మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-14

0
14

అధ్యాయం 14 – ప్రభుత్వంలో, ప్రభుత్వ కమిటీల్లో నా భాగస్వామ్యం

[dropcap]ప్ర[/dropcap]భుత్వోద్యోగంలో ఉన్నప్పుడు నేను సాధారణ విధి నిర్వహణలో భాగంగా అనేక కమిటీలలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ అధ్యాయంలో నేను ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సభ్యుడిగా లేదా చైర్మన్‌గా పని చేసిన కొన్ని ప్రధాన కమిటీల కార్యకలాపాలను మాత్రమే ప్రస్తావించాలని భావిస్తున్నాను.

బొంబాయి సాంకేతిక, పారిశ్రామిక విద్యా కమిటీ, 1921- 22:

నేను ప్రభుత్వ సేవలను విడిచిపెట్టిన తర్వాత నేను ఛైర్మన్‌గా పని చేసిన తొలి కమిటీలలో ఒకటి బొంబాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక, పారిశ్రామిక విద్యా కమిటీ (1921-22). మోంట్‌ఫోర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టిన వెంటనే 1920లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఆ సమయంలో నేను ఛైర్మన్‌గా ఈ అంశంపై పని చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలో 10 మంది యూరోపియన్లు, 7 మంది భారతీయులు సభ్యులుగా ఉన్నారు. బొంబాయి ప్రెసిడెన్సీలో సాంకేతిక, పారిశ్రామిక విద్య వ్యాప్తికి సంబంధించి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఒక సమగ్ర పథకాన్ని రూపొందించడం కమిటీ లక్ష్యం. కమిటీ రూపొందించే నివేదికలో ఈ కింది అంశాలను సంక్షిప్తంగా క్రోడీకరించవలసి ఉంటుంది. “వ్యాపారంలో ప్రముఖ కార్యనిర్వాహక స్థానాలను భర్తీ చేయడానికి నిర్వాహకులు, నిపుణులకు అవసరమైన సాంకేతిక విద్యను అందించడం, శిక్షణ పొందిన సాంకేతిక సహాయకులు, సూపరింటెండెంట్లు, ఫోర్మెన్‌లు మొదలైన ఉద్యోగులను సరఫరా చేయడం, ప్రెసిడెన్సీలో వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక వృత్తులలో పని చేయడానికి కింది స్థాయి స్థానాలకు, కార్మికులకు ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదనలు సమర్పించడం”

మొదటి దశలో సభ్యులు సామరస్యపూర్వకంగా పనిచేశారు. తొలి పరిశీలన, అధ్యయనం అనంతరం మేము ఆచరణాత్మకంగా ఏకగ్రీవంగా ఒక ప్రాథమిక నివేదికను రూపొందించాము. ఈ పని దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. అయితే మా పని కొనసాగుతుండగా, అప్పటి బొంబాయి గవర్నర్ లార్డ్ లాయిడ్, అప్రెంటిస్‌ల శిక్షణ కోసం ప్రతిపాదనలను తయారు చేయడానికి మాత్రమే పరిమితం కావాలని నేను అతన్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు నాకు సూచించారు. ఈ సూచనతో నేను విభేదించాను.

