేను సల్సెట్ సాధారణ అభివృద్ధి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దీనిలో నాకు చాలా ఆసక్తి ఉంది. ఈ విషయంలో కొద్ది కాలం క్రితం శ్రీ విశ్వేశ్వరాయ గారు తయారు చేసిన నివేదికను చదివాను. తర్వాత ఆ సమర్థుడైన ఇంజనీర్‌తో సంభాషించాను. వారి ద్వారా ఈ సమస్యపై నాకు సంపూర్ణ అవగాహన కలిగింది.” – (టైమ్స్ ఆఫ్ ఇండియా, 11 జనవరి 1912)

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here