బొంబాయి గవర్నర్ లార్డ్ జార్జ్ లాయిడ్

అయినప్పటికీ, నాతో సహా కమిటీలో అల్ప సంఖ్యలో ఉన్న భారతీయ సభ్యులందరూ బొంబాయి ప్రెసిడెన్సీలో సాంకేతిక, పారిశ్రామిక విద్యా వ్యాప్తి కోసం అన్ని అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి ఒక సాంకేతిక సంస్థను స్థాపించాలని, అనేక ఇతర సాంకేతిక విద్యా అవసరాలను తీర్చడం కోసం కార్యాచరణ రూపొందించాలని సిఫార్సు చేసాము. చివరికి యూరప్ సభ్యులందరూ విస్తృత ప్రయోజనాలు, శాశ్వత పరిధిని కలిగి ఉన్న అన్ని ప్రతిపాదనలను గట్టిగా వ్యతిరేకించారు. ఆ కారణంగా నివేదిక రెండు విభాగాలుగా తయారయ్యింది. ఒకటి పది మంది సభ్యులతో కూడిన యూరోపియన్ విభాగం, మరొకటి ఏడుగురు సభ్యులతో కూడిన భారతీయ విభాగం. సభ్యులందరూ ఆమోదిస్తారనే ఆశతో నా పర్యవేక్షణలో నివేదికను రూపొందించాను. కానీ ఒక కమిటీలోని యూరోపియన్ సభ్యులు తమ స్వంత అభిప్రాయాలకు అనుగుణంగా నివేదికను మార్చారు. భారతీయ సభ్యులు నా ముసాయిదాను పూర్తిగా ఆమోదించారు కానీ మేము అల్ప సంఖ్యలో ఉన్నాము.

కొత్తగా ఏర్పాటైన బొంబాయి రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు కమిటీని నియమించినప్పటికీ, గవర్నర్ లార్డ్ లాయిడ్ నాతో వ్యక్తిగతంగా చెప్పిన దాని ప్రకారం, బొంబాయి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నత సాంకేతిక విద్యను అభివృద్ధి చేసే ఉద్దేశం లేదని స్పష్టమైంది. చివరికి ప్రయోజనం లేని పని కోసం నేను దాదాపు ఒక సంవత్సరం విలువైన కాలాన్ని వృథా చేశానన్న భావన మిగిలింది.

రసాయన పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం కోసం బొంబాయి విశ్వ విద్యాలయ కమిటీ:

బొంబాయి రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు చేసిన కమిటీ విస్తృతంగా శ్రమించి నివేదిక రూపొందించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. బొంబాయి విశ్వవిద్యాలయం వారిని కూడా ఈ వైఫల్యం నిరుత్సాహ పరచినట్టు అనిపించింది. అయితే తమ స్వంత వనరుల నుండి సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఏదైనా చేయగలమా అని వారు అన్వేషించాలని అనుకున్నారు.

సాంకేతిక, పారిశ్రామిక విద్యా కమిటీ బొంబాయి విశ్వవిద్యాలయం టెక్నాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, బొంబాయి నగరంలో కాలేజ్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. విశ్వవిద్యాలయం ఈ ప్రతిపాదనపై చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే విశ్వవిద్యాలయం ఒక నిర్ణయానికి రాకముందే బొంబాయి ప్రభుత్వం విశ్వవిద్యాలయ సంస్కరణలపై ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా సాంకేతిక, పారిశ్రామిక విద్యా కమిటీ చేసిన సిఫార్సులతో ఏకీభవించింది. మార్చి 1930లో బొంబాయి విశ్వవిద్యాలయంలోని అకడమిక్ కౌన్సిల్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నది. విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీ విభాగం ఏర్పాటు కోసం వివరణాత్మక పథకాన్ని రూపొందించడానికి నేను ఛైర్మన్‌గా ఒక కమిటీని నియమించాలని శ్రీ కె ఎం మున్షీ చేసిన ప్రతిపాదనను అకడమిక్ కౌన్సిల్ ఆమోదించింది.

డా కె ఎం మున్షీ

దీని ప్రకారం, రసాయన పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను పరిశోధించడానికి మార్చి 1930లో ఏడుగురు భారతీయ, ముగ్గురు యూరోపియన్ సభ్యులతో కూడిన ఒక కమిటీని విశ్వవిద్యాలయం నియమించింది. ప్రెసిడెన్సీలో నిపుణులైన రసాయన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలను కమిటీకి ఎంపిక చేసిన ఘనత బొంబాయి విశ్వవిద్యాలయానికి దక్కుతుందని చెప్పాలి. ఇందులో యురోపియన్‌లు, భారతీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి కూడా విశ్వవిద్యాలయం నన్ను చైర్మన్‌గా వ్యవహరించమని ఆహ్వానించింది. ఈ పని దాదాపు ఆరు నెలల పాటు కొనసాగింది. కమిటీ ఏకగ్రీవ నివేదికను రూపొందించి విశ్వవిద్యాలయానికి సమర్పించింది. నివేదికను విశ్వవిద్యాలయం యథాతథంగా ఆమోదించింది. ఈ నివేదికను అమలు చేసే ప్రక్రియలో భాగంగా విశ్వవిద్యాలయం కెమికల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ రూపంలో వారి స్వంత సంస్థను స్థాపించింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ

దానిని తాత్కాలికంగా ఫోర్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత బొంబాయిలోని మాతుంగా ప్రాంతంలోకి శాశ్వతంగా మార్చింది. ఇది విశ్వవిద్యాలయం వారి దేశభక్తికి గొప్ప ప్రతీకగా నిలచింది. ప్రైవేట్ దాతల నుండి కూడా సంస్థకు ఇతోధిక ధన సహాయం అందింది. సంస్థ ప్రస్తుతం బాగానే నడుస్తున్నది. అభివృద్ధి దిశలో పురోగమిస్తున్న స్థితిలో ఉందని చెప్పవచ్చు.

సాగునీటి విచారణ కమిటీ, బొంబాయి, 1938:

నీటిపారుదల విధానం, అనుబంధ విషయాలకు సంబంధించిన మొత్తం సమస్యలను పరిశీలించి, అవసరమైన సిఫార్సులు, ప్రతిపాదనలను సమర్పించడానికి ఈ సాగునీటి విచారణ కమిటీని బొంబాయి ప్రభుత్వం డిసెంబర్ 1937 చివరలో ఏర్పాటు చేసింది. సెంట్రల్ డివిజన్ కమీషనర్, అగ్రికల్చర్ డైరెక్టర్, నీటిపారుదల సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లు వంటి ప్రభుత్వ ఉన్నత అధికారులతో సహా 10 మంది అధికారిక, అనధికారిక సభ్యులతో కమిటీని బొంబాయి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూరోపియన్ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. వివిధ రకాల పంటలకు నీటి సరఫరా, చక్కెర కర్మాగారాలు, మిల్లులు వంటి పారిశ్రామిక సంస్థలు, మున్సిపాలిటీలు, రైల్వేలు మొదలైన వ్యవసాయేతర అవసరాలకు నీటి సరఫరా, నీటి తీరువా వసూళ్లు, కాలువల ద్వారా సరఫరా చేసే నీటి రేట్ల సవరణ, నీటి ఎద్దడి సందర్భాల్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర సంబందిత అంశాలను క్రోడీకరిస్తూ ప్రభుత్వ సాధారణ నీటిపారుదల విధానం తయారు చేయడం కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో చేర్చినారు. కమిటీ దాదాపు ఐదు నెలల పాటు ఈ పనిలో నిమగ్నమై పని చేసింది. కమిటీ రూపొందించిన ప్రశ్నావళికి జవాబులు, ప్రత్యుత్తరాలను ప్రజల నుండి అందుకుంది. సాక్షులను విచారించింది. ముఖ్యమైన కేంద్రాలను సందర్శించింది. అనంతరం ఆచరణాత్మకంగా ఏకగ్రీవ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రెసిడెన్సీలో నీటిపారుదల పనులు, నీటి సమాన పంపిణీ, కాలువల పర్యవేక్షణ, నియంత్రణ, అంచనా రేట్లు, ఇతర సంబంధిత విషయాల ప్రస్తుత స్థితిగతులు వంటి అంశాలను నివేదిక కూలంకషంగా పరిశీలించింది.

నీటిపారుదల శాఖలో పరిపాలన, నీటి సరఫరా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన, విలక్షణమైన లక్షణాల గురించి కమిటీ సూచించిన అంశాలను సంక్షిప్త వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. ప్రెసిడెన్సీలోని అన్ని కాలువలపై స్థానిక పరిస్థితులకు సరిపోయే నీటిపారుదల ‘బ్లాక్ సిస్టమ్’ను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదికలో పేర్కొన్న విధంగా బ్లాక్ వ్యవస్థ లక్ష్యం ఏమిటంటే.. “సాధ్యమైనంత ఎక్కువ గ్రామాలకు నీటిపారుదల వ్యవస్థ ప్రయోజనాలను అందజేయడం. అదే సమయంలో ప్రతి గ్రామానికి సరఫరా చేసిన సాగునీటిని నిర్దిష్ట ప్రాంతాలకు లేదా బ్లాకులకు తప్పనిసరిగా అందించడం, బ్లాక్ పరిధిలో ఉన్ననేలల స్వభావానికి అనుగుణంగా పరిస్థితులను బట్టి సాగునీరు సరఫరా చేయడం”. నివేదికలో నిర్దేశించుకున్నట్టు బ్లాక్ వ్యవస్థ ప్రధాన ప్రయోజనాలు.. నీటి వినియోగంలో దుబారాని అరికట్టి పొదుపును సాధించడం, కాలువల నిర్వాహణను సరళీకృతం చేయడం. నిర్ధిష్ట పరిమాణంలో సాగునీటి సరఫరా చేయాలని, నీటి వినియోగం ప్రాతిపదికన నీటి తీరువా వసూలు చేయాలని వారు సిఫార్సు చేశారు. నీటి పరిమాణాన్ని కొలిచే ఖచ్చితమైన వ్యవస్థను, పరికరాలను స్వీకరించడం వాటిని సమర్థవంతమైన స్థితిలో నిర్వహణ చేయాలని సిఫార్సు చేశాము. నీటిపారుదల విషయాలలో నిరంతర పరిశోధనల ఆవశ్యకతను నొక్కిచెప్పి అందు కోసం ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలని సూచించాము.

మేము సాగునీటి శాఖ పరిపాలనా వ్యవస్థలో సూచించిన మార్పులు, నీటిపారుదల పనుల పర్యవేక్షణ, నియంత్రణ తదితర అంశాలను ఈ కింది అంశాలను దృష్టిలో పెట్టుకుని క్రోడీకరించాము.

  1. ప్రభుత్వ అధికారులు, సాగుదారులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యపూర్వకంగా పని చేయడానికి వారిని సన్నిహితంగా ఉంచడం.
  2. నీటిపారుదలలో నిమగ్నమైన సాగుదారులు తమ కోసం ఆలోచించి, ప్రణాళిక వేసుకుని, సాగునీటి నిర్వాహణ నిర్వహణ తమకు తాము చేసుకునేలా, సహకార స్ఫూర్తితో పని చేసేలా ప్రేరేపించడం; మరో మాటలో చెప్పాలంటే, వారిని మరింత స్వావలంబన దిశలో నడిపించడం.
  3. బొంబాయి రాష్ట్ర నీటిపారుదల అవసరాలపై నిరంతర అధ్యయనాన్ని కొనసాగించడం, వివిధ సమస్యలపై విచారణ, పరిశోధన నిరంతరం కొనసాగించడం కోసం వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయడం.

ఈ లక్ష్యాలను సాధించడం కోసం అధికారులు, అనధికారులతో కూడిన ఒక నీటిపారుదల బోర్డును, నిరంతర పరిశోధనల కోసం నీటిపారుదల పరిశోధన విభాగం లేదా నీటిపారుదల పరిశోధనా బ్యూరోతో ఏర్పాటు చేయాలని, ఈ సంస్థల నిర్వాహణ కోసం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చైర్మన్‌గా కాలువ సలహా కమిటీలను ఏర్పాటు చేయాలని, ఇందులోకి నామినేట్ చేసిన, ఎన్నుకోబడిన సాగుదారుల ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని కమిటీ సూచించింది. సాగునీటి సదస్సులు ఏర్పాటు చేయడం, నీటిపారుదల గణాంకాల సేకరణ నిర్వహణ, కాలువ పంచాయతీల ఏర్పాటు తదితర సిఫార్సులు కూడా చేశాము.

కమిటీ సిఫారసులకు అనుగుణంగా బొంబాయి ప్రభుత్వం ఈ దిశలో చాలా చర్యలు తీసుకుంది. కొన్ని సవరణలు, మార్పులతో సిఫార్సులను అమలు చేయడానికి 23 మార్చి 1939 న ప్రభుత్వం ఒక తీర్మానం కూడా జారీ చేసింది.

కొత్త రాజధాని విచారణ కమిటీ, 1922:

కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి భారతదేశ రాజధానిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రాజధానిలో వైస్రాయ్ నివాసం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ భవనాలు మొదలైన వాటి నిర్మాణం కోసం సమగ్రమైన పథకాన్ని రూపొందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1922లో కొత్త రాజధాని విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నేను సభ్యుడుగా ఉన్న ఈ కమిటీకి సర్ మాల్కం (ప్రస్తుతం లార్డ్) హేలీ అధ్యక్షత వహించారు.

సర్ విలియం మాల్కం హేలీ

భవనాల నిర్మాణం పురోగతిలో ఉండగా, వాటి ఆర్థికాంశాలు, సంబందిత ఇతర అంశాలు కమిటీ విచారణలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ గృహాలు, ఇతర అనుబంధ భవనాల పనులను, తయారీలో ఉన్న న్యూఢిల్లీ మురుగునీటి పారుదల వ్యవస్థ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను కమిటీ తరచుగా తనిఖీ చేసింది.

భారత ఆర్థిక విచారణ కమిటీ, 1925:

మోంట్‌ఫోర్డ్ సంస్కరణలకు అనుగుణంగా ఏర్పాటైన సెంట్రల్ అసెంబ్లీ దేశ ఆర్థిక గణాంకాలను, ముఖ్యంగా పరిశ్రమల గణాంకాలను సేకరించి ప్రజలకు అందించాలని కోరింది. ప్రజల ఆందోళనను అరికట్టడానికి, భారత ప్రభుత్వం భారత ఆర్థిక విచారణ కమిటీని నియమించింది.

రాజా హరి కిషన్ కౌల్

సభ్యులుగా పండిట్ హరి కిషన్ కౌల్ (ఈయన తరువాత రాజా హరి కిషన్ కౌల్‌గా మారారు); కమిటీ కార్యదర్శిగా ప్రొఫెసర్ బర్నెట్ హస్ట్ నియమితులైనారు. నన్ను కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించమని ఆహ్వానించారు. కమిటీకి సంబంధించిన నియమ నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

“బ్రిటీష్ పాలిత భారతదేశంలోని వివిధ తరగతుల ప్రజల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించడం, దాని సమర్థతను విశ్లేషించడం, దానికి అదనంగా ఇతర ఉత్తమ ఆర్థిక విశ్లేషణా పద్ధతులను సూచించడం, సాధారణ ఆర్థిక సర్వేను నిర్వహించడానికి సూచనలు చేయడం, మా సిఫార్సులను అమలు చేయడంలో ఉండే వ్యయ అంచనాలు రూపొందించడం”

భారత ఆర్థిక విచారణ కమిటి నివేదిక1925

ఈ కమిటీ ఏడు నెలలకు పైగా పనిచేసి, అప్పటి బ్రిటిష్ పాలిత భారతదేశంలో భాగమైన బర్మా సహా దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి, ఒక నివేదికను రూపొందించింది. కమిటీ సభ్య కార్యదర్శి శ్రీ బర్నెట్ హస్ట్ మాత్రం వేరేగా తన అసమ్మతి పత్రాన్ని వ్రాసారు.

కమిటీ తమ నివేదికలో దేశంలో ఆర్థిక సర్వే ఆవశ్యకతను నొక్కి చెప్పింది. దీని లక్ష్యం ఏమిటంటే .. “ఆర్థిక గణాంకాలు, సమాచారాన్ని సేకరించడం. ఇది ఆర్థిక విధానాలను రూపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సమస్యల పరిష్కారానికి, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం, దేశ ఆర్థిక వనరులు పెంచడం తద్వారా దేశం సాధారణ ఆర్థిక పరిపుష్టిని సాధించడం”. ఉత్పత్తి, ఆదాయం, శ్రమ, వేతనాలు, ధరలు, జీవన సూచికల ఖర్చులు, ఇతర సహసంబంధ అంశాలపై ఖచ్చితమైన, పూర్తి గణాంకాలను తయారు చేసి ప్రచురించడం కోసం ఇప్పటికే ఉన్న గణాంక సామగ్రిని పరిశీలించాము. సమగ్ర సమాచార సేకరణ కోసం సూచనలు చేశాము. కేంద్ర స్థాయిలో, రాష్ట్రాలలో సమర్థవంతమైన గణాంక సంస్థలను చట్టం ద్వారా స్థాపించడం, రాచరిక పాలిత రాష్ట్రాలలో పని చేస్తున్న బ్యూరోల వలె గణాంకాల సేకరణ పనిని సమన్వయం చేయడం వంటి ప్రత్యేక సిఫార్సులు కూడా చేశాము. నేను పాశ్చాత్య దేశాలలో గణాంక సమాచార వ్యవస్థలను అధ్యయనం చేసాను. ప్రధానంగా కెనడాలో వినియోగంలో ఉన్న గణాంక సేకరణ వ్యవస్థ తరహాలో భారతదేశ స్థానిక పరిస్థితులకు తగిన వ్యవస్థను సిఫార్సు చేశాము.

వైస్రాయ్ లార్డ్ రీడింగ్

ఈ నివేదికను అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఆ సమావేశంలో నివేదికపై తన ఆమోదాన్ని వ్యక్తం చేశారు. అయితే, సిఫారసుల అమలు విషయంలో ఎటువంటి క్రియాశీల చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. గణాంకాల సేకరణకు సంబంధించి పరిస్థితులు నేటికీ సంతృప్తికరంగా లేవు.

బ్యాక్ బే విచారణ కమిటీ, 1926:

ఇది అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తి సర్ గ్రిమ్వుడ్ మీర్స్ అధ్యక్షుడిగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ. నాతో సహా ఇద్దరు భారతీయులు, ఈజిప్టులో సేవలు అందించిన ఒక యూరోపియన్.. మొత్తం ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భారత సివిల్ సర్వీస్ యూరోపియన్ అధికారి ఒకరు కమిటీకి సెక్రటరీగా వ్యవహరించారు.

అలహాబాద్ చీఫ్ జస్టిస్ సర్ గ్రిమ్వుడ్ మీర్స్

కమిటీకి సూచించిన నియమ నిబంధనలు: “‘బ్యాక్ బే పునరుద్దరణ పథకం’ ప్రారంభం, నిర్వహణ చరిత్రను పరిశీలించడం, దాని భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించి సిఫార్సులు చేయడం.”

బొంబాయిలో పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాము. ఇందులో బొంబాయి నగర కార్పొరేషన్ సభ్యులు, గతంలో బ్యాక్ బే లో పనులు చేసిన యూరోపియన్ కాంట్రాక్టర్ ఉన్నారు.

సమావేశాలు లండన్‌లో కూడా జరిగాయి. మొదట పార్లమెంట్ వీధిలోని ఒక భవనంలో, ఆ తరువాత పార్లమెంట్ హౌస్ లోని ఒక గదిలో సమావేశాలు జరిగాయి. ఈజిప్టులో అప్పటి హై కమీషనర్‌గా ఉన్న లార్డ్ లాయిడ్‌ను మేము ఈ సమావేశాల్లో కొంతసేపు విచారించాము.

ఇప్పటికే పునరుద్ధరింపబడిన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ప్రస్తుతానికి తదుపరి పునరుద్ధరణను పరిమితం చేస్తూ, ఇంకా పునరుద్ధరణ పనులు మొదలు పెట్టని కొన్ని కొత్త పనులను కుదిస్తూ కమిటీ సిఫారసులు చేసింది.

బెంగళూరు రాజకీయ అల్లర్ల విచారణ కమిటీ, 1929:

జూలై 1928లో బెంగళూరు నగరంలో హిందూ-ముస్లిం గొడవలు జరిగాయి. జనవరి 1929లో మైసూర్ ప్రభుత్వం అల్లర్లపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించింది. నేను మొదట సుముఖంగా లేకపోయినా, హిస్ హైనెస్ మహారాజు గారి ప్రత్యేక కోరిక మేరకు బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. కమిటీ మూడు, నాలుగు నెలల పాటు స్థిరంగా విచారణ చేసి పెద్ద సంఖ్యలో సాక్షుల సాక్ష్యాలను నమోదు చేసి నివేదికను సమర్పించింది. అల్లర్లకు బాధ్యులైన రెండు వర్గాలలో ఒక వర్గానికి చెందిన నాయకుడైన ఒక సభ్యుడు రాసిన అసమ్మతి నోట్ మినహా నివేదిక స్థూలంగా సభ్యులందరి సమ్మతితో రూపొందింది.

సుక్కూర్ బ్యారేజి పనుల కమిటీ, 1929:

సింధ్ రాష్ట్రంలో సింధు నదిపై సుక్కూర్ బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై, ఆ పనులకు సంబంధించిన తీరుతెన్నులపై పత్రికల్లో పలు ఫిర్యాదులు వచ్చాయి. సుక్కూర్ బ్యారేజి పనుల ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ అవసరాలపై దర్యాప్తు చేసి నివేదించడానికి కేవలం భారతీయ ఇంజనీర్లతో కూడిన ఒక కమిటీని నియమించడం అవసరమని బొంబాయి ప్రభుత్వం భావించింది. ఈ కమిటీలో ప్రభుత్వం ఇద్దరు సభ్యులను నియమించింది. వారిలో నేను సీనియర్ సభ్యుడిని. రెండవ సభ్యుడు.. హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ శ్రీ అహ్మద్ అలీ (తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్). ఇతని గురించి ఇదివరకే ఒక అధ్యాయంలో ప్రస్తావించి ఉన్నాను. ఈయన ఇంజనీరింగ్ విద్యలో ఇంగ్లాండ్‌లో శిక్షణ పొందారు.

హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బాహాదూర్

మేము దాదాపు మూడున్నర నెలల పాటు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే సమయంలో పని చేసాము, బ్యారేజ్, నిర్మించిన కొత్త కాలువలను సందర్శించాము. ఆ తర్వాత ఒక సమగ్ర నివేదికను సమర్పించాము. బొంబాయి ప్రభుత్వం మా నివేదికను సంతృప్తికరంగా ఉందని భావించి ఆమోదించింది. నివేదికను అంగీకరిస్తూ ఆ సమయంలో బొంబాయి గవర్నర్‌గా ఉన్న సర్ ఫ్రెడరిక్ సైక్స్ నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వారు ఈ విధంగా రాశారు.

బొంబాయి గవర్నర్ సర్ ఫెడెరిక్ సైక్స్

“నివేదిక ఏ రకంగా చూసినా అద్భుతమైనది. మనమందరం ఎంతగానో కోరుకునే గొప్ప ప్రయోజకారిగా మారడానికి ప్రాజెక్ట్, ఇతర అనుబంధ నిర్మాణాలను పూర్తి చేయడానికి ఈ నివేదిక అనేక విధాలుగా సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.”

ఆ తర్వాత మేము చేసిన సిఫారసులు దాదాపు పదేళ్లపాటు అమలులో ఉన్నాయని తెలుసుకున్నాను.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here